బజ్జొచ్చి.. బ్లాగర్ ని...
బజ్జొచ్చి బ్లాగర్ ని ఎక్కిరించటం అంటే ఇదే.. యువరానర్. ముందొచ్చిన బ్లాగర్ కన్నా వెనుకొచ్చిన బజ్జే వాడి అని నమ్మిన జనాలు..ఇలా మానిటర్లకు అంటుకుపోయి.. వారాలు వారాలు స్నానాలు చేయకుండా ముక్కులుమూసుకుని.. కుళ్ళు కామెంట్లిచ్చుకోవటం నాకేం నచ్చలేదని.. నా కీ బోర్డ్ లో 'కంట్రోల్ కీ' ని నొక్కి వక్కానిస్తూ..ఆవేశాన్ని 'కంట్రోల్' చేసుకుంటున్నాను యవరానర్.
ట్విట్టర్ ని చూసి గూగుల్ అట్లకాడ మైక్రోవేవ్ వోవెన్లో పెట్టి వేడిచేసి వాతపెట్టుకున్న చందాన.. ఒకరిద్దరు ఖాలీగా ఉంటున్న ప్రోగ్రామర్ల చేత పనిచేయించడం కోసం గూగుల్ పన్నిన వ్యూహంలో భాగంగా బజ్జుపుట్టిందనీ..అది తెలియక మన కుర్రాళ్ళు భలేవుందని.. చంకల్లో చేతులుపెట్టుకుని గుద్దుకుని.. ఇలా సగం బగ్గులతో మార్కెట్టుమీదకు వదిలేసిన ఈ బజ్జుని పెంచి పోషించడం.. మన బ్లాగ్ యువతను తప్పుదారిన పట్టించడానికి పక్కదేశాలు పన్నిన కుట్రేనని.. ఇది చాలా చాలా అన్యాయమని.. నేను సవినయంగా కోర్టువారికి మనవి చేసుకుంటున్నాను యువరానర్.
తండ్రి టూర్లలో నడిచినప్పడు కనీసం చెప్పులుకొనుక్కోటానికికూడా డబ్బులు లేక.. ఒక్కసారిగా.. తెరచించుకొని తెరమీదకొచ్చిన మన యువ నేత గగన్ లాగా.. ఓదార్పు వెకేషన్లని.. అందమైన మార్నింగులనీ.. రోబోటిక్ టెక్నాలజీలనీ.. ఈ మధ్య సి.బి.ఐ రైడింగులనీ.. వార్తల్లో సెలబ్రిటీ లెవల్ కి ఎదిగినట్టుగానే.. అతి తక్కువకాలంలోనే ఎదిగిపోయేలా చేసి.. ఎక్కడో బోన్లో నిలబడాల్సిన ఈ బజ్జును ఇలా BMW కార్లలో తిరిగేలా చేసింది ఎవరనీ.. నేను కోర్టువారిని ప్రశ్నిస్తున్నాను యువరానర్.
నడమంత్రపుసిరిలాగా ఎదిగిన ఈ బజ్జు వల్ల.. బ్లాగర్ల్ లో ఎంతో శ్రమకోర్చి రాసిన టపాలకు రెండువందలు మూడువందలు హిట్లున్నా కనీసం రొండుకూడా కామెంట్లు రాలక... నిరాశతో.. నిస్పృహతో.. కొరుక్కోటానికి కూడా గోళ్ళు లేక.. వేళ్ళుకొరుక్కుంటుంటే.. ఆ వేళ్ళు రాయటానికి సహకరించక.. ఖాలీగా వుంటూ.. ఎవరికీ చెప్పుకోలేక... బాధను సోడా కలపని విస్కీలాగా దిగమింగుతున్న మా క్లైంట్ల పొట్టకొట్టడం...ఒక దేశద్రోహం అని.. దీనిని మనం కండకండాలుగా.. ఖండించి.. కేశఖండనం చేయాలని కోరుతున్నాను యువరానర్.
ఈ విషయం మీద ప్రతిపక్షమైన బజ్జును తయారుచేసిన గూగుల్ వారు వచ్చి క్షమాపన కోరి.. బజ్బును త్వరలోనే టుజి-రాజాలాగా.. కనిమొజి-రాణీలాగా..తీహార్ జైలుకు పంపించే విధంగా కోర్టువారు చర్యలు తీసుకోవాలని ప్రార్దిస్తున్నాను.
ఈ పాతవస్తువులను రోడ్డుమీద పడేసే సంస్కృతి పోవాలని మన బ్లాగ్ నేతలను నేనంతగానో వేడుకుంటున్నాను యువరానర్. ముందొచ్చిన సికింద్రాబాదుకన్నా వెనకొచ్చిన హైద్రాబాదే ముద్దన్నది.. వాస్తవమనీ.. ఈ మధ్య వేర్పాటు గొడవల్లో ఎక్కడా కూడా.. ఎవరూ మాకు సికింద్రాబాద్ కావాలని అనకపోవటంతో తేలిపోయింది.. యువరానర్.
ఇది చాలా బాధాకరమైన విషయంగా పరిగణించి మా పాతవైభవం మళ్ళా వచ్చేలా చూసి.. ఎప్పుడూ చెప్పినట్టుగా చట్టం తనపని చేసుకుపోతుందని రికార్డు చేసిన తీర్పు ఇవ్వకుండా... ఈ కేసులో కాస్త కొత్త డయలాగులు రాయించేలా కోర్టు తనవంతు సాయం చేస్తుందన్న ఆశతో వాదిస్తున్నాను యువరానర్.
మొన్న ముంబయిలో బాంబులు పేలిన తరువాత ఎవరూవచ్చి "మేమే బాంబులు పెట్టాం", అని చెప్పకపోవటం వలన.. మన హోం మినిష్టరుగారు ఎవరుపెట్టారో తెలుసుకోలేకపోయారు.. అలాగే.. ఎవరొకరు ముందుకొచ్చి.. బజ్జులోవున్నదేంటి.. బ్లాగర్లో లేనిదేంటిని చెప్పకపోవటం వలన మాకూ ఏమీ తెలియక ఇలా ఓపెన్ గా ఖండించడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నామని మనవి చేసుకుంటున్నాం యువరానర్.
చాలా విషయాలు పరిశీలించాకా తెలిసిందేంటంటే.. కొత్తగా ఏ టెక్నాలజీ వొచ్చినా.. అప్పుడెప్పుడో రాజమండ్రిలో పిచ్చికుక్కులు స్వైరవిహారం చేసినట్టుగా.. వెబ్ విహారం చేసి.. మన బ్లాగ్ యువత ఎగబడిపోతూ.. ఉర్రూతలూరుతుందని.. తేలింది యువరానర్. అలాంటి విహారమే ఇప్పుడు గూగుల్ ప్లస్సులో చేస్తున్నారని తెలుస్తుంది యువరానర్.
బ్లాగర్ పాతది.. పనికిరానిది బజ్జుకొత్తదీ..అని ఒకే కారణాలు మళ్ళీ మళ్ళీ చెప్పొద్దని నేను విన్నవించుకుంటున్నాను యువరానర్. పాతది అనే మాటైతే.. కాటుమొహానికి.. మేకప్పేసి.. పౌడర్ పూసి.. మన రాష్ట్ర హోంమంత్రిని చేస్తే.. ఏం మాట్లాడకుండా ఎలా ఒప్పుకున్నారు ఈ జనం అని ప్రశ్నిస్తున్నాను యువరానర్.
రాష్ట్రం మంటల్లో మండిపోతున్నప్పుడు కూడా.. ఫ్రెష్ గా మొహం కడుక్కుని.. మీడియా ముందుకొచ్చి.. "ఎలా జరిగిందో మేం చర్యలు తీసుకుంటాం. ఏం జరుగుతుందో మేం చర్యలు తీసుకుంటాం.. ఏదోలా మేం ప్రయత్నించి చర్యలు తీసుకుంటామని.. "చర్యలు" అనే పదాన్నిఎలా వాడాలో తెలియక ఎదో ఆవిడ మాట్లాడేస్తే..ఎలా ఒప్పుకున్నారు ఈ జనం.. అని అడుగుతున్నాను. "ఆవిడకే మాట్లాడటం రాదు.. ఇక మనమేం మాట్లాడతాం...", అని వూరుకున్నారుగానీ ఈ జనం.. వేలేత్తి ఎప్పుడూ చూపించలేదు యువరానర్.
అలాంటి ఈ జనం.. పాతది.. పనికిరానిదీ అని బ్లాగర్ ని నిందించడం ఏమన్నా భావ్యమాఁ.. అని అడుగుతున్నాను యువరానర్.
మొన్న ఇదే విషయం మనం ముఖ్యమంత్రిగారి దాకా తీసుకెళదామని వెళితే ఆయన డిల్లీ వెళ్ళారని తెలిసింది యువరానర్.. సరే కదా అని డిల్లీ దాగా వెళ్ళి గల్లీ గల్లీ తిరిగితే ప్రతీ గల్లీలోనూ మన సీమాంధ్ర.. మన తెలంగాణా ఎమ్మెల్యేలే కనిపిస్తున్నారుగానీ.. అయన దొరకలేదు.. చేసేదిలేక మళ్ళీ హైద్రాబాదొచ్చేసి.. ఎప్పటికో ఆయన్ని పట్టుకుని ఈ బ్లాగ్ బాధలు విన్నవించుకుంటే.. మేం చెప్పిందంతా విని.. ఆయనకూడా "తప్పకుండా చర్యలు తీసుకుంటాం" అన్న ఒక్కమాటని మూడు భాషల్లోఖూనీ చేసి చెప్పారుకానీ.. ఇప్పటివరకూ ఏ "చర్యలు" తీసుకోలేకపోయేసరికి.. ఈ "చర్యలు" అన్న పదానికి కొత్తగా ఏమన్నా తెలియని అర్ధాలున్నాయేమోనని అన్ని భాషల నిఘంటువులు తిరగేసుకోవాల్సొచ్చింది యువరానర్.
ఇంకొక్క విషయం నేను కోర్టువారి దృష్టిలోకి తీసుకురావాలని అనుకుంటున్నాను..., అదేంటంటే.. "కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్", "కేక","సూపరో-డూపర్", "గుర్ర్ర్ ర్ ర్", అని బాగా వాడుకలో వున్న సరికొత్త పదాలకు.. పేటెంట్లను సంపాదించి.. అంతర్జాతీయ గుర్తింపువచ్చేలా చేసి.. ఇవి బ్లాగర్లలో కామెంటిచ్చే చోట 'లైక్' బటన్ లాగా వచ్చేలా చేసి.. మౌసుక్లిక్కుచెయ్యకుండానే..కంటిచూపుతో కామెంటిచ్చే టక్నాలజీ తీసుకొస్తే....
బజ్జుల్లో ఇవి వాడుకుని.. "కికికికికికి" అని నవ్వుకుంటున్న వాళ్ళంతా.. బ్లాగ్లుల్లో కూడా "కికికికికి కికికికి కికికికి" అని నవ్వుతూ వస్తారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నాను యువరానర్.
ఈ విషయాలన్నీ చూస్తూ.. "అమ్మ ఏది చెబితే అదే..", అన్న మన ఫ్రధానమంత్రిగారిలా నోట్లో బెల్లంముక్క పెట్టుకున్నట్టుగా నవ్వుతూ వుండిపోలేక.. అవేశంతో కోర్టుకెక్కాల్సొచ్చిందని నా బాధను వెళ్ళగక్కుతున్నాను యవరానర్.
ఈ పైన పేర్కొన్నవిషయంపై.. వెంటనే తమతమ వివరణ ఇస్తూ కామెంట్లివ్వాలని.. కామెంటివ్వని వారిని.. కోర్టువారు కటినంగా శిక్షించాలని.. ఈ టపాకు కూడా బజ్జులో కామెంటిచ్చినవారిని యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించాలని కోరుకుంటూ.. ఇక్కడితో సెలవుతీసుకోకుండా ఈ పోస్టుకు రెండో భాగంలో ఎవరెవరు దీనికి
బాధ్యత వహించాలో పేరుపేరునా రాస్తుంటాననీ మనవి చేసుకుంటు సెలవు తీసుకుంటున్నాను యువరానర్. జైహింద్.. జై తెలుగు బ్లాగింగ్.