10, మార్చి 2010, బుధవారం

గొల్లకావిడి



ఏసవికాలం మొదలైనట్టేవుంది... సాయంత్రం ఆరుదాటగానే
ఎల్లిపోయే పొద్దు ఇంకాసేపు ఉందాంలే.. అన్నట్టుగా ఏడుదాటినాగూడా
అట్టాగేవుంది.. ఎవరో ఆంజనేయసాములోరి గుల్లోంచి..
ఎర్రచందనం బొట్టు తెచ్చి పడమటేపు ఆకాసంమీద రాసారంటావా..
అన్నట్టుగా దగదగా మెరిసిపోతా ఉన్నాడా సూరీడు...

పక్షులన్నీగూటికిసేరుకుంటంకోసం సిన్నపిల్లోడు పలకమీద దిద్దిన
అక్షరాల్లాగా అప్పుడప్పుడూ వొరసగా అప్పుడప్పుడూ వొంకరటింకరగా..
ఎగురుకుంటా ఎల్తావున్నాయు..., ఉమ్ముతడిజేసి చెరిపేత్తావుంటే..
పలకమీద అక్షరాలు మాయమైపోయినట్టుగా కొంతదూరం ఎగిరాకా
అయి ఆకాశంలో కలిసిపోయి మాయమైపోతున్నాయి. గాలింకా ఏడిగా
ఈత్తానే వుంది. గేద్దూడలన్నీ పాలుతీసే ఏలయ్యింది రండ్రాబాబా
అన్నట్టుగా ఆళ్ళరైతులకేసి చూత్తా ఆకల్తో అరుత్తావున్నాయి.

ఎల్లాల్సిన ఊరు రమారమి ఇంకో ఐదు పర్లాంగుల దూరం వుంటంతో,
పొద్దుపోయేలోగా సేరుకొని గుడారాలేసేత్తే.. ఏలకింత వొండుకుని తిని
పొడుకోవచ్చని..ఎరుకులు కంగారు కంగారుగా మేకలమందని..
భుజాలపైనున్న కావిడితో "హే.. హే...", అంటా అదిరిత్తా,
కంగారుపెట్టేసి పరిగెట్టిత్తావున్నాడు. ఎరుకుల్తోబాటే బాటెంబడే..
ఇంకో కావిడి భుజానేసుకుని ఇంటావిడ రత్తమ్మ ఎనకాలే గెలాపెత్తుతాంది.

ఎరుకుల్ది మొగల్తూరు దగ్గరున్న జిల్లేటితిప్ప గ్రామం.., తాతల్నాటినుండీ
వత్తున్న మేకలేపారం తప్ప ఎనకాల పొలాలుగానీ ఆస్తులుగానీలేవు.
ఏ చెడలవాట్లులేకండా.. కష్టపడిపనిజేసి తింటా ఒకరికొకరుతోడుగా
ఉంటారా మొగుడూపెల్లాలు.. పెళ్ళయి పదేళ్ళయినా పిల్లలులేరు.
ఎరుకులుకి పిల్లలంటే మహాపేనం..కనబడ్డ దేవుల్లందరికీ పిల్లలకోసం
మొక్కులు మొక్కుతుంటాడు.

మామూలు రోజుల్లో ఎరుకులు కూలిపనికెల్తావుంటే..
రత్తమ్మ మేకలమందనేసుకుని మేపుతా సాయంకాలానికి
ఇంటికిచేరుకుంటావుంటాది. ఏసవికాలమొచ్చేసరికి ఊళ్ళో పనులేంలేపోటంతో..
మిగతా జనాలందరిమల్లేనే మేకలమందనేసుకుని గోదావరి లంక గ్రామాల్లో
కొబ్బరితోటల్లోకి మకాం పెట్టేత్తుంటారు. మేకల్తో పొలంపొలం తిరుగుతా..,
కాలీసెలకల్లో గడ్డి మేపిత్తా మేకలెరువుకోసం కొబ్బరితోటల్లో మేకలు తిప్పుతా..
మేక్కింతని తీసుకుంటా సంపాయిస్తావుంటాడు ఎరుకులు.

మేకలెరువు కొబ్బరిమొక్కలకి చాలామంచి బలంకావటంతో మా తోటలోకిరా
అంటే మాదాంట్లోకు తోలు అని ఒక మూన్నాలుగునెల్లు చాలా డిమాండింగా
ఉంటాది మేకలమంద బిగినెస్సు. కొందరైతే తాతలు,తండ్రులనాటి వారసత్తంగా
ఒకే పొలానికి మేకలమందల్ని తోల్తావుంటారు. ఆవూరు, ఈ వూరు మకాంలెట్టి
తిరిగి వానాకాలమొచ్చేసరికి సొంతూరు జేరుకుంటుంటారు ఈ మేకలమందలోల్లు.

ఎరుకులు ఆళ్ళ తాతలకాలంనుండి ఓ ప్రెసిడెంటుగారి కొబ్బటితోటలో
మందలేత్తావుంటాడు. పెతీ సంత్సరం ఇంతా అంతా అని సెప్పకుండా..
సీజన్లో సగం వొకేసోట కదలకుండా మకాం ఉంటంతో..ఇంటావిడ రత్తమ్మ
ఇంతే అడిగావేంటి, ఈ సంత్సరం కాత్త పెంచడుగు అని పోరుపెట్టినా పట్టుంచుకోకండా
ఆ పెసిడెంటుగారు ఇచ్చింది తీసుకుంటా వుంటుంటాడు.. ఇలా నమ్మకంగా
ఉంటవొళ్ళ.. ఎరుకులు ఆళ్ళకి బాగా దగ్గరైపోయేడు. అందుకే.. ఏసాకాలం
వత్తందంటానే ఎరుకులు వత్తాడని.. సుట్టంకోసం ఎదురుసూత్తా
వున్నట్టు సూత్తావుంటాదా పెసిడెంటుగారి కుటుంబం.

"ఈళ్ళ తాతా.. తండ్రి చాలా నమ్మకమైనోల్లండే.. ఏదీ ఆశించేటోళ్ళుగాదు..,
అలానే ఈడు అంతే..", అని ఆ పెసిడెంటుగారు అప్పుడప్పుడూ ఇంటికొచ్చిన
పెద్దలందరితోనూ సెబుతుండేవోడు. ఆ మాటే ఎపుడూ నిలబెట్టుకోవాలన్నట్టు
ఎరుకులు కూడా చానా కచ్చితంగా ఉండేవోడు.

దీపాలెట్టే ఏలకి పెసిడంటుగారింటికి సేరుకున్నారా ఎరుకులు, రత్తమ్మా..
కొబ్బరిసెట్ల మద్దెనున్న దిబ్బలాగా సదునుచేసున్న సెంటుభూమిలో..
గుడారాలేసేసి కావిడిల్తో మోసుకొచ్చిన సామానంతా గుడారాల్లో సద్దేసేడు.
మిగతానేలంతా దుక్కి ట్రాట్టరుతో తిరగబెట్టేయటంమూలానా అంతా
ఎగుడుదిగుడుగా ఉంది.

పెరట్లోవున్న నుయ్యిలోంచి నీళ్ళుతోడి రత్తమ్మందిత్తే, కల్లాపిజిమ్మినట్టు
ఎగుడుదిగుడునేలపై జిమ్మి..,తడిపేసి..., చెక్కముక్కతో మట్టిబెడ్డలన్నీ
అనగ్గొట్టేసి.. దానిమీద వొట్టిగడ్డేసి.. మేకలు పడుకోటానికనువుగా నేలంతా
సదునుచేసేసేడు..

సెనాల్లో కర్రల్తో కంచేసేసి.. మేకల్నందులోకి తోలేసేడు, మందకి కాపాలాగా
వున్న పెంపుడు కుక్కని కంచెకి కట్టేసేడు. ఇదంతా అయ్యేసరికి
బాగాసిమ్మచీకటైపోయింది. పెసిడెంటుగారి భార్యయిచ్చిన అన్నమూ..
ఎండుచేపలకూరేసుకుని ఆ పూటకి అన్నాలు కానిచ్చేసేరు.

అమావాస్యగావటం వొల్ల.. కారుసీకటిగావుంది.. ఎక్కడో దూరంగావున్న
పంచాయితీ ఈదిలైటుకాంతి కొబ్బరిచెట్లమద్దెనుండి బంగార్దారాల్లాగా గుడారాల
దగ్గరగా అక్కడక్కడా పడతావుంది.., ఆ కాంతి తప్ప సుట్టూరా
కటికసీకటికొట్టులాగుంది. ఎక్కడో దూరాన అరుత్తున్న ఈదికుక్కలరుపులు,
ఆమడ దూరంలోవున్న పంటచెరువు సుట్టురావున్న రుప్పల్లోంచి వొత్తున్న
బాండ్రుకప్పల అరుపులు.. ఇనిపిత్తావున్నాయి.. ఇవేమి ఎరుకులు నిద్రని
ఆపలేపోయాయి.. పొద్దున్నుండీ నడిసి నడిసి అలిసిపోయిన శరీరమోమో..
నడుంవాల్చగానే నిద్రలోకిజారుకున్నాడు. సరిగ్గా నడిరేత్రికాడ..
ఆకాశంలో గొల్లకావిడి నడినెత్తికొచ్చినేల కంచెక్కట్టేసిన కుక్క ఇంతగా
అరవటంమొదలెట్టింది.

ఆ అరుపుకు ఉలిక్కిపడి లేసి కూర్సున్నాడు ఎరుకులు..
రత్తమ్మ ఉలక్కపలక్క పడుకునుంది. దగ్గరేవున్న సేతికర్ర తీసుకుని బయటకొచ్చి
సుట్టూరా సూసిన ఎరుకులుకి ఎవరూ ఆనలేదు.. వొక ఐదునిమిషాలలాగే సూసి..
ఏదోఅయ్యింటాదిలే అని ఎనక్కితిరిగి గుడారంలోకి ఎల్లిపోబోతున్నోడే..
మేకల మందమద్దెలో ఎదో సెబ్దం వొత్తన్నట్టుగా వుందేంటాని..
సేతికర్ర సంకనెట్టుకుని ఇలాయిబుడ్డి ఎలిగించి సెబ్దం వత్తున్నేపు నడిచేడు..

మందలోవున్న మచ్చలమేక నిలబడి ఈన్తా కనబడింది. గబగబా సేతికర్ర
కిందడేసేసి.. కంచెగేటు తీసి.. లోపలికెల్లి.. ఇలాయిబుడ్డి పక్కనెట్టి..
ఆ మచ్చలమేకెనకాల వొత్తుగా వొట్టిగడ్డేసేసేడు, అడ్డంగా పడుకున్న మేకల్ని
అదిలించి పక్కకి తోలేసి కాలీచేసేడు. కాసేపటికి ఆ మచ్చలమేక వో
తెల్లమల్లిపువ్వులాంటి తెల్లపిల్లని.. వో నల్లకాకిలాంటి నల్లపిల్లనీ ఈనింది.
ఎరుకులు ఆనందంతో పొంగిపోయేడు.. సర్కస్లో ఆకాసానికి ఏసిన లైటంత
ఎలుగులాగా కొబ్బరిసెట్ల మద్దెన ఎరుకులు మొహం ఎలిగిపోతావుంది. పుట్టిన
మేకపిల్లల్ని గడ్డితో అంతా సుబ్రంచేసేసి.. నీరసంగా పడుకునున్న మచ్చలమేకకి
మూట్లోవున్న పచ్చగడ్డితెచ్చి ఏసేడు.

"ఎమే.. బంగారాలు పుట్టేయే.. లేవ్వే..., ఇంతొరకూ సిన్నమచ్చగూడాలేని మేక
మన మందలోనే లేదే.. అదీగాక ఒల్లంతా మచ్చలున్న మేక్కి.. ఏ మచ్చాలేకండా..
ఇలా తెల్లదొకటీ నల్లదొకటీ పుట్టిందంటే నాకు ఆచ్చర్యంగావుందే.. ఎప్పుడో మా
తాతదగ్గర సూసానే ఈ ఇచిత్రం.. మల్లా మన మందలో సూత్తన్నాను...
ఈటిని మన సొంత పిల్లల్లెక్క చానా పేనంగా పెంచాలే..", అని తెగ మురిసిపోతా
అప్పుడే పుట్టిన మేకపిల్లల్ని గడ్డితట్టలో అట్టుకొచ్చి నిద్రమత్తులోవున్న
రత్తమ్మకి సూపించేడు.

తెల్లార్లు నిద్దర్లేకున్నా ఎరుకులు మొహం ఇంకా ఆనందంతో ఎలిగిపోతానేవుంది..,
ఆ ఎలుగులోనే ఎలుగొచ్చేసి తెల్లారిపోయింది.

"రాత్రి గొల్లకావిడి నడినెత్తికొచ్చినేల పుట్టాయి బాబయ్యా... నల్లబంగారం.. తెల్లబంగారం
అని పేర్లెట్టేను బాబయ్యా..., ఆ దేవుడిచ్చిన బిడ్డల్లెక్క అనిపిత్తాందండే మాకు..,
ఈ సంత్సరం ఈడకొచ్చిన మొదట్రోజే బాగున్నట్టుందండే.. ఈటిని మాత్రం
పోలేరమ్మమొక్కుకి పెంచమని ఎవరడిగినా ఇయ్యనండే... మీక్కూడా జెప్తున్నానండే..,
ఈసారడక్కండే బాబా" , అంటా పెసిడెంటుగారికి పొంగిపోతా సెప్పేడు ఎరుకులు.

"ఏంట్రో.. అంత ఇచిత్రమేముందీటిల్లోనో", అంటా చమత్కరించాడు పెసిడెంటుగారు.

"రాతిర్నుండీ సూత్తన్నానండే బాబా ఈడి గోలెంటో.. ఇలానే పిచ్చిపిచ్చిగా
మాటాడేతున్నాడండే... మచ్చల్లేకండా పుట్టమే గొప్పంటాడండే.." అని రత్తమ్మ
ఎరుకులొంక కొరికేసినట్టు సూత్తా పెసిడెంటుగారికి సెప్పింది..

"సరేలేరా.. అంతపేనంగావుంటే నువ్వేపెంచుకో.., నేనేమడగను.., సర్లేగానీ ఎల్లి
ఆమందని కాలవేపు తోటలోకి తోలు ఈరోజు..", అని ఎరుకులుకి పనొప్పజెప్పేడు
పెసిడెంటుగారు.

కావిడికి కట్టుకెల్లాల్సిన మంచీల్లు గిన్నె, వొన్నందాకా పక్కనడేసి... కావిడికి
వోఏపు నల్లబంగారాన్ని.. వేరెఏపు తెల్లబంగారాన్నికట్టి భుజానేసుకుని
మెకలమందెనకాల బయల్దేరేడు ఎరుకులు..

"అదేంటయ్యో..!, ఇయ్యెవడు.. అట్టుకొత్తాడు.., ఆ రెంటినీ ఎదరగట్టి..
ఎనకియ్యిగట్టొచ్చుగాదా..?, మద్దేనం ఏం తింటావేంటీ.. గడ్డీ?", అని రత్తమ్మ
సిరాకుపడిపోతా తిట్టేసింది ఎరుకులు సేత్తున్న పన్జూసి.

"నువ్వేరే కావిడిక్కట్టుకోఏహే..!, ఇది.. గొల్లకావిడే.., ముందో సుక్క.. ఎనకో సుక్క..
మద్దెన నేనో పెద్ద సుక్క.. మేం ఈపాల్నుండీ.. ఏడకెల్లినా.. ఇట్టానే ఎల్తామే..
నీఎదగ్గోలాపి ఎనక రాఎహే.." అంటా చిర్రుబుర్రులాడిపోయాడు రత్తమ్మపై.

నాలుగు నెల్లు గడిసేయి.. ఆ మేకపిల్లల్ని రాత్రుల్లు పక్కలోనే పడుకోబెట్టుకుంటా..
బూమ్మీదస్సలు కాలెట్టనియ్యకుండా.. పగటేల కావిడిగట్టి.. మోత్తా.., మేకలకిష్టమని
ఎవరెవర్నో బతిమాలి పనసాకులు కోసుకొచ్చి మరీ మేపిత్తా.., బంగారాలూ.. అంటూ
ముద్దుముద్దుగా పిలుత్తా.. పేనానికి పేనంగా పెంచుకుంటన్నాడు ఎరుకులు.

వోరోజు పెసిడెంటుగారు పనోళ్ళురాపోతే.. కొబ్బరితీత లారితోపాటెల్లి పక్కూర్లో
లోడుదించేసేకా లెక్కట్టుకొచ్చే పన్చెప్పే రు ఎరుకులుకి, ఎప్పుడూ ఆ పిల్లల్ని
ఇడిచిపెట్టనోడు.. ఇడిచిపెట్టి ఎల్లాల్సొచ్చింది. పొద్దున్నెల్లినోడు.. సాయెంత్రమేలకి
సేరుకున్నాడు...

ఇంటి దగ్గర తోటకో పర్లాంగు దూరంలోవున్న పంటకాల్వ తూము
దగ్గరకొచ్చేసరికి.. ఆల్ల గుడారాల దిబ్బదగ్గర జెనంపోగడ్డట్టు అనిపించి
వొక్కసారే లగెత్తుకుంటా నాలుగంగల్లో ఇల్లుసేరుకున్నాడు.. అక్కడ రత్తమ్మ
సోకండాలుపెడతా ఎడుత్తావుంది... ఎదురుగ్గా కదలకుండా మెదలకుండా
నాలుకలు బైట్టెట్టేసి అటొకటీ ఇటొకటీ పడున్నాయి మేకపిల్లలు..

అదిసూసిన ఎరుకులు.. నోటమాటపడిపోయినట్టైపోయి.. తలట్టుకుని
నేలపై కూలిపోయేడు... అప్పుడే మందుకొట్టిన మినపసేనులో రొట్టతినేసాయంటా..
పేనంగా సూసుకుంటున్న బంగారంలాంటి రెండుమేకలు సచ్చిపోయినియ్యని..
అక్కడ గుంపులో జనాలు సెప్పుకుంటున్నారు.

సీకటిపడింది... రత్తమ్మని వోదార్సి వోదార్సి ఎక్కడజనాలక్కడికెల్లిపోయేరు...
సత్తుగిన్నెలో అన్నంపెట్టుకొచ్చి.. తినొయ్యా అంటా చానాసేపు ఎరుకుల్ని
బతిమలాడింది.. రత్తమ్మ. ఎంత కదిపినా మాటాడకుండా అలానే కూర్చుండిపోయేడు..,
ఇకబతిమాల్లేక.. కంచం అక్కడేపడేసి తానూఏమీ తినకుండా ఎల్లి పడుకుంది రత్తమ్మ.
రోజూలాగే ఆకాశంవైపుచూత్తా పడుకున్నాడు ఎరుకులు..

నడిరేత్తిరైంది... ఆ రోజూ అమావాస్యే అయ్యుంటుంది.. మళ్ళా కటికసీకటికొట్టు..
అయే.. పంచాయితీ ఈదిదీపాలకాంతి..
అయే కుక్కలరుపులు..
అయే.. బాండ్రుకప్పల గాండ్రింపులు.. అలా ఇనపడతానేవున్నాయి..
గొల్లకావిడి నడినెత్తికొచ్చేసింది..
ఎరుకులు అలానే కళ్ళుతెరిచీ చూత్తానేవున్నాడు.. చూత్తానేవుండిపోయేడు..
ఆ కళ్ళలోంచి సూత్తానే పేనాలొదిలేసేడు...

Related Posts Plugin for WordPress, Blogger...