భార్యాబాధితులు
సినిమాల్లో చూపిస్తుంటే ఏంటో అనుకున్నాను. బయట చూసాకా పాపం నిజమే అనిపిస్తుంది.
ఈ బిగ్ బజార్ వాడికి పనీపాటావుండదు.. ఒకటికొంటే ఒకటి ఫ్రీ అంటాడు మా ప్రాణాలు తియ్యటానికి అన్నాడు మా కొలీగొకడు. అందేంటిరా ఫ్రీ అయితే కొనుక్కో అందులో నీకొచ్చినబాధేంటటా అన్నాము మేము. అంతే కస్సున లేచి... నీకలాగే వుంటుందిరా..మా అవిడకి ప్రీ అన్న పదం విందంటే.. ఒక వంద పట్టుకురమ్మంటుంది. మొన్నటికిమొన్న బిస్కట్ ప్యాకెట్టు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని పట్టుకెళ్ళానా, చాలా బాగున్నాయి..తక్కువరేటే.. ఈసారి అవి ఒక ముప్పైపట్టుకురమ్మని ఆర్డర్ వేసింది. అందేంటే అన్నెందుకూ అన్నానంటే నాకు ఆపూట బోజనంవుండదు అని తలపట్టుకున్నాడు. మేమంతా నవ్వుకున్నాం.
ఒకడేమో షాపింగ్ చేసాకా.. దానిమీద షాపువాడు అంటిచిన బార్ కోడ్ వున్న స్టిక్కర్ వెతికి వెతికి మరీ చించేస్తున్నాడు. అందేంటి బాస్ అదెందుకు చింపుతున్నావ్ అంటే.. నా ఖర్మ ఏం చేయను. వీడు ఇంత డిస్కవుంట్ అంత తగ్గింపు అని అంటిస్తాడు. ఇది కొని ఇంటికి పట్టుకెళ్ళామా అంతే.. చీప్ గా వచ్చిందని పెద్దకొన్నారులేండి బడాయి అని నామీద సెటేర్ వేస్తొంది మా ఆవిడ అని వాపోయాడు.
మీ పనే బెస్ట్ మీది ఎరేంజ్డ్ మ్యారేజ్ నాది లవ్వని కొవ్వొక్కి చేసుకున్నాను. పుట్టినరోజొస్తే.. గిఫ్టు.. డిన్నర్.. పెళ్ళిరోజొస్తే.. బయటవూరికి ట్రిప్పు. వేలేంటైన్స్ డేకి స్పెషల్ గా డైమండ్ రింగు.. ఇవ్వన్నీ అప్పుచేసైనా కొనాలి. వద్దన్నామంటే.. అదిగో పెళ్ళికిముందు ఇచ్చావుగా అప్పుడే ప్రేమతగ్గిపోయిందనీ మొదలుపెడుతుంది నస... అని వేరేవాడు నిట్టూర్పుతో చెమటలు తుడుచుకున్నాడు.
అవును నిజమేరా బాబూ.. ఈ మధ్య టీవీలో యాడ్స్ ఒకటి. వజ్రం ప్రేమంత విలువైనది ఇది గిప్ట్ ఇవ్వండి.. మీ ప్రేమను తెలుపుకోండి.. అని. ఏఁ వజ్రమిస్తేనే ప్రేమున్నట్టా. వాడి సొమ్మేంపోయింది. గవర్నమెంటు టాక్స్ లో ఇలా గిఫ్టు ఎలవెన్సులేమన్నా ఇస్తుందా ఏంటి., సంపాదనంతా ఇలా గిప్టులకు, మార్చినెలొస్తే సగం ట్యాక్సులకూ..వీటికే అయిపోతుంది అని అందరికీ సాయమొచ్చాడు ఇంకొకడు.
ఈ బాధ లవ్ మ్యారేజ్ లోనే లేదు బాసూ. నాది ఎరేంజ్డ్ మ్యారేజే. కానీ నేను పెళ్ళిచేసుకునే సమయంలో నా నక్షత్రంలో శనిసంచారం వుండి.. డబ్బులులేక ఒక రెండులక్షలు పెళ్ళిఖర్చులకు తీసుకున్నాము. అదేలే కట్నంగానే అనుకో.. అంతే ఎప్పుడు ఏది కొనిపెట్టలేకపోయినా. తీసుకున్నారుగా రెండులక్షలు అవిచ్చేయండి కొనుక్కుంటానంటుంది మా ఆవిడ. అలా ఇప్పటికి ఒక పాతిక ముప్పై లక్షలు ఖర్చయినా ఇంకా ఆ రెండులక్షలు బాకీతీరనేలేదు... అంటాడు మరోక బాధితుడు.
లాస్ట్ ఇయర్ ఇదే టైముకు మా మరదలు పెళ్ళి. అప్పుడు నేను రెండు లక్షలు పెర్సనల్ లోన్ తీసుకుని మా ఆవిడకి చీరలు నగలు కొన్నాను. ఇప్పటికీ ఆ అప్పే తీర్చలేకపోతున్నా.. మళ్ళీ వాళ్ళ పిన్నిగారి అబ్బాయి పెళ్ళంట. నానెత్తిమీద మళ్ళీ పడింది బండరాయి... అని ఎడ్చాడు ఒకడు.
మా ఆవిడకి పెద్దగా చెడలవాట్లు ఏమీ లేవుకానీ. శనిఆదివారాలొస్తే ఇంట్లో వుండనివ్వదంతే. కనీసం వెయ్యికి తగ్గకుండా ఏదన్నామంచి రెస్టారెంటులో లంచ్. రెండువేలు తగ్గకుండా డిన్నర్. ఒక ఐదొందలు పెట్టి సినిమా. నూటయాభైపెట్టి పాప్ కార్న్.. ఇది శనివారం ప్లాన్. ఆదివారమొస్తే ఏదన్న రిసార్ట్ లో పొద్దున్నుండి రాత్రివరకూ టైమ్ పాస్ అంతే వీకెండొస్తే జస్ట్ ఏడెనిమిదివేల ఖర్చంతే. అన్నాడు సూన్యంలో చూస్తు వేరేవాడు. హాహా.. అవును మంచి అలవాట్లే అని అంతా నవ్వుకున్నారు.
నాదొక వింత స్టోరీ. నాకు నాలుగు క్రెడిట్ కార్డులున్నాయి. అవెలాగుంటాయో నేను అప్లైచేసినప్పుడే చూసాను..., అవన్నీ ఇప్పుడు మా ఆవిడి హేండోవర్ లోనేవున్నాయి. అంతే.. కనబడ్డ షాపులో క్రెడిట్ కార్డు గీకడం మా ఆవిడవొంతు. బిల్ కట్టడం నా వొంతు.
ఇవన్నీ ఫైనాస్సియల్ ప్రాబ్లమ్స్.. ఇవి కాకుండా అసలు సిసలు కష్టాలు ఇవే అని భావిస్తున్నారు మరికొందరు.
మాలో కొత్తగా పెళ్ళయినవాడొకడున్నాడు. వాడు పెళ్ళికి ముందు ఎంగేజ్మెంటు అయ్యాకా రిలయన్స్ టు రిలయన్స్ ఫ్రీ అన్న రెండు మొబయిల్స్ కొని గిప్టిచ్చిమరీ అన్నిట్లోనూ తను శ్రీరామచంద్రుడికన్నాఒక ఆకు ఎక్కువే చదివానని చెప్పుకున్నాడు. అసలు విషయం అలా చెప్పుకోటంతోనే వచ్చిందంట. ఒకరోజు ఆఫీసుబయట నిలబడి సిగరెట్ కాలుస్తుంటే వాళ్ళ బావమరిది చూసి. వాళ్ళ అక్కకు చేరవేసాడంట. అంతే.. ఆ తరువాత రోజునుండి వాళ్ళావిడ వాడికి నోటికి ప్లాస్టర్ వేసి ఆఫీసుకు పంపుతుంది. బావమరిదిని ఆ ప్లాస్టర్ తియ్యకుండా ఇన్వస్టిగేషన్ కిపెట్టింది.
సాయంత్రం ఎనిమిదవగానే ఒక మూతమందైనా వాసన చూడనిదే నిద్రపట్టని వాడొకడున్నాడు. వాడిని కదిపితే చాలు ఛస్ పెళ్ళయ్యాకా.. నా బతుకు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా అయిపోయింది అంటాడు పాపం. వాళ్ళావిడి వూరెళ్ళిందంటే చాలు.. బీచ్ దగ్గర నిక్కర్లేసుకుని తాగుతూ తూలుతూ తిరిగే ఫారినర్స్ లాగా ఎప్పడూ నిశాలో మునుగిపోతూవుంటాడు.
నాన్ వెజ్ అంటే విపరీతమయిన ప్రేమున్నవాడొకడు పెళ్ళయ్యాకా ఇంట్లోవండటంలేదని నాలుక బయటపెట్టుకుని తిరుగుతుంటాడు. బయటెక్కడన్నా చాన్స్ వస్తే రేపే యుగాంతం అన్నట్టు భూమ్మీద ఏం మిగల్చకుండా తినేస్తుంటాడు. మేం అది చూసి నవ్వితే. ఏం చెప్పమంటావు బాసూ నా బాధలు అంటాడు పాపం.
ఇవండీ నేను చూసిన కొన్ని భార్యాబాధితుల బాధలు.
మీక్కూడా తెలిసినవి వుంటే ఇక్కడ రాయండి.
గమనిక:
మారుపేరుతో రాసుకునే అవకాశం వుంది. మీ అసలుపేరు ఎక్కడా బయటపెట్టమని హామీ ఇస్తున్నాము. :-)
30 కామెంట్లు:
>>గమనిక:
మారుపేరుతో రాసుకునే అవకాశం వుంది. మీ అసలుపేరు ఎక్కడా బయటపెట్టమని హామీ ఇస్తున్నాము. :-)<<
హే రాజన్!! అఙ్ఞాతగా వ్యాఖ్యానించే అవకాశం ఇవ్వకుండా ఇలా మారుపేరుతో రాసుకోమ్మని చెప్పడాన్ని ఖండిస్తున్నాను అధ్యక్షా. కాస్త ఈ ఒక్క టపాకు ఆ స్వేఛ్చనిస్తే మరిన్ని కతలు వెతలు బయటికి వస్తాయి అని నా అనుకోలు :-)
అన్నట్లు టపా బాగుంది మీరు చాలావరకు కవర్ చేశారు..
హమ్మ్ పర్లేదు. త్వరలోనే సంపూర్ణ జ్ఞానోదయమయ్యే సూచనలున్నాయి.
ఇంకా, నేను వీక్ అంతా ఆలో లక్ష్మణా అని త్రాఫ్ఫిక్ అంతా ఈది వస్తే. వీకెండ్ అంతా నన్ను బండి మీద త్రాఫ్ఫిక్ లో తిప్పాలి అంటుంది మా ఆవిడ. వెనక కూర్చున్న వాళ్ళకు చాల థ్రిల్లింగ్ గ ఉంటుంది. మనకు దూల తీరి పులుసు కారుతుంది ఒక నలభై సిగ్నల్స్ దాటేసరికి ;-)
ఆఫీసు లో ఎక్కువ ఉండక్కపోతే బాసు దొబ్బుతాడు. ఎక్కువ ఉంటె ఇంట్లో గోల...
మనం కొంటె జత రెండు వేలు. వాళ్ళు కొంటె ఐదు వేలు...
వీకెండ్ లో ఇంట్లో వంట చేయాలి. హెల్ప్ తో స్టార్ట్ అయ్యి మొత్తం మనమే చేయాలి...
ఇవన్ని ఎవడు పుస్తకాలలో రాయడు బాబాయ్....
ఓస్!!!! ఇంతేనా!!!
మీరు మరీనండి! ఈ మాత్రానికే ఉస్సూరుమంటే ఎలా? మీరు చెప్పినవి సముద్రం లో నీటి బొట్టంత!!!!
ఇవి ఇనుకోండి!!! నిన్న టి.వి లో అదేదో చానల్లో ఆడవాళ్ళంతా స్టేజ్ పై ఒకేటైప్ పట్టు చీరల్లో ఒకేటైప్ నగలతో డాన్సులు చేస్తుండటం కంటబడింది. ఎంటా అని ఆరా తీస్తే, అదేదో కిట్టి పార్టి లట. ఒక్కో నెల ఒక్కొక్కళ్ళ ఇళ్ళల్లొ, ఒకే టైప్ డ్రెస్సుల్లొ ఇలా కలిసి ఆటలు పాటలు అన్నమాట. ఎవరి డ్రెస్సులు ఎక్కువగా సూటబల్ గా ఉంటాయో వాళ్ళకి ప్రైజ్ఉలు .. ఇక ఆ ప్రైజ్ఉలు కూడా అయిదారు వేలకి తక్కువ ఉండవు. ఇదొక్కటేనా.... ఇలాంటి గేమ్స్ చాలా ఉంటాయ్!!! హి హి హి హి!!!
ఇక పార్టీలకి కావలసిన సేకరణలు నెలముందుగానే ప్రారంభిస్తారట. !!!!కావలసిన నగలు, చీరలు, హండ్ బాగ్స్, మాచింగ్ చెప్పులు. ఒకటేమిటి.. అన్ని!!!మొత్తానికి సదరు భర్త గారి పర్సు కి పెద్ద చిల్లు అన్న మాట!!!
ఓపికుంటే వండే కార్యక్రమం లేదా, క్యాటరింగ్ లేక రెస్టారెంట్‌ల్లో భోజనాలు...ఇవి కాకుండా పిక్నిక్ లూ నెలకోసారి...
కొసమెరుపేంటంటే..... ఆరోజు మాత్రం మగాళ్ళెవరు ఇంట్లో ఉండకూడదట.!!!!తరిమేస్తారు అన్నమాట..!!! ఒకవేళ ఆదివారం అయినా సరే భర్త గారు బయటెక్కడో తిరిగి రాత్రికి ఇంటికి చేరుకోవాల్సిందే.
సూపర్ కదండి !!!! హి హి హి..
పెళ్ళి మీద నేను చదివిన ఓ మంచి కోట్. "పెళ్ళాం చూయింగ్ గం లాంటిది, మొదట్లో తియ్యగా బానే ఉంటుంది కానీ, తరవాత బంకలా పట్టుకొని వదల్దు" అంట.
అది నేను పొరపాటున నా వైఫ్ పక్కనున్నప్పుడు చదివి, నవ్వా. ఆ సన్నాసెవ్వడో రాసినందుకు కాదు కానీ, నేను నవ్వినందుకు అయిపోయా :-)
" అది నేను పొరపాటున నా వైఫ్ పక్కనున్నప్పుడు చదివి, నవ్వా. ఆ సన్నాసెవ్వడో రాసినందుకు కాదు కానీ, నేను నవ్వినందుకు అయిపోయా :-) "
మరే!!!
అలా పెళ్ళాలందరిని జనరలైజ్ చేసేసి మాట్లాడితే మండిఉంటుంది...?
అయినా అందరు పెళ్ళాలు చూయింగ్‌గమ్ కాదు లెండి. ఎక్కడో నూటీకో కోటికో మంచివాళ్ళు కూడా ఉంటారు
:( వా.. వా.. ఆనందంగా వుంది.
నేనీ ప్రపంచంలో ఒంటరిని కాదు, ఏడ్వటానికి తోడున్నారు అన్న భావనే ... ఎంతో సేదతీరుస్తుంది.
(నరహంతక) కుమార్ గారి జోకు కఠిన వాస్తవాలను తెలియజేసింది. :D
@శుభకరుడు గారు
ఈ ఒక్కపోస్ట్ కే అనామికగా వ్యాఖ్యానించే అవకాశం ఎలాగో తెలియలేదు.
@కొత్తపాళీ గారు
పెళ్ళయ్యాకా ఎలాగూ జ్ఞానోదయాలో అవుతాయి.
@సాధారణ పౌరుడు గారు
అయ్యో పాపం మీ కష్టాలు చాలానేవున్నాయే.
అవునండీ ఎవడూ పుస్తకాల్లో రాయడు.. ఎందుకంటే వాళ్ళ పెళ్ళాలు కూడా చదువుతారనే భయంతో అనుకుంట. :-)
@r గారు
మీ కామెంటు డిలీట్ చేసేయ్యాలి.. ఈ కిట్టీపార్టీ అయిడియా ఎవరన్నా చూస్తే ఈ అయిడియా అదిరిందని మొదలుపెట్టినా పెడతారు బాబోయ్.. :-)
@KumarN గారు
అలాంటి కోట్స్ చదివినా తరువాత ఫ్రీడమ్ దొరికినప్పుడు హాయిగా నవ్వుకోవాలి. అలా ముందు నవ్వితే ఎందుకు నవ్వామో చెప్పుకోవాలిగా మరి. :-)
r గారు అన్నట్టు అందరు పెళ్ళాలు అలాకాదులేండి.
నరహంతక కుమార్ గారు ఈమధ్య చాలా జోకులే వేస్తున్నారు. మొన్నటికి మొన్న ఎవరో "పరస్త్రీ పాము వంటిది" అంటే "ఏ స్త్రీ అయితే ఏమి? మెళ్ళో పడ్డాక కరవక మానదు" అన్నారు.
శ్రీనివాస రాజు గారు ఈ టపాతో అనేకమందికి ప్రేరణ కల్గించారు! చూద్దాం, ఎంతమంది రాస్తారో!
"r గారు అన్నట్టు అందరు పెళ్ళాలు అలాకాదులేండి"
అవునా, అంటే కనీసం మొదట్లో కూడా తియ్యగా ఉండరా :-) చచ్చారుపో మొగుడుగొర్రెలు :-)
Snkr, we are all in it together. Hang tight, if nothing else, we(men) are certainly survivors :-)
@Snkr గారు
మీరేమి బాధపడొద్దు. మీకోసం మేమంతావున్నాం. ధైర్యంగావుండండి.
@సుజాతగారు
చూడాలి ఎంతమంది నిజాలు నిర్భయంగా రాస్తారో :-)
@KumarN గారు
బాగానే పట్టేసారే!!!.
మీరు అనుభవజ్ఞులే అని తెలుస్తుంది :-)
కుమార్ గారూ!
మీరు చెప్పిన లాజిక్ ప్రకారం అయితే, "తల్లి అల్లం, ఆలి బెల్లం" సామెత కీ అర్థం లేకుండా పోతుందండీ. :-)
కొందరు పెళ్ళాలెప్పుడు చివ్వరి వరకు కాడ్ బరీ డైరీ మిల్క్ లన్న మాట.కాక పోతే వారికి తగినంత పబ్లిసిటి దొరకదన్నమాట. :)
సుజాతగారన్నట్టు, ఈటపా చాలా మందికి ప్రేరణ కలిగిస్తోంది.
శ్రీనివాస రాజు గారు, సున్నిత మయిన సమస్య ని పంచుకున్నారు .. హి హి హి .. కాస్త జాగ్రత్త గా ఉండండి.
పెళ్లైతే కానీ తెలియలేదు పెళ్ళాం అంటే ఏమిటో
తెలిసినా తెలియలేదు చెయ్యాల్సింది ఏమిటో
వంగి తాళి కట్టి అల్లాగే ఉండిపోయాను ఎందుకో
30 ఏళ్లకే తెల్లబడింది నల్లటి జుట్టు ఎందుకో
పెరుగుతున్న అప్పులతో తరగని చింతలు
గానుగెద్దు లాగ కట్టుకున్నాను కళ్ళకి గంతలు
చచ్చినా ఒప్పుకోను నేను భార్యా విధేయుడనని
మీరైనా ఒప్పుకోండి నేను భార్యా బాధితుడనని.
ఒక్క నిమిషం ఉండండి. ఇలాంటి పోస్టుల్లో కామెంట్ పెట్టచ్చో లేదో మా ఆవిడనడిగి ఇప్పుడే వచ్చేస్తా. :)
@r గారు
అవునండీ చాలా సున్నితమే.. అందుకే మా ఆవిడ వూళ్ళోలేనప్పుడు పోస్ట్ చేసాను. :-)
@సుబ్రహ్మణ్యం గారు
చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే ఒప్పుకుంటాం.. :-)
@శంకర్ గారు
హహహా.. జాగ్రత్త వీపు అనువుగాపెట్టి అడిగేరు.. విమానం మోతే.. :-)
ఓక బీహారీ సామెత: "షాదీ కర్లో, యా ఖుష్ రహో".....
టైటిల్ చూడకుండా వచ్చా......ఆగండి మళ్ళీ వస్తా ఓ డజను అప్పడాల కర్రలు వాటిని విసిరే రెండు డజన్ల చేతులతో
లలితగారూ నేను మీకు సాయం :D
bhartabadithulu gurinchi kuda rayavachu kada...appudu comment chesta nenu....mee opinion meeda :)
@సత్యగారు
బీహారీ అయినా నిజం చెప్పాడు. :-)
@లలితగారు, @ఆ.సౌమ్యగారు
నేను హెల్మెట్ పెట్టుకున్నాను ఇప్పుడే. :-)
@శిరీష గారు
భర్తబాధితుల గురించి భర్తలే రాస్తే ఏం బాగుంటుంది చెప్పండి.
srinivas garu..meeru rayagalaru...naku telusu :)
@శిరీష గారు
మీరు రాయగలరు.. మీరు రాస్తారు.. మీరు రాసేస్తున్నారు.. హిప్నాటిజం చేయటంలేదు కదా!!
అదే హిప్నాటిజం నేను చేస్తాను..
మీరు మీ అనుభవాలు రాయండి. మేం కామెంటిస్తాం.. :-)
లలితగారూ,సౌమ్యా...నేను వస్తా మీకు సాయం ;) ఎన్ని అప్పడాలకర్రలు కావాలీ???? :))
ఏంటదీ, మరీ అప్పడాల కర్రలా? అట్లాంటి పాతకాలపు ఆయుధాల్నించి తప్పుకోవటం మాకు వెన్నతో పెట్టిన విద్య. మగజాతి ఎప్పుడో నేర్చేసుకుంది, duck అవ్వటంలో మేం experts. వెళ్ళండెళ్ళండి, కొత్తవేమన్నా నేర్చుకొని రండి :-)
హి హీ.. అప్పడాలకర్ర మరీ ఓల్డ్ టూల్ అయిపోయింది.
ఇప్పుడు లేటెస్టె గా ఏమున్నాయంటారు?? ఇదీ మా భార్యాబాధితులనే అడిగి కనుక్కుంటాను. :-)
few quotes :
A wise man never marry. When he marries, he becomes otherwise.
Are you happy or married ?
Nannu maatram ee question adakkandi..plss...
@బాటసారిగారు
కొటేషన్ బాగుందండీ. కానీ మరీ పెళ్ళిని అంతలా తీసిపారేయలేం. తింగరోళ్ళుకూడా పెళ్ళయ్యాకా తెలివైనవాళ్ళయ్యుండొచ్చు. కాకపోతే వాళ్ళు కోటేషన్స్ రాయలేదేమో.. :-)
మీరిలా భయపెట్టేస్తే పాపం పెళ్ళికానివాళ్ళేమయిపోవాలి.
ఆ క్వస్చన్ కి నేను మేరీడ్ అండ్ హేపీ అనే చెబుతాను. అప్పుడప్పుడు ఛీ.. నా జీవితం అనిపిస్తందనుకోండి. అది ఎందులోనైనా ఉండేదే కదా! ;-)
ఆలస్యంగా సమాధానమిస్తున్నందుకు క్షమించండి.
నిజమే !! పెళ్ళి ని మరీ అలా తీసి పారెయ్యలేం...
పెళ్ళయ్యాకే కదా ప్రపంచానికి . ఒక సోక్రటీస్ దొరికాడు...
@r గారు
ఏవండోయ్.. పెళ్ళిని మరీ సపోర్ట్ చేసేస్తున్నారు ఏమిటీ విషయం. ఎమన్నా బాగా దెబ్బతిన్నారా (మొట్టికాయల్లాంటివి.. :-))
మరీ ఎక్కువకాకుండా.. మరీ తక్కువకాకుండా మధ్యరకంగా సపోర్ట్ చేద్దాం ఏమంటారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి