మళ్ళీ ఆడపిల్లే పుట్టింది..!!!
"ఒరే.. ఎంకట్రావో.. మీ ఆవిడకి నొప్పులొత్తన్నాయంటరా.., మీ అమ్మాఆల్లోఆటోలో తీసుకెల్తున్నారో.. నిన్ను వున్నపలంగా పక్కూరు పెద్దాస్పట్టలకి రమ్మన్నారో.. ", అని తాటిసెత్తులో అరపకట్టుకుని బయటేపుగోడకి ప్లాస్టింగు సేత్తున్న ఎంకట్రావుకి తోట్లో బుల్లబ్బులు సైకిలుమీద గడ్డికోత్తానికెళతా కేకేసి ఇషయం సెప్పేడు.
ఆ కేకిన్న ఎంకట్రావు.. తాపీ గమేళాలోకిసిరేసి.. నాలుగడుగుల్లో కర్రలెంబడి కిందికి దిగిపోయి.. సైకిలేసుకుని ఇంటికి బయర్దేరేడు. ఓ పర్లాంగు దూరంఎల్లాకా.. కిళ్ళీకొట్టు రాంబాబుగాడు సైకిలుకు పెద్ద ఐసుగెడ్డ కట్టుకొని ఎదురొత్తా అదే ఇషయం సెప్పేడు... మళ్ళా కొంతదూరం ఎల్లాకా సంతకి గేదెల్ని తోలుకెళ్తున్న సూరయ్యతాతగూడా అదే ఇషయం సెప్పి కంగారెట్టేసేడు.. అలా దారెంబడి.. అదే ఇషయం కనబడ్డోళ్ళంతా సెబుతున్నకొద్దీ ఎంకట్రావు యమా టెన్సన్ తో సైకిలు స్పీడుపెంచేత్తా తొక్కేత్తున్నాడు.. సెమటలట్టేసి మొకంనిండా కారిపోతున్నా పట్టించుకోకుండా.. ఏదో ఆలోచన్లో తొక్కేతూనేవున్నాడు.. అలా కంగారకంగార్గా ఇంటికి సేరుకున్న ఎంకట్రావు.. సైకిలు స్టాండెయ్యకుండా వంటవసారా పాకకి ఆనించేసి.. గెడేసున్న ఇంటితలుపు.. సప్పుడు కాకండా.. నెమ్మదిగా తీసి దొంగోడు దూరినట్టు ఇంట్లోకి దూరాడు... ఆళ్ళావిడ పడుకుంటున్న మంచంమీదున్న బొంతకింద సెయ్యెట్టి.. కుంకంలో ముంచిన నిమ్మకాయలు, తాయత్తూ తీసి జేబులో కుక్కుకున్నాడు.. గుట్టుసప్పుడు కాకండా.. సైకిలు తీసుకుని.. పక్కూరు బయల్దేరేడు..
*** *** *** *** *** ***
ఎంకట్రావు ఆ ఊళ్ళో పెద్ద తాపీమేత్రి... అప్పటి కాలంలో సబ్సిడీ ఇల్లు కాన్నుండి.. మొన్నటి గవర్నమెంటోరి హయాంలో ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ సగ్రుహ వరకూ.. ఊళ్ళో అందరి డాబాలు కాంట్రాట్టుకు తీసుకుని కట్టించిచ్చినోడే.., ఆళ్ళూళ్ళో ఆంజనేయసాములోరి గుడికాన్నుంచి.. పంచాయితీ డ్రైనేజిలు..., వూరినడిమద్దెనున్న రాయిసెట్టుకింద నూతిపల్లెం, దూడల్రేవులో మెట్లు.. ఇలా ఒకటేంటి, ఆ వూళ్ళో సిమ్మెంటుతో కట్టిన ఏ సిన్న దిమ్మైనా.. ఎంకట్రావు సేయిపడకుండా పనికాలేదు.. ఎవరిదగ్గర తగ్గట్టుగా ఆళ్ళకి పనులుసేసిపెడతా, ఎవరితోనూ గొడవపడకండా.. అందరితల్లోనాలికలా ఉంటావుండే మంచి మనిషి ఎంకట్రావు.
ఎంకట్రావు తండ్రి సిన్నప్పుడే చెనిపోటంతో కూలిపనిచేత్తా పెంచుకొచ్చింది ఆళ్ళమ్మ సెంద్ర. దగ్గరసుట్టరీకంలో అమ్మాయైతే చెప్పినట్టుపడుంటుందని.. పట్టుబట్టిమరీ సుబ్బలచ్చిమిని కోడలుగా తెచ్చుకుంది సెంద్ర. ఇంత ముద్దతింటా.. ఓపికున్నప్పుడు కూలిపనికెళతా.. ఎంకట్రావుతోబాటే వుంటుంటుంది సెంద్ర.. మనిషిమంచిదే అయినా.. ఏ ఇషయమైనా.. తన్జెప్పినట్టే నడవాలంటది. మహా మాటకారి.. గడ్డుమనిషి.తేడావత్తే ఎవర్నీలెక్కసేయకుండా నోరేసుకుని పడిపోతుంటది.. వూరి జనాలంతా సెంద్రనోట్లోనోరెట్టానికి తెగ భయపడిపోతుంటారు.
ఎంకట్రావు, సుబ్బలచ్చిమికి రెండెళ్ళకితమే కవలాడపిల్లలుపుట్టేరు. ఆపరేషను సేయించేద్దాం అంటే ఇనకుండా... ఈ సారి వారసుడుడతాడు నీకేంతెల్దని ఎంకట్రావుమీద నిప్పులుసెరిగేసింది సెంద్ర. అమ్మ మాటకెదురుసెప్పలేని ఎంకట్రావు నోరుమూసేసుకున్నాడు. ఆడపిల్లలంటే పెళ్ళిళ్ళుజేసి.. పురుడ్లు పోసీ జీవితాంతం ఏదో సాకిరేవు సేత్తానేవుండాలని ఎంకట్రావు తెగ బాధపడిపోయేడు. ఈ సారికూడా ఆడపిల్లుడితే తనపరిస్తితేంటని బెంగెట్టేసుకున్నాడు. మంచి మంచి కాంట్రాట్టులొచ్చి సేతులో డబ్బులుకనబడినా.. పిల్లల్ని చూసినప్పుడల్లా ఆళ్ళ పెళ్ళే ఆలోచనలోకొత్తున్న ఎంకట్రావుకి మనశ్శాంతిలేకండా పోయింది. సుబ్బలచ్చిమికి నెలలునిండేకొద్దీ అదే ఆలోచనతో మతిలేనివాడైపోయేడు.
మతిలేని ఎంకట్రావు పక్కూరి మంత్రాల ఈరన్నకి డబ్బులిచ్చి పూజలుచేయింత్తున్నాడు. ఆడపిల్లుడితే పురుట్లోనే పోవాలని చేతబడులు చేత్తున్న ఈరన్న సెప్పినట్టుగా.. మంత్రించిన నిమ్మకాయలు వారానికోసారి అట్టుకొచ్చి సుబ్బలచ్చిమి పడుకునే బొంతకిందెడుతున్నాడు. సరిగ్గా పురుటినొప్పులొచ్చే టయానికి ఆ నిమ్మకాయలట్టుకొత్తే.. ఆటితో పూజలుజేసి పుట్టేది ఆడపిల్లయితే పురుట్లోనే చచ్చిపోయేలా చేత్తానని ఈరన్న చెప్పిన మాటలు ఎంకట్రావు నమ్మేడు. అలాగే చెప్పినిధంగా నిమ్మకాయలట్టుకెళ్ళి ఈరన్నకిచ్చేడు.
*** *** *** *** *** ***
గవర్నమెంటు ఆసుపత్రిలో సుబ్బలచ్చిమిని జాయిను చేసింది సెంద్ర.. కొడుకొత్తాడని తెగెదురుచూసింది. తనక్కనబడ్డ వూరోళ్ళందరికీ కబురెట్టించింది. నొప్పులు తట్టుకోలేని సుబ్బలచ్చిమి సొమ్మసిల్లిపోయింది. అది చూసిన పెద్దడాట్రుగారు.. బిడ్డడ్డంతిరిగింది ఆపరేషను చెయ్యాలని చెప్పేరు. సెంద్రకి సెమటలట్టేసి కాళ్ళాడ్డంలేదు. "దీనిమొగుడింకారాలేదండే.. నాకేమో ఏంసేయాలో తెల్వటంల్లేదండే.. మీరే ఏదోటిచేసి కాపాడాలండే..", అని డాట్రగారు చేతులట్టుకుంది సెంద్ర.. కూడావొచ్చిన వూరోళ్ళంతా ఏంపర్లేదు సెంద్రా అంతా మంచే జరుగుద్దని ధైర్యంసెప్పేరు.
ఏం చెయ్యాలో తోచని సెంద్ర ఆ వూరి పెద్దకొండాలమ్మకి దణ్ణమెట్టుకుంది. అంతా సవ్యంగా జెరిగితే కోడ్నికోసి నైవేద్యమెట్టుకుంటాను తల్లీ అని కన్నీళ్ళెట్టుకుని ఏడుకుంది.
కాసేపటకి ఆపరేషను పూర్తిచేసి బయటకొచ్చిన డాట్రుగారు.. ఆడపిల్లపుట్టిందనీ.. తల్లిబిడ్డా క్షేమమని చెప్పేరు. "నువ్వెయ్యేళ్ళు బతుకు బాబా..", అని డాట్రుగారి కాళ్ళట్టుకుని దణ్ణాలెట్టింది సెంద్ర..
ఓవేపు మళ్ళా ఆడపిల్లేపుట్టిందని బాధగావున్నా మరోఏపు.. తల్లీబిడ్డా గండంనుండి బయటడి బతికిబట్టకట్టేరని ఆనందించింది సెంద్ర.
అంతా అయిపోయేకా ఆసుపత్రికొచ్చి ఇషయం తెలుసుకున్న ఎంకట్రావుకి నోటమాటరాలేదు. మొకంలో నెత్తుటిచుక్కలేదు. మళ్ళా ఆడపిల్లే ఎలాపుట్టిందా, మరిపుట్టినాడపిల్ల ఈరన్నచెప్పినట్టు చావలేదే అనే అలోచన్తో పిచ్చోడిలెక్కయ్యిపోయేడు ఎంకట్రావు.
పెళ్ళాం పిల్లల్తో ఇంట్లో ఎవరితోనూ మాటాడకుండా మసలటం మొదలెట్టేడు ఎంకట్రావు. ఈ పిల్లల్నాకొద్దని పెళ్ళాన్ని పుట్టింటికిపొమ్మని పట్టుపట్టేడు. అడ్డొచ్చిన సెంద్రపై సేయిచేసుకోబోయేడు.
వూర్లో బోర్డస్కూల్లో పనిచేసి రిటేరయిపోయిన ఎంకటరత్నం మాస్టారు దగ్గరకెళ్ళి ఇషయం చెప్పి.. "కాత్తమీరైనా బుద్దిచెప్పండి బాబుగారా", అని ఏడ్చింది సెంద్ర..
ఓ రోజు సైకిలుమీద పన్లోకెల్తున్నఎంకట్రావుని పిలిపించాడు ఎంకటరత్నం మాస్టారు. ఇంటరుగుమీద కూర్చోబెట్టి.. "ఒరే పిల్లలుట్టిన తరువాత ఇయ్యేంపనుల్రా..,నిన్నునమ్ముకొచ్చిన ఆ అమ్మాయి పరిస్థితేంటిరా.. ఉన్నదాంట్లో తింటా అందరూ కలిసుంటే.. పిల్లలు పెళ్ళిల్లొచ్చేటయానికి ఆ భగవంతుడే ఏదో దారిచూపిత్తాడ్రా", అని ఇవరంగా చెప్పేడు ఎంకటరత్నం మాస్టారు. ఎంకటరత్నం మాస్టారుమీదున్న గౌరవంతో ఏమీ మాట్లాడకుండా సెప్పిందంతా ఇన్నాడు ఎంకట్రావు.
సాయంత్రం పనంతా అయిపోయి ఇంటికొచ్చేఏల ఏటిగట్టుదగ్గర సైకిలాపి.. చెట్టుకింద కూర్చున్న ఎంకట్రావుకు ఎంకటరత్నం మాస్టారుచెప్పిన మాటల్లో ఒకేమాట బుర్రలో గిరగిర తిరిగింది.
"నేను రిటేరయిపోయాకా నా ఇద్దరు కొడుకులూ నాదగ్గర డబ్బెంతుందో చూసారుగానీ.. ఒక్కడైనా ఇక్కడికొచ్చి నేనెలగున్నానో చూసారా? రెక్కలొచ్చాయికదా! ఎవడిదారినవాడెగిరిపోయేర్రా.., నేనెక్కడ ఒంటరివాడినైపోతానో అని.. పెళ్ళేచేసుకోనని పట్టుబట్టింది మా అమ్మాయి, అదికాదని మనూరబ్బాయినే ఇచ్చి పెళ్ళిచేసానా.. ఇప్పుడు నాబాగోగులు చూసుకుంటూ రోజు నన్నుపలకరించిపోతుంది. పుట్టబోయే బిడ్డలు వాళ్ళకు కావాల్సిన సిరిసంపదలు కూడా వాళ్ళతోనే తీసుకొస్తారంటారురా.. నా అనుభవంతో చెబుతున్నాను ఆడపిల్లలేనిల్లు ఇల్లుకాదురా",
మేస్టారు కొడుకులు పట్నంపోయి పెద్దుజ్జోగాల్లో స్తిరపడిపోయినిషయం నిజమే. ఆళ్ళు తండ్రిదగ్గరకు రాకండా మొకాలుచాటేత్తున్నఇషయమూ నిజమే. ఆళ్ళకూతురు దగ్గరుండి చూసుకోటమూ నిజమే. ఇయన్నీ కళ్ళముందు కనిపిత్తున్న ఎంకట్రావుకి.. కొడుక్కంటే కూతురుకే పేమెక్కువంటాదేమో.. అనిపించింది. ఆరోజునుండి పిల్లల్ని పేమతో ముద్దులెట్టుకుని చంకనేసుకుని తిరక్కపోయినా..ఆళ్ళక్కావాల్సింది అట్టుకొచ్చి కలిసిమెలిసుంటా.. సంసారంనెట్టుకొత్తున్నాడు.
*** *** *** *** *** ***
కాలగమనంలో.. ఎంకట్రావుమాస్టారు.. ఎంకట్రావు ఆళ్ళమ్మ సెంద్ర గాల్లోకలిసిపోయేరు. కాంట్రాట్టుల్లో బాగా సంపాయించిన ఎంకట్రావు.. ముగ్గురాడపిల్లలకీ పెళ్ళిళ్ళుచేయగలిగేడు సొంతిల్లుకట్టకోగలిగేడు.
ఓ సంక్రాంతి పండక్కి పిల్లల్నెత్తుకొచ్చేరు ముగ్గురాడపిల్లలూ, కూతుళ్ళూ.. మనవలూ మనవరాళ్ళతో నిండిపోయి మా సందడిగా తయారయ్యిందా ఇల్లు. మనవరాళ్ళు పట్టుపరికిణీలేసుకుని ఇల్లంతా తిరుగుతుంటే.. ఆ ఇంటికి కొత్తమెరుపొచ్చినట్టయ్యింది.
అది చూసిన ఎంకట్రావు తాను ఆ రోజు చేసిన తప్పే తలుచుకుని కళ్ళెంబట నీళ్ళెట్టుకున్నాడు.
"పుట్టినబిడ్డలు ఆళ్ళక్కావాల్సిన సిరిసంపదలు ఆళ్ళతోబాటే తీసుకొస్తారు..." అన్న ఎంకటరత్నం మాస్టారి మాటే చెవుల్లో మారుమోగింది.. చచ్చి ఏ లోకానున్నాడో మాస్టారుగారు.. "మహానుభావుడు.." అని దణ్నమెట్టుకున్నాడు ఎంకట్రావు.
25 కామెంట్లు:
మీరిట్టాగా మా కళ్ళమ్మట నీళ్ళెట్టిత్తే ఎట్టాగండీ బాబూ..ఎట్టాగైనా రాజుగారో, తవఁరు సూపరండీ బాబూ!
echo Kautilya's words above.
BEAUTIFUL
నా అనుభవంతో కూడా చెబుతున్నాను " ఆడపిల్ల లేనిల్లు ఇల్లే కాదూ" నిజంగా.
i second to what kautilya told...
motta modata varakatnam annadi pothe aadapillala puriti chaavulu annavi sagam thaaguthayi....
కౌటిల్య మాటే నాది కూడా అండీ... మీరు సూపర్.. చాలా బాగా రాశారు..
మగపిల్లలు పుడితే వరకట్నం ఉండాలంటారు, ఆడపిల్లలు పుడితే వరకట్నం పోవాలంటారు. ఈ హిపోక్రిసీ ఉంటే వరకట్నం పోదు.
@కౌటిల్యా, కొత్తపాళీ గారు, వేణూ శ్రీకాంత్ గారు
టపా నచ్చినందుకు సంతోషం. ఈ రోజుల్లో కూడా ఆడ-మగ తేడాలంటూ పట్టించుకుంటున్నవాళ్ళని చూస్తున్నాం. అందులోంచి పుట్టిన ఊహే ఈ కధ.
@భమిడిపాటి సూర్యలక్ష్మి గారు
మాది ఊహే ఇంకా. మీది అనుభవం. :-).
మీ కామెంటుకు ధన్యవాదములు.
@సంతోష్, ప్రవీణ్ శర్మగారు
కారణాలు ఏమైనాగానీ ఈ రోజుల్లో కూడా ఇలా ఆలోచించడం మన దురదృష్టం.
మీ కామెంటుకు ధన్యవాదములు.
కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు, ఆచరించడమే ఇష్టం ఉండదు. ఆడపిల్ల పుడితే శ్రీమహాలక్ష్మి అంటారు, ఆడదాన్ని దేవత అంటారు. కానీ ఆ దేవత మగవాడి (భర్త లేదా తండ్రి) posessionలో ఉండాలనుకుంటారు. ఇక్కడే మహిళలపై గౌరవం ఓడిపోతుంది.
చాలా బాగుంది. నేటివిటీలో వంశీని మరిపింపజేస్తున్నారు.
కౌటిల్య గారి మాట మరొక్కసారి.. :)
కౌటిల్య గారి మాటతో అందరూ ఏకీభవిస్తున్నారు, నేనూ అదే గుంపు లో.. చాలా బాగా ఉంది. తేజస్వి గారి తో కూడా ఏకీభవిస్తున్నాను.
బాగుందండి.
యాసలో మీ పోస్ట్ చదవడం బలే తమాషాగా, సరదాగ ఉంటుందండీ. అప్పుడప్పుడూ కుళ్లుగా కూడా ఉంటుంది మాండలీకం మీద మీకున్నంత పట్టు నాకు లేదే అని.
కౌటిల్య మాటలే నావీను...రిపీట్
ఏమి చెప్పమంటారు, కౌటిల్య గారి మాటే మాది కూడా. సూపరంతే.
ఏం బాబూ, గాలి ఆడపిల్ల మీదికి మళ్ళిందా? కొత్త ఇల్లూ, కొత్త వాతావరణం... ఇంకెందుకూ అలశ్యం చేయకు ! Best of luck !!!
@ప్రవీణ్ శర్మగారు.
ఇలా మాట్లాడుకుంటూ పోతే అంతమే వుండదు ఈ టాపిక్‌కి. :-)
@తేజస్విగారు
మరి నేటివిటీ ప.గో కదండీ.. :-)
@మేధ గారు,కృష్ణప్రియ గారు, శిశిర గారు
నచ్చినందుకు సంతోషం. ధన్యవాదములు
@ఆ.సౌమ్యగారు
కామెంటినందుకు ధన్యవాదములు. మాట్లాడింది రాయలేను.. రాసింది మాట్లాడలేను.. నాకు అంత మాండలీకంలో పట్టులేం రావండోయ్. ఏదో విన్న మాటల్ని ఉపయోగిస్తూ రాస్తున్నా.. మాపల్లె నేపధ్యం ఇలా ఉపయోగపడుతుంది అంతే. :-)
@ఫణిబాబు గారు
గాలులూ-సుడిగాలులూ ఏమీ తిరగలేదండీ. అయినా జరిగేదానిని ఆపటానికి, నాకిదే కావాలని కోరుకోవటానికి మనమెవరమూ చెప్పండి. అంతా విష్ణు మాయ. :-)
ధన్యవాదములు.
@బులుసు వారు
మీ పేరు కాస్త వోవర్ లుక్ అయ్యింది.. క్షమించండి.
మీ కామెంటుకు ధన్యవాదములు.
అవును మీ ఇంటిపేరు మీద మా తణుకులో ఒక వీధే వుందిగా! బులుసువారి వీధి అని. ఆ వీధిలోనే మా అమ్మమ్మగారి ఇల్లు :-)
రాజు గారూ,
:) మా అమ్మమ్మ గారిల్లు కూడా తణుకులోనే...
కాకపొతే బులుసు వారి వీధి కాదు...
మీ బ్లాగ్ వైపు వచ్చి చాలా రొజులు అయ్యీందండి, ఈ లోపు, చాలా టపాలు రాశారే, నాకు ఓ పది రోజులు మంచి కాలక్షేపం, మెల్లగా అన్నీ చదివి కామెంట్ పెడతా
ఆయ్, మా బాగా సెప్పారండి
@కృష్ణప్రియ గారు
అయ్ బాబోయ్ తణుకు వాళ్ళెక్కువైపోయారు. నా బ్లాగుపేరు మార్చేసుకోవాలేమో.. లేకపోతే ఫీలైపోయేలాగున్నారు. :-)
@తార గారు
లేటుగా వచ్చినా లేటెస్ట్ కామెంట్సు పెట్టండి లేటుచేయకుండా.. :-)
@బాటసారి గారు
మీకు నచ్చేసిందండే మరి.. ఆయ్. చానా సంతోషమండే బాబో. :-)
chalaa bagaa rasaru. excellent.
@స్వాతి గారు
నచ్చినందుకు సంతోషం.
కామెంటుకు ధన్యవాదములు. :-)
హృద్యంగావుంది
కోనసీమ భాషను రాతల్లో మీ అంత అందంగా ఇంకెవరు పలికించలేరేమో రాజుగారు.....your narration is just too good :)
@నాగార్జున గారు,
చాలా ఆలస్యంగా సమాధానం ఇస్తున్నాను.
మీరందరూ చదివి అర్ధంచేసుకుంటున్నారు.. ఆనందిస్తున్నారనే ధైర్యంతోనే ఇది ఒక సిరీస్ లాగా రాస్తున్నాను. మీ కామెంటుకు ధన్యవాదములు. :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి