తాతారావుగారి బెంజికారు
తాతారావుకు ఎప్పట్నుంచో కారుకొనాలని తెగమోజు. సిన్న సిన్న కార్లను
సూసినప్పుడల్లా.. "ఇదా.. ఎదవది.. నాలుగు లచ్చలు, ఇది కారేంటి..
జవ్వాది అంజిగాడి కిళ్ళీకొట్టు డబ్బాలా ఉంది.. కొంటేగింటే.. ఏబైలచ్చలు
పెట్టి బెంజు కొనాలిగానీ..., డబ్బాకార్లలో ఏముంటాదబ్బాయ్ దర్జా.."
అని అందరిదగ్గరా సెబుతుండేవోడు.
ఊళ్ళోవున్న కుర్రగాళ్ళతో ఎప్పుడూ వాదనకు దిగి "బెంజును మించిన కారు
పెపంచంలోనే లేదు, నాకు మీసాలు రానప్పుడ్నుండీ సూత్తన్నాను,
నాలుగు మార్లు ఢిల్లీలో కార్ల ఎగ్జిబిషనుక్కూడా ఎల్లాను..., నా కళ్ళముందే
బోకుల్లా తిరిగిన మీ బాబులంతా కొయిటాసొమ్ములు సంపాయించీ బాగా బలిసీ..
నిక్కర్లుమానేసి పేంటులేసుకునొచ్చిన పిల్లిమిసరకాయల్లారా..
నాకుసెప్తారేంట్రా.. మీరా?", అని అన్నిఇసయాల్లోనీ అందరికంటే ఎక్కువ
తనకే తెలుసునని సెప్పుకుంటంలో తాతారావుని మించినోడు
ఉభయగోదారిజిల్లాల్లో ఎవడూ ఉండుండడు.
పైకి "అవునురోయ్.. తాతారావుగారు సెప్పిందే కరెష్టురా..", అని
తలలాడించినా.. సాటుకెళ్ళి "ఛీ ఈ ఎదవ నోట్టో నోరుపెట్టినా కుక్కనోట్లో నోరుపెట్టినా
ఒకటే.." అనంతా తిట్టుకెళ్ళిపోయేవోరు.., తనేమీఇన్లేదన్నట్టు.. తానుపట్టుకున్న
కుందేలి నాలుగు కాళ్ళను ఎనక్కి కట్టేసి.. అసలు కాళ్ళేలేవు అని ఋజువుచేసే
తత్వం తాతారావుది.
అలాని ఊరిజనం పట్టించుకోకండా తిరిగే ఆసామాసి మనిషిగాదు తాతారావు.
పచ్చింగోదారి జిల్లా నిడదోలూ, కానూరు, ఉండ్రాజరం చుట్టుపక్కలున్న ఊళ్ళలో
మెరక.. పల్లం.. బీడు.. మాగానిల్తో కలుపుకుని.. మొత్తం ఇరవై ఎకరమూ..
సఖినేటిపల్లిలో ఐదారుసోట్ల ఎటుసూసినా ఐదెకరాల ఏకముక్కకి తక్కువగాకండా
అత్తోరు కట్నంగా ఇచ్చిందాంతో కలుపుకుంటే… సుమారు ఏభై ఎకరముంటాది
తాతారావుకి.
సఖినేటిపల్లిలో కాల్వగట్టుకి ఆనుకునున్న అరెకరంనేలలో బంగాళాపెంకుటిల్లు..
డూప్లెక్సు హౌసూ... చుట్టూ గెదెల సావిడీ.., మంచి పెసాంతమైన
వాతావరణంలో ఎండపొడ కూడా తాక్కుండా చుట్టూరా కొబ్బరిచెట్లతో
కప్పేసుంటాది తాతారావు ఇళ్ళు. ఎప్పుడో ఇల్లరికపల్లుడుగా వచ్చేసి ఇక్కడే
స్తిరపడిపోయిన తాతారావు, ఆ వూరి స్తితిమంతుల్లో వొకడుగావటం వల్ల,
అతని బలం, బలగం చూసి బయపడేవోళ్ళు ఎక్కువే ఉన్నారావూళ్ళో.
పిల్లాజెల్లాలేకపోయినా.. ఎప్పుడూ ఒక ఇరవై ముప్పై మంది పొలాళ్ళో
పనిచేయటానికి చేతికిందుండే పనోళ్ళు.. నలబైదాకా ఉండే పాడావులు,
గేదెల్నీ సూసుకోటానికి పదిమంది పాలేళ్ళు...
ఇష్టాన్సారంగా చిర్రుబుర్రులాడిపోతా ఎగరటానికి.. తిట్టింది పట్టానికీ...
తిండికి వంట్టానికీ అన్నట్టుండే.. ఇంటావిడ జయమ్మ.. ఈళ్ళందరితోనీ
కళకళ్ళాడిపోతుంటాది ఆ ఇంటి పరిసరపాంతాలు.
ఎంగిలిచేత్తో కాకినిదిల్చితే ఎక్కడ తినేసి బల్సిపోద్దో, తనకి ఎక్కడ
పుణ్యమొచ్చేద్దోని ఊర్లో ఎవడిగొడవా పట్టించుకోకండా..ఉండే తాతారావు,
కాకులు కావు కావుమనకుండానే.. పొద్దుపొడవకుండానే లేచి ఇంటి
గుమ్మానికి ఎడంపక్కనుండే ఖాలీత్తలంలో గుబురుగా పెరిగి..
పూతతో పిటపిటలాడుతున్న గున్నమామిడిచెట్టుకింద.. దారేపోయే వాడు
కనబడే ఇదంగా పడక్కుర్చీ ఏసుకుని.. కాలుమీదకాలేసుకుని వచ్చిరాని
తెలుగు కూర్చుకుంటా పేపరు సదువుతా... లంకపొగాకు సుట్ట నోట్టోపెట్టుకుని..
ఊరిసివరున్న ఆరుమిల్లోల్ల రైసుమిల్లు పొగ్గొట్టంలా పొగొదుల్తా కనబడ్డకుర్రోన్ని
కేకేసి.. రాములోరి గుడిపై మైకుసెట్టులాంటి వాయిసుతో ప్రశ్నలమీద ప్రశ్నలేసి
కుల్లబొడిసేసే తాతారావు ఇంటి సందులోకి రావాలంటే అందరూ
బెంబేలెత్తిపోతుంటారు.
మూన్నెళ్ళకోసారి మగతాలకిచ్చేసిన పచ్చింగోదారి పొలం పనులు
సూసుకుంటానికని పదిపదిహేనురోజులు ఊళ్ళోలేనప్పుడు తప్ప
తాతారావు కబుర్లబాధ పల్లేక ఆ దొడ్లో పిట్టకూడా వాలటానికి
భయపడిపోతుంటాయి.
ఒకేళ తప్పుజారో.. మరిసిపోయో ఎవడైనా ఆ ఈదిలోకొచ్చి తాతారావు
కంటికి సిక్కాడా అంతే సంగతులు.. పిలిస్తే ఎల్లాల్సిందే., ఎళ్ళామా ఊళ్ళోవోళ్ళ
రాజకీయాలు కాన్నించి రాసలీలలొరకూ.., గుళ్ళో రాంభజనలు కాన్నించి...
పేటలో రచ్చబండ ఇషయాలవరకూ మెరకీది.. పల్లపీది ఇషయాలన్నీ.. ఏది
బుర్రలోకొత్తే అది గుచ్చి గుచ్చి అడిగి మొత్తం కనుక్కునే దాకా ఇడిసిపెట్టడు.
ఒకేళ ఎవరైనా "తెల్దండే..!", అన్నారా.. "ఏరా.. ఇయ్యన్నీ తెల్సుకోకండా
ఏం సెక్రాలు దొర్లించేత్తున్నావురా తొత్తుకొడకానీ..", లాంటి తిట్లు
తినాల్సొస్తాదేమోనని నోటికొచ్చింది సెప్పేసి బయటపడేటోళ్ళు కొందరైతే...
ఆడనుండి ఈడకీ ఈడనుండి ఆడకి.. టాపిక్సులు మార్సేసి ఎదోటిమాటాడేత్తా
బోల్తాకొట్టించేసేటోళ్ళు కొందరు. ఇలా అందరి బుర్రల్లోవున్నాగుంజును
బుర్రకొట్టకుండా బుర్రగుంజు తిన్నట్టు తినేత్తా కాలచ్చేపం చేసేత్తుంటాడు
తాతారావు.
ఓరోజు బాగా పొద్దుగూకినేల... వారంరోజులకితమే పుట్టి.. నల్లగా
నిగనిగలాడిపోతావున్న పెయ్యిదూడ.. పడతాలేత్తా కట్రాడుక్కట్టేసిన
తల్లిపొదుగులో పాలుకుడవటానికి ఎల్తున్న సమయంలో..
పాలేరు ఈరిగాడు.. గోదారిలంకల్లో మడిచేలు తొక్కుకుంటా
రంకేసుకొచ్చే నల్లాంబోతులాగా పరిగెత్తుకుంటా ఏసిన రంకెకి
బెదిరిపోయి.. పాకలోంచి దొల్లుకుంటా పక్కనున్నపేడగుట్టపై
పడిపోయింది.
పరుగుతీసి తీసి.. ఒక్కమారు బ్రేకేసిన చెఱుకు ట్రాట్టరులాగా
ఊగిపోతా తాతారావు కూర్సున్న పడక్కుర్చీ దగ్గర ఆగి.
"అయ్యగారో..! మన బెంజుకారొచ్చేసిందంటండే. ఇప్పుడే పల్లపీదిలోఉండే
ఎమ్మర్వో ఎంకటేస్వర్లుగారబ్బాయి సర్సాపురంనించీ.. పంటిమీద వత్తా
చూసారంటండే.., కారుమీదేనేమోననీ..ఆరిని ఇవరం అడగ్గా..
సఖినేటిపల్లి తాతారావుగారింటికే దెలిబరీ ఇస్తన్నాం... ఇంకో అరగంటలో
వచ్చేత్తందాని.. కాతంత ఆయనకి సొప్తారాని మీకు సొప్పమని
సొప్పేరంటండే...", అని ఆయాసపడిపోతా చెప్పేడు పాలేరు ఈరిగాడు.
అదియిన్న తాతారావు మీసంమెలేసి తొడగొట్టినంతపనిచేసి, జారిపోతున్న
పంచెను ఎగ్గట్టి.. ఉక్కసారిగా పడలక్కుర్సీలోంచి లేసి "పదరా ఈరిగా..
సరంజామా చెయ్యాలి.. మొత్తం ఈ గోదారిపక్క గామాల్లో అందరికీతెలిసేటంత..
దుమ్ములేచిపోవాలా.. ఎంత ఖర్సైనా పర్లేదు.. నువ్వు ఆ పన్లోవుండు..“,
అని ఈరిగాడికి పురమాయించాడు...
"ఒరే పాపిగా...!, మనింటికి.. జనాలొత్తున్నారో.. ఆ మూలమొక్కలెక్కే...
ఓ ఇరవై కొబ్బరిబొండాలు దించరా... దావతకే.." అని
ఇంటెనకాలా గడ్డికోత్తున్న పాలేరు పాపాన్నకి పనొప్పజెప్పేడు.
కాసేపటకి.. ఊరుఊరంతా ఇటేపే నడిసొచ్చేత్తన్నారేమో అన్నట్టు..
చింతపిక్కరంగున్న ఇ-క్లాసు బెంజికారు ఎనకాల సంక్రాతి పెద్దపండుగరోజు
తోటల్లోకోడిపందాలు సూడ్డానికి పరుగెత్తుకొత్తొన్నట్టు గుంపులుగుంపులుగా
జనాలొచ్చేత్తన్నారు. కొబ్బరిసెట్లనీడా.. మద్దెమద్దెన ఎండా.. పడతా…
సేపలేటకెళ్ళొచ్చి.. అప్పుడే గోదారొడ్డుకు సేరుకున్న ఏటపడవలాగా తళతళా
మెరిసిపోతావొత్తన్న పడవంతకారుని సూసిన తాతారావూ.., ఇంటిబయట
పెహారీగోడవతల సెట్లకింద నీడల్లో పొదుగుడు కోడిపెట్టల్లా కునుకుతా నిలబడ్డ
సంబరాల్లోల్లకి మొదలెట్టండ్రా అన్నట్టు.. సైగచేసేడు.., అంతే అప్పట్దాకా
పెసాంతంగా వున్న ఆ పెదేసం.. అంతరేది లక్ష్మీనర్సింసామి తీత్తంలో
సంబరాల్లాగా.. సెలరేగిపోయిన పులిడాస్సులు... బుట్టబొమ్మలూ..
సన్నాయి మేళాలోల్ల... సిందులాటల్తో మోతెత్తిపోయింది..
అలా ఓ అరగంటగడిసాకా, ఊరసెరువులో ఖజానా బాతీదుకుంటా
వత్తాంటే తూటుమొక్కలు సైడైపోయి తప్పుకున్నట్టుగా తప్పుకున్న
జనాల్లోంచొచ్చిన కారు.. రైయ్యిమంటా.. వొచ్చి గున్నమామిడి
చెట్టునీడనాగింది.
ఆ కార్లోంచి బెంజికారు సింబలున్న సూట్లేసుకుని.. దొరల్దిగినట్టుగా..
నలుగుదిగేరు. తెల్లబట్టల్లో మిలమిలా మెరిసిపోతా..
మెల్లెపూలసెంటుకొట్టుకుని.., ఫాండ్స్ పౌడ్రు మెడనిండా తెల్లతెల్లగా
కనిపించేలా రాసుకుని.. పదేళ్ళకీ.. పచ్చకుందనాల్లా మెరిసిపోతున్న
బంగారుంగరాలూ.. మెడలో దున్నపోతు కాళ్ళకి బంధమేసేంత లావున్న
చెయినూ ఏసుకుని.. బెంజికారును చూసి.. ఆనందంపట్టలేక భూమికి
అడుగున్నర ఎత్తులో గాల్లోతేలతా.. నిలబడ్డ తాతారావును చూసి ఈయనే
కారుకొన్న పెద్దమనిషి అననుకుని.. “నమస్తే సార్.. తాతారావుగారంటే
మీరేనా అని.. “, అడిగాడు ఆ నలుగుర్లో ఒకతను.
“అవునమ్మా నేనే..., ఒరే.. కుర్చీలేసే... బొండాలుకొట్టి పట్రండ్రా..",
అని పనోళ్ళని కేకేసి.. “కాళ్ళుకడుక్కుందిరిగానీ.. రండే!”, అని
పెళ్ళికొచ్చిన మొగపెళ్ళోళ్ళమల్లే ఆహ్వానించాడు తాతారావు.
వచ్చినోళ్ళు.. కాళ్ళుకడుక్కుని.. చెట్టుకింద కుర్చీల్లో కూర్చుని
బొండాలుతాగటం మొదలుపెట్టాకా... "ఏంటండే... అసలు ఇన్పర్మేషన్
లేకుండానే పపించేసేరో...?, పంపేదానికి రోజు ముందు సెప్పమని
బుక్కుచేసినప్పుడు సెప్పేనండే..", అన్నాడు తాతారావు.. అందులో
ఒకతనకి దగ్గరగా కుర్చీలాక్కుని కూర్చుంటా...
“లేదుసార్.. నాలుగురోజులనుండీ మీరిచ్చిన ఫోన్ నెంబర్లకు
ట్రైచేస్తున్నామండీ, మీకు ఇన్ఫామ్ చేద్దామని.., కానీ ఏనెంబరుకు
కలవలేదండీ.. “, అని వినయంగా చెప్పాడు ఒకతను.
"ఆయ్.. అలాగాండే... ల్యాండేమో.. మొన్న కొబ్బరితీతలో కమ్మడిపోయి
తెగిపోయిందండే..., ఇంకా బాగవలేనట్టుందండే..., ఇకపోతే సెల్ నెంబరు
సరిగ్గా సిగ్నలుండిచావదండే.., అయ్యయ్యో.. ఫోనుచేసిచేసి.. బాగా ఇబ్బంది
పడిపోయింటారండే..." , అని తెగ బాధపడిపోయాడు తాతారావు.
“అదేంలేదుసార్... బాగాలేటయిపోతుందని.. డెలివరీచేసేసాం సార్”,
అని. వేరేఅతను చెప్పాడు..
"మంచిపనిచేసారండే.., ఇలా తెలీకోకండా వత్తానే బాగుందండే.. ",
అని మీసాలు దువ్వుకుంటా నవ్వాడు తాతారావు.
ఇంగిలీషులో ఎమన్నామాటాడే అవసంమొత్తాదని.. ముందుగానే ఊహించిన
తాతారావు.. ఆవూల్లోనే బోర్డస్కూల్లో పనిచేస్తున్న ఎంకటరత్నం మాస్టార్ని
పిలిపించుకొచ్చి.. ఎనకే నిలబెట్టుకున్నాడు. కారుగురించి దాని మెయింటేనెన్సు
గురించి చెబుతుంటే.. అదిచూసి బాగా గుర్తుపెట్టుకోండి.. అన్నట్లు ఎనకున్న
ఎంకటరత్నం మాస్టారేపు తిరిగి సైగచేత్తావున్నాడు.
కారున్జూసి.. ఉబ్బితబ్బిబ్బైపోయిన తాతారావుని.. వూరువూరంతా పొగడ్తలత్తో
ముంచేసి.. ములగసెట్టెక్కించేసి.., పెద్దపార్టీ ఇవ్వాలంటూ బుట్టలోపడేసేరు.
ఇక ఆవారంచివర్లో జనాలపట్టుమీద ఊరిసివర కొబ్బరితోటలో బోజనాలు,
సంభరాలు, రికాడ్డింగు డ్యాన్సులు ఏర్పాటుసేయించేడు.. తాతారావు.
పెద్దొరసనాటుకోడి మాసం, ఏటమాసం.. చించినాడ నుండి గుడ్డిపీతలు,
బొమ్మిడాయిలూ.. రావలు.. పులస లాంటి. పదేను రకాల నాన్ వెజ్
ఐటమ్సుతో ఏర్పాటుసేసిన భోజనాలు తినీ.., సంబరాలు సూసి జనాలు
తెగ సంబరపడిపోయారు.. , “ఒకాడపిల్లపెళ్ళిసేసినంత ఘనంగా చేసార్రా
తాతారావుగోరా.. “, అని ఎటుసూసినా సుట్టుపక్కనున్న అయిదు
గ్రామాలకు తగ్గకుండా మహా ఇంతగా సెప్పుకున్నారు..
ఓరోజు అంతరేది గుళ్ళో కారుకు పూజ్చేయిద్దామని రాములోరి గుళ్ళో
పూజారి శర్మగారిచేత ముహుర్తం పెట్టించి.. కారేసుకుని అంతరేది
బయలుదేరిన తాతారావు.. కూడా పాలేరు ఈరిగాడిని ఎక్కించుకున్నాడు.
"అయ్యగోరో... సీట్లేంటండే... దూదిపింజల్లా మెత్తమెత్తగా ఉన్నాయే..
భలేగుందండే బాబో...", అని ఈరిగాడనేసరికి.. మీసంమెలేసి
“మంరేంటనుకున్నావ్ బెంజికారంటే..”, అన్నాడు తాతారావు.
తాతారావుకి డ్రైవింగు కొత్తేమీకాదు.. పెద్దపెద్దగడ్డిమోపులూ.. చెరుకూ
ఏసుకుని.. గతుకులరోడ్డుల్లోకూడా తొనక్కుండా ట్రాట్టరునడిపిన
అనుభవముంది.., సొంతంగా కారులేకపోయినా.. కొత్తగాకనిపించిన
కారులన్నీ నడిపిచూసినోడె.. కాకపోతే.. ఇంకా అలవాటుగాని
కొత్తకారు కావటంతో కొంచెం ఊపుపులుగా లాగిస్తున్నాడు.., టర్నింగుల్లో
రోడ్డు మార్చిను దాటేసి పొలాల్లోకి పోనిచ్చేత్తా.. ఒక్కోసారి ఎక్కవ తిప్పేసి
వేరేపక్కి దూకించేత్తావున్నాడు..
ఇదంతా గమనించిన.. ఈరిగాడు.. “అయ్ బాబోయ్ అదేటండే..
తిరక్కుండా దూకేత్తాందా.. నన్నడిగితే ఈ పడవంతకారుని తిప్పటం
చానాకష్టమండే... మొన్న కొయిటానుండొచ్చిన గిరిగి పద్దనాబం
మనవడు ఆలుటోనో ఎటోనంటండే.. లక్కపిడతంత వుందండే..కోరో,
గొబ్బిరిగాయలతీతకి ఓరోజు పొలందగ్గరకి ఆ బండిమీదే తీస్కెల్లేడండే..
పొలాల్లోవుండె పచ్చ మిడద్దూకినట్టు దూకి... సిన్న సిన్న సందుల్లోగూడా
తిరిగేత్తందండే.. అదా...", అన్నాడీరిగాడు.. యమాసీరియస్ గా
బండినడుపుతున్న తాతారావొంకే చూత్తా.
"ఓరి.. సన్నాసెదవా..!!, రెండున్నర లచ్చలకారుకీ... ఏబైలచ్చలకారుకి
పోలికేంట్రా... దీంతో అలాంటియ్యి ఇరవైముప్పైగొనచ్చు..., అయినా
సింవాసనం మీదున్న కుక్కకేం తెలుత్తాదిరా ఇలువా..., దిన్నే పవరు
స్టీరింగంటారు.. ఇంత దిప్పితే.. అంత దిరుగుద్దు.. నాకింకా అలవాటుగాక
దూకేత్తందిగానీ.., అలవాటవ్వాలా... అప్పుడుదెలుత్తాది.. నా సామిరంగా..,
దీని ఎవ్వారమేంటో.. , అయినా.. కూడా నిన్నేక్కించుకురాటం..
నాదేబుద్దక్కువా...రా..", అని చెడామడా తిట్టేసరికి.. ఈరిగాడు
నోరుమూసేస్కుచ్చున్నాడు.
ఓపక్క తిట్లు తిడతానే ఉన్నాడు.. ఓ పక్క సీరియస్‌గా కారు తోల్తానే
వున్నాడు.. కారుఅటుదిప్పుతా ఇటుదిప్పుతా ఊపుపులుగా లాగిత్తానే
వున్నాడు.. తాతారావు.
కాలవమొగ రోడ్డు పెదవొంపుదగ్గరికొచ్చే సరికీ పెద్ద గేదెలమంద అడ్డొచ్చింది..
"ఎవడ్రీడా ఎదవ ఈ మందనంతా ఇక్కడెక్కిచ్చాడా..", అని తిట్టుకుంటానే..,
కుప్పనూర్పుల్లో ట్రాట్టర్ స్టీరింగు తిప్పినట్టు.. స్టీరింగు మీదకంటా పడిపోయి
మొత్తం మట్టానికి తిప్పేసేడు తాతారావు.. బండి గేదెల్ని తప్పించుకుని..
వొక్కసారిగా.. ఎడంవైపున్న బోదెలోకి దూకబోయింది.., అదేకంగార్లో..
బ్రేకనుకుని.. ఎక్షెలేటర్ మీదకాలేసి.. లోనకంటా తొక్కేసేడు..
సినిమాల్లో రేసుకారు దూకినంత దూకుడుగా.. పంట కాల్వ దూకి..
అవతలున్న కొబ్బరితోటలోకి ఎగిరి... ఓ చెట్టుమొదల్ని దబేలుమంటా
గుద్దేసింది. ఆ సౌండు మొత్తం సఖినేటిపల్లంతా ఇనబడిపోయింది..
59 కామెంట్లు:
thatharao photo petti unte bagundedi. :)
అయ్యబాబోయ్ ..బాబోయ్ ..తవరు మన పస్సిమ గోదరోల్లేనేటి ..
సానా బాగా రాసారండి .ఇంతకీ ఈ తాతారావుగారు ఇప్పుడున్నారండి .ఆబెంజి ఏవయిందంటారూ .
ఏం బాబూ, వంశీ గారి ' మా దిగువ గోదావరి కథలు' ఆపేయమని చెప్దామా? నువ్వు ఇలాటి బ్రహ్మాండమైన కథలు చెప్పేస్తుంటే, ఇంక ఆయనవి ఎవరు చదువుతారూ? గ్రేట్ !!!!!!!!!!!
good one!@
idanthaa nijangaa jarigindaa? baagaa raasaaru.
చాలా చాలా బాగు౦ది....తాతారావు ని కళ్ల ము౦దు చూపి౦చారు.. ముఖ్య౦ గోదావరి స్టైల్ సుపర్ రాశారు..ఒక్క క్షణ౦ వ౦శీ కధ చదువుతున్నానా అనిపి౦చి౦ది...
@స్వప్న గారు
బొమ్మలేయటం పెద్దగారాదండి.. లేపోతే.. ఇరగదీసేసి ఎసేద్దున్నండే.. ఆయ్.. :)
మీ కామెంటుకు ధన్యవాదములు.
@రాధిక గారు
అయ్ బాబోయ్ అంతమాటనేసేరేటండే.. బ్లాగు పేరే.. పచ్చింగోదారండే.., తాతారావుగారు కల్పితంగానీ అలాంటోల్లు ఉండేవుండొచ్చు.., అంతేనండి కధ అక్కడితో సుఖాంతం అయ్యింది..
మీ కామెంటుకు ధన్యవాదములు.
@ఫణిబాబు గారు
చాలా సంతోషమండీ.. కధమీకు నచ్చినందుకు.. వంశీగారితో పోలికా!! అమ్మో.. నేనూ ఇలాంటివి రాయగలనోలేదో అన్న చిన్న ప్రయత్నమే కానీ.. అన్నీ సొంతపదాలే వాడానండోయ్.. నేను రాసింది రాసిన్నట్టు జనాలు అర్ధంచేసుకుంటారో లేరో అని భయపడ్డాను..
మీ కామెంటుకు ధన్యవాదములు.
@junk గారు
మీ కామెంటుకు ధన్యవాదములు
kaasintha maa too go jilla gurunchi kooda rayandi babayya.
@శ్రీ గారు
కేరక్టర్స్, కధ అన్నీ కల్పితాలేనండి. మీకు నచ్చినందుకు ధన్యవాదములు
@సభద్ర గారు
నా శైలి నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.. చదువుతుంటే వంశి కధ గుర్తొచ్చిందంటే.. నా ప్రయత్నం ఫలించినట్టేనండి..
ధన్యవాదములు.
Great man, nenu inka ee thatha rao nijamgane unnadanukunna.
శ్రీనివాసరాజు గారూ,
బాగుందండీ కత...అప్పుడప్పుడూ వంశీ గారు గుర్తొచ్చారు...మీది మంచి పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ లా ఉందే..చక్కటి పల్లె'పదాలు' వినపడుతూంటే, మనసుకి హాయిగా ఉంది...మంచి శైలి..
Hi Nivas ur Narration is nice.
lucky to find ur blog..
@Kiran Chowdary
Guntur
FANTASTIC.
రాజూ, మీరింకా తరచూ రాయకపోవడం ఐపీసీ 453 కింద తీవ్ర నేరంగా పరిగణించ బడుతుంది.
నా వుద్దేశంలో వంశీ రైటింగులో ఇంత పస లేదు.
annayya naku emani comment ivvalo teleyatam ledu...
nee kadhalu naku malli malli chadavalani pistundi..
రాజు గారూ,
ఆయ్..చాలా బాగా రాశారండి. నేను భీమవరం లో ఇంజినీరింగు చదివినప్పటి మంచి రోజులు గుర్తుకొచ్చాయి మళ్ళీ. ఆ మాటలు, ఆప్యాయతలు. తరచుగా రాస్తుండండి.
-నేనుసైతం
హ హ బాగుందండి మొత్తానికి గోదారోళ్ళ గొప్పతనం ఆ కధ ఎట్లా ఐనే వేరు.... ;-)
చాలా బాగా రాసారండి.
అందరికి వంశీ గుర్తొస్తే, నాకు వంశీతో పాటు ఆహుతి ప్రసాద్ కూడా గుర్తొచ్చాడు.
@ సత్య గారు
అసలు రాసిందే తు. గో. జిల్లా అండే.. రామాయణం అంతా సదివేసి రాములోరు సీతమ్మ తల్లికి ఏమౌతారు అన్నట్లున్దండే..:)
మీ కామెంటు కి ధన్యవాదములు
@కౌటిల్య గారు
నా కదా శైలి నచ్చినందుకు ధన్యవాదములు
@కిరణ్ గారు
మీ కామెంటుకు ధన్యవాదములు
@కొత్త పాళీ గారు
అమ్మో చాల పెద్ద పోలికే :) చాలాచాలా ధన్యవాదములు.
అంత పెద్ద పెద్ద సిచ్చలోద్దండే బాబో .. రాసేత్తున్తనో.. సదివేసేయ్యండి మరి :)
@శ్రీనివాస రాజు
తమ్ముడు నా కధ నచ్చినందుకు ధన్యవాదములు
@నేనుసైతం గారు
తప్పకుండ రాస్తుంటా
@భావన గారు
మరదేనందే.. మా గోదారోల్ల గొప్పతనమో.. :) , ధన్యవాదములు
@ బోనగిరి గారు
ఆహుతి ప్రసాద్ కూడా తు.గో.జి. యాసను బాగా పండించాడు .. నా కదా శైలి నచ్చినందుకు ధన్యవాదములు
శ్రీనివాసరాజు గారూ,చాలాబాగా రాశారు...అధ్బుతమైన శైలి. లేత కొబ్బరినీళ్లు తాగినట్టుంది.మీరు ఇంకా గోదావరి యాస లో బోల్డన్ని కధలు రాయాలి!---భాస్కరభట్ల
@భాస్కరభట్ల గారు
తప్పకుండానండి.. లేతకొబ్బరినీళ్ళు ఇంకా తాగిస్తా..:) ఇదే యాసలో ఇంకా రాయాలనుంది. నా టపా మీకు నచ్చినందుకు ధన్యవాదములు.
యాస (accent) వేఱు. మాండలికం వేఱు. యాస ఉచ్చారణకి సంబంధించినది. మాండలికం స్థానిక పదజాలానికి, వ్యాకరణభేదాలకీ సంబంధించినది. యాసలో వ్రాయలేం. మాట్లాడగలం అంతే.
--తాడేపల్లి
@తాడేపల్లి గారు
సరేనండి. ఇప్పటినుండి.. యాసలో మాట్లాడుకునే మాటలను ఉపయోగిస్తూ కధలువ్రాస్తుంటాను.. :)
తెలియని విషయాలు చక్కగా వివరించి చెప్పినందుకు ధన్యవాదములు..
Let me elaborate further with your permission. Yaasa basically consists of Start and Stop points of a sentence or those of a word.
The stress we put on different letters in a word, intonation, emphasis, voice modulation - all these combine to form Yaasa. Every langugae or Maandalikam has its own music in speech, That is called Yaasa.
రాజుగారు, కథ రచ్చండి(అంటే మా ఊర్లో సూపరని).
ఈ కథకు బాపూ బొమ్మొక్కటే తక్కువ.
intha pedda stories raste chadavadam kastam...
@ చైతన్య క్రిష్ణ పాటూరు గారు
కధ నచ్చినందుకు చాలా సంతోషం.
బాపుబొమ్మవుంటే ఏ కధైనా సూపరేమోనండి... మీ పోలిక చాలా పెద్దదే... చాలా చాలా ధన్యవాదములు :)
@ ప్రదీప్ గారు
తప్పదండి మరి కధకు అర్ధం ఉండాలంటే.., కొన్ని ఐడియాలు కాన్సెప్ట్ బట్టి, అందులోనే రాస్తే బాగుంటాయి అవి వేరే కధకు లేక బ్లాగుకు రాద్దామనుకుంటే బాగోకపోవచ్చు.. అందుకే అన్నీ ఒకేదాంట్లో రాయాలంటే కధ కాస్తపెద్దదవ్వొచ్చు ఒక్కోసారి.
ఎంది బెంజి మీ అంద్రొల్లేన కొనెది మా తెలంగణ వాల్లు కొన లెర.బంచెంద్ మేము కొనగాలం.ఆద్యక్షా దినిని మా తెరస పార్టి పుర్తిగా కండిస్తునము.దినికి చంద్రబాబు నాయుడు మళ్ళ శ్రీనివాస్ రాజు తెలంగణ ప్రజలకు క్షమపన చెప్పలి లేకపొతె రాజు హైదరబాద్ లొ జాబ్ ఎల చేస్తాడొ మా ఉస్మనీయ పొరగండ్లు చుస్తారు .జై తెలంగణా. K.C.R
శ్రీనివాసూ,
నీ ప్రొఫైల్ లో
ఇప్పుడు.. హైద్రాబాద్.' అనేది, మార్చి పూణే అని వ్రాయి బాబూ.3 సంవత్సరాలనుండి ఇక్కడ ఉంటున్న ఇంకా ' పూణే కర్' అవకపోవడం బాగోలేదు !!
@సురేష్ మక్కిన
ఏం బాబు మేం హైద్రాబాద్ లో లేం.. ప్రస్తుతం పూణేలో ఉన్నాం.. ప్రత్యేక మహారాష్ట్రా లాంటి గొడవలు లేనంతకాలం మాకా తలనొప్పిలేదు. ఇక్కడైనా ప్రశాంతంగా ఉండనియ్యండి బాబు.. :)
నీ కామెంట్ కి ధ్యాంక్స్ రా..
@ఫణిబాబు గారు
గురువుగారు.. మార్చేసానండి..
వచ్చి మూడేళ్ళు ఎక్కడయ్యిందండీ.. ఇంకా సంవత్సరం కూడా అవలేదు. :)
Baaga experience unna seasoned writer laa rasaaru. Naaku baaga nachinadi entante pedda blog ayina ekkada aksharam pollupokunda rasaaru.
@ నా తరై గారు
బ్లాగు మీకు నచ్చినందుకు ధన్యవాదములు.
త్వరలో ఇంకా మంచివి రాబోతున్నాయి.. పెద్దవి అని వదిలేయక చదవండి మరి :)
శ్రీనివాస రాజు గారూ,
కొంచం ఆలస్యంగా చదివాను.. ఆసాంతమూ వంశీనే గుర్తు చేశారు.. అక్కడక్కడా మాండలికం తడబడింది. ఎంగిలి చేత్తో కాకిని తోలని తాతారావు అంత గొప్ప విందు ఇవ్వడాన్ని మరికొంచం జస్టిఫై చేసి ఉండాల్సింది.. చక్కని ప్రయత్నం.. అభినందనలు
@మురళి గారు
గొప్పకోసం ఖర్చుపెట్టే టైపు మనుషుల్లో తాతారావు ఒకడు అని ఎక్కడైనా చెప్పి వుండాల్సింది.., అది నేను మరిచాను. మంచిపాయింటు పట్టుకున్నారు.. , (మీరు సాఫ్ట్వేర్ లో టెస్టర్ కాదు కదా??) :)
మీ కామెంటుకు ధన్యవాదములు.
Nice. All the best. May be on one day you can win the hearts of all people who appreciate this sort of literature. why dont you try to put all this some movie. it will be fun.
@శ్రీరామ్ గారు
నా కధ నచ్చినందుకు సంతోషం, మీ కామెంటుకు ధన్యవాదములు.
కధలో వర్ణనంత అందంగా సినిమాలు తియ్యగలమంటారా? కధ చదువుతున్నప్పుడు ఎవరికి నచ్చినవిధంగా వారు అన్వయించుకోవటం మూలానా మనసునుదోచుకోవచ్చు. కానీ తెరమీద ఒక దర్శకుని ఊహని మాత్రమే చిత్రించడం వల్ల అందరిమనసులను దోచుకోలేదని నా భావన.
అయినా సినిమా కళవేరు, ఈ కళవేరు.. ఏమంటారు :)
నేను చేసిన ప్రయోగాల్లో నాకు 'తాతారవు బెంజికారు' కన్నా 'గొల్లకావిడి' బాగా నచ్చింది. కానీ అందరికీ మొదటిదే నచ్చినట్లు అనిపిస్తుంది.. అందరినీ మెప్పించడం కత్తిమీద సామేనండోయ్..:)
ఏదోక రోజు అందరి మనసులను దోజుకుంటానన్నారు చూసారు.. అదిచాలండీ ఇంకా మరిన్ని ఇలాంటి కధలు రాయటానికి.
Raju gaaru,
katha chaala chaala bagundi.
'గొల్లకావిడి' katha lo heart ni touch chesaaru. Ee katha chadiniva taravaata 'ayyo papam' anipinchaaru.
@ బాటసారి గారు
గొల్లకావిడి కధ నచ్చినందకు సంతోషం.. :)
Chalaaaaaaaaa baaga raasaaru :) :)
Chaduvutunnanatasepu...ala pakkaki kadalani kuda anipinchanantagaa kattipadesaru... :):)
AWESOME
kadalaalani*
@స్వేచ్ఛాగారు.
తాతారావుగారి బెంజికారా మజాకానా..!!! :)
మీరు కదలకుండా చదివినందుకు చాలా సంతోషం.. :)
ఇలానే నా బ్లాగు చదువుతారని ఆశిస్తున్నాను.. (కదలకుండా అని కాదు... రెగ్యులర్ గా అని.. :) )
"ఆ సౌండు మొత్తం సఖినేటిపల్లంతా ఇనబడిపోయింది"..
హ్హహ్హహ్హ ఆ సౌండ్ మా దాకా కూడా వచ్చింది శ్రీనివాస్ రాజు గారూ. అద్దరగొట్టేహారంతే.
మిగతా విషయంలో "మురళీ" మాటే నా మాట కూడా
@శ్రీనివాస్ పప్పు గారు
"కారున్జూసి.. ఉబ్బితబ్బిబ్బైపోయిన తాతారావుని.. వూరువూరంతా పొగడ్తలత్తో
ముంచేసి.. ములగసెట్టెక్కించేసి.., పెద్దపార్టీ ఇవ్వాలంటూ బుట్టలోపడేసేరు."
ఈ పేరాలో చెప్పిన విధంగా జనాలు అతన్ని బుట్టలోపడేసారు.. పిసినారి తాతారావుచేత కూడా పార్టీ ఇప్పించుకున్నారు.. :-) (మనం మాములుగా ఇలాంటి జనాలను చూస్తుంటాం.. డాబు కోసం తెగ ఖర్చుపెడతారు..)
ఇది నేను మురళి గారికి కామెంటు రాసినప్పుడు ఆలోచించలేదు.. కానీ మీరిద్దరూ అన్నట్టు కాస్త జస్టిఫై చేసుంటే ఇంకా బాగుండేది.. అది నిజమే.. :-)
ఇక మాండలికం అంటారా.. మొదటిప్రయత్నమే కదండీ.. ఇంకా బాగా ట్రైచేస్తా..
ఏబైలచ్చల బెంజికారండే.. మరామాత్రం సౌండు రాదేంటీ... :-)
ఏదేమైనా మీ అందరి అభిప్రాయాలు నాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి.. దానికి చాలా ఆనందంగా వుంది.
బాబోయ్ నవ్వలేక పొట్టపగిలేలా ఉంది...ఏం భాషండీ బాబూ...ఇరగదీసారు. ప్రతీ కదలికకి ఓ పోలిక పెట్టి కేకపెట్టించారు....మీకు మీరే సాటి.
మీ బ్లాగుని నేని చాలా లేట్ గా చూసాను. మొన్ననే "ఐడియా" తో తెలిసింది ఇలా నవిస్తారని. ఇంక అన్ని పోస్టులు టక టకా చదివేస్తా.
@సౌమ్య గారు
నా బ్లాగు నచ్చినందుకు సంతోషమండీ.. మీరలానే నవ్వుతూ.. కేకలుపెడుతూ అనందిస్తారని ఆశిస్తున్నాను. :-)
మీ శైలిలో చాలా అద్భుతంగా రాసారు
అభినందనలు
@హరే కృష్ణ గారు
నా శైలినచ్చినందుకు సంతోషం.
మీ కామెంటుకు ధన్యవాదములు.
very well written in godavari accent.
Really excellent.
@స్వాతిగారు
ముందుగా మీ వ్యాఖ్యకు ధన్యవాదములు..
మా గోదావరి మాటలు నచ్చినందుకు సంతోషం.
అయబాబోయ్ మా గోదావరి అంటారేంటి
కన్నవారిది విశాఖపట్నం అయినా అత్తవారిది పశ్చిమ గోదావరి
జిల్లా తణుకు అండి. ఆయ్
నివాస్ గారు. మీది పశ్చిమ గోదావరి జిల్లా అంటున్నారు కదా. అందులో ఏ ఊరు? మేము 2002 నుంచి 2006 వరకు తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఉండేవాళ్లం. పక్కనే వశిష్ట గోదావరి నది. నదికి ఇవతల తూర్పు గోదావరి, అవతల పశ్చిమ గోదావరి. వరద గట్టు మీద నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొబ్బరి తోటలు కనిపించేవి. నేను నరసాపురంలో వెబ్ డిజైనింగ్ నేర్చుకునేటప్పుడు సఖినేటిపల్లి రేవుకి బస్ లో వెళ్లి అక్కడ పంటి (పెద్ద మోటర్ బోటు) ఎక్కి రేవు దాటేవాడిని. పంటికి మీదకి కార్లు, జీపులు కూడా ఎక్కుతాయి. ఎంత సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్న ప్రాంతమని చెప్పుకున్నా అక్కడ కార్లలో తిరిగేవాళ్లు తక్కువే. కార్ కొనుక్కుంటే ఇంటి ముందు పార్కింగ్ ప్లేస్ ఉండాలి కదా.
@స్వాతిగారు
మీది తణుకేనా.. అయ్ బాబోయ్.. ఈ విషయం మన మిగతా తణుకోళ్ళకి చెప్పాలి. :-)
@ప్రవీణ్ శర్మగారు
మావూరుగురించి "గోపాల్రాజు గేదెలబేరం" కధలో కామెంట్లలో రాసాను చదవండి. (మళ్ళీ రాస్తే డబ్బాకొడుతున్నాడు అంటారేమో మిగతా జనాలని..) మా అత్తవారిది సఖినేటిపల్లి. :-)
కానీ మీరు 2006 విషయం చెబుతున్నారు.. ఇప్పుడుచూడండి ఆ ప్రాంతాలెలావున్నాయో.. మార్కెట్లోకొచ్చిన కొత్తకార్లన్నీ కనబడతాయి. :-)
anni bavunnai keep it up
@శ్రీనివాసరావు గారు
మీ కామెంటువల్ల నేనుకూడా చాలారోజులతరువాత మళ్ళి తాతారావుగారిని పలకరించాను. సంతోషం. మీ కామెంటుకు ధన్యవాదములు.
రాజుగారు,
కథో, నిజమోగానీ కధనం మాత్రం సూపర్, సూపరండి..బాబూ!
మా ఊరెల్లిన ఫీలింగ్ వచ్చేసిందండి..ఆయ్
కామెంట్‌ను పోస్ట్ చేయండి