ఇల్లాలి సన్యాసం..
ఇద్దరు పిల్లలతో వేగలేక
విసుగు పుట్టిన ఒక ఇల్లాలు సంసారాన్ని త్యజించి.. కాషాయం కట్టి.. హిమాలయాల్లోకి పోయి సన్యాసంలో కలిసిపోదాం అని నిర్ణయించుకుంది.
ఎంత గట్టి నిర్ణయం
తీసుకున్నా సాయంత్రం ఏడింటికి తన ఫేవరెట్ టి.వి సీరియల్ టైటిల్ సాంగ్ వినిపించేసరికి
మెత్తబడిపోతూ వస్తుంది.. ఇక ఇలా కాదు అని.. శని ఆది వారాల్లో పెద్దగా నచ్చిన సీరియల్స్ లేని సమయంలో ఎగిరిపోవాలని అనుకుని
"ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ఎగిరిపోతే
ఎంత బాగుంటుందీ.. " అన్న పాట పెట్టుకుని వింటూ..
కావాల్సిన వస్తువులు కొనటానికి షాపింగ్ లిస్టు రాసుకోవటం మొదలుపెట్టింది.
ఒక కాషాయం రంగులో
ఉన్న కంచి పట్టు చీర.. అప్పుడప్పుడు
కట్టుకోటానికి అని నాలుగైదు కాషాయం రంగు కాటన్
చీరలు.. మూడు
నాలుగు క్రేప్ చీరలు.. రొండు మూడు అనార్ఖలి డ్రెస్సులు కాషాయం
రంగువి.. ఒకటి రొండు నైట్ గౌన్లు.. వాటికీ
తగ్గ మాచింగ్ చెప్పులు, వాచ్.., కాషాయం
రంగు హ్యాండ్ బ్యాగ్.. మాచింగ్ నెక్లస్.. అన్నీ కొని.. మొన్ననే వారం రోజుల క్రితం కొన్న మేకప్
కిట్ పాతది అనిపించి కొత్తది తీసుకుని.. దాంతో పాటుగా ఒక కమండలం..
వడ్రంగి కొట్టులో ఆర్డర్ ఇచ్చి మరీ తయారుచేయించిన దండం.. పావుకోళ్ళు.., కొన్ని జప మాలలు.. రుద్రాక్ష మాలలు.. విబూధి పళ్ళు.. అన్నీ సర్ది మూటకట్టుకుంది.
అప్పుడప్పుడు బోర్
కొడితే పాటలు వినటానికి ఐపోడ్.., సినిమాలు చూడటానికి స్మార్ట్ ఫోన్ తన హ్యాండ్ బాగ్‌లో పెట్టుకుంది.
ఒక అర్దరాత్రి ఒంటిగంట
దాటిన తరువాత మెల్లగా లేచి.. పడుకున్న భర్త కాళ్ళకు నమస్కారం చేసి వెళ్దామంటే.. అయన
లాప్టాప్ ముందు రాత్రనకా పగలనకా కుర్చీకి అంటుకుపోవటం గమనించి.. ఇది ఈ జన్మకు జరిగే పని కాదు అని.. "ఐ యాం గోయింగ్ హిమాలయాస్" అని ఫేస్బుక్ లో అప్డేట్ పెట్టింది.
వెంటనే భర్త నుండి
వచ్చిన మొదటి "లైక్", చూసి కన్నీళ్ళ పర్యంతం అయ్యి.. “ఈ జన్మకిది చాలు స్వామీ”
అని.. ఆయనకు నమస్కరించి. అయన.. లాప్టాప్ కు “నువ్వే దిక్కు తల్లి..”,
అని స్మరించి బయలుదేరింది.
ఎంతైనా.. కడుపు తీపి.. గడప దాటనియ్యలేదు.
చిన్నాడి అల్లరి కొత్తగాని.. పెద్దాడి అల్లరి అలవాటైపోయిందే
కదా అని ఒంటిగంటైనా నిద్రపోకుండా.. టాబ్లెట్ లో "ఆంగ్రి బర్డ్స్" గేమ్
ఆడుకుంటున్న వాడిని డిస్టర్బ్ చెయ్యకుండా.. రెక్క పట్టుకుని ఈడ్చుకొచ్చి.. వాడి చేతికి కమండలం-పావుకోళ్ళు బ్యాగ్ తగిలించి..
బయట లోడ్ తో వెయిట్ చేస్తున్న పేకర్స్ & మూవర్స్
వ్యాన్.. ఎక్కేసింది.
అప్పటికే వ్యానులో
తట్ట బుట్ట సర్దుకుని ఎక్కిన అత్తగారిని చూసి ఆశ్చర్య పోవటం అటుంచి.. పెరుగు తోడు పెట్టారా.. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి వచ్చారా.. ఇల్లు తాళం సరిగ్గా
వేసారో లేదో.. అని తన ఎప్పుడూ చెప్పే డైలాగ్స్ చెప్పి తన అనుమానాలు వ్యక్తం
చేసింది.
“అవన్నీ చేసానుగానీ.. నువ్వు సరైన తిండి లేక ఎక్కడ ఇబ్బంది
పడతావోని మన వూరి నుండి తెచిన పప్పులు-ఉప్పులు.. పచ్చళ్ళు-పచారి
సరుకులు అన్నీ మూట గట్టాను.. అన్నట్లు మొన్నే ఊరినుండి తెప్పించిన..
కొబ్బరి నూనె.. పాత చింతపండు.. అక్కడ దొరకవని ముందే ఊహించి సర్దించానమ్మా..,
ఎప్పటినుండో నాకూ తీర్థయాత్రలకు వెళ్ళాలన్న కోరిక అలానే ఉండిపోయింది.. నా కొడుకు
ఎలాగూ తీర్చటం లేదూ.. నువ్వు హిమాలయాలు అని అప్డేట్ పెట్టగానే.. నా మనసుకు ఏంటో
ఊరట కలిగినదమ్మా.. అక్కడైనా కాస్త ప్రశాంతత ఉంటుంది అని నేనూ మూట-ముళ్ళు సర్దేసానమ్మా..,
చంటాడిని కాస్త చూస్తుండమని పక్కింటి లీలకు చెప్పానులే.. దానిగురించేం బెంగ లేదు..
అయినా ఎంత కష్టమొచ్చి పడిందే నీకు నా యమ్మ..”, అని గగ్గోలు పెట్టింది
అత్తగారు.
అత్తయ్య మీరు
మాత్రం ఆ సీరియల్స్ అవి వదిలి నాకోసం ఎలా వచ్చారండీ..!, సరేలే.. అయ్యిందేదో అయ్యింది..
కష్టాలేవో ఇద్దరం పడదాం అని ఒకరికొకరు ఓదార్చుకుని సర్ది చెప్పుకున్నారు.
హిమాలయాలు చేరుకున్న
తరువాత.. అక్కడ ఒక చిన్న ఆశ్రమం
ఏర్పాటు చేసుకుని.. పొద్దున్న మధ్యానం. సాయంత్రం అని లేకుండా ఘోర తపస్సు చెయ్యాలని నిర్ణయించుకుంది ఆ ఇల్లాలు..
దానికి నేను అన్ని విధాల సహకరిస్తాను.. ఇంటిపనులన్నీ
చూసుకుంటాను.. నీకేది కావాలంటే అది టైం కి వండి వార్చుతాను.., నేనుండగా ఏ లోటు రానీయను.., మీ పిల్లాడి పనులు తక్క.. అని అత్తగారు శపథం చేసారు.
మొదలు పెట్టిన మొదటి
తపస్సుకు భంగం కలగనే కలిగింది.. పక్క ఆశ్రమం లోని మునులందరూ దండాలతో దండెత్తారు.. కమండలాలు
పట్టుకుని కాలు దువ్వారు.. పెద్ద పిల్లోడు చేసిన అల్లరి అంతా సంస్కృత పద్యాలుగా వర్ణించి..
సాగదీసి రాగాలతో.. బండ బూతులు తిట్టిపోశారు.. ఆ పద్యాల సారంశం ఏమిటీ అంటే.., ఆ పిల్లాడు..
తపస్సు చేస్తున్న ఒక ముని గడ్డానికి తాడుకట్టి “టెంపుల్ రన్” అని పరుగుపెట్టాడంటా..
వేరే ముని పంచే పట్టుకుని లాగి “నింజా టెక్నిక్” అన్నాడంట.. ఇంకొక ముని.. ఘోర
తపస్సులో ఉండి మేనక డాన్స్ ను అనుభవిస్తూ ఆనందిస్తున్న సమయంలో.. ముక్కులో మామిడాకు పెట్టి
గిరగిరా తిప్పాడంటా. ఇవన్ని విని నవ్వపుకోలేని ఆ తల్లి అటువైపు తిరిగి.. రాగం తీసింది..
ఆ రాగానికి కరిగిన మునులంతా వెనుతిరిగి వెళ్ళిపోయారు.
తరువాత రోజు ఆంగ్రి
బర్డ్స్ కొత్త లెవెల్ ఫెయిల్ అయిన కోపంలో పక్క ఆశ్రమం లోని ముని కుమారుడిని పట్టుకుని
చితక్కొట్టి వచ్చేసిన పెద్ద పిల్లోడిని చెట్టుకు కట్టేశారు మునులంతా.., మునుల
భార్యలకు మంచి చేసుకుని.. కొత్త సీరియల్ కథ ని చెప్పి వాళ్ళను మెప్పించి.. బ్రతిమలాడి..
ఏదోలా విడిపించేగొడవలో.. ఆ రోజు తపస్సు గొడవ మర్చిపోయిందా ఇల్లాలు.
ఒకరోజు ఎవరికీ తెలియకుండా పొద్దున్నే లేచి చెట్ల చాటుగా తప్పస్సు మొదలుపెడితే.. పెద్ద పిల్లాడు టాబ్లెట్ లో ఛార్జింగ్ అయిపోయిందని అలా బయటకు వచ్చి షికార్లు చేస్తూ చెట్టుమీద ఉన్న తెనేపట్టుని కొట్టి.. అమ్మ వంక చూసి పారిపోతే ఆ ఈగలన్నీ ఆ తల్లి చుట్టూ ముసిరి.. మొహం మీద కుడితే.. ఇలియానా మొహం లా ఉండే ఆ తల్లి మొహం వాచి జయలలిత మొహం అంత తయారయ్యి.. మళ్ళి తపోభంగం అయ్యింది. ఏమీ తోచని ఆ ఇల్లాలు ఫేస్బుక్ లో “ఐ యాం లైక్ జయలలిత నౌ” అని అప్డేట్ చేస్తే.. వెయ్యి లైక్ లు వచ్చి ఆశ్చర్య పరిచాయి.
ఇలా రోజులు
గడుస్తున్నాయి కానీ తపస్సు భాగ్యం కలగటం లేదు అని ఆ ఇల్లాలు చాలా బాధపడిపోతున్న
సమయంలో దూరంగా చెట్ల మధ్యలోంచి ఎదో పులి ఘర్జించినట్లుగా శబ్దం వచ్చింది.. ఏంటని
అని చూస్తే.. పేకర్స్ & మూవర్స్ వ్యాన్ వేసుకుని వాళ్ళమ్మగారు దిగారు.. దిగుతూనే.. ఎలాగున్నవే..
మొహం తప్ప అంతా ఇలా చిక్కిపోయిందేంటే అని
చాలా బాధపడిపోయి సామానంతా దించి సర్దుకున్నాకా.., నీ ఒకొక్క ఫేస్బుక్ అప్డేట్స్
చూస్తుంటే కన్నీళ్ళు వచ్చేసాయనుకో.. అన్నీ చదువుతూనే.. ఉన్నానమ్మా.., మొన్నటి
అప్డేట్ స్ లో.., హిమాలయాలు..
మామిడిచెట్లు అన్నావ్ కదా.. ఈ సారీ ఊరగాయ సీజన్లో లో.. మన వూరిలో కూడా మంచి
మామిడికాయలు దొరక లేదు.. ఇక్కడికొస్తే అవన్నా మంచివి చూసుకుని ప్రశాంతంగా పట్టుకోవచ్చు
అని నేనుకూడా వచ్చేసానమ్మా.. అని చల్లగా చెప్పిందావిడ.
సాయంత్రం ఏం కూర
వండాలో.. ఎలా వండాలో.. మిట్ట మధ్యాహ్నం నుండే మాట్లాడుకోవటం మొదలుపెట్టారు తల్లి..
అత్తగారు.
క్రితం ఏడు మీరు
పెట్టిన ఆవకాయలో కాస్త ఉప్పు ఎక్కువైందండి అని ఆవిడ అంటే.., నిలవ ఉంటుంది అని
ఉప్పు ఎక్కువ వేసానండి.., ఉప్పు ఎక్కువగా ఉందాండి!.. అని ఈవిడ సమాధానం చెప్పింది...
మధ్యలో పిల్లాడు తగులుకుని.. ఉప్పు ఎక్కువ వేస్తే ఎక్కువే ఉంటుంది కదా.. అని
సెటైర్లు వేసాడు.
ఒక పక్క తపస్సుకు
కుదరక.. మరో పక్క పెద్ద పిల్లాడి అల్లరి
భరించలేకుండా ఉంటే వాటితో పాటు.. తల్లి.. అత్తగారి కబుర్లు.. ఇంకా మంటపుట్టించటం
మొదలుపెట్టాయి ఆమెకి.
ఒకరోజు మునులంతా
మళ్ళి కట్టకట్టుకుని ఆశ్రమం పై పడ్డారు.. అందులో ఒక ముసలి ముని ముందుకు వచ్చి.. “ముక్కుపచ్చలారని..
ముని కుమారులను..., ముక్కుపచ్చలారని ముని కుమారులను.... ఊఉ..”, అని రాగం
అందుకున్నాడు.
“ఆగండి.. అర్ధం
అయ్యింది.. మీ మునికుమారులను మా వాడు చితక్కొట్టేసుంటాడు.. మీరు పద్యం మొదలుపెట్టకముందే
నాకు తెలిసిపోయింది.. నన్ను క్షమించండి.. ఇప్పుటి నుండి ఇలా జరగదని నేను హామీ
ఇస్తున్నాను.. నేను వాడి సంగతి చూస్తాను.. మీరు దయచేసి ఈసారికి క్షమిచేయండి అని ఆవిడ
మునులందరికీ నమస్కారం చేసింది.
“అది కాదమ్మా..
మేము ఎన్నాళ్ళుగానో నేర్పుతున్న విలు విద్య.. శస్త్ర విద్య.. అస్త్ర విద్యలు
అన్నీ, మీ వాడు ఆ టాబ్లెట్ లో మూడు రోజుల్లో మా వాళ్ళందరికీ నేర్పించి
నిరూపించాడు.., ఆ ముక్కుపచ్చలారని మునికుమారులను ధీరులుగా తీర్చిదిద్దాడు అని
చెప్పటానికే వాచ్చాం”, అని అందరు కృతఙ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు..
ఇక్కడ ప్రశాంతంగా
ఆడుకునే వాళ్ళను కూడా వీడి టాబ్లెట్ స్కిల్ల్స్ తో చెడగొడుతున్నాడు.. వీడిని
వెంటనే మన వూరు తీసుకుపోకపోతేగాని లాభంలేదు, ఇక్కడ సర్వ నాశనం చేసేలా ఉన్నాడు అని..
హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ఫోన్ తీసుకుని..
మళ్ళి మూట-ముళ్ళు సర్దటానికని పేకర్స్ &
మూవర్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ డయల్ చేసింది.
5 కామెంట్లు:
:) :)
చదువుతూ .పైకే నవేవశామండీ బాబూ మీరు రాసినవనీన నిజాలే.అననటుల మాది కూడా పగో జిలాల యే నండీ.భీమవరం.చాలా బాగా రాశారు.
హ:-) హా;-)
:))))
:-) :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి