సెల్ ఫోన్ సుబ్బలక్ష్మి...
పిల్లల్ని కాలేజికి, భర్తగారిని ఆఫీసుకు పంపించేసి హాల్లోకొచ్చి కూర్చుని టీ.వీ ఆన్జేస్తుండగా.. సుబ్బలక్ష్మి ఫోన్ మోగింది. “హమ్మయ్యా ఎవరోకరు మాట్లాడటానికి దొరికారు”, అని మనసులోనే ఆనందపడిపోతూ ఫోనెత్తింది సుబ్బలక్ష్మి.
"వదినా.. బావున్నావా.. చాలారోజులయ్యింది నీతో మాట్లాడి", అంది అవతలివైపునుండి ఆడగొంతు.
“హా.. బావున్నానే సుజాతా.. నువ్వెలావున్నావు. చాలారోజులేంటి..అసలు మమ్మల్ని మర్చేపోయావు. ఏంటి, అంతా బాగానేవున్నారు కదా!. తమ్ముడు ఎలావున్నాడు. ఆరోగ్యం అదీ బాగానే వుంటుందా.”, లాంటి కుశలప్రశ్నలు అవీఅయిపోగానే..
"అవును అలా జరిగిందేంటే... ఈశ్వర్ కి, దేవికి పెళ్ళి ఫిక్షయ్యింది కదా!!, మున్నా దేవికోసం ముంబయినుండి తిరిగొచ్చేసాడు కదా!. దేవిప్పుడు ఈశ్వర్ ని పెళ్ళి చేసుకోనంటుంది.. మున్నానే పెళ్ళిచేసుకుంటానని పట్టుబడుతుంది అదేం చోద్యమో... ఇప్పుడేమో ఆ అమ్మాయిని మధురై పంపించేసారు.., మున్నాకి ఈ విషయం తెలియదు పాపం.. వెతుకుతున్నాడు. చూస్తున్నావా అసలు" అంది సుబ్బలక్ష్మి ఆయాసపడిపోతూ,
"హా..వదినా ఎందుకు చూడను.. మా ఇంటిల్లిపాది తప్పకుండా చూస్తాం మొగలిరేకులు సీరియల్", అని అంది సుజాత అవతలివేపునుండి.
“సుందరాకాండలో ట్విస్టు చూసావా.. ఎంతబాగుందో.. స్నెహ తిరిగొచ్చిందనుకుంటే.. నేను స్నేహను కాదు.. నేత్రా దేవి అని చెబుతుంది. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి చాలా ఇంట్రస్టింగా వుంది నాకు..”, అని వేరే టాపిక్ మొదలుపెట్టి ఒక గంట మాట్లాడుకున్నాకా ఫోన్ కట్ అయిపోయింది. "అయ్యో కట్ అయ్యిందే..", అని మరళా డయల్ చేసి ఈ సారి వంటలు, చీరలు, నగలు లాంటి మాటలుమొదలెట్టింది సుబ్బలక్ష్మి.
“ఏం కూర చేసావూ.. కరివేపాకు పులుసా.. నేనూ మొన్న మాటీవీలో చూసాను అది. నా ఫోనులో వీడియో తీసిపెట్టుకున్నాను కూడా.. రేపొండుదామని అనుకుంటున్నాను. నువ్వు అల్రెడీ చేసేసావా.. ఎలావచ్చింది”, అని ఊపిరికూడా తీసుకోకుండా ప్రశ్నలుమీద ప్రశ్నలేసేసింది సుబ్బలక్ష్మి. అవతలివేపున్న సుజాత, ప్రతీ ప్రశ్న రాసుకున్నట్టుగా మర్చిపోకుండా ఒక్కొక్కదానికీ సమాధానాలు చెప్పేసింది. మళ్ళీ ఓ గంట గడిచింది ఈ టాపిక్క్ అయ్యేసరికి.
కాలింగ్ బెల్ మ్రోగింది.. ఎవరా అని డోర్ సీత్రూనుండి చూస్తే భుజంపై గ్యాస్ బండ పెట్టుకుని కనిపించాడు గ్యాస్ వాడు.. డోర్ తీసి.. అక్కడపెట్టు అన్నట్టుగా సైగచేసి.. కిచెన్ చూపిస్తూ ఫోన్లోనే మాట్లాడుతూనేవుంది సుబ్బలక్ష్మి.
“ఎవరూ గ్యాస్ వాడా.. అవును గ్యాస్ ధరలు ఎంత మండిపోతున్నాయో.. మాకు నెలకోబండ అయిపోతుందొదినా.. “ అంది సుజాతా.
“మీకు నెలన్నా వస్తుంది మాకు పదిహేనురోజులకే అయిపోతుంది..” అంది సుబ్బలక్ష్మి. "హమ్మో.. అవునా..", అని ఆశ్చర్యపోయింది సుజాత.
కిచెన్లోకెళ్ళి గ్యాస్ బండ పైకిఎత్తిచూసి “మేడమ్.. ఈ బండకూడా నిండుగా వుంది.. మీకు కాదా మేడమ్ గ్యాస్?”, అన్నాడు గ్యాస్ పట్టుకొచ్చినబ్బాయి.
“అయ్యో నా మతి మండిపోనూ.. మాకు నిన్నే గ్యాసొచ్చింది బాబూ.., డోర్ నెంబరెంతా!, ఇరవైరొండా.. అయితే.. పక్కింటివాళ్ళకి”, అని నాలిక్కరుచుకుని గ్యాస్ అబ్బాయిని పంపించేసి డోర్ వేసేసి.. మరళా అదే విషయం ఫోన్లో చెప్పుకుని నవ్వుకున్నారిద్దరూ.
“వదినా వదినా.. మాకు ఇక్కడ కరెంటుపోయింది.. మీ ఇంట్లో టీ.వీలో అనుకుంటా... మావూరి వంట కార్యక్రమం పాటినిపిస్తుంది.. కాస్త ఫోను టీ.వీకి దగ్గరగా పెట్టవా.. ఆ పాటంటే నాకెంతో ఇష్టం..”, అంది సుజాత.
“అవునవును నాక్కూడా చాలా ఇష్టం.. నేనైతే అది రీకార్టుచేసుకుని మరీ.. నా సెల్ ఫోన్ రింగ్ టోన్లా కూడా పెట్టుకున్నాను తెలుసా”, అని గర్వంగా చెప్పింది సుబ్బలక్ష్మి.
టీ.వీ సౌండు పెంచి సెల్ఫోన్ దగ్గరపెట్టి పాటవినింపించింది. ఆ పాటతో పాటు తనూ పాటందుకుని ఫోన్లో పాడసాగింది సుబ్బలక్ష్మి.
పాటయ్యాకా, మరళా కబుర్లు మొదలుపెట్టారు. “చిట్టెమ్మ పాట, తూరుపు వెళ్లే రైలు పాట, రక్తసంభంధం.. ఇంకా చాలా పాటలు రికార్డు చేసాను.. అవన్నీ ఒక్కొక్కరికి రింగ్ టోన్ గా పెట్టాను.., మావూరి వంటపాట తప్ప నీకేదిస్టమో చెప్పు మరి.. నీ నెంబరుకు ఆ రింగ్ టోన్ పెట్టుకుంటా.., ఆపాట ఆల్రెడీ మా అమ్మాయి నెంబరుకు పెట్టుకున్నా”. అంది సుబ్బలక్ష్మి.
మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది.. కాలక్షేపం కబుర్లుచెప్పుకోటానికొచ్చింది ఎదురింటావిడ. ఇదిగో సుజాతా.. “ఎదురింటక్కయ్యగారు వచ్చారు.. స్పీకర్ అన్ చేస్తున్నాను.. అవిడని పరిచయం చేస్తాను ఈ మధ్యే ఇక్కడ అద్దెకు దిగారు.., నాకు ఈ మధ్య రోజంతా కాలక్షేపం అవుతుంది అంటే అవిడ చలవే.. ప్రతిరోజు ఈ టైములో మేమిద్దరం టీ.వీ చూస్తూ మంచిచెడూ మాట్లాడుకుంటాం.”, అని ఫోన్ స్పీకర్ అన్ చేసి ముగ్గురూ కబుర్లలో పడ్డారు.
కాసేపయ్యాకా ఫోను ఎదురింటావికి వదిలేసి.. ఇంట్లో పనులు చూసుకోవటం మొదలుపెట్టింది సుబ్బలక్ష్మి. ఎదురింటావిడా.. సుజాతా మళ్ళీ సీరియల్స్ గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు.
పనిచేసుకుంటూనే.. మధ్య మధ్యలో పరుగెత్తుకువచ్చి వాళ్ళతో మాటలు కలుపుతూవుంది సుబ్బలక్ష్మి.
అలా మాట్లాడుకుంటుండగా.. ఏదో గుర్తొచ్చినట్టుగా “పిల్లలు స్కూలుకెలిపోయారా.. మరదలా. మీ బుజ్చిగాడు ఎలా చదువుతున్నాడే.. చాలా కాలమైంది వాళ్ళను చూసి.. ఓసారి అంతా హైద్రాబాదు రాకూడదేంటే..”, అని అడిగింది సుబ్బలక్ష్మి సుజాతని.
“హైద్రాబాదా.. ఎందుకు అక్కడెవరున్నారొదినా?, పిల్లలా.. ఎవరి పిల్లలు? సీరియల్లో ఎవరిపిల్లలు గురించన్నా అడుగుతున్నావా వదినా”, అని ఎదురప్రశ్నేసింది సుజాత.
“అందేంటే.. నీ పిల్లలు గురించే అడుగుతున్నా.., మేమున్నది హైద్రాబాద్ కదా, తెలియనట్టు అడుగుతావే.”, అంది సుబ్బలక్ష్మి.
“ఛా ఊరుకో వదినా.. నాకు పిల్లలెక్కడున్నారు.. వెటకారం చెయ్యటంలేదు కదా నన్నూ, హైద్రాబాదెప్పుడెల్లారు మీరు”, అంది సుజాత.
“అదేంటే నీకిద్దరు పిల్లలు కదా!, అమ్మాయి అబ్బాయీనూ.., వయసు దాచుకోటం కోసం అక్కయ్య దగ్గర అబద్దమాడుతున్నావా ఏంటి.. ”, అని నవ్వుతూ అడిగింది సుబ్బలక్ష్మి.
“అదేంటొదినా.. నువ్వలా అంటున్నావు. ఇంతకూ మీరు మా విజయవాడలో వుంటున్న సుబ్బలక్ష్మొదినేనా.. నేను గుంటూరు సుజాతని”, అంది సుజాత.
“హా.. మాది హైద్రాబాదమ్మా విజయవాడ కాదు.., నా మాటైనా గుర్తుపట్టలేదామ్మా, మాకూ సుజాత అని మరదలుంది.. అందుకే అదే ఫోనుచేసిందేమో అనుకున్నా నీ మాట అచ్చు మా సుజాతలానే వుంది ఇప్పుడు కూడా”, అంది సుబ్బలక్ష్మి.
“అవునా.. నాకు అదే డౌటొచ్చి మిమ్మల్నడిగితే.. జలుబు చేసింది నాకు అన్నారు కదా.., నిజమే అలాగే అయ్యింటుంది అనుకున్నానండి.. సారీ అండీ రాంగ్ నెంబరు”, అంది సుజాత.
“ఇంతసేపు మాట్లాడుకున్నా అనుమానమే రాలేదమ్మా.. అవునమ్మా రాంగ్ నెంబరు.. ఏమీ అనుకోవద్దు.. ఏమీ అనుకోకమ్మా..”, అని నవ్వుతూ నాలుగు సార్లు చెప్పింది సుబ్బలక్ష్మి.
ఫోన్ కట్ చేసిన తరువాత, ఇదేంటో ఇలా కన్ఫూజైపోయామిద్దరమూ, ఇంతసేపు మాట్లాడుకున్నా తెలియనేలేదే.., అని ఎదురింటావిడా సుబ్బలక్ష్మి పగలబడి నవ్వుకున్నారు.
చార్జింగ్ పెడదామని తీసిన ఫోన్లో.. భర్త ఫోన్ నుండి ముఫ్ఫైరొండు మిస్డ్ కాల్స్, వేరే నెంబరు నుండి పది మిస్ట్ కాల్స్ ని చూసి ఆశ్ఛర్యపోయింది సుబ్బలక్ష్మి.. అయ్యో.. ఈయనెప్పుడు చేసారు.. అసలు కాల్ వెయిటింగ్ బీప్ సౌండే వినపడలేదు.. ఇప్పుడు వెంటనే ఫోన్ చెయ్యకపోతే చంపేస్తారు.. అని భర్తకు ఫోన్ చేస్తుంది సుబ్బలక్ష్మి.. వాళ్ళాయన తిట్లెక్కడవినాలో అని.. నేను మళ్ళీవస్తానక్కయ్యగారు అంటూ ఎదురింటావిడి ఇదే అదనుగా పారిపోయింది.
భర్తకు ఫోన్చేసిన సుబ్బలక్ష్మి.. నెమ్మదిగా.. “ఏవండీ ఫోన్ చేసారా.. నేను సుజాతతో మాట్లాడుతున్నాను.. మీ కాల్స్ చూడలేదు”, అని కవర్ చేసింది.
“ఫోన్ చెయ్యటమా ఎమన్నానా.. ఒక గంటసేపు అలా ఫోనుపట్టుకుని ట్రై చేస్తూ నీ ఎంగేజ్ సౌండు విని చెవులు నొప్పుపుడుతున్నాయి.. అసలు నువ్వీలోకంలో వుంటేకదా.. , నాకొక ఎకౌంట్ నెంబరు కావల్సొచ్చింది అందుకే అంతలా ట్రై చేసాను.., ఇప్పుడవసరంలేదులే.. దొరికింది. నువ్వు మాట్లాడింది సుజాతతోనా.. మరి ఆ సుజాతేమో నా నెంబరుకుచేసి.. తనఫోన్ నెంబరు మారింది, అది చెబుదామంటే వదిన ఫోన్ బిజీ అని వస్తుంది.. అని చెప్పిందేంటీ.., నాకు తెలుసు నువ్వు ఎవరితోనో సోదేస్తూ వుండుంటావ్.. సుజాతతో అని అబద్దంచెబుతున్నావ్.. నీ కసలు సెల్ఫోన్లో ఎవరన్నా దొరికితే లోకమే తెలియదు కదా!!......”, అని సీరియస్ గా వున్న భర్త తిట్ల పురాణం మొదలుపెట్టేసరికి భయపడి ఫోన్ పెట్టేసి సోఫాలో కూలబడింది సుబ్బలక్ష్మి.
కాసేపటికి తేరుకున్నాకా.. "ఏమీ అనుకోకే.. అప్పుడప్పుడూ ఫోన్ చేస్తుండు.. - ఇట్లు మీ సుబ్బలక్ష్మి వదిన", అని ఒక ఎసెమ్మెస్.. రాంగ్ నెంబరు సుజాతకి పంపించింది సుబ్బలక్ష్మి
. ****
-----------------
రచన: శ్రీనివాసరాజు ఇందుకూరి
కాన్సెప్టు: సుధ ఇందుకూరి (నా భార్య) ది