26, జనవరి 2015, సోమవారం

నా బంగారుకొండ...

గుండె వేగంగా కొట్టుకుంటుంది.. ఒళ్ళంతా ఒణుకుతుంది.. పట్టిన చెమటలో పీకల్లోతు మునిగిపోయినట్టు  ఉన్నాను.. గొంతెండి పోతుంది.. మాటలు రావటంలేదు.. అయినా ఓపిక తెచ్చుకుని అరిచాను.. బిగ్గరగా అరిచాను.. పైకప్పు ఎగిరేలా అరిచాను.. పొలికేక పెట్టాను.. ఒక్క ఉదుటున మంచమ్మీద నుండి లేచాను.. చుట్టూ చూసాను.. అంతా చీకటి.. చిక్కని చిమ్మ చీకటి.. చిన్న దీపం కుడా కనపడని చీకటి.., ఎక్కడున్నానో తెలియని చీకటి.. చేతిదగ్గర ఉన్న స్విచ్ వెతికి బెడ్ లైట్ వెలిగించాను.., నేను నా గదిలోనే ఉన్నానా.. నేను పడుకునే వున్నానా.. గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది.. ఒళ్ళు వణుకుతూనే వుంది..  ఏమో మరి... ఎందుకో మరి.. గుర్తురావటంలేదు.., ఇదంతా కలా.. కలేనా?, పీడకలే అయివుంటుంది.. కొద్ది కొద్దిగా గుర్తుంది.., అవును ఇప్పుడు గుర్తొస్తుంది.. అదిగో అదుపు తప్పిన లారి.. రోడ్డుపై నేను వెళుతుండగా.. అదుపులేని లారి.. నా ఎదురుగా వస్తుంది.. వచ్చేస్తుంది.. నేను చూస్తూ నిలబడే ఉన్నానే.. ముందుకు కదలటంలేదే.. కాళ్ళు అతుక్కుపోయాయా.., మెదడు మొద్దుబారిపోయిందా.. వచ్చేసింది.. నా పైకి వచ్చేసింది.., ఇంతలోనే నాకు మెలకువ వచ్చేసింది.. వచ్చేసింది.. తృటిలోనే ప్రమాదం తప్పేసింది.. ఇది నిజంగానే  పీడకల.. నిజమైతే ఏమైపోదును.. నా వాళ్ళు ఏమైపోదురు.. నా బంగారుకొండ ఏమైపోదునో.. ఉహించాలంటేనే కష్టంగా ఉంది..
మంచినీళ్ళు తాగాను.. మొహం తుడుచుకున్నాను.. పక్కకు తిరిగి చూసాను.. నా బంగారుకొండ ముడుచుకుని పడుకునే ఉంది.. మెత్తని జుట్టులో మొహం దాచుకుని బుద్ధిగా పడుకుంది.. నేను తిడితే కోపంలో మాట్లాడకుండా కూర్చున్నట్టు బుంగ మూతి పెట్టి పడుకునుంది.. ఏంత ముద్దుగా పడుకునుందో.. నా బంగారం..
నా దిష్టే నీకు తగిలేలా ఉంది..
నా ముద్దుల పట్టివి నిన్ను కొట్టాలని ఎలా అనిపించిందో.. నాకు చేతులెలా వచ్చాయో.., నిన్నెంతలా తిట్టానో.. నాకు నోరెలా వస్తుందో.., బూట్లు సరిగ్గా వేసుకోలేదని కసిరాను.. చెప్పిన మాట వినవని ఉరిమాను.. ఒక్క క్షణం కుడా నీకు కుదురుండదని అరిచాను.. నేను పనిలో ఉండగానే నీకు అన్ని గుర్తొస్తాయా.. అని కోప్పడ్డాను.., సరిగ్గా తినలేవని.. సరిగ్గా వినలేవని.. సరిగ్గా ఉండలేవని.. గోడల మీద గీస్తావేందుకని.. ఇల్లంతా బొమ్మలు విసురుతావని.. నీకు అన్నిటికి తిట్లే.., నిలుచుంటే.. సరిగ్గా నిలబడలేవా అని.. కూర్చుంటే.. సరిగ్గా కుర్చోలేవా అని.., ఆడుతుంటే.. బయటకు పోతావా అని.. నీకు అన్నీ తిట్లే.. నీకు తిట్లే తిట్లు.
ఇన్ని తిట్టినా నీకు నామీద కోపంలేదు.. నేనంటే ప్రేమ పోలేదు.. ఇప్పుడు నిద్రలో కూడా.. “ఐ లవ్ యు నాన్నా..” అని కలవరిస్తుంటే.. నాకు ఏడుపొస్తుంది.. కన్నీళ్ళు ఆగటంలేదు.. నేను ఎందుకు తిడుతున్నానా అనిపిస్తుంది.. ఈ చిన్ని మనసుని ఎందుకు నా తిట్లతో పొడుస్తున్నానా అనిపిస్తుంది.. నేను మర్చిపోతున్నాను..
అవును నువ్వు చిన్న పిల్లవని మర్చిపోయాను.., నీ పెద్ద పెద్ద మాటలు విని కాబోలు.. ఎదిగిపోయావని అనుకుంటున్నాను.. చిన్నదానివని మర్చిపోతున్నాను.. అందుకే మాటిమాటికీ తిడుతున్నాను.., ఇంత వయసొస్తుంది ఇదీ తెలియదా అనుకుంటున్నాను.. నా బుజ్జి కన్నవని మర్చిపోయాను.. అవును నేను నీ వయసు మర్చిపోతున్నాను.. నాలానే నువ్వు ఉండాలనుకుంటున్నాను.. నా అంత అయిపోయావని అనుకుంటున్నాను.. నువ్వు ఇంకా నా బుజ్జి కన్నవేనని.. నేను మర్చేపోయాను..
నా పీడకల నిజమని ఎంత భయపడ్డానో.., భయంతో ఎంత వణికిపోయానో.. నేను లేకపోతే ఏమైపోతావో.. నేను ఉహించగలనా అది.., లేదు.. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను.., నువ్వు నా బంగారు కొండవి..  ఇకపై నిన్ను కోప్పడను.. నువ్వు నా బుజ్జి కన్నవని  మర్చిపోను.., నీ మాటలు నన్నింక మోసం చెయ్యవు.., చెయ్యలేవు.. నువ్వెప్పుడూ.. నాకు చిన్న పిల్లవే.. నా బుజ్జి కన్నవే.. ఇదింక మర్చిపోను.. మీ నాన్న ఇది మర్చిపోడు

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

A bold confession


Me iddariki. Sri Rama Raksha

Bharath చెప్పారు...

Very nice one, reminded me my naughty elder son...it's exactly the same with us as well.

Related Posts Plugin for WordPress, Blogger...