23, అక్టోబర్ 2010, శనివారం

ఓ మధుర జ్ఞాపకం..

ఆ చిన్న పడవలో గోదారమ్మ గుండెలపై తేలుతూ వెళుతుండగా... నువ్వు నా గుండెలపై తలవాల్చి చేసిన బాసలు గుర్తున్నాయా?. మన ప్రేమ  ఎప్పటికీ ఇలానే వుండిపోవాలని.. నీలో నేను ఒదిగిపోవాలని.. చెప్పుకున్న మాటలు నీకు ఇప్పుడిప్పుడే గుర్తొస్తున్నాయి కదూ!  ఆ కోకిలమ్మతో పాటు గొంతుకట్టి మనిద్దరం పాడుకున్న పాటలు నీ మనసులో వినపడుతున్నాయా? ఏది నీ గుండెలపై చెవిఆన్చి నన్ను కూడా విననివ్వు మరి!.

తెలతెలవారినా.. మంచు పరదా కప్పుకుని... మునగలాక్కుని పడుకున్న ఈ గోదావరి..,  చలిపొద్దుకు లేవకుండా.. ఒళ్ళువిరుకుంటూ బద్దకం తీర్చుకుంటున్నట్టుగావుండే ఈ  గోదావరి..., ఆహా!.. ఎంతఅందమో కదా!. పొద్దున్నే నేనులేవగానే నా కళ్ళెదుటకొచ్చి.... లేవండి బారెడు పొద్దెక్కింది.. అని చిన్న చిరునవ్వుతో నన్ను పలకరిస్తావే.. దానికన్నా అందమా ఇదీ!, అలా అంటే చిరునవ్వునవ్వేస్తావుగానీ..  ఈ కోనసీమ అందాలన్నీ నింపుకున్న నీ వన్నెలతో పోల్చుకుంటే.. ఈ అందాలేపాటివిలే!. అమ్మో.. అలా సిగ్గుతో ముడుచుకుపోకూ.. మెళికలు తిరిపోకే..  ఆ తెరచాపలా గాలిలో తేలిపోకే..., ఇదంతా నా పైత్యం అని తీసిపారేయకు మరి. ఏ మాటకామాటే చెప్పుకోవాలి కదా!. నిజమే.. ఇవి పొగడ్తలు కాదురా బంగారం. స్వచ్ఛమైన నిజాలురా.

అదినేను మొదటిసారి గోదావరి మీద అలలతో పాటుతేలటం... లాంచిలో ప్రయాణం..., నాకు కొత్తా..,  రివ్వుమంటూ వీస్తున్న గాలి కొంటెగా కవ్విస్తున్నట్టు అనిపించింది. అందుకేనేమో భయమేవేయలేదు..  చాలా సరదాగావుంది.., మా దూరపుచుట్టం పెళ్ళికని వచ్చాం.. నేను పెళ్ళికొడుకు తరపు. చుట్టూ కొబ్బరిచెట్లతో ముసుగేసేసిన పేద్ధ.. పెంకుటి లోగిలి..అందులోనే మాకు విడిది. పెళ్ళిహడావుడి చూస్తూ.. మేమంతా ఆ ఇంటిచుట్టూ కలతిరుగుతుంటే పక్కింట్లో మల్లెపూలు కోస్తూ నువ్వు కనిపించావు.. నావైపు చూస్తావేమోనని ఎంత సేపు వేచిచూసినా నీ పనినీదేగానీ పట్టించుకోవే. ఎవరన్నా చూస్తే బాగోదేమోనని నేను వెళ్ళిపోయాను. తరువాత పందిట్లో పన్నీరు చల్లటానికి నువ్చొచ్చినప్పుడు నీవొంక కాస్త కొంటెగా చూసి..,ఇందాక అంతలా చూస్తుంటే  నన్ను పట్టించుకోలేదే అన్నట్టు చూసాను గుర్తుందా.., తరువాత అదే పెళ్ళిలో ఆ కొబ్బరాకు పందిర్లలో మనం  చూపులతో దోబూచులాడుకున్నాం గుర్తుందా.., నీకు గుర్తున్నాయో లేదోగానీ.. నువ్వుకోస్తున్న ఆ మల్లెపూల సుగంధం.. నువ్వు చల్లిన ఆ పన్నీటి సుగంధం నాకింకా గుర్తున్నాయి.. నాకివన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయెందుకో.

అది జరిగి సంవత్సరం తిరక్కుండానే అలాంటి పందిరిలోనే మనిద్దరికీ పెళ్ళయ్యింది కదా!... అప్పుడేమనిపించింది నీకు?, నాకైతే.. నిన్ను పెళ్ళిలో కలిసిన ఆరోజే.. ఆ దేవుడు మనిద్దరికీ ముడివేసేసాడని అనిపించింది. మనం పొలం గట్లలో... గోదారొడ్డున.. చింతతోపుకాడా.. దొంగచాటుగా కలుస్తుండటం చూసి జాలేసిందో ఏమో పాపం.. గోదారి ఇసకల్లో మనం సరదాగా కట్టుకున్న బొమ్మరిల్లులాంటి ఇంటిలో మనిద్దరినీ గెంటి.., ఇలా అచ్చంగా వెయ్యేళ్ళు... ఒకరి గుండెగూటిలోగిళ్ళలో ఒకరు సవ్వడులుచేసుకోండని.. ఇద్దరికీ బ్రహ్మముడివేసాడనిపిస్తుంటుంది నాకు.

కానీ ఆరోజులు ఇంకా నాకు గుర్తున్నాయి... వెచ్చంగా నీ ఒళ్ళో తలపెట్టుకుని.. ఊరిచివర తమలపాకుతోటల్లో.. ఘాటుఘాటుగా.., చల్లంగా ఎన్నెల్లో.. అరటిచెట్టు నీడల్లో కూర్చుని.. మాటుమాటుగా.. మనం పెట్టుకున్న ముద్దులు..!!, ముద్దులతో వేసుకున్న ముద్దర్లు..., అవి చూసి సిగ్గుతో తలవొంచుకుని నవ్వుకున్న బంతిపూలు..., ఆగుట్టంతా గుండెల్లో దాచుకుని నిద్రలేని రాత్రులు. నాకింకా గుర్తున్నాయి.
నాకివన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయెందుకో.

పెళ్ళయిన కొత్తలో ఒకసారీ.... నీ పుట్టినరోజుకనీ.. ఒకసారి మీ ఊరెళ్ళాం గుర్తుందా!, అప్పుడు మళ్ళీ మనం తిరిగిన చోట్లన్నీ దొంగచాటుగా తిరిగేవాళ్ళం... చెఱుకుతోటల్లో పరుగుపందేలేసుకునేవాళ్ళం. పిల్లకాలవ పక్కన జామచెట్టుకు పట్టిన పట్టుతేనే తీసి నీకు పుట్టినరోజుకానుకగా ఇచ్చాను.. నువ్వు ఆ తేనె రుచిచూసి ఆనందంతో పొంగిపోయావు.. మీ మనసంత తీయగావుంది అని బిగికౌగిలికానుక తిరిగిచ్చావు గుర్తుందా. అలా పొలాంలెంబడీ.. పుట్టలెంబడీ తిరిగి తిరిగి అలసిపోయి సందెపొద్దేల కాళ్ళీడ్చుకుంటూ ఇంటికొచ్చి.. మీ ఇంటి పెరట్లోవున్న గున్నమావిచెట్టుకింద చాపలేసుకుని కుర్చుని కబుర్లుచెప్పకునేవారం గుర్తుందా. అలా కబుర్లలో పడి ఈ లోకాన్నే మర్చిపోయేవాళ్ళం.. తలుచుకున్నా చాలు.. అబ్బా!!.. ఆ రోజులు ఎంత బాగుంటాయో.

-------------------------
ఇది నేను రాసుకున్న ఒక పాటకు బ్లాగ్ రూపం :-)

21 కామెంట్‌లు:

కౌటిల్య చెప్పారు...

హ్మ్...మీరు సూపరుగా!చెప్పీ చెప్పనట్టు మీలో రొమాంటిక్ యాంగిల్ ని భలే చెప్పారుగా....నేను ఈ పోస్ట్ దాచిపెట్టి, రేపు మీ బుడ్డోడికి చూపిస్తానుండండి..."చూడరా నాయనా! మీ నాన్న ఎంత రొమాంటిక్కో, అరేంజ్డ్ మ్యారేజీ చేసుకున్నందుకు ఇలాంటి రొమాంటిక్ టపాలు రాసి తుత్తి తీర్చుకుంటున్నారు...నువ్వన్నా మీనాన్న కలల్ని నిజంచెయ్" అని......ః)))...

"పిల్లకాలవ పక్కన జామచెట్టుకు పట్టిన పట్టుతేనే తీసి నీకు పుట్టినరోజుకానుకగా ఇచ్చాను.. నువ్వు ఆ తేనె రుచిచూసి ఆనందంతో పొంగిపోయావు..">
ఆ ఈగలు కుట్టి పక్కనున్న కాలవలో పడుంటే తెలిసేది, ఎంత తీపో ఆ నొప్పులు అని.....ః)))

హిహిహి..సరదాకి...కాని సూపర్ NARRATION.....

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఎంత అందమైన లేఖ!
చాలా బాగుంది. చాలా చాలా బాగుంది.

శ్రీనివాసరాజు చెప్పారు...

@కౌటిల్యగారు
రొమాంటిక్ ఏంగిల్ లేని వాడు ఎవడుంటాడు చెప్పండి!!
మీరు భలేవారే.. నాది అరేంజ్డ్ మ్యారేజ్ అని ఎవరు చెప్పారు? ఇది అక్షరాలా నాస్టోరీ అయితేనూ.. అయితే మీకు చాలా తక్కువ తెలుసన్నమాట నా గురించి.
మా బుడ్డోడికి మీరు ఏ టపాలు చూపించనవసరం లేదు.. వాడిది కూడా అరేంజ్డ్ కాదుగా.

నేను ఎక్కగలిగానుగా.. ఏ కాలవలోను పడకుండా..
"జామచెట్టెక్కలేవు.. పట్టుతేనె తెంపలేవు.. ఓ మల్లీ.. ఓ మల్లీ.." త్వరగా జామచెట్టెక్కటం నేర్చుకోండి ఆ తర్వాతే పెళ్ళిమరి :-)


@మందాకిని గారు
టపా నచ్చినందుకు సంతోషం. ధన్యవాదములు.

..nagarjuna.. చెప్పారు...

నాదికూడా మందాకిని గారి మాటే...మెచ్చుకోవడానికి మాటలు రావట్లేదుమరి...

కౌటిల్య చెప్పారు...

ఆయ్...ఆయ్...నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా..నాకు అరేంజ్డ్ అన్చెప్పి...వాఆఆ..వాఆఆఅ.ఐది అన్యాయం....ఏంటి బుడ్డాడికి దగ్గిరుండి లవ్వు మారేజీ చేస్తారా ఏంటి?...

ఏంటి, జాంచెట్టెక్కడం క్వాలిఫికేశనైతే, అందులో చిన్నప్పుడే డిగ్రీ పుచ్చేసుకున్నా నేను...కాని, పెళ్ళే మరి..ఎప్పుడవ్వుద్దో...అన్నలకి తమ్ముళ్ళుగా పుట్టకూడదండీ....పుడితే ఇంతే! అన్నిటికీ వాడిదయ్యిందాకా ఆగాల్సిందే!!ః(

హరే కృష్ణ చెప్పారు...

too good!
చాలా చాలా బాగుంది

మంచు చెప్పారు...

అహా.... చూసిన సంవత్సరం తిరక్కుండానే ఇంటికి తెచ్చేసుకున్నారా.. మాకయితే మీరు చాలా ఫాస్ట్ అనిపిస్తుంది :-)

( మనలొ మనమాట ...ఇలాంటి ఉత్తరాలు రాసే ఇంప్రెస్స్ చేసేసారా?)

అజ్ఞాత చెప్పారు...

ఆర్య,
సందర్భము లేని వాఖ్యను ప్రచురిస్తున్నందుకు క్షమించగలరు.ఈ తెలుగు బ్లాగు లోకములో మేము కూడా ఒక చర్చా వేదికను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని రాజకీయాలు ఉన్నాయో,తెలుగు బ్లాగు లోకములో కూడా అన్ని రాజకీయాలు ఉన్నాయని మేము భావిస్తున్నాము.మీరు ఎప్పుడన్నా ఈ తెలుగు బ్లాగు లోకములో చర్చా వేదిక కావాలంటే మా బ్లాగు ఉపయోగించుకోవచ్చు. మా దగ్గర స్వేచ్చ బాగా ఎక్కువ. మేము చాలా లిబరల్.మీరు ఎప్పుడన్నా,ఎవడితో అయినా కెలుకుడు(వాదన) మొదలు పెట్టాలి అనుకుంటే మా బ్లాగుని ఉపయోగించుకోగలరు. మేము కావాల్సిన ఫ్యూయల్ అందించగలము.
మా బ్లాగు http://appi-boppi.blogspot.com/

ఇట్లు,
సదా మీ సేవలో, మీ
అప్పి-బొప్పి

ఇందు చెప్పారు...

చాలా బాగుందండీ....గోదావరి అందాలని...మీ మనసులో భావాలని కలగలిపి అందమైన టపా వ్రాసారుగా!!

3g చెప్పారు...

ఏం రాసారండి...... నేనిప్పుడేం రాయాలోకూడా తెలియట్లేదు. సూపరంతే.

శ్రీనివాసరాజు చెప్పారు...

@నాగార్జున గారు
మెచ్చుకోలు మాటలక్కరలేదండీ.. మీరానందించి ఇచ్చిన కామెంటు చాలు. ధన్యవాదములు :)

@కౌటిల్యగారు

అరేంజ్డ్ అని మీరే డిసైడ్ చేసేసుకుంటున్నారు.. ఇక మేమేం సాయం చెయ్యగలం చెప్పండి. అరేంజ్డ్ కాకపోతే.. అన్నలతో సంబంధమేలేకుండా ఎగిరిపోయైనా చేసుకోవచ్చు.. ట్రై చెయ్యండి మరి.
జామచెట్టు ఎక్కటంలో డిగ్రీవుండటం సరిపోదండీ.. పట్టుతేనె వున్న చెట్లెక్కాలి.. అది కొయ్యాలి. :-)

@హరేకృష్ణ గారు
టపా నచ్చినందుకు సంతోషం. కామెంటుకు ధన్యవాదములు

@మంచుగారు
ఇది నా కధ కాదండీ.. నేనంత ఫాస్టూ కాదు. నాదీ అరేంజ్డె.. కౌటిల్యకి చిన్న జర్క్ ఇవ్వటానికి అలా చెప్పానంతే. ;-)

@వేణూశ్రీకాంత్ గారు
నచ్చినందుకు సంతోషం.

@ఇందు గారు
గోదారి అందాలు అలాంటివి.. ఎలా వర్ణించినా అందమే :-)

@3g గారు
నచ్చినందుకు సంతోషం. :-)

కౌటిల్య చెప్పారు...

ఐ,ఐ,అహహై...నేనే రైటు...రాజుగారిది అరేంజ్డ్ మ్యారేజేనోచ్..ః))...హన్నా! నాకు భలే జర్క్ ఇచ్చారుగా!

హ్మ్...అరేంజ్డ్ అని నేను డిసైడు చేసుకోలా! నా చిన్నప్పుడే మా పితృదేవులు డిసైడు చేసేశారు...ఎంతైనా నేను తండ్రిమాట జవదాటని శ్రీరామచంద్రుణ్ణి కదా!ః)))..మీరిలా సాయం చేస్తారని తెలిస్తే మా నాన్నగార్ని కూడా ఏదోలా ఒప్పించేవాణ్ణి..కాని ఇప్పుడు చేద్దాం అంటే, ఆ వయసై పోయింది..ః(

చెట్లెక్కటంలోనే కాదండీ..ఒక్క ఈగ కుట్టకుండా తేనె కొట్టుకురావడంలో కూడా మాకు డిగ్రీ ఉందండోయ్...ః)))

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా చాలా బాగుంది.

రాధిక(నాని ) చెప్పారు...

చాలా బాగుందండి.మీ పాట కుడా రాయాల్సింది.

రాధిక(నాని ) చెప్పారు...

చాలా బాగుందండి.మీ పాట కుడా రాయాల్సింది.

శ్రీనివాసరాజు చెప్పారు...

@చెప్పాలంటే.. గారు
చెప్పాలంటే.. అని టెన్సన్లో పెట్టినట్టుఅని బాగుంది అని చెప్పారు. ధన్యవాదములు. :-)

@రాధిక(నాని) గారు
పాటకూడా ఇక్కడ రాసే వాడినే.. కానీ అది వేరెవరికైనా చూపించటానికి రాసింది కదా.. ఎక్కడా పబ్లిష్ అవకూడదని ఇక్కడ ఇవ్వలేదు. సమయమొచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ రాస్తాను.
మీ కామెంటుకు ధన్యవాదములు. :-)

శివరంజని చెప్పారు...

చాలా చాలా బాగుంది.

మనసు పలికే చెప్పారు...

చాలా చాలా బాగుందండీ.. మంచి భావుకత్వం నిండిన టపా.. :)

swathi చెప్పారు...

Wow! of recent I haven't read a story in Telugu literature as romantic as this.

Very well written

శ్రీనివాసరాజు చెప్పారు...

@శివరంజని గారు, @మనసు పలికే గారు
టపా నచ్చినందకు సంతోషం. కామెంటుకు ధన్యవాదములు. :-)

@స్వాతిగారు
అమ్మో.. అయితే రోమాంటిక్ పాల్లు చాలా ఎక్కువయ్యాయన్నమాట!! జనాలు సిగ్గుపడి పారిపోవటంలేదు కదా!!
మీ కామెంటుకు ధన్యవాదములు. :-)

Unknown చెప్పారు...

Ninnane ee lyric ki tune compose chesa..chaala baagundi ani appude anipinchindi...inka koncham develop chesina tarvatha meeku pamputha..

Related Posts Plugin for WordPress, Blogger...