రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్...
హైదరబాద్... మహా నగరం..
ఐదో ఆరో FM రేడియో స్టేషన్లు...
అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బహుళజాతి కంపెనీలు...
స్వదేశంలో విదేశీయతకు ఏమాత్రం తీసిపోని షాపింగ్ మాల్స్, డిస్క్ లు.., పబ్‌లు..., బార్లూ...
నిజాం పాలనను గుర్తుచేస్తూ... తీపి గురుతులుగా మిగిలిపోయిన చారిత్రక కట్టడాలు...
ఏ దేశంనుండొచ్చినా సొంతింటి రుచులను ఆస్వాదించగలిగే హోటళ్ళూ... రెస్టరెంట్లూ...
ఎన్నో వింతలూ విశేషాలే కాకుండా... చూస్తుండగానే ఎదిగిపోయిన ఈ నగరంలో...
చూడటానికే అసహ్యమైన విషయాలున్నాయి...
పైకి భూతల స్వర్గంలా కనిపిస్తున్నా... ఇది భూతాల స్వర్గమే..
అదేంటి అలా అనేసాను అనుకుంటున్నారా!!
ఇవి చూడండి మరి... వీటినేమంటారో???
ఉదయం ఏడున్నరకి అలారం మ్రోగగానే మళ్ళీ ఆఫీసా అనుకొనేవాడిని... ఒకప్పుడు.
స్కూల్ కి వెళ్ళే వయసులో అయితే... అమ్మో.. ఈ రోజు లెక్కలమాష్టారు క్లాసు బాబోయ్...
కానీ ఇప్పుడు... లేవగానే ఆఫీసు.. మా మేనేజరు కన్నా ముందుగా గుర్తొచ్చేది...
MCH వారి చెత్త బండి,
ఏ టౌముకి ఆఫీసుకు బయలుదేరినా తప్పని.. చేజింగ్ లా తగులుకుంటుంది నాకు..
హమ్మయ్య సగం దూరం వచ్చేసాం.. ఇక ఈ రోజు అదృష్టం కొద్దీ చెత్తబండి రాలేదు...
అనుకునేంతలోనే... దూరదర్శన్ నాటికలో రామేశం పాత్రలాగా... తెరచాటునుండి..
ఎప్పుడు వద్దామా అన్నట్లు.. చటుక్కున ఊడిపడుతుంది... ప్రక్క సందులోంచి...
హారన్ కొట్టినా వినపడదు... అసలు వాడిలోకమే వాడిది... ఎవరికీ లొంగని మోనార్క్ లా
దూసుకుపోతుంటాడు..
నేను వెనుక హెల్మెట్ తో భంధింపబడి... ముక్కుమూసుకునే వీలులేక పడే అవస్త... ఒకటైతే...
వెనుకున్నవాడు.. కొట్టే హారన్ ఇంకొక అవస్త..., ఈ భాధలు పడలేక పాటలువిందామని
FM ఆన్ చేసి ఇయర్ ఫోన్స్‌లో హాయిగా పాటలు వింటూ కొంత దూరం వెళ్ళగలిగినా...,
"కజ్ రారే.. కజ్ రారే..", పాట కూడా కంపుకొట్టి.. "కచ్ రా రే.. కచ్ రా రే.. తెరె బద్బూ బద్బూ గాడీ...,
... కచ్ రా ", గా మారిపోయింది....
ఇక ట్రాఫిక్ విషయానికొస్తే... చదువుకున్నోడు అంతే.. చదువురానివాడూ అంతే...,
సిగ్నల్ పడినా ఆగకుండా దూసుకుపోతూ..., ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్ నే తిడుతుంటే...
ఏమనాలండీ వాళ్ళని...,
అక్కడే గట్టిగా హారన్ కొట్టేవాడొకడు... సిగ్నల్ దగ్గర ఆగి హారన్ కొట్టడం ఏం మాయరోగమో మరి...,
ఆ ప్రక్కనే... సిగ్నల్ వదిలినా వెళ్ళకుండా... దారిలో ఆపేసి సెల్ ఫోన్ మాట్లాడే వాడొకడు...
ఇవన్నీ చూడలేక చూసి ఉండలేక... అక్కడికక్కడే... అపరిచితుడు సినిమాలో రామం క్యారెక్టర్
వేసేద్దాం అనిపిస్తుంది.. కానీ.. టైము చూస్తే... అప్పటికే గంటన్నర లేటు ఆఫీసుకు...,
ప్రతీరోజు లేటుగా వెళితే మా మేనేజరు రెమో క్యారెక్టరు వేస్తాడని భయమేస్తుంటుంది.
ఈ సిగ్నల్స్ దగ్గర బైకు భాధలన్నీ పడలేక... సరదాగా వీకెండ్స్ లో బయటకు వెళ్ళేటప్పుడు..
ఆటోలో పోదామని అనుకున్నామా అంతే సంగతులు...
వాడు కుదిపే కుదుపులకు... ప్రెగ్నంట్ కానివారికి ప్రెగ్నెన్సీ... ప్రెగ్నంట్ అయినవారికి ఫ్రీ డెలివరీ ఖాయం.
ఆటోకి డిజిటల్ మీటరుంటుంది... కానీ తిరగదు.. తిరిగినా మీటరుపై రాడు వాడు..
"అరె ఫో.. మీటరుపై రాకుంటే... ఇంకెందుకు బాబూ మీటర్.. ", అని నాలుగు తిట్లు తిట్టి..
తప్పక.. అటో ఎక్కి వెళ్ళాల్సొస్తుంది..
"సాదా మీటర్.. గవర్నమెంట్ భంధ్ చేషిండు సార్..", అని.. గుట్కా వాసనకొడుతూ
తన స్టోరీ చెప్పుకుపోతుంటాడు.. ఆటోవాడు..,
మరి ఎందుకయ్యా డిజిటల్ మీటర్... ఉపయోంచకుండా దండగ అంటే..
"ఏం చేస్తం సార్.. ఫోలీషోడు చూషినాడంటే... వంద నొక్తడు... అందుకే.. పదేనొందల మీటర్‌ని..
బ్లాక్లొ నాలుగువేలు పెట్టి కొన్నం",
గవర్నమెంట్... లిమిట్ గా మీటర్లిచ్చిండు సార్... పూరా బ్లాక్ నడిషింది..,
మీటర్ పై పోతే మాకేమొస్తది...", అని ఆటోవాడు తనభాధలు చెప్పుకుంటాడు...
ఆటో దిగ్గానే వందనోటు చదివించుకొని...
ఒర్నాయనో YS కష్టాలు YS వి, KCR కష్టాలు KCR వి అన్నమాట..
పాపం ఈ ఆటోవాడికీ ఇన్ని కష్టాలా... అనుకుంటూ... పొల్యూషన్ పొగవల్ల...
మొహంపై రెండంగుళాల మందాన పట్టిన జిడ్డును వదిలించుకోటానికి
ఎన్ని కష్టాలు పడ్డానో నేనెవరకు చెప్పుకోవాలి....
ఇలా బయట అడుగుపెట్టాలంటే... వందనోటున్న నవాబులే ఈ నగరంలో
బ్రతకగలరు.. అనుకుంటే... ఇక సామాన్యుడి పరిస్ధితేంటో...
ఈ గోలంతా పడలేక వీకెండ్ వస్తే ఇంట్లోనుండి కదలాలంటే భయంపుడుతుంది...
వేలెంటైన్స్ డే..., న్యూ ఇయర్ డే... లాంటి.. ఏదైనా స్పెషల్ డే వచ్చిందీ అంటే...
ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయన్న విషయమే గుర్తుండదు జనాలకి..
ఎవడిస్టమొచ్చినట్లు వారు కంగారుగా దూరిపోయి, దూసుకుపోయి.. వెళ్ళిపోవటమే...,
బిర్యాణీ పాయింట్స్ దగ్గర మూగిపోయి కంగారు పడిపోవటం.. ఎక్కడో టీవీచానల్స్ లో పెట్రో ధరలు పెంపు
అని వినగానే... పెట్రోలు పంప్స్ దగ్గర ఎవడి కంగారు వాడిది...
చికెన్ షాపుల దగ్గర కంగారు..., ఆకరికి బార్బర్ షాప్ దగ్గర కూడా త్వరగా వెళ్ళిపోవాలని
ప్రక్కవాడిని తోసుకుని మరీ కంగారు...
ఉల్లి ధర పెరిగే అవకాశం అన్న గాలి వార్తైనా సరే... మూగి మూగి.. పడి చచ్చిపోతుంటారు...,
ఒక క్యూ కడదామనో... పద్దతి పాటిద్దామనో అలోచన ఉండనే ఉండదు.. ఎవడి స్వార్ధం వాడిది...
ఇదే విషయం కొలీగ్స్ మాట్లాడుకునేటప్పుడు వస్తొంటుంది.... మీ కోస్తా, రాయలసీమోల్లే వచ్చి
చెడగొట్టారని... కొందరు.. లేదు మీ తెలంగాణా వాళ్ళే అని.. మరికొందరు... సెటైర్లేసుకుంటుంటారు...,
నువ్వు ఎధవ.. నువ్వు ఎధవ అని ఇద్దరూ ఎధవలైనట్లనిపిస్తుంతొంది...
పబ్లిక్‌లో పబ్లిక్ టాయిలెట్స్ లేక పాపం రోడ్ల ప్రక్కనే కానిచ్చేస్తుంటారు కొందరు...
కొన్ని చోట్ల పబ్లిక్ టాయిలెట్స్.. ఉన్నా పాపం చిన్నప్పటినుండి లేని అలవాటులేని కొత్తగా తెచ్చుకుంటే
దేశమెక్కడ బాగుపడిపోతుందో అని.. ఆ టాయిలెట్ గేటు దగ్గర... చుట్టుప్రక్కలా కానిచ్చే వారు... కొందరు...
"క్లీన్ చేషే కొద్దీ పోస్తనే ఉంటరు... పబ్లిక్, లైట్ తీస్కో", అని.. అనుకుంటుంటారో ఎంటో మరి..
అసలు పట్టించుకోరు... MCH వాళ్ళు..., ఆహా... ఏం అనుభంధం వీరిది... సమైఖ్య కుటుంబం...,
అంతేలేండి.. మనుషుల్లోనే సంస్కారాలు లేనప్పుడు... మనుషులు సృష్టించుకున్న కట్టుబాట్లలో సంస్కారమెక్కడొస్తుందీ???,
సాయంత్రం ఆరుదాటకుండానే గ్లాసుమెడలో కట్టుకుని తిరిగే మందుబాబులకి ఉండే స్వేచ్ఛ
ఇక్కడ తప్ప ఇంకెక్కడా ఉండదేమో..!!
ఏ విషయానికీ క్యూ కట్టని జనం... పబ్లిక్‌లో పబ్లిక్ గా ఒకే ఒక్క చోట క్యూలో నిలబడతారు...
అదే... వైన్ షాపుల ముందు.
అక్కడే నిలబడి... త్రాగి.., తన్నుకుంటూ ఎంజాయ్ చేసుకుంటుంటే... వచ్చేపోయే జనాలకి..
ఎంటర్టైన్మెంటులా టైమ్ పాసయిపోతుంటుంది... ఈ పబ్లిక్ ఎంటర్టైన్మెంటు కల్పించిన సర్కార్ కి జోహార్లు...
హైద్రాబాద్ వచ్చిన ప్రతి వ్యక్తి ట్యాంక్ బండ్, చార్మినార్ ని చూడలేకపోవచ్చేమో కానీ...
ఈ వింతలూ విడ్డూరాలూ... ఎక్కడైనా ఎంట్రీ ఫీజులేకుండా ఫ్రీగా చూసే అవకాశం ఉంది...
రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్...
13 కామెంట్లు:
చేదు నిజాలు...
"మన" నుంచే మార్పు మొదలవుతుందని జనాలు అర్థం చేసుకోవాలి.
శ్రీనివాస రాజు గారు,
ప్రవీణ్ గారు చెప్పింది బానే ఉంది కదూ!చెత్త బండి మనిషి మిమ్మల్ని చేజ్ చెయ్యడం ట్రాజెడీయే గానీ, మరి ఆ చెత్తంతా మనమే స్రుష్టించాంగా మరి! దాన్ని అతడు తొలగించి పట్టుకుపోతుంటే, ఆ కంపు మనకి సరిపడదు! నేను మిమ్మల్ని అనడం లేదు. మీలాంటి దాన్నే నేను కూడా! చెత్త బండి పక్కనే నిలబడితే, అసహ్యించుకోకుండా ఎలా ఉంటాం? కానీ అప్పుడప్పుడన్నా భుజాలు తడుముకోవాలనిపిస్తుంది. అతడు మనం విసిరేసిన, నానా రకాల పరిమళాలు వెదజల్లే విసర్జితాలన్నిటినీ విజిల్ ఊదుకుంటూ మరీ (ఆ విజిల్ వినగానే ఎంత రిలీఫ్ గా ఉంటుందో తెలుసా! అమ్మయ్య..కంపు వదిలిపోతుంది అని) వచ్చి పట్టుకెళితే, నెలకు ఇల్లు లేదా ఫ్లాటు ఒక్కింటికి 5 లేదా కొండాపూర్ లాంటి హైటెక్ ఏరియాల్లో అయితే 10 రూపాయలు...వాడికి దక్కేది.( చూసారా...చెత్త బండి అనేసరికి నేను కూడ వాడు అనేస్తున్నాను)
ఒకటి రెండు నిమిషాలకే మీకు రామం కారెక్టర్ వెయ్యాలనిపిస్తే పాపం, వాడు రోజంతా బండితోనే ఉండటం ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించండి.
ఇకపోతే, రెడ్ సిగ్నల్ పడి ముందున్న వాహనాలు ఇప్పుడప్పుడే కదిలే అవకాశం లేదని తెలిసినా...చెవులు చిల్లులు పడేలా హారన్లు కొట్టేవాళ్ళ గురించి నాదీ మీ అభిప్రాయమే!
ఇక పబ్లిక్ టాయ్లెట్ల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
మిగతావన్నీ, .......మాస్ మీడియా! మానవ స్వభావం....వ్యక్తి స్వేచ్చ...ఇలాంటి పేర్లు పెట్టుకుని..ప్రస్తుతానికి సరిపెట్టుకుందాం!
@ సుజాత గారు..
మీరు తప్పుగా అర్ధంచేసుకున్నారు...
చెత్త తీసుకుపోవటాన్ని.. ఆ దుర్వాసన నాకు సరిపడటంలేదు అని ఉద్ధేశ్యం కాదండీ ఇక్కడ...
సిటీల్లో దానికంటూ ఒక టైముంటుంది...
ఒక చోటకి చేర్చిన చెత్తను.., రాత్రి సమయాల్లోఊరి బయటకు తరలిస్తారు.. కానీ మన హైద్రాబాద్‌లో నేను గమనించింది అది కాదు.. అందుకే అలా వ్రాయడం జరిగింది..
అది నేను ఇక్కడ సరిగ్గా చెప్పలేదులేండి...
ఆహా ఓ "నగరపోడి డైరీ " లాగా రోజూ వారి కష్టాలు ఒక్క టపా తో చెప్పేశారు.
మీ టపాలో ఒక పేరా లోని వాక్యాలు విడిపోయి కనిపిస్తున్నాయి కాస్త అలైన్ చెయ్యండి.
-- విహారి
నాకు కూడా హైదరాబాద్ మీద సిమిలర్ అభిప్రాయలున్నై. ఎటిఎం దగ్గర వేరే ఎవరైనా డ్రా చేస్తున్నప్పుడు క్యూ లో మనం బయట నిలబడి వెయిట్ చేస్తుంటే.. 'కదులు మేడం ! లోపలకు పో !!' అని కసుర్తారు జనం. అంటే.. అక్కడ కూడా తొందరే. హైదరాబాద్ పాపం 'ఎవరిదీ కని నగరం'. నాకు మాత్రం నిజంగా హైదరాబాద్ ని ప్రేమించే వాళ్లు కనిపించరు. అంతా ఎవరి గోల లో వాళ్లు వున్నట్టే అనిపిస్తుంది.
చాలా బ్లాగుంది మీ బ్లాగు.
బొల్లోజు బాబా
రోజూ నేను ఇంటి దగ్గర బయల్దేరి ఆఫీస్ కి వచ్చే లోపు అనుకునేవన్ని మీ బ్లాగ్ లో చూసాక నేనె కాదు నా లాగానె ఆలొచించెవాళ్ళు ఉన్నారని అర్ఢమైంది .
హైదరాబాదే కాదు, ఇప్పుడు ‘మెట్రో’ అన్న పదమున్న ప్రతి నగరం...ఒక సమరభూమే,దుర్గంధధామే!
ముందస్తు ప్లానింగ్ నేర్వని మన భారతీయ సంస్కృతికి అవి తార్కాణాలు. నారు పోసినవాడు నీరు పోస్తాడుగనక, సిటీని పెంచిన ‘దేవుడి’కోసం ఎదురుచూద్దామా? లేక మనుషులు ఇలాంటి పరిస్థితుల్లో జీవించజాలరని మనమే నడుంకడదామా? ఎవరి ఇష్టం వారిది.
ఒక హేండీ కేం చేతబుచ్చుకుని హైదరబాదు వీధుల్లో రోజంతా తిరిగిన అనుభూతి. నాకు అకస్మాత్తుగా నాస్టాల్జియా గుర్తొస్తోంది అదేంటో చిత్రంగా!
చాలా బాగా రాశారు
అసెంబ్లీ లో పర్యావరణం గురించి పెద్ద క్లాసు పీకినట్లుంది... మీ టపా.. అయినా ... ఇలాంటి సమస్యలకి మనుష్యులే రాజీ పడుతున్నప్పుడు .......మనం ఎన్ని చెప్పినా ఒక రకంగా వృధా ప్రయత్నమే.. మీ టపా ని మనసారా అభినందిస్తున్నాను.
hyderabad lo untu roju memu chustunna drusyalanni kanti kattinattu marokasari chupinchaaru...
ee traffic kashtala meeda... okatenti enni posts raasina adi antu leni katha laga vathune untundi!
"హే..నాకు నా సిటీ అంటే భలే ఇష్టం. నీకేంటి సమస్య? " అని అనగానే నా ఫ్రెండ్ ఒక టపా రాస్తానులే అన్నాడు. తను రాసే వరకూ నేను వేచి చూడక్కరలేదు. మీ టపా అంతా చెప్పేసింది.
అయినా నాకు నా సిటీ అంటే ఇంకా ఇష్టం. :-)
బైదవే, టపా బాగా రాశారు అని చెప్పడానికే ఈ వ్యాఖ్య!
కామెంట్‌ను పోస్ట్ చేయండి