6, మార్చి 2011, ఆదివారం

భార్యాబాధితులు


సినిమాల్లో చూపిస్తుంటే ఏంటో అనుకున్నాను. బయట చూసాకా పాపం నిజమే అనిపిస్తుంది.

ఈ బిగ్ బజార్ వాడికి పనీపాటావుండదు.. ఒకటికొంటే ఒకటి ఫ్రీ అంటాడు మా ప్రాణాలు తియ్యటానికి అన్నాడు మా కొలీగొకడు. అందేంటిరా ఫ్రీ అయితే కొనుక్కో అందులో నీకొచ్చినబాధేంటటా అన్నాము మేము. అంతే కస్సున లేచి... నీకలాగే వుంటుందిరా..మా అవిడకి ప్రీ అన్న పదం విందంటే.. ఒక వంద పట్టుకురమ్మంటుంది. మొన్నటికిమొన్న బిస్కట్ ప్యాకెట్టు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని పట్టుకెళ్ళానా, చాలా బాగున్నాయి..తక్కువరేటే.. ఈసారి అవి ఒక ముప్పైపట్టుకురమ్మని ఆర్డర్ వేసింది. అందేంటే అన్నెందుకూ అన్నానంటే నాకు ఆపూట బోజనంవుండదు అని తలపట్టుకున్నాడు. మేమంతా నవ్వుకున్నాం.

ఒకడేమో షాపింగ్ చేసాకా.. దానిమీద షాపువాడు అంటిచిన బార్ కోడ్ వున్న స్టిక్కర్ వెతికి వెతికి మరీ చించేస్తున్నాడు. అందేంటి బాస్ అదెందుకు చింపుతున్నావ్ అంటే.. నా ఖర్మ ఏం చేయను. వీడు ఇంత డిస్కవుంట్ అంత తగ్గింపు అని అంటిస్తాడు. ఇది కొని ఇంటికి పట్టుకెళ్ళామా అంతే.. చీప్ గా వచ్చిందని పెద్దకొన్నారులేండి బడాయి అని నామీద సెటేర్ వేస్తొంది మా ఆవిడ అని వాపోయాడు.

మీ పనే బెస్ట్ మీది ఎరేంజ్డ్ మ్యారేజ్ నాది లవ్వని కొవ్వొక్కి చేసుకున్నాను. పుట్టినరోజొస్తే.. గిఫ్టు.. డిన్నర్.. పెళ్ళిరోజొస్తే.. బయటవూరికి ట్రిప్పు. వేలేంటైన్స్ డేకి స్పెషల్ గా డైమండ్ రింగు.. ఇవ్వన్నీ అప్పుచేసైనా కొనాలి. వద్దన్నామంటే.. అదిగో పెళ్ళికిముందు ఇచ్చావుగా అప్పుడే ప్రేమతగ్గిపోయిందనీ మొదలుపెడుతుంది నస... అని వేరేవాడు నిట్టూర్పుతో చెమటలు తుడుచుకున్నాడు.

అవును నిజమేరా బాబూ.. ఈ మధ్య టీవీలో యాడ్స్ ఒకటి. వజ్రం ప్రేమంత విలువైనది ఇది గిప్ట్ ఇవ్వండి.. మీ ప్రేమను తెలుపుకోండి.. అని. ఏఁ వజ్రమిస్తేనే ప్రేమున్నట్టా. వాడి సొమ్మేంపోయింది. గవర్నమెంటు టాక్స్ లో ఇలా గిఫ్టు ఎలవెన్సులేమన్నా ఇస్తుందా ఏంటి., సంపాదనంతా ఇలా గిప్టులకు, మార్చినెలొస్తే సగం ట్యాక్సులకూ..వీటికే అయిపోతుంది అని అందరికీ సాయమొచ్చాడు ఇంకొకడు.

ఈ బాధ లవ్ మ్యారేజ్ లోనే లేదు బాసూ. నాది ఎరేంజ్డ్ మ్యారేజే. కానీ నేను పెళ్ళిచేసుకునే సమయంలో నా నక్షత్రంలో శనిసంచారం వుండి.. డబ్బులులేక ఒక రెండులక్షలు పెళ్ళిఖర్చులకు తీసుకున్నాము. అదేలే కట్నంగానే అనుకో.. అంతే ఎప్పుడు ఏది కొనిపెట్టలేకపోయినా. తీసుకున్నారుగా రెండులక్షలు అవిచ్చేయండి కొనుక్కుంటానంటుంది మా ఆవిడ. అలా ఇప్పటికి ఒక పాతిక ముప్పై లక్షలు ఖర్చయినా ఇంకా ఆ రెండులక్షలు బాకీతీరనేలేదు... అంటాడు మరోక బాధితుడు.

లాస్ట్ ఇయర్ ఇదే టైముకు మా మరదలు పెళ్ళి. అప్పుడు నేను రెండు లక్షలు పెర్సనల్ లోన్ తీసుకుని మా ఆవిడకి చీరలు నగలు కొన్నాను. ఇప్పటికీ ఆ అప్పే తీర్చలేకపోతున్నా.. మళ్ళీ వాళ్ళ పిన్నిగారి అబ్బాయి పెళ్ళంట. నానెత్తిమీద మళ్ళీ పడింది బండరాయి... అని ఎడ్చాడు ఒకడు.

 మా ఆవిడకి పెద్దగా చెడలవాట్లు ఏమీ లేవుకానీ. శనిఆదివారాలొస్తే ఇంట్లో వుండనివ్వదంతే. కనీసం వెయ్యికి తగ్గకుండా ఏదన్నామంచి రెస్టారెంటులో లంచ్. రెండువేలు తగ్గకుండా డిన్నర్. ఒక ఐదొందలు పెట్టి సినిమా. నూటయాభైపెట్టి పాప్ కార్న్.. ఇది శనివారం ప్లాన్. ఆదివారమొస్తే ఏదన్న రిసార్ట్ లో పొద్దున్నుండి రాత్రివరకూ టైమ్ పాస్ అంతే వీకెండొస్తే జస్ట్ ఏడెనిమిదివేల ఖర్చంతే. అన్నాడు సూన్యంలో చూస్తు వేరేవాడు. హాహా.. అవును మంచి అలవాట్లే అని అంతా నవ్వుకున్నారు.

నాదొక వింత స్టోరీ. నాకు నాలుగు క్రెడిట్ కార్డులున్నాయి. అవెలాగుంటాయో నేను అప్లైచేసినప్పుడే చూసాను..., అవన్నీ ఇప్పుడు మా ఆవిడి హేండోవర్ లోనేవున్నాయి. అంతే.. కనబడ్డ షాపులో క్రెడిట్ కార్డు గీకడం మా ఆవిడవొంతు. బిల్ కట్టడం నా వొంతు.

ఇవన్నీ ఫైనాస్సియల్ ప్రాబ్లమ్స్.. ఇవి కాకుండా అసలు సిసలు కష్టాలు ఇవే అని భావిస్తున్నారు మరికొందరు.

మాలో కొత్తగా పెళ్ళయినవాడొకడున్నాడు. వాడు పెళ్ళికి ముందు ఎంగేజ్మెంటు అయ్యాకా రిలయన్స్ టు రిలయన్స్ ఫ్రీ అన్న రెండు మొబయిల్స్ కొని గిప్టిచ్చిమరీ అన్నిట్లోనూ తను శ్రీరామచంద్రుడికన్నాఒక ఆకు ఎక్కువే చదివానని చెప్పుకున్నాడు. అసలు విషయం అలా చెప్పుకోటంతోనే వచ్చిందంట. ఒకరోజు ఆఫీసుబయట నిలబడి సిగరెట్ కాలుస్తుంటే వాళ్ళ బావమరిది చూసి. వాళ్ళ అక్కకు చేరవేసాడంట. అంతే.. ఆ తరువాత రోజునుండి వాళ్ళావిడ వాడికి నోటికి ప్లాస్టర్ వేసి ఆఫీసుకు పంపుతుంది. బావమరిదిని ఆ ప్లాస్టర్ తియ్యకుండా ఇన్వస్టిగేషన్ కిపెట్టింది.

సాయంత్రం ఎనిమిదవగానే ఒక మూతమందైనా వాసన చూడనిదే నిద్రపట్టని వాడొకడున్నాడు. వాడిని కదిపితే చాలు ఛస్ పెళ్ళయ్యాకా.. నా బతుకు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా అయిపోయింది అంటాడు పాపం.  వాళ్ళావిడి వూరెళ్ళిందంటే చాలు.. బీచ్ దగ్గర నిక్కర్లేసుకుని తాగుతూ తూలుతూ తిరిగే ఫారినర్స్ లాగా ఎప్పడూ నిశాలో మునుగిపోతూవుంటాడు.

నాన్ వెజ్ అంటే విపరీతమయిన ప్రేమున్నవాడొకడు పెళ్ళయ్యాకా ఇంట్లోవండటంలేదని నాలుక బయటపెట్టుకుని తిరుగుతుంటాడు. బయటెక్కడన్నా చాన్స్ వస్తే రేపే యుగాంతం అన్నట్టు భూమ్మీద ఏం మిగల్చకుండా తినేస్తుంటాడు. మేం అది చూసి నవ్వితే. ఏం చెప్పమంటావు బాసూ నా బాధలు అంటాడు పాపం.

ఇవండీ నేను చూసిన కొన్ని భార్యాబాధితుల బాధలు.
మీక్కూడా తెలిసినవి వుంటే ఇక్కడ రాయండి.

గమనిక: 
మారుపేరుతో రాసుకునే అవకాశం వుంది. మీ అసలుపేరు ఎక్కడా బయటపెట్టమని హామీ ఇస్తున్నాము. :-)

Related Posts Plugin for WordPress, Blogger...