తాతారావుగారి బెంజికారు
తాతారావుకు ఎప్పట్నుంచో కారుకొనాలని తెగమోజు. సిన్న సిన్న కార్లను
సూసినప్పుడల్లా.. "ఇదా.. ఎదవది.. నాలుగు లచ్చలు, ఇది కారేంటి..
జవ్వాది అంజిగాడి కిళ్ళీకొట్టు డబ్బాలా ఉంది.. కొంటేగింటే.. ఏబైలచ్చలు
పెట్టి బెంజు కొనాలిగానీ..., డబ్బాకార్లలో ఏముంటాదబ్బాయ్ దర్జా.."
అని అందరిదగ్గరా సెబుతుండేవోడు.
ఊళ్ళోవున్న కుర్రగాళ్ళతో ఎప్పుడూ వాదనకు దిగి "బెంజును మించిన కారు
పెపంచంలోనే లేదు, నాకు మీసాలు రానప్పుడ్నుండీ సూత్తన్నాను,
నాలుగు మార్లు ఢిల్లీలో కార్ల ఎగ్జిబిషనుక్కూడా ఎల్లాను..., నా కళ్ళముందే
బోకుల్లా తిరిగిన మీ బాబులంతా కొయిటాసొమ్ములు సంపాయించీ బాగా బలిసీ..
నిక్కర్లుమానేసి పేంటులేసుకునొచ్చిన పిల్లిమిసరకాయల్లారా..
నాకుసెప్తారేంట్రా.. మీరా?", అని అన్నిఇసయాల్లోనీ అందరికంటే ఎక్కువ
తనకే తెలుసునని సెప్పుకుంటంలో తాతారావుని మించినోడు
ఉభయగోదారిజిల్లాల్లో ఎవడూ ఉండుండడు.
పైకి "అవునురోయ్.. తాతారావుగారు సెప్పిందే కరెష్టురా..", అని
తలలాడించినా.. సాటుకెళ్ళి "ఛీ ఈ ఎదవ నోట్టో నోరుపెట్టినా కుక్కనోట్లో నోరుపెట్టినా
ఒకటే.." అనంతా తిట్టుకెళ్ళిపోయేవోరు.., తనేమీఇన్లేదన్నట్టు.. తానుపట్టుకున్న
కుందేలి నాలుగు కాళ్ళను ఎనక్కి కట్టేసి.. అసలు కాళ్ళేలేవు అని ఋజువుచేసే
తత్వం తాతారావుది.
అలాని ఊరిజనం పట్టించుకోకండా తిరిగే ఆసామాసి మనిషిగాదు తాతారావు.
పచ్చింగోదారి జిల్లా నిడదోలూ, కానూరు, ఉండ్రాజరం చుట్టుపక్కలున్న ఊళ్ళలో
మెరక.. పల్లం.. బీడు.. మాగానిల్తో కలుపుకుని.. మొత్తం ఇరవై ఎకరమూ..
సఖినేటిపల్లిలో ఐదారుసోట్ల ఎటుసూసినా ఐదెకరాల ఏకముక్కకి తక్కువగాకండా
అత్తోరు కట్నంగా ఇచ్చిందాంతో కలుపుకుంటే… సుమారు ఏభై ఎకరముంటాది
తాతారావుకి.
సఖినేటిపల్లిలో కాల్వగట్టుకి ఆనుకునున్న అరెకరంనేలలో బంగాళాపెంకుటిల్లు..
డూప్లెక్సు హౌసూ... చుట్టూ గెదెల సావిడీ.., మంచి పెసాంతమైన
వాతావరణంలో ఎండపొడ కూడా తాక్కుండా చుట్టూరా కొబ్బరిచెట్లతో
కప్పేసుంటాది తాతారావు ఇళ్ళు. ఎప్పుడో ఇల్లరికపల్లుడుగా వచ్చేసి ఇక్కడే
స్తిరపడిపోయిన తాతారావు, ఆ వూరి స్తితిమంతుల్లో వొకడుగావటం వల్ల,
అతని బలం, బలగం చూసి బయపడేవోళ్ళు ఎక్కువే ఉన్నారావూళ్ళో.
పిల్లాజెల్లాలేకపోయినా.. ఎప్పుడూ ఒక ఇరవై ముప్పై మంది పొలాళ్ళో
పనిచేయటానికి చేతికిందుండే పనోళ్ళు.. నలబైదాకా ఉండే పాడావులు,
గేదెల్నీ సూసుకోటానికి పదిమంది పాలేళ్ళు...
ఇష్టాన్సారంగా చిర్రుబుర్రులాడిపోతా ఎగరటానికి.. తిట్టింది పట్టానికీ...
తిండికి వంట్టానికీ అన్నట్టుండే.. ఇంటావిడ జయమ్మ.. ఈళ్ళందరితోనీ
కళకళ్ళాడిపోతుంటాది ఆ ఇంటి పరిసరపాంతాలు.
ఎంగిలిచేత్తో కాకినిదిల్చితే ఎక్కడ తినేసి బల్సిపోద్దో, తనకి ఎక్కడ
పుణ్యమొచ్చేద్దోని ఊర్లో ఎవడిగొడవా పట్టించుకోకండా..ఉండే తాతారావు,
కాకులు కావు కావుమనకుండానే.. పొద్దుపొడవకుండానే లేచి ఇంటి
గుమ్మానికి ఎడంపక్కనుండే ఖాలీత్తలంలో గుబురుగా పెరిగి..
పూతతో పిటపిటలాడుతున్న గున్నమామిడిచెట్టుకింద.. దారేపోయే వాడు
కనబడే ఇదంగా పడక్కుర్చీ ఏసుకుని.. కాలుమీదకాలేసుకుని వచ్చిరాని
తెలుగు కూర్చుకుంటా పేపరు సదువుతా... లంకపొగాకు సుట్ట నోట్టోపెట్టుకుని..
ఊరిసివరున్న ఆరుమిల్లోల్ల రైసుమిల్లు పొగ్గొట్టంలా పొగొదుల్తా కనబడ్డకుర్రోన్ని
కేకేసి.. రాములోరి గుడిపై మైకుసెట్టులాంటి వాయిసుతో ప్రశ్నలమీద ప్రశ్నలేసి
కుల్లబొడిసేసే తాతారావు ఇంటి సందులోకి రావాలంటే అందరూ
బెంబేలెత్తిపోతుంటారు.
మూన్నెళ్ళకోసారి మగతాలకిచ్చేసిన పచ్చింగోదారి పొలం పనులు
సూసుకుంటానికని పదిపదిహేనురోజులు ఊళ్ళోలేనప్పుడు తప్ప
తాతారావు కబుర్లబాధ పల్లేక ఆ దొడ్లో పిట్టకూడా వాలటానికి
భయపడిపోతుంటాయి.
ఒకేళ తప్పుజారో.. మరిసిపోయో ఎవడైనా ఆ ఈదిలోకొచ్చి తాతారావు
కంటికి సిక్కాడా అంతే సంగతులు.. పిలిస్తే ఎల్లాల్సిందే., ఎళ్ళామా ఊళ్ళోవోళ్ళ
రాజకీయాలు కాన్నించి రాసలీలలొరకూ.., గుళ్ళో రాంభజనలు కాన్నించి...
పేటలో రచ్చబండ ఇషయాలవరకూ మెరకీది.. పల్లపీది ఇషయాలన్నీ.. ఏది
బుర్రలోకొత్తే అది గుచ్చి గుచ్చి అడిగి మొత్తం కనుక్కునే దాకా ఇడిసిపెట్టడు.
ఒకేళ ఎవరైనా "తెల్దండే..!", అన్నారా.. "ఏరా.. ఇయ్యన్నీ తెల్సుకోకండా
ఏం సెక్రాలు దొర్లించేత్తున్నావురా తొత్తుకొడకానీ..", లాంటి తిట్లు
తినాల్సొస్తాదేమోనని నోటికొచ్చింది సెప్పేసి బయటపడేటోళ్ళు కొందరైతే...
ఆడనుండి ఈడకీ ఈడనుండి ఆడకి.. టాపిక్సులు మార్సేసి ఎదోటిమాటాడేత్తా
బోల్తాకొట్టించేసేటోళ్ళు కొందరు. ఇలా అందరి బుర్రల్లోవున్నాగుంజును
బుర్రకొట్టకుండా బుర్రగుంజు తిన్నట్టు తినేత్తా కాలచ్చేపం చేసేత్తుంటాడు
తాతారావు.
ఓరోజు బాగా పొద్దుగూకినేల... వారంరోజులకితమే పుట్టి.. నల్లగా
నిగనిగలాడిపోతావున్న పెయ్యిదూడ.. పడతాలేత్తా కట్రాడుక్కట్టేసిన
తల్లిపొదుగులో పాలుకుడవటానికి ఎల్తున్న సమయంలో..
పాలేరు ఈరిగాడు.. గోదారిలంకల్లో మడిచేలు తొక్కుకుంటా
రంకేసుకొచ్చే నల్లాంబోతులాగా పరిగెత్తుకుంటా ఏసిన రంకెకి
బెదిరిపోయి.. పాకలోంచి దొల్లుకుంటా పక్కనున్నపేడగుట్టపై
పడిపోయింది.
పరుగుతీసి తీసి.. ఒక్కమారు బ్రేకేసిన చెఱుకు ట్రాట్టరులాగా
ఊగిపోతా తాతారావు కూర్సున్న పడక్కుర్చీ దగ్గర ఆగి.
"అయ్యగారో..! మన బెంజుకారొచ్చేసిందంటండే. ఇప్పుడే పల్లపీదిలోఉండే
ఎమ్మర్వో ఎంకటేస్వర్లుగారబ్బాయి సర్సాపురంనించీ.. పంటిమీద వత్తా
చూసారంటండే.., కారుమీదేనేమోననీ..ఆరిని ఇవరం అడగ్గా..
సఖినేటిపల్లి తాతారావుగారింటికే దెలిబరీ ఇస్తన్నాం... ఇంకో అరగంటలో
వచ్చేత్తందాని.. కాతంత ఆయనకి సొప్తారాని మీకు సొప్పమని
సొప్పేరంటండే...", అని ఆయాసపడిపోతా చెప్పేడు పాలేరు ఈరిగాడు.
అదియిన్న తాతారావు మీసంమెలేసి తొడగొట్టినంతపనిచేసి, జారిపోతున్న
పంచెను ఎగ్గట్టి.. ఉక్కసారిగా పడలక్కుర్సీలోంచి లేసి "పదరా ఈరిగా..
సరంజామా చెయ్యాలి.. మొత్తం ఈ గోదారిపక్క గామాల్లో అందరికీతెలిసేటంత..
దుమ్ములేచిపోవాలా.. ఎంత ఖర్సైనా పర్లేదు.. నువ్వు ఆ పన్లోవుండు..“,
అని ఈరిగాడికి పురమాయించాడు...
"ఒరే పాపిగా...!, మనింటికి.. జనాలొత్తున్నారో.. ఆ మూలమొక్కలెక్కే...
ఓ ఇరవై కొబ్బరిబొండాలు దించరా... దావతకే.." అని
ఇంటెనకాలా గడ్డికోత్తున్న పాలేరు పాపాన్నకి పనొప్పజెప్పేడు.
కాసేపటకి.. ఊరుఊరంతా ఇటేపే నడిసొచ్చేత్తన్నారేమో అన్నట్టు..
చింతపిక్కరంగున్న ఇ-క్లాసు బెంజికారు ఎనకాల సంక్రాతి పెద్దపండుగరోజు
తోటల్లోకోడిపందాలు సూడ్డానికి పరుగెత్తుకొత్తొన్నట్టు గుంపులుగుంపులుగా
జనాలొచ్చేత్తన్నారు. కొబ్బరిసెట్లనీడా.. మద్దెమద్దెన ఎండా.. పడతా…
సేపలేటకెళ్ళొచ్చి.. అప్పుడే గోదారొడ్డుకు సేరుకున్న ఏటపడవలాగా తళతళా
మెరిసిపోతావొత్తన్న పడవంతకారుని సూసిన తాతారావూ.., ఇంటిబయట
పెహారీగోడవతల సెట్లకింద నీడల్లో పొదుగుడు కోడిపెట్టల్లా కునుకుతా నిలబడ్డ
సంబరాల్లోల్లకి మొదలెట్టండ్రా అన్నట్టు.. సైగచేసేడు.., అంతే అప్పట్దాకా
పెసాంతంగా వున్న ఆ పెదేసం.. అంతరేది లక్ష్మీనర్సింసామి తీత్తంలో
సంబరాల్లాగా.. సెలరేగిపోయిన పులిడాస్సులు... బుట్టబొమ్మలూ..
సన్నాయి మేళాలోల్ల... సిందులాటల్తో మోతెత్తిపోయింది..
అలా ఓ అరగంటగడిసాకా, ఊరసెరువులో ఖజానా బాతీదుకుంటా
వత్తాంటే తూటుమొక్కలు సైడైపోయి తప్పుకున్నట్టుగా తప్పుకున్న
జనాల్లోంచొచ్చిన కారు.. రైయ్యిమంటా.. వొచ్చి గున్నమామిడి
చెట్టునీడనాగింది.
ఆ కార్లోంచి బెంజికారు సింబలున్న సూట్లేసుకుని.. దొరల్దిగినట్టుగా..
నలుగుదిగేరు. తెల్లబట్టల్లో మిలమిలా మెరిసిపోతా..
మెల్లెపూలసెంటుకొట్టుకుని.., ఫాండ్స్ పౌడ్రు మెడనిండా తెల్లతెల్లగా
కనిపించేలా రాసుకుని.. పదేళ్ళకీ.. పచ్చకుందనాల్లా మెరిసిపోతున్న
బంగారుంగరాలూ.. మెడలో దున్నపోతు కాళ్ళకి బంధమేసేంత లావున్న
చెయినూ ఏసుకుని.. బెంజికారును చూసి.. ఆనందంపట్టలేక భూమికి
అడుగున్నర ఎత్తులో గాల్లోతేలతా.. నిలబడ్డ తాతారావును చూసి ఈయనే
కారుకొన్న పెద్దమనిషి అననుకుని.. “నమస్తే సార్.. తాతారావుగారంటే
మీరేనా అని.. “, అడిగాడు ఆ నలుగుర్లో ఒకతను.
“అవునమ్మా నేనే..., ఒరే.. కుర్చీలేసే... బొండాలుకొట్టి పట్రండ్రా..",
అని పనోళ్ళని కేకేసి.. “కాళ్ళుకడుక్కుందిరిగానీ.. రండే!”, అని
పెళ్ళికొచ్చిన మొగపెళ్ళోళ్ళమల్లే ఆహ్వానించాడు తాతారావు.
వచ్చినోళ్ళు.. కాళ్ళుకడుక్కుని.. చెట్టుకింద కుర్చీల్లో కూర్చుని
బొండాలుతాగటం మొదలుపెట్టాకా... "ఏంటండే... అసలు ఇన్పర్మేషన్
లేకుండానే పపించేసేరో...?, పంపేదానికి రోజు ముందు సెప్పమని
బుక్కుచేసినప్పుడు సెప్పేనండే..", అన్నాడు తాతారావు.. అందులో
ఒకతనకి దగ్గరగా కుర్చీలాక్కుని కూర్చుంటా...
“లేదుసార్.. నాలుగురోజులనుండీ మీరిచ్చిన ఫోన్ నెంబర్లకు
ట్రైచేస్తున్నామండీ, మీకు ఇన్ఫామ్ చేద్దామని.., కానీ ఏనెంబరుకు
కలవలేదండీ.. “, అని వినయంగా చెప్పాడు ఒకతను.
"ఆయ్.. అలాగాండే... ల్యాండేమో.. మొన్న కొబ్బరితీతలో కమ్మడిపోయి
తెగిపోయిందండే..., ఇంకా బాగవలేనట్టుందండే..., ఇకపోతే సెల్ నెంబరు
సరిగ్గా సిగ్నలుండిచావదండే.., అయ్యయ్యో.. ఫోనుచేసిచేసి.. బాగా ఇబ్బంది
పడిపోయింటారండే..." , అని తెగ బాధపడిపోయాడు తాతారావు.
“అదేంలేదుసార్... బాగాలేటయిపోతుందని.. డెలివరీచేసేసాం సార్”,
అని. వేరేఅతను చెప్పాడు..
"మంచిపనిచేసారండే.., ఇలా తెలీకోకండా వత్తానే బాగుందండే.. ",
అని మీసాలు దువ్వుకుంటా నవ్వాడు తాతారావు.
ఇంగిలీషులో ఎమన్నామాటాడే అవసంమొత్తాదని.. ముందుగానే ఊహించిన
తాతారావు.. ఆవూల్లోనే బోర్డస్కూల్లో పనిచేస్తున్న ఎంకటరత్నం మాస్టార్ని
పిలిపించుకొచ్చి.. ఎనకే నిలబెట్టుకున్నాడు. కారుగురించి దాని మెయింటేనెన్సు
గురించి చెబుతుంటే.. అదిచూసి బాగా గుర్తుపెట్టుకోండి.. అన్నట్లు ఎనకున్న
ఎంకటరత్నం మాస్టారేపు తిరిగి సైగచేత్తావున్నాడు.
కారున్జూసి.. ఉబ్బితబ్బిబ్బైపోయిన తాతారావుని.. వూరువూరంతా పొగడ్తలత్తో
ముంచేసి.. ములగసెట్టెక్కించేసి.., పెద్దపార్టీ ఇవ్వాలంటూ బుట్టలోపడేసేరు.
ఇక ఆవారంచివర్లో జనాలపట్టుమీద ఊరిసివర కొబ్బరితోటలో బోజనాలు,
సంభరాలు, రికాడ్డింగు డ్యాన్సులు ఏర్పాటుసేయించేడు.. తాతారావు.
పెద్దొరసనాటుకోడి మాసం, ఏటమాసం.. చించినాడ నుండి గుడ్డిపీతలు,
బొమ్మిడాయిలూ.. రావలు.. పులస లాంటి. పదేను రకాల నాన్ వెజ్
ఐటమ్సుతో ఏర్పాటుసేసిన భోజనాలు తినీ.., సంబరాలు సూసి జనాలు
తెగ సంబరపడిపోయారు.. , “ఒకాడపిల్లపెళ్ళిసేసినంత ఘనంగా చేసార్రా
తాతారావుగోరా.. “, అని ఎటుసూసినా సుట్టుపక్కనున్న అయిదు
గ్రామాలకు తగ్గకుండా మహా ఇంతగా సెప్పుకున్నారు..
ఓరోజు అంతరేది గుళ్ళో కారుకు పూజ్చేయిద్దామని రాములోరి గుళ్ళో
పూజారి శర్మగారిచేత ముహుర్తం పెట్టించి.. కారేసుకుని అంతరేది
బయలుదేరిన తాతారావు.. కూడా పాలేరు ఈరిగాడిని ఎక్కించుకున్నాడు.
"అయ్యగోరో... సీట్లేంటండే... దూదిపింజల్లా మెత్తమెత్తగా ఉన్నాయే..
భలేగుందండే బాబో...", అని ఈరిగాడనేసరికి.. మీసంమెలేసి
“మంరేంటనుకున్నావ్ బెంజికారంటే..”, అన్నాడు తాతారావు.
తాతారావుకి డ్రైవింగు కొత్తేమీకాదు.. పెద్దపెద్దగడ్డిమోపులూ.. చెరుకూ
ఏసుకుని.. గతుకులరోడ్డుల్లోకూడా తొనక్కుండా ట్రాట్టరునడిపిన
అనుభవముంది.., సొంతంగా కారులేకపోయినా.. కొత్తగాకనిపించిన
కారులన్నీ నడిపిచూసినోడె.. కాకపోతే.. ఇంకా అలవాటుగాని
కొత్తకారు కావటంతో కొంచెం ఊపుపులుగా లాగిస్తున్నాడు.., టర్నింగుల్లో
రోడ్డు మార్చిను దాటేసి పొలాల్లోకి పోనిచ్చేత్తా.. ఒక్కోసారి ఎక్కవ తిప్పేసి
వేరేపక్కి దూకించేత్తావున్నాడు..
ఇదంతా గమనించిన.. ఈరిగాడు.. “అయ్ బాబోయ్ అదేటండే..
తిరక్కుండా దూకేత్తాందా.. నన్నడిగితే ఈ పడవంతకారుని తిప్పటం
చానాకష్టమండే... మొన్న కొయిటానుండొచ్చిన గిరిగి పద్దనాబం
మనవడు ఆలుటోనో ఎటోనంటండే.. లక్కపిడతంత వుందండే..కోరో,
గొబ్బిరిగాయలతీతకి ఓరోజు పొలందగ్గరకి ఆ బండిమీదే తీస్కెల్లేడండే..
పొలాల్లోవుండె పచ్చ మిడద్దూకినట్టు దూకి... సిన్న సిన్న సందుల్లోగూడా
తిరిగేత్తందండే.. అదా...", అన్నాడీరిగాడు.. యమాసీరియస్ గా
బండినడుపుతున్న తాతారావొంకే చూత్తా.
"ఓరి.. సన్నాసెదవా..!!, రెండున్నర లచ్చలకారుకీ... ఏబైలచ్చలకారుకి
పోలికేంట్రా... దీంతో అలాంటియ్యి ఇరవైముప్పైగొనచ్చు..., అయినా
సింవాసనం మీదున్న కుక్కకేం తెలుత్తాదిరా ఇలువా..., దిన్నే పవరు
స్టీరింగంటారు.. ఇంత దిప్పితే.. అంత దిరుగుద్దు.. నాకింకా అలవాటుగాక
దూకేత్తందిగానీ.., అలవాటవ్వాలా... అప్పుడుదెలుత్తాది.. నా సామిరంగా..,
దీని ఎవ్వారమేంటో.. , అయినా.. కూడా నిన్నేక్కించుకురాటం..
నాదేబుద్దక్కువా...రా..", అని చెడామడా తిట్టేసరికి.. ఈరిగాడు
నోరుమూసేస్కుచ్చున్నాడు.
ఓపక్క తిట్లు తిడతానే ఉన్నాడు.. ఓ పక్క సీరియస్గా కారు తోల్తానే
వున్నాడు.. కారుఅటుదిప్పుతా ఇటుదిప్పుతా ఊపుపులుగా లాగిత్తానే
వున్నాడు.. తాతారావు.
కాలవమొగ రోడ్డు పెదవొంపుదగ్గరికొచ్చే సరికీ పెద్ద గేదెలమంద అడ్డొచ్చింది..
"ఎవడ్రీడా ఎదవ ఈ మందనంతా ఇక్కడెక్కిచ్చాడా..", అని తిట్టుకుంటానే..,
కుప్పనూర్పుల్లో ట్రాట్టర్ స్టీరింగు తిప్పినట్టు.. స్టీరింగు మీదకంటా పడిపోయి
మొత్తం మట్టానికి తిప్పేసేడు తాతారావు.. బండి గేదెల్ని తప్పించుకుని..
వొక్కసారిగా.. ఎడంవైపున్న బోదెలోకి దూకబోయింది.., అదేకంగార్లో..
బ్రేకనుకుని.. ఎక్షెలేటర్ మీదకాలేసి.. లోనకంటా తొక్కేసేడు..
సినిమాల్లో రేసుకారు దూకినంత దూకుడుగా.. పంట కాల్వ దూకి..
అవతలున్న కొబ్బరితోటలోకి ఎగిరి... ఓ చెట్టుమొదల్ని దబేలుమంటా
గుద్దేసింది. ఆ సౌండు మొత్తం సఖినేటిపల్లంతా ఇనబడిపోయింది..