4, సెప్టెంబర్ 2010, శనివారం

గోపాల్రాజు గేదెల బేరం...
















సాయంత్రం ఏల.. ఎర్రసెందనం రంగులో నిగనిగలాడిపోతున్న సూరీడు.. ఈ రోజుకు ఇక సెలవన్నట్టు.. టాటా సెబుతా దూరంగా వున్న కొబ్బరిసెట్ల ముసుగులోకి దూరిపోతున్నాడు.. పక్కూళ్ళో వున్న స్పిన్నింగు మిల్లులో సాయత్రం షిప్టులు మారటం కోసం ఏసే సైరెన్ కూతకూడా ఇనబడిపోయింది.., పాలేరు పాపారావు.. మైనంపాటోల్ల పాకలకాన్నిండి తీసిన పాలు క్యాను సైకిలుకట్టుకుని ఎల్తున్నాడు.. 

ఈటిల్లో ఏదన్నా ఒక్కసెనం అటుఇటు అవుతాయేమోగానీ.. సూరయ్యతాత బ్యాచ్ మాత్రం రాయిసెట్టుకిందున్న నాపరాయిబల్లపై టంచనుగా టైముకొచ్చి కూచోటం మాత్రం ఒక్క సెనం కూడా లేటవ్వదు. సూరయ్యతాత... కొత్తోళ్ళ అప్పారావు... మిలట్రీ రంగారావుగారు ముగ్గురూ తలపండిపోయిన పెద్దోళ్ళు... సాయంత్రం అవగానే రాయిసెట్టుకింద పిచ్చాపాటీ మాటలకోసం భోజనాలు కానిచ్చేసి... కొబ్బరీనుపుల్లతో పళ్ళుకుట్టుకుంటా వచ్చేత్తుంటారు.. దారేబోయేవోళ్ళని ప్రశ్నలడిగి బుర్రల్దినేత్తుంటారు. 

ఎవడూ దొరక్కపోతే జాడీ ఆటా.. పులీమేకా ఆడుకుంటా కాలచ్చేపం చేసేత్తుంటారు. ఈళ్ళ నోట్లో నానని ఇషయం అంటూ ఏదీ వుండదు.. పెపంచలోవున్న పెతీదీ ఈళ్ళమాటల్లో టాపిక్కే. సీకటి పడ్డంతో ఎవడో కుర్రోడ్ని కేకేసి.. ఈదిలైట్లేయించేడు సూరయ్యతాత. ఆ ఈది లైట్లకాంతిలో నాపరాయిపై... రుబ్బురోలుకు గంట్లుకొట్టేవోడితో... స్టాండర్డుగా గీయించిన జాడి ఆట గళ్ళలో రాళ్ళు సర్దుతావున్నాడు కొత్తోళ్ళ అప్పారావు. 

"ఒరే.. సూరిగా..., గోపాల్రాజు కనిపించేడేంట్రా ఈ రోజా.. రేపాడు ఏల్పూరు సంతలో గేదిని కొంటాడంటా.. నిన్నో టముకేత్తా అందరికీ సెప్పేత్తున్నాడ్రా", అని మిలట్రీ రంగారావుగారు సూరయ్యతాత్తో అన్నాడు. "ఆడేం మేపగలడండే... అయితేగియితే.. పాలెర్నెట్టి మేపిత్తాడేమోనండే.. ", అన్నాడు సూరయ్యతాత. "అదేమాట ఎవడోఅంటే.. పాలేర్నెట్టి మేపింతేనే గేదిని కొనాలా.. అని అరువు దెబ్బలాటెట్టేత్తున్నాడురోయ్.. అది సూసేవుగాదు..., ఆడే మేపుతాడంటా..., అదే కదా మరి అసలు ఇషయం.., బడాయి సెప్పినంత సులువనుకుంటున్నాడు... ఈ గెది దెబ్బతో ఆడి బడాయంతా వదిలిపోవాల్రా...", అని మిలట్రీ రంగారావు కాళ్ళు నాపరాయిబల్లపై సర్దుకుని బాసమటమేత్తా అన్నాడు. 

"హ హ్హ హ్హా.. నిజమేనండే.." అని అంతా పగలబడి నవ్వుకున్నారు.

ఈళ్ళ పిచ్చాపాటీమాటల్లో ఈరోజు మొదట గోపాల్రాజు టాపిక్కు వచ్చిందంటేనే.. గోపాల్రాజు సిన్నా సితకా మనిషిగాదని అర్దమవుతాది.. గోపాల్రాజుగురించి సెప్పుకుంటూ పోతే చానా వుంది.. అందరూ అతను సెప్పే బడాయి కబుర్లు ఇనీ ఇనీ అతనికి.. బడాయి గోపాల్రాజని పేరేట్టేరు. , గోపాల్రాజు ఆవూళ్ళో నాలుగెకరాలున్న ఓ చిన్న రైతు. అందర్లాగాకండా కాస్త ఏసకట్టం మనిషి.. ఏదైనా సరే నేనే సెయ్యగలను.. నేను సేసినట్టు ఎవడూ సెయ్యలేడని సెప్పుకుంటా.. నలుగుర్లో తనకో డిఫరెంట్ స్టైలుండాలని తాపత్రయపడేమడిషి . ఆ తాపత్రయమే తప్ప.. ఎప్పుడూ ఎక్కడోసోట డక్కాముక్కీలు తింటా అందరిముందు నవ్వులపాలవుతుంటాడు గోపాల్రాజు. 

ఓ సిన్న ఉదాహరణ సెబితే గోపాల్రాజు గురించి అర్ధమయిపోద్ది.., ఓ ఏడు..  అందరూ వరి పంటల్లో ఏ ఇత్తనం ఏద్దామాని ఆలోచిత్తున్న సమయంలో... గోపాల్రాజు తన నాలుగెకరాల్లోనూ.. బోబ్బాసి తోటలేసేడు.., అది సూసి వూళ్ళో నవ్వనోడంటేలేడు.. పెతీ ఒక్కడూ ఇంటికెళ్ళిమరీ ఎటకారంచేసి ఏడిపించేరు గోపాల్రాజుని.. కానీ ఆ మనిషెక్కడా తొనక్క బెనక్క కూర్సున్నాడు. 

ఆ మొండి ధ్యైరమేంటో వూళ్ళో ఎవడికీ అర్ధంకాలేదు. బొబ్బాసి కాయలు పళ్ళెటూళ్ళో ఛీ అంటారుగానీ.. సిటీల్లో తులం పదారులెక్క కొనుక్కుపోతుంటారు..., ఆటికి హైద్రాబాదు.. బెంగుళూరు..లాంటి సిటీల్లో మాంచి డిమాండుందని తెల్సుకున్నాడు గోపాల్రాజు. అందుకే ఆ ఏడు పంటేసి ఎలాగైనా తనుసేసందే కరెస్టని వూరి జనాలకు చూపిద్దామనుకున్నాడు. అతననుకున్నట్టుగానే ఆ ఏడు కాయలిరక్కాసేసినియ్యి..., అంతే మనోడు.. గాళ్ళోకితేలిపోయి.. బాడాయిలు సెప్పటంమొదలెట్టేడు.., ఏడిపించినోళ్ళంతా అతని కనబడకుండా పారిపోయేరు.

అలా బడాయిలకుపోయి చివరాఖర్లో పప్పులో కాలేసేసేడు.., పంటదాకా వచ్చి కొనుక్కెళతానన్నోలకివ్వకుండా.. తానే సిటీకి పట్టుకెళ్ళి అమ్మేద్దాం అని పెద్ద ప్లానేసేసేడు.. తానే దగ్గరుండి.. అంతా లోడుసేయించుకుని.. హైద్రాబాదు.. పెయానం కట్టేడు.., అక్కడ అనుకున్న రేటులేదని.. ఒక వారంరోజులు నాన్చి నాన్చి.. అక్కడే గొడాముల్లో లాటు పెట్టించి.. కొన్నాళ్ళు రేటుకోసం చూసేడు..., అలా నాలుగురోజులుండేసరికి.. కాయలన్నీ ముగ్గిపోటంమొదలెట్టేయి.. ముగ్గినియ్యన్నీ సగంరేటుకే అమ్మేయాల్సొచ్చింది. అక్కడుండానికి ఖర్చులు..., గోడాములకి అద్దెలు కట్టగా.., ముందు వూళ్ళో వచ్చిన బేరానితో పోల్చుకుంటే.. సగానికి సగం లాసయిపోయేడు. 
దీన్ని బట్టే అర్దమవుద్ది గోపాల్రాజు ఎంత డిఫరెంటో.

డక్కా ముక్కీలు తినే గోపాల్రాజుకు నాలెడ్జీ లేదని తీసిపారేయక్కర్లేదు.. పెతిరోజూ పేపరుతిరగేసి అక్షరం పొల్లుపోకుండా.. హెడ్డింగు కాన్నించి.. ఆ రోజు తేదీ.. అది ఎక్కడ ప్రింటయ్యింది తో మొదలెట్టి.. అన్నీ సదివేత్తుంటాడు.. దాంతో రాజకీయ వార్తలు.. షేర్ మార్కెట్లు.. అంతర్జాతీయ వార్తలు కాన్నించి దేని గురించి  అడిగినా.. తనకు పూర్తిగా తెలీపోయినా.. సెప్పేత్తుంటాడు.

అలాంటి గోపాల్రాజుకి గెదిని కొని మేపాలని కోరికపుట్టింది.
ఓ మంగళవారం రోజు.. గోపాల్రాజు తన డబడబలాడే చేతక్ బండేసుకుని గేదెలసంతకు బయల్దేరేడు.., ఎక్కడకెళ్ళినాకూడా తోకలాగుండే సుబ్బరాజుని ఎంటేసుకెళ్ళటానికి..   పెద్దకాలవ పక్కన చింతచెట్లముసుగులోవున్న సుబ్బరాజుంటికెళ్ళి కేకేసేడు.. "అప్పుడే బోంచేసి ఆవకాయబద్ద బుగ్గనెట్టుకుని సప్పలిస్తా వచ్చిన సుబ్బరాజు.. "ఏంటి బావా ఏల్పూరా..నువ్వింకా రాలేదేంటాని రడీఅయ్యి సూత్తన్నాను.., సంతలో అయితే మనం మాట్లడలేం బావా.. తణుకులో  పాతొంతెన దగ్గరున్న దూళ్ళబేరగాడి దగ్గరకెళ్తే పనైపోతాది మరి.." అని.. ఎప్పుడూ సలహా సెప్పని సుబ్బరాజు గోపాల్రాజుకి.. సలహా సెప్పేడు.

"ఛెస్.. దూళ్ళబేరగాడికేంతెలుసురా... చేటపెయ్యిని చూపిత్తే... మాంచి సూడిమీదుంది.. పూటకి ఐదులీటర్లుపాలిత్తాది.. కొనెయ్యండంటాడు.., ఆడి కమీషన్ కోసం నోటికేదొత్తే అది సెప్పేత్తాడు.. ఆడ్నినమ్ముకుని.. గొడ్డుపోయిందాన్ని కొనుక్కురావాలా?, మనకామాత్రం తెల్వదేంట్రా..., తెలవకపోతే గెదినెందుకురా మేపటం..", అని గోపాల్రాజు సుబ్బరాజుమీద కస్సుమన్నాడు. "సరేలేబావా.. నువ్వేదంటే అదే.. ఎళ్దాం పదా..", అని సుబ్బరాజు మారుమాట్లాడకుండా గోపాల్రాజు చేతక్ బండెనకాలెక్కేసేడు.

"ఈ రోజెలాగైనా గేద్తోనే తిరిగిరావాల్రా.. అందుకే ఓ ఇరవైఏలు లెక్కట్టుకొత్తున్నాను.. నిన్నే ఎంకడు దగ్గర సీటు పాడేన్రా..", అంటా.. తణుకుపొలాల్నుండి ఏల్పూరుకెళ్ళే అడ్డరూట్లోకి చేతక్ బండిని దూకించేడు గోపాల్రాజు.

సుబ్బరాజు ఊరి బాగోతాలన్నీ పూసగుచ్చినట్టు ఒక్కొక్కటీ సెప్పటం మొదలెట్టేడు... రాత్రి రాయిసెట్టుకింద సూరయ్యతాత బ్యాచ్ ఏమనుకున్నదీ.. ఎలా ఎగతాళిసేసి నవ్వుకున్నదీ.. అంతా శివరాత్రి రోజు జాగారం సెయ్యటానికి ఈసీపీ అద్దెకట్టుకొచ్చి ఆక్కుండా క్యాసెట్టుల మార్సి మార్సి.., తెల్లారేదాకా నాలుగుసినిమాలేసినట్టు... ఎడ్వైడింగులతో సహా సెప్పేసేడు.., అదంతా ఇన్న గోపాల్రాజుకి మంటెత్తిపోయింది.. "మాంచి గేదెను కొనుక్కేళ్ళి ఆళ్ళ నోళ్ళుమూయిత్తాను సూడరా..", అని సుబ్బరాజుతోటి అంటా బండి స్పీడు పెంచేసేడు.. అలా మాటల్లో పడి.. ఏల్పూరు నడీద్దాకా వచ్చేసేరు.

"బావా సికెన్ పకోడి ఏత్తున్నట్టున్నాడు బావా... ఎళ్ళి ఓ దెబ్బేసొద్దామేంటీ", అని ఎనక్కూర్చున్నసుబ్బరాజు.. ముందుకు జరిగి గోపాల్రాజు సెవిలో వూదేడు. 

"ఒరే!, నేనొచ్చినప్పుడే కదరా.. పీకల్దాకా లాగించినట్టున్నావ్.., అవకాయబద్ద సప్పలిత్తా కనిపించేవూ.. అప్పుడే ఏం తింటావ్ రా నాయనా... నీది కడుపా మండపాక మడుగా...", అని సుబ్బరాజుని.. ఎటకారం చేసేడు గోపాల్రాజు. 

"లేదుబావా.. సికెన్ పకోడి వాసన గుమగుమలాడిపోతాంది..., మాంచి టెమ్టింగా వుంటేనూ.., సరేలే.. వత్తా వత్తా ఎల్దాంలే.. నువ్వు మకాంకాడికి పోనియ్యి..", అని మాటతిరగేసేడు సుబ్బరాజు.

గేదెల మకాం కాడికి సేరుకున్నాకా... బండి నిద్రగన్నేరు సెట్టు నీడలో స్టాండేసి.. పాకల్లో కట్టేసిన గేదెల్ని సూడ్డానికి బయల్దేరేరిద్దరూ... 

ఒంటినిండా అముదం రాసేయటంవొళ్ళ నల్లగా.. నిగనిగలాడిపోతావున్నాయి మాంచి రింగులు తిరిగిన సూడి గేదె పెయ్యిలు... ఒక్కొక్కదాన్ని పరీక్షగా సూత్తా.. చేత్తో ఒక్కసారి ఒంటిమీద రాత్తా అప్పుడప్పుడూ ఆ సేయి గోపాల్రాజుకు సూపిత్తున్నాడు సుబ్బరాజు.  గేది సుట్టూ ఓ సారి రౌండేసి... తోకెత్తి సూసి.., కాలి గిట్టమీద మొటికేసి.. తలమీదున్న కొమ్ముల్ని పరీక్షగా సూసి..  అబ్బే అంటా పెదవిరుత్తుం.. మళ్ళా ఏరే గేద్దగ్గిరికెళ్ళటం.. ఇలా మొత్తం ఆ పాకలోవున్న గేదెలన్నిటినీ పరీక్షించేసేరిద్దరూ. 

ఆ పక్క పాకదగ్గర ఈగళ్ళా ముసిరేత్తున్న జనాల్ని చూసి.. "అక్కడేదో వుందిరా.. పదా..", అంటా.. జనాల్ని తోసుకుంటా ఎగిరెగిరి సూసేరిద్దరూ. నల్లగా నిగనిగలాడపోతా సిన్న సైజు ఎనుగంతున్న గేదిని సూసి ఆశ్చర్యపోయేరు.. "భలేగుందిబావా.. ఆ పొదుగుసూడు.. కనీసం పూటకి పదిలీటర్లు తక్కువివ్వదు.., ముర్రాజాతి గేది బావా..", అన్నాడు గోపాల్రాజుతో నోరొదిలేసి గేదొంక సూత్తావున్న సుబ్బరాజు. 

ఇంతలో గోపాల్రాజు ఎనకే నిలబడి పంచె కట్టుకున్న పెద్దాయన.. "పదిహేడేల ఒక్కొందా.." అన్నాడు. "రామారావుగారి పాట.. పదిహేడేల ఒక్కొందా.. ఒక్కొందా.." అని నాలుగుసార్లు సెప్పిందే సెప్పేడు.. ఆ గేదిపక్కనే చిట్టుతాడు పట్టుకుని నిక్కరేసుకున్న పొట్టోడొకడు. అప్పుడర్ధమయ్యింది.. గేదిని ఏలంపాటేత్తున్నారని. 

గోపాల్రాజు.. గేదెను చూడగానే.. ఎంటనే కొనెయ్యాలనిపించింది.. ఇంకేమాలోచించకుండా.. "పందొమ్మిదేలు.." అన్నాడు. అంతా తలల్దిప్పేసి గేదెని చూడ్డం మానేసి.. గోపాల్రాజొంక చూడ్డమొదలెట్టేరు. "మీ పేరేంటండే..", అన్నాడు పాటేసే పొట్టోడు.. "గోపాల్రాజు..", అని సెప్పేడు సుబ్బరాజు. "గోపాల్రాజుగారి పాట.. పందొమ్మిదేలు.. పందొమ్మిదేలు..", అని మళ్ళా నాలుగుసార్లరిచేడు పొట్టోడు. "పందొమ్మిదేల ఐదొందలు...", అన్నాడో మరో తలపాగా సుట్టుకున్న పెద్దాయన.. అంతే జనాల్లో చాలా మంది డ్రాపయిపోయి.. గొనుక్కుంటా.. పాకలోంచి బయటకెళ్ళిపోయేరు. 

ఇరవ్యయ్యేలు అనేద్దామని నోటిదాకా వచ్చిన గోపాల్రాజుని భుజంమీదం సేయేసి ఆపేసేడు పక్కనే నిలబడున్న మీసాలాయన. "ఏండే.. మీకు గేదె కావాలంటే ఇంకా మంచిదుందండే.., నే సూపిత్తాను నచ్చితే కొనుక్కోండే.. దీనికనవసరంగా పెట్టకండే ఇది పద్దేమ్దేలకు మించి సేయదు.. మీరు ఎక్కువెట్టేసేరని మీమీదెక్కువెట్టేసేడు ఆ తలపాగాయన... మీరంత రేటుక్కొంటే లాసయిపోతారు.. తరువాత మీఇష్టం మరి", అని నవ్వుతా గోపాల్రాజొంక సూత్తా సెప్పేడు ఆ మీసాలాయన.. .

గోపాల్రాజు సుబ్బరాజు ఒకరిమొకాలొకరు సూసుకుంటా ఆలోచిత్తావున్నారు.. అలా ఆలోచిత్తావుండగానే.. గేది పదొమ్మిదేల ఐదొందలకి తలపాగా సుట్టుకున్న పెద్దాయన పేర పాటకొట్టేసేరు.

"సరేండే.. మరి ఆ గేదె సూపించండే మాకర్జంటుగా కావాలే..", అని అడిగేడు మీసాలాయన్ని సుబ్బరాజు.  "నా ఎనకే పదండే..." అంటా, పాకలవతలున్న కొబ్బరాకు దడిమద్దెనుండి బయటకుతీసుకెళ్ళి ఒక కుర్రోడి కి పరిచయంచేసేడు మీసాలాయన. 

" పక్కూర్నుండి తోలుకొత్తున్నారండే.. మూడింటికొత్తాదండే గేదె మరి.. అప్పుడుదాకా ఉండగలరండే మరీ..", అన్నాడా కుర్రోడు. 
గోపాల్రాజు సుబ్బరాజొంక ఓసారి చూసి.. "సరే మళ్ళొత్తాం నువ్విక్కడే వుంటావు కదా...", అనడిగి.. చేతక్ బండిదగ్గరకొచ్చి ఆలొచన్లో పడ్డారిద్దరూ.

"బావా.. దీనికన్నా మంచిదంటన్నాడు అదెలాగుంటాదో సూడుమరి.. మనూరేంటి.. మన పక్కూరోళ్ళుకూడా నోళ్ళొదిలేత్తారేమో.. ఇక్కడే ఏదన్నా తలెంటుకులతాడుకొనుక్కుపోదాం బావో.. లేకపోతే దిష్టికొట్టేత్తారంతా..", అన్నాడు పల్లికిలిత్తా సుబ్బరాజు. 

"మందు గేదిని రానియ్యరా.. అప్పుడే నువ్వు తాళ్ళుదాకా ఎల్లిపోతున్నావ్.., పదా.. నీకా సికెన్ పకోడి తినిపిత్తా", అని సుబ్బరాజుని.. బండిమీద నడీదేపు లాక్కుపోయాడు గోపాల్రాజు. 

సికెన్ పకోడి దుకాణం పక్కనే వైన్ షాపు కనబడేసరికి గోపాల్రాజుకు మనసులాగేసింది.. "ఒరే.. పదరా.. నీ సికెన్ తో పాటు ఇదుంటే ఇంకా బాగుంటాది.. పదో పెగ్గేసొద్దాం.. ఇంకా చానా టైముందిలే", అని సుబ్బరాజుని లోపలికి తీసుకుపోయేడు.

మూడింటిదాకా టైమ్ పాస్ చేసేసి.. పీకల్దాకా తాగి.. తినేసి వైన్ షాప్ నుండి బయటపడ్డారిద్దరూ.

పాకలకాడున్న కుర్రోడిని కలిసి ఇవరం అడిగేరు. "దార్లో వత్తా వత్తా నీళ్ళకని చెరువులో దింపేడంటండే గేదినే.. ఆ చెరువులోనే నిద్రోతుందంటండే.. ఇక్కడ దగ్గర్లోనేనండే ఓ కిలోమీటరుంటాదండే.. ఒత్తారేంటి ఎల్దాం", అన్నాడు కుర్రోడు. 

"సరే పదమ్మా ఎల్ధాం.." అన్నాడు గోపాల్రాజు తూలిపోతా బండితీత్తా
కుర్రోడు సైకిలు తీసుకుని తొక్కడం మొదలెట్టేడు గోపాల్రాజు చేతక్ పై కుర్రోడెనకాలే ఫాలో అయిపోయేడు.

"గేది నిద్రరోవటం ఏంటి బావా.., కొంపదీసి రాత్రి సెంకడ్ షో సినిమాగ్గానీ ఎళ్ళిందంటావా..?", అన్నాడు సుబ్బరాజు గోపాల్రాజు సెవిదగ్గరగా వచ్చి సైకిలు తొక్కుతున్న కుర్రోడికి ఇనపడకుండా.

"ఒరే.. నీకు బాగా మందెక్కువైపోయిందిరా..., సెకండ్ షోకెల్తేనే అంతలా  నిద్దరట్టేత్తాదేంట్రా.. ఏ మిడ్ నైట్ షో వో అయ్యింటాది రా..", అన్నాడు గోపాల్రాజు. 

అలా కొంతదూరం ఎళ్ళే సరికి ముందెళ్ళే కుర్రోడు మాయమైపోయేడు.. "ఒరే.. సుబ్బా.. మనముందు కుర్రోడేడ్రా..", అన్నాడు గోపాల్రాజు.

"అదే సూత్తున్నాను బావా.., ఇప్పుడుదాకా ముందేవున్నాడు.. సైకిలు కూడా కనబడటంలేదు.., ఏమైపోయేడంటావ్", అన్నాడు సుబ్బరాజు.

"సరేరా ఇక్కడాగుదాం.. ఆడే వత్తాడు..", అని నాలుగురోడ్ల మద్దెలో గుండ్రంగా కట్టిన సిమ్మెంటు దిమ్మ.. దానిపైన ఇనప గ్రిల్లు వున్నచోట కాళ్ళానుకుని బండాపేడు గోపాల్రాజు.
ఓ అయిదునిమిషాలాగాకా ఎనకనుండి కుర్రోడొచ్చి "ఏంటండే.. ఈ సర్కిలెంబడే మళ్ళా ఎనక్కి తిప్పేసేరు.. మీరింకా నా ఎనకాలే వత్తున్నారనుకుని ఎల్లిపోతున్నానండే, పదండే ఇటెల్లాలి మనం", అని బండి ఎనక్కి తిప్పించి సైకిలక్కేడు కుర్రోడు.

ఎనకాలే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు సుబ్బరాజు.. "ఏరా.. ఏంట్రానీలోనువ్వే నవ్వుకుంటున్నావ్", అన్నాడు గోపాల్రాజు.
"కుర్రోడు మందేసేసినట్టున్నాడు.. ఎటు తీసుకెల్తున్నాడో ఆడికే తెల్టంలేదు బావా", అని మళ్ళీ పుసుక్కున నవ్వేడు సుబ్బరాజు.

చెరువుదగ్గరకు చేరుకుని.. నీళ్ళల్లో తేలతావున్న గేదిని చూసి "బావా.. అదిరిపోయిందిది.. పొద్దున్న చూసిన దానికి బాబులాగుంది బావా..", అని బండాపకుండానే కిందకు దూకేసి బ్యాలన్స్ చేసుకుంటా నిలబడతా అన్నాడు సుబ్బరాజు.

బండిదిగిన గోపాల్రాజు చెరువుగట్టునున్న చెట్టుకింద కూర్చున్న ముగ్గురు.. గేది తాళూకోళ్ళతో బేరం మొదలెట్టేడు. ఏవూరు.. ఏంటి.., గేదెన్నాల్లు సూడిది.. లాంటి ఇవరాలన్నీ అడిగి.. ఓ అరగంట బుర్రతినేసి.. "ఇంతకీ ఎంతకిద్దామనుకుంటున్నారో..", అని అసలు ఇషయానికొచ్చేడు.

ముప్పై ఏలుకాన్నుండి మొదలెట్టి ఇరవై ఏడుదాకా నరుక్కొచ్చేడు బేరం.., ఒక్క ఎయ్యిరూపాయలు తగ్గటానికి అవతలోల్లు ససేమిరా అంటున్నారు.. అదిగాదు ఇదిగాదని ఏదో ఓ పెద్ద స్టోరి మొదలెట్టి సెప్పేత్తా.. మరందుకే తగ్గండే అంటా.. ఆళ్ళను మాట్లాడనివ్వటంలేదు గోపాల్రాజు. బుర్రకధలో తందానా అంటే తానే తందనానా.. అన్నట్టు.. మధ్యమధ్యలో ఎంటరవుతా ఉప్పందిత్తన్నాడు సుబ్బరాజు. 

ఆలా ఎంత బేరమాడినా ఇరవైఏడువేలకి ఒక్క పావలా కూడా తగ్గేదిలేదని చెప్పేసేరు గేదిగలోళ్ళు. "అబ్బే అంతైతే ఇవ్వలేమండే.. మీరు బాగా ఎక్కువసెప్పేత్తున్నారో.., ఆయనెవరో సెప్పటంతో ఇంతదూరమొచ్చి.. పొద్దున్న సంతలో మాంచి బంగారంలాంటి గేదినొదిలేసొచ్చాం.., మీరేమో అసలు తగ్గటంలేదో..", అని గోపాల్రాజు పదపోదాం అన్నట్టు సుబ్బరాజుకు సైగచేసేడు.

"సరేలేండి ఆఖరుమాట ఎంతిత్తారు చెప్పండే", అన్నాడు గేదిగలోళ్ళలో ఓ పెద్దాయన. "నేను ఇరవై ఐదివ్వగలనండే..", అంతకుమించి ఒక్కరూపాయి మీరి ఎక్కువసెప్పినా.. గేది నాకొద్దండే", అని కరాకండిగా సెప్పేసేడు గోపాల్రాజు.

"సరేలేండి లెక్కిచ్చేసి తీసేసుకోండే", అన్నాడు పెద్దాయన.. గోపాల్రాజు సుబ్బరాజుల మొహాలు ఆనందంతో ఎలిగిపోయాయి.

"ఓ ఐదేలు లెక్క తగ్గిందండే మరి.. రేపట్టుకొచ్చి ఇచ్చేత్తాను మీకు, కావాలంటే ఈ బ్రాస్లెట్టు పెట్టుకోండి మీ దగ్గర", అని.. చేతికున్న బ్రాస్లెట్టు తియ్యబోయేడు గోపాల్రాజు.
అబ్బబ్బే.. ఆ మాత్రం నమ్మకంలేకపోతే ఎలాగండే.. పర్లేదు పర్లేదు మీ ఎడ్రస్ అదీ సెప్పండే చాలు.. మీరు రేపట్టకొచ్చి ఇచ్చేయండి పర్లేదు", అని ఎడ్రస్ తీసుకుని ఇరవ్వయేలు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు పెద్దాయన.

"ఇదిగోనండే తాడు.. మువ్వలు.. పైకెక్కేకా గేదిక్కట్టండే.., ఓ అరగంటాగాకా అదే ఎక్కేత్తాదండే గట్టో.. మీరేం కంగారుపడకండే.., రోజూ ఇలా ఓ రొండుగంటలు నిద్రోటం అలవాటండే దానికే, అరగంట తర్వాత ఎక్కాపోతే కాత్త అదిలించండి చాలో", అని చెప్పి ఎల్లిపోయేరు గేదిగలోల్లు.

"అయితే అయిందిగానీ బావా.. మాంచి గేదిని పట్టేసేం.. మనూరోల్లకి తస్తాదియ్యా ఒక్కొక్కడు నోరుపడిపోద్ది.. రేపొక్కడు మాట్టాడడు చూడు.. గేదిని చూసి", అని గోపాల్రాజుని ఉబ్బేసేసేడు సుబ్బరాజు. అలా మాట్లాడుకుంటా గంట గడిచినా గేది కదులూమెదులూ లేదు.. "బావా అదిలించనా ఎళ్ళి", అన్నాడు సుబ్బరాజు.. "అదేవొత్తాదుండ్రా.. పాపం నిద్రోతుంది గదా", అని ఇంకో అరగంట గడిపేడు గోపాల్రాజు.. అయినా గేది కదులూమెదులూ లేకండా అలాగే వుంది. "ఈ సారి తలటుతిప్పేసిందిగానీ ఇంకా పైకెక్కలేదేంటి బావా", అన్నాడు సుబ్బరాజు.

ఎంతచూసినా గట్టెక్కకపోయేసరికి.. "పద బావా అదిలిద్దాం..", అని ప్యాంటు మడతెట్టి చెరువునీట్లో దిగేడు సుబ్బరాజు.. ఎనకే గోపాల్రాజు కూడా నీట్లోకి దిగేడు.. "హయ్ హయ్..", అని గేది పొట్టమీద గుద్దేడు సుబ్బరాజు. "ఒరే ఎధవా... సూడిదిరా.. పొట్టమీదకొట్టకో.. ఎనక్కొట్టు..", అని, ఎనక చేత్తో చిన్న చిన్న దెబ్బలేసేడు గోపాల్రాజు.

"బావా ఎంతకొట్టినా కదలటంలేదు.., పొట్టకిందచేయేసి ఓ పట్టట్టు.. ముందుకు గెంటుదాం.. నీట్లోనే కదా కదిలిపోద్ది.. అప్పుడు మెలుకొవత్తాదేమో.., దీంది మరీ మొద్దునిద్రలాగుందేంటి బావా..", అని ఇద్దరూ చెరోవేపు పొట్టకింద చేయేసి పట్టట్టేరు.

గోపాల్రాజు పట్టిన పెద్ద పట్టుకి.. గేది సుబ్బరాజేపుతిరగబడిపోయే తలనీట్లోకి ఎల్లిపోయి.. నాలుక్కాళ్ళు పైకొచ్చేసినియ్యి.

"అయ్యబాబోయ్ ఇది సచ్చిన గేది బావో..", అని పెద్దకేకేసేడు సుబ్బరాజు. ఆ కెక్కి ఇద్దరికీ మందుదిగిపోయి జరిగిందంతా అప్పుడర్ధమయ్యింది.

ఇదే వార్త ఈళ్ళకన్నా ముందర వూరెళ్ళిపోయి... రాయిసెట్టుకింద మీటింగెట్టిన సూరయ్యతాత బ్యాచ్ నోట్లో ఆడేసింది.

44 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

Too good.
నేనది చెరువులో సగం మునిగి ఉన్న బండరాయేమో ననుకున్నా

అజ్ఞాత చెప్పారు...

అర్జెంటు గా స్వాతి బలరాం గారికి పంపేయ్. ఈ మధ్యనే, వంశీ దిగువ గోదావరి కథలు పూర్తయ్యాయి.నీ సీరీస్ మొదలెడతారు. వ్రాసేది నెలకొకటైనా, అఛ్ఛోణీ లాటి కథలు వ్రాసేస్తావు బాబూ!
మరీ ప.గో.జి వాడివైపోయావు. లేకపోతేనా ఇంకా ఎన్నెన్నొ వ్రాసేవాడిని. పోన్లే మా ఇంటావిడ సపోర్టు తీసికుందుగాని....

తార చెప్పారు...

అబ్బో, చానా వున్నదే, నాకో రోజు పట్టుద్ది చదవటానికి

స్వామి ( కేశవ ) చెప్పారు...

గేదె బొమ్మ మాత్రం పిచ్చక్లారిటీ గా వుంది,


నల్ల గా నిగ నిగ లాడిపోతుంది

________________________________


"బావా ఎంతకొట్టినా కదలటంలేదు.., పొట్టకిందచేయేసి ఓ పట్టట్టు.. ముందుకు గెంటుదాం.. నీట్లోనే కదా కదిలిపోద్ది.. అప్పుడు మెలుకొవత్తాదేమో.., దీంది మరీ మొద్దునిద్రలాగుందేంటి బావా..", అని ఇద్దరూ చెరోవేపు పొట్టకింద చేయేసి పట్టట్టేరు.





-- అన్నా గేదె పైకి రావట్లేదంట, మనం కూడా ఓ సెయ్యేద్దామేటి ?

గోపాల రాజు గార్ని మా ఆలమూరు సంతకు పంపు, ఈ సారి నేను అమ్మి పెడతాలే !!

శ్రీనివాసరాజు చెప్పారు...

@కొత్తపాళీ గారు

మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
కధనచ్చినందుకు సంతోషం.

మరీ బండరాయంటే బాగోదనీ.. :-)

@ఫణిబాబు గారు
అదే ట్రై చెయ్యాలండీ.. :-)
కధ నచ్చినందుకు సంతోషమండీ..

కామెంటు రాయటానికి కూడా ప.గో.జి.. తూ.గో.జి అంటారా..
ఉండండి.. ఆంటీ.. ఈయన చూడండి ఏదో అంటున్నారు మనల్ని.. (వెనక్కు చూసుకోండి ఆంటి అప్పడాల కర్రతో వస్తున్నారు.. తల జాగ్రత్త!!) :-)

@తార గారు
మీ కామెంటుకు ధన్యవాదములు.
అవునండీ కాస్త నిడివి ఎక్కువైన మాట నిజమే.. అదికూడా ఒక ప్రయేగమేలేండి.

@నీకోసమే నా అన్వేషణ గారు
గేదెబొమ్మ ఆ ప్రాంతంలోదేనండి.. అందుకే అంత క్లారిటీవుంది.

మీరూ చెయ్యేత్తారా.. మరింకే పట్టండి..
మీది ఆలమూరేంటండే.. అయితే గోపాల్రాజుగారికి చెప్తాను మీ గేదినమ్ముతున్నారని.. మరి మీవూరు నడీదిలో ఆషాపు వుందాండి మరీ?? ;-)

మంచు చెప్పారు...

హి హి ... మా ఊర్నుండి బేరగాడిని తీసుకెళ్ళాకుండా ఎల్తే అంతే మరి: -))

యాండే ... ఎక్కడొ బిమారం లొ వున్న మీకు మండపాక మడుగు గురించి ఎలా తెల్సిందండి :-))

నేనయితే దున్నపొతనుకున్నా :-))

శ్రీనివాసరాజు చెప్పారు...

@మంచు పల్లకీ గారు
అయ్ బాబోయ్ మాది బీమారం కాదిండే..
తణుకు దగ్గరేనండే.. అదే మండలంమండే మాది. మండపాక మాకెందుకు తెలీదండే.. అయ్యన్నీ తిరిగినూర్లేనండే.

దున్నపోతు అయినా బాగుండేదండే.. ఈ అవిడియా నాకెందుకురాలేదబ్బా!!!

3g చెప్పారు...

ఏటి.. మీత్తనుక్కాడా.... మాదీ తనుక్కాడే... మంచు గారా.... మీదీ తనుక్కాడైతే సెప్పెండే ఓ.. పాటేసికుందాం. మీది తణూ..కే మాది తణూ..కే అహ మనది.. అహ మనది తణూ..కే.

పోస్టు సదివి పండగయింది... గేదిషయం నేనుమాత్రం మీర్రాసిందే అయ్యుంటాదనుకున్నా!!!

వేణూశ్రీకాంత్ చెప్పారు...

చాలా చాలా బాగుంది శ్రీనివాసరాజు గారు, మాండలీకం ప్రజంటేషన్ విషయంలో వంశీగారి కథల్ని మరిపించేస్తున్నారు.

శ్రీనివాసరాజు చెప్పారు...

@3g గారు

తణుకోళ్ళెక్కువమందేవున్నట్టున్నారైతే... మనది తణూ..కే.. అహ మనది తణూ.. కే.. హ హా..హ్హా.
కధ నచ్చినందుకు సంతోషం.

@వేణూ శ్రీకాంత్ గారు
మీ పోలికకు సంతోషంగా వుంది. కామెంటుకు ధన్యవాదములు. ఇలానే చదువుతుంటారని ఆశిస్తున్నాను :-)

కొత్త పాళీ చెప్పారు...

శ్రీనివాస్, ఇప్పుడే ఇంకో బ్రిలియంటాయిడియా వచ్చింది మీ పగోజీ వాళ్ళ వ్యాఖ్యలన్నీ చదువుతుంటే. మీరు ఈ కథల్ని మీ గొంతుతో చదివి రికార్డు చేసి ఆడియో పెడితే ఇంకా పరమాద్భుతంగా ఉంటుంది. ఆ పనిలో ఉండండి. ఎప్పణ్ణించో రానారెని పోరితే ఆయన ఆ పని కాస్తా చెయ్యకుండానే బ్లాగుల్నించి నిష్క్రమించేశాడు. మీరైనా ఆడియో పెట్టండి.

హరే కృష్ణ చెప్పారు...

శ్రీనివాస్ గారు
చాలా బాగా రాసారు

నీహారిక చెప్పారు...

సానా పెద్దదై పోనాదండే, మాదీ తణుకేనండే...
ప్చ్..

..nagarjuna.. చెప్పారు...

>>బావా ఎంతకొట్టినా కదలటంలేదు.., పొట్టకిందచేయేసి ఓ పట్టట్టు.. <<

ఓ...సచ్చిన బర్రెనా...!! నేనింకా దున్నపోతు అయి ఉంటుందనుకున్నానే

శ్రీనివాసరాజు చెప్పారు...

@కొత్తపాళీ గారు
మీ అయిడియా బాగుంది. నేనెప్పుడో అనుకున్నా ఇది.. ఒకసారి నా వాయిస్ రికార్డ్ చేసుకుని విన్నాకా ప్రయత్నం మానుకున్నా :-)

@హరేకృష్ణగారు
కధ నచ్చినందుకు సంతోషం. కామెంటుకు ధన్యవాదములు

@నీహారిక గారు
మీదీ తణుకేనా.. :-)

@నాగార్జున గారు
అది సచ్చిన బర్రే.. :-)
నచ్చినందుకు సంతోషం.

భావన చెప్పారు...

బాగుందండి. గోదారి యాస తో మరీ పెద్ద కధ అయ్యేసరికి ఒకటీకి రెండు సార్లుచదవవలసొచ్చింది. నిజంగానే ఆడియోపెడితే ఇంకా బాగుండేదేమో. మీ భాష లానే కాస్త కాంప్లికేటేడ్ గా వుంది కధ ఆ యాస మూలం గా. (హి హి హి మీ వూరోళ్ళు అందరు కొట్టటానికి వస్తారేమో జంప్)

మంచు చెప్పారు...

@3జి గారొ... మాది తనుక్కాడ కాదండి... తనుకే.... తనుకు సిటి లొ సజ్జాపురమమండి :-)) సిటి అన్నాది ఒత్తెట్టి సదూకొండే

@ రాజుగారు: అదే మండలమంటే ... కేతలా...వడ్డూరా.. (రాజులెక్కువుండేది ఆ రెండూర్లే కదండే )

@ ఎటండి బావనగారొ... మా బాసంటే ఎక్కసికాలుగా వుందె...:-))

శ్రీనివాసరాజు చెప్పారు...

@మంచు గారు
మీది సజ్జాపురం "సిటీ" యండి??.

మాది తణుకు కి నాలుగు కిలోమీటర్ల దూరంలోవుండే గోపాలపురమండీ.., సిటీ కాదు.. మెట్రోపాలిటిన్ సిటీ.. అంతకంటే కాదు.. పదహారణాల ఆంధ్రా పళ్ళెటూరండే..

అదెక్కడుంది అంటారా?, మీకు తెలియదులేండి.. తణుకులో అడిగితేనే ఎక్కడ గోదారవతల గోపాలపురమా అంటుంటారండే జనాలు... కానీ (సస్యశామలంగా ఉండే మా పల్లెటూరిని నాశనంచేయటానికొచ్చిన) డి.వొ.సి ప్యాక్టరీవున్న వూరు అంటే.. ఓ.. అదా.. ఎందుకుతెలీదూ.. అంటారండీ అంతా.
ఇప్పుడు మీకు వెలిగేవుంటుంది మావూరెక్కడుందో ;-)

పేరు ఎనకాల "రాజు" అని వుంటే మీరు చెప్పినా ఆవూళ్ళలోనే (కేతలీ, వడ్డూరూ.. బీమారం..) వుండాలంటారా?, ఏదో తెలీక ఈ వూరిలోవుంటున్నానండే.. ఈ సారికి వదిలేయండి బాబ్బాబు.. :-)

రాధిక(నాని ) చెప్పారు...

కత శానా బాగుందండీ రాజుగారు.అర్జెంట్ గా స్వాతి పుస్తకానికి కి పంపేయండి . .ఎంతైనా మన ప.గో.జి..ప.గో.జీ నే సుమండి.

jyothi చెప్పారు...

మీ కథ చదువుతుంటె మా ఊరు వెళ్ళినట్లుంది.మా స్వంత ఊరు నిడదవొలు తణుకు మధ్యలో కలవచర్ల.విన్నారా ఎపుడైన ? మీ ఊరి సిద్దాంతి గారి దగ్గరకు మా వాళ్ళు వస్తూంటారు.

శ్రీనివాసరాజు చెప్పారు...

@భావన గారు
నిజమే.. కధ కాస్తపెద్దదే..
అర్ధంకాకపోయినా.. ఒకటికి రొండుసార్లు చదివారుకదండీ.
అదే ఆడియో పెట్టాననుకోండి.. ఇక నా బ్లాగుమొహమో చూడరు మరి. ఎందుకులేండి.. చదివితేనే బాగుంటుంది. ఈ సారి కాస్త చిన్నగా రాయటానికి ప్రయత్నిస్తా. :-)

@రాధిక(నాని) గారు
కధ నచ్చినందుకు సంతోషమండీ. స్వతి స్టాండర్డ్స్ వేరనుకుంటండి. ఒకసారి పంపిస్తే.. తిరిగి పంపించారు. (ఇప్పుడుకాదులేండి... ఒక సంవత్సరం క్రితం). అప్పట్నుండి ఏ పత్రిక్కన్నా పంపాలంటే భయం. నేనే ఎప్పటికైనా ఒక పుస్తకంలా రిలీజ్ చెయ్యకపోతానా ఏంటి.
మరంతే కదండీ మన ప.గో.జి.. ప.గో.జీనే.. :-)

@జ్యోతి గారు
కధనచ్చినందకు సంతోషం.
కలవచర్ల పేరు విన్నాను. ఒకటి రెండుసార్లు ఆవూరుమీదనుండి వెళ్ళినట్టుకూడా గుర్తు.
మా వూరు సిధ్దాంతిగారు అంటే.. తణుకా లేక మా ప్రక్కన గోటేరు అని వుంది అదంటారా?. అవునులేండి అక్కడ ఎవరో (గండపేరుండ) సిధ్ధాంతులున్నారని విన్నాం. మా వూరుదగ్గరే కదా అందుకే మేం వెళ్ళం.. మా వూరివారంతా మీవూరి దగ్గరున్న సిధ్దాంతులదగ్గరకొస్తారేమో మరి కనుక్కోవాలి. :-)

పరిమళం చెప్పారు...

అందరూ కామెంటేశారు:( ఇక నేనేం చెప్పను :) :)తప్ప!

అజ్ఞాత చెప్పారు...

ఫ్రాంక్ గా చెప్తున్నాను, కధ బానే ఉన్నది కానీ, బాగుంది అని చెప్పలేను, యాస బాగున్నది, అచ్చంగా సరిపోయింది, తరువాత సర్కిల్ చుట్టు తిరగడం, మిడ్ నైట్ షో లాంటివి బాగున్నా, ఇంకా బాగా చెప్పొచ్చు అనిపించింది, హాస్య కధా అనుకోవడానికి నాకైతే ఎక్కడా నవ్వు రాలేదు మరి.. ఉన్న కొద్ది పాటి హాస్యం కుడా యాసలో మరుగునపడిపోయింది, ఇక్కడ మీరు ఇంకా కృషి చెయ్యాలేమో,...
కానీ మంచి ప్రయత్నమని మాత్రం చెప్పగలను....
ఇంకా రెండు మూడు వ్రాస్తే బండి దారిన పడొచ్చు...
మొదలు, చివర రెండూ కాస్త తేలిపోయాయి..

swathi చెప్పారు...

యాస ఎంత బాగున్నా కధలో పస లేకపోవడం వల్ల చప్పబడిపోయింది. మళ్ళీ మళ్ళీ
చదవాలనిపించే మీ బ్లాగ్ లోని మిగతా కధలకి ఈ కధకి పోలికే లేదు

శ్రీనివాసరాజు చెప్పారు...

@పరిమళం గారు
ఏం చెప్పనూ అంటూనే కామెంటిచ్చి పరిమళాలు వెదజల్లేలా ఒక చిన్న నవ్వు నవ్వారుగా.. అది చాలండి :-) (ప్రాసకోసం వాడా.. తప్పుగా అనుకోవద్దు)

@తార గారు
మీ ఫ్రాంక్ నెస్ బాగుంది. హాస్యకధలు అన్నీ నవ్వురావాలని లేదేమోనండి. అది చదివే మూడ్ బట్టికూడా వుండొచ్చు. కానీ మీరన్నట్టు రాస్తున్నప్పుడు నాకూ అంత హాస్యంగా రాస్తున్నానని అనిపించలేదు. ఇది నా చిన్నప్పుడు మా పెద్దనాన్నగారు చెబుతుండే కధ. విషయం అదే.. పాత్రలు కల్పించి నాదైన శైలిలో చెప్పాను. కధలో విషయాన్ని చూపించాలనే ఎక్కువ ప్రయత్నించాను. ఇంకా కృషిచేస్తున్నా.. మంచి మంచివి రాయగలనని అనుకుంటున్నాను. మీ సలహాలకు ధన్యవాదములు. ఇలానే చదివి మంచి సలహాలిస్తారని ఆశిస్తున్నాను.

@స్వాతిగారు
మీ కామెంటుకు ధన్యవాదములు.
తప్పకుండా మీ సలహాను తీసుకుంటా. ఇంకా మంచివి రాయటానికి ప్రయత్నిస్తాను. :-)

నేస్తం చెప్పారు...

నా కైతే చాలా బాగా నచ్చింది ఈ కధ ...అచ్చం వంశీ కధ చదివినట్లు....కధాంశం కూడా బాగుంది..ఎండింగ్ లో చివరి లైన్ కరెక్ట్ ముగింపు ... కాకపోతే కళ్ళు లాగుతున్నాయి చిన్న అక్షరాలు అవడం వల్ల...బహుశా అందుకే రెండెసి సార్లు మెల్ల మెల్ల గా చదవాల్సి వస్తుంది అంకుంటా ...ఫాంట్ పెంచడానికి కుదురుతుందా మీకు అభ్యంతరం లేకపోతే

శ్రీనివాసరాజు చెప్పారు...

@నేస్తం గారు
ఒక నేస్తంలా వచ్చి చెబితే అభ్యంతరంమేముందండీ. ఇన్నాళ్ళు అందరి కళ్ళూ పాడుచేస్తున్నానని నా కళ్ళకి కనిపించలేదు సుమండీ.
మొన్నే ఫణిబాబుగారు నాలుగు తిట్లు తిట్టారు. బాబూ ఫాంటు సైజు కాస్త పెంచు అని.. మర్చేపోయాను. మళ్ళీ మీరు గుర్తుచేసారు.

కాస్త పెంచాను చూడండి. బాగుందోలేదో చెప్పండి వీలుంటే. లేకపోతే మౌనం అంగీకారముగా... అలానే వుంచేస్తా. :-)

నేస్తం చెప్పారు...

మౌనం అర్ధ అంగీకారమే కదండి...ఇంకో సగం డవుటెందుకు పెట్టాలి అని వ్యాఖ్య రూపం లోనే చెప్పేస్తున్నా ..ఇప్పుడు బాగుంది ... మాట మన్నించినందుకు ధన్యవాదాలు

శ్రీనివాసరాజు చెప్పారు...

@నేస్తం గారు
ధన్యవాదములండీ.
మొత్తం డవుటులేకుండా చేసినందుకు. :-)

అజ్ఞాత చెప్పారు...

కొంచిం అలీసంగా కామెంటినందుకు ఏవనుకోకండే.
బాగా రాసారు.
కథ చదివిన తరువాత నాకో సామెత గుర్తొచ్చింది.
"గేదెని నీళ్ళల్లో పెట్టి బేరమాడడం"
మరీ గోపాల్రాజంత అమాయకులుంటారా..... అని?

"నీది కడుపా మండపాక మడుగా" అన్నారు.
నేను "ఖండవల్లి మడుగా" అని విన్నాను.
అన్నట్టు నేను పుట్టిందీ, తణుకులోనే.

శ్రీనివాసరాజు చెప్పారు...

@బోనగిరి గారు
మీది తణుకేనేటండే.. అయితే మన తణుకోళ్ళంతా గలిసి ఒక సంఘమెట్టేదామేంటండే.. :-)

గోపాల్రాజు మరీ అంత అమాయకుడు గాదండే.. కాస్తో కూస్తో.. బడాయి తప్పా. ఓ నాలుగు పెగ్గులు ఎక్కువిచ్చుకున్నాడుగదండే.. అందుకే అలా బుట్టలో పడిపోయేడు.. :-)

తణుకు ఇవతలిపక్క గ్రామాల్లో అంటే.. మండపాకకు దగ్గర్లో అలాగే అంటారు. అదే పెరవలికి దగ్గర్లో అయితే అలాగనొచ్చేమో.

మండపాక ముడుగుకు పెద్ద చరిత్రే వుందండోయ్.. అది చాలా పెద్దది.. ఇంకా రోజూ బాగా ఆల్కహాలు తాగి బాగా మూలుగుతుంటుంది (చెఱకు నుండి వదిలే వ్యర్ధపదార్ధం అయిన మొలేసెస్..(molasses) నుండి ఆల్కహాలు తీసాకా.. మిగిలింది ఇందులో వదులుతుంటారు..)

Unknown చెప్పారు...

ఏటండి..మా గోపాల్ర్రాజు బావ అంటే అంత ఎకసక్కాలు. మా బావ ఈ రోజుల్లొ పేపర్లే కాదు, బ్లాగులు కూడా సదువుతున్నాడు...జాగ్రత్తండి బాబు :)

శ్రీనివాసరాజు చెప్పారు...

@నేనుసైతం గారు
నేనుసైతం అంటూ చదివేసి కామెంటిచ్చినందకు ధన్యవాదములండీ.. :-)

గోపాల్రాజు చదివినా పర్లేదండే.. "అదుగో చూసారా.. నా పేరు బ్లాగులోకూడా వచ్చింది.. అంటే పెపెంచకం అంతా నాగురించే చెప్పుకుంటారు.. అద్గదీ గోపాల్రాజంటే..", అని బడాయి చెప్పుకుంటాడులేండి.. ఎంతైనా బడాయి గోపాల్రాజు కదా!! ;-)

శివరంజని చెప్పారు...

హ...హ...కధ చాలా బాగుంది .ఆ యాస తో వేసే డైలాగ్స్ కయితే నాకు చాలా నవ్విచ్చింది .....ఆ యాసని భలే ప్రెజెంట్ చేసారు

ap చెప్పారు...

మీరు చెప్పిన కథ బాగా వుంది కాని, అది కథ లాగా లేదు నిజ జీవితం లో జరిగిన దాని లాగా వుంది
Telugu News

శ్రీనివాసరాజు చెప్పారు...

@శివరంజని గారు
కధ నచ్చి.. మిమ్మల్ని బాగా నవ్వించినందుకు సంతోషం.

మీ కామెంటుకు ధన్యవాదములు.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

శ్రీనివాసరాజు గారూ...,happy vinakayaka chavithi

హారం

శ్రీనివాసరాజు చెప్పారు...

@భాస్కరరామిరెడ్డిగారు

మీకు మీ కుటుంబానికి వినాయకచవితి శుభాకాంక్షలు.
ధన్యవాదములు.

ఇందు చెప్పారు...

నాకు వంశీ గారి కథలు చదివినట్టే ఉంది అండీ....బాగ వ్రాసారు...నిడివి కొంచెం ఎక్కువైనా....కథనం మాత్రం అద్భుతం :)

శ్రీనివాసరాజు చెప్పారు...

@ఇందు గారు
కథనం నచ్చినందుకు సంతోషం. :)
మీకు కూడా వంశీ కధల్లాగానే అనిపించిందా.. అందరూ అదే అంటున్నారని.. అసలేమి కలుస్తున్నాయో చూద్దామని.. పట్టుబట్టు మరీ "మా పసలపూడి కధలు" చదువుతున్నాను.. నాకైతే ఒక్క మాండలీకం తప్ప ఏది కలిసినట్టుగా అనిపించలేదు. అందులోనూ అవి తూ.గో. మాటలు. మావి ప.గో మాటలు.., బయటవారికి అన్నీ ఒకేలాగా వుండొచ్చేమోగానీ రెండిటిలో తేడా చాలానే వుందండో.. వంశీగారి కధల్లోవున్న నుడికారాలు చాలా నేను కొత్తగావిన్నవివున్నాయి.

చదవనంతసేపూ బాగానేవుంది.. ఇప్పుడు ఆ కధలు చదివాకా.. ఆ శైలిని అనుకరించకుండా నా శైలిలో రాయటం చాలెంజింగేలావుంది.. :-)

ఇందు చెప్పారు...

నిజమే అండీ....తు.గో కి ప.గో కి కూడా మాటలు తేడా ఉంటాయని నాకు తెలియదు.నేను వంశి గారి అన్నిరచనలు చదవకపొయినా కొన్ని 'పసల పూడి కథలు '...'మా దిగువ గోదావరి కథలు ' చదివాను. నేను గ్రహించిన దాని ప్రకారం మీకు వంశీ గారికి మాటల్లో సారూప్యత కొద్దిగా ఉన్నా...వంశీ గారు ఒక దృశ్యాన్ని వర్ణించే తీరు మీ తీరు ఒకేలా ఉన్నయి. అందుకే మీ కథ వంశీ గారి కథల ఉంది అన్నాను :)

శ్రీనివాసరాజు చెప్పారు...

@ఇందు గారు
మీ కామెంటుకు ధన్యవాదములు.

ఇదేంటిది.. తెలియకుండానే ములగచెట్టు ఎప్పుడెక్కానబ్బా ఇప్పుడెలా దిగాలో ఎంటో.. :-)

నాదైన శైలిలో ఇంకా బాగా రాయటానికి ప్రయత్నిస్తాను. ఇలాగె చదువుతూ మీ ఆభిప్రాయం చెబుతారని ఆశిస్తున్నాను. :-)

కౌటిల్య చెప్పారు...

రాజు గారూ...
శాన్నాళ్ళయ్యింది బ్లాగుల మొకంజూడక...ఇప్పుడొచ్చి,మీ కద సదూతా ఉంటే మనసుకి బలే సుకంగా ఉందిలే....మీ దగ్గర బలేబలే మాంఛి సొగసైన తెలుగుపదాలు నేర్చేసుకుంటున్నా నేను...దానికి పీజు ఏమన్నా ఇచ్చుకోవాలా మరి! కద బాగుంది..నడకా బాగుంది..కానీ పక్కా పల్లెటూరు మొగాన్నిగా!చాలా అనుమానాలొచ్చేశాయి...అయ్యన్నీ ఆలోచిత్తే కతని ఎంజాయ్ చెయ్యలేంలే అని సర్దిచెప్పుకున్నా...కానీ ఆ సిట్యువేశన్ కి దున్నపోతు సక్కగా అతికేదేమో అనిపిచ్చిందండీ...నా చిన్నప్పుడు విన్న పిట్టకథలన్నీ ఒకదానెమ్మట ఒకటి గుర్తొచ్చేత్తన్నాయ్ మీ కథ చదివాక...

శ్రీనివాసరాజు చెప్పారు...

@కౌటిల్యగారు

కధనచ్చినందుకు సంతోషం.
ఫీజును మనియార్డరు ద్వారాగానీ.. నెట్ ట్రాన్స్ఫర్ ద్వారా గానీ పంపించగలరని మనవి. రూపాయిలొద్దు.. డాలర్స్ అయితే మంచిది. :-)

ఇది కూడా నేను చిన్నప్పుడు విన్న పిట్టకధేనండి.. అందుకే కధను మార్చే ధైర్యం చేయలేకపోయాను. నాశైలిలో దాన్ని మలచడం తప్ప.

Related Posts Plugin for WordPress, Blogger...