26, నవంబర్ 2010, శుక్రవారం

కార్ల బజారు...

అబ్బా నా "మారుతీ 800" కారు.. అదిరిపోయే గాడీ..
బూజుపట్టినా తగ్గని వేడి.. భలేవుందిలే దీని బాడీ.
దీనికెవ్వరూ సరిరారు జోడీ...
హమ్మో పదకొండయ్యిందా..  అయితే ఈ రోజు ఆఫీసుకు కార్లోకన్నా టూవీలర్ పైనే బెటర్.

ఇదేకదా.. "స్కార్పియో.." గున్నేనుగు లాంగుదిది.. హా.. మన సినిమాల్లో ఫ్యాక్షనిస్టులు వాడేదిది...
ఇంట్లో పెళ్ళాన్ని భయపెట్టలేనివాళ్ళు వీధిలో ప్రతాపం చూపించటానికి వాడేదీ ఇదేనా..!


హ హా.. "టాటా ఇండికా.." నాకెప్పుడూ కన్ఫ్యూజనే "టాటా ఇండీకాకీ - ఇండీకామ్" కీ.
ఇప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి.. కారు పేరు "ఇండికా.." ఫోనుపేరు "ఇండీకామ్" కదా.
ఇది చూడగానే నాకు ఒక జోక్ గుర్తొస్తుంది. లక్షలు పోసి కొన్నాడంట మాఫ్రెండు ఫ్రెండు ఫ్రెండొకడు..
ఎక్కడకెళ్ళినా జనాలు చేతులూపేసి ఆపేస్తున్నారంట.. ఏంట్రాబాబు ఇలా ఆపేస్తున్నారు..
కారుకేమన్నా అయ్యిందా అని ఆగిచూసుకుంటే ఏమీలేదు..
ఇంతలో వాడేవడో కారు దగ్గరకొచ్చి. కిలోమీటర్ కి ఎంత.., ఏ.సీ తో ఎంతా నాన్ ఏ.సీ ఎంతా..
ఫలనా చోటికొస్తావా.. ట్యాక్సీ అన్నాడంటా..
హి హిహీ. కొన్ని బ్రాండులలా స్థిరపడిపాతాయి మరి.

ఒరే "సాంత్రో" కాస్త చూసుకుని వెళ్ళరో..  నీకంత పొగరేంట్రో.. తగ్గు తగ్గు తగ్గరో...
హత్తెరి.. దీనివెనకే.. "ఐ. టెన్.."
బిత్తెరి.. వెనకే.. "ఐ. ట్వంటీ.."
ఛత్.. "ఐ. తర్టీ..."
ఫ్లో లో అనేసా ఇంకా రిలీజ్ కాలేదుకదా.
"డేవూ మ్యాటిజ్" గాడా.. అనగ్గొట్టేసిన మూతిలావుండే మొహమూ వీడూను
ఎందుకురా "ఐ. ట్వంటీ.." వెనక అంత స్పీడుగా పోతావ్
వాడు బ్రేకేస్తే "దుబాయ్ శీను" రవితేజ అన్నట్టు నీ మూతింకా అప్పడమైపోద్దీ.

ఇదేంటిది.. "మహీంద్రా గ్జయిలో.." కొత్తగావచ్చిందనీ దీనికెంత స్టయిలో...
చూసాంలే.. ఇకచాలు ఛలో..

ఒర్నాయనో "ఇన్నోవా.." పక్కింట్లోవాళ్ళ పక్కింటొళ్ళని.. వాళ్ళవాళ్ళ ఎదురింటోళ్ళనీ
ఎక్కించినా ఇంకా ఖాలీగావుందా?
మరెందుకంటా అంత పెద్ద కారు నీకు.. స్పీడెల్తుందని అలా తెగతొక్కెయ్యమాకు...
కాస్త నెమ్మదిగా పోనీయ్యి బాబు.

హార్నీ "టవేరా.." అలా మీదమీదకొస్తావేరా... బ్రతకాలనిలేదురా?... మరెందుకంత కంగారురా?...

అరెరే.. "బెంజి.." మాంచి హైక్లాసు బెంజి.. ఎవడ్రా ఇక్కడ దార్లో పోసాడు గెంజి.
ఆ బెంజినీ ఈ గెంజినీ చూడగానే ఏదో రిలేషను గుర్తొస్తుందబ్బా.. హా...

 "గెంజి నుండి బెంజి దాకా చూసాను.. దేనినీ మర్చిపోలేను"..
 అన్న పద్మభూషణ్ చిరంజీవి గుర్తోచ్చాడేంటి చెప్మా!!.

హెల్మెట్ కారు.. హెల్మెట్ కారు.. "వేగన్ ఆరు.." చూడ్డానికలావున్నా దీనిది భలే జోరు...
ఒబెసిటీ వచ్చినవాడిలా.. నడుముకు కండపట్టినట్టుంది ఇదేం కారబ్బా..
ఓహో.. "మారుతీ స్విఫ్టా!!"
దీనికి వెనకో లగేజీ బాక్స్ కడితే  అదే "స్విఫ్ట్ డిజైర్.." శెభాష్ శెభాష్.. బాగానేవుంది.

ఈ లక్కపిడతలేంటి..
"ఆల్టో..." "జెన్" కీ నీకు తేడాఏంటో!
ఏమో నిజం చెప్తే ఎవరూనమ్మరు.. అదేంటో.

అర్రెర్రే.. ఇదింకా లక్కపిడతగాదే.. "చెవ్రల్లెట్ స్పార్కా!.."
దీనీ ఎనక కళ్ళద్దాలు రౌండు రౌండు ఎందుకో... అబ్బా పాత ఇస్టయిలు గాదే!!

ఓర్నీ "నానో..." ఇదేంటన్నో... ఇలాగుందేంటన్నో.. లచ్చకారా.. లచ్చల్లో కారా?
త్రీ-సీటర్ ఆటోకి రంగేసెయ్యలేదుగాందా??
"ఫియట్ యునో..", సారీ.. ఐ డోంట్ నో..!!

ఇదేంటి సిటీ అంతా తిరిగొచ్చిన కారులాగుంది.. "హోండా సిటీనా..."?
బాబూ డ్రైవరూ.. కాళ్ళుచాపుకునే ఖాళీవుందికదాని.. పడుకుని నడపబాకయ్యో!!

"ఫియట్ పేలియో...", వెనక్కినడపాలంటే బయటతలపెట్టి చూడాలయో..
"స్కోడా ఆక్టావియా..." నోరేతిరగట్లేదు ఇదేం పేరయా!!
"హోండా సివిక్.." మరీపడవలాగుంది లుక్... నడపటానికి డ్రైవరే దిక్కు.

"వోక్సేవేగన్ జెట్టా.."? మార్టిన్.. గుడ్ నైటేంకాదు..

"బి. ఎమ్. డబ్ల్యూ.." అయ్ బాబోయ్.. దూరం దూరం.. గీతడితే.. నా ఒకనెల సేలరీ.. దొబ్ల్యూ...
"ఆడీ.." మాతాతకేలేదు బాబూ గాడీ...!!
"స్కోడా ఫేబియా.." చిన్నకారుకెందుకంత ప్రైసియా...

"టా.. టా.. సఫారీ....", బానేవుంది జడముడేసుకెళ్తున్న ఆంటీలాగా ఎనకాలీ టైరెందుకో..
"హోండా ఏకోర్డ్..", సారీ ఐ కెన్నాట్ ఏఫోర్డ్..

"మారుతీ ఏ-స్టారు.." ఆ మిడిగుడ్ల హెడ్లైట్లేంటి మాష్టారూ??

వీడెవడుపాపం ఎనకెవడిచేతో నొక్కునొక్కించుకున్నటుంన్నాడు...
ఇది డాషిచ్చింది కాదా!!.. ఆహా.. ఇదే మోడలా..
ఓహో.. ఇది "మారుతీ రిట్జా..!!"

అంతలా హారన్ కొట్టకయా.. "ఫియట్ లీనియా".. కారుకొన్నది నీ బాబు మనీయా?

అప్పుడే.. ఆఫీసొచ్చేసిందే.. మిగతామోడల్స్ మళ్ళీ ఇంటికెళ్ళేటప్పుడేఁ.. ఏఁ..

18, నవంబర్ 2010, గురువారం

మా ఇంటి తంటా!!!

"నందికొండా వాగుల్లోనా నల్లాతుమ్మా నీడల్లో", అంటూ భయంకరమైన పాటతో చీకటిపడుతున్నవేళ షర్టుజేబులోవున్న సెల్ ఫోన్ రింగ్ అవటంతో..., కుకట్ పల్లి విలేజ్ దగ్గర ట్రాఫిక్లో ఇరుక్కున్న శంకర్రావు వాళ్ళావిడకోసం అని కష్టపడిసంపాదించి మరీ పెట్టుకున్న ఆ రింగ్ టోన్ వినగానే చిరాగ్గా సిక్స్ ప్యాక్ మొహంలో తెప్పించుకుని.. "మా రాక్షసిదే ఫోను.. మళ్ళీ దీనికేం గుర్తొచ్చిందో....", అనుకుంటూ సెల్ ఫోన్ బటన్ నొక్కి.. హెల్మెట్ కవర్ కాస్త పైకి జరిపి చెవికీ హెల్మెట్క్ కి వున్న ఇరుకులో ఫోన్ ని ఎడ్జస్ట్ చేసేసి హీరోహోండా స్ల్పెండర్ బండిని రెండోగేర్ లోవేసి లాగిస్తూ.. "హా.. ఏంటో త్వరగా చెప్పు.. నేను ట్రాఫిక్లోవున్నాను" అన్నాడు తన భార్య పార్వతితో.

"ఏవండీ.. వారం క్రితం.. గృహిణి టీవివాళ్ళకు.. నేను రాసిపంపించిన వంటకం లక్కీడ్రాలో సెలక్టయ్యిందంటండీ.. ఈ ఆదివారం ఆ వంటకం షూటింగ్ కు వస్తున్నాము.. అన్నీ రడీచేసుకోండని.. ఇప్పుడే ఫోనుచేసి చెప్పారు.. ఈ విషయం మన కాలనీ వారందరికీ చెప్పాలి వస్తూ వస్తూ నాలుగు కిలోల స్వీట్స్ పట్టుకురండి.. హౌసింగ్ బోర్డులోవున్న మీ ఫ్రెండ్ షాపులోమాత్రంతేవొద్దే.. ఆ ముతకకంపు స్వీట్స్ ఇస్తే మనపరువుపోతుంది.. కాస్త  ఖర్చయినా పుల్లారెడ్డి స్వీట్స్ పట్టుకురండి..", అని సంబరపడిపోతూ చెప్పింది పార్వతి.

ఆనందంలోవున్న శ్రీమతికి ఎదురుచెబితేఏమవుతుందో ఒక్కసారి వూహించుకున్న శంకర్రావు వులిక్కిపడి మన లోకానికొచ్చి.., ఇప్పుడు కుళాయి విప్పిందంటే.. హౌసింగ్ బోర్ట్ కాలనీ మొత్తం వరదలే వరదలు..  పుట్టింటికని సూట్ కేస్ సర్దిందంటే?,  దారి చార్జీలూ వదులుతాయి.. వీధినపెట్టి పరువూతీస్తుంది  ఎందుకొచ్చిన గొడవ.. ఆ డబ్బులేదో స్వీట్స్ కొనేస్తేపోలా.. అనుకుని.. లెక్కలేసుకుని.. "సరేలే తెస్తాను.. పుల్లారెడ్డి స్వీట్స్ అంటే నేను కుకట్ పల్లివరకూ వచ్చేసా మరి.. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో వెనక్కువెళితే ఇక రేపొద్దున్నే ఇవ్వాలి స్వీట్లు... చూస్తాలే వేరేచోట", అని కాస్త స్వీట్ల ఖర్చులోనైనా కటింగ్ వేద్దామని మాటతిరగేసాడు శంకర్రావు.

"మెయిన్ రోడ్డు దగ్గరకూడా ఒక బ్రాంచీ వుంది కదా!!, మొన్ననేనూ.. మా ఫ్రెండ్ చిట్టీ.. వివేకానందానగర్లో వున్న వాళ్ళ అక్కగారింటికి వెళ్ళినప్పుడు - అక్కడే కొనుక్కుని తీసుకెళ్ళాం... మీకు ఎడ్రస్ తెలియకపోతే ఎవరినన్నా అడగండి.. అక్కడేకొనండి.., నేతితోచేసినవి చాలా బాగుంటాయి.." అని సలహా ఇచ్చింది పార్వతి.

"ఓహో నీకు అదీ తెలిసిపోయిందా.. ఆ చిట్టీ.. పొట్టీకి పనేముంది.., వాళ్ళాయనకే సాఫ్ట్వేర్ ఉద్యోగం నేతితో ఏంటి బంగారంతో చేసినవైనాకొంటుంది..", అని మనసులో తిట్టుకుంటూ, "సరేలే.. పెట్టెయ్ తెస్తాను..", అని కంగారులో ఒక గేరు ముందుకేసేసి బండిని గర్ ర్ మనిపించి.. మళ్ళా తడబడి.. నెమ్మదిగా క్లచ్ పట్టుకుని.. ముందుకు నడిపించాడు. శంకర్రావు.

ఇంటికొచ్చి తలుపు తట్టగానే సెకన్లలో తెరుచుకున్న తలుపు వెనుకే ముక్కుతగిలేంత దూరంలో, త్రీడీ సినిమాలో దేవతసినిమా చూసినట్టుగా పైనుండి కిందకు దిగపోసుకున్న బంగారునగలతో.. మొహంమీదకొచ్చి ఎదురుగా నిలబడుంది పార్వతి.. "ఈ నగల దుకాణం ఒంటిమీదేసుకు తిరుగుతున్నావ్ దేనికే?, ఎవరింట్లోనన్నా పేరంటం కబురొచ్చిందా", అని అడిగాడు.. స్వీట్లకయ్యిన వెయ్యిరూపాయల బిల్లును నాలుగుసార్లు పరికించి చూసుకుని, మరీ మరీ తెచ్చుకున్న శంకతో ఊగిపోతున్న శంకర్రావు.

"పేరంటమా పాడా.., ఈ స్వీట్లు పంచడానికెళదాం పదండి మీరు త్వరగా ఫ్రెస్ అయ్యి రండి", అని స్వీట్లప్యాకెట్టు చేతిలోంచి లాక్కుని.. పైనుండే కుక్కలావాసన చూస్తూ.. "అబ్బా అదే.. పుల్లారెడ్డి నెయ్యివాసన.." అంది పార్వతి.

"పొద్దున్నుండి ఆఫీసులో పనితోకొట్టుకుచచ్చి కాళ్ళీడ్చుకుంటూ ఇంటికొచ్చాకా, వేడివేడిగా కాఫీనో టీనో తీసుకొచ్చి ఇవ్వకపోగా.. నాకిదో గొడవేంటే.. నేను రాను.. తలనొప్పిగావుంది.. అమృతాంజనం రాసుకుని పడుకంటా.. నువ్వెళ్ళి ఆ ఏడుపేదో ఏడు..", అని కాలిబొటనవేళ్ళమీదలేచి నిలబడి కస్సుమన్నాడు శంకర్రావు.. భర్త పరిస్థితి చూసిన పార్వతి మారుమాట్లాడకుండా నగలదుకాణం తో పాటుగా స్వీట్లప్యాకెట్టు మోసుకుంటూ బయటకు బయలుదేరింది.

శంకర్రావు అమీర్ పేటలోవున్న ఓ కంపెనీలో ఎకౌంటెంట్ గా పనిచేస్తుంటాడు... నెలకు పదిహేనువేలు జీతం.. రోజుకు పదిహేనుగంటలు పని.., సాధాసీధా బతుకుతో బండినలా నెట్టుకొస్తున్నతనికి, ఇంట్లోవాళ్ళు వయసయిపోతుందిరా బాబూ అని బ్రతిమలాడి.. వద్దువద్దన్నా.. బలవంతంగా పెళ్ళిచేసేసారు.., పెళ్ళయిన మొదటిరోజునుండీ కష్టాలు మొదలయ్యాయి శంకర్రావుకి... తను ఇదంటే.. ఆమె అదంటుంది..,మిద్దెంటే మేడంటుంది..,వద్దన్నదే ముద్దంటుంది.. , అలా ప్రతీదానికీ తనకు వెతిరేకదిశలోనే వెళ్ళే పెళ్ళాంమాట కాదనలేక.. నాకిలాగే రాసిపెట్టుంది.. నా ఖర్మింతే..అనుకుంటూ.., తనే కాస్తోకూస్తో కాంప్రమైజ్ అయిపోతూ... కష్టాలను దిగమింగుతుంటాడు శంకర్రావు.

అసలు ఈ గృహిణి టీవీవాళ్ళను... ఏంచేసినా పాపంలేదు.., ఆడదంటే అబలకాదు.., ఆడది ఆట వస్తువుకాదు.. అని ఆడాళ్ళలో లేని నెగిటివ్ థింకింగ్ ని నూరిపోసి.. పెద్దపెద్ద లెక్చర్లివ్వటం.. పిచ్చిపిచ్చి ఆటలకాంపిటీషన్లు పెట్టి.. పదిరూపాయల గిఫ్ట్లిస్తూ.. ఏదోపెద్ద దేశసేవచేస్తున్నట్టు.. బిల్డప్లు ఇవ్వటం, మళ్లీ ఈ వంటలప్రోగ్రాములొకటి.. మా ప్రాణాలు తియ్యటానికి.. అని రిమోట్ కంట్రోల్ పై ప్రతాపమంతా ప్రదర్శిస్తూ.. టీవీ చూస్తూ మనసులో తిట్టుకుంటున్నాడు శంకర్రావు. ఆ తిట్లు పవరు తట్టుకోలేనట్టుగా.. మంచిటైమింగ్లో కరెంటు కట్ అయ్యింది.. హమ్మయ్యా పీఢా విరగడయ్యింది.. అనుకుని కళ్ళుమూసుకున్నాడోలేదో.. ఎవరో గులకరాళ్ళు రేకుడబ్బాలో వేసి వాయించుకుంటూ వస్తున్నట్టుగా.. శభ్దం వినపడేసరికి.. మా రాక్షసి వచ్చేస్తున్నట్టుంది.. అనుకుంటూ మొహం చేతితో కప్పేసుకుని నిద్రనటించేసాడు శంకర్రావు.

"ఏవండీ సురేఖలేదూ.. ఎంతమాటందో తెలుసా.. మీ కిచెన్ మొత్తం టీవీలో చూపిస్తారు తెలుసా.., ఆ కెమేరాముందు అన్నీ రిచ్ గా కనిపించాలి.., మీ ఇంట్లోచూస్తేనా.. అన్నీ మాడిపోయిన స్టీలుగిన్నెలే.. కనీసం షూటింగ్ రోజైనా తళతళమెరిసేలా కడగండమ్మా అని అందరిముందూ వెటకారంచేసి.. వెకిలి నవ్వునవ్విందండీ.., దానికెంత పొగరో చూడండి.., నాతోపాటుగా అదీ.. పోటీలకు ఎంట్రీ పంపించింది,అది సెలెక్ట్ అవలేదని.. నాకు ఛాన్స్ వచ్చిందనీ కుళ్ళుదానికి.. ఎలాగైనా దానిపొగరనుస్తాను.. , బిగ్ బజార్లో  ఎక్చేంజీ ఆఫరంటా!!, ఏదైనా పాతవస్తువు తీసుకెళ్ళి కొత్తదాంతో మార్చేయ్యచ్చంటా..!,  మొన్న టీవీలో చూపించాడు.. మన పాతసామనంతా మార్చేసి.. కొత్తసామానుకొనేద్దాం.. అప్పడుగానీ దానికి బుద్ధిరాదు.."  అని నిద్రనటిస్తున్న శంకర్రావు నెత్తిమీద కొత్తగా స్టీలుగిన్నెల భారం తెచ్చిపెట్టింది.

"అయ్యబాబోయ్.. మళ్ళా ఈ కొత్తసామాను కొనే టెన్సనొకటిపెట్టిందా", అని తలచుకునేసరికి నటిస్తున్న నిద్ర ఎగిరిపోయింది.., అప్పుడే కరెంటురావటంతో ట్యూబులైటు మినుకుమినుకుమని నాలుగుసార్లు కొట్టుకుని వెలిగింది. కంగారుగా లేచి బాత్రూమ్లోకెళ్ళి పైకిసౌండురాకుండా కన్నీళ్ళు కార్చి ఆ కన్నీళ్ళతోనే స్నానం చేసాడు శంకర్రావు.

స్నానం చేసొచ్చి.. డైనింగ్ టేబుల్ పై రడీగా వడ్డించి పెట్టిన భోజనం దగ్గర కూర్చున్నాడు. మాడిపోయిన ముదురు బెండకాయ వేపుడుని అన్నంలో కలుపుకుని.. బలవంతంగా తింటూ.. "ఒక్కసారి ఆలోచించే..!, వాళ్ళెవరోకోసం సామానంతా మార్చేస్తే ఎలాగే.. ఈ నెల అసలే చాలా ఖర్చులున్నాయి.., అవన్నీ పోగా.. ఒక్క వెయ్యిరూపాయలు కూడా మిగలవు..., ఇప్పుడు డబ్బులెక్కడతెస్తామే..", అని కళ్ళళ్ళో కళ్ళుపెట్టి చూసే ధైర్యంలేక.. ట్యూబులైట కాంతిలో... పక్కనేవున్న సాంబారు గిన్నెలో పడ్డనీడలో పార్వతొంక చూస్తూ చెప్పాడు శంకర్రావు.

"మిమ్మల్నెమన్నా నేనిప్పుడు డబ్బులడిగానా?, అప్పుడే ఎందుకంత కంగారుపడిపోతున్నారు..., రాకరాక వచ్చిందండీ అవకాశం.. ప్రపంచం మొత్తం మనల్ని టీవీలో చూస్తారు.. అలాంటిది ఆనందించడం పోయి.. ఇలా.. మాట్లాడితే తలపట్టుకంటారెందుకు?" అని కసురుకుంది పార్వతి..

"హమ్మయ్యా.. ఇప్పుడు డబ్బులక్కర్లేదన్న మాట..", అని మనసులో అనుకుని.., మరి కొత్తసామానంటున్నావు..ఎలా.. అని ఆశ్చర్యంతోకూడిన  ప్రశ్నొక్కటేసాడు శంకర్రావు. ఈ నెలనాకు డబ్బులక్కర్లేదు.. మీ క్రెడిట్ కార్డుందిగా అదివ్వండి చాలు... ఇస్స్టాల్మెంటులో కట్టుకందాం అని అసలు బాంబు సాంబారువడ్డించినట్టు ప్లేటులో వడ్డించింది పార్వతి.

శ్రీమతి తెలివితేటలకు నవ్వాలో లేక.. క్రెడిట్ కార్డు రూపంలో జేబుకు పడబోతున్న చిల్లుకు ఏడ్వాలో తెలియక.. విన్న షాకింగ్ న్యూస్ కి మొదలయిన టెన్సన్ వల్ల.. నోట్లో పెట్టుకున్న సాంబారు ముద్ద ముందుకు వెనక్కు కదలకండా గొంతుకడ్డం పడిపోయింది శంకర్రావుకి. గ్లాసుడి మంచినీళ్ళు గటగటా తాగి.. సాంబారుముద్దని లోపలికి గెంటేసాడు.

భార్యమాటకు తిరుగులేదని తెలిసినా.. కాసేపు ఆలోచించి చించి ఒక నిర్ణయానికొచ్చినట్టుగా నటించి.. "సరేలే క్రెడిట్ కార్డిస్తా.. కాస్త చూసి జాగ్రత్తగా ఖర్చుచెయ్యి... లేకపోతే క్రెడిట్ కార్టు బిల్లు కట్టలేక పరారయిన దంపతులు అని ఆ వంటలప్రోగ్రాము తరువాత మరళా టీవీలో కనిపించే అవకాశం వస్తుంది..", అని చమత్కరించాడు శంకర్రావు.

తరువాతరోజు ఆఫీసుకు వెళుతున్న భర్తతో పాటే షాపింగ్ కి బయలుదేరింది పార్వతి. అమీర్ పేట బస్టాపులో దించేసి.. జాగ్రత్త అని చెప్పి ఆఫీసుకెళ్ళిపోయాడు శంకర్రావు.

తెల్లవారింది.. బలవంతంగా నిద్రలోంచిలేపేయటంతో ఇంకా నిద్రమత్తు వదలలేదు శంకర్రావుకి, నిద్రలోనే నడుస్తూ టూత్ బ్రష్ కి పేస్టు పెట్టుకుని నోట్లోపెట్టుకున్నాడు.. అలా బయటకొచ్చి చూసే సరికి పెద్దగార్డెన్ కనిపించి ఆశ్చర్యంకలిగించింది. "వున్న నాలుగు మొక్కలకూ నీళ్ళైనా పోసే టైముండని మా దెయ్యం.. ఒక్క రాత్రిలో ఇంటిముందు ఇన్నిమొక్కలెలా పెంచిందబ్బా..", అని ఆలోచనలో పడ్డాడు శంకర్రావు. "ఈమొక్కలెలా వచ్చాయే.. ", అని అడుగుదామని.. మనసులోమాట మనసులోవుండగానే వచ్చి.. "గార్డెన్ బాగుందాండీ?, మరీబోసిపోయినట్టుంటేనూ... అద్దెకు తెప్పిచ్చానండీ.., ఎంతా.. రోజుకు మొక్కకి ఇరవైరూపాయలే..", అని చల్లగా చెప్పేసరికి.. "అద్దెకా??", అని నోరుతెరవగా.. నోట్లోవున్న బ్రష్ కిందపడి నిద్రమత్తంతా ఎగిరిపోయింది శంకర్రావుకి.

రాత్రి కరెంటుపోయిన టైములో ఇంటకిరావటంతో కనపడని విషయాలు ఒక్కొక్కటీ బయటపడి శంకర్రావుకి వారం రోజులు దాకా నిద్రపట్టని పరిస్థితి ఏర్పడింది.

ఐదువేలుపెట్టికొన్న పట్టుచీర..., నాలుగువేలతో డ్రెస్సింగ్ టేబుల్... టీవీ పెట్టుకునే టేబుల్.., కొత్త డోర్ మ్యాట్లు.. మ్యాచింగ్ కర్టెన్లు..., హాల్లోమంచి కార్పెటు.. ఇలా మొత్తం ఇల్లంతా నిండిపోయేలా కొత్తవస్తువులను ఒకొక్కటీ చూపించింది పార్వతి.

"కిచెన్ మెరిసేలా చెయ్యాలన్నావ్ గానీ..ఇప్పడు ఇవ్వన్నీఎందుకు కొన్నావే", అని కస్సుమన్నాడు శంకర్రావు. "మీరు మరీనండీ కిచెన్ అంటే కిచెన్లోనే తీస్తారా వాళ్ళు.. మొదట మన ఇంట్రడక్షన్ తో మొదలుపెట్టేది గార్డెన్లోని.. తరువాత మరి హాల్ లోనే కదా?, అవునండే మర్చేపోయాను మీ హాబీస్ అవి అడుగుతారు..బాగా ప్రిపేరయి చెప్పండే ఏమీ లేవు అనక... ఆ తరువాత.. మరి ఇక మొదలుపెడదామా వంట అని.. కిచెన్ లోకి కట్ చేస్తారు.., అక్కడనేను మేనేజ్ చేసుకుంటాలేండి..", అని.. చిరునవ్వులు చిందించింది పార్వతి.. మరి కిచెన్లో ఏమేంకొన్నావో.. అని తలపట్టుకున్నాడు శంకర్రావు.. అబ్బే అందులే పెద్దగా ఏమీకొనలేదు.. ఒక్క ఆరువేలతో మైక్రోవేవ్ వోవెన్ కొన్నా.. అది తప్ప.. అన్నీఎక్షేంజే", అంది పార్వతి.

"ఓరినాయనో, క్రెడిట్ కార్డుంది కదా అని గీసిపారేసావేంటే?, మొత్తం ఎంత చేసావేంటి బిల్లూ?", అని పెద్దగా కేకపెట్టాడు శంకర్రావు.. ఇంతలో కాలింగ్ బెల్ మోగేసరికి.. "మీరు ఆపండి..,మీరు ఈ వాటంలో కనబడకండి.. వెళ్ళి రడీ అవ్వండి  వాళ్ళొచ్చినట్టున్నారు", అని అద్దంలో ఒక్కసారి మేకప్ సర్దుకుని.. తలుపుతీసింది.

కెమేరామేన్.. లైట్ బాయ్ తో సహా దిగింది అరంగులంలోతు మేకప్ లో మునిగిపోయి జుట్టువిరబూసుకున్న ఏంకర్ సుమతి.. "రండి రండి..", అని నగలు సర్దుకుంటూ ఆహ్వానించింది పార్వతి . వాళ్ళకు టిఫిన్లు కాఫీల అందించేసరికి రడీ అయ్యివచ్చిన శంకర్రావుని పరిచయంచేసి ఎక్కడావినని కబుర్లన్నీ సుమతికి చెప్పేస్తుంటే.. శంకర్రావు ఏమనలేక..పిచ్చినవ్వు నవ్వి..వూ.., వూ.. అంటూ తలూపుతున్నాడు. కాఫీలుతాగటం అయ్యాకా.. "ఇక మొదలెడదామా మీ కర్పూరం కాకరకాయ పచ్చడి", అంది ఏంకర్ సుమతి పార్వతి వంకచూస్తూ.
"కర్పూరం కాకరకాయ పచ్చడా".. ఇదేక్కడ పచ్చడిరా దేవుడో అని ఆశ్చర్యంతో నోరొదిలేసాడు శంకర్రావు.

అలా కాదు ఇలా.. ఇలా కాదు అలా అని ఒక నాలుగ్గంటల పాటు తీసిందే తీసాడు కెమేరామేన్.., వంటంతా అయ్యాకా వెళ్ళిపోతామన్నారు టీ.వీ వాళ్ళు. "అయ్యో భోజనం చేసెల్దురుగానీ వుండండీ..", అని పార్వతి అనగానే "భొజనమా.. బాబోయ్..  మేం త్వరగా వెళ్ళాలండీ.. వేరేచోటకూడా షూటింగ్ వుంది", అని.. త్వరత్వరగా పారిపోయారు టీ.వీ వాళ్ళు.

నాలుగు రోజులు గడిచాయి... టీ.వీలో వంటలప్రోగ్రాములో తనని చూసుకుని మురిసిపోతుంది పార్వతి. "నీ కర్పూరం కాకరకాయ పచ్చడికి అక్షరాలా అరవైవేలు క్రెడిట్ కార్టు బిల్లొచ్చింది చూసావా!, నీ వంట రుచిచూసిన ఆ ఏంకర్ ఆ రోజు అంతాలా ఓక్ ఓక్ అని కక్కుకుందా..!, అయినా  వదలకుండా ప్రోగ్రామ్ అంతా ఎడిట్ చేసి ఎలా చూపిస్తున్నారో టీ.వీ వాళ్ళు.., ఛీ.. అది వేయటానికి వాళ్ళకు సిగ్గులేదు.. చూడ్డానికి నీకెలాగు సిగ్గులేదు.. నాకన్నా వుండక్కర్లే.." అని కస్సుమంటూ లేచి బయటకెళ్ళిపోయాడు శంకర్రావు.

23, అక్టోబర్ 2010, శనివారం

ఓ మధుర జ్ఞాపకం..

ఆ చిన్న పడవలో గోదారమ్మ గుండెలపై తేలుతూ వెళుతుండగా... నువ్వు నా గుండెలపై తలవాల్చి చేసిన బాసలు గుర్తున్నాయా?. మన ప్రేమ  ఎప్పటికీ ఇలానే వుండిపోవాలని.. నీలో నేను ఒదిగిపోవాలని.. చెప్పుకున్న మాటలు నీకు ఇప్పుడిప్పుడే గుర్తొస్తున్నాయి కదూ!  ఆ కోకిలమ్మతో పాటు గొంతుకట్టి మనిద్దరం పాడుకున్న పాటలు నీ మనసులో వినపడుతున్నాయా? ఏది నీ గుండెలపై చెవిఆన్చి నన్ను కూడా విననివ్వు మరి!.

తెలతెలవారినా.. మంచు పరదా కప్పుకుని... మునగలాక్కుని పడుకున్న ఈ గోదావరి..,  చలిపొద్దుకు లేవకుండా.. ఒళ్ళువిరుకుంటూ బద్దకం తీర్చుకుంటున్నట్టుగావుండే ఈ  గోదావరి..., ఆహా!.. ఎంతఅందమో కదా!. పొద్దున్నే నేనులేవగానే నా కళ్ళెదుటకొచ్చి.... లేవండి బారెడు పొద్దెక్కింది.. అని చిన్న చిరునవ్వుతో నన్ను పలకరిస్తావే.. దానికన్నా అందమా ఇదీ!, అలా అంటే చిరునవ్వునవ్వేస్తావుగానీ..  ఈ కోనసీమ అందాలన్నీ నింపుకున్న నీ వన్నెలతో పోల్చుకుంటే.. ఈ అందాలేపాటివిలే!. అమ్మో.. అలా సిగ్గుతో ముడుచుకుపోకూ.. మెళికలు తిరిపోకే..  ఆ తెరచాపలా గాలిలో తేలిపోకే..., ఇదంతా నా పైత్యం అని తీసిపారేయకు మరి. ఏ మాటకామాటే చెప్పుకోవాలి కదా!. నిజమే.. ఇవి పొగడ్తలు కాదురా బంగారం. స్వచ్ఛమైన నిజాలురా.

అదినేను మొదటిసారి గోదావరి మీద అలలతో పాటుతేలటం... లాంచిలో ప్రయాణం..., నాకు కొత్తా..,  రివ్వుమంటూ వీస్తున్న గాలి కొంటెగా కవ్విస్తున్నట్టు అనిపించింది. అందుకేనేమో భయమేవేయలేదు..  చాలా సరదాగావుంది.., మా దూరపుచుట్టం పెళ్ళికని వచ్చాం.. నేను పెళ్ళికొడుకు తరపు. చుట్టూ కొబ్బరిచెట్లతో ముసుగేసేసిన పేద్ధ.. పెంకుటి లోగిలి..అందులోనే మాకు విడిది. పెళ్ళిహడావుడి చూస్తూ.. మేమంతా ఆ ఇంటిచుట్టూ కలతిరుగుతుంటే పక్కింట్లో మల్లెపూలు కోస్తూ నువ్వు కనిపించావు.. నావైపు చూస్తావేమోనని ఎంత సేపు వేచిచూసినా నీ పనినీదేగానీ పట్టించుకోవే. ఎవరన్నా చూస్తే బాగోదేమోనని నేను వెళ్ళిపోయాను. తరువాత పందిట్లో పన్నీరు చల్లటానికి నువ్చొచ్చినప్పుడు నీవొంక కాస్త కొంటెగా చూసి..,ఇందాక అంతలా చూస్తుంటే  నన్ను పట్టించుకోలేదే అన్నట్టు చూసాను గుర్తుందా.., తరువాత అదే పెళ్ళిలో ఆ కొబ్బరాకు పందిర్లలో మనం  చూపులతో దోబూచులాడుకున్నాం గుర్తుందా.., నీకు గుర్తున్నాయో లేదోగానీ.. నువ్వుకోస్తున్న ఆ మల్లెపూల సుగంధం.. నువ్వు చల్లిన ఆ పన్నీటి సుగంధం నాకింకా గుర్తున్నాయి.. నాకివన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయెందుకో.

అది జరిగి సంవత్సరం తిరక్కుండానే అలాంటి పందిరిలోనే మనిద్దరికీ పెళ్ళయ్యింది కదా!... అప్పుడేమనిపించింది నీకు?, నాకైతే.. నిన్ను పెళ్ళిలో కలిసిన ఆరోజే.. ఆ దేవుడు మనిద్దరికీ ముడివేసేసాడని అనిపించింది. మనం పొలం గట్లలో... గోదారొడ్డున.. చింతతోపుకాడా.. దొంగచాటుగా కలుస్తుండటం చూసి జాలేసిందో ఏమో పాపం.. గోదారి ఇసకల్లో మనం సరదాగా కట్టుకున్న బొమ్మరిల్లులాంటి ఇంటిలో మనిద్దరినీ గెంటి.., ఇలా అచ్చంగా వెయ్యేళ్ళు... ఒకరి గుండెగూటిలోగిళ్ళలో ఒకరు సవ్వడులుచేసుకోండని.. ఇద్దరికీ బ్రహ్మముడివేసాడనిపిస్తుంటుంది నాకు.

కానీ ఆరోజులు ఇంకా నాకు గుర్తున్నాయి... వెచ్చంగా నీ ఒళ్ళో తలపెట్టుకుని.. ఊరిచివర తమలపాకుతోటల్లో.. ఘాటుఘాటుగా.., చల్లంగా ఎన్నెల్లో.. అరటిచెట్టు నీడల్లో కూర్చుని.. మాటుమాటుగా.. మనం పెట్టుకున్న ముద్దులు..!!, ముద్దులతో వేసుకున్న ముద్దర్లు..., అవి చూసి సిగ్గుతో తలవొంచుకుని నవ్వుకున్న బంతిపూలు..., ఆగుట్టంతా గుండెల్లో దాచుకుని నిద్రలేని రాత్రులు. నాకింకా గుర్తున్నాయి.
నాకివన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయెందుకో.

పెళ్ళయిన కొత్తలో ఒకసారీ.... నీ పుట్టినరోజుకనీ.. ఒకసారి మీ ఊరెళ్ళాం గుర్తుందా!, అప్పుడు మళ్ళీ మనం తిరిగిన చోట్లన్నీ దొంగచాటుగా తిరిగేవాళ్ళం... చెఱుకుతోటల్లో పరుగుపందేలేసుకునేవాళ్ళం. పిల్లకాలవ పక్కన జామచెట్టుకు పట్టిన పట్టుతేనే తీసి నీకు పుట్టినరోజుకానుకగా ఇచ్చాను.. నువ్వు ఆ తేనె రుచిచూసి ఆనందంతో పొంగిపోయావు.. మీ మనసంత తీయగావుంది అని బిగికౌగిలికానుక తిరిగిచ్చావు గుర్తుందా. అలా పొలాంలెంబడీ.. పుట్టలెంబడీ తిరిగి తిరిగి అలసిపోయి సందెపొద్దేల కాళ్ళీడ్చుకుంటూ ఇంటికొచ్చి.. మీ ఇంటి పెరట్లోవున్న గున్నమావిచెట్టుకింద చాపలేసుకుని కుర్చుని కబుర్లుచెప్పకునేవారం గుర్తుందా. అలా కబుర్లలో పడి ఈ లోకాన్నే మర్చిపోయేవాళ్ళం.. తలుచుకున్నా చాలు.. అబ్బా!!.. ఆ రోజులు ఎంత బాగుంటాయో.

-------------------------
ఇది నేను రాసుకున్న ఒక పాటకు బ్లాగ్ రూపం :-)

17, అక్టోబర్ 2010, ఆదివారం

ఇడ్లీ - అదే చెట్నీ!!


పొద్దున్నేలేచి వేడివేడి రెడ్ లేబుల్ టీ తాగుతూ బాల్కనీలోకొచ్చి ఒక్కసారి ఆకాశాన్ని చూసాను.. అబ్బా ఎన్నాళ్ళయ్యింది ప్రశాంతంగా ఇలా ఆకాశాన్ని చూసి అని మనసులో అనుకుంటూ.. చల్లని గాలి పీల్చుకున్నాను. ఈ మధ్యన ప్రాజెక్టు రిలీజ్ గొడవలోపడి.. బయట ఎండా కొండా.. వానా గీనా తెలియకుండా పోతుంది. ఈ వెధవ టెన్సల్ననుండి ఎప్పుడు బయటపడతానో ఎంటో అనుకుంటుండగానే.. ఫోన్ మోగింది.., టెస్టింగ్ టీమ్ నుండి.. అదేదో పనిచేయటంలేదని.. క్లైంట్ నుండి మెయిలొచ్చింది.., మీటింగ్ వుంది త్వరగా ఆఫీసుకు రమ్మని..., కాసేపు ప్రశాంతంగా ఉందామనుకున్నానా.. అయిపోయింది.. మళ్ళీ ఎక్కడలేని బి.పి వచ్చేసింది..

త్వరత్వరగా స్నానంచేసి రడీ అయ్యాను. నిన్ననేగా ప్రోజెక్ట్ రిలీజ్ ఇచ్చాం ఏమయ్యుటుంది మళ్ళీ.. అని అలోచిస్తూనే హాల్లోకొచ్చి మా ఆవిడిచ్చిన ఇడ్లీ ప్లేట్ అందుకుని తింటున్నా.. ఒక ఇడ్లీ మొత్తం తినేసాకా తెలిసింది.. అందులో రోజూ చేసే చెట్నీలేదని.. అల్లంచెట్నీ వేసిచ్చిందని.., చెట్నీలేందే ఇడ్లీ అస్సలు నచ్చదు నాకు.. అల్లంచెట్నీలు.. ఆవకాయ-పెరుగు చెట్నీలు ప్రత్యామ్నాయాలుగా అనిపిస్తాయి.. ఎందుకో మరి, చెట్నీలేని ఇడ్లీ నాకు - ప్లానింగ్ లేని ప్రాజెక్టులాగా.. గాలిలేని టైరులాగా..  మ్రోగలేని సెల్లులాగా..  పనిలేని టెస్టర్ లాగా కనిపించి మంట తెప్పిస్తాయి.  ఒక్కసారే.. ఉగ్రరూపం దాల్చి.. చెట్నీ చేయొచ్చుగా అన్నాను. ఏ రెస్పాన్స్ రాలేదు అవతలివేపునుండి. కానీ మాచంటాడు కెవ్వున కేకేసి ఏడవటం మొదలెట్టాడు.

అమ్మో వీడెడవటం మొదలెట్టాడు.. అనుకుంటూనే.. గడియారం వంక చూస్తూ.. టైమయిపోతుందని టెన్సన్లో ఎప్పుడు తినేసానో ఇడ్లీలన్నీ తినేసా .. కంగారు కంగారుగా పార్కింగ్ ఏరియాలోకొచ్చాను.., రోజూ.. నా టూవీలర్ సీటుని హైకులటైములో మేనేజర్ ని గోకినట్టు గోకేస్తూ నాకు దొరక్కుండా పారిపోతున్న పిల్లి.. చక్కగా బండిపైకెక్కి.. ముడుచుకుని.. టెన్సన్ లేని నిద్రతో ఎంజాయ్ చేస్తుంది.

చెట్నీలేదని ఒకపక్క... ఆఫీసులో టాస్క్  టెన్సన్ మరోపక్క..., ఈ కోపాలన్నీ ఒక్కసారి గుర్తుచేసుకుని.. హాయిగా నిద్రపోతున్న పిల్లిని..  లాగి పెట్టి నడ్డిమీద ఒక్కటి తన్నాను. అదేదో సినిమాలో చిరంజీవి గుఱ్రంతో పాటుగా లారీకిందనుండి జర్రున జారి అవతలివైపుకొచ్చినట్టుగా.. పక్కనేవున్న కారు కిందనుండి జారి అవతలికెళ్ళిపడి లేచి.. నా వంక తిరిగి చూసిందా పిల్లి. "లేకపోతే.. ఆఫీసులో టెన్సన్ క్రియేట్ చేస్తావా!!!.. చెట్నీలేకుండా చేస్తావా!!!.. నా సీటు గోకేస్తావా..!!", అని తిట్టుకుంటూ దాని కళ్ళలోకి కళ్ళుపెట్టి చూస్తూ.. పళ్ళుకొరికా.. "అవన్నీనాకేంతెలుసు.. ఏదో సరదాగా టైమ్ పాస్ కి సీటుగోకానంతే..", అన్నట్టు నా వంక చూసి మేవ్వ్ అంది... "ఛస్.. ", అని బెదిరించా.. పారిపోయిందా పిల్లి.

బండి స్టార్ట్ చేసి స్పీడుగా లాగించాను.. మా బిల్డింగ్ గేటు దాటి బయటకొచ్చాను.. దారిలో  ఆగివుంది ఒక పసుపు కలర్ లారీ.., పక్కనుండి తప్పించుకుని వెళ్ళే ఓపికలేదు.. సమయమూలేదు.. ఎవడ్రా అడ్డంగా ఆపాడు అంటూ ఎక్సలేటర్ పెంచి జుమ్మనిపించి.. లారీపైనుండి ఎక్కించేసా.. ముక్కముక్కలైపోయింది.. నా బైకు కాదు.. లారీ..!!!, ఎవరూ చూడలేదు కదా.. అని అటుఇటూ చూస్తూ.. బండి ఇంకా స్పీడుగా లాగించేసాను. ఇంకా నయం..  ఆ ఐస్క్రీమ్ బండిదగ్గర ఐస్క్రీమ్ కొనుక్కుంటున్న చిన్నపిల్లాడు వెనక్కు తిరిగి చూడలేదు కాబట్టి సరిపోయింది.. లేకపోతే కింద పడి "నా బొమ్మ లారీ నాకిచ్చేయ్..", అని ఏడ్చి.. గీ.. పెట్టేవాడు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాను.

ఆఫీసు చేరుకున్నాకా బలవంతంగా పార్కింగ్ ఏరియాలో రెండు దున్నపోతుల్లావున్న యమహా.. బైకులమధ్యన నా బండిని ఇరికించటంవల్ల అటుఇటూ ఒక గీత పడింది.. అరెరే.. ఎంత జాగ్రత్తగా చూసుకునే బైకిలా అయిపోయిందేంటా అని. ప్రాణం చివుక్కుమంది..

అక్కడనుండి మొదలయింది నా బ్యాడ్ డే... ఆ రోజంతా గజిబిజి గందరగోళం.. ఒకడికనుకుని ఒకడి మెయిల్ పంపించి నీకు మెయిలిచ్చాను కానీ నువ్వు రిప్లై ఇవ్వలేదు, అది నా తప్పుకాదని పెద్ద దెబ్బలాటపెట్టుకున్నా,వాడేమో నాకు రాలేద మొర్రో అని తలపట్టుకున్నాడు. తీరా వెళ్ళి నా మెయిల్ సెంట్ అయిటమ్స్ లో చూస్తే రమేష్ అన్నవాడికి పంపబోయి.. రాహుల్ అన్నవాడికి పంపానని తెలిసింది. ఎడ్రస్ బార్లో.. R అని కొట్టగానే అవుట్ లుక్లో ఏదొస్తే అది చూడకుండా ఎంటర్ కొట్టేయటం వల్లే కదా.. ఇలా జరిగింది.., ఎధవ ఐ.టి బద్దకం..,  ఛ అనుకన్నా.

ప్రోజెక్ట్ టెస్టింగ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో డిస్కస్ చెయ్యాలి మీటింగ్ అన్నారు. ఏంటో తాడో పేడో తేల్చేయాలి.. అని తొడకొట్టుకుంటూ.. లేని మీసం తిప్పుకుంటూ.. మీటింగ్ రూమ్ వైపు బయలుదేరాను. గంటన్నర చెమటలు పట్టేలా డిస్కస్ చేసి.. ఎనాలసిస్ అని తలకాయని..  అందరూ తమతమ అభిప్రాయాలు చెప్పాకా తెలిసింది తేలింది ఏంటంటే.. మా క్లైంట్ గాడు పొద్దుపొద్దున్నే బెనడ్రిల్ కాఫ్ సిరప్ తాగొచ్చు... మత్తుమత్తు కళ్ళతో పురాతన వెర్షన్లో వేలుపెట్టి టెస్ట్ చేసి..,  మీరేమీ చెయ్యకుండా కొత్త బిల్డ్ ఎలా పంపారు అని సీరియస్ గా మెయిల్ రాసాడని. హమ్మయ్యా మనవైపు ప్రోబ్లమ్ ఏమీలేదన్నమాట.. అని అందరూ ఊపిరి పీల్చుకుని వాడిని బండబూతులు తిట్టుకున్నారు.. కానీ నాకు మాత్రం పాపం వాడికీ ఇడ్లీలో చెట్నీ ఏనచ్చోవుండదులే.. అదే ఎఫెక్ట్ అయ్యుటుందని సర్దిచెప్పుకున్నాను.

మీటింగ్లో మాట్లాడి మాట్లాడి ఓపికలేక.. పాక్కుంటూ నాసీటు దగ్గరకొచ్చేసరికి.. ఎక్కడనుండో లోకల్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది..., నీరసంగానే ఎత్తి హలో అన్నా.., "నమస్తే  సార్..", అంది ఒక ఆడగొంతు.."యస్..", అన్నానేను.. "సార్.. మీరు ఈ సంవత్సరం టాక్స్ సేవింగ్ ప్లాన్ చేసారా.. కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్ఛర్ బాండ్స్ పై...", అని.. ఏదో చెప్పబోతుంటే.. "నేను స్టూడెంటును ఆంటీ..,  ఇప్పుడే నిక్కరేసుకుని.. స్కూలుకు బయలుదేరుతున్నా ఆంటీ...", అని అనేసరికి.. ధబ్మని సీటునుండి కిందపడిపోయిన శబ్దంలా ఏదో శబ్దంతో ఫోన్ కట్ అయిపోయింది. పీఢా విరగడయ్యింది అనుకుని నా సీట్లో కూర్చున్నా.

పద సిగరెట్ అని.. మా డాటాబేస్ వాడు నన్ను లాక్కుపోటానికి నా దగ్గరకొచ్చాడు.. నాకెలాగూ సిగరెట్ అలవాటు లేదు.. ఆ వదిలే ప్రొగపీల్చటం తప్ప.., సరేపద.. అది పీల్చితే అయినా ఈ టెన్సన్లు కాస్త తగ్గుతాయేమోనని.. వాడితో కిందకు వెళ్ళాను...

ఈ రోజంత ఇలావుందేంటబ్బా అని అలోచించగా.. ఇవన్నీ ఆ చెట్నీకి సైడెఫెక్టులేలా అనిపించాయి..వెంటనే  ఈవిషయాలన్నీ మా ఆవిడకు చెప్పాలని ఫోనుచేసాను. అన్ని కుశల ప్రశ్నలు వేసాకా.., ఇవాలా ఇలా జరిగింది.. అదిలా అయ్యింది. ఇదిలా ఏడ్చింది.. ఇవన్నీ చెట్నీసైడెఫెక్టుల్లాగా అనిపిస్తున్నాయి.. అని మొదలుపెట్టాను. అప్పటిదాకా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న మా చంటాడు..డీటియస్..డాల్బీ స్టీరియో మింగేసినట్టు ఏడవటం మొదలుపెట్టాడు.. వీడేడుస్తున్నాడు నాకేమీ వినిపించటంలేదు.. మళ్ళీచేయండి అనగానే ఫోన్ కట్ చేసేసా.. మళ్ళీ ఒక పావుగంటయ్యాకా చేస్తే మళ్ళీ అదే గొడవ.. ఐదునిమిషాలు కేరింతలు కొట్టాడు చెట్నీ మాటెత్తగానే డాల్బీ ఏఫేక్ట్..ఈ సారి వాడి నోటిదగ్గర ఫోన్ పెట్టిందేమో.. అమ్మో.. వీడిసౌండుకన్నా నా ప్రాజెక్ట్ గొడవలే బెస్ట్ అని ఫోన్ పెట్టేసి.. మళ్ళీ ఫోన్చేస్తే ఒట్టు.

ఇంటికొచ్చాకా..,చంటాడు పడుకున్న సమయం చూసుకుని.. మొత్తం జరిగిందంతా చెప్పాను.., చెట్నీలేని బతుకు.. దుర్భరం.. అన్యాయం, అక్రమం.. ఆవేశం ఆయాసం.. అని నా గోడు వినిపించి ఆయాసపడ్డాను. సరే సరే.. పాయింట్ నోటెడ్..రేపట్నుండి చెట్నీ మర్చిపోకండా చేస్తా అని.. హామీ ఇచ్చి కరపత్రం పై సంతకం చేసింది మా ఆవిడ.

తరువాతరోజు పొద్దున్నే యధావిధిగా ఆఫీసుకు రడీ అవుతున్నాను. టీ.వీ పెట్టి చూస్తూ మళ్ళీ ఇడ్లీప్లేటందుకున్నాను... అదే ప్లేట్.. అవే ఇడ్లీలు.. కానీ నేనుకున్న చెట్నీకాకుండా..మళ్ళీ అల్లంచెట్నీవుంది. ఇదేంటిది.. అని మళ్ళీ క్లాస్ మొదలుపెట్టాను.. ఇంతచెప్పినా నువ్వు మారలేదు.. మర్చిపోయావ్.. అది ఇదీ.. ఆట్.. ఊట్.. అల్లంచెట్నీ అని చెడమడా తిట్లు అందుకున్నా.., తిట్టి తిట్టి.. ఆవేశపడి... చెమటలు తుడుచుకున్నాను.

ఒక ఐదు నిముషాలు నిశ్శబ్దం..

ఆవేశపడకండి.., ఈ మంచినీళ్ళు తాగండి.. అని మంచినీళ్ళ గ్లాసు చేతికిచ్చి.. ఇదిగో చెట్నీ!!... చేసాను.., మీరేమంటారో అని అల్లంచెట్నీవేసా అంతే.. అని.. ప్లేట్లో వడ్డించింది.

ప్రక్కనే దివాన్ కాట్ పై.. ఆన్ యువర్ ఆర్మ్స్ అనగానే.. పరుగెత్తటానికి రెడీగా వున్న అథ్లెట్ లాగా.. మోకాళ్ళపై నిలబడి.. హిహీహీ.... అని కేరింతలుకొట్టి వెక్కిరించినట్టు నవ్వాడు మా చంటాడు.

22, సెప్టెంబర్ 2010, బుధవారం

బకాసురులు - 3


(రీల్ అతుక్కుంది.. ఈ కధకు బయ్యర్స్ ఎవరూ రాకపోవటంతో.. చిన్న ధియేటర్లవాళ్ళని బ్రతిమలాడి ఇచ్చుకోవటంవళ్ళ ఇలా రీళ్ళు తెగిపోతున్నాయి.. అంతరాయాలకి చింతిస్తున్నాము.. )

అది దగ్గర్లోవున్న బడా కార్పొరేట్ హాస్పిటల్.. ఒక్కసారి.. హాస్పిటల్ ఎంట్రన్సు గేటుపై లాంగ్ షాట్..హాస్పిటల్ పేరుపై ఒక క్లోజప్ షాట్.. కట్ చేస్తే... టోయ్. టోయ్.. టోయ్.. అంటూ వచ్చిన అంబులెస్స్ కూతలు.., జనాల ఆర్తనాదాలు.., హడావిడిగా తిరుగుతున్న డాక్టర్లు.. కొత్తకొత్తబట్టలువేసుకుని స్ట్రెచ్చర్ పై పడుకున్న పేషెంట్లు.., ప్లేట్లో.. ఇడ్లీ..దోశ.. పెసరట్టుప్మా తీసుకెళుతున్నట్టుగా.. ఒక సెలైన్ బాటిల్.. ఒక కాటన్ రోల్.. ఒక బ్లడ్ బాటిల్ .. ఒక సిరంజి పెట్టుకుని.. పరుగులు తీస్తూ పట్టుకెళ్తున్న నర్సులు.. ఇవ్వన్నీ నిజంగా కళ్ళముందులేకపోయినా... తెలుగు సినిమాలు చూసిచూసి.. అదేరకంగా వూహించుకుంటూ.. ఒణికిపోతున్నాడు బొండు భద్రం. అలా ఒణికిపోతూనే కారురివర్స్ గేరువేసినట్టుగా.. వెనక్కెనక్కి వెళ్ళిపోతున్నాడు.

రిసెఫ్సన్ దాకా వచ్చిన చుండ్రు రమణకి... అప్పటిదాకా పదిచెక్రాల లారీ పక్కన నడిచొచ్చిన ఫీలింగ్ ఒక్కసారిగా మిస్సయ్యేసరికి.. "బొండుగాడేడ్రా..", అని నల్లశీనుని అడిగాడు.. ఇద్దరూ వెనక్కు తిరిగి చూసారు.. గుళ్ళోకివెళ్ళకుండానే.. గుడిపైనున్న రాఘవేంద్రరావుగారి సినిమాలో హీరోయిన్ బొమ్మల్లాగా కనిపించిన బొమ్మలను చూసి కళ్ళుతిరిగిపడిపోయిన భక్తుడు.. కిందపడి.. గిలగిలా కొట్టేసుకున్నట్టు.. హాస్పిటల్ గేటు దగ్గర పడిపోయున్నాడు బొండుభద్రం. జేబులోనుండి కఫ్ సిరప్ అంత చిన్న బాటిల్ బయటపడి.. దొర్లుకుంటూ దొర్లుకుంటూ.. సరిగ్గా పాయిజన్ అని ఇంగ్లీషులో రాసున్నఅక్షరాలు కనిపించేవిధంగా ఆగింది.. (సరిగ్గా ఎలా ఆగింది అనే కదా మీ డౌటు.. ఎన్ని టేకులు తీసుకుంటే ఈషాట్ వచ్చిందో మీకేంతెలుసు.., అయినా సినిమా చూసి.. ఛీ ఎధవ సినిమాఅనేస్తారు.. అదే కదా ప్రాబ్లమ్)

అది చూసిన సెక్యూరిటీ గార్డ్.. "పాయిజన్ కేస్..", అని స్ట్రెచ్చర్ పట్టుకున్న బాయ్ ని పిలుస్తూ ఆర్తీ అగర్వాల్ లా ఆర్తనాదం చేసాడు. ఒకపది మంది సాయం అడిగి బొండు భద్రాన్ని అతి కష్టంమీద స్ట్రెచ్చర్ పై ఎక్కించారు. ట్రాలీ తోసుకుంటూ వెళుతున్నారు.. చక్రాలు కిచ్ కిచ్ మని శబ్దంచేస్తున్నాయి... సీలింగ్ పై లైట్లు వెనక్కు వెనక్కు వెళ్ళిపోతున్నాయి. మిగతా ముగ్గురూ ట్రాలీతోపాటే పరుగెడుతున్నారు.

"ఏరా.. ఇప్పటిదాకా బాగానేవున్నావుగా.. అంత సడెన్ గా ఎలా పడ్డావ్",అని ట్రాలీ తో పాటే పరుగుతీస్తూ బొండుభద్రం చెవిలో గుసగుసలాడాడు కుక్కల సతీష్.
"నాకు చిన్నప్పటినుండి హాస్పిటల్ అంటే చాలా భయంరా.. చిరంజీవిని చూడగానే కాళ్ళువొణికిపోయేవి..", అన్నాడు బొండుభద్రం.
"చిరంజీవి కాదెహే...సిరంజి.., సరేలే కానీ.. గీతాంజలి సినిమా చూసావా?", అనడిగాడు చుండ్రు రమణ.
"ఒరే.. ఆ సినిమాలు.. స్టోరీలు అవసరమా ఇప్పుడు?", అనడిగాడు బొండుభద్రం.
"మరదే.. అందులో హీరోయిన్ కి కేన్సర్ అని తెలిసాకా.. హాస్పిటల్ కి తీసుకెళుతున్నప్పుడు సీన్లో ఆమె ఎలా ఏక్ట్ చేసిందో.. ఫ్రేమ్ టుప్రేమ్ అలానే ఏక్టింగ్ చెయ్యి.., నువ్వేం భయపడకు.. మేమున్నాం.. నువ్వు కుమ్మేయ్.., సిరంజి లేకుండానే.. ఇంజక్షన్ సెలైన్ ద్వారా ఇవ్వమని నర్సుకి చెబుతాంలే.. ", అని సలహా ఇస్తూ  ధైర్యం (తేజ సినిమా  ధైర్యం కాదు) చెప్పాడు చుండ్రు రమణ.

ట్రాలీ చక్రాల కీచ్ కీచ్ శబ్దాలు వింటూ.. సీలింగ్ పై వెనక్కు పరుగెడుతున్న లైట్లు చూస్తూ.. బొండుభద్రం ఒక పదిసెకన్లు.. ప్లాస్బాక్ లోకి వెళ్ళాడు. గీతాంజలి సినిమాలో ఆ సీన్ ఒక్కసారి ఊహించుకున్నాడు.. ఇరగదీసేసి ఏక్ట్ చేసేసాడు. ట్రాలీని నడుపుతున్న బాయ్స్ ఇంకా ఫాస్ట్ గా తోసుకుంటూ.. ఐ.సి.యు వైపు తోసుకు వెళుతున్నారు. ఆ ముగ్గరూ ఇంకాఫాస్ట్ గా ట్రాలీతోపాటే పరుగెడుతున్నారు.

"ఒరేయ్..మరీ ఎక్కువ ఏక్ట్ చెయ్యకు.. ఆ హీరోయిన్లాగా నీకు క్యాన్సర్ అని ట్రీట్మెంటిచ్చేయగలరు.. పాయిజన్ కేసులా చెయ్యి చాలు", అని చెప్పాడు నల్లశీను.

ట్రాలీ ఐ.సి.యు లోపలికెళిపోయింది.. గోడమీదనున్న రెడ్ లైట్ వెలిగింది.

రిసెఫ్సన్ దగ్గరకెళ్ళి.. హెల్త్ కార్ట్ చూపించి.. వివరాలు కనుక్కున్న చుండ్రురమణ.. టామ్ అండ్ జర్రీ షోలో.. జర్రీని పట్టుకోలేక.. అలసిపోయి.. చేతులు వేళాడేసుకుని.. చెమటలు తుడుచుకుంటూ దిగాలుగా వున్న టామ్ లాగా.. నడుస్తూ వచ్చాడు.
"ఒరే.., ఈ ఎమర్జెన్సీలో ఇన్సూరెన్స్ కంపెనీవాళ్ళని కాంటాక్ట్ చేసి.. వారిదగ్గరనుండి రిప్లైవచ్చేదాకా వెయిట్ చేయలేమండి. ముందు కేష్ కట్టేయండి.. తరువాత ఈ బిల్లులన్నీ పంపిస్తే.. ఆ డబ్బులు మీకు అన్నీ వచ్చేస్తాయని.. చెబుతుందిరా రిషెఫ్సనిస్టు..", అన్నాడు చుండ్రు రమణ.

"అంతే కదా.. నా క్రెడిట్ కార్డుతో కట్టేస్తా.. తరువాత డబ్బులొస్తాయి.., దీనికే టెన్సనెందుకురా.. ", అని చెప్పాడు నల్లశీను.

ఇంతలో డి.టి.యస్ ఎఫెక్టుతో పెద్ద పెద్ద పొలికేకలు.. పెడబొబ్బలు.. ఐ.సి.యు రూమ్ నుండి వినిపించడం మొదలుపెట్టాయి.., పైనున్న రెడ్ లైట్ ఆరిపోయింది.. ఐ.సి.యు రూమ్.. తల్లకిందులైపోయింది. (నిజంగా తల్లకిందుకాదు.. కెమోరా ఉల్టా తిప్పాం.. :-) )

అదంతా చూస్తున్న ఆ ముగ్గురికీ చెమటలు పట్టేసాయి.., సినిమాళ్లలో విలన్ వేసుకొచ్చిన కార్లు. వరుసగా వచ్చి.. వరుసగా ఆగి.. టఫ్ టఫ్ టఫ్.. అని ఒక్ససారిగా డోర్లు తీసినట్టుగా.. ఆ ముగ్గురూ ఒక్కసారిగా టఫ్ టఫ్ టఫ్ అని.. కూలబడిపోయారు... వాళ్ళ జేబుల్లోంచి.. అవే.. కఫ్ సిరప్ బాటిల్లంత బాటిల్లు కింద పడ్డాయి.. మళ్ళీ అలాగే దొర్లకుంటూ పాయిజన్ అని రాసున్న ఇంగ్లీష్ అక్షరాలు దగ్గరే ఆగాయి. ఒక్కసారిగా సీన్ చీకటైపోయింది.

***

అది రాత్రి.. కానీ డిస్కో లైట్లకాంతిలో పగల్లావుంది.. ఒకడి మాట ఒకడికి వినపడనంతగా ధుబ్ ధుబ్మని బీట్ తో వస్తున్న రాక్ సాంగ్స్.. చుట్టూ పార్టీ వాతావరణం.
ఆ నలుగురూ.. తినటం మొదలుపెట్టారు.. తింటూనే నోట్లో మాటవచ్చేటంత కాలీ చేసుకుని.. "ఏరా.., ఐ.సి.యులోంచి.. అంతలా అరిచావ్.. ఏంచూసావ్ రా లోపలా.. ", అనడిగాడు నల్లశీను.. ప్లేటుతో సహా చికెన్ చిల్లీ.. తినేస్తున్న బొండుభద్రాన్ని.

"నర్సు చేతులోవున్న చిరంజీవిరా..", అన్నాడు బొండుభద్రం.

హహాహా.. "కరెంటు పోయి లైటాగిపోతే.. మేమంతా నువ్వు జెండా.. అనుకున్నాంరా", అన్నాడు చుండ్రు రమణ.

కాలం గడిచింది... (ఈ ఊత పదానికి ఇదే ఆఖరులేండి.. తిట్టుకోకండి..)

హాస్పిటల్ బిల్లు పేరు చెప్పి.. చుండ్రు రమణకి పదివేలు.. కుక్కలసతీష్ కి పదివేలు.. బొండు భద్రానికి పదిహేనువేలు.. నల్లశీనుకి.. ఇరవైవేలు ఖర్చయ్యింది. అదే చూపిస్తూ క్రెడిట్ కార్డు బిల్లొచ్చింది నల్లశీనుకి. "ఎంతొస్తే ఏంటిలే..", అని ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసాడు బొండు భద్రం.

"పాయిజన్ కేసు.. సుసైడ్ ఎటంప్ట్ కిందకు వస్తాయి సార్.. మా పాలసీ అది కవర్ చెయ్యదు... ఇది.. మా బుక్ లెట్.. నూటముఫ్ఫైమూడోపేజిలో.. నాలుగోలైన్లో రాసాము.. అది చదువుకొని.., అందులో ఏమన్నా సహాయం కావాలంటే.. మా కాల్ సెంటర్ కి కాల్ చేయండి.. మీరు మాట్లాడుతున్నది సిల్క్ స్మితతో... శుభోధయం.. ధన్యవాదాలు", అని చిలకలా నవ్వుతూ మాట్లాడి ఫోన్ పెట్టేసింది.. కాల్ సెంటర్ అమ్మాయి.

ఆ న్యూస్ విన్న నలుగురికీ కడుపులో దేవేసి.. అప్పుడెప్పుడో పార్టీలో తిన్నదంతా.. ఇప్పుడు బయటకొచ్చినంత పనైంది.

ఆగండాగండి.. అప్పుడే పార్కింగ్ టికెట్ట్ వెతుక్కుంటూ.. సీట్లోంచి లేచిపోతున్నారా?, మరదే.. ఇక్కడో చిన్న ట్విస్టుంది.. అదికూడా చూసి(చదివి) వెళ్ళండి.

బిల్లెలాగూ తప్పేట్టులేదని తెలుసుకున్న ఆ నలుగురూ.. హాస్పిటల్ కి వెళ్ళి.. అందరివీ ఒకటే కేసులు కదా.. మరి బిల్లెందుకు వేరువేరుగా వచ్చిందని గొడవపెట్టారు.

బొండు భద్రం టాంక్ కాస్త పెద్దదనీ.. అది క్లీన్ చెయ్యటానికి స్పెషల్ గా మున్సిపాలిటీవాళ్ళను తీసుకురావల్సొచ్చిందనీ.. అందుకే పదిహేనువేలన్నారు.

నల్లశీను జేబులోనుండి రెండు కఫ్ సిరప్ బాటిల్లంత బాటిల్లు పడ్డాయని.. ఒకదానిమీద పాయిజన్ అని రాసుండగా.. వేరేదానిపై ఏమీ రాసిలేని తెల్లకాగితం అంటించి వుండటంతో.. ఏదో తెలియని విషం తాగుంటాడు అని.. ఆ తెలియని క్లీనింగ్ కి.. ఇరవైవేలయ్యిందని తేల్చిచెప్పి.., నలుగుర్నీ మెడపట్టి బయటకు గెంటేసారు హాస్పిటల్ వాళ్ళు.

20, సెప్టెంబర్ 2010, సోమవారం

బకాసురులు - 2

(ఇది ఇంటర్వెల్ తరువాత భాగం.. ముందు భాగం చదివి సమోసాలు తిన్నాకా ఇది చదవండి.. )

పెళ్ళాన్ని ఊరి బస్సెక్కించి.. పక్కనేవున్న బీరుషాపులో.. ఒక చిన్నలారీడు బీరుకాయలు కొని.. మనుషుల్నిపెట్టి ఇంటికి పంపించమని ఎడ్రసు రాసి షాపువాడికిచ్చాడు చందు. వచ్చిన మనుషులు.. పేకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళలాగా.. ఫ్రిజ్ నిండా.. బీరువానిండా.. మంచంనిండా.. సోఫానిండా.. సింక్ నిండా.. లెట్రిన్ సీట్ నిండా... ఎక్కడ పెట్టమంటే అక్కడ బీరుకాయలు సర్దేసి.. నెలరోజులకు సరిపడా స్టాక్ పెట్టి.. నడవడానికి చోటులేకుండా ఇంటినిండా నింపేసి వెళ్ళిపోయారు. "ఎక్సూజ్ మి..", అని అలవాట్లోపొరపాటుగా అడ్డంగా పడివున్న బాటిల్సుతో అంటూ.. తప్పించుకుంటూ.. తనటీమ్లోనేవున్న నలుగురు కుర్రాళ్ళకు ఫోను చేసి ( ఆ నలుగురు కుర్రోళ్ళకి.. మళ్ళీ రీ ఇంట్రో. కావాలంటే.. ముందు చెప్పిన రాయలసీమ ఎపిసోడ్.. డి.వి.డిని ఇక్కడ ప్లేచేసుకున్నట్టు ఊహించుకోండి..) , "సాయంత్రం పార్టీకి మీరు తప్పకుండా రావాలి.. కొత్త అని అసలేమీ సిగ్గుపడొద్దు.. ఇది అందరం కలవాలనే గెట్ టూగెదర్..", అని మరీ మరీ రమ్మని పిలిచాడు.

చీకటిపడటంతో ఇంటి వాతావరణం మారిపోయింది. బొండుభద్రం.. నల్లశీను.. కుక్కల సతీష్.. చుండ్రురమణ..ఇంకా మరో ఇద్దరితో.. ఇల్లు బార్ లాగా కలకలలాడిపోయింది కాదు కాదు.. కలకలలాడే బార్ లాగా అయిపోయింది.. అబ్బాఇదీ కాదు.. ఇల్లులో కలకలలు బార్ లాగా అయిపోయాయి.. (ష్.ష్.. మీకు అర్ధమయ్యిందనే అనుకుంటున్నా!!.., అదే సినిమా అయితేనా ఈ సీనుకు.. గుణశేఖర్ లా నాలుగుకోట్లుపెట్టి పెద్దసెట్ వేయించి చూపించేవాడిని.., అఫ్ కోర్స్.. నిర్మాత వెఱ్ఱిబుజ్జి అయితే)

దొరికిందే పట్టు అని.. పట్టుకు పది బాటిల్ల చొప్పున తాగటం మొదలెట్టారు నలుగురు కుర్రాళ్ళూ.. ఒక్కరోజులోనే మొత్తం లోడు లోడంతా ఖాలీచేసేసి.. తినటానికి తెచ్చుకున్న స్టఫ్ అయిపోవటంతో.. చందూ ఇంట్లో నెలకు సరిపడా తెచ్చిపెట్టుకున్న ఉప్పూ.. కందిపప్పూ.. చింతపండూ.. ఆవాలు.. మెంతులు.. గసగసాలు లాంటి పచారీ సరుకులన్నీ.. ఇది బాగుందంటే.. టేస్టు ఇది బాగుందని.. ఎలకలు కొట్టినట్టు డబ్బాలన్నిటికీ పళ్ళతోటి గాట్లుపెట్టేసి.. తిరగబోసేసి తినేసారు.

ఇదంతా చూసిన పక్కింటివాళ్ళు... ఎడ్వటైజ్మెంటుల్లేని సీరియల్లాగా సీనుకు సీను డడండ్.. డడండ్.. అని మ్యూజిక్కుతో.. ఫ్లాష్ ప్లాష్.. ఎడిటింగ్ ఎఫెక్టులతో.., 3డి సినిమా కళ్ళజోడులాగా కళ్ళకుకట్టినట్టు.. చందూవాళ్ళావిడకి ఫోనులోనే బుల్లితెరపై చూపించేసారు. అవతలవైపు ఫోనులోమాట్లాడుతున్న చందువాళ్ళావిడ మొహం.. బ్లాక్ &వైట్లోకి మారిపోయింది. అదే బ్లాక్ & వైట్ మొహమేసుకుని.. తరువాత రోజునే ఊరునుండి తిరిగొచ్చేసినావిడ. లిప్ట్ ఎక్కకుండా..., మెట్లెక్కి రాకుండా.., మేడమీదకొచ్చేసింది.

(ఇదే సీరియల్ అయితే.. ఇక్కడే మిగతాది వచ్చేవారం అని టైటిల్స్ వేసేస్తూ.. టైటిల్ సాంగ్ వేసేద్దుం). ఇంతకూ ఆమె లిప్ప్టు ఎక్కుండా.. మెట్లమీదనుండి రాకుండా ఎలా వచ్చిందబ్బా అనుకుంటున్నారా!!, తాగిపడేసిన బీరుబాటిల్లపై అడుగులో అడుగులేసుకుంటూ స్లోమోషన్లో.. నడుచుకుంటూ (ఇదే మోషన్.. నాలుగు ఎపిసోడ్స్ చూపించొచ్చు), నాలుగో ఫ్లోర్లోవున్న వాళ్ళ అపార్ట్మెంటులోకొచ్చేసరికి..., స్వైన్ ఫ్లూ వచ్చిన పందులకి.. టామీ ఫ్లూ టాబ్లెట్టు ఇస్తే మత్తుగా పడిదొర్లుతున్నట్టుగా దొర్లుతున్న చందు.. అండ్ నాదస్వర బృందాన్ని చూసి "హె.. కృష్ణా.. ముకుందా.", అన్నపాట అర్తిగా బ్యాక్ గ్రౌండలో వింటూ.. జన్మధన్యమైపోయిన ఆవిడకి కళ్ళుతిరిగిపోయి.. పోకిరి సినిమాలో మహేష్ బాబు కొట్టినట్టు దిమ్మతిరిగి మైండ్ బ్లాకయిపోయింది.

తలనుండి రాలిన చుండ్రులో కప్పుకుపోయిన్న చండ్రురమణ మొహాం కనపడటంలేదు. పీతకి తాతలాగా తాగిన బొండుభద్రం.. ఒక రూములో మొత్తం బెడ్ కిందనుండి.. కుర్చీలకిందనుండి.. గోడలదగ్గరనుండి.. కార్పట్ పైనుండి.. కార్పెట్ ఏరియా అంతా కవర్ చేసేసి గదికి సరిపడా పడుకున్నాడు. కుక్కలు చించిన కర్టెన్లాగా చిందరవందరగా పడివున్నాడు కుక్కలసతీష్. అసలు కేండెట్టు నల్లశీనేలావున్నాడనే కదామీ కంగారు.., టెన్సన్ పడకండి.. గోర్లుకొరుక్కోకండి.. మిగిలిన ఇద్దరికిందా నలిగిపోయి నల్లపూసైపోయాడుగానీ.. బాగానేవున్నాడు.

ఆ దెబ్బతో కంపెనీలో అందరికీ ఆ నలుగురి గురించీ తెలిసిపోయింది.. పార్టీ ఏదన్నావుంటే... ఎన్నికలముందు దొంగచాటుగా.. మీడియాకి దూరంగా పారిపోయి.. పొత్తులు (మొక్కజొన్న పొత్తులు కాదు) కలుపుకుంటున్న రాజకీయనాయకుల్లాగా.. వాళ్ళకు తెలియకుండా పార్టీలు జరుపుకుంటున్నారే తప్ప.. ఒక్కడుకూడా వీళ్ళముందు పార్టీమాటెత్తటంలేదు.. తినేసి వచ్చి.. వాళ్ళముందు.. బ్రేవ్.. మని గౌడుగేదే త్రేన్చినట్టు పొరపాటున త్రేన్చినా.. గ్యాస్ట్రిక్ ప్రోబ్లమ్ వచ్చేసింది అంటున్నారేగానీ అసలు విషయమే పెద్ద గోబర్ గ్యాస్ అని చెప్పటంలేదు.

లంచ్.. డిన్నర్ ఫ్రీగా ఇచ్చే కంపెనీవాళ్ళు.., అన్నీ మానేసారు. ఆఫీసు ఎంప్లాయిస్ వాహనాలకన్నా.. కేంటిన్ వాడు వండిన వస్తువులు పట్టుకొచ్చే వాహనాలు ఎక్కువైపోయాయని జనాలు గొడవపెడుతున్నారని.. చిన్న సాకును సాగదీసి.. వంగదీసి.. లొంగదీసుకుని.. కార్పొరేట్ స్టైల్లో చెప్పి.. అసలు ఇలా ఇండియా టైము.. యు.యస్ టైము రెండూ చూసుకుని.. ఆప్పొద్దులా ఆంబోతులా తింటున్న("ముప్పొద్దులా దున్నపోతు" కి కొత్త ప్రయోగం.., "ఆరుపొద్దులా ఆంబోతులా" అని అర్ధం),

"ఆం-బోతులు" ఎవరని.. బండబూతులు తిట్టి.. లేనినీతులు చెప్పి.. కొంగబాతుల చంపుట.. నేరమెగదరా సుమతీ.. అని చక్కగా నవ్వుతూ అర్ధంకాకుండా చెప్పిన హెచ్చార్ టీమ్... శ్రీకృష్ణకమిటీలాంటి.. శ్రీరామకమిటీ.. శ్రీదుర్యోధనకమిటీ.. శ్రీబకాసురకమిటీ (టైటిల్ కి జస్టిఫికేషన్ కాదు.).. లాంటి తొమ్మిది కమిటీలు వేసి..ఇకనుండి. తొమ్మిదిదాటాకావుండేవాళ్ళకే డిన్నర్ ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పారు.

అయినా.. ఆ నలుగురి ప్రస్థానం ఆగలేదు.. పనున్నాలేకపోయినా.. పన్నున్నా లేకపోయినా.. అన్ లిమిటెడ్ భోజనంకోసం లేనిపనిని.. అన్ లిమిటెడ్ గా కల్పించుకుని చేస్తూ తినేస్తున్నారు.

కాలంగడిచింది.. కంపెనీ కేంటిన్ మూతపడింది... అన్ లిమిటెడ్ కి అలవాటు పడ్డ ఆ నాలుగు నాలుకలూ చప్పబడి.. చప్పలించబడి.. మెత్తబడి.. ఒత్తబడి.. చిత్తుచిత్తుచేయబడి.. చేతబడిచేసిన నక్కలవలె.. బక్కచిక్కిపోయినవి.


వరదల్లో కట్టుకున్న గోచీవూడిపోబోతూ.. నీటిలోప్రయాణానికి టిక్కెట్టుతీసుకున్న.. సరిసమయంలో.. హెలీకాప్టర్లోంచి పులిహోర పొట్లం పైనుండి కిందకిందకు జారి. మీదమీదకి చేరి.. చేతిదాకావస్తుంటే.. "ఒకటోసారి.. అన్నమా.. మానమా..?, రెండోసారి.. అన్నమా.. మానమా..?", అనుకుంటూ చీటీపాటలా పాటపాడుకుంటున్న ఒక పేద జీవికి.. ఫైటింగ్ సీన్లో గాల్లోగిరగిరగిరమంటూ.. తిరుగుతూవచ్చే మన తెలుగుహీరోలాగా.. ఒక ఎండుటాకు.. గోచీప్లేస్ ని రీప్లేస్ చేస్తే.. "అన్నమే..", అని చిరునవ్వునవ్వుకుని అంటిపెట్టుకున్న ఆకును ఎగరనీయకుండా పులిహోరప్యాకెట్టుని ఎగిరి పట్టుకుని.. బాలీవుడ్ కింగ్ కిస్సర్ ఇమ్రాన్ హస్మీలాగా ఆ పేకెట్టుకు లిప్ కిస్ ఇచ్చి.. పులిహోర తిన్నంత హాయిగా.. తియ్యటి వార్త మోసుకొచ్చింది ఒక ఈ-మెయిల్.

ఆ వారం కంపెనీ మూడవ పుట్టినరోజుని.. సరిగ్గా ఈరోజుకు మూడురోజుల తరువాత.. సెలబ్రేట్ చేసుకోవటానికి మీరంతా మాంచి మూడ్లో.. మూడోనెంబరు రోడ్లోవున్న "మిడ్ టవున్ మూడ్స్" రెస్టారెంటు మూడోప్లోర్కి రావాలని సరిగ్గా మధ్యాన్నం మూడింటికి.. ఇన్ బాక్సులోనవ్వింది ఆరోజొచ్చిన ముప్పైమూడోమెయిల్.. (మూడంకెని ఎక్కువ వాడానని..దీనికి తరువాత స్టోరిలో ఎక్కడో గొప్ప ఇంపార్టెన్సు వుంటుదని.. ఇంగ్లీష్ ఫిక్షన్ సినిమా ప్రేక్షకుడిలాగా ఎక్కువాలోచించి బర్గర్.. సేండ్విచ్ మీద కాలేసేయకండే..)

ఆ మెయిల్ చూసి.. చేతబడిచేయబడిన నక్కలవలెనున్న నలుగురి నాలుకలూ.. సత్తువను పొంది.. సుఖముగానుండెను. (కధసుఖాంతానికి వాడేపదం కాదు)

కాలం గడిచింది.... (నో కామెంట్స్.. ఈ కధలో ఇదే నా ఊతపదం).

కాస్త వెరైటీగా.. పార్టీకి ముందురోజు రానేవచ్చింది.. వెరైటీగా.. ముందురోజు రావటం కాదు.. కధల్లో ఎప్పుడులాగా.. పార్టీరోజు రావటం కాకుండా.. పార్టీముందురోజు వెరైటీగావచ్చిందని.

"రేపటి పార్టీకి ఎలారా.. అసలు ప్రిపేర్ కాలేదు.. కడుపంతా నిండిపోయింది.., అసలు తినలేమేమోరా..", అన్నాడు కుక్కలసతీష్.

"అవున్రా.. నాదీ అంతే.., మరీ ఇంత మూడురోజులముందు సడెన్ గా చెబుతారేంట్రా మనోళ్ళు, కనీసం ఒక పదిరోజులైనా ముందు చెబితే.. పార్టీకి.. సామాజిక న్యాయం చేద్దుం కదా!!", అన్నాడు బొండుభద్రం.

"ఏదొకటి రా బాబూ.., పొద్దున్నే టీ.వీలో మంతెన సత్యన్నారాయణరాజు ఫ్రీగా సలహాలు చెబుతున్నారుకదా అని టీ.వీ పెడితే...,రోజంతా నిమ్మరసం తేనె.. నిమ్మరసం తేనే మాత్రమే పుచ్చుకుంటే.. దానివల్ల కడుపుఅంతా డెట్టాల్ వేసి క్లీన్ చేసినంతలా అయిపోతుందని చెప్పారు.., మొత్తం క్లీన్ అవ్వాలని.. ఒక నాలుగు బాటిల్లు కానిచ్చేసా.. కానీ ఈ తేనే నిమ్మరసం మాత్రమే వుంది చూసారూ.. మొత్తం మంట మంట.. భగభగలాడే పెట్రోల్లాగా బయటకొస్తుంది..., ఇదేంటి మాస్టారు.. డెట్టాల్ లా క్లీనింగ్ అంటే మంట కూడా అలాగేవుంటుందా.. అని ఆయన్నే అడుగదామంటే మళ్ళీ రేపొద్దుటదాకా టీ.వీలో రాడే..", అన్నాడు నల్లశీను.

"ఒరే.. శుభమా అని భోజనాలుపెడుతుంటే.., గురువుగారు.. కడుపులో దేవుతుంది.. వాంతిచేసుకోవాలి.. కొత్త ఆకు ఒకటి తెచ్చివేస్తారా, అన్నాడంట వెనకటికెవడో.., అంత తేడాగా వున్నవాడు అక్కడికి రావటమెందుకూ.. వచ్చివడ్డించే వాడిని పిలిచి మరీ ఆకువేయించుకుని.. ఫుల్ గా కక్కటమెందుకూ.., ఛస్.. ఆపండెహే!!, కడుపు నిండుగా వున్నవాళ్ళూ... మంటతో బాధపడేవాళ్ళూ రానక్కర్లేదు... మీ కడుపులు క్లీన్ చేయించుకోవాలంటే నాదగ్గర ఒక ఐడియావుంది.. అది మీ జీవితాన్నే మార్చేస్తుంది..", అని చిరాకుపడుతూనే సలహాచెప్పాడు చుండ్రురమణ.

ఏంట్రాఏంటది.. అని ముగ్గురూ.. చుండ్రురమణ చుట్టూచేరి గుసగుసలాడటం మొదలుపెట్టేరు.

"పాయిజన్ తాగామని చెప్పి ఏ కార్పొరేట్ హాస్పటల్ కి అయినా వెళ్ళామంటే.., ఏ టెస్టూ చేయకుండానే.., కడుపులో పేగులుమెత్తం బయటకు తీసేసి.. పక్కనున్న బేసిన్లోవేసి సుబ్బరంగా కడిగేసి.., ఆఁ.. అనమని.. నోరుతెరిచాకా.. ఆ పేగులు మొత్తం నోట్లోకి తోసేసి.., అరగంటలో సర్దేస్తారు.. అంతే కడుపు మొత్తం క్లీన్..", అన్నాడు చుండ్రురమణ.

"సర్దేసిన తరువాత.. ఫీజు చెబితే.. అన్నీ మళ్ళీ బయటకొస్తాయి..", అని కోపంగా అన్నాడు బొండు భద్రం.

ఎవరుమీరు.. అసలెందుకొచ్చారిక్కడికి.. అని చెమటలు తుడుచుకంటూ అడిగిన ఒక బక్కప్రాణికి.. జేబులోంచి.. ఒక సిగరెట్టు పెట్టెనుండి.. ఒకపక్కనుండి చింపిన.. అట్టముక్కలాంటి కార్టుముక్కొకటి చూపించి.. "వు. ఆర్ ఫ్రమ్.. సి.బి.ఐ..", అని సినిమాల్లో అన్నట్టుగా.. జేబులోంచి.. కంపెనీ ఇచ్చిన హెల్త్ కార్ట్ చూపిస్తూ.. "ఇవిచ్చింది ఎందుకు మనకూ..., ఈ కార్టు ఎంత పవర్ ఫుల్ అంటే.. దీన్ని నువ్వు హాస్పిటల్ బయటున్న సెక్యూరిటీ వాడికి చూపించినా చాలు.., వాడే డాక్టరయిపోయి.. నీకు వేసెక్టమీ ఆపరేషన్ చేసేయ్యటాకైనా రడీ అయిపోతాడు", అన్నాడు చుండ్రు రమణ.

"సరే పద.., ఆ ఆపరేషన్ తో కడుపుక్లీన్ అవుతుందంటే.. సెక్యూరిటీ వాడు చేస్తే ఎంటి.. జనరేటర్ రూమ్లో వాడు చేస్తేఎంటి.. నేను చేయించేసుకుంటా..మీరూ వస్తున్నారా", అని కార్టుతీసుకుని చేత్తో పట్టుకుని రడీ అయిపోయి నడుచుకంటూ వెళ్ళిపోయాడు.. నల్లశీను.

"ఒరే..ఆగు.. ఆ ఆపరేషన్ కడుపు క్లీన్ చేయించుకోటానికి కాదురా.. బాబూ.., నీకెలా చెప్పేది..", అని వాడివెనకే పరిగెత్తుతూ.. అంతా దగ్గర్లోవున్న బడా కార్పొరేట్ హాస్పిటల్ కి చేరుకున్నారు.

అయ్యో రీల్ తెగిపోయింది.. (కధలో కాదు.. బయట..)

కాసేపు విరామం.. (విరామం అన్నప్పుడు ఏడ్స్ చూడటం అలవాటయ్యిపోతే.. కుడిపక్కకిందనున్న ఏడ్స్ పై క్లిక్ చేసుకోవచ్చు.. :-) )

మిగతాది రీల్ కి అతికించిన ఫెవీక్విక్ ఆరి.. బాగా సెట్టయ్యాకా.. :-)

19, సెప్టెంబర్ 2010, ఆదివారం

బకాసురులు - 1

బురదలో పందిపిల్లలు ఒకదానిమీదొకటి పడి దొర్లినట్టుదొర్లుతూ.., పదిమంది కలిసి ఒకటే అగ్గిపెట్టంత హాస్టల్ గదిలోవుంటూ.., బాగా చదువుకుని కలెక్టర్లయ్యి తిరిగిరండిరా బాబూ.. అని వాళ్ళ బాబులు పంపించిన డబ్బులు.. తింటానికి.. తిరగటానికీ.. షకీలా సినిమాలు చూడటానికే సరిపోక, ఒక్క సిగరెట్టు కొని ఒకడు ఉఫ్ ఉఫ్ మని వూదుతుంటే.. ఆ వచ్చే పొగను సగం సగం షేర్ చేసుకుంటూ పీల్చుతూ. వైన్ షాపుకి ఎదురుగా.., నవరత్నా బార్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంటు మేడపైనున్నడిగ్రీ కాలేజిలో ఒక ఏడెనిమిదేళ్ళనుండీ.. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నారు ఆ నలుగురు కుర్రాళ్ళు.

దూరదర్శన్ లో వార్తలు రావటానికి.. రెండు నిముషాలముందే వెనక్కు లెక్కపెడుతూ వేసే అంకెల్లాగా.. సెకన్లతో సహా వెనక్కు లెక్కపెడుతూ నాలుగు నిముషాలముందే వెంకటరమణ మెస్ దగ్గర.. దినం బోజనాల్లో మిగిలిపోయిన ఆకులు నాకడానికొచ్చిన కుక్కల్లాగా కాసుక్కుర్చున్నారు. "భోజనం తాయారు.." అని బోర్డు ఎప్పుడు పెడతారా.. (తాయారే... అచ్చుతప్పు కాదు.. అదా హోటల్లో వంటమనిషి పేరు.., బోర్డురాసినోడికి బాగా ఫేవరెట్టు.. అందుకే అలా అభిమానం చూపించుకున్నాడు..) వెళ్ళి దూకేసి ప్లేట్లతోపాటుమింగేద్దామా అని ఒకడి వెనకాలొకళ్ళు నిలబడి.. ఒకడి ప్యాంటు వెనుకజేబులో ఒకడు చేతులు పెట్టుకుని... చూస్తున్నారా కుర్రాళ్ళు. "ఒరే.. ఇంకా బోర్డుపెట్టలేదేంట్రా..., కొంపదీసి తాయారు ఈరోజు సెలవా",అన్నాడు బొండుభద్రంగాడు.


"ఆ సంగతి తరువాత గానీ.. వెనకజేబులోచెయ్యి పెట్టి పర్సుందని వెతుకుతున్నట్టున్నావు.., అసలు జేబేలేదక్కడ.. వున్నది ఈ-మెయిల్ ఇన్ బాక్స్ అన్నవిషయం.. నువ్వింకా కనిపెట్టలేకపోతున్నావు, అలాగే.. మోచేతిదాకా చెయ్యి కిందకు పెట్టి అక్కడ కాస్త గోకరా.., బాబ్బాబు దురదగా వుంది అన్నాడు నల్లశీనుగాడు, జేబులోచేయిపెట్టి వెతుకుతూ.. సి.బి.ఐ ఎంక్వైరీ చేస్తున్నట్టు మొహం పెట్టిన బొండు భద్రంగాడిని.

"ఒరే ఛీ ఎవడిపడితే వాడి ఇన్ బాక్సులో మెయిల్స్ చెక్ చేసేవాడిలాగా కనబడుతున్నానా?, ఛెస్.. ఎధవనా బతుకు, భోజనం అవగానే చెయ్యి డెట్టాల్ సబ్బుతో బాగా కడుక్కోవాలి.., గుప్తుల కాలంలో ఉతికి.. మళ్ళీ ఈ రోజే సర్ఫ్ లో నాన్చినాన్చి జాడించిన కుక్కలోడి షర్ట్ తో ప్రస్తుతానికి సరిపెట్టుకుంటా..", అని ఫ్యాంటుజేబులో చెయ్యితీసేసి ఎదురుగా నిలబడి.. తాయారు బోర్డుకోసమే కళ్ళార్పకుండా కళ్ళల్లో వందకేండిల్స్ బల్బువెలిగించుకుని చూస్తున్న కుక్కల సతీష్ గాడి షర్టుకు చేయితుడుచుకున్నాడు బొండు భద్రం. అలా.. ఒకడి సీక్రేటులు ఒకళ్ళు.. లంచం తీసుకుంటూ పట్టుబడిపోయిన ప్రభుత్వోదోగి కధనం.. మాదాంట్లోనే ఎక్ల్సూసివ్.. అని ఎర్రసర్కిల్ తో హైలేట్ చేసి.., వేసిందే వేసి.. చూపించే టీ.వీ చానల్ లాగా అందరికీ తెలిసిన విషయాలనే స్పెషల్ న్యూసులుగా మార్చి చెప్పేసుకుంటున్నారు.

"ఒరే!!.. ఆపండహే.. మీ ఎదవ గోలా... కడుపులో పందికొక్కులు.. ఇంద్ర సినిమాలో చిరంజీవి వేసిన వీణ స్టెప్పేసి గొడవచేసేస్తుంటే... మీగోలేంటెహే..", అని చిరాకుపడుతూ.. బరాక్ ఒబామాలాగా జుట్టున్నా వారం క్రితమే గుండుచేయించుకున్నట్టుండే తలకాయను ఐదువేళ్ళతో బరాబరా గోక్కుంటా.. ఒక పావుకేజీ చుండ్రు రాల్చిన చుండ్రు రాము. అంతలోనే తాయారొచ్చి తయారు బోర్డుపెట్టేసింది.

ఫ్యాంట్లు జారిపోతున్నా పట్టించుకోకుండా.. పరుగెత్తుకుంటూ వెళ్ళి కుర్చీలు కాసేసుకున్నారు... తరువాత సర్వర్ పట్టుకొచ్చిన ఫ్యాంట్లను దులుపుకుంటూ ఒకరినొకరు చూడకుండా నలుగురూ నాలుగువైపులూ తిరిగి.. ఎవరూచూడటంలేదుకదా.. అని వేసుకుని కుర్చీల్లో కుర్చున్నారు. "ఒరే.. మన హోటల్ కి మరో కొత్తవోనర్ రా", అన్నాడు నల్లశీను. "అయితే కుమ్మేయొచ్చు ఈయాలకూడా", అన్నాడు కుక్కల సతీష్.. ఎప్పటిలాగే నాలుగు ఫుల్ మీల్స్ చెప్పి.. పది ఫుల్ మీల్స్ కి సరిపడా తినేసి.. అరగంటలోనే లోపలున్న తాయారుచేతే ఆరోజుకు బోర్డుతీయించేసారు.

వీళ్ళ నలుగురు దెబ్బకీ తట్టుకోలేక అదే మెస్సు.. సంవత్సరంలో అరడజను ఓనర్ల చేతులు మారింది. ఆ రోజు వీళ్ళ తిండి దెబ్బకు... ఆర్ధిక మాంద్యంలో గిలాగిలాకొట్టేసుకున్న క్రెడిట్ కార్డులమ్మేవాడిలాగా అయిపోయాడు కొత్తగా వచ్చిన మెస్ ఓనరు. రాత్రంతా బొండుభద్రంగాడు దేవతకు నైవేద్యం కోసం పెట్టే ముద్దంత ముద్దలు కలుపుకుని.. మురుక్కాల్వ తూమంతున్న నోట్లోకి తోసేసుకుంటూ.. తింటున్నట్టు.. కలల్లోకి వచ్చేసి నిద్రపట్టకుండా చేసేసాడు. "కాలుమీదకాలేసుకని కూర్చుని టీ.వీ చూస్తున్నవాళ్ళావిడకి.. గాజులేసుకుని.. టీ పట్టుకు వస్తే.., నచ్చలేదని ఆ వేడివేడి టీని.. ఆవిడ ఏంచేసిందో చిన్న బ్రేక్ తరువాత చూడండి", అని టీ.వీలో నూతన్ ప్రసాద్ వాయిస్ లో వస్తున్న ప్రోగ్రాములో తనని.. ఒక్కసారి ఊహించుకున్న మెస్ ఓనర్.. ఇకలాభంలేదని.. ఆ నలుగుర్నీ బయటకు తోలటానికి కొత్తకొత్త టెక్నిక్కులు ఆలోచించడం మొదలుపెట్టాడు.

ఓ రోజు అన్నంలో మామూలు సున్నం కాకుండా.. నాటు సున్నం కలిపించేసాడు.., అసెంబ్లీలో ప్రతిపక్షంవాడు బండబూతులు తిడుతుంటే.. మైక్ వాయిస్ కట్ చేయించేసి తనకేమీ తెలియదన్నట్లుగా.. రాసుకొచ్చిన సోదిని చదివివినిపిస్తున్న అఖిలపక్షం మంత్రిలాగా.. ఏమీ ఎరగనట్టు భోజనం తినేసి.. తమలపాకూ.. వక్కా నోట్లోవేసుకుని.. నములుతూ.. నోరుతెరిచి చూపిస్తూ.. బయటకొచ్చాడు బొండుభద్రం.., ఎర్రగా పండిపోయున్న.. ఆ నోరును చూసి మూర్చరోగమొచ్చినట్లుగా గిలగిలా కొట్టేసుకున్నాడు మెస్ ఓనర్.

వేరే రోజు కూరల్లో బస్తాడు ఉప్పు, అరబస్తా తినే షోడా కలిపించేసాడు.. అన్ని కూరలూ ఒక పెద్దగిన్నెలో వేసేసుకుని.. గిన్నెనిండా నీళ్ళు కలిపేసుకుని.. ఆవురావురుమంటా తినేసారు. ఆ నలుగురూ.. (రాజేంద్రప్రసాద్ సినిమా కాదు)

ఇక నావల్లకాదని.., "ఈవిడవేరే ఆవిడని.. ప్రేక్షకులకు తెలిసిపోయినా పర్వాలేదు.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు స్టోరీ మార్చేసైనా కేరెక్టర్ని మార్చేయ్యాలి..", అని టీ.వీ సీరియల్ వాళ్ళు గట్టినిర్ణయం తీసుకున్నట్టుగా ఒక నిర్ణయం తీసుకుని.. తరువాతరోజు సాంబారులో స్పెషల్ గా ఎండుమిర్చిబదులు బొద్దింకలు వేయించి తాలింపుపెట్టించాడు.. బొద్దింకలుమట్టుకే పక్కకు తీసేసి.. సాంబారు జుర్రేసిన కుర్రోళ్ళు.., "సాంబార్ సూపర్ అంకుల్..", రేపూ ఇలానే చేయించండి అని ఓనర్ దగ్గరకు లొట్టలేస్తా వచ్చాడు నల్లశీను. ఆ భయంకరమైన దృశ్యాలు చూసిన ఓనర్.., భయబ్రాంతులతో.. మెంతులు తిని.. వాంతులుచేసుకుని.. హాస్పిటల్లో జాయినయ్యి.. పిచ్చోడయిపోయి రోడ్డుమీద పడ్డాడు.

కాలగడిచింది.. కట్ చేస్తే... అది రాయలసీమలో ఒక ఏరియా... మళ్ళీ కట్ చేసి హెలీకాప్టర్లోంచి కెమేరా జూమ్ చేస్తే... పాములా వంకరలు తిరిగిన మట్టి రోడ్డు.. చిన్నచిన్న చీమలు ఎర్రమట్టినేలలో రన్నింగ్ రేస్ పెట్టుకుని.. దుమ్ములేపుకుంటా వస్తున్నట్టు హెలీకాప్టర్లోంచి కనిపిస్తున్న.. నాలుగు నల్ల ఇన్నోవాలు ఒక తెల్ల స్కార్పియోని ఫాలో అవుతున్నాయి. దానివెనకే.. మూడు తెల్ల టవేరాలు.. ఒక నల్ల సఫారీనీ వెంటాడుకుంటూ వస్తున్నాయి.., దానివెనకాల.. నాలుగు నల్ల మహీంద్రా గ్జయిలోలని.. ఒక తెల్ల హోండా సి.ఆర్.వి ని వెంటపడుతున్నాయి.

దానివెనకే.. నాలుగు ఎర్రలారీలు.. నాలుగు తెల్లలారీలు.. నాలుగు పచ్చలారీలనిండా కత్తులూ.. కటార్లూ.. పట్టుకుని, బఠాణీలు బొంబాయిశెనగలు తింటూవున్న జనాలనేసుకుని.. స్పీడు స్పీడుగా వచ్చేస్తున్నాయి. మధ్యమధ్యలో ధనేల్ ధనేల్ మని బాంబులు.. (లారీల్లో జనాలమధ్యకాదు.. బయట నిజం బాంబులు..) కెమేరా ఇంకా జూమ్ చేస్తే... నల్ల ఇన్నోవాలో కిటికీదగ్గర.. సగం కిందకు దించిన నల్లమిర్రర్ దగ్గర ఎవడో నల్లగావున్నాడు.. కెమేరా కాస్త బ్లర్ ఎడ్జస్ట్ చేసి చూపిస్తే.. వాడే మన నల్లశీనుగాడు.., కెమేరా ఇంకాస్త జూమ్ చేస్తే.. వాడిచేతిలో రాజమౌళిసినిమాలోలాగా.. సినిమాకో రకమైన షేపులో.. వెరైటిగావుండే కత్తిలాంటి.. కొడవలిలాంటి..సుత్తిలాంటి నల్లటి గొడ్డలి. ఇంకా జూమ్ చేస్తే.. నల్లమల అడవిలాగా వాడి చేతిమీదున్నవెంట్రుకలు.. మొత్తం తెరంతా చీకటితో నల్లగా అయిపోయింది... ఇంకా జూమ్ చేస్తే.. ఇంకా నల్లని నలుపు.. ఇంకా ఇంకా ఇంకా జూమ్ చేసిచూస్తే..?, చాలు చాలు.. ఇంకెక్కడికి చేస్తాం.. ఈ కెమేరాలోవున్న జూమింతే...

ఆగండి సార్.. ఆగండి.. ఆగండి.. ఆగగండి....గగం...డిడి. (ఎకో ఎఫెక్టు..)

మీరు మరీనండీ.. ఏదేదో ఊహీంచేసుకుంటున్నారు.. ఏదో చిన్న బడ్జెట్లో కధచెబుదామంటే.. మరీ. ఇంత భారీ క్లైమాక్సా..., కనీసం నాబ్లాగు కుడివైపుకిందనున్న ఏడ్ పైకూడా క్లిక్కుచేయరు మీరు.. అంత పెద్ద బడ్జెట్లో కధ ఎక్కడనుండి రాస్తాం చెప్పండి బాబూ... అందుకే చిన్న బడ్జెట్లోనే కొనసాగిద్దాం.. :-)

కాలం గడిచింది.. ఆ నలుగురు కుర్రాళ్ళకి.. ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలొచ్చాయి.

గిర్ర్ ర్ ర్ మని మ్రోగింది గంట.. (కధలో కాదు బయట)

ఇంటర్వెల్..

బయటకు వెళ్ళి అన్ లిమిటెడ్ గా.. సమోసాలు.. జంతికలూ.. ఏమన్నా దొరుకుతాయోమో తినేసిరండి..

మిగతా కధ తరువాత చెప్పుకుందాం.. :-)

4, సెప్టెంబర్ 2010, శనివారం

గోపాల్రాజు గేదెల బేరం...
















సాయంత్రం ఏల.. ఎర్రసెందనం రంగులో నిగనిగలాడిపోతున్న సూరీడు.. ఈ రోజుకు ఇక సెలవన్నట్టు.. టాటా సెబుతా దూరంగా వున్న కొబ్బరిసెట్ల ముసుగులోకి దూరిపోతున్నాడు.. పక్కూళ్ళో వున్న స్పిన్నింగు మిల్లులో సాయత్రం షిప్టులు మారటం కోసం ఏసే సైరెన్ కూతకూడా ఇనబడిపోయింది.., పాలేరు పాపారావు.. మైనంపాటోల్ల పాకలకాన్నిండి తీసిన పాలు క్యాను సైకిలుకట్టుకుని ఎల్తున్నాడు.. 

ఈటిల్లో ఏదన్నా ఒక్కసెనం అటుఇటు అవుతాయేమోగానీ.. సూరయ్యతాత బ్యాచ్ మాత్రం రాయిసెట్టుకిందున్న నాపరాయిబల్లపై టంచనుగా టైముకొచ్చి కూచోటం మాత్రం ఒక్క సెనం కూడా లేటవ్వదు. సూరయ్యతాత... కొత్తోళ్ళ అప్పారావు... మిలట్రీ రంగారావుగారు ముగ్గురూ తలపండిపోయిన పెద్దోళ్ళు... సాయంత్రం అవగానే రాయిసెట్టుకింద పిచ్చాపాటీ మాటలకోసం భోజనాలు కానిచ్చేసి... కొబ్బరీనుపుల్లతో పళ్ళుకుట్టుకుంటా వచ్చేత్తుంటారు.. దారేబోయేవోళ్ళని ప్రశ్నలడిగి బుర్రల్దినేత్తుంటారు. 

ఎవడూ దొరక్కపోతే జాడీ ఆటా.. పులీమేకా ఆడుకుంటా కాలచ్చేపం చేసేత్తుంటారు. ఈళ్ళ నోట్లో నానని ఇషయం అంటూ ఏదీ వుండదు.. పెపంచలోవున్న పెతీదీ ఈళ్ళమాటల్లో టాపిక్కే. సీకటి పడ్డంతో ఎవడో కుర్రోడ్ని కేకేసి.. ఈదిలైట్లేయించేడు సూరయ్యతాత. ఆ ఈది లైట్లకాంతిలో నాపరాయిపై... రుబ్బురోలుకు గంట్లుకొట్టేవోడితో... స్టాండర్డుగా గీయించిన జాడి ఆట గళ్ళలో రాళ్ళు సర్దుతావున్నాడు కొత్తోళ్ళ అప్పారావు. 

"ఒరే.. సూరిగా..., గోపాల్రాజు కనిపించేడేంట్రా ఈ రోజా.. రేపాడు ఏల్పూరు సంతలో గేదిని కొంటాడంటా.. నిన్నో టముకేత్తా అందరికీ సెప్పేత్తున్నాడ్రా", అని మిలట్రీ రంగారావుగారు సూరయ్యతాత్తో అన్నాడు. "ఆడేం మేపగలడండే... అయితేగియితే.. పాలెర్నెట్టి మేపిత్తాడేమోనండే.. ", అన్నాడు సూరయ్యతాత. "అదేమాట ఎవడోఅంటే.. పాలేర్నెట్టి మేపింతేనే గేదిని కొనాలా.. అని అరువు దెబ్బలాటెట్టేత్తున్నాడురోయ్.. అది సూసేవుగాదు..., ఆడే మేపుతాడంటా..., అదే కదా మరి అసలు ఇషయం.., బడాయి సెప్పినంత సులువనుకుంటున్నాడు... ఈ గెది దెబ్బతో ఆడి బడాయంతా వదిలిపోవాల్రా...", అని మిలట్రీ రంగారావు కాళ్ళు నాపరాయిబల్లపై సర్దుకుని బాసమటమేత్తా అన్నాడు. 

"హ హ్హ హ్హా.. నిజమేనండే.." అని అంతా పగలబడి నవ్వుకున్నారు.

ఈళ్ళ పిచ్చాపాటీమాటల్లో ఈరోజు మొదట గోపాల్రాజు టాపిక్కు వచ్చిందంటేనే.. గోపాల్రాజు సిన్నా సితకా మనిషిగాదని అర్దమవుతాది.. గోపాల్రాజుగురించి సెప్పుకుంటూ పోతే చానా వుంది.. అందరూ అతను సెప్పే బడాయి కబుర్లు ఇనీ ఇనీ అతనికి.. బడాయి గోపాల్రాజని పేరేట్టేరు. , గోపాల్రాజు ఆవూళ్ళో నాలుగెకరాలున్న ఓ చిన్న రైతు. అందర్లాగాకండా కాస్త ఏసకట్టం మనిషి.. ఏదైనా సరే నేనే సెయ్యగలను.. నేను సేసినట్టు ఎవడూ సెయ్యలేడని సెప్పుకుంటా.. నలుగుర్లో తనకో డిఫరెంట్ స్టైలుండాలని తాపత్రయపడేమడిషి . ఆ తాపత్రయమే తప్ప.. ఎప్పుడూ ఎక్కడోసోట డక్కాముక్కీలు తింటా అందరిముందు నవ్వులపాలవుతుంటాడు గోపాల్రాజు. 

ఓ సిన్న ఉదాహరణ సెబితే గోపాల్రాజు గురించి అర్ధమయిపోద్ది.., ఓ ఏడు..  అందరూ వరి పంటల్లో ఏ ఇత్తనం ఏద్దామాని ఆలోచిత్తున్న సమయంలో... గోపాల్రాజు తన నాలుగెకరాల్లోనూ.. బోబ్బాసి తోటలేసేడు.., అది సూసి వూళ్ళో నవ్వనోడంటేలేడు.. పెతీ ఒక్కడూ ఇంటికెళ్ళిమరీ ఎటకారంచేసి ఏడిపించేరు గోపాల్రాజుని.. కానీ ఆ మనిషెక్కడా తొనక్క బెనక్క కూర్సున్నాడు. 

ఆ మొండి ధ్యైరమేంటో వూళ్ళో ఎవడికీ అర్ధంకాలేదు. బొబ్బాసి కాయలు పళ్ళెటూళ్ళో ఛీ అంటారుగానీ.. సిటీల్లో తులం పదారులెక్క కొనుక్కుపోతుంటారు..., ఆటికి హైద్రాబాదు.. బెంగుళూరు..లాంటి సిటీల్లో మాంచి డిమాండుందని తెల్సుకున్నాడు గోపాల్రాజు. అందుకే ఆ ఏడు పంటేసి ఎలాగైనా తనుసేసందే కరెస్టని వూరి జనాలకు చూపిద్దామనుకున్నాడు. అతననుకున్నట్టుగానే ఆ ఏడు కాయలిరక్కాసేసినియ్యి..., అంతే మనోడు.. గాళ్ళోకితేలిపోయి.. బాడాయిలు సెప్పటంమొదలెట్టేడు.., ఏడిపించినోళ్ళంతా అతని కనబడకుండా పారిపోయేరు.

అలా బడాయిలకుపోయి చివరాఖర్లో పప్పులో కాలేసేసేడు.., పంటదాకా వచ్చి కొనుక్కెళతానన్నోలకివ్వకుండా.. తానే సిటీకి పట్టుకెళ్ళి అమ్మేద్దాం అని పెద్ద ప్లానేసేసేడు.. తానే దగ్గరుండి.. అంతా లోడుసేయించుకుని.. హైద్రాబాదు.. పెయానం కట్టేడు.., అక్కడ అనుకున్న రేటులేదని.. ఒక వారంరోజులు నాన్చి నాన్చి.. అక్కడే గొడాముల్లో లాటు పెట్టించి.. కొన్నాళ్ళు రేటుకోసం చూసేడు..., అలా నాలుగురోజులుండేసరికి.. కాయలన్నీ ముగ్గిపోటంమొదలెట్టేయి.. ముగ్గినియ్యన్నీ సగంరేటుకే అమ్మేయాల్సొచ్చింది. అక్కడుండానికి ఖర్చులు..., గోడాములకి అద్దెలు కట్టగా.., ముందు వూళ్ళో వచ్చిన బేరానితో పోల్చుకుంటే.. సగానికి సగం లాసయిపోయేడు. 
దీన్ని బట్టే అర్దమవుద్ది గోపాల్రాజు ఎంత డిఫరెంటో.

డక్కా ముక్కీలు తినే గోపాల్రాజుకు నాలెడ్జీ లేదని తీసిపారేయక్కర్లేదు.. పెతిరోజూ పేపరుతిరగేసి అక్షరం పొల్లుపోకుండా.. హెడ్డింగు కాన్నించి.. ఆ రోజు తేదీ.. అది ఎక్కడ ప్రింటయ్యింది తో మొదలెట్టి.. అన్నీ సదివేత్తుంటాడు.. దాంతో రాజకీయ వార్తలు.. షేర్ మార్కెట్లు.. అంతర్జాతీయ వార్తలు కాన్నించి దేని గురించి  అడిగినా.. తనకు పూర్తిగా తెలీపోయినా.. సెప్పేత్తుంటాడు.

అలాంటి గోపాల్రాజుకి గెదిని కొని మేపాలని కోరికపుట్టింది.
ఓ మంగళవారం రోజు.. గోపాల్రాజు తన డబడబలాడే చేతక్ బండేసుకుని గేదెలసంతకు బయల్దేరేడు.., ఎక్కడకెళ్ళినాకూడా తోకలాగుండే సుబ్బరాజుని ఎంటేసుకెళ్ళటానికి..   పెద్దకాలవ పక్కన చింతచెట్లముసుగులోవున్న సుబ్బరాజుంటికెళ్ళి కేకేసేడు.. "అప్పుడే బోంచేసి ఆవకాయబద్ద బుగ్గనెట్టుకుని సప్పలిస్తా వచ్చిన సుబ్బరాజు.. "ఏంటి బావా ఏల్పూరా..నువ్వింకా రాలేదేంటాని రడీఅయ్యి సూత్తన్నాను.., సంతలో అయితే మనం మాట్లడలేం బావా.. తణుకులో  పాతొంతెన దగ్గరున్న దూళ్ళబేరగాడి దగ్గరకెళ్తే పనైపోతాది మరి.." అని.. ఎప్పుడూ సలహా సెప్పని సుబ్బరాజు గోపాల్రాజుకి.. సలహా సెప్పేడు.

"ఛెస్.. దూళ్ళబేరగాడికేంతెలుసురా... చేటపెయ్యిని చూపిత్తే... మాంచి సూడిమీదుంది.. పూటకి ఐదులీటర్లుపాలిత్తాది.. కొనెయ్యండంటాడు.., ఆడి కమీషన్ కోసం నోటికేదొత్తే అది సెప్పేత్తాడు.. ఆడ్నినమ్ముకుని.. గొడ్డుపోయిందాన్ని కొనుక్కురావాలా?, మనకామాత్రం తెల్వదేంట్రా..., తెలవకపోతే గెదినెందుకురా మేపటం..", అని గోపాల్రాజు సుబ్బరాజుమీద కస్సుమన్నాడు. "సరేలేబావా.. నువ్వేదంటే అదే.. ఎళ్దాం పదా..", అని సుబ్బరాజు మారుమాట్లాడకుండా గోపాల్రాజు చేతక్ బండెనకాలెక్కేసేడు.

"ఈ రోజెలాగైనా గేద్తోనే తిరిగిరావాల్రా.. అందుకే ఓ ఇరవైఏలు లెక్కట్టుకొత్తున్నాను.. నిన్నే ఎంకడు దగ్గర సీటు పాడేన్రా..", అంటా.. తణుకుపొలాల్నుండి ఏల్పూరుకెళ్ళే అడ్డరూట్లోకి చేతక్ బండిని దూకించేడు గోపాల్రాజు.

సుబ్బరాజు ఊరి బాగోతాలన్నీ పూసగుచ్చినట్టు ఒక్కొక్కటీ సెప్పటం మొదలెట్టేడు... రాత్రి రాయిసెట్టుకింద సూరయ్యతాత బ్యాచ్ ఏమనుకున్నదీ.. ఎలా ఎగతాళిసేసి నవ్వుకున్నదీ.. అంతా శివరాత్రి రోజు జాగారం సెయ్యటానికి ఈసీపీ అద్దెకట్టుకొచ్చి ఆక్కుండా క్యాసెట్టుల మార్సి మార్సి.., తెల్లారేదాకా నాలుగుసినిమాలేసినట్టు... ఎడ్వైడింగులతో సహా సెప్పేసేడు.., అదంతా ఇన్న గోపాల్రాజుకి మంటెత్తిపోయింది.. "మాంచి గేదెను కొనుక్కేళ్ళి ఆళ్ళ నోళ్ళుమూయిత్తాను సూడరా..", అని సుబ్బరాజుతోటి అంటా బండి స్పీడు పెంచేసేడు.. అలా మాటల్లో పడి.. ఏల్పూరు నడీద్దాకా వచ్చేసేరు.

"బావా సికెన్ పకోడి ఏత్తున్నట్టున్నాడు బావా... ఎళ్ళి ఓ దెబ్బేసొద్దామేంటీ", అని ఎనక్కూర్చున్నసుబ్బరాజు.. ముందుకు జరిగి గోపాల్రాజు సెవిలో వూదేడు. 

"ఒరే!, నేనొచ్చినప్పుడే కదరా.. పీకల్దాకా లాగించినట్టున్నావ్.., అవకాయబద్ద సప్పలిత్తా కనిపించేవూ.. అప్పుడే ఏం తింటావ్ రా నాయనా... నీది కడుపా మండపాక మడుగా...", అని సుబ్బరాజుని.. ఎటకారం చేసేడు గోపాల్రాజు. 

"లేదుబావా.. సికెన్ పకోడి వాసన గుమగుమలాడిపోతాంది..., మాంచి టెమ్టింగా వుంటేనూ.., సరేలే.. వత్తా వత్తా ఎల్దాంలే.. నువ్వు మకాంకాడికి పోనియ్యి..", అని మాటతిరగేసేడు సుబ్బరాజు.

గేదెల మకాం కాడికి సేరుకున్నాకా... బండి నిద్రగన్నేరు సెట్టు నీడలో స్టాండేసి.. పాకల్లో కట్టేసిన గేదెల్ని సూడ్డానికి బయల్దేరేరిద్దరూ... 

ఒంటినిండా అముదం రాసేయటంవొళ్ళ నల్లగా.. నిగనిగలాడిపోతావున్నాయి మాంచి రింగులు తిరిగిన సూడి గేదె పెయ్యిలు... ఒక్కొక్కదాన్ని పరీక్షగా సూత్తా.. చేత్తో ఒక్కసారి ఒంటిమీద రాత్తా అప్పుడప్పుడూ ఆ సేయి గోపాల్రాజుకు సూపిత్తున్నాడు సుబ్బరాజు.  గేది సుట్టూ ఓ సారి రౌండేసి... తోకెత్తి సూసి.., కాలి గిట్టమీద మొటికేసి.. తలమీదున్న కొమ్ముల్ని పరీక్షగా సూసి..  అబ్బే అంటా పెదవిరుత్తుం.. మళ్ళా ఏరే గేద్దగ్గిరికెళ్ళటం.. ఇలా మొత్తం ఆ పాకలోవున్న గేదెలన్నిటినీ పరీక్షించేసేరిద్దరూ. 

ఆ పక్క పాకదగ్గర ఈగళ్ళా ముసిరేత్తున్న జనాల్ని చూసి.. "అక్కడేదో వుందిరా.. పదా..", అంటా.. జనాల్ని తోసుకుంటా ఎగిరెగిరి సూసేరిద్దరూ. నల్లగా నిగనిగలాడపోతా సిన్న సైజు ఎనుగంతున్న గేదిని సూసి ఆశ్చర్యపోయేరు.. "భలేగుందిబావా.. ఆ పొదుగుసూడు.. కనీసం పూటకి పదిలీటర్లు తక్కువివ్వదు.., ముర్రాజాతి గేది బావా..", అన్నాడు గోపాల్రాజుతో నోరొదిలేసి గేదొంక సూత్తావున్న సుబ్బరాజు. 

ఇంతలో గోపాల్రాజు ఎనకే నిలబడి పంచె కట్టుకున్న పెద్దాయన.. "పదిహేడేల ఒక్కొందా.." అన్నాడు. "రామారావుగారి పాట.. పదిహేడేల ఒక్కొందా.. ఒక్కొందా.." అని నాలుగుసార్లు సెప్పిందే సెప్పేడు.. ఆ గేదిపక్కనే చిట్టుతాడు పట్టుకుని నిక్కరేసుకున్న పొట్టోడొకడు. అప్పుడర్ధమయ్యింది.. గేదిని ఏలంపాటేత్తున్నారని. 

గోపాల్రాజు.. గేదెను చూడగానే.. ఎంటనే కొనెయ్యాలనిపించింది.. ఇంకేమాలోచించకుండా.. "పందొమ్మిదేలు.." అన్నాడు. అంతా తలల్దిప్పేసి గేదెని చూడ్డం మానేసి.. గోపాల్రాజొంక చూడ్డమొదలెట్టేరు. "మీ పేరేంటండే..", అన్నాడు పాటేసే పొట్టోడు.. "గోపాల్రాజు..", అని సెప్పేడు సుబ్బరాజు. "గోపాల్రాజుగారి పాట.. పందొమ్మిదేలు.. పందొమ్మిదేలు..", అని మళ్ళా నాలుగుసార్లరిచేడు పొట్టోడు. "పందొమ్మిదేల ఐదొందలు...", అన్నాడో మరో తలపాగా సుట్టుకున్న పెద్దాయన.. అంతే జనాల్లో చాలా మంది డ్రాపయిపోయి.. గొనుక్కుంటా.. పాకలోంచి బయటకెళ్ళిపోయేరు. 

ఇరవ్యయ్యేలు అనేద్దామని నోటిదాకా వచ్చిన గోపాల్రాజుని భుజంమీదం సేయేసి ఆపేసేడు పక్కనే నిలబడున్న మీసాలాయన. "ఏండే.. మీకు గేదె కావాలంటే ఇంకా మంచిదుందండే.., నే సూపిత్తాను నచ్చితే కొనుక్కోండే.. దీనికనవసరంగా పెట్టకండే ఇది పద్దేమ్దేలకు మించి సేయదు.. మీరు ఎక్కువెట్టేసేరని మీమీదెక్కువెట్టేసేడు ఆ తలపాగాయన... మీరంత రేటుక్కొంటే లాసయిపోతారు.. తరువాత మీఇష్టం మరి", అని నవ్వుతా గోపాల్రాజొంక సూత్తా సెప్పేడు ఆ మీసాలాయన.. .

గోపాల్రాజు సుబ్బరాజు ఒకరిమొకాలొకరు సూసుకుంటా ఆలోచిత్తావున్నారు.. అలా ఆలోచిత్తావుండగానే.. గేది పదొమ్మిదేల ఐదొందలకి తలపాగా సుట్టుకున్న పెద్దాయన పేర పాటకొట్టేసేరు.

"సరేండే.. మరి ఆ గేదె సూపించండే మాకర్జంటుగా కావాలే..", అని అడిగేడు మీసాలాయన్ని సుబ్బరాజు.  "నా ఎనకే పదండే..." అంటా, పాకలవతలున్న కొబ్బరాకు దడిమద్దెనుండి బయటకుతీసుకెళ్ళి ఒక కుర్రోడి కి పరిచయంచేసేడు మీసాలాయన. 

" పక్కూర్నుండి తోలుకొత్తున్నారండే.. మూడింటికొత్తాదండే గేదె మరి.. అప్పుడుదాకా ఉండగలరండే మరీ..", అన్నాడా కుర్రోడు. 
గోపాల్రాజు సుబ్బరాజొంక ఓసారి చూసి.. "సరే మళ్ళొత్తాం నువ్విక్కడే వుంటావు కదా...", అనడిగి.. చేతక్ బండిదగ్గరకొచ్చి ఆలొచన్లో పడ్డారిద్దరూ.

"బావా.. దీనికన్నా మంచిదంటన్నాడు అదెలాగుంటాదో సూడుమరి.. మనూరేంటి.. మన పక్కూరోళ్ళుకూడా నోళ్ళొదిలేత్తారేమో.. ఇక్కడే ఏదన్నా తలెంటుకులతాడుకొనుక్కుపోదాం బావో.. లేకపోతే దిష్టికొట్టేత్తారంతా..", అన్నాడు పల్లికిలిత్తా సుబ్బరాజు. 

"మందు గేదిని రానియ్యరా.. అప్పుడే నువ్వు తాళ్ళుదాకా ఎల్లిపోతున్నావ్.., పదా.. నీకా సికెన్ పకోడి తినిపిత్తా", అని సుబ్బరాజుని.. బండిమీద నడీదేపు లాక్కుపోయాడు గోపాల్రాజు. 

సికెన్ పకోడి దుకాణం పక్కనే వైన్ షాపు కనబడేసరికి గోపాల్రాజుకు మనసులాగేసింది.. "ఒరే.. పదరా.. నీ సికెన్ తో పాటు ఇదుంటే ఇంకా బాగుంటాది.. పదో పెగ్గేసొద్దాం.. ఇంకా చానా టైముందిలే", అని సుబ్బరాజుని లోపలికి తీసుకుపోయేడు.

మూడింటిదాకా టైమ్ పాస్ చేసేసి.. పీకల్దాకా తాగి.. తినేసి వైన్ షాప్ నుండి బయటపడ్డారిద్దరూ.

పాకలకాడున్న కుర్రోడిని కలిసి ఇవరం అడిగేరు. "దార్లో వత్తా వత్తా నీళ్ళకని చెరువులో దింపేడంటండే గేదినే.. ఆ చెరువులోనే నిద్రోతుందంటండే.. ఇక్కడ దగ్గర్లోనేనండే ఓ కిలోమీటరుంటాదండే.. ఒత్తారేంటి ఎల్దాం", అన్నాడు కుర్రోడు. 

"సరే పదమ్మా ఎల్ధాం.." అన్నాడు గోపాల్రాజు తూలిపోతా బండితీత్తా
కుర్రోడు సైకిలు తీసుకుని తొక్కడం మొదలెట్టేడు గోపాల్రాజు చేతక్ పై కుర్రోడెనకాలే ఫాలో అయిపోయేడు.

"గేది నిద్రరోవటం ఏంటి బావా.., కొంపదీసి రాత్రి సెంకడ్ షో సినిమాగ్గానీ ఎళ్ళిందంటావా..?", అన్నాడు సుబ్బరాజు గోపాల్రాజు సెవిదగ్గరగా వచ్చి సైకిలు తొక్కుతున్న కుర్రోడికి ఇనపడకుండా.

"ఒరే.. నీకు బాగా మందెక్కువైపోయిందిరా..., సెకండ్ షోకెల్తేనే అంతలా  నిద్దరట్టేత్తాదేంట్రా.. ఏ మిడ్ నైట్ షో వో అయ్యింటాది రా..", అన్నాడు గోపాల్రాజు. 

అలా కొంతదూరం ఎళ్ళే సరికి ముందెళ్ళే కుర్రోడు మాయమైపోయేడు.. "ఒరే.. సుబ్బా.. మనముందు కుర్రోడేడ్రా..", అన్నాడు గోపాల్రాజు.

"అదే సూత్తున్నాను బావా.., ఇప్పుడుదాకా ముందేవున్నాడు.. సైకిలు కూడా కనబడటంలేదు.., ఏమైపోయేడంటావ్", అన్నాడు సుబ్బరాజు.

"సరేరా ఇక్కడాగుదాం.. ఆడే వత్తాడు..", అని నాలుగురోడ్ల మద్దెలో గుండ్రంగా కట్టిన సిమ్మెంటు దిమ్మ.. దానిపైన ఇనప గ్రిల్లు వున్నచోట కాళ్ళానుకుని బండాపేడు గోపాల్రాజు.
ఓ అయిదునిమిషాలాగాకా ఎనకనుండి కుర్రోడొచ్చి "ఏంటండే.. ఈ సర్కిలెంబడే మళ్ళా ఎనక్కి తిప్పేసేరు.. మీరింకా నా ఎనకాలే వత్తున్నారనుకుని ఎల్లిపోతున్నానండే, పదండే ఇటెల్లాలి మనం", అని బండి ఎనక్కి తిప్పించి సైకిలక్కేడు కుర్రోడు.

ఎనకాలే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు సుబ్బరాజు.. "ఏరా.. ఏంట్రానీలోనువ్వే నవ్వుకుంటున్నావ్", అన్నాడు గోపాల్రాజు.
"కుర్రోడు మందేసేసినట్టున్నాడు.. ఎటు తీసుకెల్తున్నాడో ఆడికే తెల్టంలేదు బావా", అని మళ్ళీ పుసుక్కున నవ్వేడు సుబ్బరాజు.

చెరువుదగ్గరకు చేరుకుని.. నీళ్ళల్లో తేలతావున్న గేదిని చూసి "బావా.. అదిరిపోయిందిది.. పొద్దున్న చూసిన దానికి బాబులాగుంది బావా..", అని బండాపకుండానే కిందకు దూకేసి బ్యాలన్స్ చేసుకుంటా నిలబడతా అన్నాడు సుబ్బరాజు.

బండిదిగిన గోపాల్రాజు చెరువుగట్టునున్న చెట్టుకింద కూర్చున్న ముగ్గురు.. గేది తాళూకోళ్ళతో బేరం మొదలెట్టేడు. ఏవూరు.. ఏంటి.., గేదెన్నాల్లు సూడిది.. లాంటి ఇవరాలన్నీ అడిగి.. ఓ అరగంట బుర్రతినేసి.. "ఇంతకీ ఎంతకిద్దామనుకుంటున్నారో..", అని అసలు ఇషయానికొచ్చేడు.

ముప్పై ఏలుకాన్నుండి మొదలెట్టి ఇరవై ఏడుదాకా నరుక్కొచ్చేడు బేరం.., ఒక్క ఎయ్యిరూపాయలు తగ్గటానికి అవతలోల్లు ససేమిరా అంటున్నారు.. అదిగాదు ఇదిగాదని ఏదో ఓ పెద్ద స్టోరి మొదలెట్టి సెప్పేత్తా.. మరందుకే తగ్గండే అంటా.. ఆళ్ళను మాట్లాడనివ్వటంలేదు గోపాల్రాజు. బుర్రకధలో తందానా అంటే తానే తందనానా.. అన్నట్టు.. మధ్యమధ్యలో ఎంటరవుతా ఉప్పందిత్తన్నాడు సుబ్బరాజు. 

ఆలా ఎంత బేరమాడినా ఇరవైఏడువేలకి ఒక్క పావలా కూడా తగ్గేదిలేదని చెప్పేసేరు గేదిగలోళ్ళు. "అబ్బే అంతైతే ఇవ్వలేమండే.. మీరు బాగా ఎక్కువసెప్పేత్తున్నారో.., ఆయనెవరో సెప్పటంతో ఇంతదూరమొచ్చి.. పొద్దున్న సంతలో మాంచి బంగారంలాంటి గేదినొదిలేసొచ్చాం.., మీరేమో అసలు తగ్గటంలేదో..", అని గోపాల్రాజు పదపోదాం అన్నట్టు సుబ్బరాజుకు సైగచేసేడు.

"సరేలేండి ఆఖరుమాట ఎంతిత్తారు చెప్పండే", అన్నాడు గేదిగలోళ్ళలో ఓ పెద్దాయన. "నేను ఇరవై ఐదివ్వగలనండే..", అంతకుమించి ఒక్కరూపాయి మీరి ఎక్కువసెప్పినా.. గేది నాకొద్దండే", అని కరాకండిగా సెప్పేసేడు గోపాల్రాజు.

"సరేలేండి లెక్కిచ్చేసి తీసేసుకోండే", అన్నాడు పెద్దాయన.. గోపాల్రాజు సుబ్బరాజుల మొహాలు ఆనందంతో ఎలిగిపోయాయి.

"ఓ ఐదేలు లెక్క తగ్గిందండే మరి.. రేపట్టుకొచ్చి ఇచ్చేత్తాను మీకు, కావాలంటే ఈ బ్రాస్లెట్టు పెట్టుకోండి మీ దగ్గర", అని.. చేతికున్న బ్రాస్లెట్టు తియ్యబోయేడు గోపాల్రాజు.
అబ్బబ్బే.. ఆ మాత్రం నమ్మకంలేకపోతే ఎలాగండే.. పర్లేదు పర్లేదు మీ ఎడ్రస్ అదీ సెప్పండే చాలు.. మీరు రేపట్టకొచ్చి ఇచ్చేయండి పర్లేదు", అని ఎడ్రస్ తీసుకుని ఇరవ్వయేలు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు పెద్దాయన.

"ఇదిగోనండే తాడు.. మువ్వలు.. పైకెక్కేకా గేదిక్కట్టండే.., ఓ అరగంటాగాకా అదే ఎక్కేత్తాదండే గట్టో.. మీరేం కంగారుపడకండే.., రోజూ ఇలా ఓ రొండుగంటలు నిద్రోటం అలవాటండే దానికే, అరగంట తర్వాత ఎక్కాపోతే కాత్త అదిలించండి చాలో", అని చెప్పి ఎల్లిపోయేరు గేదిగలోల్లు.

"అయితే అయిందిగానీ బావా.. మాంచి గేదిని పట్టేసేం.. మనూరోల్లకి తస్తాదియ్యా ఒక్కొక్కడు నోరుపడిపోద్ది.. రేపొక్కడు మాట్టాడడు చూడు.. గేదిని చూసి", అని గోపాల్రాజుని ఉబ్బేసేసేడు సుబ్బరాజు. అలా మాట్లాడుకుంటా గంట గడిచినా గేది కదులూమెదులూ లేదు.. "బావా అదిలించనా ఎళ్ళి", అన్నాడు సుబ్బరాజు.. "అదేవొత్తాదుండ్రా.. పాపం నిద్రోతుంది గదా", అని ఇంకో అరగంట గడిపేడు గోపాల్రాజు.. అయినా గేది కదులూమెదులూ లేకండా అలాగే వుంది. "ఈ సారి తలటుతిప్పేసిందిగానీ ఇంకా పైకెక్కలేదేంటి బావా", అన్నాడు సుబ్బరాజు.

ఎంతచూసినా గట్టెక్కకపోయేసరికి.. "పద బావా అదిలిద్దాం..", అని ప్యాంటు మడతెట్టి చెరువునీట్లో దిగేడు సుబ్బరాజు.. ఎనకే గోపాల్రాజు కూడా నీట్లోకి దిగేడు.. "హయ్ హయ్..", అని గేది పొట్టమీద గుద్దేడు సుబ్బరాజు. "ఒరే ఎధవా... సూడిదిరా.. పొట్టమీదకొట్టకో.. ఎనక్కొట్టు..", అని, ఎనక చేత్తో చిన్న చిన్న దెబ్బలేసేడు గోపాల్రాజు.

"బావా ఎంతకొట్టినా కదలటంలేదు.., పొట్టకిందచేయేసి ఓ పట్టట్టు.. ముందుకు గెంటుదాం.. నీట్లోనే కదా కదిలిపోద్ది.. అప్పుడు మెలుకొవత్తాదేమో.., దీంది మరీ మొద్దునిద్రలాగుందేంటి బావా..", అని ఇద్దరూ చెరోవేపు పొట్టకింద చేయేసి పట్టట్టేరు.

గోపాల్రాజు పట్టిన పెద్ద పట్టుకి.. గేది సుబ్బరాజేపుతిరగబడిపోయే తలనీట్లోకి ఎల్లిపోయి.. నాలుక్కాళ్ళు పైకొచ్చేసినియ్యి.

"అయ్యబాబోయ్ ఇది సచ్చిన గేది బావో..", అని పెద్దకేకేసేడు సుబ్బరాజు. ఆ కెక్కి ఇద్దరికీ మందుదిగిపోయి జరిగిందంతా అప్పుడర్ధమయ్యింది.

ఇదే వార్త ఈళ్ళకన్నా ముందర వూరెళ్ళిపోయి... రాయిసెట్టుకింద మీటింగెట్టిన సూరయ్యతాత బ్యాచ్ నోట్లో ఆడేసింది.

24, జులై 2010, శనివారం

రాకెట్ లాంచ్...


(పూర్తిగా సాఫ్ట్వేర్ కు సంభందించిన సాంకేతిక పదాలతో నిండిన టపా.. 
అర్ధంకాకపోతే నన్నేమడగొద్దుబాబోయ్..)

"అప్ లోడ్ ఫెయుల్యూర్", ని కూడా ఆటోమేట్ చెయ్యాలి అని ముందురోజు జరిగిన 
రాకెట్ మీటింగ్ లో డిస్కషన్ వల్ల ఆ రాత్రంతా నిద్రే పట్టలేదు.. ఎలా చెయ్యాలబ్బా.. 
అని రాత్రంతా బుర్రబద్దలుకొట్టుకున్నాఒక్క ఆలోచనా రాలేదు. ఎపుడూలేనిది.. 
తరువాత రోజు తెల్లవారుఝామున పదింటికే లేచి.. ఆఫిసుకు బయలుదేరాను.. 
బయటకురాగానే.. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామే.. "పొద్దుపొద్దున్నే లేచి ఇలా 
జనాలంతా ఎక్కడికి పోతార్రాబాబు", అని అనుకుంటూనే.. హెల్మెట్ పైనే బుర్రగోక్కుంటూ..  
నా టూవీలర్ ను ఆఫీసురూట్లోకి దూకించాను..  

ఇంకా నిన్నటి రాకెట్ డిష్కషన్ లో మాట్లాడుకున్నవిషయమే ఎలా చెయ్యాలబ్బా అని 
బుర్రలో ఇన్ఫైనేట్ లూప్లో పడి కొట్టుకున్న వైల్ లూప్ లాగా తిరిగి తిరిగి కొట్టుకుంటుంది.. 

అలా కొట్టుకుంటున్న వైల్ లూప్ ని, బ్రేక్ పాయింట్ పెట్టి డిబగ్ చేస్తూ.. బైక్ 
నడుపుతున్నానేమో..., రోడ్డ్ మీదున్న సిగ్నల్ కనబడనేలేదు.. కొత్త టెస్టర్ పొద్దెరగకుండా 
అక్కడా ఇక్కడా క్లిక్ చేసినట్టుగా.. చూసుకోకుండా సిగ్నల్ బ్రేక్ చేసేసి.., బైక్ ముందు బ్రేకు 
వెనకబ్రేకు నొక్కి.. సరిగ్గా.. నల్లకల్లద్దాలు పెట్టుకుని ఉగ్రస్వరూపంతో నిలబడివున్న 
ఆడకానిస్టేబుల్ ముందు ఆపి.. దొరికిపోయాను.. 

"లైసెన్సు తియ్", అందామె.. "నేను దాటింది సిగ్నల్ కదా.. లైసెన్సెందుకబ్బా", అనుకుంటూనే 
తీసి చూపించాను.. "ఇది డూప్లికేట్ కదా.. ఒరిజినల్ చూపించు.. లేకపోతే బండిక్కడపెట్టేసి 
వెళ్ళిపో", అని మరాఠీ ఫ్లేవర్ కలగలిపిన హిందీలో అందామె.., ఇదెక్కడ గోలరా అనుకని..
 "సారీ మేడమ్ ఏదో రాకెట్ టెన్సన్లో సిగ్నల్ బ్రేక్ చేసా", అని అందామనుకున్నా.. 
" రాకెట్..!! ఏంటి?", అని పోలీసోళ్ళ లాంగ్వేజిలే బై డిఫాల్ట్ గా వుండే ఫేక్ నోట్స్ రాకెట్, 
సెక్స్ రాకెట్ లాంటి రాకెట్లనుకుని అపార్ధంచేసుకుంటుందేమోనని.. భయంవేసింది.., 
నా దృష్టిలో రాకెట్ అంటే ఇది అని చెప్పడానికి మళ్ళీ ఓ పెద్ద డాక్యమెంటేషన్ చేసివ్వాలేమో.., 
ఆ గోలంతా ఎందుకులే", అని.. "ఫైనెంత", అన్నాను ఎంతుంది అన్నట్టు పైనుండి కిందకు
ఒక్కసారి చూసిందామె.., వంద తీచి చేతిలోపెట్టి, టి. ఆర్. ఎస్ జెండా రంగులోవున్న 
రశీదొకటి తీసుకుని.. మళ్ళా నా కోడ్ డీబగ్గ్ చేస్తూ ఆఫీసుకు బయలుదేరాను.

ఇంతకూ ఏదో ఆలోచన్లో పడి రాకెట్ అంటే ఎంటో చెప్పలేదు కదా.. అదే చెప్తా... 
చెవుల్లో దూదిలేదా.. దగ్గర్లో ఏది అందుబాటులోవుంటే అది పెట్టుకుని వినండి.. 

మేం చేస్తున్న కొత్తప్రోజెక్టులో.. రోజువారి లావాదేవీలు అన్నీ వేరే డాటాబేస్ లోకి మైగ్రేట్ 
చేసి.. వాటిమీద రిపోర్టింగ్ అప్లికేషను ఒకటి డిజైన్ చెయ్యాలి.. డాటాబేస్ అంటే ఏంటి అని
చాలా మందికి తెలియకపోవచ్చు.. ఒక చిన్న ఉదాహరణిచ్చి వివరించడానికి ప్రయత్నిస్తాను.. 
మన వంట గదిలో నెలకు సరిపడా కావలిసిన పచారి సరుకులు దాచుకోవటానికి 
ఉపయోగిస్తామే.. బీరువానో లేక షెల్ఫో అదే ఒక డాటాబేస్ లాంటిదన్నమాట.., ఈ 
డాటాబేస్ లో టేబుల్స్ అని వుంటాయి.. అంటే డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ 
లాంటివి కాదు.. ఆ షెల్ఫ్ లో వుండే కందిపప్పు డబ్బా ఒక టేబుల్.. ధనియాల డబ్బా 
ఒక టేబుల్.. అలా అన్నమాట.. రోజువారీ కూర వండటంకోసం ఆ టేబుల్ నుండి  కొంత, 
ఈ టేబుల్ నుండి కొంత తీసుకుంటుంటాం అదే ఒక ట్రాన్సాక్షన్.. (లావాదేవీ...), 
నెలాఖరున సరుకులు ఇన్సర్ట్ చేస్తాం, కొన్ని అప్ డేట్ చేస్తాం.. ఇలా చెప్పుకుంటూ 
పోతే డాటాబేస్ గురించి పెద్ద పుస్తకం రాయొచ్చు, దీనికంతంలేదు కాబట్టీ... ఇక్కడ డాటాబేస్ 
అంటే తెలిస్తే చాలు.. (ఇప్పుడు మొత్తం అర్ధమైపోతే.... ఇంతేనా సింపుల్ అని మా జాబ్స్ కి 
కాంపిటేషన్ వచ్చేస్తారంతా). 

ఇక మా ప్రోజెక్ట్ విషయానికొస్తే.. నేనిచ్చిన ఉదాహరణలాగే పచారిసరుకులు అక్కడివి 
ఇక్కడకు మెయ్యటమే కదా.. చిన్నదే అప్లికేషన్ అనుకుని... తాలింపు పెట్టని టమాటా 
పప్పులోకాలేసేసారు మా కంపెనీ వాళ్ళు.  టెండరువేసి పడ్డ పెద్దచేపను చూసి తెగ 
మురిసిపోయారు.. ఇక్కడవరకూ బాగానేవుంది.. "ఇంతకూ మీకేంకావాలి..", అని క్లైంట్ ని
అడిగినప్పటినుండి మొదలయ్యాయి మా సాఫ్ట్వేర్ కష్టాలు.. 

రోజువారి లావాదేవీలు జరిగే డాటాబేస్, అసలు పేరూవూరు లేని డాటాబేస్ అని, 
ఎవడో తలమాసినవాడు తయారుచేసి ప్రీగా ఇచ్చింది వాడుతున్నారు వాళ్ళని తేలింది..
సరే వాడారనుకుందాం.., డేటాబేస్ ఏదైనా కొన్ని స్టాండర్డ్స్ అన్నాఏడుస్తాయికదా.. 
ఏదొక డ్రైవర్ దొరుకుతుందిలే.. (డ్రైవర్ అంటే.. కారుడ్రైవర్.. బస్సుడ్రైవర్ కాదు.., ఎదన్నా 
సాఫ్వ్టేర్ వేరేదానితో ఇంటరాక్ట్ అవటానికి వాడే చిన్న సాఫ్వ్టేర్) ఎలాగోలాగా అందులో 
జరిగేవన్నీ రోజుకోసారి ఒక స్టేజింగ్ డాటాబేస్ లో (ఒక టెంపెరరీ డాటాబేస్) లోకి మైగ్రేట్ 
చేసేద్దాం.. తరువాత అక్కడ కావలిసిన మార్పులుచేర్పులు.. చేసేసి.. ఫైనల్ రిపోర్టింగ్ కోసం 
తయారుచేసుకున్న డాటాబేస్ లోకి చేసేద్దాం అంతే సింపుల్ అని.. ఒక రెండురోజులు 
ఎక్కడికీ కదలకుండా మీటింగ్ రూమ్లోనే కాలకృత్యాలు తీర్చుకుని.., ఒకడిబుర్ర ఒకడుగోక్కుని.. 
నెత్తిమీద మిగిలిన నాలుగువెంట్రుకలు రాలిపోయేదాకా  పెద్దప్లాను గీసుకున్నాం.. ఆ ప్లానుకు 
ఒక మంచి ముహూర్తంచూసి.., పసుపురాసి కుంకుంబొట్లుపెట్టి.. వివరించి క్లైంట్ కి.. 
హరికధా కాలక్షేపం డీటీయస్ లో వినిపిస్తే ఎలావుంటుందో అలా వినిపించాం.

అంతావిన్నాకా.. మొత్తం సీ షార్ప్ కోర్సంతా నేర్చేసుకుని.. ఇఫ్ స్టేట్మెంటంటే ఏంటని 
అడిగినట్టు.. "అంతా బాగానే వుంది.. మరి ఈ రెండు డేటాబేస్ లూ ఒకచోటవుండవనుకో.... 
ఒకటి అమెరికా.. వేరేది ఆముదాలవలస అనుకో ఏంటి పరిస్థితి అని అడిగాడు.. 
"ఐతే ఏముంది.. ఏదొక కనెక్షన్ వుంటుంది కదా కనీసం ఇంటర్నెట్ కనెక్షన్, దాంతో 
ఈ డాటాబేస్ నుండి ఆ డాటాబేస్ కి కనెక్ట్ అవటమే అంతే!!", అని కష్టమైన పజిల్ ని 
సింపుల్ గా సాల్వ్ చేసినట్టుగా.. చెప్పి సెబాష్ సెబాష్ అని మా మేనేజరు నేనూ.. 
ఒకరి భుజాలొకరు చరుచుకున్నాం.

"లేదు అలాంటిదేమీ వుండదన్నాడు.." క్లైంట్.., ఒక్కసారి షాక్ కొట్టిన బొంత కాకిలాగా 
కరెంటుతీగల మీదనుండి సలసలాకాలుతున్న తారు రోడ్డుమీద పడ్డట్టయ్యింది మా పరిస్థితి. 
"అసలు ఈ రెండు వేరువేరుచోట్లవుంటాయనీ తెలియదు.. పోనీ వున్నాచేసేద్దాం.. అనుకుంటే.. 
కనక్షనే వుండదా.. ఇదెక్కడ కొత్త ట్విస్ట్ రా నాయనా..!!, ఏ కనెక్షనూ లేకపోతే ఎలా..  
రోజువారి లావాదేవీలు ప్రింట్ తీసుకుని.. ఒక పెద్ద పద్దులు పుస్తకంలో రాయమంటాడా
ఏంటి..", అని ఫోన్ మ్యూట్ నొక్కి ఒకడితరువాతొకడు తలలు ఫోనుకేసి కొట్టుకున్నాం. 

"సరే ఇంటర్నెట్ లేదు అనుకున్నాం.. ఇక్కడ జరిగినవి అక్కడకి ఎలా వెళతాయి", అని 
అడిగాడు మా మేనేజరు.. "ఇంటర్నెట్ లేకపోతే ఎలా..?,  వుంటుంది, కానీ.. డాటాబేస్ కి 
కనెక్షన్ ఇవ్వం.. ఒక ఎఫ్. టీ. పి ఫోల్డర్ షేర్ చేస్తామంతే (ఇంటర్నెట్ ద్వారా షేర్ చెయ్యబడే 
ఒక ఫోల్డర్). ఇకదానికిమించి ఏమీ ఇవ్వం.. దీనికి ఎలా చేస్తారో ఆలోచించండి.." అని,
ఇంకొక్క ప్రశ్న అడిగారంటే.. ఒక్కొక్కడి తలా పుచ్చకాయల్లెక్క లేచిపోతాయి.. అని 
ఫ్యాక్షన్ మూవీలో హీరో డైలాగులా, తొడకొట్టి.. మొహంలోమొహం పెట్టి ఉమ్ములు పడేలా 
చెప్పేసాడు క్లైంట్..  సరేలే డాలర్లిస్తున్నాడుగా.. అని సర్దిచెప్పుకుని.. మొహంతుడుచుకుని..  
మళ్ళా మేమంతా అలోచనలో పడ్డాం.., తరువాత రోజు సాయత్రం కంపెనీ సీటివో  
(చీప్ టెక్నికల్ ఆఫీసర్ ;-) )తో విషయ విశ్లేషణా ఫోన్ కాల్ ఒకటి షెడ్యూల్ చేసుకుని.. 
మొత్తం కష్టాలు వివరించి చెప్పాం.., మనవాడే మనవాడే అని మీదెక్కించుకుంటే.. 
షర్టంతా తడిపి కంపుచేసాడన్నట్టుగా.. మా సీటివో మాకే ఎదురొచ్చాడు.

"అవును కష్టమర్ కి ఎలాకావాలో అలానే చెయ్యాలి.. ఇదే దానికి ఎలా చెస్తామో 
అలోచించండి అంటూనే, మీరు ఇది చెబుతుంటే నాకు చిన్నప్పుడు నిక్కర్లేసుకునే టైమ్ 
గుర్తొస్తుంది అన్నాడు.. "ఇదేంట్రాబాబూ.., క్లైంట్ వేసిన కుళ్ళుజోక్ కంపు భరించలేక 
ముక్కులుమూసుకుని పనిచేస్తుంటే.. నీకు నిక్కర్లటైము గుర్తుకురావటమేమిటీ!!..",  
అనుకునేంతలోనే అసలు విషయం చెప్పాడు.. 

ఇలాంటిదే ఒకప్పుడు మేం చేసాం.., అదిక్కడ వర్కవుట్ అవుతుంది అని నా నమ్మకం.. 
అది ఏంటంటే,  ఇక్కడ లావాదేవీలు ఒక ఫైల్ లాగా మార్చి ఆ ఫైల్ ని అక్కడున్న 
ఏఫ్. టీ. పి ఫోల్డర్ లోకి పంపించి.., అక్కడ ఆ ఫైలునుండి డాటాను డాటాబేస్ లోకి 
ఇంపోర్ట్ చేసేయ్యటమే.. సింపుల్ అని నాలుగుముక్కల్లో చెప్పేసి.. నాకు వేరేపనుంది 
ఇది ఆలోచించి ప్లాన్ డిజైన్ చేసి పంపండి అని తప్పించుకు పారిపోయాడు సి.టి.వో.

మా మేనేజరుకు ఇది నచ్చినా.. నాకూ... మా టీమ్ మేట్స్ కి నచ్చలేదు.., "ఫైల్స్ అంటేనే 
పాతపద్దతి..కదా!, అవి పంపించడం.. దాన్నుండి డాటాబేస్లోకి ఇంపోర్ట్ చేయటం అంటే 
చాలా యాతనతో కూడుకున్న పని, ఎన్నో కండీషన్స్ మనం సొంతంగా రాసి హేండిల్ 
చేయాలి.. అసలున్న టైమ్ లైన్స్ అంతంతమాత్రమే, ఆఖరిదాకా వచ్చాకా 
చేతులెత్తెయాల్సొస్తుంది మరి..",  అని మొహంమీద చెప్పేసాం.. "అవును నేను మీతో 
ఏకీభవిస్తాను.. కానీ.. ఇది తప్పవేరే దిక్కులేదు..", అని మేనేజరు  కంటతడిపెట్టుకున్నాడు.., 
ఏం చేస్తాం.. నీతోనే మేమంతా అని... కర్చీఫ్ తో అతని కన్నీళ్ళుతుడుస్తున్న మాకు 
తెలియకుండానే కళ్ళళ్ళో నీళ్ళు గిర్రునతిరిగాయి..

వీకెండ్ లేదు.. వీక్ డే లేదు.. రాత్రీలేదు.. పగలూలేదు అన్నట్టుగా కష్టపడి.. క్లైంట్ కి 
సరిపడే విధంగా పనిచేసిపెట్టే రెండు విండోస్ సర్వీసులు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటూ.. 
అక్కడి ఫైల్స్ ఇక్కడకు పంపిస్తూ... అన్నికాలాల్లోనూ చక్కగా పనిచేసేవిధంగా.. 
ఆర్కిటెక్చర్ డిజైన్ చేసి పెట్టాము.. (విండోస్ సర్వీస్ అంటే ఏంలేదండీ.. విండోస్ ఆపరేటింగ్ 
సిస్టమ్లో ఎప్పుడూ గేట్ దగ్గర కాపలావుండే కుక్కలాగా నిరంతరం కాపలాకాస్తూ.. చెప్పినపనిచేసే సర్వీసులన్నమాట.).

ఇంతకూ ఈ ఆర్కిటెక్చర్ ని రాకెట్ అని ఎందుకన్నామంటే... ఆముదాలవలసనుండి వచ్చిన 
లావాదేవీ ఫైల్ ని కట్టగట్టి ఒక పెట్టెలో పెట్టి.. (జిప్ చేసి.. ), దానికి ఎమ్. డి. ఐదు అల్గోరిధమ్ 
ద్వారా ఒక కోడ్ తయారుచేసి (చిన్నప్పుడు వర్షాకాలం చదువుల్లో చదువుకున్నాం.. 
కానీ ఎందుకుపయోగిస్తారో ఇప్పడే తెలిసింది..), కట్టగట్టిన ఫైలును.. కోడ్ ను అవతలివైపు
కుక్కలా ఎదురుచూస్తున్న సర్వీసుకు విసరగానే అది ఎగిరి పట్టుకుని.. డైన్లోడ్ చేసుకుని.. 
మరళా ఎమ్. డి. ఐదు అల్గోరిధమ్ ద్వారా ఒక కోడ్ తయారుచేసి, వచ్చిన కోడ్.. ఇప్పటికోడ్ 
తో సరిచూసి.., సరిగ్గా సరిపోతే.. ఓహో.. బాగానే పంపించాడు అని అనుకుని.. తనపని 
తానుచేసుకుపోతూ అమెరికాలోవున్న డాటాబేస్ లోకి లావాదేవీలు పంపించేస్తుంది.. 
సరిపోలేకపోతే.. ఆముదాలవలసలో వున్న కుక్కకి..., నాకు సరిగ్గా అందలేదని ఒక బిస్కట్ 
ముక్క పడేస్తుంది.. , ఇలా ముందుగా నిర్దేశించిన నూటొక్క విషయాలను పరిగనించుకుని.. 
తనపని తాను చేసుకుపోతాయి ఈ విండోస్ సర్వీసులు.. ఒక్క ముక్క కూడా అర్ధంఅవలేదు 
కదూ.!!,  అందుకే ఈ ప్రాసెస్ అంతటికీ రాకెట్ అని పేరుపెట్టాము.. 

ఈ రాకెట్ ని డిజైన్ చెయ్యటానికే.. ఇన్ని తిప్పలూ పడింది.... ఆడపోలీసుకు తాంబులం 
సమర్పించుకున్నదీనూ. ఓ రోజు కూరగాయల దుకాణంవాడు.. మీరు సాఫ్వేర్ ఇంజనీరు 
కదా.., అంతంత జీతాలిస్తుంటారు.. అంత పెద్ద పెద్ద బిల్డింగుల్లో.. ఏ.సి రూముల్లో కూర్చుని.. 
మీరసలు ఏం చేస్తుంటారు అనడిగాడు.., నీకు ఏ.టి ఎమ్ లోంచి డబ్బులెలా వస్తున్నాయి..
అవి రాగానే వెంటనే ఎసెమ్మెస్ ఎలా వస్తుంది.., ట్రైన్ టికెట్.. ఇంటర్నెట్లో ఎలా కొనగలుగుతున్నావ్..
ఇంకా కరెంట్ బిల్ కూడా నువ్వు ఇంట్లోనుండి ఎలా కట్టగలుగుతున్నావ్.., ఇలా చెప్పుకుంటే 
చాలా వున్నాయి.. అని అవన్నీ నేనే చేసినట్టుగా కాస్త కటింగిచ్చి.., మేమైతే ఒక రాకెట్లు 
తయారుచేస్తున్నాం అని వాడికర్ధమయేలా కొన్ని ఉదాహరణలతో, స్త్రీలింగానికి  పుంలింగమూ 
పుంలింగానికి స్త్రీలింగమూ కలగలిపిన వచ్చీరాని (బూతు) హిందిలో వివరించాను.. 
(ఇంకా నయం హిందీలో నపుంసక లింగం లేదు.., నా దెబ్బకు వాడు పిచ్చోడయిపోదుడు.. ). 

అప్పట్నుండీ కూరగాయల దుకాణం వాడు నాతో.. "అయ్ బాబోయ్ మీరు ఇంత గొప్పోలండే..", 
అన్నట్టు చూడ్డం.. మాట్లాడటం మొదలుపెట్టాడు..., ఆరోజునుండీ పుచ్చొంకాయలమీద కాస్త  
నా కోసం స్పెషల్ డిస్కౌంటులు ప్రకటించి ఇవ్వటం కూడా మొదలెట్టాడు.., ఇంకేముంది 
అప్పటినుండి మొదలయ్యాయి ఆలోచనలు.., అవును ఇస్రోలో రాకెట్ తయారుచేస్తున్న
వాళ్ళకు మాకూ తేడా ఏముంది? ఏమీలేదే..!!, అని గాల్లో తేలుతూ తిరగటం. అప్పటికే 
రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతులమీదుగా.. పదోసారి బెస్ట్ సాఫ్ట్వేర్ సైంటిస్ట్ గా అవార్డ్ 
అందుకుంటున్నట్టుగా కలలు ఒక పక్క... మా టీమ్ తో కలిసి.., గీసుకున్న 
ఆర్కిటెక్చర్ ప్రకారం రాకెట్ ఇంప్లిమెంటేషన్ ఇంకొకపక్క.. అబ్బో క్షణం ఖాలీలేదు. అలా 
మూడునెలలు గడిచాయి.. మా రాకెట్ కుడా లాంచింగ్ కి సిధ్ధమయ్యింది..

ఇప్పుడు కొత్త కష్టాలు.. "కర్నేమే నహీ..!, సంజానేమే..", అన్నట్టుగా మీదపడ్డాయి. 
మా కంపెనీలో బండమెదడు టెస్టర్లకు అవి ఎలా పనిచేస్తాయో అంతా వివరించి చెప్పేసరికి..
మానిటర్లో ప్రాణం.. మౌసుదాకా పాక్కొచ్చింది. "మన టెస్టర్సేకే అర్ధంఅవటానికి 
ఇంతటైముపట్టిందంటే.. అసలు క్లైంటుకేమర్ధమవుతుంది?, ఇలాక్కాదు.. ఒక డాక్యుమెంట్
తయారుచేద్దాం.. ", అన్నాడు మేనేజరు. చేద్దాం అన్నాడంటే.. ఇన్డైరెక్టుగా నువ్వుచెయ్యరా 
అనే కదా..!, ఏం చేస్తాం.. డాక్యుమెంటు రాయటం మొదలెట్టాను.. తెలుగులో నేనురాసే
బ్లాగులు అందరికీ నచ్చేస్తున్నాయి.. అదే స్టయిల్లో పడగొట్టేద్దాం తెల్లోల్లని.. అనుకుని 
గొప్ప బిల్డప్ ఇస్తూ.. ఇంగ్లీష్ లో డాక్యుమెంటేషన్ చేసి.. టీమ్ అందరికీ చూపించాను.. 

ఆ డాక్యుమెంటును.. ముప్పైనాలుగు సార్లు రివ్యూ అని చెప్పి.. నేనురాసింది మొత్తం 
బండబూతేనని తేల్చి.. దాని షేపులు మొత్తం మార్చేసి... ఎలాగైతే ఒక ఏభై పేజిల కధల
పుస్తకంలాగా.., దాంతో పాటుగా.. పది పదిహేను వెబ్సైట్లకు లింకులతో  సర్వాంగ 
సుందరంగా డాక్కుమెంటుని తీర్చిదిద్దాము.

ఇది ఫలానా రోజు డెమోఇవ్వాలి.. అంతా రడీఅవ్వండి అన్న మెయిల్ చూడగానే.. మా 
టీమ్ మెంబర్లంతా గాల్లోకి ఇంకోఅడుగెత్తుకు లేచి ఒకరినొకరు చూసుకుని మురిసిపోయాం. 
ఆ ఫలానారోజు పొద్దున్నే రడీ అయ్యి.. "ఈ రోజు కాస్త రావటానికి లేటవుతుందేమో.. 
ఫోన్ చేస్తాలే..", అని మా ఆవిడకు చెప్పి.. మాంచి హుషారుగా.. లిఫ్ట్ కూడా ఎక్కుండా 
మెట్లుదిగి.. ఆఫీసుకు బయలుదేరాను.. నెనువెళ్ళవలసిన రోడ్లన్నీ నిండిపోయున్నాయి.. 
జనాలు యాత్రలకెళుతున్నట్టుగా పొలోమంటూ వెళ్ళిపోతున్నారు.. ఎక్కడచూసినా 
తీర్ధంలాగా.. ఎదో సంబరంలాగా ఇసుకేస్తేరాలని జనం... అయ్ బాబోయ్.. ఇదంతా 
నా రాకెట్ లాంచింగ్ సెలబ్రేషనేనా.. అనుకుని ఒక్కసారి.. మళ్ళీ రాష్ట్రపతి అవార్టు 
గుర్తుకుతెచ్చుకుని నడిరోడ్డులో అడ్డంగా బైకుపెట్టి ఆలోచించేస్తున్ననాకు.. ఎవడో
పెద్దగా హారన్ కొట్టి.. ఈ లోకంలోకొచ్చేలాచేసాడు...

 కొంత దూరం వెళ్ళాకా తెలిసింది అవి మహారాష్ట్రాలో ఏదాడికొకసారి జరిగే ఫాల్కీ 
యాత్ర (దేవుడిని పల్లకీలో వేసుకుని మోసుకుంటూ యాత్రచేపట్టే ఒక పండుగ) అని.. 
అంతే కదా.. ఇంకా నయం.. పొరపాటుపడ్డా.., అని ముక్కుకి కట్టుకున్న కర్చీఫ్ 
వెనుకే ఎవరికీ కనబడకుండా ముసిముసి నవ్వులు నవ్వుకున్నా..

ఒక నాలుగు గంటలుపట్టింది ఆ జనాలనుండి తప్పించుకుని ఆఫీసుచేరుకునే సరికి.. 
సరేలే ఎలాగైతే చేరుకున్నాం అనుకుని సరిపెట్టుకున్నాను. క్లైంట్ కాల్ కన్నా 
ముందుగానే మాకు ఇంటర్నల్ మీటింగని టెస్ట్ డ్రైవ్ లాగా ఒకటి పెట్టుకున్నాం.. 
అంతా ఆత్రుతగా మా టీమ్ మేట్ చెప్పింది వింటున్నారు.. నేను టెన్సన్ టెస్సన్ గా 
అందరివంకా నోరువదిలేసి చూస్తున్నాను, ఎవడన్నా ఏమన్నా లాస్ట్ మినిట్లో 
పేల్చుతాడేమోనని... ఇంతలో మా ఆవిడ దగ్గరనుండి ఫోను వస్తుంది.. కట్ చేసి.. 
నా ఫోన్ మెసేజ్ టెంప్లేట్స్ లో సేవ్ చేసిపెట్టుకున్న.. "నేను మీటింగ్లోవున్నాను.. 
ఎదన్నా ముఖ్యమైనవిషయం అయితే... మెసేజ్ పెట్టు", అన్న మెసేజ్ పంపాను. 
"వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండి..", అని రిప్లై ఇచ్చింది మా అవిడ.., 
"ఇక్కడ కంపెనీలు మునిగిపోయేంత టెన్సల్లో మేం చస్తుంటే.. ఇదొక పెద్ద 
ముఖ్యమైనవిషయం మరి..", అని మనసులో అనుకుని ఫోన్ జేబులో పెట్టేసుకుని..
మళ్ళీ నోరు తెరిచి అందరివంకా చూడటంమొదలుపెట్టాను.. 

ఎవడూ మాట్లాడలేదు.. అంతాబాగానేవుందని వూపిరిపీల్చుకున్నాం. ఆమీటింగ్ 
నుండి బయటకురాకుండానే క్లైంట్ మీటింగ్ కి టైమయ్యింది..

ఏ.సీ రూమ్లో మా గుండెదడలే పెద్ద సౌండులావినపడుతున్నాయి.. అంతా నిశ్శబ్దం..., 
మా మేనేజరు మొహంలో కూడా ఆ రోజు కాస్త టెన్సనుకనిపించింది.., అన్లైన్లో 
వాళ్ళకు స్ర్కీన్ చూపిస్తు అంతా వివరించి చెబుతున్నాడు మా టీమ్ మేట్... 
అరగంటైపోయినా ఏమీ మాటలు రావటంలేదు అవతలినుండి.. అసలున్నారా లేదా..
అని మాటిమాటికి కావాలనే ఆపుతున్నాడు... చెప్పేవాడు. నలభై నిముషాల్లో 
మొత్తం అంతా ఉదాహరణలతో సహా వివరించేసాడు మా టీమ్ మేట్..

ఎనీ క్వస్చన్స్.. అనగానే తెల్లోడు రెస్పాన్స్ అయ్యాడు.. "ఇటీజ్ రియల్లీ ఎక్సెలెంట్...
బట్ బట్.. రైట్ నౌ వు ఆర్ నాట్ గోయింగ్ విత్ టూ సెర్వర్స్....", అన్నాడు..

అంటే ఏంటో మాకెవ్వరికీ అర్ధంకాలేదు.. ఫోన్ మ్యూట్ నొక్కి.. మా మేనేజరు అందరికీ 
వివరించిచెప్పాడు. అప్పుడు తెలిసింది అసలువిషయం.. ప్రస్తుతానికి.. రెండుచోట్ల అంటే 
ఆముదాలవలస, అమెరికా అక్కర్లేదు.. అమెరికాలోవున్నదాన్లోనే రెండు డాటాబేస్లుంటాయి..
అంటే ఏముంది డైరెక్ట్ కనెక్షన్ అన్నాడు.. "మరి ఈ మూడునెలలు కష్టపడి తయారుచేసిన 
రాకెట్...", అన్నాను నేను.., ఇంకేముంది.. అని పైనుండి కిందదాకా చూసాడు మేనేజరు..

"వా.. అని మా టీమ్ అంతా కుర్చీలమీంచి నేలమీదపడి.. గిలగిలా కొట్టేసుకున్నాం.. 
కాసేపటికి తేరుకుని టైముచూస్తే పదవుతుంది.. అమ్మో త్వరగావెళ్ళాలి.. ఈ టైములో కూరగాయలెక్కడదొరుకుతాయి..., ఆ కూరగాయలోడిదగ్గరకెళ్ళి రాకెట్ సంగతితెలిస్తే 
పరువుపోతుంది..  ఛా.. కనీసం మేం చేసిన రాకెట్.. మార్కెట్ కెళ్ళి కూరగాయలుతేవటానికైనా 
ఉపయోగపడుండినా బాగుండేది.. అనుకుని.. పెదవివిరుచుకుంటూ ఆఫీసు బయటపడ్డాను..



Related Posts Plugin for WordPress, Blogger...