30, మార్చి 2008, ఆదివారం

రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్...



హైదరబాద్... మహా నగరం..

ఐదో ఆరో FM రేడియో స్టేషన్లు...

అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బహుళజాతి కంపెనీలు...

స్వదేశంలో విదేశీయతకు ఏమాత్రం తీసిపోని షాపింగ్ మాల్స్, డిస్క్ లు.., పబ్లు..., బార్లూ...

నిజాం పాలనను గుర్తుచేస్తూ... తీపి గురుతులుగా మిగిలిపోయిన చారిత్రక కట్టడాలు...

దేశంనుండొచ్చినా సొంతింటి రుచులను ఆస్వాదించగలిగే హోటళ్ళూ... రెస్టరెంట్లూ...

ఎన్నో వింతలూ విశేషాలే కాకుండా... చూస్తుండగానే ఎదిగిపోయిన నగరంలో...

చూడటానికే అసహ్యమైన విషయాలున్నాయి...

పైకి భూతల స్వర్గంలా కనిపిస్తున్నా... ఇది భూతాల స్వర్గమే..

అదేంటి అలా అనేసాను అనుకుంటున్నారా!!

ఇవి చూడండి మరి... వీటినేమంటారో???

ఉదయం ఏడున్నరకి అలారం మ్రోగగానే మళ్ళీ ఆఫీసా అనుకొనేవాడిని... ఒకప్పుడు.

స్కూల్ కి వెళ్ళే వయసులో అయితే... అమ్మో.. రోజు లెక్కలమాష్టారు క్లాసు బాబోయ్...

కానీ ఇప్పుడు... లేవగానే ఆఫీసు.. మా మేనేజరు కన్నా ముందుగా గుర్తొచ్చేది...

MCH వారి చెత్త బండి,

టౌముకి ఆఫీసుకు బయలుదేరినా తప్పని.. చేజింగ్ లా తగులుకుంటుంది నాకు..

హమ్మయ్య సగం దూరం వచ్చేసాం.. ఇక రోజు అదృష్టం కొద్దీ చెత్తబండి రాలేదు...

అనుకునేంతలోనే... దూరదర్శన్ నాటికలో రామేశం పాత్రలాగా... తెరచాటునుండి..

ఎప్పుడు వద్దామా అన్నట్లు.. చటుక్కున ఊడిపడుతుంది... ప్రక్క సందులోంచి...

హారన్ కొట్టినా వినపడదు... అసలు వాడిలోకమే వాడిది... ఎవరికీ లొంగని మోనార్క్ లా

దూసుకుపోతుంటాడు..

నేను వెనుక హెల్మెట్ తో భంధింపబడి... ముక్కుమూసుకునే వీలులేక పడే అవస్త... ఒకటైతే...

వెనుకున్నవాడు.. కొట్టే హారన్ ఇంకొక అవస్త..., భాధలు పడలేక పాటలువిందామని

FM ఆన్ చేసి ఇయర్ ఫోన్స్లో హాయిగా పాటలు వింటూ కొంత దూరం వెళ్ళగలిగినా...,

"కజ్ రారే.. కజ్ రారే..", పాట కూడా కంపుకొట్టి.. "కచ్ రా రే.. కచ్ రా రే.. తెరె బద్బూ బద్బూ గాడీ...,

... కచ్ రా ", గా మారిపోయింది....

ఇక ట్రాఫిక్ విషయానికొస్తే... చదువుకున్నోడు అంతే.. చదువురానివాడూ అంతే...,

సిగ్నల్ పడినా ఆగకుండా దూసుకుపోతూ..., ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్ నే తిడుతుంటే...

ఏమనాలండీ వాళ్ళని...,

అక్కడే గట్టిగా హారన్ కొట్టేవాడొకడు... సిగ్నల్ దగ్గర ఆగి హారన్ కొట్టడం ఏం మాయరోగమో మరి...,

ప్రక్కనే... సిగ్నల్ వదిలినా వెళ్ళకుండా... దారిలో ఆపేసి సెల్ ఫోన్ మాట్లాడే వాడొకడు...

ఇవన్నీ చూడలేక చూసి ఉండలేక... అక్కడికక్కడే... అపరిచితుడు సినిమాలో రామం క్యారెక్టర్

వేసేద్దాం అనిపిస్తుంది.. కానీ.. టైము చూస్తే... అప్పటికే గంటన్నర లేటు ఆఫీసుకు...,

ప్రతీరోజు లేటుగా వెళితే మా మేనేజరు రెమో క్యారెక్టరు వేస్తాడని భయమేస్తుంటుంది.

సిగ్నల్స్ దగ్గర బైకు భాధలన్నీ పడలేక... సరదాగా వీకెండ్స్ లో బయటకు వెళ్ళేటప్పుడు..

ఆటోలో పోదామని అనుకున్నామా అంతే సంగతులు...

వాడు కుదిపే కుదుపులకు... ప్రెగ్నంట్ కానివారికి ప్రెగ్నెన్సీ... ప్రెగ్నంట్ అయినవారికి ఫ్రీ డెలివరీ ఖాయం.

ఆటోకి డిజిటల్ మీటరుంటుంది... కానీ తిరగదు.. తిరిగినా మీటరుపై రాడు వాడు..

"అరె ఫో.. మీటరుపై రాకుంటే... ఇంకెందుకు బాబూ మీటర్.. ", అని నాలుగు తిట్లు తిట్టి..

తప్పక.. అటో ఎక్కి వెళ్ళాల్సొస్తుంది..

"సాదా మీటర్.. గవర్నమెంట్ భంధ్ చేషిండు సార్..", అని.. గుట్కా వాసనకొడుతూ

తన స్టోరీ చెప్పుకుపోతుంటాడు.. ఆటోవాడు..,

మరి ఎందుకయ్యా డిజిటల్ మీటర్... ఉపయోంచకుండా దండగ అంటే..

"ఏం చేస్తం సార్.. ఫోలీషోడు చూషినాడంటే... వంద నొక్తడు... అందుకే.. పదేనొందల మీటర్ని..

బ్లాక్లొ నాలుగువేలు పెట్టి కొన్నం",

గవర్నమెంట్... లిమిట్ గా మీటర్లిచ్చిండు సార్... పూరా బ్లాక్ నడిషింది..,

మీటర్ పై పోతే మాకేమొస్తది...", అని ఆటోవాడు తనభాధలు చెప్పుకుంటాడు...

ఆటో దిగ్గానే వందనోటు చదివించుకొని...

ఒర్నాయనో YS కష్టాలు YS వి, KCR కష్టాలు KCR వి అన్నమాట..

పాపం ఆటోవాడికీ ఇన్ని కష్టాలా... అనుకుంటూ... పొల్యూషన్ పొగవల్ల...

మొహంపై రెండంగుళాల మందాన పట్టిన జిడ్డును వదిలించుకోటానికి

ఎన్ని కష్టాలు పడ్డానో నేనెవరకు చెప్పుకోవాలి....

ఇలా బయట అడుగుపెట్టాలంటే... వందనోటున్న నవాబులే ఈ నగరంలో

బ్రతకగలరు.. అనుకుంటే... ఇక సామాన్యుడి పరిస్ధితేంటో...

గోలంతా పడలేక వీకెండ్ వస్తే ఇంట్లోనుండి కదలాలంటే భయంపుడుతుంది...

వేలెంటైన్స్ డే..., న్యూ ఇయర్ డే... లాంటి.. ఏదైనా స్పెషల్ డే వచ్చిందీ అంటే...

ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయన్న విషయమే గుర్తుండదు జనాలకి..

ఎవడిస్టమొచ్చినట్లు వారు కంగారుగా దూరిపోయి, దూసుకుపోయి.. వెళ్ళిపోవటమే...,

బిర్యాణీ పాయింట్స్ దగ్గర మూగిపోయి కంగారు పడిపోవటం.. ఎక్కడో టీవీచానల్స్ లో పెట్రో ధరలు పెంపు

అని వినగానే... పెట్రోలు పంప్స్ దగ్గర ఎవడి కంగారు వాడిది...

చికెన్ షాపుల దగ్గర కంగారు..., ఆకరికి బార్బర్ షాప్ దగ్గర కూడా త్వరగా వెళ్ళిపోవాలని

ప్రక్కవాడిని తోసుకుని మరీ కంగారు...

ఉల్లి ధర పెరిగే అవకాశం అన్న గాలి వార్తైనా సరే... మూగి మూగి.. పడి చచ్చిపోతుంటారు...,

ఒక క్యూ కడదామనో... పద్దతి పాటిద్దామనో అలోచన ఉండనే ఉండదు.. ఎవడి స్వార్ధం వాడిది...

ఇదే విషయం కొలీగ్స్ మాట్లాడుకునేటప్పుడు వస్తొంటుంది.... మీ కోస్తా, రాయలసీమోల్లే వచ్చి

చెడగొట్టారని... కొందరు.. లేదు మీ తెలంగాణా వాళ్ళే అని.. మరికొందరు... సెటైర్లేసుకుంటుంటారు...,

నువ్వు ఎధవ.. నువ్వు ఎధవ అని ఇద్దరూ ఎధవలైనట్లనిపిస్తుంతొంది...

పబ్లిక్లో పబ్లిక్ టాయిలెట్స్ లేక పాపం రోడ్ల ప్రక్కనే కానిచ్చేస్తుంటారు కొందరు...

కొన్ని చోట్ల పబ్లిక్ టాయిలెట్స్.. ఉన్నా పాపం చిన్నప్పటినుండి లేని అలవాటులేని కొత్తగా తెచ్చుకుంటే

దేశమెక్కడ బాగుపడిపోతుందో అని.. టాయిలెట్ గేటు దగ్గర... చుట్టుప్రక్కలా కానిచ్చే వారు... కొందరు...

"క్లీన్ చేషే కొద్దీ పోస్తనే ఉంటరు... పబ్లిక్, లైట్ తీస్కో", అని.. అనుకుంటుంటారో ఎంటో మరి..

అసలు పట్టించుకోరు... MCH వాళ్ళు..., ఆహా... ఏం అనుభంధం వీరిది... సమైఖ్య కుటుంబం...,

అంతేలేండి.. మనుషుల్లోనే సంస్కారాలు లేనప్పుడు... మనుషులు సృష్టించుకున్న కట్టుబాట్లలో సంస్కారమెక్కడొస్తుందీ???,

సాయంత్రం ఆరుదాటకుండానే గ్లాసుమెడలో కట్టుకుని తిరిగే మందుబాబులకి ఉండే స్వేచ్ఛ

ఇక్కడ తప్ప ఇంకెక్కడా ఉండదేమో..!!

విషయానికీ క్యూ కట్టని జనం... పబ్లిక్లో పబ్లిక్ గా ఒకే ఒక్క చోట క్యూలో నిలబడతారు...

అదే... వైన్ షాపుల ముందు.

అక్కడే నిలబడి... త్రాగి.., తన్నుకుంటూ ఎంజాయ్ చేసుకుంటుంటే... వచ్చేపోయే జనాలకి..

ఎంటర్టైన్మెంటులా టైమ్ పాసయిపోతుంటుంది... పబ్లిక్ ఎంటర్టైన్మెంటు కల్పించిన సర్కార్ కి జోహార్లు...

హైద్రాబాద్ వచ్చిన ప్రతి వ్యక్తి ట్యాంక్ బండ్, చార్మినార్ ని చూడలేకపోవచ్చేమో కానీ...

వింతలూ విడ్డూరాలూ... ఎక్కడైనా ఎంట్రీ ఫీజులేకుండా ఫ్రీగా చూసే అవకాశం ఉంది...

రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్...

Related Posts Plugin for WordPress, Blogger...