18, జనవరి 2007, గురువారం

విలువ...



"సరేరా.. ఉంటాను.. బస్సు బయలుదేరేలా ఉంది.. అందరినీ అడిగినట్లు చెప్పరా.. పోన్ చేస్తాలే..," అని వెళుతున్న బస్సుతోపాటు వడివడిగా అడుగులు వేస్తూ స్నేహితుడిని సాగనంపాడు శంకర్. అతనికి సెలవు దొరకలేదు. ఎప్పుడు సెలవు అడిగినా ఆఫీసులో కొత్త వర్కు చెబుతుంటాడు వాళ్ళ మేనేజరు. తెలిసినవాళ్ళందరికీ సెలవులు దొరికాయి. ఇంటికి వెళ్ళిపోయారు. "రూమ్లో ఒంటరిగా ఉండాలిరా దేవుడా ఐదురోజులు. చచ్చాం", అని మనసులో అనుకున్నాడు. రాత్రి పదకొండు కావస్తుంది. ఏంటిరా బాబు ఇంత ఆకలిగా ఉంది. మధ్యాహ్నమే కదా కడుపునిండుగా తిన్నాం. మళ్ళీ ఆకలి మొదలు… ఇంకా ఇక్కడ ఏ టైముకైనా ఏది కావాలంటే అది దొరుకుతుంది కాబట్టి సాగుతుంది మనకు.. ఒకవారం తిండిదొరకని చోట ఉంటే తెలిసొస్తుంది.

సరే ఏదైనా హోటల్ లో బిరియానీ తిని ఇంటికి పోదాం అనుకుని రోడ్డుదాటాడు. హైదరాబాద్ హౌస్ బిరియానీ సెంటర్ కు చేరుకున్నాడు. రెస్టారెంటు కనిపించేంత దూరంనుండే గాలిలో కలిసి వస్తున్న బిరియానీ వాసనలను పట్టుకున్నాడు. ముక్కుకి అందిన బిరియానీ వాసనలతో కాస్త ఓపిక వచ్చినట్లుగా అడుగులు వేగంగా పడసాగాయి.

ఎల్లవొచ్చిగోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో…రింగ్ టోన్ తో జేబులో ఉన్నా ఫోన్ మ్రోగింది. ఈ టైములో ఎవరబ్బా అనుకుంటూ పోన్ తీసాడు. కిరణ్ గాడా.. వీడికేమయ్యింది ఈటైములో.. అనుకుంటూ అన్సర్ బటన్ నొక్కి.. "చెప్పరా.. ఏంటి.. ", అన్నాడు శంకర్. "ఒరే నేను ట్రైన్లో ఉన్నారా.. ఇంటికి బయలుదేరారా.. మావాడు లాస్ట్ మూమెంట్లో ఇచ్చాడు లీవ్… వాడిసంగతి తెలిసిందే కదా…నీకు చెబ్దామని చేసా. మళ్ళీ ఇంటికెళ్ళకా చేస్తారా బై", అని పెట్టేసాడు..


"హూ.. వీడికి కూడా లీవ్ దొరికేసింది. వీడి మేనేజర్ ప్రకాష్ రాజ్ కేరెక్టర్ లా కాస్త ఏడిపించినా, మంచివాడిలానే ఉన్నాడు". ఫోన్ తిరిగి జేబులో పెట్టుకుంటూ అలవాటు ప్రకారం ఫ్యాంటు వెనుకజేబుతడుముకున్నాడు. ఎత్తుగా ఉండే పర్సు లేకపోయేసరికి గుండెజల్లుమంది. కంగారుగా అన్నీ జేబులు వెతుక్కున్నాడు. ఫొను తప్ప జేబుల్లో ఏమీలేవు. నైట్ ప్యాంటు వేసుకోవడం వలన అన్నీ రూమ్లో పెట్టేసినట్లున్నాను అని తెలిసొచ్చిన తరువాత కాస్త మనసుకుదుటపడింది. కానీ రూమ్ తాళంచెవి కోసం వెతుక్కున్నాడు. ఎక్కడా దొరకలేదు. "ఓరిబాబోయ్…!!! ఈ వెంకట్ గాడు వేసినట్లున్నాడు తాళం, కూడా తాళంచెవి తీసుకెళ్ళిపోయాడు, నా తాళం రూమ్లో ఉండిపోయింది. ఇప్పుడెలా", అని గట్టిగా అరిచినంత పనిచేసాడు. ఒక్కసారిగా వీధిలైట్లు ఆరిపోయి చీకటైపోయినట్టుగా కళ్ళు బైర్లు కమ్మాయి.

"ఇప్పుడేంచేయ్యాలి…టైముకూడా పన్నెండు కావస్తుంది. ఎక్కడికెళ్ళగలం ఇంత అర్దరాత్రి, అయినా తెలిసినవాళ్ళంతా ఊరెళ్ళిపోయారే…ఎలారా..", అనుకుంటూ అలోచించసాగాడు.

బాస్కర్ గాడి రూమ్ దగ్గర్లోనే ఉంది కానీ వాడికి మనకు మొన్నగొడవయ్యింది.. ఇప్పుడు ఇలా వెళితే కాస్త కటింగులిస్తాడు.. వాడికాచాన్స్ ఇప్వకూడదు. ఇక డూప్లికేట్ కీ అయితే ఓనర్ దగ్గరుంది అక్కడివెళ్ళివచ్చేసరికి కనీసం అరగంట పడుతుంది.. అవును డబ్బులు కూడాలేనట్టున్నాయి అని వెతకగా.. ఒక ఏబైరూపాయలనోటు, అయిదురూపాయల చిల్లర పైజేబులో కనపడింది. హమ్మయ్యా.. ఇదన్నా ఉంది ప్రస్తుతానికి… ఓనర్ ని చేరుకున్నా అర్ధరాత్రి లేపడం మంచిదికాదు.

రేపువెళ్ళితీసుకోవాలి... అవును తాళాలు తీసేవడిని తీసుకొస్తే…ఇప్పుడు దొరుకుతాడా?, ఒకవేళదొరికినా, ఈ టైమ్ లో తాళాలు బద్దలగొడితే.. దొంగనుకునేరు ఎవరన్నా. సరేలే ఎదవగొడవంతా ఎందుకు.. ఈ రాత్రి ఎలాగోలా గడిపేస్తే సరిపోతుంది..

అసలంతా ఈ వెంకట్ గాడివల్లే… పదిన్నర బస్సుకోసం... పదింటివరకూ.. కదల్లేదు.., ఇక నన్నుకంగారు పెట్టి.. ఈ పరిస్ధితి తీసుకొచ్చాడు. వీడికి ఫోన్ చేసి నాలుగుతిట్లు పెట్టాలి… అని కోపంగా పోన్ తీసాడు.. డయల్ చేసిన నెంబరు కట్ చేసేసి.. ఎందుకులే.. మళ్ళీ ఈ జర్నిలో అంతా నిద్రలేకుండా అలోచిస్తాడు మనశ్సాంతిలేకుండా.. మనకెలాగు ఉండదు నిద్ర ఈరోజు ఇక వాడినిద్రపాడుచేయడందేనికిలే ఊరినుండి వచ్చాకా చెప్తా వాడిపని…ప్రస్తుతం ఏంచేయాలబ్బా అని ఆలోచించాడు.

బుర్రంతా నిండిన అలోచనలు కడుపులో ఆకలిని డామినేట్ చేసేసాయి. ఎదన్నా తినాలి అన్న ఆలోచన కూడా రావడంలేదు మనసులోకి. ఇక ఈ రాత్రికి రూమ్ ప్రక్కనున్న పార్క్ లో బెంచ్ పైన పడుకుని. రేపు పొద్దున్నే ఓనర్ దగ్గరకు వెళ్ళి తాళంచెవి తెచ్చుకుని ఆఫీసుకు వెళ్ళాలి.. అని నిర్ణయం తీసుకున్నాడు.

జేబులో ఉన్న డబ్బులతో బిరియానీ వచ్చేలా లేదు. అంతా ఖర్చుపెట్టేస్తే రేపు తిరగడానికి డబ్బులు అవసరం అని.. ప్రక్కనే ఉన్న సమోసా బండి దగ్గరకు వెళ్ళి పార్సల్ కట్టించుకున్నాడు.

వెన్నెల్లో చాలా అందంగా కనపడుతున్నాయి పూలమొక్కలు. పార్కులోకి అడుగుపెట్టగానే వచ్చిన పూలవాసనతో అతనికి మంచి ఆనందాన్నిచ్చింది. ఒక్కసారిగా టెన్నస్స్ అన్నీ మరచిపోయాడు. మంచి బెంచ్ ఒకటి చూసుకుని కూర్చున్నాడు. చందమామను చూస్తూ తిందామని సమోసా పొట్లం విప్పబోతూ అనిపించింది.

డబ్బులులేకపోతే.. క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయ్… అదీకాకపోతే ఇంత పెద్దనగరంలో ఎంతో మంది స్నేహితులున్నారు.. అయినా ఈ గతిఏంటినాకు. ఖర్మకాకపోతే ఎంటిది?, నేను పర్సుమర్చిపోవడమేంటి?... వాడు తాళంచెవి మర్చిపోవడమేమిటి?, స్నేహితులంతా ఒకేసారి కట్టకట్టుకుని ఇళ్ళకుపోవడమేమిటి..?... బిరియానీ తినవలసినవాడిని, ఈ సమోసాలు తినడమేమిటీ.. అంతే మన టైం బాగాలేదు.. ఈరోజుకు ఏదోలా సర్దుకుందాం.. అని అనుకుని సమోసాల పొట్లంవిప్పాడు.

ఒక్కసారిగా చెడువాసన వచ్చింది.. చీ.. ఇదేంటి.. అని.. ముక్కుమూసుకున్నాడు కొంతసేపు. ఏంటి ఎక్కడిదీ చెడువాసన.. అబ్బా..!!, అనుకుని పొట్లం కాస్త దగ్గరగా పెట్టుకుని వాసన చూసాడు బాగానే ఉందే..? మరి ఎక్కడనుండి వస్తుంది అని లేచినిలబడి చుట్టూ చూసాడు. ఏదో కాగితాలు కదులుతున్న చప్పుడు కూడా వినపడింది. కొన్ని అడుగులు వేసాడు. చప్పడు వినపడ్డవైపుగా.

పార్కుకి పెన్సువేసిఉంది.. అదే ప్రక్కగా రోడ్డు, దగ్గర్లో వీధిదీపానికి కాస్త అటువైపుగా ఒక చెత్తకుండీ ఉంది. ఎవో కుక్కలు అనుకుంట అవి కదుపుతుండడం వల్ల చెడువాసన వస్తుంది అని తెలుసుకున్నాడు. వెనక్కుతిరిగివస్తుండగా అక్కడపాకుతున్నది కుక్కలా కాకుండా మనిషిలా అనిపించింది కాస్త మసక చీకటిలో, సరిగ్గా చూడగా ఎవరో మనిషి కనిపించాడు.

కొంపదీసి దొంగేమో.. అయినా దొంగ చెత్తకుండీదగ్గర ఏంచేస్తాడు. వీధి కుక్కలుకూడా కూడానే ఉన్నాయి. దొంగకాదు ఎవడో పిచ్చివాడుఅయ్యివుంటాడు.. దగ్గరగా చూద్దామనుకుని కాస్తముందుకు నడిచాడు... పెద్దశబ్ధంతో గూర్ఖావేసిన విజిల్ వినపడి ఉలిక్కిపడి చతికిలపడ్డాడు. అమ్మో ఈ చీకట్లో నేను దొరికినా దొంగనే అవుతాను. అసలే ఈ సిటీలో ఇటువంటి కార్యకలాపాలు ఎక్కువ.. అనుకుని కదలకుండా మెదలకుండా కూర్చున్నాడు. భయంతో...

కొంత సమయం గడిచాకా లేచి చెత్తకుండీవైపు చూసాడు. ఒకతను మాసిన బట్టలతో, మట్టితో ఉండలు కట్టిన జుట్టుతో, గడ్డంతో, చెత్తకుండిలో కాగితాల మధ్య ఉన్న మెతుకులు వెతుకుతున్నాడు. ఏరిన పదార్దాలను చిన్న కాగితంపై పోగుచేస్తున్నాడు. ప్రక్కనే ఉన్న కుక్కలు అతన్నిదాటి వెళ్ళకుండా, ఆజ్ఞాపించినట్టుగా అక్కడే నిలబడి చూస్తున్నాయి. శంకర్ కి ఆశ్చర్యంవేసింది.. అదిచూసి ఒక విషయం అతనికి అర్ధమయ్యింది. అతనెన్నిరోజులుగా ఆకలిభాదను అనుభవిస్తున్నాడో.. పాపం. నా టెన్సన్ నా ఆకలిబాధను కొంత సమయం డామినేట్ చేసేసింది. అదే బాధ ఎక్కువైతే చుట్టూ ఉన్న చెత్తని, చెడువాసనని, రుచిని డామినేట్ చేస్తే ఏమవుతుందో అతని కళ్ళముందు ప్రత్యక్షమయ్యింది ఇప్పుడు.

అయినా అదే తినాలా?, అడుక్కుంటే ఎవరన్నాపెట్టకపోతారా?, ఏమోలే ఎద్దులా ఉన్నావ్ పనిచేసుకుని బ్రతకొచ్చుకదా? అన్న మాటలుకూడా విన్నాం.. చెప్పలేం.. పడ్డవానికే కదా తెలిసేది.. పాపం పిచ్చివాడేమో.. ఎమో తెలియక చేస్తున్నాడేమో.. ఎవరికైనా తప్పదు కదా ఈ ఆకలి బాధ. నా దగ్గరున్న సమోసాలు ఇచ్చేయడం మంచిది. ఒకరోజు నేను తినక పోతే నష్టంలేదు.. నాకు ఒక్కరోజు ఆకలిబాధఅంటే ఎంటో తెలుసొస్తుంది కూడాను. చిన్న ఈగో, దోమో పడింది అని గిన్నెడు అన్నాన్ని పడేసిన రోజులు ఉన్నాయి.. హోటల్లో తిన్నది ఎక్కువై, తీసుకెళడానికి నామోషీ వచ్చి వెయిటర్ కి చెప్పి తీసేయమని పడేసిన రోజులూ ఉన్నాయి..

నాలాంటివాడికి ఆకలిబాధ ఒక్కరోజు తెలియడమే మంచిదే.. సరే సరే.. ఇప్పుడు మన ఆలోచనలకన్నా అతని ఆకలి ముఖ్యం అతను అది తినకముందే ఇవ్వడం మేలు అనుకుని, పార్కు బయటకొచ్చి.. చెత్తకుండి దగ్గరకు చేరుకుని.. అతనిని పిలిచి సమోసాల పొట్లం చేతికిచ్చాడు శంకర్. అది తీసుకున్న ఆ వ్వక్తి. మళ్ళీ చెత్తకుండీ వైపు నడిచాడు.. ఏంటిది.. మళ్ళీ ఇటువైపు వెళుతున్నాడు అని పార్కులోకి వెళుతూనే అతని వంక చూసాడు శంకర్.. అక్కడ పోగుచేసిన పదార్ధాలను కుక్కలకు తినమన్నట్లుగా వాటి దగ్గరకు లాగి వీధిదీపం ఆవలికి వెళ్ళి కూర్చుని సమోసాలు తినసాగాడు. ఇదంతా చూస్తూనే శంకర్ తన బెంచ్ పైకి వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ ఆలోచనలు వెంటాడాయి.

బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ||

ఇది చిన్నప్పుడు భగవద్గీతలో నేర్చుకున్న పద్యం

అవును ఈరోజే తెలిసింది పడేసిన ఆహారం కూడా ఇలా ఉపయోగపడుతుందన్నమాట.. కానీ మనంతినగా మిగిలింది, వేరొకరికి…మనుషులే తినలేనిది జంతువులకు, జంతువులు తినలేనిది క్రిమికీటకాలకూ చేరాలన్నమాట… ఏంటి ప్రతీరోజు ఇలాంటివి ఎన్నో చూస్తున్నా నాకు తెలియలేదు.. దానిగురించి ఆలోచించనూలేదు… ఈ రోజు నేను ఈ పరిస్ధితిలో ఉన్నా కాబట్టి ఆలోచిస్తున్నానా?,

ఏమోలే… ఎవరో చెప్పినట్లు …ఒక సంవత్సరకాలం విలువ తెలియాలి అంటే.. పరీక్షలలో తప్పిన విధ్యార్దిని అడుగు తెలుస్తుంది, ఒక నెల యొక్క విలువ తెలియాలి అంటే నెలలు నిండకుండానే జన్మనిచ్చిన తల్లిని అడుగు, ఒక నిముషం విలువ తెలియాలి అంటే తను వెళ్ళవలసిన రైలును దాటిపోతే తలపట్టుకున్న వ్వక్తిని అడుగు, ఒకసెకను కాలం విలువ తెలియాలి అంటే తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్న వ్వక్తిని కనుక్కో, ఒక్క మిల్లీసెకను విలువతెలియాలి అంటే ఒలింపిక్స్లో రజతపతకాన్ని పొందిన వాడినడుగు…అని.

ఎదుటి వాడి ఆకలి బాధతెలియాలి అంటే ఒక్కరోజు ఆకలితో గడపాలి.., దూరమైనప్పుడే దేని విలువ అయినా తెలిసేది... అని అప్పుడే తెలుసుకున్నాడు.

ఇలా శంకర్ ఆలోచిస్తూ ఉండగానే తెల్లారిపోయింది.

10, జనవరి 2007, బుధవారం

రాంగ్ నెంబర్...




ఆఫిసునుండి తిరిగి రూమ్ దగ్గర ఉన్న సందులోకి తిరిగి, నడుస్తూ వస్తున్న దీపక్ జేబులో ఉన్న సెల్ ఫోన్ మ్రోగింది. ఆఫీసులో పని ఎక్కువై అసలే అలసి ఉన్న దీపక్ , ఫోన్ ఎత్తి నీరసంగా "హలో!" అన్నాడు. అవతలి వైపునుండి ఒక ముసలతను గొంతు వినపడింది.. “ఏరా! సతీష్ వచ్చేయరా.. నీకోసం బెంగ పెట్టుకున్నాం రా.. వచ్చేయరా బాబు.. “, అని ఏడుపు గొంతుతో వణుకుతూ అవతలి వ్యక్తి మాట్లాడుతున్నాడు. దీపక్ కి అర్ధంకాలేదు.. అసలే చికాకు ఉన్నాడేమో, కోపంగా తిట్టేద్దాం అనుకున్నాడు.., మళ్ళీ ఎవరో పెద్దాయన గొంతులా ఉంది కదా అని "ఎవరుకావాలండీ.. ఇక్కడ సతీష్ ఎవరూలేరండి", అని గౌరవంగా సమాధానమిచ్చాడు. ఫోన్ కట్ అయ్యింది.

మళ్ళీ రెండు అడుగులు వేసాడో లేదో మళ్ళీ మ్రోగింది. మళ్ళీ అదే గొంతు అదే ఏడుపు.. ఇక్కడ ఎవరూలేరని చెప్పినా ఆయన వినడంలేదు.. అలా నాలుగుసార్లు రిసీవ్ చేసుకుని సహనంతో సమాధానమిచ్చాడు. ఇక ఈసారి వస్తే పెద్దాయనైనా సరే అయిపోయాడు అనుకున్నాడు.
మళ్ళీ మ్రోగింది.

ఈ సారి కాస్త కోపంగా సమాధానమిచ్చాడు.. దానికి అవతలి వ్వక్తి తిట్టడం మొదలుపెట్టాడు.
"ఒరే.. మా సతీష్ ని వదిలిపెట్టు లేకపోతే పోలీస్ కంప్లేంటు ఇస్తాను.. కిడ్నప్ కేసు పెడతా", అని బెదిరించాడు.

"ఇదెక్కడి గోలయ్యా బాబు.. సతీష్ ఎవరూలేరు అంటుంటే. "అని ఫోన్ కట్ చేసేసాడు.
ఇక ఫోన్ మీద పోన్ రావడం మాత్రం ఆగలేదు. చికాకు పడుతూ రూమ్ చేరుకున్నాడు. అప్పటికే టైము పది కావస్తుంది ఫ్రండ్స్ అంతా ఎవరిపనిలో వాళ్ళున్నారు.

అనురాగ్ ఎఫ్ ఎమ్ లో పాటలు వింటున్నాడు. సత్యం, జీవా, అజయ్ టీవిలో న్యూస్ చూస్తున్నారు. శ్రీనివాస్ ఎవరితోనో ఫోన్లో బిజిగా ఉన్నాడు. వీళ్ళంతా తోటి రూమ్ మేట్స్.

అంతా వేరువేరు రాష్ట్రాలనుండి వచ్చినవాళ్ళు. సత్యం, దీపక్ మధ్యప్రదేశ్, అనురాగ్ ది ఉత్ర్తర్ ప్రదేశ్, జీవాది తమిళనాడు, శ్రీనివాస్ ది ఆంధ్రా, కొత్తగా వచ్చిన పాత రూమ్ మేట్ అజయ్ కూడా ఉన్నాడు. వాడిది బీహార్..

సత్యం, శ్రీనివాస్, అనురాగ్, జీవాలు ఒకే కంపేనీలో చేస్తారు, దీపక్, అజయ్ లు వేరు వేరు కంపెనీల్లో చేస్తుంటారు. అందరూ హిందీలో మాట్లాడుకుంటారు.. లేదా ఇంగ్లీష్.

"హే.. కొత్త జాబ్ వచ్చిందట కదా.., ఎక్కడ ఏంటి.. ఎలా ఉన్నావ్", అని దీపక్ అజయ్ ని పలకరించాడు..

"అవును.. కోలకతాలో వచ్చింది ఇంకొక పదిరోజుల్లో జాయిన్ అవ్వాలి. నా బుక్స్ అవి ఇక్కడ వుండి పోయాయి తీసుకెళ్దామని వచ్చాను. అవును నీ జాబ్ ఎలా? ఉంది", అని అజయ్ అడిగాడు దీపక్ ని.

మొబైల్ వైబ్రేట్ మోడ్ లో పెట్టేసి.. బాత్రూమ్లో దూరి కాస్త ఫ్రెస్ అయ్యి బయటపడ్డాడు దీపక్.

బయటకొచ్చాకా సత్యంతో ఫోన్ గురించి చెప్పాడు. వస్తున్న కాల్స్ ని కట్ చేస్తూ. "అదేంటి నాకివ్వు నేను మాట్లాడతా..", అని సత్యం ఫోన్ లాక్కొని మరీ మాట్లాడాడు..

"చెప్పండి తాతగారు.., ఇక్కడ సతీష్ ఎవరూలేరు", అని నాలా మర్యాదగా చెప్పాడు.
"మీకు కావాల్సిన నెంబరేంటి..", అని అడిగాడు. అవతలి వ్యక్తి తిట్లు ఆపడంలేదు.. "చంపేస్తా మీ ఎడ్రస్ చెప్పు ",అన్నట్లున్నాడు.

సత్యం కి కోపం మొదలయ్యింది. "ఏంటిరా మర్యాదగా చెబుతుంటే.. వినవే.. ఎవడులేడుబే.. నీకు చేతనయ్యింది చేస్కో..బే.. ఇదిగో నా ఎడ్రస్ అని మొత్తం ఎడ్రసంతా వివరంగా చెప్పేసాడు. రాస్కో.. మళ్ళీ కావాలంటే చెప్తా.. ఏ టైముకి వచ్చినా పర్లేదు.. నీకు దమ్ముంటే రా", అని.. తొడ కొట్టి జూనియర్ ఎన్ టి ఆర్ చెప్పినట్టు డైలాగ్స్ చేప్పేసరికి.. దీపక్ కి కాళ్ళు వణికాయి.. ఏంటిరా.. ఇదేమన్నా రెస్టారెంటుకి ఫోన్ చేసి ఆర్డర్ చేప్పుతున్నావనుకున్నావా.. మొత్తం ఎడ్రసు చెప్పేవు.. వాడు ఇప్పుడు పోలీస్ కంప్లేంటు ఇస్తే.. ఏం చేస్తావ్.. బే", అని భయంతో అరిచాడు.

"అందులోనూ ఏదో కిడ్నాప్ అంటున్నాడు.. నాకేదో భయంగా ఉంది", అని గోలపెట్టాడు.
"ఏం జరుగుతుంది ", అని మిగతా వాళ్ళంతా ఒకరూములోకి చేరి చర్చించుకున్నారు. జరిగిందంతా తెలుసుకుని.. సత్యంని తిట్టారు..

అజయ్ టాటా ఇండికామ్ లో పనిచేస్తుంటాడు.. "వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేసేయండి లేకపోతే ట్రేస్ చేసే అవకాశం ఉంది", అని సలహా ఇచ్చాడు.. దీపక్ వణుకుతున్న చేతులతో స్విచ్చాఫ్ చేసేసాడు.

"మొత్తం ఎడ్రసే తెలిసిపోతే ఇక ఫోన్ ట్రేస్ చేయాల్సిన అవసరం ఏముంది బే", అని శ్రీనివాస్ తిట్టాడు అజయ్ ని.. అంతా మళ్ళీ తెల్లమొహం వేసారు.

అందరి మొహాల్లోనూ టెన్సన్ కనపడింది.. జీవాకి ఏమీ అర్దంకాలేదు.. అతనికి హిందీ రాదు.. “వాట్ హేపెన్డ్ మేన్”, అని అడిగాడు. వాడికి ఓపికగా అనురాగ్ అంతా వివరించాడు. “ఓ గాడ్ “,అని నిట్టూర్చాడు జీవా.

అనురాగ్ కి ఒక ఐడియా వచ్చింది. "ఇది కష్టమర్ కేర్ కి పోన్ చేసి చెప్పేద్దాం మనకు ఎదో రాంగ్ కాల్స్ వస్తున్నాయని. ముందుగా మనమే చెబితే కంప్లైంటు ముందు మనదే ఉంటుంది, తరువాత ఏం జరిగినా మనదే పైచేయి అవుతుంది", అని అన్నాడు.

"సరే దీపక్ పోను ఇవ్వురా ", అని అడిగాడు శ్రీనివాస్..
"అమ్మో, అది ఆన్ చేస్తే మళ్ళీ కాల్స్ వస్తాయి", అని భయపడ్డాడు ధీపక్.

"సరే శ్రీనివాస్ నీ ఫోన్ ఇవ్వు", అని అనురాగ్ కష్టమర్ కేర్ కి కాల్ చేసాడు.

"హలో మాకు ఎవరో రాంగ్ కాల్స్ చేస్తునారు, బెదిరిస్తున్నారు, కాస్త అది ట్రేస్ చెయ్యగలరా. కంప్లేంట్ రాసుకోండి", అని కాల్ వస్తున్న నెంబరు ఇచ్చాడు. కష్టమర్ కేర్ వాడు ఏదో నెంబరు రాసుకోమన్నట్లున్నాడు పెన్ అన్నట్లు సైగచేసాడు.. పెన్ అందించగా ఏదో ఆరు నెంబర్లు రాసాడు. ఇంకా ఎవో చెప్పినవి కంగారు కంగారుగా ఎక్కించేసాడు పేపర్ పై.

"ఇదిగో ఈ నెంబరుకు మనం మెసేజ్ పంపాలంట. మన నెంబరు, రాంగ్ కాల్ వస్తున్న నెంబరు. పెట్టి పంపిస్తే అది లాగ్ అవుతుందంట. నేను పంపిస్తాను అని మెసేజ్ పంపించాడు.", అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

"సరే కంప్లైంట్ చేసేసాం. ఇప్పుడు వాళ్ళు నలుగరురైదుగురు వస్తే ఏంటి పరిస్ధితి. ఎలా", అని అన్నాడు జీవా.

"అవును వస్తే రానియ్.. మనం ఆరుగురున్నాం ఆమాత్రం కొట్టలేమా అందరూ రాడ్స్ తీయండ్రా", అని ఎక్సర్ సైజ్ చేసే వెయిట్స్ తీసేసి రాడ్స్ అవీ రడీచేసి మెయిన్ డోర్ ప్రక్కన పెట్టాడు సత్యం.

"ఎందుకైనా మంచిది.. ఇది ముంబయి బే… ఆఫీస్లో తెలిసిన రాహుల్ ఉన్నాడు కదా వాడికి కాస్తా రౌడీ బ్యాక్ గ్రవుండ్ ఉంది. వాడికి పోన్ చెయ్యి. చెబ్దాం. మరీ అవసరం అయితే. వాడు సాయం చేస్తాడు", అని వాడికి కూడా పోన్ చేసేసి వివరంగా చెప్పారు అంతా.

ఇదంతా వింటూ తలపట్టుకుని కూర్చున్నాడు దీపక్. ఏడుపు ఒకటే తక్కువైంది మొహంలో. "అందరూ పల్లేదురా మేమున్నాం కదా భయపడకు.. అయినా ఈ రోజు ఫోన్ ఎవరికైనా ఇచ్చావా.. ఎవరైనా కొత్తవాళ్ళునిన్ను ఫాలో అయ్యారా", అని ప్రశ్నల వర్షం కురిపించారు.. ఆందోళనగా ఆళోచిస్తూ "లేదురా.. ", అని సమాధానం చెప్పాడు, దీపక్.

"సరే పద! రా అనురాగ్.. మనం వెళ్ళి సెక్యూరిటీవాళ్ళకు చెబ్దాం ఎవరైనా వస్తే రానివ్వద్దని. జాగ్రత్తగా ఉండమనీ. తేడా వస్తే పోలీసులకు ఫోన్ చెయమని", అని సత్యం అనురాగ్ ని క్రిందకు తీసుకుపోయాడు.

మళ్ళీ మిగిలినవారంతా "ఏంటి? ఎలా జరిగుంటుంది.. ?", అని విశ్లేషించసాగారు.

పదినిముషాలు గడిచింది.. సత్యం దగ్గరగా వేసి వున్న తలుపును కంగారు గుద్దుకుంటూ వచ్చి రూమ్లో పడ్డాడు. అవేశంగా అనురాగ్ వెనుకనుండి పరుగెత్తి వచ్చాడు లోపలికి.

కంగారు కంగారుగా తలుపులు మూసేసాడు అజయ్.. 'ఏమైందిరా!!!"', అని అంతా అడిగారు.. సత్యం,అనురాగ్ ని.

"సెక్యూరిటీ వాళ్ళకు చెప్పాం… చెప్పి వస్తుండగా... ఏదో సుమో ఆగింది... అందులో నుండి నలుగురు ఐదుగురు చేతిలో ఎవో రాడ్స్ తో దిగారు.. ఎడ్రస్ వెతుక్కుంటున్నారు.. లా ఉంది.. మేం భయంతో వచ్చేసాం..", అని వగురస్తూ చెప్పాడు సత్యం.

ధీపక్ తో పాటుగా అందరికీ కాళ్ళువణికాయి.. , "అయ్యబాబోయ్ ఇప్పడెలారా..", అని అనుకున్నారంతా.

అంతా నిశ్సబ్ధంగా కూర్చున్నారు. అంతా మెయిన్ డోర్ వైపు చూస్తున్నారు.. ఏ క్షణాన్నైనా కాలింగ్ బెల్ మ్రోగొచ్చు అని.

"చాలా సేపయ్యింది ఇక పడుకుందాం. ఎవడన్నా తలుపు కొడితే అప్పుడే చూద్దాం", అని అంతా సర్దుకుని పడుకున్నారు.

లైట్లన్ని తీసేసారు.

పది నిముషాలు గడిచాయి. ఏ శబ్ధమూ రాలేదు. సడెన్ గా శ్రీనివాస్ లేచి లైటువేసి ఏదో వెతకసాగాడు.. "ఏంటి బాస్ వెతుకుతున్నావ్??", అన్నాడు దీపక్.. "రాడ్స్ అన్నీ దగ్గర్లో ఉన్నాయోలేదో", అని.. అని లైటు తీసేసి పడుకున్నాడు శ్రీనివాస్.

కాసేపటికి.. అనురాగ్ లేచి లైట్లన్నీ వేసి.. 'ఆజ్ కా బక్రా దీపక్ జీ......" అని కేకలు పెట్టాడు. దీపక్ అయోమయంగా చూస్తూ "ఏమైంది?..", అని అడిగాడు..

"ఇదంతా మా ప్లాన్ చేయని నాటకం బే", అని.. అంతా నవ్వుకున్నారు.

ప్రక్క రూమ్లో పడుకుని ఉన్న అజయ్ పరుగుపరుగున వచ్చి.. దీపక్ ని పట్టుకుని.. ఏడిపిస్తూ.. ఆటపట్టించాడు.

(ఇది మా రూమ్లో జరిగిన.. ఒక సంఘటన, ఇందులో శ్రీనివాస్ పాత్రదారిగా నేను నటించగా. మిగతా పేర్లుకల, వాళ్ళు మా రూమ్ మేట్స్.. రిహార్సల్ లేకుండానే నాటకాన్ని రక్తికట్టించారు.)


తరువాత మళ్ళీ ఆన్ చేసిన దీపక్ మొబైల్ కి మిస్ కాల్స్ రాసాగాయి. దీపక్ కంగారుగా "ఎవరిది ఇది మళ్ళీ కొత్త నెంబరు..", అని ఆశ్చర్యపోయాడు.. వాడితో పాటుగా అంతా అశ్చర్యపోయారు. ఈ సమయంలో నాకు ఎవడుచేస్తాడు కాల్, ఇప్పుడు పన్నెండు అయ్యింది అని బిక్కమొహంవేసాడు దీపక్ మా వంక చూస్తూ. తరువాత వచ్చిన ఫోన్ ఎత్తాడు.. "సతీష్ ఉన్నాడా??", అని అవతలి వ్యక్తి అన్నాడంట.. దీపక్ కేకలేస్తూ చెప్పాడు.. "ఎవడో మళ్ళీ సతీష్ అంటున్నాడ్రా..", అని..

మాకెవరకూ వెలగలేదు "ఇదేంటి.. మనకు తెలిసిన వాళ్ళెవరిదీ కాదు కదా నెంబర్", అని..

ప్రక్క రూమ్లో నుండి జీవా నవ్వుతూ వచ్చాడు.. “వేర్ ఈస్ సతీష్ మేన్”, అంటూ.. దీపక్.. తలపట్టుకుని.. మొహం.. తలగడలోదాచేసుకున్నాడు.. మళ్ళీ అంతా పగలబడి నవ్వుకున్నాం.


తెరవెనుక కధ:
---------

అజయ్ టాటాఇండీకామ్ లో చేస్తాడు అని చెప్పాను కదా!, అతని కి కొత్తగా ఫ్రీ పోన్ ఒకటిచ్చారు. అది దీపక్ కి తెలియదు. ఆ నెంబర్ నుండి సత్యం ఫోన్ చేసి అలా కధమొదలుపెట్టాడు. దాన్ని అనురాగ్ కొనసాగిస్తూ ప్రక్కనే ఉంటూ మిస్ కాల్స్ ఇవ్వసాగారు.

ఇదంతా జరుగుతుండగా. ఫోన్ మాట్లాడటం అయిన నాకు ఏంజరిగిందో తెలియలేదు. సత్యం అనురాగ్ నుండి తెలుసుకున్నాను. కాసేపు నేను కూడా నమ్మేసాను.. అంతలా ఏక్ట్ చేసారు మా వాళ్ళు. నాకు కష్టమర్ కేర్ కి ఫోన్ చేసిన తరువాత అసలు విషయం అర్ధం అయ్యింది. ఎందుకంటే అనురాగ్ ఒక్కసారి డయల్ చేసి హలో అని వెంటనే మాట్లాడటం మొదలు పెట్టగానే అనుమానం వచ్చింది. హచ్ కష్టమర్ కేర్ కి చాలా సార్లు చేసాను ఫోన్ ఎవేవో ఆప్సన్స్ ఉంటాయి అవన్నీ డయల్చేసాకా కాని ఎంతో సేపటికి మాట్లాడలేం. తరువాత అనురాగ్ చేతిలోనుండి నా ఫోన్ తీసుకున్నాకా, డయల్ కాల్ లిస్ట్లో హచ్ కేర్ లేకపోయేసరికి నేను కూడా ఏక్ట్ చేయండం మొదలుపెట్టాను.

జీవాకి కూడా తెలిసిపోయింది ఎలా తెలిసిందో మరి.. కొంతసేపు దీపక్ ని ఓదార్చాడు.. తరువాత వేరే రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. ఇక సత్యం, అనురాగ్, అజయ్ లతో కలిసి నేను కూడా దీపక్ ని ఆట పట్టించాం.

అన్నిట్లో హైలైట్ ఏంటంటే, జీవా ఫోన్ చేసి సతీష్ ని అడగటం.

జీవా కొత్తగా రూమ్లోకి రావటం వలన అతని నెంబరు కూడా ఎవరికీ తెలియదు.

మా రూమ్ మేట్సే వేసిన చిన్న ప్లాన్ కాస్తా మంచి నాటకమయ్యింది… అది నచ్చినాకు నా బ్లాగ్ లో ఒక పోస్ట్ అవుతుందని ఇక్కడ రాసాను. ఇది ఏ రామ్ గోపాల్ వర్మకో ఇస్తే మంచి సస్పెన్స్ మూవీయే అవుతుంది…

ఆయనా ఇక్కడే ఉంటాడండోయ్ ఈసారి కలిసినప్పుడు చెప్పాలీ కధ..

టైటిల్.. “రాంగ్ నెంబర్”, కన్ఫామ్ చేద్దామా…?, కేప్సన్ ఉండాలి కాబట్టి.. హుమ్మ్….??,
"తెలిసిన వారి నెంబర్లు ఏడ్ చేసుకోండి…" అని ఇద్దాం.. ఒకే.. ఏక్షన్…

3, జనవరి 2007, బుధవారం

‘వార’ఫలం



ప్రతిరోజూలానే పేపరు తిరగేయటంతో మొదలుపెట్టాడు అతను. త్వరత్వరగా పేపరు పేజీలు తిప్పాడు. వెనుక రజనికాంత్ చేతులు కదిపినప్పుడు వచ్చే సౌండు ఎఫక్ట్సుతో నాలుగవ పేజిలో వేసే దినఫలం కాలమ్ కి కళ్ళు వేగంగా వెళ్ళాయి.

స్నేహితులతో వైరం, అనుకోని సంఘటనలు ఎదురవటం, ప్రమాదం, ధననష్టం, ఎదుటివారి విషయాలలో తలదూర్చడం మంచిది కాదు, పై అధీకారులచేత విమర్శలు, అపనిందలు … అన్నీ వరసపెట్టి చదవటం మొదలుపెట్టాడు. "ఎదో తేడాగా ఉన్నట్లుంది ఈ రోజు", అనుకుని బయలుదేరాడు ఆఫీసుకు టైమవుతుందని స్నానంచేయటానికి.

స్నానం మధ్యలో పోన్ వస్తే రూమ్ మేట్ ఫోను తీసి చేతికిచ్చాడు.. మాట్లాడుతూ.. కంగారులో సబ్బుపై కాలువేసి జారి పడ్డాడు. పోనుకాస్తా పగిలిపోయింది. నడుంనొప్పి పట్టింది. కష్టపడి పదివేలు పెట్టి కొనుకున్న ఫోన్ పోయింది అన్న బాధ ఒకపక్క, దినఫలంలో రాసినట్లుగా అనుకోని సంఘటన జరిగింది అని భయం ఒకప్రక్క..

"అరెరే.. అలా ఎలా పడ్డవ్ రా.. ", అని నడుంపట్టుకుని వస్తున్న అతనిని చూసి కంగారుగా రూమ్ మేట్ జాలిచూపిస్తూ చేయిసాయం అందించాడు. వెనుక విషాద వాయొలిన్ సంగీతం మొదలయ్యింది…

"చీ!!.. నీ…, ఇదంతా నీ వల్లే… ఫోను నువ్వే ఎత్తి స్నానంచేస్తున్నాడు అని చెప్పొచ్చుగా", అని ఏడుపుమొహంతో అన్నాడతను. ధినఫలంలో వ్రాసిన “స్నేహితులతో వైరం”, గుర్తొచ్చి నోరుమూసుకుని నోట్లోనే తిట్లన్ని తిట్టేసుకుంటూ…త్వరత్వరగా పనులు కానిచ్చి , దేవుడికి దణ్ణం పెట్టుకున్నాడు. ఈ రోజు అంతా మంచిగా ఉండాలి అని.

బైక్ ని ఆఫీసుకు వేగంగా పరుగెత్తించాడు. ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో తిట్టుకుంటూ సడన్ బ్రేక్ కొట్టాడు. కాస్త అందరూ నిలిపినదానికంటే ఒక అంగుళం ముందు బండి ఆగింది.. అది ఈలవేస్తూ ఓరచూపులుచూస్తున్న ట్రాఫిక్ పోలీసు కంట పడింది.

అదిగమనించి, బైక్ ను కాళ్ళ సాయంతో కాస్త వెనక్కు నడిపించి.. ఏమీ ఎరుగనట్లు.. ఆకాశంవైపు చూస్తూ.., జుట్టు సర్దుకుంటూ.. అద్దంలో మొహం చూసుకుంటూ.. అతని చూపులనుండి తప్పించుకున్నాడు కాసేపు. మళ్ళీ పోలీసువైపు చూసేసరికి, లాంగ్ షాట్ కాస్తా క్లోజప్ షాట్ లా జూమ్ అయినట్లు వచ్చి దగ్గరగా నిలబడ్డాడు. సీరియస్ గా చూస్తూ బైక్ పక్కన పెట్టు అన్నట్లు సైగచేసాడు. చేసేదేమీలేక పక్కనపెట్టవలసి వచ్చింది పాపం.

అయిదు నిముషాలు గడిచింది. కానీ ఇంకా పోలీసు ట్రాఫిక్ క్లియర్ చేయండంలోనే ఉన్నాడు. "ఇక్కడ వీడు పని వీడు చేసేసుకుంటున్నాడు మన దగ్గరకు ఎప్పడొస్తాడు", అని అనుకుంటూ. ఆఫీసుకు లేటయ్యి బాస్ ముందు చేతులుకట్టుకుని నిలబడే సీన్ , వెనుక ఫాస్ట్ ఫార్వాడ్ చేసినట్లుగా వినిపించే తిట్లు గుర్తొచ్చి. మాకూ పనులున్నాయ్ అని తిట్టుకుంటూ .

"రా.. రా త్వరగా…",అని ఎదో సినిమలో వెంకటేష్ బాబు పళ్ళుకొరుకుతూ అన్నట్లు, వాయిస్ పైకి రాకుండా చేయి ఊపాడు…

కోపంగా పరుగుపరుగున వచ్చాడు పోలీసు. "ఏంటి బాబు.. ఏంటి కంగారేంటి? ఆగాలి. ఇక్కడ మేం ఏమన్నా ఖాళీగా ఉన్నామా.. హీరో వెంకటేష్ లా పళ్లుకొరుకుతూ చేయిఊపుతున్నావేంటి..?", అన్నాడు.


ఒక్కసారి తనని వెంకటేష్ తో పోల్చినందుకు, క్రేన్ పైన కూర్చుని చెట్టు ఎక్కినట్టు చూపించే షాట్ ఒకటి ఊహించుకుని… మళ్ళీ సడెన్ గా క్రేన్ క్రిందకు దిగగా మామూలు మనిషయ్యి …

"లేదండి... నాకు ఆఫీస్ టైమవుతుంది. అందుకే పిలిచానండి", అని నెమ్మదిగా వినయంగా సమాధానంచెప్పాడు పోలిసుకు.

"అయినా నేను ఒక అంగుళమే కదా దాటాను. దానికే ఆగమంటారా.. అందుకే మళ్ళీ వెనక్కు వెళ్ళిపోయా సార్.. ", "సారీ!! సార్..", అని సర్దిచెప్పుకున్నాడు.

"అది కాదు బాబు నీ హేల్మెట్ ఏది.? ఉద్యోగంచేస్తున్న వాడివిలా ఉన్నావ్, మీకు కూడా మేం ప్రతిరోజు ఎక్కడ గుర్తుచేస్తామండి.", అని గౌరవంతో కూడిన తిట్లు మొదలుపెట్టాడు పోలీస్.

ఒక్కసారిగా ప్రస్తుత సీను నుండి తను నిద్రలేచిన సీనువరకూ, ప్రేములు వెనక్క పరుగుతీసాయి…

పేపరులో వ్రాసిన ధినఫలం ఫ్రేమూ, ధననష్టం అన్న పెద్దపెద్ద అక్షరాలతో ఉన్న ఫ్రేమూ, హెల్మట్ అల్మరాలో పెట్టి మర్చిపోయినట్లున్న ఫ్రేమూ.. కాస్త ఫ్లాషింగ్ ఎఫెక్ట్సుతో కనపడటం మొదలుపెట్టాయి అతనికి.

కట్ చేసి ప్రస్తుత స్ధితికి వస్తే.. తిట్లుతిడుతున్న పోలీసు, తన బాస్ లా కనపడటం మొదలుపెట్టాడు. వెంటనే చేతులు ఆటోమేటిగ్గా కట్టేసుకున్నాడు.

"పదండి…మీకు సినిమా చూపించాల్సిందే.. పదండి!!", అన్నాడు.. పోలీసు…

"వద్దుసార్!!.. మీకు కావాల్సింది ఎంటో నాకు అర్దమయ్యింది నన్ను వదిలేయండి, ఇప్పుటి వరకూ మీరు చూపించిన సినిమా చాలు, దానికి టిక్కెట్టు చార్జీలకింద ఈ వంద ఉంచండి", అని నవ్వుతున్న గాంధీగారి నోటును ఒక్కసారి ప్రేమగా చూసుకుంటూ… "గాంధీగారు..!!, మీపని బెస్టు…సార్..! పదినోటు అనిలేదు, వెయ్యినోటు అనిలేదు.. ప్రతిచోటా.. ప్రతిదానికి కామెడీ సీనులా నవ్వుతుంటారు…,మా పరిస్ధితిచూసారా?? ఏంచేస్తాం బేడ్ టైం సార్..", అని మనసులో అనుకుంటూ…మడతపెట్టి పోలీసుచేతిలో పెట్టాడు.

ఇక్కడ ఇంకేం పాపాలు చూడాలో అనుకుంటూ ఆఫీసుకి చేరుకున్నాడు. "ఇక మిగిలిందేముంది.. బాస్ చేత.. ఫుల్ @#$, అని రాసివుంది కదా ధినఫలంలో అదే తరువాత సీన్", అనుకుని చెమటలు తుడుచుకుంటూ లోపలికెళ్ళాడు.

"బాస్ పిలుస్తున్నారు సార్ మిమ్మల్ని..", అని చెయ్యిఅడ్డుపెట్టుకుని నవ్వుతూ పిలిచాడు ప్యూను.

"అనుకున్నా ఈ గొర్రె మొహంగాడు ఇంకా రాలేదేంటా", అని మనసులో అనుకుని…
"సరే వస్తున్నా!!!", అని టెన్సన్ గా బాస్ రూమ్లోకి వెళ్ళాడు…

నిజం చెబితే ఎలాగూ ఆయన నమ్మడు తెలిసిందే కదా!!, ఎవరికో ఏక్సిడెంటు అయితే రక్షించా అని ఎదో కధచెప్పి సీన్ సీరియస్ చేద్దామా?, లేక డబ్బులుపోయాయి అని ట్రాజెడీ చేద్దామా? ఎలాచెప్పాలి.. ఏం చెప్పాలి అని కధ అలోచిస్తూనే కేబిన్ డోర్ తట్టి లోపలికి వెళ్ళాడు.

వెళ్ళడంతోనే బాస్ మొహంలో చిరునవ్వు కనపడే సరికి. వెంకటెశా.... శ్రీనివాసా.. ప్రభో..... అన్న బ్యాక్ గ్రవుండ్ సాంగ్ తో... వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్నట్లు ఒక్కసారి ఆయన్ని చూసి మనసులో దణ్ణంపెట్టుకున్నాడు.

"ఇదిగో తాగవయ్యా!", అంటూ రడీచేసిన పెట్టిన వేడి వేడి కాఫీ చేతికిచ్చి.. "నీకో గుడ్ న్యూస్!!, మనకు ఆ కాంట్రాక్ట్ దక్కింది…, అంతా నీ కష్టానికి ఫలితమే", అన్న బాస్ మాటలు నమ్మలేకపోయాడతను. వేడి వేడి కాఫీ నెత్తిమీదపోసి కలో నిజమో టెస్ట్ చేద్దామనుకున్నాడు కానీ, కల కాకపోతే… గుడ్ న్యూస్ చెప్పినాయన నెత్తిమీద వేడి కాఫీ పోయటం బాగోదేమోనని కాస్త ఆలోచించాల్సి వచ్చింది, అసలే బాస్ ది బట్టతల పాపం.

నవ్వుతూ.. "ధ్యాంక్స్ సార్!", అని షేక్ హ్యాండిచ్చాడు.

బాస్ రూమ్ నుండి బయటకు వచ్చేసరికి, ఆనందం తట్టుకోలేక, కాళ్ళుతేలిపోగా, వెనుక జాతర డప్పులశబ్ధంతో పులివేషంవేసి డ్యాన్స్ చేసినంత పనిచేసాడు.

"ధినఫలంలో వ్రాయనేలేదు ఇది.. ఎలా జరిగింది", అని మనసులో ఎదో పీకుతున్నా.. ఆనందం అవదులు దాటి…కవర్ చేసేసింది. "అయినా మనమంచికే జరిగిందిలే", అనుకున్నాడు. ఇక ఆ రోజంతా త్వరత్వరగా గడిచిపోయింది.

తరువాతరోజు పేపర్ చదవడంకోసం పొద్దున్నే లేచాడు. తలుపుతీసి పేపరు చేత్తో అందుకుని, ఆవులిస్తూ పేజీలు తిరగేసాడు.

రెండు పేపర్లు కనబడేసరికి చికాకుగా మొహంపెట్టి చూసాడు.


ఒకటి నిన్నటిది, ఇంకొకటి ఆ రోజుది. ఇదేంటి నిన్నటి పేపరు మళ్ళీ ఇచ్చాడు. వీడికి మతిపోయినట్టుంది, అని అనుకుని

నిన్నటి పేపర్ ప్రక్కన పడేసి, ఈ రోజు పేపర్ చదవడం మొదలుపెట్టాడు.

చదవడం పూర్తిచేసి బెడ్ పై పడి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. ఆరోజు సెలవురోజు కావడం వలన ఆఫీసు టెన్సన్ లేదతనికి.

సడెన్ గా గుర్తొచ్చింది…, "నిన్నటి పేపర్ ఎందుకిచ్చాడు?, ఒకవేళ నిన్న తీసుకురాలేదా?, అలా ఐతే.. నిన్న చదివిన పేపర్ ఎక్కడిది???", అని…, బెడ్ పైనుండి క్రిందపడి మరీ పరుగుతీసాడు.

పేపర్లు చూసి నిద్రమత్తుఎగిరేలా నవ్వుకున్నాడు, నిన్న అతను చదివింది క్రిందటి వారంపేపర్…అని తెలిసుకుని.

Related Posts Plugin for WordPress, Blogger...