చేతులు కడిగిన శుభవేళా..
ముప్పై ఏళ్లలో ఎప్పుడూ చెయ్యి సబ్బుతో కడగని శంకర్రావు.. హూ గైడ్ లైన్స్ కి అనుగుణంగా ప్రతి గంటకి ముప్పయి సెకండ్ల పాటు చేతులు కడుగుతున్నాడు.
చేతికున్న వైరస్ల చావు దేవుడెరుగు.. చేతికున్న రేఖలన్నీ. కూడా అరిగిపోయి తెల్ల పుష్పాల్లా తయారయ్యాయి. ఇక నేను కడగలేనే.. చచ్చే చావొచ్చింది.., ఇలా కడుగుతూనే చస్తానేమో.. రేపు పేపర్లో.. చేతులు కడిగి కడిగి అమాయకపు భర్త మృతి అని వేస్తారేమోనే అని అమాయకంగా తన భార్య జానకితో అన్నాడు.
ఎందుకండీ.. అంత చిరాకు, మీరు అంతలా కడగబట్టే కదా తుమ్మ మొద్దుల్లా ఉండే మీ చేతులు.. ఇలా తెల్లపుష్పాల్లా తళతళలాడుతున్నాయి.., ఏది చేసినా మన మంచికే అని చేతులు చూపించి మెచ్చుకుంది భార్య జానకి.
చేతులు తుడుచుకుని వచ్చి టీవీ పెట్టడం కోసం సోఫాలో ఉన్న రిమోట్ అందుకుని కూర్చున్నాడు.
ఇరవై చాలన్నారు.. ఎందుకైనా మంచిదని ముప్పై సెకండ్ల పాటు కడుగుతున్నా. నువ్వు ఎప్పుడూ చేతులు కడిగిన పాపాన లేవు, మళ్ళీ నన్ను వెటకారం చెయ్యడం.. అని చిరాకు పడ్డాడు.
సరే.. ఆ రిమోట్ ఇవ్వండి. నాకు సీరియల్ టైమయ్యింది.. అంది జానకి కోపంగా.
చచ్చినా ఇచ్చేదిలేదు. నేను వార్తలు చూడాలి అని నచ్చిన ఛానల్ మార్చి రిమోట్ సోఫాలో కాళ్ళకింద దాచుకున్నాడు.
ఇలాంటి మొగుడు ఇంట్లో ఎందుకయ్యా.. ఆ క్వరంటీన్ సెంటర్లో పడేస్తే ఒక పద్నాలుగు రోజులు ప్రశాంతంగా ఉండదా.. అని కయ్యి మంది జానకి.
ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం తరువాత కాసేపు నిశ్శబ్దం...
కాసేపటికి ఏవండోయ్.. ఇది చూసారా..
వర్లక్ష్మొదిన వాట్సాప్ పెట్టింది.., చేతులు కనీసం నలభై నుండి తొంభై సెకండ్ల పాటు సబ్బుతో రుద్దాలంట.. లేకపోతే ప్రయోజనం లేదంట.. అంటూ వాట్సాప్ మెస్సేజ్ చూపించింది.
చూసారుకదా.., ఏమయ్యిందో మీ ముప్పై సెకన్ల కడుగుడుల కధ.. అంది నవ్వుతూ జానకి.
విసిగిపోయిన శంకర్రావు వాళ్ళావిడతో గట్టిగా అరుస్తూ
"కత్తందుకో జానకీ..." అన్నాడు.
మీరే అందుకోండి మీ వెర్రి పుష్పాలతో.. ఇన్నాళ్లూ ఆ కడిగింది మొహమైనా బాగుండేది.. కాస్త తెలుపొచ్చేదేమో.
ముప్పై సెకండ్లే తోమి ఏం వెలగబెట్టేరంట.., నాకు వంట గదిలో బోల్డు పనుంది.. మీరెళ్లి ఆ మిగిలిపోయిన సెకండ్లకు కడుక్కోండి చేతులు అంది వెటకారంగా అక్కడనుండి లేచి వెళ్లిపోతూ.
అప్పటికే తల గోడకేసి బాదుకుందామనుకుంటున్న శంకర్రావు రేడియోలో పాట వస్తుంటే వింటూ ఆగాడు.
మాయాబజార్ లో ఘంటసాలగారి పాటొస్తుంది.
చేతులు కడిగిన శుభవేళా..
ఎందుకు నీకీ కలవరము..
ఎందుకు నీకీ కలవరము..
అని పాట ఆగి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా జనహితార్ధం జారీ అని చెప్పింది.
ఛీఛీ.. ఆఖరుకు ఈ రేడియోలో కూడా నన్నే వెటకారం చేస్తున్నారు అని తలగోడకేసి కొట్టుకోటం మొదలెట్టాడు.
ఏవండోయ్.. ఆ పడగ్గదిలో ఉన్న అద్దం మేకు కాస్త బయటకొచ్చి అద్దం కిందకు జారిపోయింది. ఆ తల కొట్టుకునేదేదో ఆ మేక్కేసి కొట్టుకుంటే అద్దమైనా సరవుతుంది కదా.. అని వంటింట్లొంచి అరిచింది జానకి.
ఇక చేసేదేం లేక తలుపు తీసుకుని బయటకు పోదాం అని విసురుగా తలుపులు తీసి గుమ్మంలోకి అడుగుపెట్టగానే పీపీయి కిట్స్ వేసుకుని ఇద్దరు గ్రహాంతరవాసుల్లాగా గుమ్మం ముందు నిలబడి ఉన్నారు.
వాళ్ళను చూసి భయపడ్డ శంకర్రావు అంతే వేగంతో లోపలికి దూరి తలుపు వెనకాల కొక్కేనికి తగిలించిన మాస్క్ తీసి మొహానికి తగిలించుకుని మళ్ళీ గుమ్మంలోకి వచ్చాడు.
ముందు నిలబడిన ఇద్దర్లో ఒకతను జేబులోంచి పెన్ను పేపరు తీసి. శంకర్రావుగారంటే మీరేనా అనడిగాడు.
వణుకుతూ తడబడ్డ గొంతుతో.. నే.. నే.. అన్నాడు శంకర్రావు.
మేం మున్సిపాలిటీ సర్వే డిపార్ట్మెంట్ నుండి వస్తున్నాం.
మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. మాకు అనుమానం వస్తే తీసుకుపోతాం..
మీరురోజుకు చేతులు ఎన్ని సార్లు కడుగుతారు అనడిగాడు.
ఒక ముప్పైసార్లు అన్నాడు.
ఎన్ని సెకండ్ల పాటు.. అనడిగాడు.
ఒక నలభై.. తొంభై.. వంద సెకన్లు పైనే కడుగుతానండి.. అన్నాడు గర్వంగా.
కానీ అన్నిసార్లు కడిగినట్టు లేవు కదా సార్ మీ చేతులు. మీరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మాకు. ఇది ప్రభుత్వానికి పంపే సర్వే, మీ డీటెయిల్స్ అన్ని వెళతాయి అని బెదిరించాడతను.
అదేంటి.. ఇంత తెల్లగా ఉంటేనూ.. ఇంకా కడిగినట్టు లేవు అంటే ఎలా అని తెల్లపుష్పాలను గాల్లో ఊపుతూ చూపించాడు.
బియ్యం ఏరుతూ.. పళ్లెం చేతిలో పట్టుకుని.. మాస్కు కిందనుంచి నాలుగ్గింజలు నోట్లోవేసుకుని పటపటలాడిస్తూ.. వెనుకే వచ్చింది జానకి.
సార్.. ముప్పై సెకండ్ల కంటే ఎక్కువ ఈయనెప్పుడూ కడగలేదండీ.. అని చెప్పింది గ్రహాంతరవాసులకు.
అదేసార్.. నేను చేతులు చూసి ఎంత సేపటి క్రితం కడిగినవో చెప్పేయగలను. అలాటిది నన్నే మోసం చెయ్యాలని చూస్తారా.. ఉండండి రిమార్కు రాసేస్తా అని పుస్తకం పేజీలు తిప్పాడు.
బాబ్బాబు.. ఆగవయ్యా, ఏదిపడితే అది రాయకు.
ఇకనుంచి సరిగ్గా కడుగుతా అని అతని చెయ్యి పట్టుకుని శపథం చేసినట్టు.. చేతిలో చెయ్యేసాడు.
ఏంటి.. సోషల్ డిస్టన్సింగ్ కూడా మీరు పాటించడం లేదు. ఇలా మీదకొచ్చేసి నా చెయ్యి ముట్టుకుంటారా.
మీరు కనీసం ఆరోగ్యంగా అయినా ఉన్నారా లేదా..
ఆ వివరాలు చెప్పండి ముందు.. అని అడగటం మొదలుపెట్టాడు.
మీకు దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోటం కష్టంగా ఉండటం, వాసనా రుచి తెలికపోవటం లాంటి లక్షణాలు ఉన్నాయా.. అనడిగాడు.
శంకర్రావు.. అబ్బే అవేం లేవు అన్నాడు.., ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా హాచ్ అని పెద్ద తుమ్మొచ్చింది.
మీకు డయాబెటిస్, హార్ట్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా.
లేవు అన్న దానికి అడ్డుపడి.. వీళ్ళకుటుంబంలో అందరికీ ఉన్నాయండి.. అంది జానకి.
మీరు ఒక పదిరోజుల్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళారా.. అనడిగాడు.
మొన్న వద్దంటే కరివేపాకు లేకుండా కూరలేంటి.. ముద్ద దిగట్లేదు అని పక్కూరెళ్లి మరీ తెచ్చారండి.. చెప్పరేమండి.. అలా నసుగుతారే అంది జానకి శంకర్రావు వంక ఉరిమి ఉరిమి చూస్తూ.
ఇక ఆఖరి ప్రశ్న.. కోవిడ్ పేషంట్ తో ఈ మధ్య ఎవరినన్నా కలిసారా.. అనడిగాడు.
మొన్నే వీళ్ళ ఫ్రెండ్ కి వచ్చి హోమ్ క్వరంటీన్లో ఉంటే వెళ్లి పళ్లు, బాదం పప్పు, జీడిపప్పు, అవిఇవీ కొనిచ్చి కలిసొచ్చారు కదా.. అంది కోపంగా జానకి.
అయితే.. ఈయన్ని మేం క్వరంటీన్ కి తీసుకెళుతున్నాం మేడం.. అని శంకర్రావుని బుజాలమీద చేతులువేసి బలవంతంగా నడిపించుకుంటూ తీసుకెళ్లి అంబులెన్సెక్కించారు.
అంబులెన్స్ వెనుక అద్దంలోంచి బయటకు చూస్తున్న శంకర్రావుకి రిమోట్ చూపించి వెక్కిరించింది జానకి.