18, ఫిబ్రవరి 2012, శనివారం

కన్ఫ్యూజన్లో...


పొద్దున్నే లేచినదగ్గర్నుండి మొదలయ్యింది ఎంటో ఈ కన్ఫ్యూజన్. టూత్ పేస్టు బ్రష్ కి పెట్టుకుని నిద్రమత్తుతో కళ్ళుతెరవకుండానే సింక్ దగ్గరున్న మిర్రర్ ముందు కునుకులాగుతూ పల్లు తోమేస్తున్నాను. తోమటంఅయ్యాకా అద్దంలోకి చూద్దునా మొత్తం తెల్లగా కనిపించింది.. ఏంటి నా పల్లేనా ఇంత తెల్లగా మొహం అంతా అయిపోయాయ్ అని మొహం వెతికితే కనబడలేదు.. పేస్టు నురగలో మొత్తం మొహం అంతా తెల్లగా కప్పేసుంది. ఇదేంటి ఇంతనురగొచ్చింది అని మొహంకడుక్కుని చూసాకా అర్ధం అయ్యింది నేను పెట్టుకున్నది పేస్టుకాదని షేవింగ్ క్రీమని.

ఇదెక్కడిగోలో ఏంటో ఎందుకో ఈ కన్ఫ్యూజన్ అని టూత్ పేస్టుతో మళ్ళీ పల్లు తోముకుని.. అలానే అలోచిస్తూ గ్యాస్ స్టౌ వెలిగించి టీ పెట్టుకున్నాను. మరుగుతున్న టీ డికాషను వంకచూస్తూ నాలుగు చెంచాల పంచదార ఎక్కువేసి దించేసి.. టీ.వీ పెట్టి పొద్దున్నే ఈరోజు చావువార్తలేమయ్యుంటాయబ్బా అని న్యూస్ ఛానల్స్ లో మొహం పెట్టి సోఫాలో కూలబడి టీ తాగుతున్నాను.

ఎక్కడో పది మంది సజీవ దహనం.. ఇంకెక్కడో లారీని ఆటో ఢీ నలుగురు మరణం ఇలా వార్తలన్నీ కళ్ళార్పకుండా పొద్దుపొద్దున్నే చూస్తేగానీ టీ.వీ పెట్టినందుకు మనసుకి సంతృప్తి కలగలేదు. హెడ్లైన్స్ అయిపోయి.. అసలు వార్తల్లోకొచ్చేసరికి అప్పటిదాగా రుచిగా అనిపించిన  టీ చేదుగా అదేదోలా వుంది. ఇదేంటి సగం దాకా బాగానేవుంది దీనికేం రోగమొచ్చిదబ్బా అని ఆ సగం టీ కిచెన్ సింక్ లో పారబోసి నోరుకడుక్కున్నాకా.. పేస్టుకు బదులు షేవింగ్ క్రీమ్ లాగా ఇక్కడ పంచదారకి బదులు టేస్టింగ్ సాల్ట్ వాడేసానని అదీగాక నాలుగు చెంచాలు ఎక్కువే వేసేసాననీ తేలిపోయింది. బాగానే వుంది ఈ కన్ఫ్యూజన్ సంబడం. ఇలా మొదలయ్యిదేంటిరా ఈ రోజు ఇంకా ఎన్నిఅఘాయిత్యాలు చూడాలో ఏంటో అని తల గోడనుకుని కర్టెన్ కేసి కొట్టుకుని మళ్ళీ కన్ఫ్యూజయిపోయాను.

టేస్టింగ్ సాల్ట్ ఎఫెక్టు వల్ల అనుకుంట కాలకృత్యాలు మాములుకంటే కాస్త ఎక్కువ టైము సీతాకాల సమావేశాల్లా సమయం పట్టేసింది. ఇప్పుడు కూల్ వాటరనుకుని ఏ హాట్ వాటరో నెత్తిమీదోసుకుంటే ఈకలు పీకేసిన బ్రాయిలర్ కోడిలా తయారయిపోతాననుకుని భయమేసి చన్నీళ్ళతో త్వరత్వరగా మొలతాడు తడిపేసుకుని స్నానం ముగించేసాను. షర్టనుకుని ప్యాంటు.. ప్యాంటనుకుని షర్టు ఎక్కడ తికమకపడిపోతానో అని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వేసేసుకుని ఇన్షర్ట్ చేసేసుకున్నాకా అక్కడే తీసి పెట్టుకున్న బనియన్ కనిపించింది..ఛీ..నా జీవితం.. అని మళ్ళీ అన్నీ విప్పి మొదట్నుండి మొదలెట్టాను.

కాసేపటికి ఎలాగైతే త్వరగా పనులు కానిచ్చి.. లిఫ్ట్ ఎక్కేసి డోర్ వేసి బటన్ నొక్కాననుకుని ఒక పదినిముషాలు వెయిట్ చేసి తరువాత బటన్ని నొక్కి పార్కింగ్ ఏరియాలోకొచ్చేసరికి  ఫోన్ రింగయ్యింది. కుడనుకుని ఎడమ వేపు ప్యాంటుజేబులో చెయ్యి పెట్టివెతికితే ఫోను కనబడలేదు. అయ్యో ఫోను మర్చిపోయినట్టున్నాను. నా మతిమరుపుమీద మా మేనేజరు ప్రజెంటేషనివ్వా.. అనుకుంటూ వెనక్కు బయలుదేరేలోగా వెలిగింది బుర్ర.

ఫోన్ మర్చిపోతే రింగ్ ఎలా అవుతుంది..? అదే కదా, అయితే ఈ జేబులో వుందా అని ఫోన్ ఎత్తేసరికి
"రమేష్ బోల్ రహా హూ", అన్నాడు అవతలి వ్యక్తి.. ఓ రమేష్.. నేను సురేష్.. అని 5-స్టార్ చాక్లెట్ట్ ఏడ్ గుర్తొచ్చింది గానీ ఆ రమేష్ ఎవడో గుర్తురాలేదు.
ఎవరు మీరు అనకుండా "హాజీ బోలియే...",అని నటించేసాకా. మీదనుకుని మా ఇంటికి తాళం వేసేసారు. నేను బయట్నుండి ఇప్పుడే వచ్చాను మా ఆవిడ ఇంట్లోనే వుండిపోయింది అన్నాడు అతను. అప్పుడు ఏ  కన్ఫ్యూజన్ లేకుండా మా ఎదురింటి ప్లాటులో వుండే రమేషే ఫోన్ చేసాడని కన్ఫామ్ అయిపోయింది.

పరుగెత్తుకుంటూ వెళ్ళి తాళం చెప్పి సారీతీసాను. చిచ్చిచీ.. సారీ చెప్పి తాళంతీసాను.. ఆ తాళం మా ఇంటి తలుపుకు వేసుకుని ఉరుకులూ పరుగుల్తో పడుతూలేస్తూ ఆఫీసులో అడుగుపెట్టేసాను. నా డెస్క్ దగ్గరకు వచ్చి చూసేసరికి ఎవడో కూర్చునున్నాడు. అర్య-2 సినిమాలోలాగా నైన్త్ ప్లోరు టైపు వాడిలా నేనువేరే ప్లోరులోకిరాలేదు కదా అని ఒక్కసారి మా మేనేజరు క్యాబిన్.., మా క్యాంటినుకు దారి.. నా దగ్గర్లోవున్న అమ్మాయిల్నీ.. అవిఇవీ సరిచూసుకుని అదిమా ఆఫీసే అని కన్ఫమ్ చేసుకున్నాకా.
"హలో, మీరు కన్ఫ్యూజన్లో నాడెస్క్ దగ్గర కూర్చున్నట్టున్నారు ఇదినాదీ..", అని చిన్నపిల్లాడు కారుబొమ్మని చూపించి నాదీ.. అన్నట్టు నా డెస్క్ చూపించి అన్నాను..
వాడు నవ్వుతూ.. "అవునుమీదే..నేను సిస్టమ్ సపోర్ట్ టీమ్.. మీరు ఫలానా సాఫ్వేర్ ఇస్టాల్ చెయ్యమని టికెట్ రైజ్ చేసారు కదా అది చేద్దామని వచ్చాను", అన్నాడు.
"అవునా!.. సారీ మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అందుకే అలా అన్నానని", అన్నాను.
"హా పర్వాలేదు నేను సిటీనిద్రపోతున్నప్పుడు మేలుకుని పనిచేస్తుంటానులేండి", అని  పెద్ద డెకాయట్.. గజదొంగ స్టైల్లో ఇంట్రడక్షన్ ఇచ్చాడు.
"ఓ నైట్ షిప్పుల్లో ఉంటారా!", అని అర్ధమయ్యినట్టు తలూపాను.
"హహా.. అవును", అని నవ్వి సాఫ్వ్టేర్ ఇన్స్టాల్ చేసివెళ్ళిపోయాడు.

అక్కడితో ఆగలేదు నా కన్ఫ్యూజన్.. డాట్-నెట్ అనుకుని జావా ప్రోగ్రాములో కెలికేసి.. కామెంట్లు రాసేసాను. ఆ ప్రోగామ్ గలవాడొచ్చి గొలగోలచేసేసాడు.. ఎవడు చేసాడో తెలియక తికమక పడిపోయాడు. నేను సైలెంటుగా ఆ సిస్టమ్ రిమోట్ సెషన్ ఆపేసి ఏమీ ఎరగనట్టు కూర్చున్నాను.

టెస్టింగ్ సెర్వర్ అనుకుని ప్రొడక్షన్ సెర్వర్లో వేలుపెట్టి నాలుగు రికార్డుల డాటాబేస్ నుండి డిలీట్ కొట్టాను. అయ్యబాబోయ్ అని నాలుక్కరుచుకున్నాను. అదంతా చెమటలు కక్కుతూఎవడూచూడకుండా రివర్ట్ చేస్తూ మధ్యమద్యలో ఫోననుకుని పక్కనేవున్నమౌసు చెవిదగ్గరపెట్టుకుని కన్ఫ్యూజయిపోయి పక్కోళ్ళందరిదగ్గరా ఇస్సల్ట్ అయిపోయాను.

ఇలాక్కాదు ఈరోజు ఏదో తేడావుంది. ఏంటో తేల్చేయాలని రెస్ట్ రూమ్లో కెళ్ళి హ్యాండ్ వాష్ సోపుతో తలంటేసుకుని చల్లబడి టెన్సన్ లేకుండా బయటకొచ్చి కళ్ళుమూసుకుని మెడిటేషన్ లోకి వెళ్ళిపోయాను.

పదినిముషాలు పోయాకా ఎవడో ఎదురుగా వచ్చి ఎలకగోకినట్టి చేతిపైన తట్టిలేపి మీటింగ్ కి రమ్మన్నారు అన్నాడు. డ్రాలో వున్నపస్తకం పెన్నూపట్టుకని మీటింగ్ రూమ్లోకి పరుగుపెట్టాను. అందరూ ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు. ఫలానే డేట్ లో అయిపోవాలి.. అయిపోతుందా అన్నాడు.
అయిపోతుంది ఏంపర్వాలేదు అంటున్నారు అంతా. నాకుమెడిటేషన్ మత్తు దిగినట్టులేదు..ఏమీ అర్ధంకావటంలేదు. అలాగే తింగరి చూపులుచూస్తున్నాను.
వాడెవడో లేచివెళ్ళి వైట్ బోర్ట్ పై. పెద్దలిస్ట్ ఎక్కించేసాడు. సరేలే పడుంటుంది కదా అని ఆ లిస్ట్ నేనూ నా పుస్తకంపై ఎక్కించేసాను.
పక్కన ఒక్క నిలువు గీత గీసాడు...నేనూ నిలువుగా గీతగీసేసాను. కాస్త పొడవైందని చేత్తో చెరిపేసాడు. నేను పెన్ను గీతను చెరపలేను కాబట్టి కాస్త గీత చివరని కొట్టేసాను. సరే ఎవరెవరు ఎన్నిచేసారో చెప్పండి అని ఒకొక్కడిని అడుగుతున్నాడు. అవి పది..ఇవి నాలుగూ అని ఎవో లెక్కలు ప్రతివారుచెబుతున్నారు.. వాడు బోర్టుమీద వారి పేరు తిన్నగా రాస్తున్నాడు. అది చూసి నేనూరాసేస్తున్నాను. కొంత మంది త్వరత్వరగా చెప్పేస్తున్నారు. నేనూ త్వరత్వరగా రాసేస్తున్నాను.

కాసేపటికి అంతా నిశ్సబ్దం అయిపోయింది. స్పీడుగా రాస్తున్న నా పెన్ను.. సర్ర్...మని గీతగీసుకుంటూ బ్రేకేసేసింది. నేను తలవంచుకుని రాసేవాడిని తలెత్తి పైకి చూసాను. అందరూ చెప్పటం అయిపోయిదనుకుంట... ఇక నావంతేనని అందరూ నా వంక చూస్తున్నారు.
"నీవి ఎన్ని?", అని నన్నడిగాడు, నాకు అర్ధం కాక ఏంటి అని అడిగాను.
"అవే రిపోర్టులు ఎన్ని చెసావ్", అన్నాడు.
"ఏ రిపోర్టులు??", అన్నాను.
"అదేంటి నువ్వు ఈప్రాజెక్టుకి కొత్తా?", అని ఇంకో ప్రశ్నవేసాడు.
అన్నిటికీ నేను పెట్టే బ్లాంక్ ఫేస్ చూసేసరికి వాడికి అర్ధమయ్యినట్టుంది..
"హే.. నువ్వు వేరే టీమ్ కదా ఈమీటింగ్లో కి ఎందుకొచ్చావ్", అన్నాడు.

"నాకేం తెలుసు వాడు పిలిస్తే వచ్చాను", అన్నాను నన్నుపిలిచినవాడిని చూపిస్తూ.
వాడు నా వంక చూస్తూ "కన్ఫ్యూజ్ అయ్యాను సారీ.. ఆ కార్నర్లో పిల్లర్ దగ్గరున్నవాడిని పిలవమంటే నిన్ను పిలిచినట్టున్నాను..సో సారీ..", అని పిచ్చినవ్వు నవ్వాడు.

"ఇట్సోకే..నో ప్రాబ్లమ్..", అని నెమ్మదిగా లేచి నడుచుకుంటూ వచ్చి డోర్ మెల్లిగా తీసుకుని బయటపడ్డాకా.. వాళ్ళు నవ్వుకుంటున్న నవ్వులు వినిపించుకోనట్టుగా మొహంపెట్టి విజిలేసుకుంటూ వచ్చేసాను.

జరిగిన అవమానం తలచుకుంటూ కుమిలిపోతూ.. పైకేమీ ఎరగనట్టు సిస్టమ్లో అలా రిఫ్రెష్లు కొడుతుంటే.. వెనక వచ్చి నిలబడి..లంచ్ కి పోదాం పద అని అన్నాడు మా కొలీగొకడు. "అప్పుడే లంచ్ టైమా.. మెడిటేషన్ చేస్తున్నా సారీ..సారి.. ఇంప్లిమెంటేషన్ చేస్తున్నా.. అందుకే టైము తెలియలేదని వాడికి కన్ఫ్యూజన్ పై కవరింగులిచ్చి.. వాడితోపాటు క్యాంటిన్ కి బయలుదేరాను.

లంచ్ తీసుకోటానికి లైన్లో నిలబడితే.. ఎవడో బూటుకాలితో నాబూటుకాలుపైవేసి పసపసా తొక్కేస్తున్నాడు..
"హే.. కాలుతియ్య్  బే..", అని హిందీలో అరిచేసరికి...
"నువ్వు హిందీలో అరిచి నన్ను కన్ఫ్యూజ్ చెయ్యకు.. కన్ఫ్యూజన్లో ఇంకా ఎక్కువ తొక్కేస్తాను", అని తెలుగు డయలాగు చెప్పి క్షమించేసి కాలుతీసేసాడు.
వీడేంటి హిందీవాడు తెలుగుడయలాగ్ చెప్పాడని అనుకుని ఆశ్చర్యపోబోయేంతలో వాడి ఫేసు చూసి వీడా వీడు..మన తెలుగోడే కదా కన్ఫ్యూజ్ అయిపోయానే అనుకున్నాను.
అదే కన్ఫ్యూజన్లో సాంబార్ చపాతీతోనూ.. ఆలూ-మేతీకూర రైస్ లోనూ కలుపుకుని త్వరత్వరగా తినేసి తిరిగి వర్కుకొచ్చేసాను.

సిస్టమ్ దగ్గరకొచ్చి ఆన్లైన్లో పేస్లిప్ చూస్తుండగా గుర్తొచ్చింది నేను పెట్టిన లీవులు నాలుగే కదా ఆరు లీవ్ బ్యాలన్స్ లోంచి ఎలా కట్ అయ్యాయి.. అని ఎడ్మిన్ డిపార్ట్మెంటులో వుండే అమ్మాయికి మెయిల్ కొట్టాను. కాసేపటికి రిప్లైవచ్చింది సారీ నేను ఆ అమ్మాయిని కాదు అమిత్ ని అని. సరేలే 'ఏ' అని కొట్టగానే ముందు నీ మెయిల్-ఐడి వొచ్చింది, నేనేంచేసేది కన్ఫ్యూజ్ అయ్యాలే పో..అని అసలు అమ్మాయికి మెయిలు కొట్టాను.
"సారీ.. వేరే శ్రీనివాస్ వి.. నీవనుకుని నీ ఎకౌంట్లోంచి వెళ్ళిపోయాయి కన్ఫ్యూజ్ అయిపోయాను వెరీ సారీ, వచ్చే నెల్లో సరిచేయిస్తా", అని చల్లగా చెప్పింది.. మాతల్లే.. మనదీ కన్ఫ్యూజనేనా అనుకున్నాను మనసులో.

సాయంత్రం చాయ్ టైముకు రోడ్డుమీదకొచ్చేసరికి టాపాసులూ తారాజువ్వల్తో సందడి సందడిగా వుంది. పూణే కార్పొరేషన్ ఎలక్షన్లో ఎన్సీపీ గెలిచేసింది.. అన్నాడు మా కొలీగ్. ఏదో పెద్ద నాకూ రాజకీయాల్లో క్రియాశీలక పాత్రవున్నట్టు.. అయితే మనమావ.. శరత్ పవార్ జీ పార్టీ ఇంటికెళ్ళిపోయిందా అన్నానునేను.. గెలిచింది అదేకదా ఇంటికెందుకెళుతుంది అనిమాట తిరగేసాడు వేరే కొలీగ్.

అదేంటి వాడిది రాష్టవాదీ కాంగ్రెస్ పార్టీకదా... ఎన్పీపి అంటే.. నేష్నలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కదా.. అదివేరు ఇదివేరే.. అని నేనూ నాలుగుసార్లు మాట తిరగేసేసాను. జస్ట్ హిందీ-ఇంగ్లీష్ తేడా అంతే.. రెండూ ఒకటే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు అని వాళ్ళంతా గొల్లుమని నవ్వుకున్నారు.

హూ.. ఎలాగైనానాకూ పార్టీలగురించి తెలుసు అని.. నేను కస్ఫ్యూజ్ కాలేదని నిరూపించాలి , ఆంధ్రా రాజకీయాలైతే వీళ్ళకంత తెలియదులే అని..
"మా ఆంధ్రాలో ఈసారి.. బీజూ జనతాధల్ కి నిలబడే కేసీఆర్ కీ.. బీజేపీలో చంద్రబాబు నాయుడికీ.. చిరంజీవి నిలబడే కమ్యూనిస్ట్ పార్టీకీ పోటీ వుంటాది చూడూ.. నా సామిరంగా.. అని కన్ఫ్యూజన్లో ఏదేదో అనేసాను. అలా అని నా చుట్టూ చూసే సరికి, ఎవడూలేడు. అంతా వెళ్ళిపోయారు. నేనొక్కడినే అక్కడ ఎటువెళ్ళాలో అని కన్ఫ్యూజన్లో చూస్తు నిలబడిపోయాను.
-------------
ఒక యధార్థ కల్పిత కధ.
ఒక కల్పిత యధార్ధ కధ.. ఏంటో ఈ కన్ఫ్యూజన్.. :-)

11 కామెంట్‌లు:

కౌటిల్య చెప్పారు...

ఇంతకీ నేనెక్కడున్నాను? రాజు గారి బ్లాగులోనేనా! ఇంతకీ ఈయన ఏ రాజుగారు? ఎంతమంది ఉన్నారేంటి? మరేం ఇద్దరు రాజుగార్లు...ఇద్దరూ పేరుపరంగా ఒహటే మరి! అందుకనే మేం ఇంటిపేరెట్టి పిలుచుకుంటాం ముద్దుగా...హమ్మయ్య! నేను మా దాట్లగారి బ్లాగులోనే కదా ఉంది. ఎహే! ఆ రాజుగారు కథలూ, గట్రా రాయరు. కవితలూ పాటలూ, ఇంకా ఏవో టెక్కునిక్కులూ...ఇక్కడన్నీ కథలే కనిపిస్తున్నాయ్ మరి...అయ్యయ్యో! నా కన్ఫ్యూజన్ మండిపోనూ! నేనున్నది మా ఇందుకూరి రాజుగారి బ్లాగులోనే అన్నమాట! బాబోయ్! ఆయన కథ చదివి నాకు ఎంత కన్ఫ్యూజనొచ్చేసింది....

ఇదో రాజుగారూ! ఇదేం బావుళ్ళా! మీరు మమ్మల్ని మరీ ఇలా మకతిక పెట్టెయ్యటం...;)

అజ్ఞాత చెప్పారు...

ఏంటో అంతా కన్ఫ్యూజన్ గా వుంది.

Mauli చెప్పారు...

>>>సైలెంటుగా ఆ సిస్టమ్ రిమోట్ సెషన్ ఆపేసి

>>>"నాకేం తెలుసు వాడు పిలిస్తే వచ్చాను", అన్నాను నన్నుపిలిచినవాడిని చూపిస్తూ.

Had a really good laugh

రాజ్ కుమార్ చెప్పారు...

నిప్పు సినిమా గాని చూశారాండీ??? ;)
నైస్ పోస్ట్ ;)

అజ్ఞాత చెప్పారు...

ఇంకా నయం కన్ఫ్యూజన్ లో పింక్ స్లిప్ ని పే స్లిప్ అనుకోలేదు కదా!

మనసు పలికే చెప్పారు...

టపా మొత్తం ఒకెత్తైతే, ఆ మీటింగ్ పార్ట్ మరో ఎత్తు. ఆఫీసులో కూర్చుకి గట్టిగా నవ్వేశా అది చదివి :)))
హమ్మయ్య, ఇంత కంఫ్యూజన్ లోనూ టపా మీ ఐడి నుండే పెట్టేశారు పొరపాటున వేరే వాళ్ల ఐడి నుండి పెట్టకుండా..;)

శ్రీనివాసరాజు చెప్పారు...

@కౌటిల్యగారు,
కన్ఫ్యూజన్లో పడి.. పేషెంటుకు మోషన్స్ తగ్గటానికివ్వాల్సింది మాని అయ్యేటందుకిచ్చేరు. కొంపలంటుకుపోతాయి. :)

@లలితగారు,
హహా.. కన్ఫ్యూజ్ చేసేసానన్నమాట.

@మౌళిగారు
మీ నవ్వులకు సంతోషం.

@రాజ్ కుమార్ గారు
నిప్పును తృటిలో తప్పించుకున్నా లేకపోతే ఇంకా కన్ఫ్యూజన్ గా వుండేది ఈ పోస్ట్. :)

@బోనగిరి గారు
పింక్ స్లిప్ - పే స్లిప్పా.. మీరు ఇంకా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇంతకీ ఇవేంటబ్బా?? :-)

@మనసుపలికే గారు
నచ్చినందుకు సంతోషం.
వేరేవాళ్ళ ఐడి తెలుసుగానీ పాస్వార్డు తెలియదుకదా అందుకే అవలేదు లేకపోతే రాసేవాడినేమో.!

ఇంత కన్ఫ్యూజన్లో కూడా కామెంట్లిచ్చిన మీ అందరికీ ధన్వవాదములు.

A Homemaker's Utopia చెప్పారు...

రాజు గారు,
మీ బ్లాగు చాలా చాలా బాగుందండీ...:-) మాది కుడా గోదావరేనండీ బాబు..ఎటొచ్చీ మీది పశ్చిమ గోదావరైతే మాది తూర్పు గోదావరి..రాజమండ్రి వాస్తవ్యులం..నన్ను కూడా మీ బ్లాగ్ మిత్రులలో కలుపుకుంటారని ఆశిస్తూ...నాగిని.

శ్రీనివాసరాజు చెప్పారు...

@A Homemaker's Utopia గారు,
బ్లాగు నచ్చినందుకు సంతోషం.
తప్పకుండా నా బ్లాగు మిత్రుల్లో మీరు ఒకరే. అందులోనూ మా ఉభయగోదావరోళ్ళు కదా! :)
ధన్యవాదములు.

రఘురాం వర్మ చెప్పారు...

నా బ్లాగ్ మీకు నచ్చినందుకు చాలా సంతోషం .. మీలాంటి వారి అభిప్రాయాలే.......

ఇదేంటి నేను కామెంటు కదా పెట్టాలి....

క్షమించండి రాజు గారు .... మళ్ళీ క్షమించాలి బావ గారు కదా.....!

ఏంటో ఎందుకు మొదలుపెట్టానో మరచిపోయను...

ఒక్క మాట మటికి గురుతుంది ...... సూపర్

ధాత్రి చెప్పారు...

పోస్ట్ చదివి ఇల్లనుకొని, confuse అయ్యి office లో గట్టిగా నవ్వేసానండి..:)
Very good narrating style..
చాలా నచ్చింది blog..:)

Related Posts Plugin for WordPress, Blogger...