24, నవంబర్ 2009, మంగళవారం

రిషెషన్ ఎఫెక్టు...



అందరూ దిగాలుగా... మీటింగ్ హాల్ నుండి.. బయటకు వచ్చారు..., ఈ సంవత్సరం జరగాల్సిన
appraisals ఇక లేవని... రిషెషన్ వలన తమ బిజినెస్ చాలా దెబ్బతిందని..., త్వరలోనే
cost cutting పేరుతో.. కొంతమందిని తీసే అవకాశం కూడా ఉందని.. డైరెక్టుగా...
HR మీటింగులో చెప్పేయటంతో అందరి మొహాల్లోనూ టెన్సన్ మొదలయ్యింది...
చంటికి ఏమీ తోచడంలేదు..., ఇంకొక వారంలో జీతం పెరుగబోతుందని...,
తరువాత నెలలో ఒక పదిహేనువేలు వరకూ జీతం ఎక్కువ వస్తుందని... ముందుగానే
ఒక మూడు లక్షలకి.. personal loan పెట్టేసి... నిజాంపేట రోడ్డులో ఒక
టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి బుక్ చేసేసాడు..., ఒక రెండువేలు పెట్టి.. కొలీగ్సందరికీ
పార్టీకూడా చేసేసాడు... ఇప్పుడు... ఉద్యోగం అటుఇటుగానీ అయితే...,
ఇంకేమన్నా ఉందా!,తలుచుకుంటేనే... తలనుండి కాళ్ళవరకూ ఒణుకు పుట్టింది...

ఆఫీసు గేటుబయట.. చాయ్ బండి దగ్గర కలిసి ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటున్నారు,
షేర్ మార్కెట్ పతనం గురించి ఒక్కొక్కరు.. ఒక్కో విధంగా వాళ్ళకు తెలిసినవి చెప్పేసారు..,
ఇలా అయితే... మ్యూచువల్ ఫండ్సంటూ కట్టిన డబ్బు ఇప్పుడు తీసినా...
సగం కూడా రాదన్నమాట అని మనసులో అనుకున్నాడు చంటి...

కాలం గడిచింది...
తన కంపెనీలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.., రెస్ట్ రూమ్లో.. చేతులు తుడుచుకునే
పేపర్ టవల్స్ దగ్గరనుండి... ప్రతి డెస్క్ దగ్గర పెట్టే వాటర్ బాటిల్స్ వరకూ అన్ని వసతులు
తీసేసారు.. ఇరవైరూపాయలతో ఇచ్చే లంచ్ కాస్తా తగ్గింపు లేకుండా నలభైరూపాయలు
చేసేసారు..., పదిమందికి నలుగురు అన్నట్లు.. ఖాలీగా బెంచ్ పై మూలుగుతున్న
వాళ్ళందరికీ వాలంటరీ రిటైర్మెంటులాగా.. ఒక నెల జీతం ఇచ్చేసి.. ఇంటికి పంపించేసారు.,
చంటికి అదృష్టం సపోర్ట్ ఫ్రోజెక్ట్ రూపంలో కలిసొచ్చి.. తృటిలో తప్పించుకుని..
హమ్మయ్యా.. కనీసం ఉద్యోగం అన్నా మిగిలింది అనుకున్నాడు...

పని ఒత్తిడి బాగా పెరిగిపోయింది... పదిమంది చేసే పని ఒక్కడు చేయాల్సొస్తుంది...
పని ఎక్కువ ఉందని ఎదురు తిరిగి అడిగే ధైర్యం ఎవడూ చేయలేదు.. నోరుమూసుకుని..
పనిచేస్తున్నారంతా... ఖాలీ అయితే.. ఎక్కడు బెంచ్ మీదకు వస్తామో...
అని పనిఉంటేనే బాగుణ్ణు అనుకోవటం మొదలుపెట్టారు..

ఏ రోజు ఏ కొత్త షాకింగ్ న్యూస్ వినాస్సొస్తుందో అని.. న్యూస్ ఛానల్సే చూడటం
మానేసి... ఆఫీసు బయట రోజు రోజుకూ.. బక్క చిక్కిపోయిన కుక్కల్ని,
కుప్పలు కుప్పలుగా పోసిన సిగరెట్ ముక్కల్ని... చూసినప్పుడల్లా... ఇంకా
రిషెషన్ ఎఫెక్టు కొనసాగుతూనే ఉందన్నమాట... అని అంచనావేసుకున్నాడు చంటి.

ఒక్కవారంలోనే ఎటుచూసినా.. టూలెట్ బోర్డులు కనపడసాగాయి..., ఏడువేలు
అద్దెకట్టలేక దుకాణం సర్దేసి... ఇరుకిళ్ళే సరి అనుకుని... మూడువేల ఇంటిలోకి
చేరిపోయాడు..., మాట్లాడితే మెక్ డొనేల్డ్స్ కు పోయేది మానేసి... రోడ్డుప్రక్కన
సమోసానే తినటం మొదలుపెట్టాడు..., వీకెండు పార్టీలు, సినిమాలు..
అన్నీ మానేసి.. కాళ్ళమీదకాళ్ళు వేసుకుని.. చక్కగా ఇంట్లో కూర్చుని..
FMలో పాటలు.. TVలో సినిమాలతో టైమ్ పాస్ చేయటం అలవాటయ్యింది..

పోస్ట్ పెయిడ్ మొబయిల్ కనెక్షన్ కాస్తా ప్రీపెయిడ్ అయ్యింది..., ఏ గడ్డి కనపడితే
ఆ గడ్డి కొనటానికి ఉపయోగపడతాయి.. అనుకునే.. sodexho pass కి కూడా
ఎక్ష్పైరీ డేట్ ఉంటుందని.. అవి కూడా డబ్బులేనని, అవి కింద పడిపోతే..
జాగ్రత్తగా తీసుకొని కళ్ళకద్దుకోవాలని తెలిసొచ్చింది...

ఒకప్పుడు.. భరించి బిల్స్ కట్టిన బరిస్తా.., కాఫీషాప్ లు ముందునుండు వెళ్ళేటప్పుడు...
ఖర్చుపెట్టిన డబ్బులు గుర్తొచ్చి.. తలవంచుకోవాల్సొచ్చింది..., కారుకి పెద్ద పరదా
కప్పేసి.. ఆఫీసుకు.. టూ వీలర్ పై వేరే ఫ్రండును వేసుకుని.. పెట్రోలుకు అయిన
ఖర్చును.. సగం సగం చేసుకోవడం మొదలుపెట్టాడు.. ఇలా తెలిసిన ప్రతి ఖర్చుకు..
కటింగు వేసి.. ఎంతో కొంత మిగల్చడం మొదతలుపెట్టాడు.. చంటి..

కొత్తగా ఆచి తూచి చేస్తున్న ఖర్చులకు.. బడ్జెట్ ప్లాన్ వేసి చూస్తే.. తన జీతం మొత్తం
ఇంటి అద్దెకు..లోనుకు.., కారు లోనుకు... ఇలా.. అన్ని ఖర్చులకు పోగా..
నెలకు రెండువేలు అప్పుచేయ్యాల్సుంటుంది అని తేలింది.., సిటీలో బ్రతకడం కష్టం కష్టం
అంటుంటే.. ఏంటో అనుకున్నా.. కష్టాలు ఇప్పుడే తెలుస్తున్నాయి..
అని మనసులో అనుకున్నాడు చంటి.

సరేలే.. కష్టాలు సాఫ్వేర్ ఇంజనీర్లకు రాక.. గవర్నమెంటు ఉద్యోగులకొస్తాయా...
అనుకుని..దేవుడికైనా మొక్కితే.. సమస్యలు తీరుతాయోమో.. చూద్ధాం.. అని
ఒకరోజు చిలుకూరి బాలాజి గుడికి బయలుదేరాడు... బస్సులోనే వెళ్ళి
బస్సులోనే వద్దాం.. సాదాసీదాగా మొదలుపెడదాం.. కనీసం ఆ దేవుడైనా మొర
వింటాడేమో అని అనుకుని... బస్సుకోసం చూస్తున్న చంటికి... స్నేహితుడు
నుండి ఫోన్ వచ్చింది.., బాలాజి గుడికి వస్తున్న విషయం చెప్పాడు.. చంటి..
"ఒరే... నేను అక్కడే ఉన్నా..ఇక్కడ IBM, Accenture రెండూ..
ఒకేసారి.. ఒకేచోట ఇంటర్వూ పెడితే వచ్చినంత జనం ఉన్నార్రా... చాలా కష్టంగా ఉంది...
రిషెషన్ స్పెషల్ బస్సులు కూడా RTC వారు మెహదీపట్నం నుండి.. నడుపుతున్నారు...
అసలు టిక్కెట్టురేటుకి సగమే తీసుకుంటారంటరా.., నువ్వు త్వరగా అందులోనే వచ్చేయి...
నా మొబైల్ లో బ్యాలన్స్ లేదు.. పెట్ఠేస్తున్నా అని కట్ చేసేసాడు...", "ఓహో.. వీడు అల్రెడీ
వెళ్ళిపోయాడా.., ఇలా అందరూ వెళ్ళి ఆయన చెవిలో గుసగుసలాడితే.. ఆయనమాత్రం
ఏంచేస్తాడు.. తప్పదు మరి.. ఎంత జనం ఉన్నా.. ఎంత టైమైనా..
దేవుడిదగ్గరకు వెళ్ళేటప్పుడు.. అనుకుని వెళ్ళి దేవునికి మొక్కులు మొక్కి...
సాయంత్రానికి తిరిగొచ్చాడు ఇంటికి...

"ఒరే.. ఎలాగైతే కష్టపడి మేనేజర్ ని.. రెండురోజులు సెలవు ఇవ్వటానికి ఒప్పింగలిగాన్రా...",
అని బండిపై తనవెనకు కూర్చున్న స్నేహితునితో ఆనందంగా చెప్పాడు చంటి.. ఏంటిరా,
"మళ్ళీ.. పెళ్ళా ఎవరదన్నా?, ఇప్పుడు ఇంటికి ఏంటి?" అని అడిగాడు వెనుక
కూర్చున్న స్నేహితుడు..

"పెళ్ళా పాడా.,.ఇప్పటికే.. ఖర్చులు భరించలేకున్నా..., క్రితం వారం.. నా క్లోజ్ ఫ్రండ్సందరి
పెళ్ళిల్లకూ చాలా వర్కుంది.., అసలు ఖాళీలేదు..అని చెప్పి.. వెళ్ళటం మానేసా...
ఒక్క పెళ్ళికి వెళ్ళొస్తే.. కనీసం మూడువేలు వదులుతున్నాయి రా బాబు..",
ఇంటికి వెళ్తున్నారా.. మళ్ళీ పెళ్ళిచూపులంట.. ఇంటికెళ్ళి కూడా.. చాలా రోజులయ్యింది..!!,
రమ్మని ఒకటే పోరు పెడుతున్నారు..", అని అన్నాడు చంటి...

ఒరే.. అది చూడు.. అక్కడ.. కటింగు వేయించుకుంటే.. గడ్డం ఫ్రీ అంటరా..
పద వెళ్ళొద్దాం... నువ్వు కటింగు వేయించుకో.. నేను గెడ్డంచేయించుకుంటా..
"ఒకప్పుడు.. అమీర్ పెట ఎలా ఉండేదిరా.. ఎలా అయిపోయింది.. ఇక్కడ institutes
అన్నీ ఖాళీ చేసేసి.. హాస్టల్లనుండి ఇంటికి.. చెక్కేసారు జనాలు.. ఇక ఇలాంటి షాపువాళ్ళకు
బేరాల్లేక ఇలా డిస్కౌంటులు పెడుతున్నారన్నమాట.. బాగానే ఉందిరా..
మనకు కలిసొచ్చింది అని నవ్వుకుంటూ కటింగ్ షాప్ లోకి వెళ్ళారిద్దరూ...
నువ్వెళ్ళరా.. నేను ఏమన్నా.. చందనా బ్రదర్ర్స్.. బొమ్మనా బ్రదర్స్ వాళ్ళ రిషెషన్
తగ్గింపు ధరలు అని ఏమన్నా ఉన్నాయేమో చూస్తాను, ఎలాగూ బట్టలు కొనుక్కోవాలి...
అని పేపర్ తిరగేసాడు.. చంటి...

ఎవడో చెప్పిన సలహాతో... రెండొందలు తక్కువ అని... RTC బస్సు లో ప్రయాణం చేసి...
ఏడింటికళ్ళా చేరాల్సిన వాడు.. పదకొండింటికి.. చేరుకున్నాడు..., సీట్లనిండా నల్లులు చేరి..
రాత్రంతా.. కుట్టినచోట కుట్టకుండా.. కుట్టి.. నిద్రలేక.. మొహం వాచిపోయింది..., ఆ అవతారంలో
ఉన్న చంటిని బస్సు దగ్గరకు రిసీవ్ చేసుకోడానికొచ్చిన వాళ్ళ అన్నయ్య... నవ్వాపుకోలేక
నవ్వుతూ స్వాగతం పలికాడు..., ఏంట్రా చంటి.. ఎలా ఉన్నావు.. అని అన్నివిషయాలు
మాట్లాడుకున్నాకా.. "ఆ సంభంధం వాళ్ళు వద్దనుకున్నారంటరా.. మొన్నటి వరకూ
సాఫ్వేర్ ఇంజనీరే కావాలని పట్టుపట్టిన ఆ అమ్మాయి.. ఇప్పుడు గవర్నమెంటు ఉద్యోగి
కావాలందంట... అందుకే రావటం లేదని ఫోన్ చేసి చెప్పారు.. నీకు చెబుదాం అంటే...
అప్పటికే నువ్వు బస్సెక్కినట్లున్నావు.. ఫోను దొరకలేదు.. అని..
అసలు షాకింగ్ న్యూస్ అప్పుడు చెప్పాడు..

చంటికి.. బుర్ర గిర గిర మని తిరిగింది...ఈ రిషెషను నా పెళ్ళిమీదకూడా దెబ్బకొట్టిందన్నమాట
అని మనసులోనే కుమిలిపోయాడు..., చంటి ఊరికి వస్తున్నాడంటేనే.. పులిడ్యాన్సులతో
బ్రహ్మరధం పట్టినట్లుగా.. ఎదురుగా.. వచ్చి పలకరించే జనాలంతా ఎవరూ కనపడకపోయేసరికి..
మనకు ఇక్కడ కూడా విలువ పోయింది ఛీ.. అని మనసులో అనుకున్నాడు...
కొంతసేపటికి... చుట్టుప్రక్కల చుట్టాలంతా ఒకరొక్కరుగా.. రావటం,ఎదో..
ఆర్దిక మందం అంట కదా... రోజూ టీవిలో చూపిస్తున్నారు.. అని ఒకరు..,
ఉద్యోగాలు తీసేస్తున్నారంట.. కదా.. అని ఒకరు...., అంతే.. పెరుగుట విరుగుట
కొరకే.. అంతెంత జీతాలిస్తున్నప్పుడు అప్పుడే అనుకున్నా నేను. ఎప్పుడో బోర్లా పడతారని..
అని ఒకరు.., ఆఖరుకి... పెళ్ళిసంభంధం కూడా కాదనుకున్నారా..
అయ్యయ్యో.. అని ముక్కున వేలేసేవారొకరు... ఇలా ఎవరికి తోచినవి వారు మాట్లాడుతుంటే..
చంటికి.. బీపీ రేజయ్యిపోసాగింది... ఒకేఒక్కరోజుండి... పెట్టుకున్న సెలవు క్యాన్సిల్
చేసేసి.. ఒక రోజు ముందే... తిరుగు ప్రయాణం కట్టాడు.

మరలా ఎధావిధిగా.. తరువాత రోజు.. అఫీసుకు..చేరుకున్నాడు.. అదేంటి త్వరగా వచ్చేసావు..
అని మేనేజరు వెకిలిగా నవ్వి వేసిన ప్రశ్నకు.. పిచ్చినవ్వు ఒకటి విసిరి సమాధానంగా ఊరుకున్నాడు...

సరే ఇక సీరియస్ గా పనన్నా చేసి ఉన్న ఉద్యోమైనా కాపాడుకుందాం అనుకుని మెయిల్స్
చెక్ చేసుకున్నాడు.. రిషెషన్ అని చైన్ మెయిల్ ఎదో చూసి.. ఏంటిది..?
అన్నట్లు ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టాడు...

ఒక కంపెనీలో సాయత్రం ఆరుఅవగానే.. పైర్ అలార్మ్..మ్రోగింది...
అందరూ పరుగులు తీసి ఒక చోట గూమిగూడారు..
సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి.. ఇలా చెప్తాడు..

"డియర్ ఎంప్లాయూస్... ఈ రోజు చాలా భాధాకర విషయం చెప్పబోతున్నాను...
మన కంపెనీ నుండి.. ఒక 80% మందిని తీసేయల్సోచ్చింది...
ఈ విషయం ఒక్కసారే చెబితే మీరంతా షాక్ అవుతారని మాకు తెలుసు..
అందుకే ఇలా ఫైర్ అలార్మ్ ఆన్ చేసి.. అందరినీ బయటకు పిలిపించడం జరిగింది..,
ఇప్పుడు అందరూ లోపలికి మీ ID card swipe చేసి వెళ్ళండి.. డోర్ ఓపెన్
అయినవాళ్ళు రేపు రావచ్చు.. ఓపెన్ కానివాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు...
మీ వస్తువులు ఏమన్నా ఉంటే.. రేపు కొరియర్లో పంపించేస్తాం..
ఆల్ ది బెస్ట్.. అని ఆ మెయిలు సారాంశం...

మెయిల చదివి... నవ్వలేని నవ్వు వచ్చింది చంటికి... ఆ తరువాత పనికి సంభంధించిన
మెయిల్ ఓపెన్ చేసాడు.. సడెన్ గా ఫైర్ అలార్మ్ మ్రోగటం మొదలుపెట్టింది... జనం అంతా
పరుగులు తీయటం మానేసి.. గుండెల్లో రాయిపడ్డట్టయ్యి... లేచి నిలబడిపోయారు...,
ఏంటి.. ఏంటి.. అని చుట్టూ చూసుకున్నారు... తరువాత కొంతసేపటికి... తెలిసిందేంటంటే..
ఎవరో పరధ్యానంగా బయటకు వెళ్ళబోతూ ఫైర్ ఎక్సిట్ ఓపెన్ చేసాడని తెలిసింది.. హమ్మయ్యా...
మెయిల్ లో జరిగినట్లుగా కాదన్న మాట, మన ఉద్యోగాలు పరవాలేదన్నమాట..
అని మనసు స్ధిరం చేసుకున్నారందరూ...

రోజూ భయం భయంగా ఇంటికిపోవటం.. భయం భయంగా ఆఫీసుకు రావటం...
దొరికిన కాఫీ బ్రేక్ లంచ్ బ్రేక్లో ఒకరి భాధలు ఒకరు చెప్పుకోవటం.. జరుగుతుంది...

ఒరే.. మా ఆవిడ దగ్గరకూడా నా పరువుపోయిందిరా... సాఫ్వేర్ ఇంజనీరునని..
పాతిక లక్షలు కట్నం తీసుకున్నాననేమో.. "ఈ రోజు. నేను త్వరగా వెళ్ళాలి లంచ్ బాక్స్ పెట్టు"
ని కాస్త చిరాగ్గా అంటే.. "ఉంటుందో ఊడుతుందో తెలియని ఉద్యోగానికి...
అంత కంగారుపడిపోతారెందుకు", అని వెటకారంగా అంటొందిరా..
అని ఒకడు చెప్పుకుని.. ఎడ్చాడు..

ఒరే.. ఆటోవాడు.. మీటరుపై ఏభై ఇవ్వమన్నాడు.. ఎందుకులే ఎధవ ఖర్చు..
అని నడిచొస్తుంటే.. వెళ్ళు బాబూ వెళ్ళు.. .లేటుగా వెళ్ళు పింక్ స్లిప్ రడీ చేస్తారు
అని అంటున్నాడ్రా.. నాకైతే డెస్క్ దగ్గరకు వచ్చి చూసుకునేవరకూ చెమటలు
పట్టాయిరా.. అని ఇంకొకడు తన భాధను చెప్పుకున్నాడు...

మరి అందరూ తమ భాధలు చెప్పుకుంటున్నారు.. మరి చంటిగాడేంట్రా అసలేం
మాట్లడటంలేదు... అని ఫ్రండ్సంతా అడిగితే... ఒరే.. రేపు నా లోన్ EMI
పే చెయ్యటానికి లాస్ట్ డేట్ రా... ఎవడిని అప్పుఅడుగుదామా అని అలోచిస్తున్నారా..
సలహా ఇవ్వండ్రా.. అనగానే.. అందరూ అక్కడనుండి.. మాయం అయిపోయారు..

12, సెప్టెంబర్ 2009, శనివారం

గుర్తుకొస్తున్నాయి...




తెల్లారింది... ఈ రోజు.. ఎలా ఉంటుందో.. ఏమిటో... అనుకుంటూ లేచి.. బ్రష్ చేసుకున్నా..,
ఏమ్నన్నా ఓపెనింగ్స్ ఉన్నాయో లేదో.. అని జాబ్స్ కాలమ్స్ అన్నీ... తిరగేసాను.. అటూ ఇటూ..
ఎటు చూసినా.... అన్నీ నాలుగేళ్ళు పైబడే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు.

ఎవడూ జాబ్ ఇవ్వకపోతే.. ఎక్కడనుండొస్తుందీ??... ఎక్స్పీరియన్స్.., అని ఆలోచిస్తూనే...
ఫ్రెండ్ ఇచ్చిన వేడివేడి టీ తో బాల్కనీలోకి వచ్చి... సూర్యూడ్ని చూసాను... అప్పుడే...
నైట్ షిప్ట్ చేసి కళ్ళు ఎర్రబడిన... బిపివో ఎంప్లాయిలా సరిగ్గా హైటెక్ సిటీ పైనుండి.. వస్తున్నాడు...,

హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆ రూము..., బాల్కనీ నుండి... రోజూ హైటెక్ సిటీ దర్శనం....
ఎప్పటికైనా అందులో జాబ్ కొట్టగలనంటావా??,అని.. ఫ్రెండ్స్ తో అన్న మాటలు...
మేం గడిపిన ఆ రోజులూ... ఎప్పటికీ మరచిపోలేనివి..

మేం ఐదుగురు స్నేహితులం, ఒకే రూములో ఉండేవాళ్ళం.. మా రూము చూస్తే బ్యాచిలర్ రూమంటే
ఎవరూ...నమ్మరు... వస్తువులన్నీ... చక్కగా సర్దుకునే వాళ్ళం,ఒకరూము నిండా పుస్తకాలతో
లైబ్రరీలా ఉండేది.. అదే రూములో ఒక ప్రక్కగా కంప్యూటర్, అదే మాకు ప్రపంచం...,
హోమ్ ధియేటర్... డివిడిప్లేయర్... వార్తావాహిని...వినోదాల డబ్బా అన్నీను..,
అప్పుడప్పుడూ సరదాగా గేమ్స్...సినిమాలు.., పాటలూ...!

పాటలంటే గుర్తొచ్చింది...!!, మా రూములో అందరికీ పాటలంటే పిచ్చి ఉండేది...,
ఎవడి టేస్ట్ వాడిదన్నట్లు ఉన్నా..!, అందరికీ కామన్ గా.., పాతపాటలే ఎక్కువ... వినే వాళ్ళం..
winamp లో ఎవరి ప్లేలిస్ట్ వాళ్ళదే..., కానీ..., నాకు నచ్చిన పాటలతో ప్రక్కవాడిని
చిత్తుచేసిన రోజులూ ఉన్నాయనుకోండి.., కష్టాలు పంచుకుని..., అలవాట్లు కలుపుకుని...,
ఒకరినొకరు అర్ధంచేసుకుని... కలిసి కబుర్లుచెప్పుకుంటూ... కలిసిమెలిసి...
ఉంటుంటే చాలా బాగుండేది..

"సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్..", ఆకలిరాజ్యంలో పాట పెద్ద సౌండులో పెట్టుకుని..
ఒకప్రక్క పాటలు వింటూ.. చేతిలో పుస్తకం పట్టుకుని... బాల్కనీలో తిరుగుతూ...
వచ్చే పోయేవాళ్ళని చూసి.. కామెంట్ చేసుకుంటూ.. నిరుద్యోగులం మేం అన్న విషయం
మరిచిపోతూ.... రోజులు గడిపినా...!! రోజు రోజుకు ఉద్యోగం లేదు!!!
అన్న విషయం మనసుకు తగిలి... పగిలి పోవటం మాత్రం మానలేదు...

ఫ్రెండ్స్.. చుట్టాలు.. తెలిసినవాళ్ళ పెళ్ళిళ్ళకు వెళ్ళాలంటేనే భయం..ఎదో ఇంటర్వూ ఉంది..
అని వంకపెట్టి... ఎగ్గొట్టక తప్పేదికాదు... పెళ్ళిలో ఆనందంకన్నా... అందరూ ఏంచేస్తున్నావ్..
ఇంకా జాబ్ రాలేదా?,"అవునూ.. మన సుబ్బారావుగారి అబ్బాయికి జాబ్ వచ్చింది తెలుసా?,
ఇంటర్మీడియెటే చేసాడు వాడు...!!!, నెలకు పదివేలు ఇస్తారంట... చాలామంచి కంపెనీ..
అంట...",అని చెప్పుకుంటూ... మధ్యలో.."మరి నీకెప్పుడొస్తుంది??, నీదేమో...
ఎమ్మెస్సీ... అంటే... స్టార్టింగే ముప్పై అయినా రావాలి మరి...",
అని చెప్పుల్తో కొట్టేవారి భాధతప్ప పెళ్ళిళ్ళలో ఆనందమె కరువాయేను...

నామీద, నా కష్టపడే తత్వం మీద ఎంత నమ్మకమున్నా...ఈ బయట జనాలు కొట్టే చెప్పుదెబ్బలు విని
నాన్నకో అమ్మకో మా వాడు.."తప్పుచేస్తున్నాడా??, బాధ్యతగా ఉద్యోగం వెతకటంలేదేమో?",
అన్న అనుమానాలు రావటమూ... సహజం..., ఎంతైనా...తెలుగు సినీ ప్రేక్షకులు కదా మరి!!.

ఇంటికి వెళ్ళిన నాలుగురోజులూ నా ఉద్యోగంమీదే.., ఏదొక చర్చ... కధాకమామిసు...,
ఎక్కడికి వెళ్లినా... నలుగురిలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నేనే ఉండేవాడిని... "ఇదెక్కడిగోలరా బాబు...
వీళ్లంతా సానుభూతి చూపిస్తున్నారా?, లేక ఎద్దేవా చేస్తున్నారా?", అనిపించేది... "ఎవడో పెళ్ళి
నా చావుకొచ్చినట్లయ్యింది..., సరేలే ఏంచేస్తాం...", అని.. సరిపెట్టుకునేవాడిని...

ఎదో సరదాగా నాలుగురోజులు ఉండిపోదామనుకుని వచ్చినవాడినే అయినా... ఎప్పుడెలిపోదామా...
అన్నట్లు..అనిపించి... ఇంటర్వూ వంకతో వెళ్లిపోయేకన్నా... ముందే ఇంటర్వూ ఉంది కుదరదు
అని చెప్పటమే బాగుండేది....

నాన్నకు తెలిసిన.. ఏ మినిష్టరో, లేక ఎమ్మెల్యేనో రికమెండషన్ తీసుకురావటం..., వెళ్ళి కలిస్తే వాళ్ళు...
"ఏంటీ... ఎమ్మెస్సీనా..., ఇప్పుడు... అంతా ఇంజనీరింగ్ కు ఎక్కువ ఉన్నాయిబాబు...,
ఎమ్మెస్సీకి.... ఉన్నప్పుడు చెప్తాన్లే...", అని కర్ర విరగనివ్వక.. పాముచావనివ్వక చెప్పే
సమాధానాలు.... చేసే అవమానాలూ..., అటు ఇంట్లో చెప్పలేక... ఫ్రండ్స్ సలహా అడగలేక....
నానా యాతనా పడేవాడిని..,జరిగింది ధైర్యంచేసి... ఒక ఫ్రెండ్ కి చెబితే... ఒక్కసారిగా పగలబడి నవ్వి...
"నువ్వూ వెళ్ళావా!!,నాది అదే పరిస్తితి..., ఇంజనీరింగా!! , ప్రస్తుతానికి లేవు బాబు
ఒకనెల ఆగి కనిపించు...", అని చక్కగా చెప్పారు... అన్నాడు..., "అయినా రికమెండేషన్స్...
ఏంటి లేకపోతే..., అర్హత లేకపోయి,అడ్డదారిలో ఉద్యోగానికి కదా, అవి కావాల్సింది...",
అని ఇద్దరూ సర్దిచెప్పుకున్నాం.., ఇదే... విషయం ఇంట్లోవాళ్ళకు డైరెక్టుగా... చెప్పలేకపోయేవాడిని.

"సరేలే... అన్నిరాళ్ళూ విసురుదాం... ఏదో ఒక చిన్న రాయైనా తగలకపోదా??", అని ఎదో మూల చిన్న ఆశ,
చిన్న ఉద్యోగమైనా దొరక్కపోదా అని... ఇక.. అవమానాలు... నెమ్మదిగా అలవాటు చేసుకున్నాను.
కానీ ఎన్నాళ్ళని ఇంట్లో డబ్బులు అడిగి బ్రతుకుతాం.. వాళ్ళకు ఇవ్వటం భాధ్యతైనా,
నాకు తీసుకోవటం తప్పే అనిపించేది..., ఇక ఏదో ఒక... చిన్న ఉద్యోగం మన ట్రాక్ కాకపోయినా
పర్లేదు అనిపించేది..., ఏం చేస్తాం పీజీ చేసాం, ఏ పనైనా అర్హతకు తగినదైతే ముందుముందు
బాగుంటుంది అని ఆశ, ఒకవేళ చిన్న ఉద్వోగం అయితే??, మళ్ళీ తగిన ఉద్యోగం కోసం తిప్పలు పడాలి..,

సాయంత్రం ఏదో ఒక సమయంలో ఇలాంటి విషయాలు నలుగురూ కలిసి మాట్లాడుకునేవాళ్ళం...
మనసులో ఉన్నవి చెప్పుకుని...కాస్త భారం దించుకునేవాళ్ళం...

పొద్దున్న తొమ్మిది అవగానే... లాస్ట్ బస్ స్టాప్ దగ్గర ఉన్న... ఆంటీ హొటల్ లో టీ. తాగి..,
రోడ్డుప్రక్క బండిహొటల్ లో టిఫిన్...చేసి.., ఎక్కాల్సిన బస్సుకోసం ఎదురుచూసి....,
ఫైలు నిండా రెజ్యూమ్స్ నలగనివ్వక... పట్టుకుని..., పేపర్లో పడ్డ కంపెనీల ఎడ్రసులన్నీ
రాసుకున్న పేపరును మాటిమాటికీ బయటకుతీసి..., చూసుకుని...,
నలుగురూ చెప్పిన నాలుగు రకాల ఎడ్రస్సులతో సతమతమయ్యి..., దిగాల్సిన చోటకాకుండా కాస్త
ముందో వెనుకో... బస్సుదిగి, చివరకు ఎలాగోలాగా అనుకున్న చోటుకు.. చేరుకున్నాకా...,
"హమ్మయ్యా...!! వచ్చాంరాబాబు...", అనుకోగానే.. అక్కడ అప్పటికే..
ఇంటర్వూలకోసం క్యూలు కట్టిన జనాలను చూసి నోరెల్లబెట్టీ..., చెమటలు తుడుచుకుంటూ...
లైన్లో నిలబడి..., ఆకలిబాధను మరచి... పిలిచిన ప్రతిపేరుకూ ఉలికిపడి...,
మన పేరు ఎప్పుడొస్తుందోనని వేచిచూస్తూ... పడిగాపులు కాస్తూ..., చెమటతో తడిచిన షర్టుతో...,
సగం బయటకొచ్చిన ఇన్ షర్టుతో..., కిక్కిరిసిన బస్సులో తొక్కేసిన బూట్లలో...
వణుకుతున్న కాళ్ళతో, తడబడిన అడుగులు వేస్తూ ఇంటర్వూ రూములోకి అడుగుపెట్టి...
అడిగిన నాలుగు ప్రశ్నలకు... టకీటకీమని జవాబులు చెప్పి..., "ఉఫ్..!!!",
అని..ఊపిరి పీల్చుకుని.., ఇంటర్వూ రూమునుండి...బయటపడి.., మళ్ళా తరువాత వెళ్ళాళ్సిన
కంపెనీ ఏమిటో...?, ఎక్కడో...?, అని రాసుకున్న ఎడ్రసు చీటిలో కళ్ళింతచేసుకుని చూసి,
పడిలేస్తూ పరుగుతీస్తూ..., బస్సులెక్కి... మేడలెక్కి..., మెట్లుదిగి..., తిరిగి తిరిగి...
అలసిపోయి... రాత్రి పదయ్యేసరికి... కర్రీపాయింట్ దగ్గరనుండి తెచ్చుకున్న..
నాలుగు రకాల కూరలనూ ఒకరికొకరు... వడ్డించుకని...., ఇంటి దగ్గరనుండి తెచ్చుకున్న
ఆవకాయకు...సాయంగా.. నెయ్యికలిపి తింటూ..., ఆ రోజు జరిగినవన్నీ నెమరువేస్తూ...
నవ్వుకుంటూ...కడుపునింపుకుని..., పిల్లగాలికి బయటకొచ్చి..., తిన్నదరిగిన తరువాత..
రూముకొచ్చి..,నడుంవాల్చి...., "హమ్మయ్య ఈ రోజు గడిచినట్లే", అనుకుని కునుకు తీసి...
మాకోసం మరో పరుగుల రోజు.. వెకిలిగా నవ్వుతూ...ఎదురుచూసినట్లు కలగనగానే....,

కలనిజమై తెల్లవారి... మళ్ళీ కధ మొదలై... ఉద్యోగప్రయత్నం తప్ప.., మరో కలేలేని... జీవితానికి..,
కళే కరువయ్యి... రొజులు పరుగులు తీస్తుంటే...., ఆపరుగుల రోజులతో.. మా పరుగులూ సాగుతున్నాయి...!

అసలు ముందు.. ఇంటర్వూ భయం పోతే చాలు.. తరువాతెలాగూ ఎదొకటి రాకమానదు అనుకునేలోపే
పది ఇంటర్వూలదాకా.. అయిపోయాయి... ఇక తరువాత నాలో ఉన్న లోపాలను గుర్తించడం మొదలుపెట్టాను...
ఇంటర్వూలో చెప్పలేనివి అన్నీ ఒక లిస్టురాసుకునేవాడిని..., వాటిమీద తరువాతరోజునుండి శోధన మొదలుపెట్టేవాడిని...
అలా నాలో కాస్త స్ధైర్యాన్ని నింపుకున్నాను...

కానీ దండయాత్రను మాత్రం ఆగనివ్వలేదు..., ఆ తరువాత జరిగిన ఇంటర్వూలలో ఎదో తేడాను గమనించాను...
సమాధానాలు వాటికవే రావటం మొదలుపెట్టాయి... నేను చేసిన పరిశ్రమ నాకు తోడుగా రావటం మొదలుపెట్టింది....,
లోనదాగిఉన్న విషయమేదో.. నన్ను నడిపిస్తుందని భావించాను...,
అదే కాన్ఫిడెన్స్ అని తెలుసుకున్నాను, ఇక త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నాను.., అని మనసును సిద్ధంచేసాను...

రెండుమూడు ఆఖరుదాకా వచ్చినట్లు వచ్చి ఆగిపోయాయి..., ఈ వారంలో కబురొస్తుంది అనుకున్నవి
ఎందుకో మరి కాలయాపన చేసాయి..., తృటిలో తప్పినవి కొన్నయితే..., ఎండీ ఊళ్ళోలేరు వచ్చాకా చెబుతాం..,
అని నెలలుగడిపినవి కొన్ని..., ఎమైందో తెలియదు అన్నవి కొన్ని..., ఇలా మళ్ళీ అన్నీ సహనాన్ని పరీక్షించాయి...,
అతికొద్దిరోజుల్లోనే... నా సహనం కోల్పోయేలా చేశాయి...

అన్ని అయిపోయాయి..., చాలారోజుల తరువాత... సమాధానం వచ్చింది...,
"సారీ...!, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ పై కాస్త శ్రధ్ధ వహించాల్సి ఉంది... తరువాత కనిపించు...",
అని..., ఇన్నిరోజులూ ఆగాను...!!, ఇంకేముంది ఐపోయిందని ఆశపడ్డాను...!,
కాస్త మనకు అనుకూలంగా ఉందని... ఇంట్లోవాళ్ళతోనూ.. ఫ్రెండ్స్ తో కూడా చెప్పాను...!,
చివరకు ఇలా అయ్యిందేంటా!!, అని చాలా ఆలోచించాను.. ఆరోజు అసలు రూముకు వెళ్ళాలనిపించలేదు...,

నా మొహం తెలుసున్న వాళ్ళకు ఎవ్వరికీ చూపించాలనిపించలేదు..,
అలా నడుస్తూ ఒక పార్కులో ఒక చోట కూర్చున్నాను..., వస్తూపోయేవాళ్ళంతా నా వైపు చూసి..
"ఏంటి అలా ఉన్నావ్..", అని ప్రశ్నించినట్లు అనిపించింది..., ఉలిక్కిపడ్డాను...!,
మొహం తుడుచుకున్నాను..

ఆలోచనలు.. గుర్రాలై పరుగులు తీసాయి..., "సరేలే ఈ ఉద్వోగం ఒక్కటే నా జీవిత లక్ష్యంకాదుకదా!!,
వేరొకటి ప్రయత్నిద్దాం", అని సర్దిచెప్పకున్నాను..., దగ్గరలో ఉన్న బస్టాపుకు బయలుదేరాను...,
కాసేపు మనసుని స్ధిరపరచుకున్నాను..., గుర్రాలకాళ్ళకు భంధాలు వేసాను..., వచ్చిన బస్సుఎక్కి...
కిటికీ దగ్గరసీట్లో కూర్చున్నాను..., బయట బస్సువేగానికనుగునంగా... వెనక్కు పరుగెడుతున్న పరిసరాలను...
చూసాను...,"ఇన్నాళ్ళూ... నా పరుగు.. ఇలానే ఉందా!!, ఇలానే వెనక్కు తీస్తున్న పరుగునే
చూసి మురిసిపోయానా??, నేనేమీ సాధించలేనా!, నేనెందుకు పనికిరానా!!",
మళ్ళీ ఆలోచనలు పరుగులు తీసాయి... ఈ సారి.. నా మనసు మాట వినలేదు...,
కళ్ళవెంట కన్నీళ్ళొచ్చాయి..., బస్సులోంచి బయటకు చూస్తూ ఏడ్చేసాను...
ఎప్పుడో చిన్నప్పుడు.. తెలియని వయసులో ఏడ్చాను..., మళ్ళీ చాలారోజులకు...,
ఎలా ఉంటుందో ఆరోజే తెలుసుకున్నాను...

కొన్ని రోజులు ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉన్నాను..., అలాంటి.. సమయల్లో స్ఫూర్తినిచ్చే..
పుస్తకాలు చదవటం ఒక మంచి అలవాటుగా మా రూమ్మేట్స్ దగ్గరనేర్చుకున్నాను...,
మా లైబ్రెరీలోని... వివేకానందుడి పుస్తకాల్లో ఒకటి చదివి కాస్త ఊపిరి పీల్చుకున్నాను...,
నచ్చినపాటలు వింటూ కాస్త మనసుని ఏమార్చాను...

కాస్త తేరుకున్నాకా నా కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంచుకోవటానికి ప్రయత్నాలు చేసాను...
ఒక చోట కోర్సు జాయిన్ అయ్యి... ఎదుటివారితో ఎలామాట్లాడాలో...,
మనసులో ఉన్న విషయాన్ని ఇతరులకు అర్ధమయ్యేలా ఎలా వ్యక్తపరచాలోలాంటి...
కొన్ని మెలకువలు నేర్చుకున్నాను..., ఉద్యోగానికి.. పనితనమేకాదు...
అన్ని విద్యలూ సమపాళ్లలో ఉండాలనే విషయజ్ఞాణం కాస్త సంపాదించాను...,
తెలిసిన వాళ్ళను అడిగి కొత్త విషయాలు తెలుసుకున్నాను.

మనం అన్నీ బాగానే చేసాం అనే అనుకుంటాం.., కాని కొన్ని లోపాలను మనం తెలుసుకోలేం...
మన మొహం ఎప్పుడూ అద్దంలో బాగానే కనిపిస్తుంది.. అందులో లోపాలు ఎదుటివాడికే కదా తెలుస్తుంది...
నా లోపాలను బేరీజు వేసుకున్నాను..., నెమ్మది నెమ్మదిగా.. వాటిని అధిగమించాను...
అనుకున్న పట్టుసాధించాను...

ఆ తరువాత అతికొద్దిరోజులలోనే... నా ట్రాక్ కాకపోయినా... నెలకు మూడువేలు
సంపాదించే ఉద్యోగమొకటి సాధించగలిగాను..., ప్రతిరోజూ ఒక విద్యార్దిలా మారాను...,
చదువుకునే రోజుల్లో పుస్తకం తీస్తేచాలు... నిద్రవచ్చేది.., అలాంటిది..
పుస్తకమే లోకంగా చదివాను..., అతి తక్కువ సమయంలోనే... నా కలనెరవేర్చుకున్నాను...,
ఆ తరువాత ఉద్వోగరిత్యా ముంబయి రావాల్సొచ్చింది..., ఇక అక్కడ నిత్య విద్యార్ధినయ్యాను...,
మనుషులగురించి... జీవితం గురించి చాలా తెలుసుకున్నాను..

ఇప్పుడు సుఖపడుతున్నవారంతా ఎదో ఒకరోజున కష్టపడ్డవారే..., అందరూ చాలా కష్టాలు పడతారు..,
ప్రక్కవాడు.. అలా ఉన్నాడే అనుకుంటాం కాని.., అతను అలా ఉండటానికి ఎన్ని తిప్పులుపడ్డాడో,
ఎన్ని మెట్లెక్కాడో..., మనం అలోచించం...

నేను పడ్డకష్టం ఎవడూ పడడు.., అని అందరికీ అనిపిస్తుంది..., అసలు లైటేలేని..
ప్రపంచం నుండి వచ్చి... చదువుకుని పెద్దవాళ్ళయిన వాళ్ళున్నారు... వాళ్ళతో పోలిస్తే..
మనదెంత?., ఇంకా అన్నీ ఉన్నా ఆవారాగా తిరిగి జీవితాలను నాశనంచేసుకున్నవాళ్ళతో పోలిస్తే...
మనం కొంచెం పర్వాలేదు... అనిపిస్తుంది..

ఎపుడూ జీవితం.. సజావుగా ఉండాలని కోరుకునేకన్నా..., కష్టాలుండాలనే కోరుకోవాలి...,
ఆ కష్టాలను భరించగలిగే... శక్తి రావాలని కోరుకోవాలి..., ఎందుకంటే.. కష్టాలను
అధిగమించినతరువాత వచ్చే ఆనందంలో ఉన్న తృప్తి వెలకట్టలేనిది...

ఎక్కడో సరిగా గుర్తలేదు కానీ... ఒక చోట ఒక కొటేషన్ చూసాను... ఒక తాబేలు..
వెనుక బ్యాగ్ తగిలించుకుని..., చెమటలు కక్కుకుంటూ... నడుస్తున్నట్లు బొమ్మ ఉంటుంది...,
క్రింద.. ఇలా వ్రాసి ఉంది...,

"లక్ష్యాన్నిచేరుకున్నామా లేదా అన్నది ముఖ్యంకాదు.., మనం ఆ లక్ష్యాన్ని అందుకోడాని అసలు
(అదే దిశలో) నడుస్తున్నామా లేదా అన్నది ముఖ్యం...".

ఇది ప్రతిఒక్కరి జీవితానికీ సరిగ్గా సరిపోతుంది...

-----------------------------------------------------------

జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నవాళ్ళను చూసినప్పుడల్లా నాకు నా రోజులు గుర్తొస్తుంటాయి...
అందుకే వ్రాయాలనిపించింది.
All the best.

20, జూన్ 2009, శనివారం

నాన్నమ్మ...



ఇంటికి.. ఎప్పుడు ఫోన్ చేసినా అడుగుతూ ఉంటా."అమ్మా.. మామ ఎలా ఉందే!!",
అని., మామ అంటె మా నాన్నమ్మ..., ఏడుగురు సంతానం మా నానమ్మకి...
నలుగురు మగవాళ్ళు.. ముగ్గురు ఆడపిల్లలూ... అంతా మాఊరిలోనే ఉంటారు...,
మాదొక అరవై కుటుంబాలుండే ఒక చిన్నఊరు... అందులో సగం మా నానమ్మ
కుటుంబం వాళ్ళే కాబట్టి... ఊరంతా మా చుట్టాలే... మా నాన్నగారు మా నానమ్మకి
ఆఖరు సంతానం... నాకు తెలిసినప్పుడు నుండి నానమ్మ మాతొనే ఉంటుంది.
నానమ్మకి మా నాన్న, అమ్మఅంటే.. చాలా ఇష్టం... నేనంటే ఇంకా ఇష్టం..

నా చిన్నప్పటినుండి నన్ను బాగా చూసుకునేది. అమ్మకొట్టినా.. తిట్టినా అడ్డొచ్చి
గారాభంచేసేది, ఇప్పుడంటే వందేళ్ళు దాటిపోయి ఒంగిపోయింది.. పనులేమి
చెయ్యటంలేదు.. కానీ...నా చిన్నప్పుడైతే బోలెడు పనులు చేసేది...
పొద్దున్నే ఆరింటికల్లా అరుగు చివర ఒక పీటవేసుకుని...మజ్జిగ చిలకడం మొదలుపెట్టేది...
నేను నా చిన్నపీట వేసుకుని కూర్చుని... చూస్తూ ఉండేవాడిని..."నెనూ చిలుకుతా",
అని చేతిలోంచి లాక్కుని ప్రయత్నించేవాడిని కానీ.. నాకు కుదిరేది కాదు...,
మజ్జిగ చిలకగా వచ్చిన వెన్నను ముద్దగా చేసి నాకు తినిపించేది..

నాకు వెన్నంటే ఇష్టమేకానీ ఎందుకో తినను.. అని మారాం చేసేవాడిని...
చేతికి అంటిన వెన్నను.. కాళ్ళకు చేతులుకూ బలవంతంగా రాసేది...,
మా నాన్నమ్మచేసే పనులన్నిటినీ దగ్గరగా పరిక్షించేవాడిని..., ప్రశ్నలువేసి
తినేసేవాడిని... ఏమడిగినా విసుక్కోకుండా... చాలా ఓపికగా వివరించి చెప్పేది..,
ఉగాది పండుగ వస్తే వేపకొమ్మలనుండి వేపపువ్వుకోయ్యటం...,
దీపావళికి దీపాలలో వేసేందుకు ఒత్తులు చెయ్యటం...,

ఆడపిల్లలందరికీ గోరింటాకు రుబ్బి.. పంచిపెట్టడం, గోంగూర కాడలకు ఒత్తులు కట్టి
వెలిగించడంలాంటి పద్దతులన్నీ ఎలా చెయ్యాలో ఎందుకు చెయ్యలో అందరికీ
వివరంగా చెప్పేది... అంతేకాదు...మా ఊరందరికీ మానాన్నమ్మ అంటే చాలా గౌరవం.
ఊళ్ళో ఎవరికి పిల్లలు పుట్టినా మామ్మ దగ్గరకు తీసుకొచ్చి చూపించి వెళ్ళేవారు...,
దీవించమని అడిగేవారు... దిష్టి తగలకుండా తలవెంట్రుకలతో చేసిన తాడు..
స్వయంగా దగ్గరుండి చేయించుకుని కట్టి, పిల్లల్ని తీసుకెళ్ళేవారు...

వేసవికాలం వస్తే..., మా చుట్టాలంతా... ఆవకాయ పెట్టే పనుల్లో మునిగిపోయేవారు...
మాకు సెలవులు కావడంతో మేం పరిక్షగా ఎవరెవరు ఏం చేస్తున్నారో చూస్తుండే వాళ్ళం...

అక్కడ మా నాన్నమ్మే, ఆవకాయలో... ఏ వస్తువు ఎంత కలపాలో.., ఎలా కలపాలో
దగ్గరుండి చేసేది..., మొత్తం చుట్టాలందరికీ ఆవకాయ పెట్టడం అయ్యేసరికి...
మాకు మా నానమ్మకి ఒక పదిహేనురోజులు కాలయాపన సరిపోయేది...

ఇప్పుడు పరిస్ధితి వేరు...,
మనవలు... మునిమనవలు.. మనవరాళ్ళు అందరి పెళ్ళిళ్ళూ..
చూసిన కళ్ళు కనిపించడం మానేసాయి..., పదిమంది పనులలో వెన్నుదన్నుగా ఉన్న
నానమ్మ... ఒంగిపోయి..నడవలేక మంచానపడింది... వయసుతో పాటు చాదస్తం,
భయం వచ్చాయి...

ఎవరన్నా ఏదైనా తినటానికి పెడితే పొట్లాలు కట్టి దాచిపెడుతుంది...
మా అక్క,అన్నయ్య వాళ్ళ పిల్లలొస్తే..., ప్రక్కన కూర్చోబెట్టుకుని...
దాచిన పొట్లాలుతీసి పెడుతుంది..., ఆ వీధివిషయాలు.. ఈ వీధి విషయాలు
అడుగుతుంది..., వాళ్ళెలా ఉన్నారు.. వీళ్ళేంచేస్తున్నారు...
అని చాదస్తంగా నాలుగైదుసార్లు అడిగేసరికి... పిల్లలు... "ఈ ముసలిదానికి
చెప్పలేక చస్తున్నాం... బుర్రతినేస్తుంది...", అని అంటే..., వాళ్ళ మద్దుమాటలకు
నవ్వేస్తుంది..., కోపమొస్తే... "వెళ్ళు అవతలికి... చెప్తే అరిగిపోతావా!",
అని మాట్లాడటం మానేస్తుంది...

అది చూస్తే నాకు అనిపించేది... మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు..
అడిగే ప్రశ్నలకు పెద్దవాళ్ళు ఓపికగా... సమాధానాలు చెబుతారు..
వయసు పైబడ్డాకా వాళ్ళు చిన్నవాళ్ళయ్యి...,అడిగే ప్రశ్నలకు...
పిల్లలేకాదు..., పెద్దలకే... విసుగుపుట్టిస్తాయి అని...,

వయసు పెరిగి వృద్ధాప్యంలోకి అడుగుపెట్టినవాళ్ళు చిన్నపిల్లలే అవుతారు...
వాళ్ళచేష్టలు.., అలవాట్లు... భయాలు అన్నీ చిన్నపిల్లలకంటే...
ఎక్కువగా అనిపిస్తాయి...

నేను చదువు పూర్తిచేసి.. ఉద్యోగప్రయత్నాల్లో ఉన్నాననుకుంట...
ఒక పదిరోజులు ఇంటికి వెళ్ళాను... కాసేపు అవి ఇవి అడిగింది నానమ్మ...
చెప్పాను ఇలా ఉంటుంది అక్కడ.. నలుగురు కలిసి ఉంటాం..
వంటచేసుకుని తింటాం... అని.., "జాగ్రత్తమ్మా... రాత్రిళ్ళు...
తలుపులు అవి గడియపెట్టుకోవాలి.. దొంగలు అవి వస్తారంట అక్కడ...
టీవీలో చెప్తుంటాడు..", అని అంది.. నేను మనసులో నవ్వుకుని..
"మేం జాగ్రత్తగానే ఉంటాం మామా.. నువ్వేం కంగారుపడకు... నలుగురం క
లిసే ఉంటాం కదా!!, పర్వాలేదు..", అని చెప్పాను...,

మరి నీకు డబ్బులు అవి నాన్న పంపిస్తున్నాడా!, సరిపోతున్నాయా?,
ఒక వందరూపాయలు సరిపోవమ్మా నెలకు??", అని అడిగింది...,
నేను నవ్వుకుని.. "వంద ఎక్కడ సరిపోతాయే... ఒక పదిహేనువందలు దాకా
అవుతాయి నెలకు", అన్నాను...

అమ్మో..., పదిహేనొందలే...!, అవునులే.. రేట్లు అన్ని పెరిగిపోయాయి
కదా..., అయినా పర్లేదు..., కావాలంటే నాన్నను అడుగు...,
నాన్న అప్పుచేసైనా ఇస్తాడు..., ఉద్యోగం కోసం తప్పదు మరి..., తిండి సరిగా తిను...,
ఆరోగ్యం పాడవుతుంది లేకపోతే...", అని సలహా చెప్పింది..., సరే అన్నాను...

అలా మాట్లాడుతూ... అలవాటు ప్రకారం... ఏడింటికే నిద్రపోయింది...,
నాకూ నిద్రపట్టేసింది..., పదకొండు అయ్యిందనుకుంట.. నన్ను ఎవరో
తట్టిలేపుతున్నట్లు అనిపించి లేచాను..., నానమ్మ నాపక్కగా వచ్చి కూర్చుంది...,
ఒరే... నన్ను చంపేస్తావా??, అని అమాయకంగా అడిగింది..
నిద్రలో ఉన్ననాకు ఆ మాటలు సరిగా అర్ధంకాలేదు... ఏంటే.. అని మళ్ళీ అడిగాను..

నన్ను చంపేయకురా..., మీ నాన్న దగ్గర ఉంటూ... భరువైపోయానురా...,
నీ డబ్బులు తింటూ ఉన్నాను..., నన్ను మీ నాన్న చూస్తున్నందుకు నన్ను చంపేస్తావా!,
అని అమాయకంగా అడిగింది..

నాకు మాటలు రాలేదు.. చాలా బాధకలిగింది... ఏంటి ఇలా ఆలోచిస్తుంది అని...,
ఆమె.. అమాయకత్వాన్ని అర్ధంచేసుకున్నాను...

ఏమీ లేదు మామా... , నువ్వంటే నాకూ ఇష్టమేనే... మా నాన్న బాధ్యతగా నిన్ను
చూస్తున్నారు.. నేనేమి నా డబ్బులతోనిన్ను పోషించడంలేదు కదా!,
అలా ఎందుకు అనుకుంటున్నావు..?, నువ్వు ఎవ్వరికీ భరువుకాదే...,
నీకేదికావాలన్నా అడిగి తిను..., ఎవరూ నిన్ను చూడకపోవటం ఉండదు...,
అలా ఏమీ అనుకోకు... పడుకో.. అని సర్దిచెప్పాను...,మళ్ళీ చిన్నపిల్లలకు సర్దిచెబితే...
చెప్పినమాట వని పడుకున్నట్లు... వెళ్ళి పడుకుంది...

తరువాత రోజు మా అమ్మకు ఈ విషయం చెప్పాను... అవిడ అంతే ఈ మధ్య
ఎదేదో మాట్లాడుతున్నారు.. నువ్వవి పట్టించుకుని ఏమీ అనుకోకు...
నన్ను అలానే అంటున్నారు..., అని ఆరోజు కాస్తవివరంగా ఇద్దరం
మా నానమ్మకి చెప్పాం... అలాంటి అలోచనలు ఏమీ పెట్టుకోకూడదు...,
ఈ వయసులో.. ఏమీ అలోచించకుండా... చక్కగా దేవుణ్ని తలచుకుంటూ...
ప్రార్ధనచేసుకుంటూ,అన్నీ మరచిపోవాలని.. సరే అంది నానమ్మ...


అత్తా కోడళ్ళంటే.. ఇలానే ఉంటారు... పైకొకటి.. లోపలొకటి... మాట్లాడుతూ,
ఎప్పడూ తిట్టుకుంటూ...ఒకరినొకరు.. ధ్వేషించుకుంటూ ఉంటారు..
అనేది నేను సినిమాల్లోనూ, కధల్లోనూ, బయటకూడా చాలా చూసాను...

మా ఇంట్లో మా అమ్మా.. నానమ్మా... అలాకాదు..., ఒక తల్లీ కూతుల్లా ఉంటారు...
మా అమ్మ ఎప్పుడు మా నానమ్మని గౌరవించేది.. ఆమె మాట వినేది...,
మా నానమ్మకూడా అంతే.. ఎప్పుడూ సాధించేది కాదు... అత్తగారిని నేను చెప్పినట్లు వినాలి
అని అన్నట్లు ప్రవర్తించేది కాదు... , మంచాన పడిన తరువాత కూడా...
మా నానమ్మ చాదస్తం చూసి.. సెలవులకో.. కాళీదొరికినపుడో...
ఊరికి వెళ్ళేవాడిని నాకే.. కాస్త విసుగు పుట్టేది... పోనీలే ఆవిడను ఏమీ అనకు
అని.. మా అమ్మ నాకు చెప్పేది...

మా చిన్నప్పుడు ఎవరినైనా.. నువ్వు అని పిలిస్తే... తప్పు అలా పిలవకూడదు
పెద్దవాళ్ళను.. మీరు అనాలి, అని మా అమ్మచెప్పేది... అలానే నేర్పించింది...,
తరువాత... అందరినీ మీరు అని పిలవటమే నాకు అలవాటయ్యింది...,
మా నాన్నమ్మను అమ్మ గౌరవంగా చూడబట్టే నాకూ పెద్దలను గౌరవించాలి అనే విషయం
బోధపడి ఉంటుంది..., ఇవన్నీ మనకు మనం చేసుకుంటేనే...
మనకూ అలానే జరుగుతుంది!, నేనైనా రేపు అంతే... నా తల్లిదండ్రులను బాగా
చూసుకుంటేనే... నా పిల్లలు కూడా నన్ను చూసేది...?

నాకు ఉద్యోగం లేక... డబ్బులులేని టైములో... నా చేతికి వందో
రెండొందలో ఇచ్చి నానమ్మకు ఇవ్వమనేది... మా అమ్మ, అది చూసి నానమ్మ పొంగిపోయేది...
మా మనవడు నాకు డబ్బులిచ్చాడు అని అదరికీ చెప్పుకునేది...,

అలానే నాకు తెలియకుండా కూడా మా అమ్మ బట్టలు కొని నేను కొన్నట్లుగా
ఇచ్చేది నానమ్మకి... అపుడు అర్ధంఅయ్యేది... వాళ్ళకున్నఅన్యోన్యత...,
మా నాన్నకూడా అంతే... మాకు ఎంత చేసినా... ఆరోగ్యాలు ఎలాగూ నీలా అవ్వవులే...
నీ అరోగ్యం, నీ ఆయుష్షు మంచివి..., అని మా నానమ్మకు ఆరోగ్య విషయంలో
చాలా జాగ్రత్తగా చూసుకున్నారు...

కనిపించడం మానేసిన కళ్ళు.. సూన్యంలో కలిసిపోయాయి...
అందరి బాగోగులు తెలుసుకుంటూ...,అందరి బాగు కోరుకుంటూనే...,
ఎవరికీ భారం కాకుండా... ఎవరిచేత మాట పడకుండా...,
కల్ముషమెరుగని మనసుతో.. ఎలాగైతే... పుట్టిందో.. ఆఖరి క్షణాలలో...
మరలా.. చిన్నపిల్లగా మారి... అలానే ఆనందంగా... నానమ్మ వెళ్ళిపోయింది...

మాలో చిరకాలం ఉండిపోయేలా..., మంచి బుద్దులనూ,సంస్కారాలను... నేర్పి..
మాలో.. అవి తీయని జ్ఞాపకాలుగా విడిచిపెట్టింది...

ఎటువంటివారికైనా తప్పనిది... వృద్దాప్యం... మిగతా జీవితంమంతా ఎంత దర్జాగా...,
ఎంత హొదాతో...అడుగులకు మడుగులెత్తించుకుని.. ఎలా బ్రతికామన్నదానికన్నా..
చివరిక్షణాలలో ఏ బాధలూ తెలియకుండా నా అన్నవాళ్ళ నలుగురి చేతులమీదుగా...
ఆనందంగా వెళ్ళిపోతే.. దానికన్నా జీవితానికి ఇంకేంకావాలి?

నానమ్మలు.. అమ్మమ్మలు.. తాతయ్యలూ... వీళ్ళంతా ఒకప్పుడు మనలాంటివాళ్ళే...
పాతతరపు పద్దతులూ..., మంచిచెడులను.. మన రాబోయే తరాలకు పరిచయంచేస్తూ...,
మన వెన్నంటే ఉంటూ.. మనమేలుకోరే... గురువులు...

వాళ్ళు మనకెప్పుడు భారం కారు..., కాకూడదు...!!

20, జనవరి 2009, మంగళవారం

ఏది "సత్యం"??



భారత ఐటి రంగానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టిన సత్యం కంప్యూటర్స్
ప్రపంచానికి ఇచ్చిన షాక్.. నుండి ఇంకా తేరుకోలేకపోతున్నాం.

ఒకపక్క ఆర్ధికమాంద్యం వల్ల, అమెరికా ప్రాజెక్టులు.. క్లైంట్లు చేతులెత్తేయంటంతో...
పడిన దెబ్బకి కాస్త లేచి నిలబడగలిగే సమయంలో, ఈ సత్యం వార్త మరో దెబ్బలా తగిలి...
వీకెండ్ వస్తేనే గజగజ వణికిపోయే సాఫ్వ్టేర్ ఇంజనీరు.. ఇప్పుడు.. ఈ ఐటిపై పడ్డ దెబ్బమీద
దెబ్బకి..., ప్రతినోటా... వస్తున్న గాలి వార్తలకు వీక్ డేస్ లో కూడా వీకైపోవాల్సిన
పరిస్తితి వచ్చింది...

మన ఊరిలో కంప్యూటర్స్ అన్నా, సాఫ్ట్వేర్ అన్నా అందరికీ సులువుగా తెలిసే ఒకే ఒక్క కంపెనీగా
సత్యం కంపూటర్స్ కి ప్రత్యేక స్క్షానం ఉంది. సత్యంలో పనిచేస్తున్నా, అంటే ప్రజలు బ్రహ్మరధం
పట్టేవారు, వారికే పెద్దపీటవేసి... నలుగురిలో చెప్పుకునేవారు...,
పెళ్ళిసంభందాల విషయంలో కూడా.. అదొక ఆస్తిలానే లెక్కవేసేవారంటే...
మీరు నమ్మలేకపోవచ్చు...

నేను ఫలానా కంపెనీలో చేస్తున్నా అంటే... అది సత్యంకంటే పెద్దదేనా?
అని జనాలు అడిగేవారంటే.. దానిబట్టే చెప్పొచ్చు...
అది జనాల మనసుల్లో ఎంతలా నాటుకుపోయిందో...

మన ఆంధ్రావారిచేత స్థాపింపబడి అనతికాలంలోనే ఎదిగిన ఎకైక కంపెనీ కావటం వల్లనే ఇంత పేరు
రావటానికి కారణంకావొచ్చు...

మనం చేసే పని మనకు నచ్చినా నచ్చకపోయినా... ప్రస్తుతానికి ఉన్న ఉద్యోగం, హోదాతో
సరిపెట్టుకుని రోజులు నెట్టుకొస్తున్నా.... ప్రతి ఒక్కరికీ ఒక డ్రీమ్ కంపెనీ,
డ్రీమ్ జాబ్ అంటూ ఉంటుంది... ఎప్పటికైనా ఆ కంపెనీ ట్యాగ్ మెడలోవేసుకోవాలి అనే
సంకల్పమూ ఉండొచ్చు..., అలానే చాలామంది మనసుల్లో డ్రీమ్ గా సత్యం కూడా ఉంది...,
నాకున్న ఉద్యోగ అనుభవంలో నేను స్వయంగా చూసి మెచ్చి నచ్చిన ప్రోసెస్ లు సత్యం కంపూటర్స్ లో
చూసాను... అప్పట్నుండీ నాకూ అది డ్రీమ్ కంపెనీగా మారింది...

కార్పొరేట్ కల్చర్ మనకు మనస్ఫూర్తిగా నచ్చకపోయినా!!,
మనకు అది తప్ప వేరే ఏదీ బ్రతుకుతెరువులేకపోతే అదే... గొప్ప కల్చర్ గా చెప్పుకుంటాం...,
ఇష్షంలేకున్నా కష్షమైనా అలవాటు చేసుకోవాళ్ళిందే కదా మరి!!!

మనం కంపెనీ మారటానికో... లేక జాబ్ సంపాదించటానికో పెట్టే రెజ్యూమ్ లో ఎంత
నిజాలుంటాయో మనకే తెలుసు... రెజ్యూమ్లో వ్రాసినవి నూరుశాతం కరెక్టేనా?
అని ప్రశ్నించుకుంటే ఎంతశాతం నిజాలుంటాయి?,
నిజంగా నిజాలు చేప్తే మనకు ఉద్యోగం వచ్చిఉండేదా?, నిజాలు చెప్పి ఎంతమంది మనలో
ఉద్యోగాలు సంపాదించి ఉండొచ్చు..??, లాంటి ప్రశ్నలువేసుకుంటే ఉద్యోగమే చెయ్యలేం...

క్లైంటుకు కంపెనీలు, ప్రాజెక్టులకోసం చూపించే లెక్కల్లో ఎంత నిజం ఉంటుంది?,
అలాగే మనం చేసిన పనిలోనూ.. చూపించేదాంట్లోనూ ఎంత నిజం ఉంటుంది...?
నిజంగా చెప్పాలంటే... కార్పొరేట్ అంటేనే మోసాలకు జన్మస్ధానం అని చెప్పొచ్చు.

అలాంటి కార్పొరేట్ కు వెన్నతో పెట్టిన విద్యే... లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూపించటం.

అదే పని రామలింగరాజు చేసినట్లు తోచినా..., ఇప్పుడు అదే పెద్ద స్కామ్ అని చిత్రిస్తున్నాయి
ఇప్పుడొస్తున్న కధనాలు..

మోసం చేసి డబ్బులు మళ్ళించటానికి... ఒక కంపెనీని.. 20 ఏళ్ళపాటు... పెంచి పోషించి,
వేలమందికి ఉద్యోగాలిచ్చి..., తెలుగువాడు గర్వపడే స్ధానంలో కంపెనీని నిలపాలా??

డబ్బాసే ఉంటే?, భైర్రాజు ఫౌండేషన్ ద్వారా.. వేలమందికి... పళ్ళెటూర్లలో ఐటి సర్వీసెస్ లో
పనిచేసే భాగ్యం కలిగించి...

మంచినీరే ఎరుగని ఊరికి..., ఏన్నో ఏళ్ళుగా సమస్యను చూస్తూ... ఎన్నో ప్రభుత్వాలు
మారినా... ఎవరూ చెయ్యలేని పనిని చేసి చూపించాల్సిన అవసరం ఉందా...?,
అలాగే ఆరోగ్యం, పారిశుధ్యంకు కోట్లు ఖర్చుపెట్టి... పనుల చేయించాలా?

ప్రాణాలవిలువ తెలుసుకుని..., అత్యవసర పరిస్ధితులకు తగినవిధంగా స్ఫందించే సాంకేతిక
పరిజ్ఞానంతో...,108 సేవలతో ఎన్నో ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉందంటారా??

చేసిన... చేస్తున్న పనులలో ఏదీ లాభాపేక్షతో చేసినవిగా నాకు అనిపించలేదు...
రాజకీయ అవసరాలు అసలే కనిపించలేదు... ఏనాడు మీడియాముందుకొచ్చి...
మేం ఇది చేస్తున్నాం అని చెప్పుకోలేదు...

ప్రతీ కార్పొరేట్ కి ఒక సేవా సంస్ధ రిజిష్టరై ఉంటుంది... అది కంపెనీకి వచ్చిన లాభాల్లో
ఇంత శాతం మేం సేవచేస్తున్నాం, అని చూపించుకోవటంకోసమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు...,
కానీ సత్యంకు భైర్రాజు ఫౌండేషన్ అలాంటిది కాదని... రాజు తన ఆశక్తితో నడుపుతున్నదని
తెలిసిన తరువాత వీళ్ళు చేస్తున్నది ఒక మహా కార్యం అని సదభిప్రాయం కలిగింది.

కనీసం ఎంతో కొంతశాతం చేసాం అని లెక్కలు చూపించుకోటానికైనా చేసిన కార్పొరేట్లైనా ఉన్నాయా?,
అంటే నాకు తెలిసి లేవనే చెప్పాలి!!

ఈ సేవలన్నీ చేస్తూ కూడా.. రాజు మోసం చేసారు అంటే నేను జీర్ణించుకోలేని విషయం.
ఇప్పుడు రాజు చేసినది పెద్ద ఫ్రాడ్ అని చెప్పుకునే వార్తల్లో ఎంత నిజముందో
ఆ దేవుడికే తెలియాలి మరి...

కానీ ఒక్కటి మాత్రం నిజం.. వ్యాపారంలో నష్టం-లాభం ఎవరూ తప్పించుకోలేనివి...,
అలానే మన కష్టమర్స్ అందరికీ న్యాయం చెయ్యాలి అంటే అదీ కాని పనే!!

నష్టాలొస్తే ఎవరొకరికి గట్టి దెబ్బ తగలక మానదు... కొన్ని విషయాలు ప్రాణంమీదకొస్తే కాని
తెలియవు మనం చేసింది తప్పే అని... ఆ సమయానికి అది.. ఒక వ్యూహం కావచ్చు...
పండితే దానికి ప్రశంసల వర్షం కురుస్తుంది..., పండకపోయి బెడిసికొట్టి అది బడామోసం
అయ్యే అవకాశమూ ఉంది...!!

ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియని రోజులివి. అందరిదీ స్వార్ధమే..., ఆ రాజకీయ పార్టీ
ఈ రాజకీయ పార్టీ ఒకరినొకరు తక్కువచేసుకుని మాట్లాడటమే కాని, అసలు నిజమేదో తెలిసుకునే
ప్రయత్నం చేస్తున్నట్లయితే కనిపించడంలేదు.
ఏమో ఈ ఆటలో అందరూ దొంగలేనేమో...అదీ చెప్పలేం.

మీడియా గురించి చెప్పనే అక్కర్లేదు.. ఏది జరిగినా ఆకాశం.. భూమి.. ఒక్కటై ప్రళయం వచ్చినా!!
పడిపోని బిజినెస్ ఏంటి అంటే... మీడియా అనిపిస్తుంది.. ఏది జరిగినా వాళ్ళకు బిజినెస్సే...

కులానికో ఛానల్.. పార్టీకో పత్రిక.. ఆహా.. ఏబాగుందీ బిజినెస్...!!!,
ఏది చూపించాలో ఏది చూపించకూడదో తెలియని.. మీడియాకు ఒక నియంత్రణ బోర్డ్లంటూ
ఉండవా??, ఉంటే అవి నిద్రపోతుంటాయా??.

ముంబై తాజ్ హోటల్లో జరిగే ఆపరేషన్లు టీవిలో చూస్తూ ఉగ్రవాదులు ఏం జరుగుతుందో
ఎలా తప్పించుకోవాలో ప్లాన్లుగీసుకున్నారంట..., అది చాలు ఉదాహరణగా చెప్పుకోవటానికి
మన మీడియా ఎంత అప్టుడేట్ గా ఉందో...

స్వతంత్ర్యం కావాలి కావాలి అని తెల్లవాళ్ళను... తరిమి తరిమి కొట్టి తెచ్చుకున్న మనం...
మళ్ళీ మా పైసాలకన్నా మీ యుకే పౌండ్లే భరువని నమ్మి బానిసల్లా వాళ్ళవెంట మనం
వెళ్ళేలా చేసిందీ ఈ కార్పోరేటే కదా!!!, అలా అని ఇంత చదువూ చదివి... బ్రతుకు బండి
నెట్టుకోలేని ఉద్యోగాలు చేస్తూ నేను గాంధేయవాదిని.. నా దేశపు నూలు వస్త్రాలే వేసుకుంటా,
నా దేశకోసం సేవలందించే ఉద్యోగమే చేస్తా అంటూ బ్రతకగలమా??

మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజు శనివారం వస్తే..., మళ్ళీ ఆ రోజు ఆఫీసుకు సెలవని...
ఎవరూ రారని... ఆగష్టు 14నే జరిపిన పుణ్యం కార్పొరేట్ కల్చర్ కే దక్కింది...
అది చూసి నేను పాకిస్తాన్ లో ఉన్నానా? లేక భారదేశంలో ఉన్నానా అనిపించింది.
ఇదేనేమో గ్లోబలైజేషన్ అంటే..??, అని సరిపెట్టుకున్నా చివరికి...

తప్పదు... ఈ కార్పొరేట్ ప్రపంచంలో బ్రతికినంతకాలం మనఃస్సాక్షి చంపుకోవాల్సిందే,
వీటినుండి తప్పించుకోలేం.

పోటీ పోటీ అంటూ.. ప్రపంచంతోపాటు పరిగెడుతూ ఉన్నమనం...
నిలబడి నీళ్ళు ఎలాగూ తాగలేం అని నిర్ణయించుకుని...
పరుగెడుతూ పాలే త్రాగుతున్నాం...
పడిలేస్తూ ఇలా మనల్ని మోసంచేసుకుంటున్నాం.

ఈ సత్యం కధలో మోసం ఉండి తప్పించినా తప్పించొచ్చు...
మోసమేలేదు... అంతా కల్పితకధ అని చెప్పినా చెప్పొచ్చు...

ఈ కధ కంచికి ఎలా చేరినా... మనం ప్రేక్షకులలాగా చూడగలం తప్ప ఏమీ చేయలేం...!!

ఇప్పటివరకూ ఎన్ని జరగలేదు... మోసాలు? జరిగినవాటికి అన్నిటిననీ నిరూపించి..
బాధ్యులకు... శిక్షపడేలా చేసి... న్యాయమే జరిగిందంటారా??

ఈ విషయంలో నాకు తెలిసింది వ్రాసి వాక్ (బ్లాగ్) స్వాతంత్య్రాన్ని చాటి చెప్పటం తప్ప
నేను చేయగలిగేది ఏదీ తోచలేదు...

పై విషయాలలో నాకున్న జ్ఞాణంతో చెప్పిన, నా ఆభిప్రాయాలు మాత్రమే అని మనవి.

Related Posts Plugin for WordPress, Blogger...