4, ఫిబ్రవరి 2010, గురువారం

'జంపో'పదేశం.



ఇది ఒక జూనియర్ బ్రహ్మీసాఫ్ట్వేర్ ఇంజనీరుకు ఒక సీనియర్ బ్రహ్మీసాఫ్ట్వేర్
ఇంజనీరు, ఉద్యోగం మారమనీ.. మారకపోవటంవలన కలిగే కష్టనష్టాలను

వివరించి చెప్పిన ఉపదేశముల సారాంశం.
-------------------------------------------------------------

నాయనా.. బ్రహ్మీ... "లాప్టాప్ లో చార్జింగ్ ఉన్నప్పుడే చేసిన వర్కును సేవ్ చేసుకోవలెను..."
తరువాత "అయ్యో shutdown అయిపోయిందే!", అని ఎంత ఏడ్చినా లాభంలేదు...,
కావునా జంపుకు సమయము ఆశన్నమయినది... త్వరగా మంచి
నిర్ణయంతీసుకుని జంపుకు సిద్ధంకమ్ము...

"తుమ్మితే ఊడిపడిపోయే ముక్కూ... అమెరికా వాడు తుమ్మితే ఊడిపోయే ఐ.టి. ఉద్యోగమూ
రెండునూ ఒకటే" అని తెలుసుకొనుము... రిషెషన్ టైములో నువ్వు బిల్లింగ్ లో(ప్రాజెక్ట్ లో)
ఉన్నావు కాబట్టి నీ కంపెనీ నిన్ను కాపాడిందే కానీ.. నీపై ప్రేమతో నీకు పింక్ స్లిప్ ఇవ్వకుండా
ఉందని తలచి భ్రమపడి కనికరం చూపవలదు.

ఈ కంపెనీలూ మనకు పదే పదే చెప్పే "కారెవ్వరూ మాకు సొంతవారు... కారెవ్వరు మాకు
శత్రువులు", అనే విషయం గుడ్డిగా నమ్ముతున్నావా? సొంతవారు కాకపోతే... నేను
పారిపోతానురోయ్ అని మొత్తుకున్నా వినకుండా.. బ్రతిమలాడి.. బుజ్జగించి... హైకులు
ఎక్కువ ఇచ్చి కొంతమందినే ఎందుకు కుర్చీలలో కుర్చోబెట్టారు.?
శత్రువులు కాకపోతే... నాకు ఈఈ విషయాలు నచ్చలేదు అని రిజైన్ చేసినా.. వాళ్ళతో
మారు మాట్లాడకుండా, ఎందుకు వెళ్ళిపోతున్నావ్ అని అడగకుండా... కొంతమందినే
ఎందుకు రిలీవ్ డేట్ ఇచ్చిపంపిచేసారు?. అందరూ ఒకటే అని చెబుతూనే మరి
ఎందుకీ తారతమ్యం?

నీ చింత నాకు అర్ధమైంది నాయనా.. "ఏమీ లేని ఎడారిలో ఆముదము చెట్టే
మహా వృక్షము" అనుకుని రిషెషన్ టైములో కంపెనీని నమ్ముకుని.. ఆ లోగోను ఫొటో
కట్టించి పూజించుకున్న నేను ఇప్పుడు ఆ కంపెనీకి.. ఆ లోగోకు.. ఎలా దగా చేసి బయటకు
పోగలను అనుకుంటున్నావా? చేసేది చేయించేది నువ్వుకాదు నాయనా...
"నీవు నిమిత్తమాత్రుడవే కానీ సి.యి.వో వి కాదుగా!!", నీది కానిదానిమీద
ఎందుకంత చింతన?.

"ఏ ఎండకు ఆ గొడుగూ... , ఏ జంపుకు.. ఆ మాటా..." చెప్పని వాడు
"ఈ ఇండస్ట్రీలో పడ్డ ట్రైనీలాగా కొట్టుకుచావాళ్ళిందే...!", "పట్టి పట్టి పెట్టిన పంగనామం
కదా.. అని నచ్చకపోయినా అదే పెట్టుకుని చెరుపుకోకుండా.. తిరుగుతావా?".. ,
ఇదీ అంతే... నచ్చినచోటకే పయనం.. వచ్చిందే కట్నం.

పాపం నేను వెళిపోతే మా మేనేజరు ఎమైపోతాడో, మా HR ఏమనుకుంటాడో
అని అలోచిస్తున్నావా? హ హ హా.. పిచ్చివాడా!... "శతకోటి లింగాలలో ఒక బోడిలింగం నువ్వు...",
ఒకప్పుడు పాటంటే ఘంటశాలగారే పాడాలి అన్న జనం.. ఆయనలేకపోతే
మిగతావాళ్ళచేత పాటలు పాడించడం మానేశారా?,
ఇప్పుడు బాలూ పాడుతుంటే ఘంటశాలగారిలా లేదే... అని వినేవారు వినటంమానేశారా?.

"పాతనీరు పోతుంది కొత్తనీరు వస్తుంది...", నీ జంపు.. ఎక్కడా చూడని చోద్యమూ
కాదూ... ఎవ్వరూ చెప్పని సినిమా స్టోరీనూ కాదూ... "ఎవరి తాతలకు నువ్వు దగ్గులు
నేర్పటమూలేదూ..." ఈ జంపు అనేది ఒక సహజ ప్రక్రియ నాయనా,
దానిని ఎవరూ ఆపలేరు...

అయినా ఈ రిషెషన్ టైమును అనువుగా చేసుకుని "ఎద్దుపుండు కాకికి ముద్దు"
అన్నట్లుగా మాటలతోనూ... చేతలతోనూ.. నిన్ను పొడుచుకు తిన్న మీ మేనేజరు
గురించా... నువ్వు ఆలోచించేది??.

"తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లు కుట్టిందన్నట్లు"... నువ్వుచేసే పనేంటో.. నువ్వు
ఎక్కడకుర్చుంటావో.. ఎలా ఉంటున్నావో, ఎలా తింటున్నావో కూడా తెలియని,
తెలుసుకునే అవసరంలేదు అని... నీ వీక్నెస్ లను, నీ చేతకానితనాన్నీ అలుసుగా
చేసుకుని.. పెత్తనం తీసుకుని.. నిన్ను కుట్టిచంపిన HR మేనేజరు గురించా...
నువ్వు ఆలోచించేది??

ఇతరులకు చెప్పటానికే ఆ నీతులు గానీ.. వాళ్ళకు సమయమొస్తే..., మంచి ఆఫర్ వస్తే...
వారూ ఉండరు నాయనా..., ఈ జంపు ప్రవాహంలో వారూ కొట్టుకుపోతారు...

ఈ అలోచనలు మాని నువ్వు ముందడుగు వెయ్యి నాయనా...
"సిగ్గువిడిస్తే ఇక ఆన్ సైట్ ఆఫరే" అని తెలుసుకో...

నీలో స్కిల్స్ ఉన్నంతకాలం..., నీవల్ల డాలర్స్ రాలుతున్నంతకాలం...,
నువ్వు ఒక్కరోజు ఆఫీసుకు రాకపోతే ఎక్కడ పని అక్కడ ఆగిపోయినంతకాలం...
"పిల్లి శాపాలు ఉట్టిని తెంచలేవు" అన్నట్లుగా ఎవరూ నీ కీబొర్డులో ఉన్నఒక్క 'కీ' ను
కూడా పెగల్చలేరు అని గుర్తుంచుకో...

మన ఉద్యోగాలగురించి మనకు తెలియనవి కాదుగా... అందుకే
"మంచమున్నంతవరకూ కాళ్ళుచాచుకోవాలి", గవర్నమెంటు ఉద్యోగిలాగా...
రిటైర్మెంటు ఉండదు... పెన్షన్ ఉండదు..., జీతమే కాని బత్యం ఉండదు..
"క్షణంతీరికా ఉండదు... పైసా జేబులో ఉండదూ".

ఇప్పటివరకూ ఎన్నిరాళ్ళువెనకేసావో ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే..,
క్రితం వారమే డాక్టరు ఇచ్చిన స్కానింగు రిపోర్టుప్రకారం కిడ్నీలో నాలుగూ,
పిత్తాశయంలో రెండూ..., ఈ రాళ్ళు తప్ప ఇంకైమైనా రాళ్ళు వెనకేయబడి
ఉన్నాయా ఉండవు అని నాకు తెలుసు నాయనా.

గ్యాస్ ధరపెగిగినా... పెట్రోల్ ధరపెరిగినా.. నిత్యావసర వస్తువుల ధరలు..
మండి మసైపోతున్నా ఆ జీతంలోనే భరించాలిగా...!
గవర్నమెంటు ఉద్యోగిలాగా నేనూ బల్లకింద చేతులు పెట్టగలను అనుకుని
చేతులు పెడితే... అక్కడ దొరికేవి కీబోర్డు వైర్లు, మౌసు వైర్లు తప్ప..
చేతికేమీ దొరకవు నాయనా.

మేనేజరు ఎప్పుడో భూమి పుట్టినప్పుడు చేసిన బాసలు తలచుకుంటూ.. ,
ఇదిగో ఈ నెల జీతంతో వస్తుంది.. క్రితం నెల జీతంతోనే రావాలే?,
తరువాత నెల జీతంతో వస్తుందేమో..?, అని ఇస్తానన్న హైకునే తలచుకుంటూ...
"అందని మ్రానిపండ్లకు అర్రులు చాచి..." కాచుకుని కూర్చుని... ఎన్నాళ్ళు ఇలా
"నల్లమేఘాలను చూసి ఎడమచేతి దగ్గర ఉన్న చెంబులో నీళ్ళను ఒలకబోసుకుంటావు?,
అన్నీఎండబెట్టుకూర్చుంటావు చెప్పు?"

మనదగ్గరే కూర్చుంటున్నాడు, మనవాడే అనుకునేవు..
"మేనేజరు కూడా ఆ తాను ముక్కే నని" తెలుసుకో నాయనా..

ఈ బాధలన్నీ ప్రక్క సీట్లో పనిలేని కోలీగ్ తో చెప్పుకుంటే..
"నీ చెవికి రాగిపోగులైనా ఉన్నాయి... అవి కూడా నాకు లేవే?",
అని ఒకరిని పట్టుకుని ఒకరు ఏడవవలసివస్తుంది...,
ఇలా టెస్టర్ బాధలు డెవలెపర్ కు.. డెవలెపర్ బాధలు టెస్టర్ కు
చెప్పుకుంటూ... రాసుకుని పూసుకుంటూ తిరిగితే..
రాలేవి బగ్గులే కానీ డబ్బులు కాదు.. నాయనా.

ఫలానా పద్మారావు ఐదేళ్లనుండీ ఒకటే కంపెనీలో మూలిగి ముక్కుతుంటే..,
సన్మాన సభ పెడతామన్నారు కంపెనీ వాళ్ళు..., ఇంకేముంది.. పద్మారావు కల పండింది,
ఒక పెద్ద చెక్కే వస్తుందో, లేక మంచి ఫోస్టే వస్తుందో , లేక ఆన్ సైటు ఆఫరే వస్తుందో
అనుకున్నారు అంతా... చివరకు ఏమొచ్చిందో తెలుసా?,
ఖర్చులేకుండా కంపెనీ క్యాంటిన్ లో ఉన్నపెద్ద స్టేజిపై సభ పెట్టి...
ఒక చెక్కముక్కపై అతని పేరు చెక్కి ఇచ్చి, ఐదేళ్ళనుండీ కంపెనీ మారలేని
నీ చేతకానితనాన్ని... ఇలా బహుమతిగా ఇచ్చి గౌరవిస్తున్నాం..
జాగ్రత్తగా నీ డెస్క్ దగ్గర పెట్టుకుని రోజూ చూసుకో అని చెప్పకనే చెప్పారు నాయనా...

నేను త్వరత్వరగా కంపెనీలు మారుతున్నాను, నా కెరీర్ పాడైపోతుంది,
ఎక్కువకాలం ఒకటే కంపెనీలో ఉంటే చాలా కలిసొస్తాయి, మంచి పేరుంటుంది..
అన్న నీ అనుమానాలు/భ్రమలు పటాపంచలు కావటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా?
ఉన్నవాళ్ళకు ఏమిచ్చారని చెక్కముక్కలు తప్ప...

కంపెనీ మారటం కూడా ఒక కళ నాయనా.. అందులోని టిప్పులు.. ట్రిక్కులూ..
కావాలంటే నీ సీనియర్ బ్రహ్మిలను అడిగి తెలుసుకో, లేక నా సారాశంలో ఉన్న
పదమూడవ అద్యాయం చదువుకో.. బ్రతుక నేర్చుకో.

కంపెనీ మారితేనే నీ జీతం రెట్టింపులవుతుంది... ఇక్కడే ఎన్నేళ్ళున్నా
"ఇంటి కుక్కకు ఒక ఎంగిలి మెతుకు", అన్నట్లు ఐదుశాతమో లేక పదిశాతంమో
పడేసి నోరుమూయిస్తారు, అడిగితే నష్టాలు అంటారు..

బయటనుండి వచ్చిన ఊరకుక్కకు ఏభైశాతం...,
అమెరికానుండి వచ్చిన ఎమ్మెస్ కుక్కకు వందశాతం ఇచ్చినా ఇస్తారు..,
అదేంటి అని అడిగావంటే.. క్రిటికల్ ప్రాజెక్ట్ అందుకే ఇస్తున్నాం అంటారు.
బయటకుక్క ఇంతకుముందు ఏమీ చెయ్యలేదనీ...,
అమెరికన్ కుక్క ఇంగ్లీషులో అరవటం తప్ప.. ప్రోగ్రామింగులో ఒక్క ముక్క కూడా
రాదు అని తెలుసుకున్నాకా..., ఆ క్రిటికల్ ప్రాజెక్ట్ మళ్ళా ఇంటి కుక్కమీదే పడేస్తారు...

ఇలా ఇంటికుక్క మోస్తున్నంతకాలం..., ప్రాజెక్ట్ నడిచిపోతున్నంతకాలం...
ఆవైపుకు ఏ మేనేజరూ రాడు..., ఏ సి. యి. వో రాడు... అయ్యో నాకన్నా
ఎక్కువసేపు ఆఫీసులో కష్టపడుతున్నాడే పాపం అని సెక్యూరిటీ వాడు
బాధపడతాడు తప్ప నీ ప్రాజెక్ట్ లో ఎవడూ అనడు.... ఎప్పుడైతే ప్రాజెక్టు
గతి తప్పుతుందో... కాలం చెల్లుతుందో.., అంతా వచ్చి నెత్తినెక్కుతారు...

ప్రాజెక్ట్ సక్సస్ అయ్యి బాగా డబ్బులు వస్తే... ఇదంతా మీ చలవే అని
మాటలు విదుల్చుతారు... మాటలతో కడుపు నిండుతుందా?.
అందుకే నువ్వు కూడా ఊరకుక్కగా మారి ఎంతో కొంత మార్పును పొంది
సుఖంగా ఉండు నాయనా.

నేను చెప్పిన విధంగా ఆలోచించి ఈ క్రింది శ్లోకం మీ మేనేజరు తిట్టినప్పుడు...
నీ ఈ ప్రస్తుత ఉద్యోగమునందు విరక్తికలిగినప్పుడుగానీ నాలుగు సార్లు
చదువుకొనిన యెడల మంచి జరుగును.

జంపోప జంపేవ జజంపోనాం
జంపు జంపునే జంపుజంపాత్మకమ్....

జంపుళ్ళో జంపు జాజంపు...
జంపైన జంపు జనమజంపు...

జంపు జంపూనాం జంపుకై జంపునాత్మకమ్...


ఇది జంపోపదేశ గ్రంధంలో పదకొండవ అద్యాయము నుండి సేకరించబడినది.
సర్వే జంపూనాం సుఖినోభవన్తు..
-------------------------------------------
ఇందలి చర్చించిన విషయములు, పేర్లూ కల్పితములు అని ఎవరినీ ఉద్దేశించినవి..
కించపరిచేవి.. కావని మనవి.

28 కామెంట్‌లు:

తమిళన్ చెప్పారు...

@అక్కడ దొరికేవి కీబోర్డు వైర్లు, మౌసు వైర్లు .....హాల్ చల్ మే గుడాల్ పెసల్లు బెబ్బర్లు..మొత్తం జోర్ ...

భావన చెప్పారు...

IT industry కాచి వడపోసేసేరు కదా. బాగుంది మీ జంపోపదేశం... :-)

PaRaDoX చెప్పారు...

baaga chepparu andi srinivas garu kani ila maa MS chesina vallani videsi kukka ga abhivarninchatam oka pakka badha pettina , english lo aravatam tappa coding oka mukka kuda radu ani meeru cheppindi nijame kada ani navukuda ochhi chachhindi :D

శ్రీనివాసరాజు చెప్పారు...

@తమిళన్ గారు
మీ అనందం అంతగా నాకు అర్ధంకాలేదు కానీ.. బ్లాగు మీకు నచ్చింది అని అనుకుంటున్నాను.

ధన్యవాదములు..

శ్రీనివాసరాజు చెప్పారు...

@భావన గారు
అదే ఇండస్ట్రీలో ఉన్నాకా కాచుకోవటమో.. వడపోయటమో ఎదోకటి చెయ్యాలి కదా... :)

మీ కామెంటుకు ధన్యవాదములు..


@PaRaDox గారు
ఒక్క ఎమ్మెస్ వాళ్ళనే కుక్కలనలేదండీ...
అలా కోడింగు రానివారు అందరూ ఉండరులేండి..
కానీ కంపెనీలకు ఏమి కావాలో తెలియదు అన్నది అక్కడ తెలపటంకోసం కొందరిని కుక్కలను చేయక తప్పలేదు మరి.

నవ్వుకుని సరదాగా తీసుకున్నందుకు ధన్యవాదములు.

bapi చెప్పారు...

చాల బాగుంది బ్లాగ్ అన్నయ.... ఇంక ఈలాంటి మంచి మంచి ఉపదేశాలు ఈస్తావ్ అని ఆసిస్తూ..
మీ బ్రహ్మీ తమ్ముడు

kals చెప్పారు...

chala bagundandi...meeru inkaa ilanti vi rasi..ee IT life lo konchem relax & refersh istahru ani asisthunnanu ..

నలుగురి లో నాలుగోవాడు చెప్పారు...

Well Said ..just 20 days back, I submit my resignation then my manager came to me and said, I am good,better even some times best.

Time bad, he observed only after i resigned.Even he promised for B1. of-course I just ignored.

కౌటిల్య చెప్పారు...

బాగుందండీ మీ టపా...సాఫ్ట్ వేర్ వాళ్ళ జీవితాల్ని కళ్ళకి కట్టినట్టు చూపించారు..
ఇంకో మాట..."తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లు కుట్టిందన్నట్లు",కాదండీ.."పేనుకు పెత్తనమిస్తే"..

PaRaDoX చెప్పారు...

@కౌటిల్య

penu ki pethhanam isthe tala antha gorigindhi anedi paata sametha !! telu ki pethhanam isthe ratri antha kuttindi idi kottha sametha !! :D

bandlapally చెప్పారు...

emi vupadesam chesarandi...mothaniki baagundhi mee jumpopadesam...
mari meereppudu jumping ;);):)

అజ్ఞాత చెప్పారు...

అబ్బో.....బోలెడన్ని సామెతలు నేర్చేసుకున్నాం.
ఇంతకీ , జంపుకి ముహుర్తం పెట్టించేరా ?

శ్రీనివాసరాజు చెప్పారు...

@తమ్ముడు బాపి,

తప్పకుండా ఇస్తాం.. కనీసం మీకు మేము చెప్పటానికైనా ఉన్నాంగా..!
మాకైతై చెంపదెబ్బతగిలేదాకా అనుభవంలోకి రాలేదు.. మీకు ఆ చాన్స్ ఇవ్వం.. చెంపదెబ్బ తగిలేలోపే చెయ్యిఅడ్డుపెట్టుకోవచ్చు..


@kals

తప్పకుండా రాస్తాను.. అందరినీ రిలాక్స్.. రిఫ్రష్ చయ్యటానికి నిన్న ఆఫీస్ లోనే కష్టపడి ఈ బ్లాగ్ రాసాను.. (మా వాళ్ళెవ్వరికీ తెలుగు రాదులేండి.. :) )

శ్రీనివాసరాజు చెప్పారు...

@ "నలుగురి లో నాలుగోవాడు" గారు
------------------------

మీ జంపుకు నా అభినందనలు.. కానీ జంపుగురించి మీరు ఆనందంగా లేనట్టున్నారు.. ధనలక్ష్మి కలిసొస్తే చాలండి.. చెప్పాగా మేనేజర్లు అలానే ఉంటారు.., కానీ వాళ్ళచేతుల్లో కూడా అన్నీ ఉండవు పాపం.
ఆల్ ది బెస్ట్..

మీ కామెంటుకు ధన్యవాదములు

@కౌటిల్య గారు
-----------------
మీ కామెంటుకు ధన్యవాదములు.
మీ సందేహాన్ని PaRaDox గారు తీర్చినట్లున్నారు.
PaRaDox గారు మీకు కూడా ధన్యవాదములు.


@బండ్లపల్లిగారు
------------------
మీ స్పందనకు ధన్యవాదములు..
జంపు శ్లోకం జపిస్తూ.. మంచి సందర్భంకోసమే చూస్తున్నా... :)


@లలితగారు
--------------------
మీ కామెంటుకు ధన్యవాదములు..
పైన చెప్పిన విధంగానే ఎదురు చూస్తున్నా.

అజ్ఞాత చెప్పారు...

"గవర్నమెంటు ఉద్యోగిలాగా నేనూ బల్లకింద చేతులు పెట్టగలను అనుకుని
చేతులు పెడితే.." ఏం బాబూ, మావాళ్ళని పట్టుకున్నావు? మిగిలినదంతా చాలా బాగుంది.అలాగని 'జంపు' చేసేయకు.ముందుముందు పనులు చాలా ఉన్నాయి.!

శ్రీనివాసరాజు చెప్పారు...

@ ఫణిబాబు గారు

గవర్నమెంటు ఉద్యోగుల్లో కొందరికి కనీసం అ చాన్స్ అన్నా ఉంది కదా అని.

ప్రస్తుతం ఉపదేశమే... సమయమొచ్చినప్పుడు జంపే జంపు. :)

బ్లాగు మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

confused చెప్పారు...

Srinivas garu, after reading your blog and after rewinding of my last 4.5 yrs experience in a MNC, i decided to jump on 4th. But my manager some how got smell of it ( i haven't told to anybody this yet) and started my on site processing.

Now the confusion is to jump or not to jump ???

శ్రీనివాసరాజు చెప్పారు...

@confused

కొంతమంది ఫ్రొఫైల్ జాబ్స్ సైటులో అప్ డేట్ చేసి తన సొంత కంపెనీని తెలియకో లేక బద్దకించో బ్లాక్ చేసుకోవటం మరిచిపోతారు... నేను గమనించాను కొంత మంది మేనేజర్లు కొత్తవాళ్ళకోసం వెతుకుతూ తన ప్రాజెక్ట్లో ఎవరి ఫ్రొఫైల్స్ అన్నా ఉన్నాయామో అని కూడా వెతుకుతుంటారు...(మాకు అప్పుడప్పుడూ మీటింగ్స్ లో హింట్స్ ఇస్తుంటారు.. వీడు వెళ్ళిపోయే అవకాశం ఉంది డిపెండెన్సీ క్రియేట్ చేసుకోవద్దు అని.. ) అలా కనిపెట్టేస్తారు కూడా, కొన్ని కంపెనీవాళ్ళైతే కంపెనీపేరుతో లాగిన్ ఉండదు.. కాబట్టి మనకు బ్లాక్ చేసే అవకాశంకూడా ఉండదు.. వారు ఏ లాగిన్ తో వెతుకుతున్నారో తెలుసుకోవటం కూడా కష్టమే..

ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడటం, సాయంత్రమో లేక ప్రొద్దున్నో పర్మిషన్స్ అడిగి ఆఫీస్ నుండి బయటపడటమో ఇవ్వన్నీ కూడా మీరు కొత్త జాబ్ చూసుకుంటున్నారని చెప్పకనే చెప్పే విషయాలు..

ఇలాంటి కిటుకులు మరి చాలా ఉంటాయి..., తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడు అని.. మేనేజరుకూడా ఒకప్పుడు ఇలాంటి వేషాలే వేసుంటాడు కదా.. అందుకే జర బధ్రం.. ;-)

ఇక మీ జంపు విషయం అంటారా!, నేను సలహా చెప్పేటంతవాడిని కాదుగానీ.., అందులోనూ ఇందులోనూ ఉన్న పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్సు రాసుకుని బేరీజు వేసుకోండి.. పెద్దల సలహాలు తీసుకుని.. ఏది బాగుంటుందో మీరే నిర్ణయించుకోండి..., అల్ ద బెస్టూ... :)

మురళి చెప్పారు...

మంచి టపా.. రాసిన విధానం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలని జ్ఞాపకం చేసిందండీ..

శ్రీనివాసరాజు చెప్పారు...

@మురళి గారు

నా టపా చదివినందుకు ధన్యవాదములు...

నా కధాశైలి.. ఏకంగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కధనే గుర్తొచ్చేలా చేసింది అంటే... చాలా ధన్యుడను.. :-)

ఈ ఒక్కమాటా చాలండీ నా బ్లాగింగ్ నాకు సంతృప్తినివ్వటానికి..., ఇలానే నా బ్లాగు చదువుతుంటారని ఆశిస్తున్నాను.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఆహా..ఎంత బాగా ఇచ్చారండీ జంపోపదేశం..ఇక నుండి నేను 'జంపేనా..జంపుభ్యాం..జంపుభిహీ' అనే శభ్దం నిత్యం ఉచ్చరిస్తూ ఓ కాలు ఆఫీస్ బయట వేసి ఉంచుతా!! :-)

అజ్ఞాత చెప్పారు...

పడీపడీ పగలబడి నవ్వి కన్నీళ్ళొచ్చాయంటే నమ్మండి.

పానీపూరి123 చెప్పారు...

@confused
నాకు అలానే జరిగింది, కాని నేను రిస్క్ తీసుకుని డిచ్ కొట్టాను.

పానీపూరి123 చెప్పారు...

nice writing :-)
మూడేళ్ళు ఒకేదానిలో ఉన్న నాకంటే, మూడేళ్ళల్లో 4సార్లు జంప్ అయినవాళ్ళు, నాకండే డబల్ శాలరి వచ్చేది.

శ్రీనివాసరాజు చెప్పారు...

@శేఖర్ పెద్దగోపు గారు
అలానే వుంచండి కాలు.. శీగ్రమేవ మంచి ఆఫర్ ప్రాప్తిరస్తూ.. మమ అనుకుని ముక్కుపట్టుకోండి... :-)

@ఓబుల్ రెడ్డిగారు
హాయిగా నవ్వుకున్నందుకు సంతోషం.
మీ కామెంటుకు ధన్యవాదములు

@పానీపూరి గారు
మరి అందుకేనండీ అన్నది..
"ఏ ఎండకు ఆ గొడుగూ... , ఏ జంపుకు.. ఆ మాటా..." చెప్పని వాడు
"ఈ ఇండస్ట్రీలో పడ్డ ట్రైనీలాగా కొట్టుకుచావాళ్ళిందే...!" అని..

"వచ్చేది" అంటున్నారు అంటే ఇప్పటికే మీరు జంపులు బాగాచేసీ.. బాగానే ఉహూ ఉహూ అన్నమాటా.. (మనలో మన మాటా.. మీ ఎక్స్పీరియన్సు.. మీ సేలరీ ఎంతో చెప్పండి.. కాస్త మాకూ మార్కెట్ రేట్లపై అవగాహన వున్నట్లుంటుంది.. :-) )

Indian Minerva చెప్పారు...

హ హ హ

ఒక పరి నేనునూ సెలవుగైకొనిన మా ప్రాజెక్టు ఏ గంగలగలియునోయని చింతాక్రాంతుడనయితిని. అప్పుడు నా సహోద్యోగి నేననెంత నిమిత్తమాతృడనో, నేను లేకున్ననూ యేయాటంకములూ గలగకుండకనే ప్రాజెక్టు యెట్లు పూర్తవగలదో వివరించి నేను సెలవు గైకొనుటకు నన్నుద్యిక్తునిగావించెను. మీ వ్రాతలు ఆతని మాటలను జ్ఞప్తికి తెచ్చినవి.

"ఇతరులకు చెప్పటానికే ఆ నీతులు గానీ.. వాళ్ళకు సమయమొస్తే..., మంచి ఆఫర్ వస్తే...
వారూ ఉండరు నాయనా..., ఈ జంపు ప్రవాహంలో వారూ కొట్టుకుపోతారు..."

పరమసత్యము.

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ చెప్పారు...

చాలా బాగుంది

శ్రీనివాసరాజు చెప్పారు...

@ఇండియన్ మినర్వాగారు
ఆలశ్యముగానైనా నా 'జంపో'పదేశం చదివినందుకు సంతోషం.. అలాగే జంపుకు సిధ్దంకండి మార్కెట్టులు చాలా రేజింగ్లో రెపరెపలాడిపోతున్నాయు. :)

@బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ గారు
మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నాకు తెలుసు మాస్టారూ. నేనుచేసేది అదే ఉద్యోగం కదా మరి. :))

Related Posts Plugin for WordPress, Blogger...