12, సెప్టెంబర్ 2009, శనివారం

గుర్తుకొస్తున్నాయి...




తెల్లారింది... ఈ రోజు.. ఎలా ఉంటుందో.. ఏమిటో... అనుకుంటూ లేచి.. బ్రష్ చేసుకున్నా..,
ఏమ్నన్నా ఓపెనింగ్స్ ఉన్నాయో లేదో.. అని జాబ్స్ కాలమ్స్ అన్నీ... తిరగేసాను.. అటూ ఇటూ..
ఎటు చూసినా.... అన్నీ నాలుగేళ్ళు పైబడే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు.

ఎవడూ జాబ్ ఇవ్వకపోతే.. ఎక్కడనుండొస్తుందీ??... ఎక్స్పీరియన్స్.., అని ఆలోచిస్తూనే...
ఫ్రెండ్ ఇచ్చిన వేడివేడి టీ తో బాల్కనీలోకి వచ్చి... సూర్యూడ్ని చూసాను... అప్పుడే...
నైట్ షిప్ట్ చేసి కళ్ళు ఎర్రబడిన... బిపివో ఎంప్లాయిలా సరిగ్గా హైటెక్ సిటీ పైనుండి.. వస్తున్నాడు...,

హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆ రూము..., బాల్కనీ నుండి... రోజూ హైటెక్ సిటీ దర్శనం....
ఎప్పటికైనా అందులో జాబ్ కొట్టగలనంటావా??,అని.. ఫ్రెండ్స్ తో అన్న మాటలు...
మేం గడిపిన ఆ రోజులూ... ఎప్పటికీ మరచిపోలేనివి..

మేం ఐదుగురు స్నేహితులం, ఒకే రూములో ఉండేవాళ్ళం.. మా రూము చూస్తే బ్యాచిలర్ రూమంటే
ఎవరూ...నమ్మరు... వస్తువులన్నీ... చక్కగా సర్దుకునే వాళ్ళం,ఒకరూము నిండా పుస్తకాలతో
లైబ్రరీలా ఉండేది.. అదే రూములో ఒక ప్రక్కగా కంప్యూటర్, అదే మాకు ప్రపంచం...,
హోమ్ ధియేటర్... డివిడిప్లేయర్... వార్తావాహిని...వినోదాల డబ్బా అన్నీను..,
అప్పుడప్పుడూ సరదాగా గేమ్స్...సినిమాలు.., పాటలూ...!

పాటలంటే గుర్తొచ్చింది...!!, మా రూములో అందరికీ పాటలంటే పిచ్చి ఉండేది...,
ఎవడి టేస్ట్ వాడిదన్నట్లు ఉన్నా..!, అందరికీ కామన్ గా.., పాతపాటలే ఎక్కువ... వినే వాళ్ళం..
winamp లో ఎవరి ప్లేలిస్ట్ వాళ్ళదే..., కానీ..., నాకు నచ్చిన పాటలతో ప్రక్కవాడిని
చిత్తుచేసిన రోజులూ ఉన్నాయనుకోండి.., కష్టాలు పంచుకుని..., అలవాట్లు కలుపుకుని...,
ఒకరినొకరు అర్ధంచేసుకుని... కలిసి కబుర్లుచెప్పుకుంటూ... కలిసిమెలిసి...
ఉంటుంటే చాలా బాగుండేది..

"సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్..", ఆకలిరాజ్యంలో పాట పెద్ద సౌండులో పెట్టుకుని..
ఒకప్రక్క పాటలు వింటూ.. చేతిలో పుస్తకం పట్టుకుని... బాల్కనీలో తిరుగుతూ...
వచ్చే పోయేవాళ్ళని చూసి.. కామెంట్ చేసుకుంటూ.. నిరుద్యోగులం మేం అన్న విషయం
మరిచిపోతూ.... రోజులు గడిపినా...!! రోజు రోజుకు ఉద్యోగం లేదు!!!
అన్న విషయం మనసుకు తగిలి... పగిలి పోవటం మాత్రం మానలేదు...

ఫ్రెండ్స్.. చుట్టాలు.. తెలిసినవాళ్ళ పెళ్ళిళ్ళకు వెళ్ళాలంటేనే భయం..ఎదో ఇంటర్వూ ఉంది..
అని వంకపెట్టి... ఎగ్గొట్టక తప్పేదికాదు... పెళ్ళిలో ఆనందంకన్నా... అందరూ ఏంచేస్తున్నావ్..
ఇంకా జాబ్ రాలేదా?,"అవునూ.. మన సుబ్బారావుగారి అబ్బాయికి జాబ్ వచ్చింది తెలుసా?,
ఇంటర్మీడియెటే చేసాడు వాడు...!!!, నెలకు పదివేలు ఇస్తారంట... చాలామంచి కంపెనీ..
అంట...",అని చెప్పుకుంటూ... మధ్యలో.."మరి నీకెప్పుడొస్తుంది??, నీదేమో...
ఎమ్మెస్సీ... అంటే... స్టార్టింగే ముప్పై అయినా రావాలి మరి...",
అని చెప్పుల్తో కొట్టేవారి భాధతప్ప పెళ్ళిళ్ళలో ఆనందమె కరువాయేను...

నామీద, నా కష్టపడే తత్వం మీద ఎంత నమ్మకమున్నా...ఈ బయట జనాలు కొట్టే చెప్పుదెబ్బలు విని
నాన్నకో అమ్మకో మా వాడు.."తప్పుచేస్తున్నాడా??, బాధ్యతగా ఉద్యోగం వెతకటంలేదేమో?",
అన్న అనుమానాలు రావటమూ... సహజం..., ఎంతైనా...తెలుగు సినీ ప్రేక్షకులు కదా మరి!!.

ఇంటికి వెళ్ళిన నాలుగురోజులూ నా ఉద్యోగంమీదే.., ఏదొక చర్చ... కధాకమామిసు...,
ఎక్కడికి వెళ్లినా... నలుగురిలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నేనే ఉండేవాడిని... "ఇదెక్కడిగోలరా బాబు...
వీళ్లంతా సానుభూతి చూపిస్తున్నారా?, లేక ఎద్దేవా చేస్తున్నారా?", అనిపించేది... "ఎవడో పెళ్ళి
నా చావుకొచ్చినట్లయ్యింది..., సరేలే ఏంచేస్తాం...", అని.. సరిపెట్టుకునేవాడిని...

ఎదో సరదాగా నాలుగురోజులు ఉండిపోదామనుకుని వచ్చినవాడినే అయినా... ఎప్పుడెలిపోదామా...
అన్నట్లు..అనిపించి... ఇంటర్వూ వంకతో వెళ్లిపోయేకన్నా... ముందే ఇంటర్వూ ఉంది కుదరదు
అని చెప్పటమే బాగుండేది....

నాన్నకు తెలిసిన.. ఏ మినిష్టరో, లేక ఎమ్మెల్యేనో రికమెండషన్ తీసుకురావటం..., వెళ్ళి కలిస్తే వాళ్ళు...
"ఏంటీ... ఎమ్మెస్సీనా..., ఇప్పుడు... అంతా ఇంజనీరింగ్ కు ఎక్కువ ఉన్నాయిబాబు...,
ఎమ్మెస్సీకి.... ఉన్నప్పుడు చెప్తాన్లే...", అని కర్ర విరగనివ్వక.. పాముచావనివ్వక చెప్పే
సమాధానాలు.... చేసే అవమానాలూ..., అటు ఇంట్లో చెప్పలేక... ఫ్రండ్స్ సలహా అడగలేక....
నానా యాతనా పడేవాడిని..,జరిగింది ధైర్యంచేసి... ఒక ఫ్రెండ్ కి చెబితే... ఒక్కసారిగా పగలబడి నవ్వి...
"నువ్వూ వెళ్ళావా!!,నాది అదే పరిస్తితి..., ఇంజనీరింగా!! , ప్రస్తుతానికి లేవు బాబు
ఒకనెల ఆగి కనిపించు...", అని చక్కగా చెప్పారు... అన్నాడు..., "అయినా రికమెండేషన్స్...
ఏంటి లేకపోతే..., అర్హత లేకపోయి,అడ్డదారిలో ఉద్యోగానికి కదా, అవి కావాల్సింది...",
అని ఇద్దరూ సర్దిచెప్పుకున్నాం.., ఇదే... విషయం ఇంట్లోవాళ్ళకు డైరెక్టుగా... చెప్పలేకపోయేవాడిని.

"సరేలే... అన్నిరాళ్ళూ విసురుదాం... ఏదో ఒక చిన్న రాయైనా తగలకపోదా??", అని ఎదో మూల చిన్న ఆశ,
చిన్న ఉద్యోగమైనా దొరక్కపోదా అని... ఇక.. అవమానాలు... నెమ్మదిగా అలవాటు చేసుకున్నాను.
కానీ ఎన్నాళ్ళని ఇంట్లో డబ్బులు అడిగి బ్రతుకుతాం.. వాళ్ళకు ఇవ్వటం భాధ్యతైనా,
నాకు తీసుకోవటం తప్పే అనిపించేది..., ఇక ఏదో ఒక... చిన్న ఉద్యోగం మన ట్రాక్ కాకపోయినా
పర్లేదు అనిపించేది..., ఏం చేస్తాం పీజీ చేసాం, ఏ పనైనా అర్హతకు తగినదైతే ముందుముందు
బాగుంటుంది అని ఆశ, ఒకవేళ చిన్న ఉద్వోగం అయితే??, మళ్ళీ తగిన ఉద్యోగం కోసం తిప్పలు పడాలి..,

సాయంత్రం ఏదో ఒక సమయంలో ఇలాంటి విషయాలు నలుగురూ కలిసి మాట్లాడుకునేవాళ్ళం...
మనసులో ఉన్నవి చెప్పుకుని...కాస్త భారం దించుకునేవాళ్ళం...

పొద్దున్న తొమ్మిది అవగానే... లాస్ట్ బస్ స్టాప్ దగ్గర ఉన్న... ఆంటీ హొటల్ లో టీ. తాగి..,
రోడ్డుప్రక్క బండిహొటల్ లో టిఫిన్...చేసి.., ఎక్కాల్సిన బస్సుకోసం ఎదురుచూసి....,
ఫైలు నిండా రెజ్యూమ్స్ నలగనివ్వక... పట్టుకుని..., పేపర్లో పడ్డ కంపెనీల ఎడ్రసులన్నీ
రాసుకున్న పేపరును మాటిమాటికీ బయటకుతీసి..., చూసుకుని...,
నలుగురూ చెప్పిన నాలుగు రకాల ఎడ్రస్సులతో సతమతమయ్యి..., దిగాల్సిన చోటకాకుండా కాస్త
ముందో వెనుకో... బస్సుదిగి, చివరకు ఎలాగోలాగా అనుకున్న చోటుకు.. చేరుకున్నాకా...,
"హమ్మయ్యా...!! వచ్చాంరాబాబు...", అనుకోగానే.. అక్కడ అప్పటికే..
ఇంటర్వూలకోసం క్యూలు కట్టిన జనాలను చూసి నోరెల్లబెట్టీ..., చెమటలు తుడుచుకుంటూ...
లైన్లో నిలబడి..., ఆకలిబాధను మరచి... పిలిచిన ప్రతిపేరుకూ ఉలికిపడి...,
మన పేరు ఎప్పుడొస్తుందోనని వేచిచూస్తూ... పడిగాపులు కాస్తూ..., చెమటతో తడిచిన షర్టుతో...,
సగం బయటకొచ్చిన ఇన్ షర్టుతో..., కిక్కిరిసిన బస్సులో తొక్కేసిన బూట్లలో...
వణుకుతున్న కాళ్ళతో, తడబడిన అడుగులు వేస్తూ ఇంటర్వూ రూములోకి అడుగుపెట్టి...
అడిగిన నాలుగు ప్రశ్నలకు... టకీటకీమని జవాబులు చెప్పి..., "ఉఫ్..!!!",
అని..ఊపిరి పీల్చుకుని.., ఇంటర్వూ రూమునుండి...బయటపడి.., మళ్ళా తరువాత వెళ్ళాళ్సిన
కంపెనీ ఏమిటో...?, ఎక్కడో...?, అని రాసుకున్న ఎడ్రసు చీటిలో కళ్ళింతచేసుకుని చూసి,
పడిలేస్తూ పరుగుతీస్తూ..., బస్సులెక్కి... మేడలెక్కి..., మెట్లుదిగి..., తిరిగి తిరిగి...
అలసిపోయి... రాత్రి పదయ్యేసరికి... కర్రీపాయింట్ దగ్గరనుండి తెచ్చుకున్న..
నాలుగు రకాల కూరలనూ ఒకరికొకరు... వడ్డించుకని...., ఇంటి దగ్గరనుండి తెచ్చుకున్న
ఆవకాయకు...సాయంగా.. నెయ్యికలిపి తింటూ..., ఆ రోజు జరిగినవన్నీ నెమరువేస్తూ...
నవ్వుకుంటూ...కడుపునింపుకుని..., పిల్లగాలికి బయటకొచ్చి..., తిన్నదరిగిన తరువాత..
రూముకొచ్చి..,నడుంవాల్చి...., "హమ్మయ్య ఈ రోజు గడిచినట్లే", అనుకుని కునుకు తీసి...
మాకోసం మరో పరుగుల రోజు.. వెకిలిగా నవ్వుతూ...ఎదురుచూసినట్లు కలగనగానే....,

కలనిజమై తెల్లవారి... మళ్ళీ కధ మొదలై... ఉద్యోగప్రయత్నం తప్ప.., మరో కలేలేని... జీవితానికి..,
కళే కరువయ్యి... రొజులు పరుగులు తీస్తుంటే...., ఆపరుగుల రోజులతో.. మా పరుగులూ సాగుతున్నాయి...!

అసలు ముందు.. ఇంటర్వూ భయం పోతే చాలు.. తరువాతెలాగూ ఎదొకటి రాకమానదు అనుకునేలోపే
పది ఇంటర్వూలదాకా.. అయిపోయాయి... ఇక తరువాత నాలో ఉన్న లోపాలను గుర్తించడం మొదలుపెట్టాను...
ఇంటర్వూలో చెప్పలేనివి అన్నీ ఒక లిస్టురాసుకునేవాడిని..., వాటిమీద తరువాతరోజునుండి శోధన మొదలుపెట్టేవాడిని...
అలా నాలో కాస్త స్ధైర్యాన్ని నింపుకున్నాను...

కానీ దండయాత్రను మాత్రం ఆగనివ్వలేదు..., ఆ తరువాత జరిగిన ఇంటర్వూలలో ఎదో తేడాను గమనించాను...
సమాధానాలు వాటికవే రావటం మొదలుపెట్టాయి... నేను చేసిన పరిశ్రమ నాకు తోడుగా రావటం మొదలుపెట్టింది....,
లోనదాగిఉన్న విషయమేదో.. నన్ను నడిపిస్తుందని భావించాను...,
అదే కాన్ఫిడెన్స్ అని తెలుసుకున్నాను, ఇక త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నాను.., అని మనసును సిద్ధంచేసాను...

రెండుమూడు ఆఖరుదాకా వచ్చినట్లు వచ్చి ఆగిపోయాయి..., ఈ వారంలో కబురొస్తుంది అనుకున్నవి
ఎందుకో మరి కాలయాపన చేసాయి..., తృటిలో తప్పినవి కొన్నయితే..., ఎండీ ఊళ్ళోలేరు వచ్చాకా చెబుతాం..,
అని నెలలుగడిపినవి కొన్ని..., ఎమైందో తెలియదు అన్నవి కొన్ని..., ఇలా మళ్ళీ అన్నీ సహనాన్ని పరీక్షించాయి...,
అతికొద్దిరోజుల్లోనే... నా సహనం కోల్పోయేలా చేశాయి...

అన్ని అయిపోయాయి..., చాలారోజుల తరువాత... సమాధానం వచ్చింది...,
"సారీ...!, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ పై కాస్త శ్రధ్ధ వహించాల్సి ఉంది... తరువాత కనిపించు...",
అని..., ఇన్నిరోజులూ ఆగాను...!!, ఇంకేముంది ఐపోయిందని ఆశపడ్డాను...!,
కాస్త మనకు అనుకూలంగా ఉందని... ఇంట్లోవాళ్ళతోనూ.. ఫ్రెండ్స్ తో కూడా చెప్పాను...!,
చివరకు ఇలా అయ్యిందేంటా!!, అని చాలా ఆలోచించాను.. ఆరోజు అసలు రూముకు వెళ్ళాలనిపించలేదు...,

నా మొహం తెలుసున్న వాళ్ళకు ఎవ్వరికీ చూపించాలనిపించలేదు..,
అలా నడుస్తూ ఒక పార్కులో ఒక చోట కూర్చున్నాను..., వస్తూపోయేవాళ్ళంతా నా వైపు చూసి..
"ఏంటి అలా ఉన్నావ్..", అని ప్రశ్నించినట్లు అనిపించింది..., ఉలిక్కిపడ్డాను...!,
మొహం తుడుచుకున్నాను..

ఆలోచనలు.. గుర్రాలై పరుగులు తీసాయి..., "సరేలే ఈ ఉద్వోగం ఒక్కటే నా జీవిత లక్ష్యంకాదుకదా!!,
వేరొకటి ప్రయత్నిద్దాం", అని సర్దిచెప్పకున్నాను..., దగ్గరలో ఉన్న బస్టాపుకు బయలుదేరాను...,
కాసేపు మనసుని స్ధిరపరచుకున్నాను..., గుర్రాలకాళ్ళకు భంధాలు వేసాను..., వచ్చిన బస్సుఎక్కి...
కిటికీ దగ్గరసీట్లో కూర్చున్నాను..., బయట బస్సువేగానికనుగునంగా... వెనక్కు పరుగెడుతున్న పరిసరాలను...
చూసాను...,"ఇన్నాళ్ళూ... నా పరుగు.. ఇలానే ఉందా!!, ఇలానే వెనక్కు తీస్తున్న పరుగునే
చూసి మురిసిపోయానా??, నేనేమీ సాధించలేనా!, నేనెందుకు పనికిరానా!!",
మళ్ళీ ఆలోచనలు పరుగులు తీసాయి... ఈ సారి.. నా మనసు మాట వినలేదు...,
కళ్ళవెంట కన్నీళ్ళొచ్చాయి..., బస్సులోంచి బయటకు చూస్తూ ఏడ్చేసాను...
ఎప్పుడో చిన్నప్పుడు.. తెలియని వయసులో ఏడ్చాను..., మళ్ళీ చాలారోజులకు...,
ఎలా ఉంటుందో ఆరోజే తెలుసుకున్నాను...

కొన్ని రోజులు ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉన్నాను..., అలాంటి.. సమయల్లో స్ఫూర్తినిచ్చే..
పుస్తకాలు చదవటం ఒక మంచి అలవాటుగా మా రూమ్మేట్స్ దగ్గరనేర్చుకున్నాను...,
మా లైబ్రెరీలోని... వివేకానందుడి పుస్తకాల్లో ఒకటి చదివి కాస్త ఊపిరి పీల్చుకున్నాను...,
నచ్చినపాటలు వింటూ కాస్త మనసుని ఏమార్చాను...

కాస్త తేరుకున్నాకా నా కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంచుకోవటానికి ప్రయత్నాలు చేసాను...
ఒక చోట కోర్సు జాయిన్ అయ్యి... ఎదుటివారితో ఎలామాట్లాడాలో...,
మనసులో ఉన్న విషయాన్ని ఇతరులకు అర్ధమయ్యేలా ఎలా వ్యక్తపరచాలోలాంటి...
కొన్ని మెలకువలు నేర్చుకున్నాను..., ఉద్యోగానికి.. పనితనమేకాదు...
అన్ని విద్యలూ సమపాళ్లలో ఉండాలనే విషయజ్ఞాణం కాస్త సంపాదించాను...,
తెలిసిన వాళ్ళను అడిగి కొత్త విషయాలు తెలుసుకున్నాను.

మనం అన్నీ బాగానే చేసాం అనే అనుకుంటాం.., కాని కొన్ని లోపాలను మనం తెలుసుకోలేం...
మన మొహం ఎప్పుడూ అద్దంలో బాగానే కనిపిస్తుంది.. అందులో లోపాలు ఎదుటివాడికే కదా తెలుస్తుంది...
నా లోపాలను బేరీజు వేసుకున్నాను..., నెమ్మది నెమ్మదిగా.. వాటిని అధిగమించాను...
అనుకున్న పట్టుసాధించాను...

ఆ తరువాత అతికొద్దిరోజులలోనే... నా ట్రాక్ కాకపోయినా... నెలకు మూడువేలు
సంపాదించే ఉద్యోగమొకటి సాధించగలిగాను..., ప్రతిరోజూ ఒక విద్యార్దిలా మారాను...,
చదువుకునే రోజుల్లో పుస్తకం తీస్తేచాలు... నిద్రవచ్చేది.., అలాంటిది..
పుస్తకమే లోకంగా చదివాను..., అతి తక్కువ సమయంలోనే... నా కలనెరవేర్చుకున్నాను...,
ఆ తరువాత ఉద్వోగరిత్యా ముంబయి రావాల్సొచ్చింది..., ఇక అక్కడ నిత్య విద్యార్ధినయ్యాను...,
మనుషులగురించి... జీవితం గురించి చాలా తెలుసుకున్నాను..

ఇప్పుడు సుఖపడుతున్నవారంతా ఎదో ఒకరోజున కష్టపడ్డవారే..., అందరూ చాలా కష్టాలు పడతారు..,
ప్రక్కవాడు.. అలా ఉన్నాడే అనుకుంటాం కాని.., అతను అలా ఉండటానికి ఎన్ని తిప్పులుపడ్డాడో,
ఎన్ని మెట్లెక్కాడో..., మనం అలోచించం...

నేను పడ్డకష్టం ఎవడూ పడడు.., అని అందరికీ అనిపిస్తుంది..., అసలు లైటేలేని..
ప్రపంచం నుండి వచ్చి... చదువుకుని పెద్దవాళ్ళయిన వాళ్ళున్నారు... వాళ్ళతో పోలిస్తే..
మనదెంత?., ఇంకా అన్నీ ఉన్నా ఆవారాగా తిరిగి జీవితాలను నాశనంచేసుకున్నవాళ్ళతో పోలిస్తే...
మనం కొంచెం పర్వాలేదు... అనిపిస్తుంది..

ఎపుడూ జీవితం.. సజావుగా ఉండాలని కోరుకునేకన్నా..., కష్టాలుండాలనే కోరుకోవాలి...,
ఆ కష్టాలను భరించగలిగే... శక్తి రావాలని కోరుకోవాలి..., ఎందుకంటే.. కష్టాలను
అధిగమించినతరువాత వచ్చే ఆనందంలో ఉన్న తృప్తి వెలకట్టలేనిది...

ఎక్కడో సరిగా గుర్తలేదు కానీ... ఒక చోట ఒక కొటేషన్ చూసాను... ఒక తాబేలు..
వెనుక బ్యాగ్ తగిలించుకుని..., చెమటలు కక్కుకుంటూ... నడుస్తున్నట్లు బొమ్మ ఉంటుంది...,
క్రింద.. ఇలా వ్రాసి ఉంది...,

"లక్ష్యాన్నిచేరుకున్నామా లేదా అన్నది ముఖ్యంకాదు.., మనం ఆ లక్ష్యాన్ని అందుకోడాని అసలు
(అదే దిశలో) నడుస్తున్నామా లేదా అన్నది ముఖ్యం...".

ఇది ప్రతిఒక్కరి జీవితానికీ సరిగ్గా సరిపోతుంది...

-----------------------------------------------------------

జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నవాళ్ళను చూసినప్పుడల్లా నాకు నా రోజులు గుర్తొస్తుంటాయి...
అందుకే వ్రాయాలనిపించింది.
All the best.

Related Posts Plugin for WordPress, Blogger...