29, డిసెంబర్ 2007, శనివారం

నేనూ అమెరికా.. పోతా..!!!



నో...., నో... ,నోనో....

అని పెద్ద కేకపెట్ట.. నిద్రలోంచి లేచాడు.. బాలు.. అసలు పేరు బాలసుబ్రమణ్యం...

వృత్తి పరంగా సాఫ్ట్వేర్. ఇంజనీర్...H1B వీసా పై అమెరికా వచ్చాడు...
వచ్చి. నాలుగు నెలలైంది... వీసా ఇచ్చిన కన్సల్టెన్న్సీ ద్వారా.
ఉద్యోగం కోసం వేట సాగించాడు... తనతో వచ్చివారందరికీ జాబ్స్ వచ్చేసాయి..కానీ పాపం బాలూ కు.. ఇంకా రాలేదు... ఇంకా రూపాయి కాసులు.. భయంకరంగా కలలోకి రావటంతో.. నిద్రలోంచి ఉలిక్కి పడి లేచాడు..

బయట విపరీతమైన మంచు వెళ్ళాలంటేనే చలికి వణుకు.. , ఆ వణుకుతోపాటు... ఇంటర్వూ భయం.. అన్ని వణుకులు ఎక్కువయ్యాయి..

అసలు MCA చేసిన తరువాత కూడా జాబ్ కోసం తిరిగినప్పుడే.. ఇంటర్వూ అంటే.. వణికి పోయేవాడు... ఏదో టైము బాగుండి... చిన్న కంపెనీలో జాబ్ కొట్టి... నాలుగేళ్ళు.. పనికి దొరక్కుండా.. నెట్టుకొచ్చి.. ఎనిమిది కంపెనీలు మారాడు... చఛా.. ఏంటో బ్రతుకు.. ప్రతి ఒక్కడికీ లోకువ అయిపోయాను.. అందరూ.. చక్కగా అమెరికా చెక్కేస్తున్నారు..
నేనెందుకు ట్రై చెయ్యకూడదు...అని అనిపించింది..

అప్పట్నుండీ డాలర్లే కల్లోకి రాసాగాయి..., రూపాయి కనపడితే చాలు.. చిరాగ్గా మొహం పెట్టేవాడు...

ఇంకెన్నాళ్ళీ.. మెతుకు.. బాధ.. చక్కగా.. బ్రెడ్ జామ్.. బర్గర్.. తింటూ.., డాలర్స్.. లెక్కపెట్టుకోక.... అనుకునేవాడు..., అందరితోపాటుగా..తనూ.. వీసాకి అప్లై చేసాడు.. లక్కీగా లక్కీడ్రాలో వీసా కొట్టాడు...

ఇక మనోడికి... కాలు భూమి మీదలేదు... కళ్ళలోకి కొత్తగా.. డాలర్.. సింబల్స్.. వచ్చి మెరవసాగాయి..., అమెరికా గురించి.. అక్కడ... అలవాట్లు.. పరిస్ధితులగురించి... అందరికీ ఫోన్ చేసి మరీ.. కనుకున్నాడు..., దానికి తగ్గట్లు... ఇండియాలోనే.. నడుచుకొవటం.. మొదలుపెట్టాడు...

పొద్దున్నే ఆఫీసుకొచ్చేసి... ఆరవగానే.. చంగున లేచి.. ఇంటికి.. బయలుదేరటం మొదలుపెట్టాడు...

ఏంటిరా వెళ్ళిపోతున్నావ్ అంటే.. US లో ఇంతే.. ఇంతే.. అని.. చెప్పేవాడు.. అలా రెండు.. రోజులు చూసి ఓపికపట్టిన ప్రోజెక్టు మేనేజరు.. ఆగలేక.. ఏంటిది అని అడిగేసాడు.. తడబడకుండా.... విషయం చెప్పేసి.. తరువాత రోజు నుండి.. నచ్చిన టైముకురావటం మొదలుపెట్టాడు...

ఏ షాపింగ్ కు వెళ్ళినా.. ఏం చేసినా.. డాలర్స్ తోటి కంపేర్.. చేసి..
ఓస్.. ఇంతేనా.. నాలుగు డాలర్లే.. అని.. పెదవి విరిచి.. కటింగ్స్ ఇవ్వటం చూసి.. తోటి ఉద్యోగులంతా... కాస్త.. చాటుగా నవ్వుకోసాగారు... అయినా మనోడు ఎవ్వరినీ లెక్కచెయ్యకుండా.. అమెరికా సోది చెప్పడం మాత్రం మానేవాడు కాదు...

ఫ్రోజక్ట్ మేనేజర్.. పిలిచి... వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది.. నువ్వు.. చెయ్యకపోతే.. ఫో.. చేసే వాళ్ళని చెడగొట్టకు.. అని.. అయినా పట్టించుకోకుండా..

వాడితో.. నాకేంటి..బే.. నేను అవుతా.. మేనేజర్.. After 5 years US return...జాగ్రత్త.. వాడేనా ఏంటి... బోడి ప్రాజెక్టు మేనేజర్... అని.. నవ్వుతున్న కొలీగ్స్... దగ్గర.. గొప్పలు చెప్పుకుని కవర్ చేసుకున్నాడు...

ఇంటి దగ్గర నుండి వాళ్ళ నాన్న ఫోన్.. ఏరా బాబూ ఎలా ఉన్నావ్.. ఈ మధ్య అసలు ఫోన్ చెయ్యటంలేదు.. అని...,

"లేదు డాడ్.. నేను చాలా బిజీ" అనేసరికి వాళ్ళ నాన్న షాక్ తిన్నాడు.. "ఏందిరా ఇదీ.. కొత్తగా "నాయనా" అనడం మాని "డాడ్" అని పిలుస్తున్నొవ్.. ఏందో ఈ కొత్త పిలుపో..", అని వాపోయాడు..

అమెరికా వెళ్తున్నా డాడ్... ఇంకొక రెండు నెలల్లో... ఫ్లై అవుతా.. అని.. గొప్పగా చెప్పుకున్నాడు...

"ఒరే.. మరీ ఉద్యోగమూ..??", అని అమాయకంగా అడిగాడు.. బాలు చెప్పింది విని... భయపడ్డాడు.. ఒరే.. అక్కడ నువ్వు ఇమడగలవా??, కష్టమేమోరా.. ఎందుకురా.. సుఖంగా ఉన్న పేణాన్ని.. కష్టాల్లో పెట్టుకుంటావ్..?

ఇక్కడ.. ఈ ముప్పవేలు జీతం సరిపోతుంది కదరా..?, అప్పుడప్పుడు మమ్మల్ని చూడటానికి రావచ్చును కూడా..!!, ఎందుకురా.. ఇక్కడే ఉండిపోవచ్చుగా...? అని బ్రతిమలాడాడు నాయన..

తరువాత అమ్మ మాట్లాడి... కొత్తగా వచ్చిన పెళ్ళి సంభందం గురించి చెప్పింది..., పెళ్ళిచేసుకుని ఇక్కడే ఉండిపో బాబూ అని బ్రతిమలాడింది...

లేదమ్మా ఇంకా సెటిల్ కావాలి... డబ్బులు సంపాదించాలి.. అని మాట దాటేసాడు.. బాలు.. కాదురా బాబూ డబ్బే కావాలంటే.. వాళ్ళకి చాలా ఉంది ఒక్కతే కూతురు.. బాగానే కట్నం ముట్టజెప్పుతార్రా అని.. ఎర చూపి బ్రతిమలాడినా.. మనోడు లొంగలేదు..

"ఛా... డాలర్స్.. గుట్టలు పోసి.... లెక్కపెట్టుకోండిరా అంటుంటే... చీప్ గా.. చిల్లర రూపాయిలుగా పొయ్యి.. లెక్కపెడతా అన్నాడంట.. ఎనకెటికెవడో .. డాలర్ వేల్యూ మీకు తెలియటంలేదమ్మా..., నాకు అక్కడ.. నెలకు అన్ని ఖర్చులు పోగా.. లక్షన్నర మిగులుతుంది తెలుసా??, తిరిగొచ్చి... పెళ్ళిచేసుకుంటే.. డబుల్ కట్నం వస్తుంది.. నీకేం తెలియదులే నా ప్లాన్స్ అన్నీ...నే చూస్కుంటా", అని ఫోన్ కట్ చేసాడు...

$$$$$$$$$$$$$$$$$$$$

మొబైల్ ఫోన్ మోత విని... ఫ్లాష్ బ్యాక్ నుండి.. వెనక్కు వచ్చాడు..., ఆ రోజు శనివారమేమో.. రూమ్మేట్స్.. రూమంతా డిస్కోతెక్ చేసారు... ఫుల్ సౌండుతో ఇంగ్లీష్ పాటలు పెట్టి... డాన్సులు.. పెడబొబ్బలూ... ఒరే ఆపండ్రా బాబూ... ఎదో ఇంటర్వూ కాల్ లా ఉంది... అని బ్రతిమలాడుకుని.. మూలకెళ్ళి ఫోన్ లిప్ట్ చేసాడు..., బాలు కళ్ళలో డాలర్ సింబల్స్ మళ్ళీ మెరిసాయి... రెండు రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వూలో సెలక్టయ్యావని.. సోమవారంనుండి.. వచ్చి జాయిన్ అవ్వమని.. కన్సల్టెన్సీవాడు.. కాల్ చేసి చెప్పాడు...

బాలూకు చాలా ఆనందంగా ఉంది..., కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు లేదు...
పొద్దున్నే 6.30 కి లేచి రడీ అయ్యి.. ట్రైన్ పట్టుకుని.. 8.30 కల్లా ఆఫీస్ లో ఉండాలి... కొత్త కంపెనీ కొత్త ప్రాజెక్ట్ అంటే.. మన ఇండియాలోలా ఒక మూడు నెలలు.. టైమ్ పాస్ చేయొచ్చు అనుకున్నాడు.. కానీ వెళ్ళిన మొదటి రోజే కనీసం ఇంట్రడక్షన్ అయినా లేకుండా పని.. ఇచ్చాడు.. ఒక తెల్లోడు..

ప్రక్కనే కూర్చుని.. చేస్తున్న పని చూడసాగాడు.. ఇక బాలూకు చెమటలు.. బీపీ..., ఆ తెల్లోడు యముడు లా తగిలాడు... ఎనిమిది గంటల్లో కనీసం ఒక అరగంట కూడా బయటకు వెళ్ళడు... ఒక్క ఐదు నిముషాలు టీ.. అదీ అక్కడికే తెచ్చుకుని తాగుతాడు...

ఏదన్నా తప్పు చేస్తే... చాలు.. What hell you are doing?? అని పెద్ద క్లాసు పీకటం మొదలుపెడతాడు..., మనది బానిస బ్రతుకేరా అక్కడ.. అని ఇంతకు ముందు ఫ్రండ్స్ చెప్తుంటే.. వినలేదు..., ఇప్పుడు అర్దమౌతుంది..ఇది.. బానిస బ్రతుకుకంటే ఎక్కువ అనిపించింది బాలూకు..

యముడు.. వెనకే కూర్చుంటే.... అన్నీ తప్పులే.. రోజంతా క్లాసులే..

ఓర్నాయనో... చిన్నప్పుడు.. లెక్కల మాస్టారు.. బోర్డుపై లెక్క ఇచ్చి బెత్తం పట్టుకుని.. వెనుక నిలబడినట్లుంది..
దానికైతే..ఒక గంట ఓపికపడితేనో.. ఓ నాలుగు.. తింటేనో సరిపోయేది... బాబోయ్.. ఇది నరకం.. ఇదేం ఖర్మరా బాబూ.. అనుకున్నాడు బాలు.

రూమ్ లో ఉండి.. చక్కగా నచ్చినవి వండుకు తినేవాడు.. ఆఫీస్లో ఆ బ్రెడ్లు, నానా గడ్డి.. తినలేక.. ఒక్క వారం రోజులకే... బాలూ కళ్ళులోపలికి పోయి.. పిచ్చివాడిలా తయారయ్యాడు..., ఈ డాలర్.. మూటలు దేవుడెరుగు.. ఒక నెల ఉండి.. ఎలాగోలా ఇండియా చెక్కేయాలి అనుకున్నాడు...

నెలతరువాత... జీతం చూసుకున్నాడు... 1000 డాలర్సే.. ఎకౌంటులో చూసుకుని... దిమ్మ తిరిగి.. కన్సల్టెన్సీకి ఫోన్ చేసాడు...

ఈ నాలుగునెలలు... తనని.. పోషించినందుకు..., జాబ్ చూపించినందుకు పర్సంటేజ్ క్రింద.. అన్నీ పోగా.. మిగిలింది ఇంతే... ఇంకా.. ఒక సంవత్సరం వరకూ ఈ జీతమే అని వాడు.. చెప్పిన సమాధానం చూసి... నేలపై చతికిల పడ్డాడు....

అతని.. కళ్ళలోంచి డాలర్ సింబల్స్ కూడా.. క్రింద పడ్డాయి...

27, సెప్టెంబర్ 2007, గురువారం

స్వరరాగ గంగా ప్రవాహం...



 
ఆఫీసునుండి.. అలసిపోయి.. వస్తూ.. హెడ్పోన్స్ లో ఒక మంచి పాట వింటున్నా...
ఆహా.. ఎంత బాగుంది.. అని ఒక్కసారి నా ఈ రోజు టెన్సన్స్ అన్నీ మరచిపోయా.. అలసిన
మనసుకు ఒక చెట్టు నీడలా ఆపాట తోచింది.. కాసేపు విశ్రాంతి కోరింది..
సేద తీరాను..
"సాగర సంగమమే.. ప్రణయ సాగర సంగమమే...." , (సీతాకోక చిలుక చిత్రంలోనిది..)
ఎంత చక్కటి పాట.. ఏముందో తెలియదు ఈ పాటలో.. నేను వరుసగా.. వందసార్లు.. విన్నా
ఇంకా వినసొంపుగానే ఉంటుంది..., ఈ పాటలో వీణతో పలికించిన సంగీతం..
ఎంత ఎమోషనల్ గా ఉంటుందో.. చెప్పలేను...., వింటుంటేనే  మదిలో కదులుతున్న ఏవో భావాలు...
కెరటాలుగా...అనిపిస్తాయి.. పాటకు తగ్గట్టు బాలు పాడిన తీరు.. ఇంకెవరూ సాటిరారు అనిపిస్తుంది..
 
నేను ఎంత  చికాకులో ఉన్నా, అలసటగా ఉన్నా సరే వినగానే ప్రాణంలేచొస్తుంది...
మహానుభావుడు.. ఇళయరాజా.. ఎలా చేసారో కానీ.. దీనికి..స్వరకల్పన..
నిజంగా మెచ్చుకోకుండా ఉండలేం. ఇంకా చెప్పుకోదగ్గ పాటలు చాలానే ఉన్నాయి
 
ఆయన మనసులో ఉన్న భావాలను సంగీతంలా పిలికిస్తారేమో..తెలియదు..
ఆ సంగీతంలో కూడా భావాలు పలుకుతుంటాయి...
పాడేవారు అవసరంలేదు అన్నట్లు..గాయని/గాయకుడు పాడలేని శృతిని, భావాన్ని.. 
అందులో ఉన్న వాయిద్యం పలికిస్తుంది...,
 
నాకు కాస్త ఎమోషనల్ సాంగ్స్ అంటే ఇష్టం,  పాటను ఎదో వింటున్నా అన్నట్లు కాకుండా..
పాటలోని ప్రతీ వాయిద్యం పలికే తీరును...చాలా శ్రద్దగా.. పరిశీలించడమంటే ఇష్టం...
 
ఆయన పాటల్లోని వాయిద్యాలు... ఇలా వచ్చి కూసి అలా వెళ్ళిపోయె కోయిలలా ఉంటాయి... అది నాకు
బాగా నచ్చుతుంది..., ఆ పాటతో పాటుగా వింటే.. అవి కోయిల కూతలా.. వినసొంపుగా ఉంటాయి...
కొన్ని కొన్ని స్వరాలు.. విడిగా వింటే.. చిన్నప్పుడు కొబ్బరాకుతో చేసిన బూర.. సరిగ్గా పలుకుతుందోలేదో అని
సరిచూసుకున్నట్లుండి చిలిపిగా నవ్వొస్తుంటుంది.. కానీ అటివంటి అపస్వరాన్ని కూడా స్వరకలయికతో.. ఒక
సుస్వరంగా మార్చగల ప్రతిభ నేను గమనించినదానిని బట్టి..  ఒక్క ఇళయరాజాదే..
 
సంగీతానికి చాలా పవరుంది... ఎటువంటి భావం అయినా వ్యక్తం చేయటం సంగీతంతో సాధ్యం...
ఇది నేను నమ్ముతాను...
ప్రశాంతమైన వాతావరణంలో కనులు మూసుకుని.. చక్కటి పాటని వింటూ, స్వరాలను గమనిస్తూ
ఆ స్వరాలకనుకూలంగా... మనసుని నాట్యంచేయిస్తుంటే.. ఆహా.. ఇంతకన్నా ఆనందం ఉంటుందా..!!
ఏమో నాకైతే... ఏదీ అంత ఆనందాన్ని ఇవ్వవనిపిస్తుంది...
 
సంగీతం ఎలా పుట్టిందో.. ఎలా పెరిగిందో చెప్పటానికి నా వయసు.. నా జ్ఞనం సరిపోవుకానీ... మనకు అదొక
వరమే..., ఎప్పట్నండో నాకు నేర్చుకోవాలని కోరిక..., సమయం కుదరక నెట్టుకొస్తున్నా.. కానీ కనీసం
చిరు ప్రయత్నమైనా చెయ్యాలి.. ఏదోక వాయిద్యం నేర్చుకోవాలి..
 
అబ్బా..ఆ అమ్మాయి చూడు ఎంత బాగా పాడుతుందో.. ఆహా ఆ అబ్బాయి.. గొంతు నిజంగా వరం..
అనుకుంటుంటాం.. మనకు పాడే ప్రతిభలేదు.. గొంతుదేవుడివ్వలేదు అని బాధపడుతుంటాం...
ఖచ్చితంగా.. ఇలాంటి కోరికలను.. ఏదోక సంగీతవాద్యాన్ని నేర్చుకుంటే తీర్చుకోగలం.. అని అనిపిస్తుంది..
 
ప్రియుని జాడ వెతుకుతున్న ప్రియురాలిని... నేను..
ప్రేమలోన దాగిఉన్న అమృతాలను తాగాలని.. ఆశగా ఎదురుచూస్తున్న
ప్రియసఖినే నేను, అని ప్రేయసి ప్రియుని కోసం రాసుకున్న పదాలు..
 
మధురసరాగంలో మృదుమురళిని మ్రోగించగ మదిలోన కదిలేటి.. భావమై
చెలియా తాళంలోన మనసును పలికించగ హృదయంలో వినిపించే రాగమై
 
లాంటి.. పువ్వులంటి.. పదాలను.. స్వరమాలలో కూర్చి.. ఒక పాటగా మార్చితే...
ఆ పదాలలోని కనిపించని అందాలు.. బయటపడి.. భావానికి మరింత వన్నెతెస్తాయి..
 
సంగీతానికి.. అంత వన్నెవుంది..మరి..,
ఎన్నో రీతులుగా.. ఎన్నో దారులలో..., వైవిధ్యభరితముగా... కాలానుగుణంగా సంగీతం మారుతున్నా...., దానిపై ఉన్న ప్రేమను వీడక.., మక్కువ వదలక,  ఇంకా సంగీతానికి జీవంపోస్తూ.. అందరినీ అలరిస్తున్న సంగీతకారులకు..., మహానుభావులకు... వందనం అభివందనం...
ఆ స్వరరాగగంగా ప్రవాహంలొ స్నానాలు చేసి తరిస్తూ ఆనదిస్తున్న శ్రోతలకు కూడా...!!!

18, ఆగస్టు 2007, శనివారం

ప్రణయమా.. మరుమల్లే పూలతోటలో.. ఘుమఘుమా..



ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే....
కాకితొటి కబురు చాలులే.. రెక్కలుకట్టుకుని వచ్చి వాలనా...

నీ రాకకోసం.. వేచివున్న ఈ మనసుని అలుసుగ చూడకనీ...
అంటూ.. ఇలాంటి సందేశాలతో రాసుకున్న ప్రెమలేఖలు...
అవి ఇప్పటి కాలంలో లేకపోయినా..

ప్రియునికై వేచి చూచు ప్రియురాళ్ళు..
ప్రియురాలు లేని విరహ వేదనతో వీగిపోయే.. ప్రియుళ్ళు...

ఇవి ఏ కాలంలో అయినా మాములే.. కానీ... ఎదురుచూపులో ఉన్న ఆనందాల్ని...
ఆమెను తాకిన గాలిని తాకినా చాలును.. అన్న కాంప్రమైజ్ లను..పొందటానికి..

ఎన్నో రీతులు.. దారులు ఉన్నాయి... కాలంతో పాటుగా..అవి.. మారుతున్నాయి...

ఇప్పుడు.. ఆకాశరామన్న ఉత్తరాలు.. లేకపోవచ్చు.. కానీ..
ఎసెమ్మెస్ లు.. ఈ మెయిల్లూ... సెల్ ఫోన్లూ... వీడియో చాట్లూ.. ఉన్నాయి..

మాటరానిమౌనమిదీ.. మౌనవీణగానమిదీ... అని.. మౌనంగా పలికే..
మిస్ట్ కాల్స్ ఉన్నాయి... ఒక్క మిస్డ్ కాల్ లో ఎన్నో భావాలు పలుకుతాయి...
నేను నీకోసమే ఆలోచిస్తునారా.. రోమియో... అంటే..
నీ ఆలోచనతోనే ఉన్నారా జూలియట్...అని.

చాటింగ్లో స్టేటస్ మెసేజ్ లో కూడా.. ఎన్నో భావాలు.. పలుకుతున్నాయి..
స్టేటస్ లోనే తిట్టుకుంటూ.. మళ్ళీ.. మాట్లాడటం మొదలవగానే..
చాటింగ్ చేసుకుంటూ... అలకలు.. చిలకలు..
కొమ్మకొమ్మకో సన్నాయి రాగాలు కూడా సాధ్యమే..

ఎదురు చూపుల కన్నులకీ.. కాటుక రేఖే.. ఆభరణం
పెదవిదాటని మాటలకీ..మౌనరాగమే.. ఆభరణం..

సుదూర తీరాలు.. ఏడేడు.. సాగరాలు.. అవతల ఉన్నా..
అమె ఎప్పుడు ఆన్ లైన్ కి వస్తుందో...

అతనికి తెలుసు... అతనెక్కడ ఏ క్షణాన ఏంచేస్తుంటాడో...
ఆమెకు తెలుసు.. అంతా.. టెక్నాలజీ మహిమే.. మరి..

మనసులు దూరం అయ్యే కొద్దీ దగ్గరవటం అంటే ఇదేనేమో...

జాబిల్లి కోసం ఆకాశమల్లే... వేచాను నీ రాకకై... అని..
ఎదురుచూపులోనే.. ఆనందం ఉందెమో..

సుమం ప్రతి సుమం సుమం... క్షణం ప్రతిక్షణం క్షణం..అని..
ప్రియురాలు తండ్రి ప్రక్కన ఉన్నా ధైర్యంగా ప్రియుడు ఐ లౌ యు చెప్పగలడు...,
ఈ రోజు మ్యాట్నీ షో కి రడియా.. అని అడగగలడు... ఒక చిన్న ఎసెమ్మెస్ తో...


నువ్వంటేనే.. కోపం వస్తుంది.. అసలు నువ్వు నాతో మాట్లాడకు పో...
అని చెప్పాలనుకుంటే.. ఒక బ్లాంక్ ఎసెమ్మెస్....

వయ్యారిగోదారమ్మా ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం...
హే.. నేనిప్పుడు గోదారిలో. ప్రయాణం చేస్తున్నా తెలుసా...
ఆ చల్లని గాలి.. గోదారి గల గల ఎంత అందంగా ఉన్నాయో.. చూస్తావా..?!!
ఇదిగో చూడు కాదేది.. అసాధ్యం.. అని ఒక ఎమ్మెమ్మెస్...


చేయిజారిన చందమామను.. అందుకోగలనా..
దూరమైన నా ప్రేమజ్యోతిని చేరుకోగలనా..
నాప్రేమతో తన ప్రేమనే గెలుచుకోగలనా..

నువ్వంటే.. ప్రాణమనీ.. నీతోనే లోకమనీ..
నీ ప్రేమేలేకుంటే.. బ్రతికేది ఏందుకనీ..
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా....
ఇలాంటి ఎవరికీ చెప్పుకోలేని వాటికోసం బ్లాగులున్నాయి...

కన్న కలలిక ఎందుకో... కన్నె కలయిక కోరుకో... అని..
అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయటానికి.. ఆర్కుట్ ఉంది...

ఓ ప్రియతమా.. బదులీయిమా.. ఏచోట నీవు వున్నా..
ఈ పాటనై నలువైపులా నీ జాడ వెతుకుతున్నా..
అంటూ చెలికి.. డెడికేట్ చేసేందుకు... ఎఫ్ ఎమ్ రేడియో ప్రోగ్రాములున్నాయి...
కాలం మారినా.. ప్రేమ రసం ఒక్కటే... ఎన్ని మారినా... ఎంత మారినా..
ఎక్కడైనా... సరిగంగ స్నానాల ఒణుకు ఒక్కటే... అన్నట్లు..

రూపం మారినా.. ప్రణయమా.. నువ్వు..మారనే లేదు...

2, ఆగస్టు 2007, గురువారం

అనువుగానిచోట... ఆవకాయన్నం..


 




గాంధీ తాత ఎందరికో ఆదర్శం.. ఇంకెదరికో... అభిమానం...
ఆయన సిధ్దాంతాలను

ఇప్పటికీ పాటించె మహానుభావులున్నారు..

పైకి చెప్పుకోకపోయినా చేసి చూపించకపోయినా..

అలానే.. తమకు తోచినవిధంగా.. పాటించేవాళ్ళున్నారు అంటే..

అది గాంధీ గొప్పతనం కాక ఇంకేంటి చెప్పండి?

నేను గాంధీకి అంత అభిమానిని కాకపోయినా...

ఆయన జీవిత చరిత్రను వడపోనసినవాడిని

కాకపోయినా.. ఆయన ఓర్పు.. గురించి చదివినపుడు,

స్నేహితులు చెప్పుకుంటున్నప్పుడు విన్నప్పుడు

కాస్త మనసులో ఆయన అంటే అభిమానం చేరుకుంది...

ఈ కాలంలో గాంధీ ఉండి వుంటే?? ఎలా ఉండేదో..

అని అనుకున్నా ఒకప్పుడు...

ఉండుంటే..ఆయన ఈ దేశాన్ని మార్చడంమాటేమో కానీ..

జనాలతో పడలేక ఆయనే మారిపోయేవాడేమో..

అవును.. నిజం... అలానే జరిగుండేది...

ఏ స్కాముల్లోనో..., మోసాల్లోనో ఇరికించేసేవారు...

నా పార్టీలోకిరా అంటే మా దాంట్లోకిరా అని..
చంపేసేవారేమో రాజకీయనాయకులు..

వాళ్ళ బాధపడలేక.. ఆయన ఏ కొత్తపార్టీనో
పెట్టుకోవాల్సి వచ్చేదెమో... కూడానూ..

గాంధీ చదివింది మా ఆనుభంధ సంస్ధల్లోనే.. అని కాలేజీవాళ్ళు..
డప్పువేసి బిజినెస్..

గాంధీవాడేది.. మా హెయిర్ ఆయిల్ అని.., మా సబ్బు..
అని.. వేరే కంపేనీలవాళ్ళు..

ఇక అవి తట్టుకోలేక.. ఆయనే.. ఒక కొత్త ఏడ్..లో నటించెవారేమో...

అదిగో గాంధీకి.. అక్రమార్జన ఎక్కువైంది.. అని నిలదీయివారొకరు..?

గాంధీకి నేను మొదటి భార్యను అని.. రుజువులు చూపించి.. కోర్టుకెక్కి..

రచ్చకీడ్చి... పాపులారిటీ కోట్టేవాళ్లూ.. అవి కధలుగా..
కధనాలుగా చూపించి బిజినెస్ చేసే వాళ్ళూ..

అమ్మో.. చాలా బిజినెస్ పోయింది పాపం గాంధీలాంటి..
మంచి వ్యక్తి మనకిపుడు లేకపోవడం వలన...

శంకర్ దాదా జిందాబాద్ సినిమాకి వెళ్ళాకా అనిపించింది..

ఆయన ఇప్పటి కాలంలో లేకపోవటమె ఎంతో.. మంచిదైంది అని...

సినిమా మొదలైన దగ్గరనుండి.. ప్రక్కనున్నవాడు ఏదో నసుగుతున్నాడు..

ఎంటో ఆ నసుగుడు అర్ధంకాలేదు..

కాస్త సమయం గడిచాకా.. అర్ధం అయ్యింది..

ఆ నసుగుడు కి కారణం పాపం.. గాంధీ అని...

అదేంటి.. గాంధీగారి తప్పేంటి అనుకుంటున్నారా?

చిరంజీవి.. ఎమోషన్ తెచ్చుకుని...
మంచి ఫైట్ చేసే టైంలో అయన రావటమే
అయన చేసిన తప్పు పాపం...

వచ్చాడ్రా..బాబూ... ఇంకెముంది.. చంపుతాడు..
క్లాసులు పీకి.... అని.. రానురాను.. నసుగుడు కాస్తా..
పెద్ద కేకలయ్యాయి.. పచ్చిభూతులు కూడా..

గాంధీ ఉండి ఉంటే.. హే రామ్.. అనేవారేమో.. వినలేక..

మరి చిరంజీవిలాంటి అగ్రహీరో ఏ ఉద్దేశ్యంతో ఆలాంటి సబ్జక్టును..
తీసాడో తెలియదు కానీ..

ఒక ఇమేజ్ చట్రంలో వాళ్ళను చూసే ప్రేక్షకుడు మాత్రం
ఆ ఉద్దేశ్యంతో తీసుకోలేదేమో అనిపిస్తుంది...

గాంధీ ఇప్పటి మనిషయితే... ఖచ్చితంగా..
జనాలు ఇంటిపై దాడిచేయటమో... రాళ్ళువిసరటమో చేసేవారు....

పెద్ద ప్రమాదం తప్పినట్లే అయితే!!!..

ఆయన ఇప్పుడు.. లేకపోవడమే మంచిదైంది... లేకపోతే..

గాంధీ సిధ్దాంతాలు పేరు చెప్పుకుని.. రాద్దాంతాలు.. చూడలేకపోయేవాళ్ళం...
భరించలేక మనమందరం గాడ్సేయవాదులయ్యేవాళ్ళం...

దీనికి మాతృక.. హిందీలో.. లగేరహో మున్నాభాయ్..
బాగానే.. పండింది.. నేను ముంబయిలో ఉన్నప్పుడు..
జనాలు కూడా బాగానే ఉంది అనుకున్నారు..

అవునులేండి.. సినిమాకి ముందు జనగనమన గీతం వేస్తే...
ఇప్పటికీ నిలబడి.. గౌరవాన్ని తెలిపే.. ప్రజ ఉన్న చోటు అది...
కాస్త కాకపోతే కాస్తయినా నచ్చుతుంది..

నచ్చకపోయినా గాంధీని తిట్టేంత ఉండదు అని చెప్పగలను...

ఏదైనా అంతే... అనువుగానీచోట... ఉంటే.....

రాక్.. పాప్.. మస్తుగున్న పబ్బులో

రఘుపతి రాఘవ రాజారాం పాట పెడతాను అంటే..

జానాలు కొడతానికొస్తారు...

ఆ మధ్య పౌర్ణమి అని ఒక సినిమా వచ్చింది....

చాలెంజింగ్ నిర్మాత ఎమ్మెస్ రాజు తీసిన సినిమా అది..

ఎయిటీస్.. స్టోరీలైన్ ని.. ఇప్పడు తీద్దాం అనుకోడం చాలేంజింగే...
కదా మరి..

కానీ ఇళయరాజా.. లాంటి.. గొప్ప సంగీత దర్శకులు ఉన్న ఆ కాలం...

జయప్రద.... భానుప్రియ లాంటి మంచి నాట్యం తెలిసిన వారు ఉన్న ఆ కాలం...

సంప్రదాయల్ని.. తెరకెక్కించి...అందరూ శెభాష్ అనేలా చేసే దర్శకులున్న ఆ కాలం...

ఇప్పుడు రావాలంటే.. ఎక్కడొస్తుంది....

సంగీతానికి దేవీశ్రీ న్యాయం చేసినా..

నాట్యానికి... ప్రభుదేవా.. న్యాయంచేసినా..

చార్మీలాంటి.. గ్లామరస్ అమ్మాయి.... చేత.. ఎన్నని..

వేయించగలరు స్టెప్స్?

ఒకవేళ.. ఎవరో భరతనాట్యం తెలిసిన అమ్మాయిని నూతన పరిచయం చేసి...

కధ నడిపిద్దాం అంటే.. కుదరదు.. జనాలకు నచ్చదని.. తెలుసు...

కానీ.. ఎదో.. కళకు. మన సహకారం చేస్తున్నాం అన్న తృష్ణ వాళ్ళను

ఇలాంటివాటికి.... పూనుకునెలా చేసినా...

ఇది.. కూడా.. అనువుకానిచోట... ఆవకాయన్నమే..


ఆఖరులో ఒకటి రాసారు ఆ సినిమాలో..

సంప్రదాయలను.. బ్రతికించండి.. అని..

అది చదివాకా అనిపించింది.. నిజమే.. బ్రతికించాలి.. అని...

ఈ కాలంలో.. సిద్ధాంతమైనా.. సంప్రదాయమైనా..
చెప్పినా చూపించినా.. అది..చచ్చినట్లే..

వాటిని బ్రతికించాలంటే... వాటిని.. అనువుగానిచోట..
ప్రదర్శించకపోవటమే మేలు...

పిజ్జా హట్ లో... ఆవకాయన్నం తింటే.. మరి..
అనువుగానిచోట ఆవకాయన్నమే.. కదా!!!

మార్పు అనేది.. జనాలలోనే రావాలి...
అది ఎప్పటికైనా వస్తుంది అని.. ఆశిద్దాం..

24, జులై 2007, మంగళవారం

మగువ తెగువా..? మగాడి లోకువా??




(జాగ్రత్తగా చదవండి... ఇబ్బందికర వాఖ్యాలున్న మాట నిజం...,
ఇందులోని సన్నివేశాలలోని.. పాత్రలూ , పరుష పదాలు..
ఉద్దేశించి రాసినప్పటికీ.. మగాళ్ళు/ఆడాళ్ళు.. అన్నప్పుడు..
అందరినీ ఉద్దేశించినవి కావు... కొందరికే పరిమితం..
అని మనవి.., అందుకే..
నవ్వుతూ చదవండి.... అదే ముఖ్యోద్దేశం...)
----------------------------------------

అంతా ఆడమయం..
జగమంతా.. మగువమయం...

ఎక్కడ చూసినా అడమయం... ఎటువైపు విన్నా.. అదే.. విషయం..
రోజులో సగంపైనే.. సమయం దీనికోసం...చర్చలు...

ఇంతకీ.. మగువకు అంత పెద్దపీట అవసరమంటారా?
(ఎవడు తయారు చేయించుంటాడు.. ఈ పీట అని అడక్కండి..)

ఎవరూ తక్కువ కానే.. కాదు..
ఎవరి మనుగడ వారిది.. విలువల్లో ఇద్దరూ ఒక్కటే..
ఎవరిని తక్కువ చేసినా బ్రతుకు బండి నడవదు..

అవసరం ఉన్న చోట తప్పులేదు.. కానీ..ఈ అనవసరపు..
విషయాలే.. అవసరమా??

టీవీ పెట్టామా..అంతే.. అమ్మాయిలేని ఒక్క యాడ్...ఒక్క సినిమా పాట
ఉండవ్... అయినా షేవింగ్ చేసుకునే రేజర్ యాడ్ కి
అమ్మాయికి సంభందం ఎంటో... నాకిప్పటికీ అర్ధంకాని విషయం..

అదొక్కటే.. మగాళ్ళకోసం అనుకున్నా.. కానీ
ఏ యాడ్ లోనైనా అమ్మాయిదే పై చేయి... సగం సగం బట్టలేసుకుని...
తిప్పుకుంటూ.. (పాపం మగాడు ఈ తిప్పుడు తిప్పలేడు..
లేకపొతే చాన్సివ్వడు...)

కొన్ని యాడ్సయితే... వాటి అర్ధం ఏంటో.. ఎందుకో కూడా తెలియని పరిస్ధితి...
కానీ అమ్మాయుంటుంది.. అందంగా...అంతే..

అసలు వచ్చిన అమ్మాయి.. ఆలోచించనిస్తే కదా!!.. అటుతిరిగి ఇటుతిరిగి
ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది...

ఇవి చూసి..ద్వజమెత్తి.. ఖండించిన మహిళా సంఘాలు... మళ్ళీ..
వాళ్ళే టీవీ నిండా... ష్...

ఏమో.. మగువలో ఉన్నది.. మగాడిలో లేనిది ఏంటో కనుక్కోవాలి..
ఏంటో అది అయస్కాంతమో.. ఎక్కడ దొరుకుతుందో వెతకాలి...

హా.. మరిచా.. ఎందుకూ.. మా ప్రక్కటీము.. హెడ్ ని అడిగితే తెలిసిపోతుంది...
ఎవడేది అడిగినా.. చిరాగ్గా మొహం పెట్టి.. చూసే..అతను..
వాళ్ళ టీములో అమ్మాయికి ఏదన్నా డౌటు రాబోతుందనగానే.. చటుక్కున సీట్లోంచి లేచి..
మే ఐ హెల్ప్ యు.. అంటాడు..., మిగతా మగపురుగులు.. ఏదన్నా చిన్న తప్పుచేసినా..
సునామీలా విరుచుకుపడి పెద్ద రాద్దాంతం చేస్తాడు..
అప్పుడు అనిపిస్తుంటుంది..

ఒరే.. నేను ఎర్రతోలున్న అమ్మాయిలా పుట్టుంటే..
నీకుండేదిరోయ్..., నా హీల్... క్రింద వేసి నలిపేద్దును నిన్ను.. అని...

రోడ్డుమీద వెళుతూనో.. రోడ్డు దాటుతూనో... ఎవడైనా మగాడు పడిపోతే..
ఒక్కడు రాడు... సాయం చేయటానికి... అదే అమ్మాయి అయితే..
ముసలితాత కూడా.. పరుగెత్తుకుని వచ్చి లేపటానికి ట్రై చేస్తాడు..

ఇక.. పక్కింటి.. పంకజం.. ఎదురింటి.. రాజీ కధలు మీకు తెలియనివి కావు..
ఇప్పుటి కాలానికి తగ్గట్టు... కాస్త మోడ్రన్ గా చెప్పుకుంటూ పోతే..
పక్క క్యాబిను.. అమ్మాయి.. వేసుకొచ్చే జీన్స్...ఒక పెద్ద ఇష్యూ..,
మనం చూసామా లేదా అన్నట్లు ఆమె..చూపులు...

మనం పనిలో పడిపోయి ఎక్కడ చూడమో.. అన్నట్లు..
బాధతో మెలికలు తిరిగిపోతూ.. పదే పదే..
అక్కడే తిరగటాలు.. ఏంటో మరి ఈ టార్చర్లు..,

వెబ్ సైటుకు నెంబరాఫ్ హిట్స్ పెర్ డే.. అన్నట్లు ఏమన్నా లెక్కుంటుందో ఎమో..
కృష్ణ కృష్ణా.. (బాబోయ్.. కాదు.. ) రామరామా.....
ఏమిటయ్యా నీ లీలలు..

ఇంతిచెయు వింతలన్నీ చరిత్రలో కధే కదా!!.. అన్నట్లు..
అమ్మాయి..కొంత చేసినా.. అది వింతే...

ఇదంతా.. మగాళ్ళ వీక్ నెస్ అనుకుంటాను.. నోరుతెరిచి చూడటం...
లీనియన్స్ ఇవ్వటం...వల్లే ఈ ఆగడాలు..

ముప్పయ్ మూడు శాతం కావాలి కావాలి.. అని పోరాడారు.. మహిళలు..
ఇప్పుడు.. మగాళ్ళు ఆ ముప్పయ్ మూడు శాతం
తీసుకున్నట్లున్నారనిపిస్తుంది...

స్త్రీ కి.. సమానత్వం... కావాలి..
అడదంటే.. అబల కాదు.. సబల...
మహిళలు.. మహరాణులు.. లాంటి కేప్షన్లు కాస్త పక్కన పెడతా..
వాటిగురించి మనకు ఎక్కువ తెలియదు....
తెలిసినా మాట్లాడలేం.. మాట్లాడనివ్వరు కూడా..

ఆడదంటే.. అలంకారప్రాయంగా మారిపోతుందనే.. బాదొకపక్క..
అయితే..

సరేలే... ఆఫీసునుండి ఇంటికొచ్చేటప్పుడు...
ఆ రోడ్డుప్రక్క.. పెద్ద పెద్ద హోర్టింగ్స్ పై అమ్మాయిల బొమ్మలే.. లేకపోతే
సిగ్నల్ పడ్డప్పుడు.. కాలక్షేపం ఎక్కడిది..?,

అబ్బాయిలవి పెడితే చూస్తామా చస్తామా.. అనికూడా అనిపిస్తుంటుంది...

పోనీ.. జనాల వీక్ నెస్ ఎదో ఏడ్చింది.. అనుకుంటే..
అందరిదీ వీక్ నెస్ అయితే చాలా కష్టంకదా?.

జనాల బుద్దులను మార్చాల్సిన మీడియావాళ్ళ బుద్దులు అసలు బాలేదు..
పేపరు మొదటి పేజీల్లోనే.. సగం బట్టలు వేసుకున్న బొమ్మలు..,
ఇక సినిమా పేజీ... చెప్పనక్కర్లేదు..

అవును..స్పోర్ట్స్ పేజీలో కూడా.. అవే...

కాదేది.. అశ్లీలతకనర్హం... అదే మార్కెటింగ్ ఫండా.. ప్రస్తుతం...

ఒక న్యూస్ పేపర్ యాడ్.. హోర్డింగ్ చూసానీమధ్య...
ప్రతి మగాడు.. వార్త చదవి తీరాలన్నది ముఖ్యోద్దేశమేమో.. కానీ...
ఎక్కడ రాయాలో అక్కడ రాసాడు..., అంటే.. గింటే..
క్రియేటివిటీ.. అంటారు..మరి.

ఇక మీడియాలో పెద్ద భాగమైన టీవివాళ్ళగురించి..
మాట్లాడలేం.... మాట్లాడటమే.. వేస్టు..

ఇక దుస్తులు..

మనకు నచ్చినవి వేసుకోటంలో లేదు తప్పు..
ప్రక్కవాడికి నచ్చేట్లు వేసుకోవటంలోనూ లేదు తప్పు..
నాకంటూ.. ఒక స్టైలుండాలి...,
నేనే అందంగా కనపడాలి అనుకోవడంలోనూ
లేదు తప్పు...

పక్కవాడికి చూపించాలన్నట్లు వేసుకోవటం.. తప్పు..
వాళ్ళకు ఇబ్బంది కలిగించేలా మన దుస్తులుండటం తప్పు..
ఇంకా పచ్చిగా చెప్పాలంటే... అందాలేమన్నా ఉంటే...
వాళ్ళ.. ఆయనకి చూపించుకుంటే.. మంచిది...
పక్కవాడికి పడి పడి..చూపించడం తప్పు..
ఏదేమైనా.. అది... పబ్లిగ్గా.. చూపించటము.. తప్పే...

ఏ ఏం పోయింది.... నన్ను చూడటం వాళ్ళ తప్పు అంటే.. మనమేం చెప్పలేం..
మన వలన ప్రకవాడి జీవితంలో.. మారణహోమాలు జరగక్కర్లేదు..
ఒక్క విలువైన నిముషం వృధా అయితే చాలు...

ఏమనుకున్నా.. తప్పు తప్పే.. తప్పున్నరే.. అంతే....

ఈ సగం దుస్తులు మొదటి ఐడియా.. మగాడిదే.. అయ్యిండాలి..
ఇలాంటి.. ప్రతి.. ఎదవ పనుల వెనుక ఉన్నది. మగ కన్నే..
ఈ.. తప్పంతా.. మగాళ్ళదే..

ఒరే.. మావా... ఆ పొటోబు చూడరా.. ఎధవ..ఎలా తీసాడో... అంటే..
ఆ తీయించుకున్నదాని సిగ్గేడకు పోయిందీ... దానిని బట్టే కదేంటి..
ఆడు.. తీసేది... అన్నట్లు..

మగబుద్ది ప్రకారం ఆడాళ్ళకు కాస్త తప్పుల్లో సగభాగం ఇవ్వాలి కాబట్టీను..
ఈ తప్పుల్లో వాళ్ళదీ.. ఉంటుంది భాగం..

ఇంకా చాలా రాయాలనిపించింది.. కానీ నా బ్లాగ్లో అశ్లీలత కు తావులేదని..
ఇక్కడే ఆపేస్తున్నా..

-------------------------------------------

(అక్కలూ.. అన్నయ్యలూ... మరదళ్ళూ.. బావలూ...

ఆడ, మగ ఇద్దరినీ సమానంగానే తిట్టాను.. నన్నేమనకండి.... బాబోయ్..)

3, జులై 2007, మంగళవారం

చీమ కధ...



అది.. సిటీకి దగ్గర్లో... రోడ్డుప్రక్కనున్న చెట్టుక్రింద ఒక చీమల రాజ్యం...


కాస్త లోతుగా పరిశీలించి...అక్కడ ఏం జరుగుతుందో... ఒక్కసారి చూద్దాం..


(కెమెరా.. జూమ్ మ్.... లైట్స్ ఆన్...;-) )


(కొన్ని చీమలు గూమిగూడి.. మాట్లాడుకుంటున్నాయి..)


ఒక చీమ: ఎరా.. మన చంటిగాడు కనిపించడంలేదేంటిరా...?


మరో చీమ: వాడికి ఎక్కువైందిరా.... ఈ మధ్య... ఎక్సట్రాలుచేస్తున్నాడు...


జీన్సులు టీషర్టులు వేసి.., పక్క చెట్టు.. ఆడచీమల వెంటపడి...

కటింగులిస్తున్నాడురా... ఎధవ..


మొన్న.. బంజారాహిల్స్.. చీమలన్నీ బైక్ పై వెళుతుంటే..

వెనక కూర్చున్న ఆమెని... కామెంట్ చేసాడంట..


అంతే.. అంతా.. కలిసి.. కుమ్మి వదిలారు... అయినా సిగ్గులేదు.. తరువాత మా

బ్యాచ్ తో చితక్కొట్టేసాను వాళ్ళని అని.. గొప్పులు చెప్పుకుంటున్నాడు తెలుసా?


ఒరే.. బంటిగాడ్రా బాబోయ్.. ఇలాగే వస్తున్నాడురా.. వీడొకడు.. సోదితో చంపేస్తాడు..

బుక్కైపోయాం.. ...


బంటి:( పల్సర్ బైక్.. సడెన్ బ్రేక్ కొట్టి ఆపి..)

హాయ్.. ఎలా ఉన్నారంతా.. నా డ్రస్ ఎలా ఉంది..రా..



మిగతా చీమలు: బాగుందిరా..!!!, ఎక్కడకొన్నావ్.. రా..



బంటి: చిరు అన్న గిఫ్ట్ బే.. తెలియదా??



ఒక చీమ: (కొయ్ రా కొయ్.. వినేవాళ్ళం మేం ఉన్నాం కదా.. అని.. కళ్ళజోడు సర్దుకుంటూ)

చిరు అన్నా?? ఎవరు రా?



మరో చీమ: (వెటకారం బయటకు కనపడనీయకుండా) ఏరా తెలియనట్టు అడుగుతావ్.. ,

మన బంటిగాడు పిచ్చ చిరంజీవి ఫ్యాన్స్ తెలుసా?


మొన్నే... చిరు అన్నతో ఫొటో తీయించుకున్నాడు... అప్పుడు గిఫ్ట్ ఇచ్చుంటాడు అన్న..

మనోడు బాగా క్లోజ్ రా.. అన్నకి..


ఒక చీమ: (ఆశ్చర్యంతో) ఓ.. నిజమా!! నాకు తెలియదురా..

ఒరే.. బంటీ నన్నూ తీసుకెళ్ళరా..చిరు అన్నదగ్గరకు వస్తాను.. ఫ్లీజ్.. రా..


బంటి: (స్టైల్ గా కాలు ఊపుతూ..) ఈ సారి చూస్తాలేరా.. అన్నకి ఖాలీ ఉన్నప్పుడు.. నాకు.. చెప్తాడు..

అప్పుడు తీసుకెళతా..లే.. పో..


ఒక చీమ: (పెంటమీద తిరిగే... గండు చీమ మొహం వీడూను.. వీడికి చిరు పోన్ చేసి చెప్తాడా??

కండచీమ కటింగులన్నీ ఉన్నాయ్ వీడికి..)


సరే.. రా.. మర్చిపోకూడదు.. మరి...


బంటి: మొన్న రావాల్సిందిరా... అన్న.. రక్తదాన శిబిరం దగ్గర నన్ను.. చూస్కోమని చెప్పిండని.. వెళ్ళాను..

నా రక్తం.. కూడా ఇచ్చాను.. తరువాత.. ఐబ్యాంకుకు.. నా కళ్ళు రాసిచ్చేసినా కూడా..

అందుకే.. ఈ షర్ట్ అన్న పేమతో.. గిఫ్టు ఇచ్చిండు..


ఒక చీమ: (ఏంటి.. నీ చీమరక్తమే..??, కళ్ళుకూడా..?? ఇచ్చావా..

ఇనేవోడుంటే.. ఎన్నైనా చెప్తావ్.. బురదలో పడిన.. కరెంటు చీమ మొహమూ నువ్వూను...)


ఓ.. మంచిపని చేసినావ్.. రా.., నాకు తెలిసుంటే నేనూ వద్దునురా..


బంటి: (కళ్ళజోడు.. తీసి తుడుచుకుంటూ..)

సరే నెక్స్ట్ టైమ్ బెటర్ లక్....


నేను పోవాలి.. జూబ్లీ హిల్స్ లో.. పవన్ ది.. షూటింగ్ ఉంది.. కలవాలి...

బై రా..


(బండిని దుమ్మురేగేలా..దూకించి.. వెళ్ళిపోయాడు.. బంటి)


మిగతా చీమలు: హమ్మయ్యా పోయాడ్రా బాబు.. చంపేస్తాడు.. సోది చెప్పి...


ఒక చీమ: ఒరే.. మన శేఖర్ గాడి బ్యాచ్ అంతా హైటెక్ సిటీ ఏరియాలో
సెటిల్ అయిపోయారంట కదా?


మరో చీమ: అవునురా.. వాళ్ళకేంటిరా.. మంచి.. తిండి దొరుకుతుందంట..!!.. పని తక్కువ ఉందంట!!..,

వారానికి ఐదురోజులేనంటరా!!... సాఫ్ట్వేర్.. కదా!! ఎంజాయ్ చేస్తున్నార్రా...


శేఖర్ గాడు.. టీసీయస్ ప్రక్కనే.. ఉంటుండంట.. సెల్ పోన్ కొన్నాడు..


అక్కడే.. విప్రో దగ్గర్లో ఉంటున్న గాళ్ళ్ ఫ్రండుని పట్టాడు..


ఇక ఎప్పుడూ ఫోనులో బిజీరా వాడు.., ఎంత ఉన్నా సరిపోవటంలేదురా ఖర్చులకి అంటున్నాడు..

వాడి స్టైలే మార్చేసిందిరా సాప్ట్వేర్...,


నేనెలాగూ వెళ్ళలేనురా.., అంత పెర్సంటేజ్ లేదు నాకు.. మా తమ్ముడిని తోసేద్దాం అని చుస్తున్నారా.. ఇప్పుడు


కొత్తగా రిఫరెన్సులు అడుగుతున్నారంట..ఫ్రెషర్స్ కి.., శేఖర్ గాడ్ని అడగాలి.. ఈ సారి ఫొన్ చేసినప్పుడు..


ఏవో కన్సల్టెన్నీలు ఉన్నాయంట కూడా అవికూడా తెలుసుకోవాలి...


ఈ సాప్ట్వేర్ వచ్చి.. మన చీమలరాజ్యాన్ని చెడగొట్టేసిందిరా.. ఎక్కడబడితే.. అక్కడ పుట్టలన్నీ ఫుల్..


పోనీలే మంచిది.. మనకు ఎక్కువ కష్టపడకుండా తిండి దొరుకుతుంది...


ఒకప్పుడు.. పప్పన్నం దొరికితే.. ఎంతగొప్పో.. దద్దోజనం, క్షీరాన్నం దొరికిన రోజు పండగే..


ఇప్పుడు.. హాట్ డాగ్.., పీజా.., చికెన్ బర్గర్... విత్ కోక్... లేందే.. తిన్నట్టుండడంలేదంట..

అలా అయిపోయార్రావాళ్ళు.. అందుకే.. ఎంత ఖర్చయినా మా తమ్ముడిని అక్కడికే


తోసేస్తారా..,


ఇక అప్పుచేసైనా మా చెల్లిని.. హై క్లాస్ వాడికే.. ఇచ్చి చేస్తా.., కనీసం.. నాలుగైదు.. గుంపుల్ని..


మెయిన్ టైన్ చేయగలిగేవాడై ఉండాలి..., నాలుగైదు.. చీమల దండులపై దండయాత్రచేసి ఉండాలి..


ఒక చీమ: నువ్వు అలానే కలలుకంటూ ఉండు.. అంత ఏక్టివ్ నెస్ పనికిరాదు.. ఈ కాలంలో.. అలా ఉన్నవాళ్ళ

జీవితాలు ఎలా ఉంటున్నాయో తెలియటంలేదా??.. మనం చూడటంలేదా??


ఆ రామంగారబ్బాయి.. అలాగే.. ఉండేవాడు.. ఏమయ్యింది.. హాలీవుడ్.. వాడెవడోనంట..


మన చీమల జీవితం మీద ఏనిమేషన్ సినిమాకో.. దేనికోసమో రీసెర్చ్ అని వచ్చాడంట..


మనోడి టైం బాగోక.. వాడి కంట పడ్డాడు.. తీసుకుపోయాడు.., మనందరికీ దూరమై పోయాడు..


అలానే ఉంటుంది...

అందుకే.. చక్కగా.. చెప్పింది వినే.. లోకల్.. చీమకు కట్టిపడేయ్..,


మనం చెప్పినట్టు వింటాడు.. దొరికినకాడికి తింటాడు..


మరో చీమ: నేను అంత ఆశేం పడటంలేదుకానీ ఎదో చిన్న ఆశ.. చెల్లిని గొప్పోడికిచ్చి చేద్దామని అంతే...

మనిషిలా.. లక్షలు లక్షలు జీతమూరావాలి... పనీ ఉండకూడదూ...



ఇన్కమ్ టాక్సూ ఉండకుండా.. డబ్బంతా మూటకట్టాలి అనో


పప్పూ... అవకాయన్నం కావాలి... డాలర్సూ కావాలి.. అనో... కోరుకునేంత ఆశకాదులే...



సరే పదలే.. వీళ్ళతో ..మనకెందుకు... మన ఆశలు తీరేవికావుకానీ... మనిషిగా పుట్టినా...

మట్టిలో పురుగులా పుట్టినా... అనుభవించడానికి ... సుడుండాలి దేనికైనా...,

సరేలే.. మనింటి ఓనర్ భార్య టీ పెట్టే టైమైంది..పద.. ఈ రోజు పొద్దున్నే శుప్రభాతం మొదలుపెట్టింది వాళ్ళాయనపై..

పాపం ఏంచేసాడొ తప్పు.. ఆ కోపంలో మనకు పండగే ఈ రోజు..

నాలుగు పంచదారపలుకులు.. ఎక్కువ.. విదుల్చుతుంది.....


ఒక చీమ: అంతేలే.. మనకా పంచదార మీదే.. ఎక్కువ రాసాడు.. మనపేర్లు....

అవే..గతి మనకు... పద..

23, జూన్ 2007, శనివారం

మౌనం...



దయచేసి కాసెపు ఇక్కడ కూర్చోండి సార్.. అని సీటు చూపించాడు.. సెక్యూరిటీ.. పర్సన్..

సరే.. అని.. కూర్చోటానికి రడీ అవుతూ.. ప్రక్కసీటులో ఉన్న అమ్మాయితో మేడమ్..

ఈ బ్యాగ్ మీదేనా అది కాస్త తీస్తే కూర్చుంటా అని.. రిక్వెస్ట్ చేసాడు.. అతను..

సారీ అండి.. అని గబగబా బ్యాగ్ తీసుకుని.. చిన్న చిరునవ్వు

విసిరింది ఆ అమ్మాయి.. ఆ చిరునవ్వుని చూసి కాసేపు ప్రపంచాన్ని మరచిపోయాడు అతను..

చాలా బాగుంది అమ్మాయి.. ఆ చిరునవ్వుకూడా..

కానీ ఇంటర్వూ టెన్సన్.. తో తను మళ్ళీ మాములు స్థితికి వచ్చేసాడు..

పదినిముషాలు గడిచింది.. కానీ ఆ అమ్మాయి.. పుస్తకంలో తప్ప వేరే ప్రపంచాన్ని చూడటంలేదు..

అతనికి కాస్త నవ్వొచ్చినా.. ఏవండీ.. ఏంటండి అంతలా చదివేస్తున్నారు..

మీరు రాసేది ఏమైనా ఎమ్సెట్ ఎగ్జామా.. ఇంటర్వూ మేడమ్.. అన్నాడు నవ్వుతూ.

నాకు కాస్త టెన్సనండి.. అన్నీ మర్చిపోతా అందుకె చదువుతున్నా అంది..
ఒక చిరునవ్వు నవ్వి.. ఊరుకున్నాడు.

ఇంతలో ఆమెను లోపలికి రమ్మని.. పిలిచారు.. ,
ఆల్ ది బెస్ట్.. బాగా చేయండి అని షేక్ హ్యాండిచ్చాడు.. అతను.

ధ్యాంక్స్ అండి అని నవ్వుతు వెళ్ళిపోయింది.. ఆమె..


ఆలానే చూస్తు ఉండిపోయినతను.. ఉలిక్కిపడి ఈలోకానికొచ్చేసరికి..

ఇతని పేరు గట్టిగా పిలవటం వినపడింది..

గబగబా లేచి.. ఇన్షర్ట్ సర్దుకుని.. లోపలికెళ్ళాడు..

ఓగంట గడిచాకా వచ్చాడతను..

అప్పటికే ఇంటర్వూ అయిపోయిన ఆ అమ్మాయి.. రిషెప్సన్ దగ్గర నిలబడి ఉంది..

అతన్ని చూసి.. దగ్గరకు వచ్చి.. ధ్యాంక్సండీ నేను సెలెక్టయ్యాను.. అంది ఆనందంగా..

నిజంగా.. గ్రేట్.. కంగ్రాట్యూలేషన్స్.. నేను కూడా సెలెక్ట్ డ్..
రేపు రమ్మన్నారు ఆఫర్ లెటర్ కోసం..

సరే పదండి ఏదన్నా రెష్టారెంటుకు పోదాం నేను ట్రీటిస్తాను అన్నాడతను..

హుమ్మ్.. తెలియని వాళ్ళతో ఇలా బయటతిరగటం నాకిష్టం ఉండదండీ..
అన్నదామె కాస్త నెమ్మదిగా..

తెలుసుకుందామండి.. బోజనం చేస్తూ మాట్లాడుకుందాం పదండి..
మీకు ఇబ్బందిలేకపోతేనే!!! అన్నాడతను..

ఇద్దరూ దగ్గర్లో ఉన్న రెస్టరెంటుకు చేరుకున్నారు.

రోజులు గడిచాయి.. ఇద్దరూ ఒకే టీమ్ లో కలిసి పనిచేస్తున్నారు..
చాలా దగ్గరగా రోజూ కలిసి తిరగటం వలన..

ఇద్దరి ఇష్టాలు ఒకటయ్యాయి.. ఒకరోజు సాయంత్రం ఆ అమ్మాయి..

అతనికోసం ఎదురుచూస్తూ ఉంది ఆఫిసు బయట.

కాసేపటికి వచ్చినతని.. కూడా కలిసి నడిచింది.. ఇద్దరూ పదినిముషాలు మౌనంగా ఉన్నారు..

సరేలే.. రెండురోజుల్లో వచ్చేస్తావుగా ఎందుకంత డల్ గా ఉంటావ్..కాస్త హుషారుగా వెళ్ళిరా..

చాలా రోజులతరువాత ఇంటికి వెళ్తున్నావుగా.. అన్నాడతను..
ఇద్దరి మధ్య ఉన్న మౌనాన్ని చేధిస్తూ

ఏమో.. నాకు ఎదోలా ఉంది.. అని.. దగ్గరకి చేరి.. బుజాలపై తలవాల్చి ఏడ్చెసింది...

ఏంటిరా.. ఎందుకలా ఎమైంది..? అని అడుగుదామనుకున్నవాడు..

ఆ ఊహించని తరుణానికి అతనికి మాటరాలేదు..

నేను నిన్ను.. చాలా ఇష్టపడుతున్నాను.. నిన్ను విడిచి ఒక్క క్షణం ఉండలేకపోతున్నాను..

ఆఫిసునుండి ఇంటికివెళ్ళగానె నేనొక ఒంటరిలోకంలోకి వెళ్ళినట్లు ఫీల్ అవుతున్నాను..

ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అన్నట్లు నాకు ప్రతిరోజు తెల్లారుతుంది..

నువ్వు ఒక్క క్షణం నీ సీట్లో లెకపోతే నాకు ఎమీ తోచదు..
మరినాకెందుకిలా ఉందో తెలియదు..

అని తన మొహాన్ని అతని గుండెలచాటు దాచేసుకుంది...

ఆ రెండురోజులూ ఫోన్లో పలకరించుకంటూ.. కాలం గడిపారు..

ప్రతిరోజు ఆమె మోముపై నవ్వుల పువ్వులు పూయిస్తూ..

ఆ పూవుల పరిమళాన్ని ఆనందిస్తూ.. అతనికి.. రోజులు నడుస్తున్నాయి..

ఏదో ఒకరోజు జరిగిన చిన్న సంఘటన వలన ఇద్దరికీ మనస్ఫర్దలుఒచ్చాయి..

అతన్ని అసహ్యించుకోవడం మొదలుపెట్టిందామె.. అతను..

బ్రతిమలాడాడు.. నేనే తప్పుచేయలేదు.. కావాలని అని చెప్పాడు..

తరువాతనుండి మాటలు తక్కువయ్యాయి..

ఇద్దరిమధ్య మౌనమే గెలిచింది అన్నట్లు.. రాజ్యమేలింది... కొన్నిరోజులు..

కానీ.. ఆమె ఎదురు పడే సమయంలో.. అతనికి ప్రాణంపోయినట్లుండేది

ఎదో నవ్వాలన్నట్లు నవ్వే ఆమె నవ్వును తట్టుకోలేకపోయాడతను..

సాయంత్రం.. మనం కలవాలి.. నీతో మాట్లాడాలి అని ఒక సందేశం పంపాడు..

ఇద్దరూ ఒక చోట కలుసుకున్నారు..

చల్లగా వీస్తున్న గాలితో కలిసి వారిద్దరిమధ్యన ఉన్న మౌనం రాగం తీసింది కాసెపు..

ఎందుకిలా నన్ను వేధిస్తున్నావ్.. నేను చేసింది ఏమన్నా అంత తప్పుందా?

ఇంతేనా నన్ను అర్ధంచేసుకున్నది.. అని భాదగా అడిగాడతను..

లేదు.. నువ్వు ఏ తప్పుచేయలేదు.. తప్పు నేనే చేసాను.. అది ఇప్పుడు తెలుసుకున్నాను..

అందుకె నన్ను నీకు దూరంగా చేసుకుంటున్నాను.. ఇళ్ళువదలి బయటికొచ్చిన నాకు

మొట్టమొదటిసారిగా పరిచయమైన నువ్వు నా సొంతవాడిలా నాకు అనిపించావు..

నాకు ఒంట్లో బాలేకపోతే నువ్వు తీసుకున్న కేర్.. నా కష్టంలో నువ్వు నాకిచ్చిన సలహాలు..

నాతో పంచుకున్న మంచిచెడులు.. అన్నీ నావాళ్ళతో ఉన్నట్లనిపించింది....

అది దాచుకోలేక నీకు చెప్పాను.. నన్ను క్షమించు..

నువ్వది సీరియస్ గా తీసుకుంటున్నావ్.. అందుకే నీకు దూరంగా ఉండటానికి ట్రైచేస్తున్నా...

మళ్ళీ మనం స్నేహితులుగానే ఉండగలం అనుకుంటే.. నేను నీతో

మాములుగా మాట్లాడగలను.... అని చెప్పిందామె..


అలానే వాళ్ళపలకరింపులు.. కొనసాగాయి.. కొన్నిరోజులు..

ఆమె మాటలు.. చేతలు.. చూస్తు గడుపుతన్నంతసేపూ..

ఒకసారి ప్రేమగా అనుకున్న అతను.. . ఇపుడు.. అది.. ఒట్టి స్నేహమే అని ..
మనసుకు సర్దిచెప్పలెకపోయాడు..


స్నేహానికి కళంకం తెస్తున్నానని అతనికి అనిపించింది.. కష్టమైనా తనతో మాట్లాడకుండా..
తనకి కనపడకుండా.. ఉండటం అలవాటు చేసుకున్నాడు..


కానీ.. ఒక రోజు... ఆమెతో చెప్పాడు.. నేను.. వేరే ఊరు వెళ్ళిపోతున్నాను..
అక్కడే సెటిల్ అవుదామనుకుంటున్నాను..

వేరే జాబ్ వచ్చింది.. అని.. చెప్పాడు..

ఆ రోజు రానే వచ్చింది... అతను ఆమెను వీడి దూరంగా వెళ్ళిపోయాడు...
తరువాత.. ఆమెను కలవలేదు..

ఆమె మనసులోన మౌనం ఇంకా అలానే నిధిలా నిక్షిప్తమై ఉండిపోయింది...


కాలం గడిచింది...


విడిపోయి దూరంగా ఉన్నా జ్ఞపకాలలో, మనసులో ఇంకా ఆమెనే నిలుపుకున్నాడతను..

కానీ.. ఒకరోజు....

అప్పుడే.. వసంతం విరిసి.. కోయిలరాగం మొదలయ్యినట్లు ఆమె గొంతు.. వినపడింది.. ఫోనులొ..
మనసు ఆనందంలో మునిగి ఉప్పెనలా.. ఎగసిపడింది.. కానీ ఆ అనందపుటలలు.. గొంతుదాటి..
బయటకు రాలేకపోయాయి... మాములుమాటలె... అతని గొంతు.. నుండి వచ్చాయి...

ఎలా ఉన్నావు అంటే ఎలా ఉన్నావని.. కుశలప్రశ్నలు అయ్యాకా... కాసేపు.. మౌనంతో
మూగబోయాయి.. ఇద్దరి... ఫోన్లు...

ఆమెకు.. దుఃఖం ఆగలేదు... ఏడ్చేసింది...
నేను చేసింది తప్పే అని ఇప్పుటికి.. తెలుసుకున్నాను అని అంది..

అతనికి.. మాటలురాలేదు...


కానీ ఒకప్పుడు.. తన గుండెచాటున... తన.. మోమును.. దాచుకుని.. ఆమె ఏడ్చిన సంధర్భమే..
అతనికి గుర్తుకురాసాగింది..

అప్పటి.. ఆ కన్నిటిలో.. తడిసి బరువెక్కి...
ఇన్నాళ్ళూ... మోస్తున్న తన హృదయం ఇంకా బరువుగానే అనిపించింది...

ఇప్పటి.. ఈ కన్నీటి.. అలలు...
బరువెక్కిన ఆ హృదయాన్ని.. కరిగించలేకపోయాయి...

మళ్ళీ మౌనమే.. జయించి రాజ్యమేలింది...

19, జూన్ 2007, మంగళవారం

ఛ...!!, ఏంటీ.. పెళ్ళిగోల...



* ఆరోగ్యం పాడువుతుందిరా ఈ హోటల్ భోజనం.. ఆఫీసులో క్యాంటిన్ భోజనం తినలేకపోతున్నాను..

అనటం పాపం.. అంటాడు.. ఎవడోకడు.... ఐతే ఏముంది.. త్వరగా పెళ్ళిచేసుకో.. కావలిసినవన్నీ వండిపెడుతుంది..

అదొక్కటే మార్గమా.. ఏ మనం వంట చేసుకోలేమా.. వచ్చకా కూడా మనం ఆ అమ్మాయికి..వండిపెట్టకుండా

ఉంటే చాలు.., అయినా పెళ్ళికి.. వంటకి, తిండికి లింకేంటో??..

*ఆఫిసులో పని ఎక్కువైపోయిందిరా.... చస్తున్నా. ఇక వెళతాను అంటే చాలు.. అప్పుడే వెళ్ళి ఏంచేస్తావ్.

పెళ్ళామా పిల్లలా.. అని వెటకారం చేస్తున్నాడురా.. మా మేనేజరు...అని ఎవడితో మొరపెట్టుకున్నా

మరందుకే. పెళ్ళిచేసుకోమనేది.. అని అంటారు.. ఇక్కడ కూడా.. మరి ఏంటో లింకు..

ఏ పెళ్లి కానివాళ్ళు.. కాసేపు.. ఇంటికెళ్ళి..హాయిగా ప్రశాంతంగా ఉండలేరా??,

నచ్చిన హాబీని ఎంజాయ్ చెయ్యలేరా?

*ఏమండీ.. ఇక్కడ టూలెట్ బోర్డ్ ఉంది.. ఇల్లు అద్దెకు ఇస్తారా.. అంటే.. మొదట.. అడికే ప్రశ్న..

బ్యాచ్ లర్స్ ఆ..??


అయితే ఇవ్వమండి.. ప్యామిలీకే..


ఓహో.... మరి.. బ్యాచిలర్స్.. ఫుట్ పాతలపై పడుకోవాలా...?, పెళ్ళికాకముందు అందరూ బ్యాచ్ లర్సే.. కాదా..

ఇక్కడ కూడా లింకుపెట్టేసార్రా బాబు..


* సింగిల్ గా బైక్ పై పాటలు పాడుకుంటు.. హాయిగా వెళుతుంటే.., ఎవడో బేవార్స్ గాడు..
చేయిచాపి.. లిఫ్ట్.. అంటే..ఈ పాటల మూడ్ పోగొట్టుకోలేక.. ఎహే.. నేనివ్వను అని చిరాగ్గా వెళ్ళిపోతే..

ఏ.. అలా ఒక్కడివే ఫొకపోతే.. లిఫ్ట్ ఇవ్వొచ్చుగా..? అని తిడుతున్నాడు..

ఇదెక్కడ గోలరా.... నా బైకుమీద.. నాకు నచ్చిన పాటపాడుకంటూ ఒంటరిగా వెళ్ళే హక్కులేదా.. అంటే..

మరందుకేరా పెళ్ళి.. అని మళ్ళీ లింకు పెట్టేసారు..


*అలాగే సినిమా హాల్లో.. కాస్త అక్కడ కూర్చుంటారా.. లేడిసున్నారు. మీరొక్కరే కదా.. అని బ్రతిమలాడి

చివరిసీటు ఇస్తే.. గాలిఆడక.. చెమటలు తుడుచుకుంటూ. సినిమా చూస్తుంటే.. ప్రక్కవాడు పిచ్చినవ్వు నవ్వి..


మీరు సింగిలేనా.. నేను అంతే.. అందుకే పెళ్ళిచేసుకోమని పెద్దలు చెప్పేది.. లేకపోతే ఇలాగే తోసేస్తారు.. అంటున్నాడు
వెటకారంగా..

ఓహో దీనికీ పెళ్ళికి మళ్ళీ లింకా..

* ఊరెళ్లేటప్పుడు.. చాలా రోజుల ముందు ముందుజాగ్రత్తతో టికెట్ రిజర్వ్ చేసుకుని మిడిల్ బెర్త్ తీసుకుంటే..

బాబూ.. బ్యాచిలరా..!, మేం ఫ్యామిలీ.. కాస్త సైడప్పర్ బెర్తులో ఎడ్జస్ట్ అవుతారా.. అని రిక్వస్ట్...చేస్తే..

పోనీలే అని.. మూటకట్టి.. అటకపైకి ఎక్కించినట్లుగా.. ముడుచుకుని.. పడుకుని జర్నీచేసి.. నడుంపట్టేస్తే..

మరందుకే పెళ్ళిచేసుకోవాలి.. ఎవడూ రిక్వస్ట్ చేయడు.. అంటాడు పక్కోడు..

మళ్ళీ ఇదో లింకు..



*అబ్బా ఎప్పుడూ ఈ రూమ్లో బోర్ కొడుతుందిరా.. లైఫ్. పద అలా బయటకుపోదాం ఏ పార్కుకో బీచ్ కో.. లేక

డిస్కోకో.. అంటే.. ఎ.. వెళ్ళి ఏంచేస్తావురా.. బటానీలు తింటూ. అక్కడికొచ్చే... జంటలను చూసి

మనసుపాడుచేసుకుంటూ...

ఆ బటానీలు అమ్మేవాడితో బాతాఖనీ కొట్టడం తప్ప.. ఇక డిస్క్ కి పోవాలంటే.. పక్కన అమ్మాయి కావాలి.. అందుకే

బాబుపెళ్ళిచేసుకో...

ఓరినాయనో.. మళ్ళి అక్కడికే వచ్చార్రా....


*ఇల్లుకొనటానికి హౌసింగ్ లోన్ అప్లై చేస్తున్నారా... ఏదిబాగుంటుందో చెప్పరా తెలిసుంటే...అనగానె పక్కోడు..
తగులుకుని.. ఒరే.. పిచ్చి బామ్మర్దీ.. ఇల్లు కాదు నువ్వు కొనాల్సింది. .
ఇప్పుడు.. కార్ లోన్ పెట్టి.... ఒక మంచి కారుకొను.

నాలుగు చైనులు.. రెండుచేతులకీ.. బ్రాస్లెట్టు.. ఉంగరాలు.. చేయించుకుని.., సూటేసుకని.. ఖాలీ సూట్కేసుతో

అటుఇటూ తిరిగి..హడావుడి చెయ్యి.... ఇక పడతారు..సౌండున్న స్పోన్సర్స్... బ్లాక్ సుమోల్లో దిగి.. ఎగబడతారు..

అందర్ని లైన్లో నిలబెట్టి.. ఎవడికైతే.... బంజారాహిల్స్ లోనో.. హైటెక్ సిటీ ప్రక్కనో ఇల్లు ఉందో చూసి... ఒకే అన్నావంటె..

పిల్లనిచ్చి పెళ్ళిచేయగానే.. అమ్మాయితోపాటు.. కొత్తఫ్లాటు లక్ష్మీదేవిలా.. వస్తుంది.. ఆ అమ్మాయి చదువుకుని

ఉద్యోగం చేస్తుందా..!!, అయితే... ఇంకా నయం.. అప్పుడు హోమ్ లోన్ పెట్టి ఇల్లుకొను.. ఆ అమ్మాయి జీతం నెలనెలా లోన్ కట్టు..


ని జీతంతో కార్ తో పాటు.. ప్యామీలీ మెయిటెన్ చెయ్యి..

అదీ.. పెళ్ళిచేస్కో.. ఒక్కదెబ్బకు రెండు ఇల్లులు.. అని అదో లింకు..

* ఆహా.. వర్షం భలే పడుతుంది.. వాతావరణం చాలా బాగుంది.. ఇప్పుడు బయటకివెళితె.. బాగుంటుంది అంటే..
బాసూ.. నువ్వు బయటకెళ్ళినా, లొపలున్నా, ఆఫిసు ఎగ్గొట్టి.. ఇంటికెళ్ళినా ఒకటే బాసు.. పెళ్ళయ్యిందా ఎమైనానా?? అని వెటకారం.


* నా జుట్టు చూడు ఎంత పలచబడిందో.. ఒక్కసారిగా.. అరెకరం ఖాలీ ఐపోయిందిరా.. అంటె..
పెళ్ళిచేసుకో బాబు.. లేకపోతే.. ఆ ఉన్నది కాస్త పోతుంది.. అంటాడు పక్కోడు..


అదేంటిరా.. మరి పెళ్ళిచేసుకుంటె.. పోయింది వస్తుందా?... లేక.. పెళ్ళయిపోయాకా బట్టతల ఐనా పర్వాలేదా? అంటే చెప్పరు కానీ లింకు మాత్రం పెడతారు..

*అబ్బా ఈ నసగాడు చంపేస్తున్నాడే.. మా డాడి ఉన్నప్పుడే..
ఫోన్ చేస్తాడు.. కుల్లుజోకులేసి.. చావగొడుతున్నాడే.. అని

తని స్నేహితురాలికి చెప్పుకున్న పాపానికి.. ఆ అమ్మాయి ఇచ్చిన సలహా..

అందుకే చెప్పేది. మీ వాళ్ళు తెచ్చిన సంభంధం ఒకే అను.. అ ఆర్కుట్లో సింగిల్ అన్న స్టాటస్ ని.. మ్యారీడ్ అను మార్చు..

వెంటనే అతని మొబైల్.. ఎడ్రస్ లిస్ట్ లోంచి నీ నెంబరు డిలీట్ కొడతాడు.. ఆర్కుట్ స్రాపుబుక్ ఖాలిగా ఉంటుంది కూడా..

అని లింకు పెట్టింది మళ్ళీ... ఫ్రండ్ కాస్త నసపెడితే అదీ పెళ్ళికి లింకే??


*నా ఈ కాస్మోటిక్స్ కే అయిపోతుందే సగం జీతం అంతా.. ఎలా ఖర్చుపెడుతున్నానో నాచేతులమీదుగా అనిపస్తుంది..
అందుకెనే.. త్వరగా పెళ్ళిచేసుకో.. అతని చేతులమీదుగా కొనుక్కోవచ్చు...

అంటే.. అవి కొనుక్కోవడానికి ఇప్పుడు పెళ్ళే చేసుకోవాలా?


*ఏంటమ్మా చెల్లెమ్మా.... మన పద్దూ రోజురోజుకు లావెక్కుతుందీ.. ఇలా ఐతే కష్టం.. రేపు పెళ్ళిచెయ్యాలి.. కాస్త స్వీట్స్..

ఐస్క్రీమ్స్ తిననివ్వొద్దు.. కంట్రోల్ లో పెట్టండి.. అలానే.. వంటలు చేయటం ఇంటిపనులు చేసుకోవటంలాంటివి

నేర్పించండి.. కాస్త ఎక్సర్సైజు గా ఉంటుంది కూడా, నాకంటావా ఆ కంట్రోల్ లేకపోయింది.. అందుకె.. ఇప్పుడు కొలెస్ట్రాల్..

డయాబెటిస్.. అని.. పనిలెని మావయ్యలు అమ్మలకు.. చెప్పే చచ్చు సలహాలలో కూడా.. లింకులు ఉంటాయి....

వాళ్ళుమాత్రం.. మెక్కి.. లావెక్కుతారు.. రూలు అందరికీ ఒకటె కాదా??


*ఈ ట్రాఫిక్ రానురాను ఎక్కువైపోతుందే.. పంజాగుట్టనుండి అమీర్ పేట సిగ్నల్ కి రావటానికి.. గంటపట్టింది.. డ్రయివ్

చేయలేక చస్తున్నానే..

అందుకేనే పెళ్ళిచేసుకో.. అతనే డ్రయివ్ చేస్తాడు.. వెనుక కూర్చోబెట్టుకుని.. అంటుంది... ఇది.. మరీనూ...!!!


*పొద్దున్న లేచిందగ్గరనుండి.. గాడిదలా ఆఫీసులో పనిచేస్తుంటే.. ఇంకా అదవలేదు ఇది పెండింగుంది.. అని నసుగుతున్నారే..

అనగానే ఇచ్చే సలహా.. ఎవడన్నా అమెరికా సంభందం పట్టు...నువ్వు ఇంట్లో కూర్చోవడమే.. సాయంత్రానికి డాలర్స్ మూట

పట్టుకొస్తే.. నువ్వు లెక్కపెట్టుకోవటమే.. అని పెళ్ళికి మళ్ళీ..లింకు..


ఇవన్నీ చెబుతున్నారు.. ఇంతకూ.. పెళ్ళికి మన ఆనందాలన్నిటికీ.... అంత లింకు ఉందా అనుకుంటే..


మరి.. ఇవి...

*ఆరోజు కూడా ఇంటర్వూ ఫేయిలయ్యి వచ్చిన అమ్మాయిని.. నిలదీసి.. చెప్పానా.. నీకు.. మగాడిలా ఉద్యోగం వద్దే అని..

పెళ్ళిచేసేస్తే.. నువ్వు మాటవింటావ్..


*వీడు చాలా ఎక్కువచేస్తున్నాడ్రా.. పెళ్ళిచేస్తేనే కాని పిచ్చి కుదరదు.. వీడికి..

*ఎంత జీతమొచ్చినా సరిపోవడంలేదురా.. అంటే. అప్పుడే ఏమయ్యింది.. పెళ్ళయ్యాకా తెలుస్తుంది.. అసలు బాధ..

*ఒరే.. నన్ను లెక్కేయకండిరా.. మీ పార్టీలు.. పాడూ..కానీ.. అసలే పెళ్ళయినవాడిని.. నన్నిలా బ్రతకనీయండిరా..

అంటే.. అంత భయంకరంగా ఉంటుందా... ??

ఎక్కడికెళ్ళినా ప్రశంతతలేదు.. అందరూ చెబుతున్న బోడి సలహాలు.... ఇవి.. చంపేస్తున్నారు..

పోనీ పెళ్ళితో సమస్యలు తీరిపోయాయా..అంటే..

కొత్తగా పెళ్ళయ్యి.. ఒక సంవత్సరం అయిన జంటలను.. ఎవరినైనా.. దయచేసి అడిగే ప్రయత్నం కూడా చెయ్యొద్దు..
పైన విన్నవాటికన్నా భయంకరంగా సమస్యలు ఉంటాయ్.. అని చెబుతారు.. తరువాత మీ ఇష్టం..

ఆనందం అంటే తెలియని వాళ్ళ సెటైర్స్.. సంగతి ఎలా ఉన్నాకానీ..

లైఫ్..ని ఎంజాయ్ చెయ్యడం తెలిస్తే.. నీరో చక్కవర్తిలాగా.. రోమ్ నగరం.. మునిగిపోతున్నా
ఫిడేలువాయించుకుంటూ.. ఆనందించొచ్చు...


మనకున్న ఏదొక హాబీని.. ఎంజాయ్ చేస్తూ.. స్నేహితులతో చెట్టాపట్టావేసుకుని.. హాయిగా నవ్వుకుంటూ
తిరిగేద్దాం..


ఏదో ఎప్పుడో వస్తుందీ.. రాబోతుందీ.. అని.. టైమ్ వేస్ట్ చేసుకునే కంటే.. ఇప్పుడు ఏంచేస్తున్నామో అన్నది ముఖ్యంకాదా?


నెవర్ కాంప్రమైజ్.. లివ్ యువర్ లైఫ్.. అంతే...

----------------------------------------------------------------

(పెళ్ళి ఎప్పుడు బ్రదర్.. అని. గుచ్చి గుచ్చి అడిగి.., పనికిరాని చచ్చుసలహాలిచ్చి..చావగొట్టే.. మహానుభావుల పాదపద్మములకు.. అంకింతం..)

4, జూన్ 2007, సోమవారం

రోమియో...


(ఓ చిన్న కాలనీ రోడ్ జంక్షన్.. ప్రక్కన ఉన్న చెట్టుక్రింద గోడపై కూర్చుని..)

రాహుల్: (సర్దుకుని కూర్చుంటూ..) ఏరా మామా ఏంది.. ఈ రోజు ప్లాన్..?
ఎక్కడికి పోదాం..!!

అరవింద్: (వాచ్ చూసుకుంటూ) డిసైడ్ చేయండ్రా జల్దీ...
ఐమాక్స్ లో స్పైడర్ మాన్ త్రీ ఉంది పోదామా?, శంకర్ గానికి చెప్తే.. టికెట్స్ పడతాడు..

సంతోష్: (చికాగ్గా మొహం పెట్టి) ఏం.. బచ్చాగానివా నువ్వు?..
చిన్న పిల్లల సినిమారా బాబు.. అది.

రాహుల్: (ష్... ) సరే కానీ సిగరెట్టీయరా.. పొద్దున్నుండి ఒక్కటి కూడా కాల్చలేదు..

అరవింద్: (నవ్వుతూ) అవునురా.. నువ్వు స్పైడర్ మాన్ ని చూస్తవ్....
మేం బచ్చాగాళ్ళం కాదు.. అక్కడొచ్చే పొట్టి స్కర్ట్.. పోరిలను చూస్తాం..


రాహుల్: (ఒక్కసారిగా లేచి నిలబడి) హే.. ఆపండ్ర మీ లొల్లి..
ఎప్పుడూ పోరి పోరి.. వేరే టాపిక్ లు లేవురా మీకు..??

సంతోష్: (సీరియస్ గా మొహం పెట్టి) ఏమిరో అన్న మూడ్ తేడాగా ఉంది..
ఏంది కధ??

అరవింద్: (వెటకారంగా..) హ హ హా.. అదా.. నే చెప్తారా..
అన్నది లౌ ఫెయిల్యూర్.. రా..

రాహుల్: (కోపంగా వేళ్ళమధ్యనున్న సిగరెట్ చూపిస్తూ..) ఒరే..
అరవింద్గా.. నీకు పగులుద్దిరోయ్..

అరవింద్: (దొరక్కుండా దూరంగా జరిగి).. హ హ హా.. చెప్తా..
విషయం ఏంటంటే..

అన్నకి.. ఒకమ్మాయిపై మనసైంది..

అన్న చూసాడు..!!, అది చూసింది..!, బానే ఉందనిపించింది..

పర్లేదులే ఎడ్జస్ట్!, అనుకున్నాడు....

పలకరించాడు.., కటింగ్ ఇచ్చింది..!!, అన్నకు మండింది..

నేను పోనురా..!!!, అది కటింగులిస్తుంది.. మిస్ వాల్డ్ లా అన్నాడు...

గద్ గదే అన్నా....!!!, పేమంటే.. అంతేలే, ఇలానే ఉంటాది అన్నాడు పక్కోడు..
సరే అని ఊరుకుని.. తరువాత రోజు పాలో అయిపోయాడు..

అన్నను చూసి... తిప్పుడు ఎక్కువ తిప్పింది..

అదేంట్రా అంటే..!!, అంతేలే మామా... నీ మీద పేమా.. అన్నాడు మళ్ళీ పక్కోడు..

పదిరోజులు తిరిగాడు.. పదిహేను రోజులు తిరిగాడు.. అదే.. తిప్పుడు. .

అన్న.. అదే.. ఫాలోయింగ్.., కానీ విషయం తేల్లేదు..

ఇక ఆవేశమొచ్చి... ఎదురెళ్లి అడిగేసాడు.., "నీ ఉద్దేశ్యం ఏంటి...?,
ఏమనుకుంటున్నావ్ నా గురించి..?, పిచ్చోడిలా
కనిపిస్తున్నానా?, ఎనక వస్తుంటే.. అసలు పట్టించుకోవేం.." అని..

"సారీ..!!!, నే వచ్చేదారిలో.. చాలా మంది నన్ను చూసి కామెంట్ చేస్తుండేవాళ్ళు..
అది మా అన్నయ్యకు తెలిసింది. నన్ను తిట్టాడు.. నా తప్పేంలేదు అని చెప్పాను..
అయినా వినకుండా మా అన్న వాళ్ళను చితక్కొట్టాడు..

ఆ తరువాత మా అన్నయ్య కొన్ని రోజులు.. నా వెనుక సెక్కూరిటీలాగా వచ్చేవాడు..
నాకు భయంవేసేది.. నేను అందుకే ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసేదాన్ని కాదు....
ఈ మధ్య అన్నయ్య రావటం మానేసాడు అని.. ఇప్పుడే తెలిసింది..
నువ్వు నా వెనుకవస్తున్నావని చెప్పగానే..అది నువ్వని.. మా అన్నయ్య కాదు అని..",
అని అందంట.. అమాయకంగా...

పాపం.. అన్న పదిహేనురోజుల రోమింగ్.. వేస్ట్ అయిపోయిందని బాధపడుతుంటే..
మీ లొల్లేందిరా.. పోరీలు పోరీలు అని..

సంతోష్: (అరవింద్ బుజాలపై దరువేస్తూ..) ఫిగరు.. దొరకలేదు అని.. దిగులు చెందకూ..
మంచి స్పీడు ఉన్న పల్సర్.. కొను ఫిగరు ఎందుకూ... ఆ... ఫిగరు దొరకలేదు.. అనీ.....

హ హ హా..

( పగలబడి నవ్వుకున్నారంతా..)

అరవింద్: (నవ్వాపుకోలేక గట్టిగా నవ్వుతూ) ఇంతకి.. ఆ సలహాలిచ్చిన పక్కోడెవడో తెలుసా..??,
మన గ్రేట్..సందీప్ గాడు..!

సంతోష్: (పొట్టపట్టుకుని నవ్వుతూ.. నవ్వాపి..) వాడి వీపు వాడే గోక్కోవడం తెలియదు..
ఇలాంటి చచ్చు సలహాలు కూడా ఇస్తున్నాడా?

మొన్న ఏమైందో తెలుసారా?.. సందీప్ గాడు...నేను.. 225 బస్లో పోతున్నామా..,
ఎప్పుడూ..ఫుట్ బోర్డ్ పై తిరిగే వాడికి.. సడెన్ గా బుద్ది వచ్చినట్లు.. అమ్మాయిల వెనుక సీట్లొ కూర్చున్నాడు..,
ఎవరో అమ్మాయి వస్తే.. ఆ సీటిచ్చేసి.. అక్కడే నిలబడ్డాడు.. , నేను ఎందుకైనా మంచిది అని..
కాస్త దూరంగా నిలబడ్డాను.. అంతే కాసేపటికి..ఆ అమ్మాయి లేచి ఎవో తిట్లు తిట్టి.. వార్నింగ్ ఇచ్చింది..,
జనం అంతా కొట్టడానికి రడీ అయ్యారు.. బుద్దిలేదారా నీకు అని.., అ కంగారులో.. ముందునుండి దిగబోయి..
ఒక ఆంటీని ఢాషిచ్చినట్లున్నాడు.. అమె సీరియస్ అయిపోయి.. క్లాస్ పీకింది..
గబగబా ముందు నుండి దిగిపోయాడు..నేను వెనుకనుండి దిగిపోయా...

ఏంటిరా ఏమన్నావ్ రా.. ఆ అమ్మాయ్ వార్నింగ్ ఇచ్చిందేట్రా??, అని అడిగా!!

"మనసా వాచా నిన్నే వలచా.. నిన్నే ప్రేమించా.. అఅఅ.." అని పాడారా..

అంతే.. వార్నింగ్ ఇచ్చిందిరా.. అది గోదావరి సినిమాలో పాట రా.. అన్నాడు..

ఆహా..!!, అయితే నాకే తెలియదు.. అ అమ్మాయికీ తెలిసుండదులేరా..పాపం..ఏ సినిమాలోదో..

అయినా కాస్త తెలిసిన పాట పాడుండాల్సిందిరా..అని.. చాలా సేపు ఏడిపించారా వాడ్ని..

ఇంతకీ ఎదవ చెప్పడంలేదు కానీ ఏదో అనుంటాడు..అందుకే వార్నింగిచ్చింది..
ఇంకా నయం కొట్టలేదు.. పరువుపోయేది.. నేను ఓ దెబ్బవేసేవాడిని.. అందరితో కలిసి..

వాడొచ్చి.. రాహుల్ గానికి ఎడ్వైజులివ్వడం.. వీడు ఫాలో అవడం..

హ హా..

*********

(ఎనిమిదేళ్ళ తరువాత... జనం బాగా ఉన్న ఒక షాపింగ్ మాల్ బయట... )

శ్రావ్య: (చేతిలో ఉన్న బ్యాగ్ మార్చుకుంటూ) అబ్బా... రాహుల్.. ఇది పట్కో.... బరువుగా ఉంది..

నేను మోయలేక చస్తుంటే.. ఇక్కడ.. నువ్వు..
ఏంటి అమ్మాయిల్ని కవర్ చేసెస్తున్నావా ...

ఇంటికి పద నీ పని చెప్తా.. నీ బుద్ది మారదే...??

రాహుల్: (కంగారుపడుతూ) కాదే బాబు.. ఆ కుర్రాళ్ళూ... గాళ్స్ ని కామెంట్ చేయటం..
చూస్తుంటే... ఏదో గుర్తొస్తేను...

ఊ.. ఇదే మోయలెకపోతే.. ఎలా.. ఇటివ్వు.. నే మోస్తాను..

శ్రావ్య: (వెటకారంగా) మోయలేకే కదా నిన్ను తీస్కొచ్చింది.. కూడా..

రాహుల్: (కాస్త కోపంగా) చంపావు కదా..!!, షాపింగ్ పేరు చెప్పి.. నాలుగు గంటలు తిన్నావ్..!

శ్రావ్య: (కాస్త బిక్కమొహం వేసి కోపంగా) అన్నీ నాకోసమేనా కొన్నది..? ఇంట్లోకి కావాల్సినవి కూడా కొన్నా కదా!
ఇంటిదగ్గరుండి ఏం చేస్తావ్ లే.. పనీ పాటాలేకుండా..

వీకెండ్ అయినా నాతోరాలేవా బయటకి... నామీద మండిపడటానికి మాత్రం ముందుంటావ్..
ఎప్పుడూ.. హు...

(అని బుంగమూతి పెట్టింది శ్రావ్య)

రాహుల్: (చికాగ్గా) సరేలే అలగకు.. నాకు ఓపికలేదు.. నిన్ను..బ్రతిమలాడుకోవటానికి...
రేపు ఆఫిస్ కి పోవాలే..

(ఛీ ఖర్మరా బాబు..... అప్పుడు.. అమ్మాయిల్ని.. ఏడిపించిన పాపానికి.. ఇలా తగిలించావా
దేవుడా.. మెడకొక డోలులాంటి పెళ్ళాన్ని.. కదిపితే చాలు మ్రోగుతుంది.. )

శ్రావ్య: (బొంగురపోయిన గొంతుతో) ఎప్పుడూ.. నాదే తప్పని చూపిస్తావ్.. ఏ నేనూ రేపు వెళ్ళక్కర్లేదా ఆఫిస్ కి..
ఏమన్నా అంటే.. డోమినేట్ చేయటానికి ట్రైచేస్తున్నానంటావ్...

రాహుల్: (బ్రతిమలాడుతూ) సరే.. ప్లీజ్.. వదిలెయ్ వే.. మోస్తున్నాగా..

(నిన్ను కూడా మోసుకు తీసుకెళ్ళనా.... ఓరి బాబోయ్.. వారమంతా ఆఫిస్ టెన్సన్..
వారం చివర్లో ఈ టెన్సన్.. అమ్మాయిలెనక తిరిగి తిరిగి కోరి కోరి.. కట్టబెట్టుకున్నాం.. రా దేవుడా..)

సరే పద... నేనొస్తాకానీ.... ఇది తీస్కెళ్ళు..

(జేబులో ఉన్న ఫోన్ రింగ్ అవటం మొదలుపెట్టింది..)

ఈ టైంలో ఎవడబ్బా.. చంపడానికి...

హలో ఎవరు.. హా.. చెప్పరా..సంతోష్.. ఏంటి..

సంతోష్: (ఆనందంగా.. ) ఒరే.. సాయంత్రం పార్టీ ఎరేంజ్ చేసుకుందాం వస్తావా.. మా ఇంట్లోనే..రా..

రాహుల్: (భయంగా.. ) ఓరి బాబోయ్ మీ ఇంట్లోనా.. ఏ.. మీ పులి పెళ్ళాం లేదా బాబూ..అంత ధైర్యం
వచ్చింది...నీకు..??

ఆమెకు.. తెలిస్తె.. మా ఆవిడకి చెప్పి.. నన్ను.. చంపించేస్తుందిరా బాబు.. నాకొద్దు..
స్ప్రైట్ లో కుంకుడుకాయ్.. వేసుకుని.. స్మిర్నాఫ్.. అనుకుని తాగి పడుకుంటారా.. నాకొద్దు..
నన్నిరికించొద్దు.. అసలే హోమ్ డిపార్ట్ మెంట్ సీరియస్ రా.. నన్నొదిలెయ్.. ఈ వీకెండ్ కి..

సంతోష్: (వెటకారం కూడిన వాయిస్ తో) సరేరా.. సందీప్ గాడికి, అరవింద్గాడికీ ఇదే బాధంట.. రాలేమని.. ఫోన్లో చెప్పలేక..
ఎసెమ్మెస్ చేసేసారు.. పాపం పక్కనే.. పెళ్ళాలున్నట్లున్నారు.. ఇక నేనొక్కడినె కానిచ్చేస్తా..
మీ అందరికోసం చూసుకుని.. చాలా కాలం తరువాత వచ్చిన మంచి చాన్స్ ని పోగొట్టుకోలేను..
రా.. ఒక వారంరోజులు రాదు మా ఆవిడ.. అందుకే పొద్దున్నే ఆరింటికి లేచి.. ఫ్రిజ్ అంతా శుభ్రంగా
కడిగేసి.. ఫుల్ బాటిల్స్ తో హౌస్ ఫుల్ చేసేసా.. మాట్లాడి టైమ్ వేస్ట్.. లే.. మరి..ఉంటా.. బై..

రాహుల్: ( మనకెందుకురా అనుకుంటు) సరే రా.. ఎంజాయ్ చెయ్... కుమ్ము.. జాగ్రత్తరోయ్.. ఎక్కువ ఆవేశపడకు.. దొరికిపోతావ్..
అప్పుడు నిన్ను కుమ్మి.. ఫ్రిజ్ లో పెడుతుంది..మీ ఆవిడ... హహా.. బై..

(ఫోన్ కట్ చేసాడు..)

(హాహా.. ఒక్క నిముషం ముందుచేసుంటే.. నేనూ ఎసెమ్మెస్ ఇచ్చేవాడిని.. )

అమ్మో.. బ్రతికుంటే.. మెక్డొవెల్ విస్కీ ఎప్పుడైనా తాగొచ్చు.. ఇప్పటికే.. ప్రతిదానికి.. ఆరాలు తిసి..
అలకలు..వేసి.. చంపేస్తుంది.. ఇక ఈ సారి దేనికీ దొరక్కూడదు.. కక్షకట్టిందంటే.. కూరల్లో ఉప్పు ఎక్కువేసో..
అసలువేయకో.., పొద్దున్నే కాస్తలేటుగా లేచి.. బెడ్ కాఫీ ఇవ్వకుండా.. మౌనవ్రతం పాటించో...,
బాత్రూంలో చెప్పకుండా వేడినీళ్ళు పెట్టో.. లేక.. షాంపూ కింద వలకబోసో..., సైలెంటుగా చంపేస్తుంది..

ఇన్ని కష్టాలుంటాయని.. చక్కగా చెప్పారు.. పడి నడుంవిరగ్గొట్టుకుని.. కాళ్ళులాగిన ఫ్రండ్స్ అంతా.. వినబుద్దేస్తేకదా..

రాహుల్: (ప్రేమగా.. ) శ్రావూ.. ఏంటి.. ఏంచేస్తున్నావ్..?

(అమ్మో... అయిపోయిందిరా దేవుడా... రెజ్లింగ్ చానల్ పెట్టింది.. అంటే.. చాలా సీరియస్ గా ఉన్నట్లే..మేటర్..
డిస్కవరీలో.. సింహాల.. పులుల వేట ప్రోగ్రామో, కనీసం. హిందీపాటల చానలో.. ఎక్స్పెట్ చేసా.., కాస్త ఏవరేజ్ రేంజ్..
ఏదొక.. కహానీ చెప్పి.. మర్చిపోయేలా చేసేద్దుం.. ఇదైతే కష్టమే.. అయినా.. నేనేమన్నానని.. ఇంత సీరియస్..
ఇక ఇప్పుడు ఎం మాట్లాడి లాభంలేదు.. ఇక రేపు కదపడం బెస్టు.. లేకపోతే.. నా తల.. ఏనుగు కాళ్ళకింద పడ్డ పుచ్చు వెలక్కాయ అయిపోద్ది.. పక్కింటోళ్లకు కూడా వినపడకుండా.. పగలిపోద్ది..

అసలెలా ఉండే.. రాహుల్ గాడు.. ఎలా అయిపోయాడు.. అమ్మాయి ఒంటరిగా నా ముందు నుండి వెళ్ళాలంటె.. వణికిపోయేది..
కాలేజీ రోజుల్లో... ఇక మన బ్యాచ్ పేరు చెబితే... ఎవడికైనా గజగజ గజాననే..
అలాంటి.. రాహుల్..ఇక్కడ.. గజగజ.. ఛ.. నా బతుకు చెడ..)

శ్రావ్య: (సీరియస్ గా మొహంపెట్టి) ఎంటా గొనుగుడు... ఇంతకూ ఫోన్ బిల్ కట్టారా??, ఈ రోజే లాస్ట్ డేట్.. మళ్ళీ కట్ చేసేస్తాడు..

రాహుల్: (ఆనందంతో పొంగిపోతూ.. పైకి కనపడనీయకుండా) కట్టేసా నిన్నే.. ఆఫిస్ నుండి వస్తూవస్తూ.. వెళ్ళాను..

(ఏడుకొండలవాడా వెంకటరమణా.. గోవిందా గోవింద.. ఎంత చల్లనివాడివయ్యా నువ్వు.. నా శ్రావూ ఇంత త్వరగా చల్లాగా అయ్యేలా చేసావు
తండ్రీ నువ్వున్నావయ్యా.. ఉన్నావ్... లక్కీగా.. ఫోన్ బిల్ కట్టేలా చేసి.. నాకు వందమార్కులొచ్చేలా చేసినందుకు.. నీ ఋణం ఎలా
తీచ్చుకోను స్వామి...)

శ్రావ్య: (టీవీ చానల్స్ మారుస్తూ... ) సరేలేండి... ఓనర్ కి రెంట్ కూడా రేపివ్వాలి.. గుర్తుచేయండి...
పదండి.. భోజనం చేద్దాం..

రాహుల్: (మార్కులు కొట్టాలి అన్నట్లు.. ఉత్సాహంతో ) సరేలే... చెప్తానులే... పద.. నే రడి చేస్తాలే అన్నీ...

(హమ్మయ్యా... మార్చిందిరా బాబూ చానల్.. రెజ్లింగ్ లో రౌద్రం అంతా.. మొహంలోచూసి.. టెన్సన్..
తట్టుకోలేక పోతున్నా..)

(భోజనం దగ్గర కూర్చున్నారు.. శ్రావ్య వడ్డిస్తుంటే.. అడ్డుపడి మరీ ఎక్కవచేసి.. సాయం చేసేస్తున్నాడు..
రాహుల్.. కాస్త మంచి మఅర్కులు కొట్టడానికి..)

శ్రావ్య: (కోపంగా..) నాకేం ప్రోబ్లమ్ లేదు.., మీ ఆరోగ్యం.., మీ ఇష్టం..., నాకు భయపడి మీరేమీ త్యాగాలు చేయనక్కర్లేదు..,
కానీ మాట ఇచ్చినట్టు నటించటాలు..., అడిగితే.. నిజం.., నమ్ము అని కవర్ చేయటాలు చేసి.. అబద్దాలు చెప్పి నన్ను మోసం చేయొద్దు..

రాహుల్: (ఏమీ అర్ధంకాక.. కలుపుకున్న గొంగూర పచ్చడి ముద్ద.. నోటి దగ్గరపెట్టుకుని.. ఆలోచిస్తూ) దేనిగురించి నువ్వు మాట్లాడేది..???

శ్రావ్య: ఇప్పుడే వస్తాను అని చెప్పి.. షాప్ బయట నిలబడి... సిగరెట్ కాల్చటం నేను చూడలేదనుకున్నారా!!?, నేను అద్దంలోనుంచి చూస్తూనే ఉన్నా!
దొంగలాగా దాచుకుని కాలుస్తున్నారు.. అంత భయపడనవసరంలేదు.. రేపట్నిండి.. ఇంట్లోనె హాయిగా కాల్చుకోండి.. మళ్ళీ మా అయన అసలు సిగరెట్
కాల్చరు అని నేను చెప్పిన వాళ్ళంతా చూసి.. నాకు చెప్పకుండా ఉంటారు కనీసం.

రాహుల్: (షాక్ తిన్నవాడిలా గొంతు దగ్గర అడ్డుపడ్డ.. గోంగుర ముద్దను మంచినీళ్ళు త్రాగి లోపలికి తోసెస్తూ.. )

(అబ్బా ఇదా అసలు విషయం.. ఫుల్ గా బుక్ రా రాహుల్ నువ్వు.. నీ స్కోర్ ఇప్పుడు.. నెగెటివ్ మార్కింగ్ లో పడింది..
మైనస్... నైన్ హండ్రడ్..)

1, జూన్ 2007, శుక్రవారం

నా రాత...

చాలా రోజుల తరువాత మళ్ళీ సమయం దొరికింది... మళ్ళీ వ్రాయడం మొదలుపెట్టాను.
వ్రాత నా జీవితంలో ఒక బాగంగా మారిపోయింది.. నా ఈ కలలు నిజాలు అవుతున్నందుకు.
నా రాతలు.. చదివి ఆనందిస్తున్నందుకు.... అందరూ నాకు ఇస్తున్న అభిప్రాయాలకు..చాలా ధ్యాంక్స్..

అవి.. ఇంకా నా మీద ఎన్నో కొత్త.. బాధ్యతలు వేస్తున్నాయి.. బాగా రాయాలి అనుకునేలా చేస్తున్నాయి..

ఈ మధ్య వ్రాయకపోవడం వలన ఏదో తెలియని వెలితిగా కూడా.. తోస్తుంది... నాకు.
అందరికీ పేరుపేరున సమాధానమివ్వాలని ఉంది..కానీ మీ మెయిలు ఎడ్రస్ నాదగ్గరలేదు..

అందుకే..

ఈ క్రింది విషయాల్లో ఏదైనా మీరు అనుకుని ఉంటే..


వీడేంట్రా.. రాస్తాడు.. అభిప్రాయం చెబితే సమాధానమివ్వడు..

ఎవో పిచ్చి రాతల్లే.. పని పాటా లేక..

రాసిందే రాసినట్టుంటుందెహే.. వేస్ట్.. చదవకు టైమ్ వేస్ట్..

కాస్త పెద్దగా రాస్తాడు కాని.. పర్లేదు. మేటర్ ఉంటుంది..

ఓ అదా నేను చదివాను.. బాగానే ఉంటుంది..

మనోడు.. కాఫీ దింపాడుర్రోయ్..

కాస్త ఎక్కువ చేస్తాడు కుర్రోడు..

వీడు కనిపిస్తే చెప్పాల్రా.. బాబు.. నీకో దణ్ణం ఇక రాయకు అని..



లాంటి..వే కాక ఇంకా ఎమైనా మంచి/చెడు.. ఏదైనా సరే ఆహ్వానం..

నాకు మీ ఆభిప్రాయం చెప్పగలరు.. నిర్మొహమాటంగా.. !!!

సిగ్గులేకుండా.. భయంలేకుండా...

మరి ఇంకే.. కడిగిపడేయండి.. ఇక్కడ... srisri.indukuri@gmail.com

నాకూ.. ఓ మంచి స్నే'హితుడు'న్నాడని గర్వపడతాను...

త్వరగా కానీయండి మరి..


మీ
శ్రీనివాసరాజు ఇందుకూరి..

27, మే 2007, ఆదివారం

బ్రహ్మీ సాప్ట్వేర్ ఇంజనీర్..


(This Post Contains some Slangs .. READERS DISCRETION ADVISED

కొన్ని చోట్ల తప్పక.. పరుషపదాలు ఉపయోగించడమైనది.. ఇబ్బంది అయితే చదువవద్దని మనవి... క్షమించగలరు....)

ఎంత వెటకారం అయిపోయింది.. ప్రతి ఒక్కడికి లోకువగానే ఉంది. కనిపించినంత సులువుకాదు.. సుఖమూ..లేదు.. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే…

ఈ మధ్య ప్రతి ఒక్కడికి సులువుగా ఉద్యోగాలు రావడంవలన అనుకుంట ఈ ఫీల్డ్ అంటే లోకువ కట్టేసారు.. వైట్ కాలర్ జాబ్.. సుఖంగా కూర్చీలోంచి కదలకుండా.. చాటింగ్ చేసుకుంటూ.. పాటలు వింటూ.. ఎంజాయ్ చేస్తూ.. వారానికి రొండు రోజులు సెలవు తీసుకుంటూ.. పని తక్కువ పైసలు ఎక్కువ .. ఇవే తెలిసినవి పైకి.. తెలియని విషయాలు చాలా ఉన్నాయి…

ఏసీలో చెమటలు… కుర్చీలో అయస్కాంతాలు… పియల్ చేత అక్షింతలు.. మీటింగుల్లో ఒకరిపైఒకరి నీలాపనిందలు.. అమ్మో.. బాబోయ్ అని మనసులోనే అనుకుంటూ… పైకి నవ్వుతూ నటనలు చేయటాలు.. ఏం చెప్పమంటారు.. అది చెబితే తెలియదులేండి అనుభవించాలి…

ఒకోరోజు.. ప్రక్కసీటులోవాడు వచ్చాడోలేదో తెలియకుండా పనిచేయాల్సొస్తుంది.. అంటే మీరే అర్ధంచేసుకోండి.. అన్ని ఉద్యోగాలు అలానే ఉంటాయి కాదనటంలేదు..

కానీ ఈ ఫీల్డ్ కి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే..

ఉంటే.... చాటింగ్ చేసుకుంటూ… క్యాంటిన్ లో పౌడర్ టీలు అవసరంఉన్నా లేకున్నా తాగుతూ.. కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకునెంత టైముంటుంది

లేకపోతే.. పెళ్ళాం ముద్దుగా ఫోన్ చేసినా చిరాకుగా మాట్లాడేంత పనుంటుంది.. అది ఎప్పుడు ఎలా వచ్చిపడుతుందో ఎవడికీ తెలియదు. అదే అసలు సమస్య.

ఎంతో కష్టపడి.. సాధించాం అనుకున్న పని.. మన పైన ఉన్నవాడికి డెమోనో లేక సబ్మిట్ చేద్దామనో అనుకున్నప్పుడు.. సడెన్ గా మొరాయించడం మొదలవుతుంది.. దాన్నే బగ్ అనో.. గిగ్ అనో.. మా ప్రోజెక్ట్ లీడర్ అయిరన్ లెగ్.. అనో ఏదనుకున్నా కానీ.... ఒకొక్కసారి. చేసినదంతా వేస్ట్ అన్నట్లు ప్రోజక్ట్ లీడర్.. మొహంమీద.. కరాకండిగా చెప్పేస్తాడు ఇంత సులువుది కూడా ఇంత టైం తీసుకుంటున్నావేంటి అని ఇన్ డైరెక్టుగా అడుగుతాడు.. ఇక ఒక్కసారే మీటర్ 200 దాటిపోద్ది.. పోరా.. నీకు తెలియనిదా.. ఇది.. నేనంతా కరెక్ట్ గానే చేసాను.. అది ఈ ఇష్యూలో చిక్కుకుంది నేనేంచేయను. నా సీట్లో కూర్చుంటేగాని తెలియదు.. చేసేముందు నాకూ ఈజినే అనిపిస్తుంది.. కాని ఈ అనుకోని సమస్యల్లో చిక్కుకుని.. ఇలా అయ్యింది.. ఒక్కసారి చేసిచూడు తెలుస్తుంది.. అని మనసులో… అనుకుని.. కాస్త చిరాకు పరాకు చూపులు చూసే సరికి వాడికే అర్ధం అవుతుంది..

అదికాదమ్మా.. ఇది నీ ప్రాబ్లమ్ కాదులే.. నువ్వు చెయ్యాలని చెయ్యలేదనుకో కాని.. ఇప్పుడు డెలివరి టైం లో ఇలా వస్తే నామీద ఎగిరి పడతారు.. అందరూ.. ఇప్పుడెలా.. అని బిక్కమొహం వేస్తాడు... ప్రోజక్ట్ లీడరు..

సరేలేండి ఐవిల్ గూగుల్ ఇట్ అవుట్…(గూగుల్ లో వెతికి చూస్తాను) అది నోన్ ఇష్యూ అయితే.. ఫోరమ్స్ లో సొల్యూషన్ దొరక్కపోదు.. లేకపోతే కొన్నిరోజులు వెయిట్ చేయాలి.. అని.. కాస్త కుదుట పడి..

మళ్ళా.. అలో.. సాఫ్ట్వేర్.. ఇంజనీర్.. అనుకుంటూ.. మొహాన్నీ మానిటర్ కి వేళాడదీసుకోవాల్సొస్తుంది. ఈ లోపుగా.. ఎవడో టైముబాగోక మెయిలో.. లేక ఫోనో చేస్తాడు.. అంతే వాడికి మూడింది.. ఎరా.. ఏం పీకుతున్నవ్ బే.. ఈ మధ్య ఫోన్ చేయటంలేదు.. పోరీని పట్టావేంటి.. అంటాడు.. నేను సాయంత్రం చేస్తారా.. అని ఎక్కిన మీటర్ ని.. దించి.. కళ్ళుమూసుకుని.. కూల్ గా చెబుతాను .. విన్నాడా బ్రతికిపోతాడు. లేకపోతే అయిపోతాడు..

మళ్ళీ వర్క్.. ఈలోపు.. కాళీగా తిరిగే ప్రక్క ప్రాజెక్ట్ వాళ్ళ వెటకారాలు.. (మనం ఖాలిగా ఉన్నప్పుడు తగ్గుతామా.. ఏంటి.. మనమూ ఇలా సెటైర్లేస్తాం.. అందుకే వీళ్ళ రివెంజ్ ఇప్పుడు.)

మనోడు కుమ్మేస్తున్నాడురో.. హైకుల టైముకదా.. బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ కోసమేమో, లేదా ఆన్ సైట్ ఆఫర్ కోసమో.. సీరియస్ గా చేస్తున్నాడు.. అని సెటైర్లు వేయటం..

ఒరే.. పనీలేదు పాటూలేదు.. మెడకో లాప్ టాప్ అని..

ఇక్కడ పని అవక నేను చస్తుంటే.. ఆన్ సైట్ ఆఫర్ ఒకటి… అనేలోపే.. వాళ్ళు తప్పించుకుని నవ్వుతూ పారిపోయారు..
సడెన్ గా ఎదో.. మనకు దగ్గరగా ఉన్నటువంటి సమస్యే.. ఎవడో ఫోరమ్లో కనిపిస్తుంది.. కళ్ళింతచేసి మొహం మానిటర్లోపెట్టి వెతికినంతసేపుండదు.. దానికి ప్రశ్న ఉంది కానీ జవాబు ఎవరూ ఇవ్వలేదు....

ఛీ.. నీ.. కొంచెంలో పోయిందిరా.. అనుకుని.. వీడు ఎవడో మనలాంటి బాద్యుడే.. అనుకుని.. మళ్ళీ.. వెతుకులాట.

అంతే ఈలోపు.. డెస్క్ పై ఉన్న ఫోను మ్రోగడం మొదలుపెడుతుంది.. నాకు తెలియనంత ధీక్షగా వెతుకుతున్నానేమో.. అప్పటికే పది రింగులై ఉంటాయి.. మొద్దుబారిన మెదడుకు ఎదో మ్రోగుతున్నదని.. అనిపించి.. లిఫ్ట్ చేసానా.. సార్... వి ఆర్ ఫ్రమ్.. సో అండ్ సో బ్యాంకు మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏ క్రెడిట్ కార్డు వాడుతున్నారు.. సార్.. అని శ్రావ్యంగా.. వినపడిందొక ఆడగొంతు.

నీకు బుద్దుందా.. నేనేది వాడితే నీకెందుకే.. పెట్టు ఫోను.. మళ్ళీ చేసావంటే.. నిన్ను.. నిన్ను.. ఛా.. అని.. టక్ మని.. ఫోన్ పెట్టేసాకా అనిపిస్తుంది.. పాపం ఈ టాస్క్ మీద కోపానికి ఆ అమ్మాయి భలి.. లేకపోతే నేను ఖాళీగా ఉన్నప్పుడు చేస్తే కాసేపు కాలక్షేపానికి సుత్తికొట్టేవాడిని కదా.. ఇలాంటి టైములో ఏంటి.. అని అనుకుని.. సరేలే.. ఆ అమ్మాయి టైము బ్యాడ్.. కష్టమైన టాస్క్ చెయ్యలేని.. ఎవడో ఎదవ.. కష్టమర్.. అని లైట్ తీసుకుంటుందిలే...


ఆమ్మా.. గూగులమ్మతల్లీ.. ఈ బ్రహ్మీ సాప్ట్వేర్ ఇంజనీరుకు.. సొల్యూషన్ వరాలిచ్చి కరుణించమ్మా.. ..

త్వమేవ మాతాచ పితాత్వమేవ.. త్వమేవ భందు సఖాత్వమేవ….. త్వమేవ సర్వం మమదేవదేవా… అని పెద్ద శ్లోకం చదివి.... హారతిచ్చి.. కొబ్బరికాయ కొట్టినట్లు..మళ్ళీ.. వెతుకు.. బటన్ కొట్టాను. గూగుల్ లో..

ఈ లోపు.. నాలుగుసార్లు ప్రోజక్ట్ లీడర్ వెనుకనుండి తొంగిచూసి వెళ్ళాడు..

ఆయన టెన్సన్ ఆయనది.. అసలు దొరుకుతుందో లేదో అని నాకు టెన్సనైతే.. ఏమో అసలు అవుతుందో లేదో అని.. (అతని చేతిలో లేదు కదా) అతని టెన్సన్..

మళ్ళీ ఏసీలో చెమటలు.. కాసేపటికి ఒక కొలిక్కి వచ్చింది.. అనిపించింది.. ఎదో పాత గుడ్డకి పాత దారం వేసి కుట్టిన.. అతుకుల బొంత లాగా…

టైముచూసేటప్పటికి.. పదయ్యింది.. ఏంటి.. అప్పుడే పదా.. అమ్మో వెళ్ళాలి.. అనుకుని వెనక్కి చూసేటప్పటికి.. పీయల్ జంప్..

హమ్మయ్యా అనుకుని పిల్లిలా నెమ్మదిగా నడుస్తూ ఇంటికి చేరుకుని.. ఊపిరిపీల్చుకున్నామా.. తిన్నామా.. పడుకున్నామా..

ఇక రాత్రంతా కలలో ఫర్ లూప్ లు.. వైల్ లూపులు.. ఇన్ఫైనేట్ లూపులో పడి కొట్టుకున్న ప్రోగ్రాములు. బాబోయ్.. అలా కలతనిద్రతోనే తెల్లారుతుంది... పొద్దున పదయ్యింది కూడా.. పరుగుపరుగున స్నానం.. టిఫిన్ మళ్ళీ జైలుగదిలోకి వెళ్ళినట్టుగా ఆఫీసులోకి ఎంటరవుతున్నప్పుడు ఫీలింగు..

పీయల్ వచ్చే టైమయ్యింది.. ఎలాగోలా నే చేసింది చూపించి.. కన్విన్స్ చేయాలి.. అని.. పైనుంచి కిందకు.. అటునుండి ఇటు.. నాలుగు సార్లు టెస్ట్ చేసి చూసుకున్నాను.. బాగానే పనిచేస్తుందనిపించింది..

అలా వెళ్ళి ఆ పౌడర్ టీ ఒకటి తాగుదాం అని వెళ్ళాను.. కిటికీలోంచి బయట ఎండను చూస్తూ.. వేడివేడి టీ.. ఏసిలో తాగుతుంటే.. బాగుంది అనిపించింది. కాసేపు టైమ్ పాస్ చేస్తుండగా.. అప్పుడే వస్తున్న కొలీగ్స్ తో కాసేపు పిచ్చాపాటి మాటలు… ఎవడెవడు.. కంపెనీలు మారాడో.. ఎంతెంత వస్తున్నాయో… లాంటి విషయాలు విని.. ఆశ్చర్యంతో నోరుతెరిచే టీ త్రాగుతున్నాం అందరూ….

ఒరే.. తెలుసా.. ఆ వెంకట్ గాడు ఆన్ సైట్ పోయాడు.. జాయిన్ అయ్యి పదిరోజులు కాలేదు.. కొత్తకంపెనీలో.. అప్పుడే ఎగిరిపోయాడ్రా అన్నాడు మా కొలీగ్. నిజంగా..?? చాలా లక్ రా..!!, అన్నా నేను..

కాదు..రా లక్ కాదు.. సుడి.. వాడికి లక్ ఎక్కడుంది..? మొన్నటివరకూ ఏ కంపెనీలోనూ సెట్ కాలేక.. వర్క్ ఇస్తే చాలు జంప్ చేసే వాడికి.. సడెన్ గా వచ్చింది…ఈ ఆఫర్.. అయినా తెలిసిందేంటంటే.. వాళ్ళ ప్రోజక్ట్ లో మెదటి వ్యక్తి వీడేనంట.. స్టడీ చెయ్యాలని పంపించారు వీడిని.. ఇంకా టీమ్ ఫామ్ అవలేదంట..లే.. అని.. తన మనసుకు సర్ది చెప్పుకున్నాడు.. (అలాగే అందరి మనసులకి సర్దిచెప్పాడు.. లేకపోతే.. అదొక నిద్రపట్టని భాధ...),

ఒరే.. మనమెప్పుడు ఎగిరిపోయి.. హాయిగా బ్రెడ్ జామ్ తింటూ.. డాలర్స్ ఎప్పుడు సంపాదిస్తాంరా.. అన్నాడింకొకడు..

కంగారు పడకులే.. వెళ్తావు.. నువ్వే ముందు.. వెళతావు.. మాలో అన్నానేను..

ఇదింకా బాగుంది.. రా... ప్రాజెక్టూలేదూ.. పనీలేదూ.. అన్ సైటు ఆఫరన్నాడంట వెనకటికి నీలాంటి వాడొకడు..

నేను ఈ బెంచి పై నవమాసాలు నిండి.. పురిటినొప్పులు పడలేక చస్తుంటె..నేనెలా వెళ్తానురా.. అన్నాడు చిరాగ్గా.. అంతా నవ్వుకున్నాం.

నేను టైముచూసుకుని.. ఒరే..మా పియల్ వచ్చే టైమయ్యిందిరా. అని.. మళ్ళీ జైలుగదిలోకి ఎంటరయ్యాను..

నా టైమ్ స్టార్ట్ అన్నట్లు టెన్సన్ గా ఊపిరి బిగపట్టి.. చెబుతున్నాను.. ఇలా ట్రై చేసాను.. ఇది రిజల్ట్.. అని..

ఓ గ్రేట్ జాబ్.. బడ్డీ.. మరి.. దీనివల్ల ఇలా అవ్వచ్చేమో టెస్ట్ చేసావా.. అని అన్నాడు పీయల్..
చూసానండి.. అది కూడా ఒకే.. నౌ ఉయ్ కెన్ కన్విన్స్… నో ఇష్యూస్.. అనుకుంటున్నా.. అన్ని రకాలుగా ఇదే బెస్ట్ సొల్యూషన్ అని నా అభిప్రాయం… అని ఫైనలైజ్ చేసేసాను..
ఒకే.. లెట్ అజ్ ట్రై.. ఇంకొక విషయం ఎంటంటే.. మొన్న మనం ఇచ్చిన సొల్యూషన్ కే.. క్లైంట్ ఒప్పుకున్నట్లు మెయిల్ ఇచ్చాడు.. ఈ రోజు పొద్దున్నే చూసాను.. నీకు ఫార్వార్డ్ కొట్టడం మరిచిపోయాను.. శ్రీ.. ఇక ఈ సొల్యూషన్ అవసరంలేదు.. అని ఇన్ డైరెక్టుగా.. చెప్పాడు.. పీయల్..

నా కళ్ళలోకి ధైర్యంగా చూడలేక.. ప్రక్క చూపులు చూస్తూ.. సరే.. కొత్త ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయేమో.. చూడండి.. అని.. మాటమార్చేసి.. వెళ్ళిపోయాడు.. చల్లగా..

ఒక్కసారి.. దిమ్మతిరిగిపోయింది.. ఇన్ని రోజులు రాత్రిపగలు కష్టపడి టెన్సన్లు పడి..
రాత్రిళ్ళు.. నిద్రలేకుండా.. ఫ్రండ్స్ అందిరిమీదా.. చిరాకుపడి.. ఫోన్లుచేసిన శ్రావ్యమైన అమ్మాయిల గొంతుని కసురుకొన.. అయ్యో పాపం కసురుకున్నానే.. అని బాధతో (పౌడర్ టీ..) తాగి..తాగి ఆరోగ్యాలు పాడుచేసుకుని.. ఇంతా.. చేస్తే... ఆ క్లైంటుగాడు.. మెడమెంటలోడుకాకపోతే.. సగం ఉన్నది నచ్చిందా.. వాడికి

నచ్చితె నచ్చింది… పోనీ.. అది నచ్చి చచ్చింది అని.. ఈ ఎధవ చెప్పొచ్చుకదా.. ఇంతలా టెన్సన్ తో చస్తుంటే.. మెయిలుచూడకుండా గేమ్స్ ఆడతాడా.. ఇప్పుడొచ్చి చల్లగా.. అవసరంలేదని ఒక్కమాటలో చెప్తాడా..

సంభంధంలేని.. చదువులు చదివి.. సెలెక్ట్ అయిపోయాం కదా.. మంచి జీతం అని ఉద్యోగాల్లో చేరటం.. ఆన్ సైట్ ఆఫర్ కొట్టడం.. తిరిగొచ్చి.. లీడ్ పోస్ట్ కొట్టేసి.. ఇలా మెయిల్లు చూసుకోకుండా మా ఖర్మకొద్దీ.. తయారవుతారయ్యా.. అని.. కాస్త కసిగా తిట్టేసుకున్నా మొత్తం సీనియర్ స్టాఫ్ అంతటిని..

ఇంకా ఏమనాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు.. (ఇలాంటి కొత్త కొత్త నటనలు రియాక్షన్ లు.. చాలా అలవాటవుతాయిలేండి.).. ఫస్ట్ ఆఫ్ లో ఫోలీసుగా ఉండి.. సెకెండ్ ఆఫ్ లో దొంగలామారిపోయి.. జరిగే.. చెల్లిపెళ్ళిని దూరంగా చూస్తూ గోడను.. ఒకచేత్తో భలంగా నొక్కుతూ.. పట్టుకుని.. ఏడుస్తున్న సూపర్ స్టార్ కృష్ణ సీన్ గుర్తొచ్చి.. అదే మొహంపెట్టి.. అదే.. రియాక్షన్ పెట్టి.. కాసేపు బాధపడ్డాను..

చీ ఈ సాప్ట్వేర్ ఉద్యోగం కన్నా.. ఏదైనా పార్క్ లో ఐస్క్రీమ్ లు.. అమ్ముకోవటం బెస్ట్ రా బాబు సాయంత్రానికి.. ఎంత సాధించామో.. సంపాదించామో.. తెలుసుకోవచ్చు... ఎవడూ.. నాకీ ఐస్క్రీమ్ నచ్చలేదని.. సగం తిని తిరిగి ఇవ్వడు అని.. కూడా అనుకున్నాను.. మళ్ళీ బాధలో ఒక పెగ్గు పౌడర్ టీ… ష్.. బాధొచ్చినా సంతోషమొచ్చినా అదేకదా మాకు… మందు..

ఇలాంటి తలతిక్క పనులుచేయబట్టే.. అందరూ సాఫ్ట్వేర్ అంటే నవ్వుతున్నారు.. నవ్వరా మరి.. ఒక క్షణం బిజీ.. ఒకక్షణం ఖాలీ.. అంటే.. ఎవడికి నమ్మబుధ్ధి అవుతుంది..

ఇంతలో.. ఇంటినుండి ఫోను.. ఏరా.. బాగున్నావా.. ? అసలు ఫోను చేయటంలేదు.. ఆరోగ్యం ఎలా ఉంది.. అని అమ్మో నాన్నో ఆరా అడుగుతారు.. కాస్త నవ్వు తెచ్చుకుని.. బాగానే ఉన్నాను.. కాస్త బిజీగా ఉన్నా అందుకే చెయ్యలేదు.. మీరెలా ఉన్నారు.. అందరూ ఎలా ఉన్నారు.. అని కాసేపు.. ఎవో కబుర్లుచెప్పాకా..

మా దగ్గరేముంటాయిరా.. మీరే చెప్పాలి.. ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు అని అనగానే.. మా బ్రతుకులే చెప్పుకోవాలి అని అనాలనిపిస్తుంది... కానీ మన టెన్సన్స్ అన్నీ ఇంట్లో చెప్పటమెందుకులే అని.. ఏమున్నాయి.. తిన్నామా.. ఆఫీసుకు వెళ్ళామా.. పడుకున్నామా అంతే.. అలా నడిచిపోతున్నాయి రోజులు. బాగానే ఉంది అంతా అని చెబుతాం..ఇక ఎవరన్నా ఫ్రండ్స్ ని కలిసినప్పుడు.. మాటల్లో.. వస్తే.. నీకేంట్రా సాఫ్ట్వేర్ ఇంజనీరువి.. అనేమాటలే.. కాస్త వెటకారంగా అనిపిస్తుంటుంది...

ఇక తరువాత వారం రోజులు ఖాలీ.. తిండి.. చాటింగ్.. ఆర్కుటింగ్.. పడక అదే పని.. కళ్ళార్పకుండా.. సీరియస్ గా ఆర్కుట్లో.. రాబోయే స్ర్కాపుకోసం వెయిటింగ్…వచ్చిన స్ర్కాపుకి.. జవాబిస్తూ మళ్ళా ప్రక్కనున్న యాహూ. మెసెంజర్.. మెసెజ్ విండోలో ఎదో టైపుచేసి.. నాలో నేనే పిచ్చోడిలా నవ్వుకోవటం..

సరే టీ తాగుదాం అని (ఇప్పటికి ముప్పయ్యోది అనుకుంట గుర్తులేదు.. ) లేచానా.. అంతే.. ఎదురుగా ఉన్న డెస్క్ పై అమ్మాయి.. మానిటర్ వైపు చూస్తున్నట్లే కూర్చుని నిద్ర..

అబ్బబ్బా.. పొద్దున్నే ఈ నిద్రమొహాలేంట్రా బాబు.. ఆఫీసులో.. పనిలేని టైములోకూడా ఇలా నిద్రపోతుంటే.. ఏంబాగుపడతారు.. అసలీ ఆడవాళ్ళకెందుకంటావ్.. ఎందుకులే.. మళ్ళా మహిళా సంఘాలన్నీ నన్ను నిలదీసేస్తాయి.. అంటే అన్నామని.. మనకెందుకులే.. అని బయటకు పోయాను..

సరిగ్గా పదిరోజుల తరువాత మళ్ళా కొత్త ఇష్యూ అని చెప్పి.. ఎక్సెల్ షీట్ ఇచ్చారు.. ఈసారైనా.. సీరియస్ గా చెయ్యాలి. మాటపడకూడదు.. అని.. మొదలుపెట్టాను.. వచ్చిన మంచి గుడ్ మార్నింగ్ మెయిల్స్ చదువుతూ.. కాస్త ఇన్స్పిరెషన్ తెచ్చుకుని.. చాలా కష్టపడి.. ఒక్కదెబ్బకు రెండు స్ర్కీనులు లాగా.. రెండు అవగొట్టాను..

కాసేపటికి.. అప్లికేషన్ రన్ చేసి చూసాను.. అనుకోకుండా.. ఎర్రర్స్.. మళ్ళా.. ఎదో. పీకనొక్కేసినట్టు.. అయిపోయింది.. ఎంటిరా.. ఒక సెకను ముందు పనిచేసింది.. ఏమైంది.. దీనికి.. అని ఒక పావుగంట బుర్రపీక్కున్నాకా.. గమనించాను.. డేటాబేస్ లో ప్రోబ్లమ్ అని.. డేటాబేస్ వాడి దగ్గరకెళ్ళి.. ఫలానా టేబుల్ లో ఎర్రర్ వస్తుందేంటి.. అని అడిగాను..

హి హి హి.. అదా.. రాదేంటి మరి.. దాంట్లో నాలుగు కాలమ్స్ డిలీట్ చేసేసేగా.. అని చల్లగా చెప్పాడు..

కొత్త చేంజెస్ వచ్చాయి.. అవి చేస్తున్నాను.. అని వెటకారంగా చూసాడు..

మరి చెప్పాలిగా అన్నట్లు.. చూసాను.. చెబుతామండి.. చేసాకా.. అన్నట్లు చూసాడు..

వా…. ఓరి దేవుడో.. నన్ను రక్షించు.. అని సీలింగ్ వైవు చూసి.. పెద్దగా గావుకేకపెట్టాను.. ఎవరికీ వినపడకుండా….

రోజులు గడిచాయి… మా అక్కవాళ్ళ అమ్మాయి.. ఫోన్ చేసింది.. మావయ్యా.. రేపు శనివారం నా పుట్టినరోజు.. వస్తున్నావా? అని.. అడిగింది.. అవునా..? మర్చిపోయాను..!! అని కాకుండా కవర్ చేసుకుని.. తెలుసమ్మా.. కానీ రావటం కుదరదు.. డెలివరీ ఉంది.. అన్నాను..

ఎవరిది.. మావయ్యా..?? అంది.. (నాదే.. వర్కు…ఎక్కవై.. అని మనసులో అనుకున్నాకా..)
హ.. హా…హా.. (నవ్వలేక నవ్వాను..) ప్రోజెక్ట్.. లాస్ట్ లో ఉంది.. బిజీ అని చెబుతున్నానమ్మా అని అన్నాను.

ఎలాగైతే.. డెలివరీ చేసేసాం.. హమ్మయ్యా.. అనుకున్నాం.. తరువాత రోజు ఆఫీసుకు మంచి హుషారుగా వచ్చారంతా.. ఆ రోజు శుక్రవారం ఒకటేమో.. మొత్తం ఊళ్ళో ఉన్న దుకాణాల్లో ఏది.. కాస్త కొట్టొచ్చినట్టు..(చెత్తగా) కనిపిస్తుందో కనుక్కుని మరీ కొన్నట్లు.. ఉండే టీ షర్ట్స్.. కార్గోస్.. వేసుకొచ్చి.. కళకళలాడిపోయింది ఆఫీసంతా..

రిషెప్సనిస్ట్.. ఏ లిప్ కలర్ వేసుకొస్తుందో అని కాసేపు డిష్కషన్ జరిగింది.. కానీ మేమనుకున్న రంగుకాకుండా.. వేరేది వేసుకొచ్చింది మళ్ళీ.. అన్ని రంగులు తయారు చేసినోడికి కాదు కానీ.. అన్నీ కొని వాడుతున్నందుకు ఇవ్వాలి ఈ అమ్మాయికి అవార్డు.. అనిపించింది..

ఎప్పడూ ఏదోక సెస్నేషన్ వార్త పట్టుకొచ్చే.. సత్తిగాడు ఇంకా రాలేదేంట్రా అన్నానో లేదో.. వెనుకనుండి.. వచ్చేసాడు.. ఇక్కడే ఉన్నా అని మంచినీళ్ళు త్రాగుతూ.. గుటకలువేస్తూ..

ఓహో.. నువ్వు త్రాగటంలో బిజీనా.. రాలేదేమో అనుకున్నా నీ మాట వినపడేసరికి అని అంతా నవ్వుకున్నాం..

సత్తి: మీకో విషయం తెలుసా.. మన పీయమ్ రిజైన్ చెయ్యబోతున్నాడంట..
మేమంతా: నిజమా.. ఎందుకు?
సత్తి: నలుగురిని ఫైర్ చేసారంట.. ఐదో ప్లోర్ లో.. తెలుసా?
మేమంతా: కారణం ఏంటి?

ఇలా మొదలుపెట్టాడు.. టివి9 హెడ్ లైన్స్ లా.. కేప్షన్ తో సహా చెప్పాడు.. కానీ జవాబులు చెప్పడు వాడికలవాటే..

కానీ వాడు చెప్పే వార్తలకు.. ఎవడైనా కంగారు పడకుండా ఉండగలరంటే.. పొరపాటే..

తరువాత ఒక్క మంచి వార్త మాత్రం చెప్పాడు.. మనకు అబ్బాయి పుట్టాడంట… ప్రోజెక్ట్.. సక్సెస్ గా డెలివరీ అయ్యిందంట.. అని..

హమ్మయ్యా.. బ్రతికించావురా దేవుడా అనుకున్నాం టీమ్ మెంబర్స్ అంతా..

సరే పార్టీరా ఈ రోజు.. అని వేరే టీమ్ వాళ్ళు గ్లాసులు పట్టుకుని రడీ అయిపోసాగారు.. చూద్దాంలే అని.. మాట దాటేసాం..

డెస్క్ దగ్గరకెళ్ళి మెయిల్ చెక్ చేసుకోగానే.. మొదలుపెట్టాడు సత్తిగాడు.. పెద్దకేక పెట్టి.. ఒరే.. బగ్ లిస్ట్ పంపార్రోయ్… అని..

అబ్బాయే.. పుట్టాడు.. అచ్చు.. సత్తిగాడిలా ఉంటాడు… అని నేను పాడగా..
బాబోయ్ వద్దురా.. అమ్మాయే.. పుడుతుంది.. అచ్చు.. శీనుగాడిలా ఉంటుంది.. అని అన్నాడు..

హ హ హా.. హా.. అని పగలబడి నవ్వుకున్నామిద్దరూ...

(కొంపదీసి నా మోడ్యూల్ లోనే వచ్చుంటాయి.. దేవుడా.. అదే కోడ్..(నేను రాసిందే నేను) మళ్ళీ.. చదవాలంటే నరకం.. )

20, మే 2007, ఆదివారం

నేను సైతం




ఎవరి విలువ వారిదే..! ఎవరి పాత్ర వారిదే.. కాదంటారా..!!

ఒక్కరోజు ఆఫీసుకు వెళ్ళకపోతే మనంలేమని ఆగిపోయే పనులుండవా? , అలాగే మనం ఆధారపడే ప్రతి విషయంలోకూడా అంతే కదా?, మేనేజరు రాకపోతే మనకేం చేయాలో తోచదు. అలానే మనం లేని సమయంలో మా మేనేజరుకి అంతే. ఈ ఆధారం పడటం అనేది లేకపోతే..!! ఎలా ఉండేదో..!,
అసలీ ఆధారం అనేది డబ్బుతో వస్తుంది అనుకుంటాను.. బ్రతకటానికి అవసరం కాబట్టి మనం పనిచేసి సంపాదిస్తాము. మనకు బోలేడంత డబ్బుఉంటే పనిచేయనక్కరలేకపోయేలా ఉంటే మనకి ఎవరిపైనైనా ఆధార పడే అవసరం ఉండదా..?

అదే చూద్దాం.. మనకో పెద్ద బంగ్లా.. కారు.. ఉన్నా అన్నీ అమర్చిపెట్టడానికి ఎవరొకరు కావాలి. సరే అన్నీ మనమే చేసుకుంటాం. అంటే కుదరదు..!, ఏదొకదానికి ఎదుటిమనిషి అధారం తప్పదు. అసలి రాజు-పేద కాన్సెప్ట్ ఎవడు కనిపెట్టాడో, ఎలా వచ్చిందో కానీ.. బాగానే ఉంది..!!, లేకపోతే డబ్బులున్నవాడు పేదవాడిని చిరాకు చూపులు చూసేవాడు.. ఆటో అవసరంలేదని కారులో వెళ్ళినా.. వంటమనిషి అక్కర్లేదు హోటల్ లో తిందాం అనుకున్నా ఇక్కడా అధారం ఉంది ఎంత డబ్బున్నా రైతులా తనకు కావలిసింది తను పండించుకోలేడు.. అలానే రైతు తను పండించుకున్నది తనే దాచుకుని తినలేడు. ఇలా డైరెక్టుగా ఆధారాలు విషయం వదిలేద్దాం. ఇక ఇన్ డైరెక్ట్ అలోచిద్దాం..

మనమొక అమెరికన్ కంపెనీకి పనిచేస్తున్నాము.. అనుకోండి.. ఇక్కడే ఉన్నా అక్కడుండే వాళ్ళు తెలియకుండానే మనమీద ఆధారపడుతున్నారు. మనం చేసిన తప్పులు భరిస్తారు.. చేసి అమర్చినవి హాయిగా అనుభవిస్తారు. వచ్చిన డబ్బుతో మనమూ అంతే.. ఇలా ఆధారపడేవి.. అధారాలుగా నిలిచినవాటితో సంభంధం ఉన్నవాటిలో..ఒక్క క్షణంలో మనం చేసిన తప్పైనా ఒప్పైనా ఆ ప్రభావం ఉంటుంది.


బైకు పై స్పీడుగా వెళుతున్నాను.. నా ఆఫీసుటైమవుతుందని.. ఎప్పుడూ వెళ్ళే రూటులో.. సడెన్ గా ట్రాఫిక్ జామ్ అయ్యింది సరే కదా అని.. అంతే స్పీడుగా నిర్ణయం తీసుకుని ప్రక్క సందులోకి తిప్పబోతుండగా అంతే స్పీడులో వస్తున్న బైకర్ సడెన్ బ్రేకు కొట్టి నా బైకుని గుద్ది పడ్డాడు.. కాసేపు.. కోపంగా చూసుకున్నాం.. నీదే.. అంటే కాదు.. నీదే తప్పు అని తిట్టుకున్నాం.. చివరికి దులుపుకుని ఎవరిదారిన వాళ్ళం వెళ్ళిపోయాం..

తరువాత పావుగంట ఆఫీసుకు లేటు.. సీట్లో కూర్చున్నాకా పావుగంటసేపు అదే అలోచనతో కొంతసేపు సమయం వృధా.. కాఫీ టైములో పక్క కోలీగ్ తో ఈ విషయం చెప్పి అదొక అరగంట సుత్తి.. ఇంతేనండి.. హైద్రాబాద్ అంతా ఛంఢాలంగా తయారైంది.. ఈ ట్రాఫీక్.. మరీ దరిద్రంగా ఉంది.. మొన్న నేను నెక్లస్ రోడ్డు లో వెళుతున్నానా… అంటూ మళ్ళీ వేరొక కధ.. ఇంకా ఎవరన్నా చేరి తమకి జరిగిన సంఘటనలు ఇలా విక్రమార్క కధ చెబితే.. మళ్ళీ ఓ అరగంట.. ఇలా ఇలా.. పని విషయంలో ఒక రెండు గంటలు వెనుకబడ్డాం.

ఆ ట్రాఫిక్ జామ్ గురించి ఆలోచించి ఒక్క నిముషం వేచుండుంటే ప్రక్క సందులోకెళ్ళే ఆలోచనుండేదీ కాదు.. వాడు నన్ను ఢీ కొట్టేవాడూ కాదు.. పడేవాళ్ళమూకాదు.. ఇలా కధలూ ఉండేవి కాదు.. ష్… అబ్బా.. ఎన్ని ఆధారాలున్నాయి.. ఈ చిన్న సంఘటనకు..

ఇక పడ్డవాడు.. వాడికి సంభంధం ఉన్నవాళ్ళలో కూడా ఎంత గడబిడ జరిగిందో.. ఇలాంటి విషయాల్లో కూడా ఆధారం ఉంది.. అది చెబుదామనే.. ఈ స్టోరీ అంతా..

ఫుట్ పాత్ పై కాకుండా రోడ్డుపై నడిస్తే.. మనవెనుక వచ్చే వ్యక్తి వెళ్ళాల్సిన ట్రైను దాటిపోవచ్చు.. రొటీన్ కి భిన్నంగా చేద్దాం అని.. సడెన్ గా సినిమాకి ప్రోగ్రామ్ పెట్టి సినిమాకి స్నేహితులతో కలిసి వెళితే.. గాళ్ ఫ్రండుతో ప్లాన్ చేసుకున్న వ్యక్తికి టికెట్ దొరక్క.. వాళ్ళమధ్య మసస్ఫర్దలొచ్చి అలకలురావొచ్చు.

ఈరోజు ఇంటికెళ్ళి వండే టైములేదండి.. ఇక్కడ తినేద్దాం అని హోటలుకెళ్ళిన ఒక జంట వలన.. ఆ హోటల్ పై ఆధారపడిన మిగిలింది తిని బ్రతికే ఒక ముసలతనికి ఆకలితో పడుకునేలా చేయొచ్చు. ఈ అనుకోని ఆధారాలు కూడా డేంజర్ లానే ఉన్నాయి కదా. అందుకే చేసే ప్రతిపని ఆచితూచి చెయ్యాలి..

అంటే మరీ ఆలోచించి పిచ్చివాళ్ళవ్వక్కర్లేదు కానీ.. కాస్త అలోచిస్తేచాలు.. మనకు తెలియని ఆధారాలు.. నష్టాలకు మన భాద్యతలేకపోయినా తెలిసి ఏదీ.. శచేయకుంటేచాలు.. నా ఇష్టం వచ్చినట్లుంటాను నీకేంటంటా.. అనుకునే చాన్సే రాకుండా ఉంటే చాలు.. ఆ.. ఎవడూ చూడటంలేదు కదా..పర్లేదులే.. అనుకోకుంటే చాలు....

మనం చాలా మందిపై ఆధారపడి ఉన్నవాళ్ళం.. అలానే మనపై కూడా ఎందరో ఆధారపడి ఉన్నారు.. ఒకరి చేయి పట్టుకుని ఒకరు తిరుగుతూ చేసుకున్న వలయం మనది.. మనం తప్పటడుగు వేస్తే మనవెనుకున్నవాడు.. అలానే వాడివెనుకున్నవాడు గీత తప్పి.. మొత్తం వలయమే గతి తప్పి మతిలేకుండా పోయే.. ప్రమాదముంది..


దేశానికి సేవ అంటే... ఆర్మీలో చేరి.. శత్రుదేశంతో పోరాడి వీరమరణం పొందినవాళ్ళు దేశసేవకే పుట్టారంటారు.. ఆ ఆదృష్టం అందరికి దక్కదనుకోండి.. అందరూ జవానులై దేశసేవ చేస్తానంటే..ఇక సేవలందుకునే జనమూ ఉండరూ..
ఒక డాక్టర్ రోగిని బ్రతికిస్తే.. ప్రాణాలిచ్చాడు.. దేవుడంతటివాడు..అంటారు..

అలానే ఇంజనీరు.. ఎందరికో నీళ్ళిచ్చి.. గృహాలు కట్టి.. సేవచేయగా.. అతనూ దేవుడే..

మరి నేనూ ఆ కేటగిరీలో లేను కాబట్టి మనిష్టం మనమీద ఆధారపడేవాళ్ళులేరు.. అని పనులుకానీయకండి.. అలా అని నేనెందుకూ పనికిరానని బాధాపడకండి..

మనకున్న పనిని సక్రమంగా నిర్వర్తించి.. ఎదుటివారికి ఇబ్బందిలేకుండా బ్రతకగలగడం కూడా గొప్ప దేశసేవేనండోయ్.. అది ఒక కళ కూడానూ.. ఎలా అంటారా.. అబ్బా ఇప్పటివరకూ చెప్పింది మీరు ఏమి విన్నట్లు.. మరి. అంతా మళ్ళీ చెప్పి.. మిమ్మల్మి ఇబ్బందిపెట్ట దలచలేదండి.. కాబట్టి..

ఈ లోకంలోకొచ్చినందుకు అనుక్షణాన్ని అనుభవిస్తూ.. ఆనందం పంచుతూ.. మనదైన శైలిలో ముందుకు సాగిపోదాం.. నేనుసైతం అంటూ..

సర్వే జనా సుఖినోభవన్తు…

1, మార్చి 2007, గురువారం

ఈనాటి రామాయణం




ఆఫీసులో కాస్త పని తగలడంవలన, ఇంటికి కాస్త లేటుగా వెళ్ళాల్సిరావొచ్చునని శ్రీరామచంద్రుడు సీతాదేవికి ఫొన్ చేయసాగాడు.. చాలాసేపటివరకూ నెట్వర్క్ బిజీ అని వచ్చేసరికి.. శ్రీరామచంద్రులవారికి ఓపిక నశించింది.. "ఛ.. ఆ బిఎస్ ఎన్ ఎల్ తీస్కోవద్దూ.. సరిగా సిగ్నల్ ఉండదు అని చెప్పినా వినిపించుకోకుండా.. అదే కావాలని మారాంచేసి మరీ తీసుకుంది సీత.. ఇప్పుడు అవసరమైనప్పుడు ఈ నెట్వర్క్ బిజీ అవుతుంది", అని చిరాకు పడ్డారు. కాసేపటికి కనెక్ట్ అయ్యింది.. కానీ ఎంతసేపు రింగ్ అవుతున్నా సీతాదేవి ఫోన్ లిప్ట్ చేయకపోయేసరికి, శ్రీరాముడు మనసు కాస్త శంకించింది.. ఎదన్నా ప్రోబ్లమ్ ఏమోనని.. కాస్త భయమేసింది.

కొంతసేపటికి ఫోన్ లిప్ట్ చేసారు కానీ సీతాదేవి మృదువైన పలుకులు కాక.. కేకలు వినిపిస్తున్నాయి.. ఎవరిదో భయంకరమైన నవ్వు వినిపిస్తుంది. చుట్టూ పెద్ద హెలీకాప్టర్ సౌండులాగా.. గోలగోలగా ఉంది.. ఆ భయంకర నవ్వు నవ్వుతున్న వ్యక్తి..
“మాట్లాడు ఇదిగో మీ శ్రీరామచంద్రుడితో.. నిన్ను నా లంకకు తీసుకెళ్తున్నానని చెప్పు.. కావాలంటే ఎడ్రసు చెప్తాను నోట్ చేసుకోమను.. గ్రేట్ లంకా ఎవెన్యూ, ఫేస్ సెవెన్.. అక్కడ దిగి టాక్సీ ఎక్కి.. రావణ్ మహల్.. అంటే ఎవడికైనా తెలుస్తుందని చెప్పు.. “, అని గర్జిస్తూ డైలాగులు వినపడ్డాయి.
ఏదో పెద్దశబ్దంతో ఫోన్ కట్టయ్యింది. శ్రీరాములవారికి కంగారు మొదలయ్యింది. ఎదో అనుకోని ప్రమాదంలో సీత చిక్కుకుంది అని లక్ష్మణునికి ఫోన్ చేసాడు.

“జయ జయ రామ్.. శ్రీరామ పరంధామా.. జయరామ పరంధామా.. రఘురామ రామ రణరంగ భీమ… జగదేక సార్వభౌమా……”, (లవకుశ సినిమాలోని పాట) అని వస్తున్న లక్ష్మణుడి ఫోన్ కాలర్ ట్యూన్ ని టెన్సన్ తో వింటున్నారు శ్రీరాములవారు.
లక్ష్మణుడు ఫోన్ తీసి "అన్నయ్యగారు.. నేను బయట ఉన్నాను ఇంటికి వెళుతున్నాను.. చెప్పండి" అని వినయంగా అడుగగా.. శ్రీరాములవారు అంతా వివరంగా చెప్పారు.

కంగారుపడ్డ లక్ష్మణులవారు.. "అవునా? అన్నగారు.. !! నన్ను బజారుకు వెళ్ళమన్నారు వదినగారు.. నేను అన్నయ్యగారు వచ్చాక వెళ్తాను అంటే కాస్త కోప్పడ్డారు. సరే కదా అని ఒంటరిగా విడిచి వెళ్ళాను”.

“బజారునుండి బయలుదేరేటప్పుడు ఎదో మర్చిపోయి అడుగుదాం అని వదినగారికి కాల్ చేస్తుంటే ఈ నెంబరు మనుగడలో లేదు మీరు కాల్ చేసిన నెంబరు సరిచూసుకోండి అని చెప్తుంది.. నాకర్దంకాలేదు.. సరేలే అని లేండ్ నెంబరుకు ట్రైచేసాను.. అది కూడా లిప్ట్ చెయ్యలేదు.. అసలే అది చక్రవాకం సీరియల్ వచ్చే సమయం.. వదినగారు ఇల్లువిడిచి ఎక్కడకూ వెళ్ళరు కూడా.. అందుకే కంగారుగా ఇంటికి చేరుకుంటున్నా”, అని.. చెప్పాడు లక్ష్మణుడు..

జరిగిందానికి శ్రీరాములవారు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. లక్ష్మణుడు ఎలా జరిగుంటుంది అంతా విచిత్రంగా ఉందే.. అని విశ్లేషణ చేయసాగాడు.
“ఎలాగైనా ఆ లంకా ఎవెన్యూ ఎంతదూరమో కనుక్కొని వాడి పని చెబుదాం మీరేమీ టెన్సన్ పడొద్దు.. మా స్నేహితులందరికీ ఈ విషయం ఎసెమ్మెస్ చేసాను.. ఎవరో హనుమంతులవారని మంచి మేధావి మహాబలుడు ఉన్నారని రిప్లై వచ్చింది. వివరాలు అన్నీ కనుక్కున్నాను. అతను ఎటువంటి ఎడ్రసునైనా గూగుల్ లో వెతికి పట్టేస్తాడంట.. ఎలాంటి చోటకైనా వెళ్ళి చెప్పిన పనిని సునాయసంగా చేయగలడంట.. అందుకే ఆయనని తీసుకురమ్మని నా స్నేహితునికి చెప్పాను. ఇప్పటికి వాళ్ళు బయలుదేరి ఉంటారు.. మీరేమీ చింతించవద్దు. మనకంతా మంచే జరుగుతుంది అన్నయ్యా “, అని.. శ్రీరాములవారిని ఓదార్చాడు లక్ష్మణుడు.

హనుమంతులవారు హడావుడిగా శ్రీరాములవారిని చేరుకుని నమస్కరించారు. “నేను మీకు చాలా అభిమానిని సార్.. ఎప్పట్నండో మిమ్మల్ని కలవాలని ఎదురుచూస్తున్నాను. కానీ ఇలా కలవాల్సొస్తుంది అని అనుకోలేదు.. మీరేమీ భాదపడొద్దు. ఇప్పటి టెక్నాలజీతో సాధ్యంకానిది ఏదీలేదు.. నేను మీకు తప్పనిసరిగా సాయపడతాను”, అని హామీ ఇచ్చి తన దగ్గర ఉన్న లాప్ టాప్ ని ఓపెన్ చేయసాగారు హనుమంతులవారు.

“ఇది ఇంటెల్ వారి సెంట్రినో డ్యూయో తో బలపర్చబడినది.. చాలా వేగవంతమైనది..”, అంటూనే గూగుల్ ఎర్త్ స్టార్ట్ చేసి.. సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. లంక మొత్తం డెక్కటాప్ పై లోడ్ అయ్యింది.. జూమ్ చేయసాగారు.. హనుమంతులవారు.

బిల్డింగ్స్ తో సహా అన్ని కనపడేసరికి శ్రీరాములవారిని ఆశ్చర్యచకితులను చేసింది. “ఇది ఓపెన్ సోర్సా అని అడిగారు కుతూహలంగా.. కాదు స్వామీ, ఫ్రీవేర్ అంతె అన్నారు.. “, హనుమంతులవారు..
“సరేసరే.. మనం ఉన్న చోటు చూపించండి.. తరువాత, సీత ఉన్న లంక సంగతి చూద్దాం అన్నమాటలు నోటిదగ్గరవరకూ వచ్చేసాయి. మళ్ళీ ఎందుకులే.. సీతకన్నా ఈ గూగుల్ ఎర్తే ఇంట్రస్టింగా ఉంది”, అని అందరూ అనుకునేరు అని కుతూహలాన్ని దాచేసుకుని.. ఆగిపోయారు శ్రీరామచంద్రులవారు.

“ఛ.. !! కష్టం అని నిట్టూర్చారు..”, హనుమంతులవారు.. శ్రీరామచంద్రులవారితో సహా లక్ష్మణులవారుకూడా కనుబొమలు చిట్లించి “ఏమైనది”, అని అడిగారు ఆశ్చర్యంతో.. “ఇది ఇంకా బీటా వెర్షన్ స్వామీ.. సరిగ్గా ఆ లంకలో మనకు కావలిసిన ఇమేజస్ దగ్గరకొచ్చేసరికి.. రావటంలేదు.. ఇంకా కనస్ట్రక్సన్ లో ఉంది.. ఇమేజస్ గేదర్ చేస్తున్నాం అని వస్తుంది.. ఇపుడు.. మనకు కాస్త కష్టమే స్వామి”, అని బాధపడ్డారు. హనుమంతులవారు.

“సరే నేను లంకకు బయలుదేరతాను.. ఎలాగూ కాస్త ఆచూకీ తెలిసింది కాబట్టి.. దానితో అక్కడికి చేరుకుని వెతికి అసలు చోటు పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు స్వామి.. మీరు చింతించవద్దు.”, అని శ్రీరామచంద్రులవారి దగ్గర సెలవు తీసుకుని హనుమంతులవారు లంకకు బయలుదేరారు.

ఇంకా ఇతర మార్గాలగురించి వెతుకుతూ.. లక్ష్మణుడు, శ్రీరాముడు.. అలోచిస్తూ.. ఉద్యానవనంలో తిరుగుతుంటే.. పరిచారిక వచ్చి.. “స్వామీ!! మన సీతమ్మగారిని టీవీలో చూపిస్తున్నారు..”, అని చెప్పేసరికి.. ఇద్దరూ టీవీ చూడటానికి పరుగుపరుగున లోపలికెళ్ళారు.

Tv 99 అనే చానల్ లో చెట్టుకింద కూర్చుని ఉన్న సీతాదేవిపై ఇంటర్వూ జరుగుతుంది.. “అసలు మీరెవరో.. ఇక్కడికి ఎందుకు వచ్చారో.. మాప్రేక్షకలోకానికి వివరంగా చెప్పండి”, అంటూ ఒక ఏంకర్ చేతిలో మైకును కత్తి తిప్పినట్లుగా తిప్పుతూ ప్రశ్నల యుద్ధంచేస్తున్నాడు.. సీతాదేవి ఏమీ మాట్లాడక మౌనం వహించి.. ఉంది.

సీతాదేవి ఎక్కడుందో ఎలా ఉందో తెలియక సతమతమైన సమయంలో.. టీవీలో చూసి కాస్త మనసుకుదుటపడినా.. ఆమె పరిస్తితి చూసి శ్రీరాములవారికి, లక్ష్మణునికి కళ్ళవెంబడి నీళ్ళుకారాయి.. అమెను చూస్తున్నా ఎమీ చేయలేని పరిస్ధితిలా తోచింది శ్రీరాములవారికి.

కాసేపటికి సీతాదేవి పెదవివిప్పి మాట్లాడటం మొదలుపెట్టింది. జరిగినదంతా చెప్పింది.. తనని ఎలా ఆ రావణాసురుడు వలలో చిక్కుకుని.. అతను లంకకు తీసుకొచ్చాడో వివరించింది. ఎలాగైనా ఈ విషయాన్ని మా శ్రీరామచంద్రులవారికి చేర్చమని వేడుకుంది. ఏంకర్ కెమేరామేన్ ని కాస్త సీతాదేవి.. కళ్ళవెంబడి నీళ్ళను. క్లోజప్ అన్నట్లు సైగచేయగా.. కెమేరామేన్ జూమ్ చేసి చూపించసాగాడు.. మధ్యలో ఒక్కసారిగా ఏంకర్ కెమేరాకు అడ్డొచ్చి.. “ఇప్పుడు కాసేపట్లో మీకు ఈ కిడ్నాపింగ్ కి కారణాలు.. ఎలా జరిగిందో విశ్లేషిస్తూ.. ఒక డాక్కుమెంటరీ చూపిస్తాం అప్పటివరకూ ఓ చిన్న బ్రేక్.. “, అని ఎడ్వర్టైజ్ మెంట్స్ వేయసాగారు.

బ్రేక్ తరువాత డాక్యుమెంటరీ.. వేయడం మొదలుపెట్టారు , ఊహా చిత్రం.. లాగా కొన్ని కేరెక్టర్స్ తో.. కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. క్రింద అప్పుడే స్క్రోలింగ్ మొదలుపెట్టారు..
సీతాదేవి శ్రీరాముడిని చేరుకుంటుందా..?? ఎ) లేదు బి) అవును సి) చేరుకోవడం చాలా కష్టం డి) చెప్పలేం.. వెంటనే 1233 కి ఎసెమ్మెస్ చేయండి.. బహుమతులు గెలుచుకోండి.

అక్కడే తరువాత రాబోయే కార్యక్రమం గురించి కూడా రాసారు.. సీతాదేవితో మాట్లాడాలంటే ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయండి అని.. కొన్ని నెంబర్లు ఇచ్చారు.

తరువాత కార్యక్రమానికి Tv 99 కి ఫోన్ చేద్దాం అని నిర్ణయించారు. లక్ష్మణుడు ఫోన్ ట్రైచేసాడు.. చాలా సేపటికి దొరికింది.. లైవ్ షో అయినప్పటికీ చాలామంది కాలర్స్ ఉండటం వలన.. ఎవరో అమ్మాయి మాట్లాడి లైనులో ఉండమన్నారు.. అపుడు శ్రీరామచంద్రులవారు.. సీతాదేవి తన భార్య అని.. అమె ఉన్న ప్రదేశం ఎక్కడో చెప్పమని వాళ్ళని అడిగారు. దానికి ఆ అమ్మాయి నవ్వుతూ.. “అది ఇంకా రెండురోజులవరకూ చెప్పలేంసార్.. అదే మా బిజినెస్ వ్యూహం.. సార్.. ఏ టీవీ చానల్ కి తెలియని విధంగా మా రిపోర్టర్స్ కష్టపడి సంపాదించిన కొత్త వార్త ఇలా అందరికీ చెప్పకూడదు.. మీరు భర్తఅయినా మా లైవ్ షో చాలా రసపట్టులో ఉంది.. ఎసెమ్మెస్ లు రావడం మొదలుపెట్టాయి.. ఒక ఎనిమిదిగంటలు ఆగాక అపుడు చెప్తాం”, అని నవ్వుతూ సమాధానమిచ్చిందామె.

ఫోన్ కట్ అయిపోయింది. తరువాత ఎన్నిసార్లు ప్రయత్నించినా మరలా కాల్ కలవలేదు.. ఆగ్రహంచెందిన లక్ష్మణుడు.. Tv 99 ని మట్టుపెట్టాలని ఆవేశంగా కదిలాడు.. “అన్నగారు.. ఆ రావణుడికన్నా ఈ మీడియా రావణులను.. ముందు మీరు వధించాలి”, అని.. అస్త్రశస్త్రములు తీసుకొచ్చి శ్రీరామునికిచ్చి.. నమస్కరించెను.

శ్రీరాముడు.. యుద్దానికి సన్నద్దమయ్యెను..

శ్రీరాఘవం ధశరధాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుభాహుం అరవిందదలాయ దాక్షం
రామం నిశాచర వినాశకరం.. నమామి…

-------------------------------------------------------------------------
ఎక్కడ అన్యాయాలకూ, అక్రమాలకూ, అవినీతులకూ హద్దూ అదుపూ ఉండదో, ఆ అన్యాయాలపై కూడా ఆధారపడి ఎవరు వ్యాపారాలు చేస్తుంటారో.. అవి చోద్యంలా చూస్తూ.. పట్టించుకోని ప్రజలూ, ప్రభుత్వాలు.. ఉంటాయో... అక్కడ మరో శ్రీరాముడో.. మరో శ్రీకృష్ణుడో అవతరించాలని ఆశిద్దాం.
ఇలా ఆశించడమైనా మన కర్తవ్యంగా భావిద్దాం.

21, ఫిబ్రవరి 2007, బుధవారం

బిల్ గేట్స్ ఇండియా పర్యటన



బిల్ గేట్స్ ఇండియాలోని టెక్నాలజీ గురించి, సాప్ట్ వేర్ అభివృద్దిని గురించి తెలుసుకోవడం కోసం నాలుగు రోజుల పర్యటనపై ఇండియా బయలుదేరాడు. బెంగుళూరుకి ఫ్లైటులో చేరుకుని కారులో హోటల్ కి బయలుదేరమన్నాడు డ్రైవర్ ని… సెక్రటరీ చిన్న నవ్వు నవ్వి.. సార్ ఇక్కడి నుండి టెక్నాలజీ మీట్ సమావేశానికి వెళిపోతున్నాం అన్నాడు. అదేంటి అది ఇంకా నాలుగు గంటల తరువాత కదా ఇప్పట్నుండి ఎందుకు, ఏంటి అంతదూరం ఉంటుందా మనం వెళ్ళవలసింది ? అన్నాడు అమాయకంగా బిల్ గేట్స్ . బెంగుళూరులో ఇంతే సార్.. ట్రాఫిక్ జామ్ ఇప్పుడు బయలుదేరితే ఆ సమయానికి చేరుకుంటాం అన్నాడు.

డ్రైవర్ మిర్రర్ లో బిల్ గేట్స్ అమాయకపు మొహం చూస్తూ… బెంగుళూరుకి కొత్త అనుకుంట పాపం… అని ముసిముసిగా నవ్వుకున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నారు. డ్రైవర్. దిగి.. సార్ నేను ఒక అరగంట అలా ఇలా తిరిగి వస్తాను… మీరు వస్తారా? అని అడిగాడు.. హా.. … ఏంటి అంటే అరగంట వరకూ ఇక్కడనుండి కదలలేమా. అని నోరెళ్ళబెట్టాడు. ఇది మాములే సార్ పదండి వెళదాం అక్కడ రోడ్డుప్రక్కన దోశలు వేస్తారు చాలా బాగుంటాయి అని ఆహ్వానించాడు సెక్రటరీ.

అలా నడుస్తూ వెళ్ళి దోశలు ఆర్డర్ ఇచ్చారు. ఎక్కడ చూసినా జనం రోడ్డు ప్రక్కన లాప్ టాప్ ల్లో మొహాలు పెట్టి సీరియస్ గా ఎదో చేసేస్తున్నారు.. ఏంటిది.. ఇంత డవలెప్ మెంట్ ఉందా ఐటికి అని అడిగాడు సెక్రటరీనీ. అవునుసార్ వీళ్ళంతా సాప్ట్ వేర్ ఇంజనీర్లు సార్. సాయంత్రం నైట్ షిప్ట్ కోసం పొద్దున్నే బయలుదేరిపోతారిలా ఆఫీసుకు.. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ లా , వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్ జామ్స్ అన్న మాట. అని చెప్పాడు సెక్రటరీ.. అవును నిజమే ఎటుచూసినా సాప్ట్ వేర్ ఇంజనీరులే కనిపిస్తున్నారు.. అయితే మన ఈ ఐటి కి ఇక్కడ మంచి పేరుందిలా ఉందే అన్నాడు గర్వంగా.

అవునండీ ఒక సంవత్సరం క్రితం చెప్పుకునేవారు బెంగుళూరులో ఒక రాయి విసిరితే అయితే కుక్కకి లేదా సాప్ట్ వేర్ ఇంజనీరుకి తగులుతుంది అని.. కాని ఇప్పుడు రాయివేస్తే కచ్ఛితంగా సాప్ట్ వేర్ ఇంజనీరుకు తగులుతుంది అంటున్నారు అంతా.. నేనూ ఇప్పుడు అది నిజం అని నమ్ముతాను సార్ అన్నాడు సెక్రటరీ నవ్వుతూ.

కాసేపటికి ట్రాఫిక్ కదలడం మొదలయ్యింది.. హమ్మయ్యా అనుకుంటూ బయలుదేరారు. కొంత దూరం వెళ్ళేసరికి

వేలమంది జనం లైన్లలో నిలబడి ఉన్నారు ఒకచోట… ఇక్కడ ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్టుందయ్యో ఆ జనం అది చూస్తే నాకు భయంగా ఉంది అన్నాడు బిల్ గేట్స్, డ్రైవర్ ని వేరే రూట్ నుండి పోనివ్వమని చెప్పు అన్నాడు సెక్రటరీతో. కాదు సార్ అది జాబ్ ఫేయిర్. వీళ్ళంతా మన రేపటి ఐటి పౌరులు సార్.. అదిగో చూడండి… అక్కడ టెక్నాలజీ కి తగ్గట్టుగా లైను కట్టారు… , సార్ మనలో మన మాట.. జావాలైనుకన్నా మన టెక్నాలజీస్ లైనే పెద్దదిగా ఉంది సార్… ఇక నుండి మనం ఏ కొత్త టెక్నాలజీ రిలీజ్ చేసినా ఆన్ లైన్ ఫోరమ్స్ , ఒపినీయన్ పోల్స్ వేస్ట్ సార్ ఇక్కడ లైను పొడవు చూస్తే చెప్పొచ్చు సార్ హిట్టో ప్లాపో.., అని పొంగిపోతూ చెప్పాడు సెక్రటరీ.

రూటుమార్చి ప్రక్క రోడ్డునుండి ఎలాగైతే టైముకు సమావేశానికి చేరుకున్నారు. బిల్ గేట్స్ భావోద్వేగంతో బెంగుళూరుని... ఇండియాని పొగిడేసి త్వరలో భారతదేశానికి వస్తున్న కొత్త ప్రాజెక్టులు, పధకాల గురించి పెద్ద వ్యాసం చదివేసాడు.

సాయత్రం హైదరాబాదుకు వెళదాం, ఎవరినీ కలిసేది లేదు కానీ, ఒక సామాన్య వ్యక్తిలా తిరుగుదాం.. అక్కడ కూడా ఎలా ఉందో చూద్దాం పద, అని ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యమన్నాడు.

హైటెక్ సిటీ ఆ ప్రదేశాలు తిరిగి తిరిగి.. చాలా మారిపోయింది.. అంతా మన ఐటి చలవే అని ఆనందపడిపోయాడు..

సరే అమీర్ పేట్ వెళదాం అక్కడ ఐటి చాలా ఫేమస్ అంట కదా అని బయలుదేరారు.

అమీర్ పేట్ సెంటరుకి చేరుకునేసరికి డ్రైవరు సార్ ఈ సందులోకే మనం వెళ్ళాలి సార్ కానీ కారు వెళ్ళదు అన్నాడు.

ఏ.. ఇరుకు సందా? లేక రోడ్ బాగోదా అని అడిగాడు సెక్రటరీ డ్రైవరును. కాదు సార్ అటు చూడండి అని ఆ సందు దగ్గరగా కారు ఆపి చూపించాడు. రోడ్డంతా పాంపెట్లతోటీ నిండి పోయింది. పైన ఎడ్వర్టైజుమెంట్ బ్యానర్ల తలకి తగిలేలా కట్టేసి ఉన్నాయి ఎటుచూసినా..

ఏంటయ్యా ఇది అని అడిగాడు సెక్రటరీని.. సార్ ఇక్కడ అన్నీ ఐటి ఇన్స్టి ట్యూట్స్ ఉంటాయి, మనం రిలీజ్ చేసిన ఏ ప్రొడక్ట్ , సాఫ్ట్ వేర్ అయినా వారంరోజుల్లో ఇక్కడ కోర్సు చెప్పడం మొదలుపెట్టేస్తారు సార్.. చెప్పాడు సెక్రటరీ.. ఓహో ఐతే మంచిదే కదా.. అంటూనే అక్కడ ఉన్న బ్యానర్ చూసి ఆశ్చర్యపోయాడు.. జావా రెండువేలకే.దానితో సీక్వెల్ సెర్వర్ ఫ్రీ… అని రాసిఉంది.. "హా..!! ఏంటి మన డాటాబేస్ ఫ్రీ నా…!", పోనీలే మన ప్రోడక్ట్ కి ప్రొమోషన్లా ఉంటుంది.. ", అని సరిపెట్టుకుంటుండగా… మైక్రోసాప్ట్ డాట్నెట్ 2.0 ఒక గంటలో.. పదిహేనేళ్ళ అనుభవం గల అప్పారావు చే… లిమిటెడ్ సీట్స్, త్వరపడండి.. ఫిజు.. 20 రూపాయలు మాత్రమే అని రాసున్న మరో బ్యానర్ చూసేసరికి బిల్ గేట్స్ కి కళ్ళుతిరిగినంత పనయ్యింది.. బాబోయ్.. ఏంటి గంటలో చెప్పేస్తారా?, ఇంజక్షన్ లాంటిది ఏమన్నా కనిపెట్టుంటారయ్యా ఈ హైదరాబాద్ వాళ్ళు.. వెళ్ళగానే సిరంజిలో డాట్నెట్ ఎక్కించేసి పొడిచేస్తారేమో… లేకపోతే ఒకగంటలో ఎలా చెప్తారంటావ్.. అయినా అతని అనుభవం చూడు పదిహేనేళ్ళంట.. డాట్నెట్ వచ్చి నాలుగేళ్ళు కూడా అయ్యిండదూ.. పదిహేనేళ్ళంటే అప్పటికి నేను కంప్యూటరు కూడా పట్టుండను.. హ హ అని నవ్వుకున్నాడు బిల్ గేట్స్. సరే సార్ ఒక్కసారి క్లాసుకెళదాం ఎలా చెప్తారో అని క్లాసుకెళ్ళి విని వచ్చారు.


సాయంత్రానికి అంతా తిరిగి తిరిగి ఒక హోటల్ రూమ్ కి చేరుకున్నారు. తరువాత రోజు ప్లాన్స్ ఏంటో అడిగాడు సెక్రటరీని బిల్ గేట్స్. రేపు మళ్ళీ బెంగుళూరు వెళ్ళాల్సిరావొచ్చు సార్. మన విండోస్ విస్టా అఫీషియల్ రిలీజ్ ఇన్ ఇండియా సార్ అన్నాడు.. ఉలిక్కిపడ్డ బిల్ గేట్స్ వద్దులేవయ్యా మళ్ళీ బెంగుళూరు ఎందుకులే ఎవరొకరు అది చేసేస్తారులే ముంబయి నగరాన్ని చూడాలనుంది సరదాగా అలా తిరిగొద్దాం ఇక ఇండియా టెక్నాలజీ చూసుకో అక్కర్లేదు ఎలాగూ ఇప్పటివరకూ చూసాం కదా అని అన్నాడు నవ్వుతూ. సరే అన్నాడు సెక్రటరీ.

తరువాత రోజు గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర్లో ఉన్న ప్రాంతాలన్నీ కాలినడకతో తిరుగుతున్నారు.

అలా వెళుతుండగా అక్కడ ఒక చోట సీడీలు అమ్మే దుకాణంలో ఒక సీడీని చూసిన బిల్ గేట్స్ కళ్ళుతిరిగి కిందపడ్డాడు.

అక్కడ ఏం చూసారు సార్ అని సెక్రటరీ చూడగా ఏ సీడీ అయినా ఏభై రూపాయలు అని ఉన్న చోట, విండోస్ విస్టా సీడీని చూసి కళ్ళుతేలేసి నోరు తెరిచాడు సెక్రటరీ.

------------------------------------------------------------

ఒక కల్పిత వ్యంగ్య రచన. ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యముతో కాదు (కులదైవం బిల్ గేట్స్ ని అసలే కాదు)

12, ఫిబ్రవరి 2007, సోమవారం

తేనెలొలుకు తెలుగు… మా పాట

ఇంటర్నెట్ విప్లవంతో నా కలలు కొన్ని నిజంచేసుకోగలిగాను. ఒకప్పుడు.. ఇంగ్లీషులో రాసి రాసి.. చిరాకు పుట్టి.. తెలుగులో రాసే అవకాశం ఈ ఇంటర్నెట్ కి ఎప్పుడొస్తుందా అనుకున్న నాకు అది ఇప్పుడు చేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా బ్లాగులో కధలు, నా అనుభవాలు రాసి.. స్నేహితులకు పంచుకున్న తీపిగురుతులు నిజంగా చాలా ఆనందాన్నిస్తున్నాయి. ఆర్కుట్ పుణ్యమా అని పరిచయమైన ఒక స్నేహితుని సహాయంతో నాకున్న పాటలు రాసే అభిరుచిని కూడా మెరుగుపర్చుకున్నాను.

మేమే నమ్మలేని విధంగా ఇప్పటికి 20 తెలుగు పాటలు చేయగలిగాము. అదీ ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా.. అంతా చాటింగ్లో మాట్లాడుకుంటూ.. మార్పులూ చేర్పులూ చేస్తూ.., కొంతమంది దగ్గర అభిప్రాయాలు సేకరిస్తూ ఉన్నాము.

ఈ పాటలు ఎవరికోసము కాదు.. మాకుమేం విని ఆనందిస్తున్నాము ప్రస్తుతానికి. కొన్ని ఆశయాలు ఉన్నా అవి అచరనలోకి వచ్చే సరికి కాస్త సమయం పట్టవచ్చు.

ఈ తెలుగు బ్లాగరుల గుంపులో సభ్యత్వం, మిత్రుల అభిప్రాయాలు చదువుతూ ఉంటుంటే నాకు ఈ హిందీ రాజ్యంలో ఉన్నా తెలుగుదేశంలోనే ఉన్నట్లనిపిస్తుంది. ఈ మహత్కార్యాన్ని అంకురార్పన చేసిన మిత్రులకు.. దానిని విజయవంతం చేసిన వారికీ నా కృతఘ్ఞతలు.

నా ఇరవయ్యో పాటగా.. తెలుగు భాషపై చూపుతున్న చిన్నచూపుపై వేదనను వ్యక్తంచేస్తూ చెయ్యడం జరిగింది. ఈ పాటను మన తెలుగు బ్లాగరుల గుంపుకు అంకితమిస్తున్నాను. ఈ పాటవిని దీనిపై అభిప్రాయమును తెలియపరుచగలరు.

సాహిత్య పరంగా ఆభిప్రాయమును తెలియపరిచినచో నేను అవి మెరుగుపర్చుకొనుటకు ప్రయత్నించగలను. సంగీతపరంగా తెలిసినవారు కూడా తమ తమ అభిప్రాయాలు చెప్పగలరు.

ఇక పాట గురించి:

సాహిత్యం : నా సొంతము
కూర్పు, సంగీతం, గానం: శ్రవణ్ కుమార్.

ఇది గానం పరంగా అంత అద్భుతంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే పాటలు పాడే కళ వేరు. కానీ పాట ఇలా ఉంటుంది అని చెప్పడంకోసం ఎవరొకరు పాడాలి కాబట్టి.. శ్రవణ్ పాడిన పాట ఇది. ఎవరైనా మంచి గాయకులు దొరికితే.. తప్పకుండా మళ్ళీ పాడించడానికి ప్రయత్నిస్తాము. ఆశక్తి కలవారు నాకు తెలుపగలరు.

మా ఈ మహత్కార్యంలో పాలుపంచుకుని సహకరించిన (సహకరిస్తున్న) శ్రీనివాసరాజు దాట్ల గారికి, రామనాధరెడ్డి గారికి

ప్రత్యేకంగా కృతఘ్ఞతలు చెప్పుకుంటున్నాము.


ఈ పాటను ఇక్కడ వినగలరు.(డౌన్ లోడ్ సౌకర్యం కలదు)

Telugu Lessa.mp3



ఇక్కడ నుండి డౌనులోడ్ చేసుకోండి

మీ
శ్రీనివాసరాజు ఇందుకూరి.

18, జనవరి 2007, గురువారం

విలువ...



"సరేరా.. ఉంటాను.. బస్సు బయలుదేరేలా ఉంది.. అందరినీ అడిగినట్లు చెప్పరా.. పోన్ చేస్తాలే..," అని వెళుతున్న బస్సుతోపాటు వడివడిగా అడుగులు వేస్తూ స్నేహితుడిని సాగనంపాడు శంకర్. అతనికి సెలవు దొరకలేదు. ఎప్పుడు సెలవు అడిగినా ఆఫీసులో కొత్త వర్కు చెబుతుంటాడు వాళ్ళ మేనేజరు. తెలిసినవాళ్ళందరికీ సెలవులు దొరికాయి. ఇంటికి వెళ్ళిపోయారు. "రూమ్లో ఒంటరిగా ఉండాలిరా దేవుడా ఐదురోజులు. చచ్చాం", అని మనసులో అనుకున్నాడు. రాత్రి పదకొండు కావస్తుంది. ఏంటిరా బాబు ఇంత ఆకలిగా ఉంది. మధ్యాహ్నమే కదా కడుపునిండుగా తిన్నాం. మళ్ళీ ఆకలి మొదలు… ఇంకా ఇక్కడ ఏ టైముకైనా ఏది కావాలంటే అది దొరుకుతుంది కాబట్టి సాగుతుంది మనకు.. ఒకవారం తిండిదొరకని చోట ఉంటే తెలిసొస్తుంది.

సరే ఏదైనా హోటల్ లో బిరియానీ తిని ఇంటికి పోదాం అనుకుని రోడ్డుదాటాడు. హైదరాబాద్ హౌస్ బిరియానీ సెంటర్ కు చేరుకున్నాడు. రెస్టారెంటు కనిపించేంత దూరంనుండే గాలిలో కలిసి వస్తున్న బిరియానీ వాసనలను పట్టుకున్నాడు. ముక్కుకి అందిన బిరియానీ వాసనలతో కాస్త ఓపిక వచ్చినట్లుగా అడుగులు వేగంగా పడసాగాయి.

ఎల్లవొచ్చిగోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో…రింగ్ టోన్ తో జేబులో ఉన్నా ఫోన్ మ్రోగింది. ఈ టైములో ఎవరబ్బా అనుకుంటూ పోన్ తీసాడు. కిరణ్ గాడా.. వీడికేమయ్యింది ఈటైములో.. అనుకుంటూ అన్సర్ బటన్ నొక్కి.. "చెప్పరా.. ఏంటి.. ", అన్నాడు శంకర్. "ఒరే నేను ట్రైన్లో ఉన్నారా.. ఇంటికి బయలుదేరారా.. మావాడు లాస్ట్ మూమెంట్లో ఇచ్చాడు లీవ్… వాడిసంగతి తెలిసిందే కదా…నీకు చెబ్దామని చేసా. మళ్ళీ ఇంటికెళ్ళకా చేస్తారా బై", అని పెట్టేసాడు..


"హూ.. వీడికి కూడా లీవ్ దొరికేసింది. వీడి మేనేజర్ ప్రకాష్ రాజ్ కేరెక్టర్ లా కాస్త ఏడిపించినా, మంచివాడిలానే ఉన్నాడు". ఫోన్ తిరిగి జేబులో పెట్టుకుంటూ అలవాటు ప్రకారం ఫ్యాంటు వెనుకజేబుతడుముకున్నాడు. ఎత్తుగా ఉండే పర్సు లేకపోయేసరికి గుండెజల్లుమంది. కంగారుగా అన్నీ జేబులు వెతుక్కున్నాడు. ఫొను తప్ప జేబుల్లో ఏమీలేవు. నైట్ ప్యాంటు వేసుకోవడం వలన అన్నీ రూమ్లో పెట్టేసినట్లున్నాను అని తెలిసొచ్చిన తరువాత కాస్త మనసుకుదుటపడింది. కానీ రూమ్ తాళంచెవి కోసం వెతుక్కున్నాడు. ఎక్కడా దొరకలేదు. "ఓరిబాబోయ్…!!! ఈ వెంకట్ గాడు వేసినట్లున్నాడు తాళం, కూడా తాళంచెవి తీసుకెళ్ళిపోయాడు, నా తాళం రూమ్లో ఉండిపోయింది. ఇప్పుడెలా", అని గట్టిగా అరిచినంత పనిచేసాడు. ఒక్కసారిగా వీధిలైట్లు ఆరిపోయి చీకటైపోయినట్టుగా కళ్ళు బైర్లు కమ్మాయి.

"ఇప్పుడేంచేయ్యాలి…టైముకూడా పన్నెండు కావస్తుంది. ఎక్కడికెళ్ళగలం ఇంత అర్దరాత్రి, అయినా తెలిసినవాళ్ళంతా ఊరెళ్ళిపోయారే…ఎలారా..", అనుకుంటూ అలోచించసాగాడు.

బాస్కర్ గాడి రూమ్ దగ్గర్లోనే ఉంది కానీ వాడికి మనకు మొన్నగొడవయ్యింది.. ఇప్పుడు ఇలా వెళితే కాస్త కటింగులిస్తాడు.. వాడికాచాన్స్ ఇప్వకూడదు. ఇక డూప్లికేట్ కీ అయితే ఓనర్ దగ్గరుంది అక్కడివెళ్ళివచ్చేసరికి కనీసం అరగంట పడుతుంది.. అవును డబ్బులు కూడాలేనట్టున్నాయి అని వెతకగా.. ఒక ఏబైరూపాయలనోటు, అయిదురూపాయల చిల్లర పైజేబులో కనపడింది. హమ్మయ్యా.. ఇదన్నా ఉంది ప్రస్తుతానికి… ఓనర్ ని చేరుకున్నా అర్ధరాత్రి లేపడం మంచిదికాదు.

రేపువెళ్ళితీసుకోవాలి... అవును తాళాలు తీసేవడిని తీసుకొస్తే…ఇప్పుడు దొరుకుతాడా?, ఒకవేళదొరికినా, ఈ టైమ్ లో తాళాలు బద్దలగొడితే.. దొంగనుకునేరు ఎవరన్నా. సరేలే ఎదవగొడవంతా ఎందుకు.. ఈ రాత్రి ఎలాగోలా గడిపేస్తే సరిపోతుంది..

అసలంతా ఈ వెంకట్ గాడివల్లే… పదిన్నర బస్సుకోసం... పదింటివరకూ.. కదల్లేదు.., ఇక నన్నుకంగారు పెట్టి.. ఈ పరిస్ధితి తీసుకొచ్చాడు. వీడికి ఫోన్ చేసి నాలుగుతిట్లు పెట్టాలి… అని కోపంగా పోన్ తీసాడు.. డయల్ చేసిన నెంబరు కట్ చేసేసి.. ఎందుకులే.. మళ్ళీ ఈ జర్నిలో అంతా నిద్రలేకుండా అలోచిస్తాడు మనశ్సాంతిలేకుండా.. మనకెలాగు ఉండదు నిద్ర ఈరోజు ఇక వాడినిద్రపాడుచేయడందేనికిలే ఊరినుండి వచ్చాకా చెప్తా వాడిపని…ప్రస్తుతం ఏంచేయాలబ్బా అని ఆలోచించాడు.

బుర్రంతా నిండిన అలోచనలు కడుపులో ఆకలిని డామినేట్ చేసేసాయి. ఎదన్నా తినాలి అన్న ఆలోచన కూడా రావడంలేదు మనసులోకి. ఇక ఈ రాత్రికి రూమ్ ప్రక్కనున్న పార్క్ లో బెంచ్ పైన పడుకుని. రేపు పొద్దున్నే ఓనర్ దగ్గరకు వెళ్ళి తాళంచెవి తెచ్చుకుని ఆఫీసుకు వెళ్ళాలి.. అని నిర్ణయం తీసుకున్నాడు.

జేబులో ఉన్న డబ్బులతో బిరియానీ వచ్చేలా లేదు. అంతా ఖర్చుపెట్టేస్తే రేపు తిరగడానికి డబ్బులు అవసరం అని.. ప్రక్కనే ఉన్న సమోసా బండి దగ్గరకు వెళ్ళి పార్సల్ కట్టించుకున్నాడు.

వెన్నెల్లో చాలా అందంగా కనపడుతున్నాయి పూలమొక్కలు. పార్కులోకి అడుగుపెట్టగానే వచ్చిన పూలవాసనతో అతనికి మంచి ఆనందాన్నిచ్చింది. ఒక్కసారిగా టెన్నస్స్ అన్నీ మరచిపోయాడు. మంచి బెంచ్ ఒకటి చూసుకుని కూర్చున్నాడు. చందమామను చూస్తూ తిందామని సమోసా పొట్లం విప్పబోతూ అనిపించింది.

డబ్బులులేకపోతే.. క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయ్… అదీకాకపోతే ఇంత పెద్దనగరంలో ఎంతో మంది స్నేహితులున్నారు.. అయినా ఈ గతిఏంటినాకు. ఖర్మకాకపోతే ఎంటిది?, నేను పర్సుమర్చిపోవడమేంటి?... వాడు తాళంచెవి మర్చిపోవడమేమిటి?, స్నేహితులంతా ఒకేసారి కట్టకట్టుకుని ఇళ్ళకుపోవడమేమిటి..?... బిరియానీ తినవలసినవాడిని, ఈ సమోసాలు తినడమేమిటీ.. అంతే మన టైం బాగాలేదు.. ఈరోజుకు ఏదోలా సర్దుకుందాం.. అని అనుకుని సమోసాల పొట్లంవిప్పాడు.

ఒక్కసారిగా చెడువాసన వచ్చింది.. చీ.. ఇదేంటి.. అని.. ముక్కుమూసుకున్నాడు కొంతసేపు. ఏంటి ఎక్కడిదీ చెడువాసన.. అబ్బా..!!, అనుకుని పొట్లం కాస్త దగ్గరగా పెట్టుకుని వాసన చూసాడు బాగానే ఉందే..? మరి ఎక్కడనుండి వస్తుంది అని లేచినిలబడి చుట్టూ చూసాడు. ఏదో కాగితాలు కదులుతున్న చప్పుడు కూడా వినపడింది. కొన్ని అడుగులు వేసాడు. చప్పడు వినపడ్డవైపుగా.

పార్కుకి పెన్సువేసిఉంది.. అదే ప్రక్కగా రోడ్డు, దగ్గర్లో వీధిదీపానికి కాస్త అటువైపుగా ఒక చెత్తకుండీ ఉంది. ఎవో కుక్కలు అనుకుంట అవి కదుపుతుండడం వల్ల చెడువాసన వస్తుంది అని తెలుసుకున్నాడు. వెనక్కుతిరిగివస్తుండగా అక్కడపాకుతున్నది కుక్కలా కాకుండా మనిషిలా అనిపించింది కాస్త మసక చీకటిలో, సరిగ్గా చూడగా ఎవరో మనిషి కనిపించాడు.

కొంపదీసి దొంగేమో.. అయినా దొంగ చెత్తకుండీదగ్గర ఏంచేస్తాడు. వీధి కుక్కలుకూడా కూడానే ఉన్నాయి. దొంగకాదు ఎవడో పిచ్చివాడుఅయ్యివుంటాడు.. దగ్గరగా చూద్దామనుకుని కాస్తముందుకు నడిచాడు... పెద్దశబ్ధంతో గూర్ఖావేసిన విజిల్ వినపడి ఉలిక్కిపడి చతికిలపడ్డాడు. అమ్మో ఈ చీకట్లో నేను దొరికినా దొంగనే అవుతాను. అసలే ఈ సిటీలో ఇటువంటి కార్యకలాపాలు ఎక్కువ.. అనుకుని కదలకుండా మెదలకుండా కూర్చున్నాడు. భయంతో...

కొంత సమయం గడిచాకా లేచి చెత్తకుండీవైపు చూసాడు. ఒకతను మాసిన బట్టలతో, మట్టితో ఉండలు కట్టిన జుట్టుతో, గడ్డంతో, చెత్తకుండిలో కాగితాల మధ్య ఉన్న మెతుకులు వెతుకుతున్నాడు. ఏరిన పదార్దాలను చిన్న కాగితంపై పోగుచేస్తున్నాడు. ప్రక్కనే ఉన్న కుక్కలు అతన్నిదాటి వెళ్ళకుండా, ఆజ్ఞాపించినట్టుగా అక్కడే నిలబడి చూస్తున్నాయి. శంకర్ కి ఆశ్చర్యంవేసింది.. అదిచూసి ఒక విషయం అతనికి అర్ధమయ్యింది. అతనెన్నిరోజులుగా ఆకలిభాదను అనుభవిస్తున్నాడో.. పాపం. నా టెన్సన్ నా ఆకలిబాధను కొంత సమయం డామినేట్ చేసేసింది. అదే బాధ ఎక్కువైతే చుట్టూ ఉన్న చెత్తని, చెడువాసనని, రుచిని డామినేట్ చేస్తే ఏమవుతుందో అతని కళ్ళముందు ప్రత్యక్షమయ్యింది ఇప్పుడు.

అయినా అదే తినాలా?, అడుక్కుంటే ఎవరన్నాపెట్టకపోతారా?, ఏమోలే ఎద్దులా ఉన్నావ్ పనిచేసుకుని బ్రతకొచ్చుకదా? అన్న మాటలుకూడా విన్నాం.. చెప్పలేం.. పడ్డవానికే కదా తెలిసేది.. పాపం పిచ్చివాడేమో.. ఎమో తెలియక చేస్తున్నాడేమో.. ఎవరికైనా తప్పదు కదా ఈ ఆకలి బాధ. నా దగ్గరున్న సమోసాలు ఇచ్చేయడం మంచిది. ఒకరోజు నేను తినక పోతే నష్టంలేదు.. నాకు ఒక్కరోజు ఆకలిబాధఅంటే ఎంటో తెలుసొస్తుంది కూడాను. చిన్న ఈగో, దోమో పడింది అని గిన్నెడు అన్నాన్ని పడేసిన రోజులు ఉన్నాయి.. హోటల్లో తిన్నది ఎక్కువై, తీసుకెళడానికి నామోషీ వచ్చి వెయిటర్ కి చెప్పి తీసేయమని పడేసిన రోజులూ ఉన్నాయి..

నాలాంటివాడికి ఆకలిబాధ ఒక్కరోజు తెలియడమే మంచిదే.. సరే సరే.. ఇప్పుడు మన ఆలోచనలకన్నా అతని ఆకలి ముఖ్యం అతను అది తినకముందే ఇవ్వడం మేలు అనుకుని, పార్కు బయటకొచ్చి.. చెత్తకుండి దగ్గరకు చేరుకుని.. అతనిని పిలిచి సమోసాల పొట్లం చేతికిచ్చాడు శంకర్. అది తీసుకున్న ఆ వ్వక్తి. మళ్ళీ చెత్తకుండీ వైపు నడిచాడు.. ఏంటిది.. మళ్ళీ ఇటువైపు వెళుతున్నాడు అని పార్కులోకి వెళుతూనే అతని వంక చూసాడు శంకర్.. అక్కడ పోగుచేసిన పదార్ధాలను కుక్కలకు తినమన్నట్లుగా వాటి దగ్గరకు లాగి వీధిదీపం ఆవలికి వెళ్ళి కూర్చుని సమోసాలు తినసాగాడు. ఇదంతా చూస్తూనే శంకర్ తన బెంచ్ పైకి వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ ఆలోచనలు వెంటాడాయి.

బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ||

ఇది చిన్నప్పుడు భగవద్గీతలో నేర్చుకున్న పద్యం

అవును ఈరోజే తెలిసింది పడేసిన ఆహారం కూడా ఇలా ఉపయోగపడుతుందన్నమాట.. కానీ మనంతినగా మిగిలింది, వేరొకరికి…మనుషులే తినలేనిది జంతువులకు, జంతువులు తినలేనిది క్రిమికీటకాలకూ చేరాలన్నమాట… ఏంటి ప్రతీరోజు ఇలాంటివి ఎన్నో చూస్తున్నా నాకు తెలియలేదు.. దానిగురించి ఆలోచించనూలేదు… ఈ రోజు నేను ఈ పరిస్ధితిలో ఉన్నా కాబట్టి ఆలోచిస్తున్నానా?,

ఏమోలే… ఎవరో చెప్పినట్లు …ఒక సంవత్సరకాలం విలువ తెలియాలి అంటే.. పరీక్షలలో తప్పిన విధ్యార్దిని అడుగు తెలుస్తుంది, ఒక నెల యొక్క విలువ తెలియాలి అంటే నెలలు నిండకుండానే జన్మనిచ్చిన తల్లిని అడుగు, ఒక నిముషం విలువ తెలియాలి అంటే తను వెళ్ళవలసిన రైలును దాటిపోతే తలపట్టుకున్న వ్వక్తిని అడుగు, ఒకసెకను కాలం విలువ తెలియాలి అంటే తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్న వ్వక్తిని కనుక్కో, ఒక్క మిల్లీసెకను విలువతెలియాలి అంటే ఒలింపిక్స్లో రజతపతకాన్ని పొందిన వాడినడుగు…అని.

ఎదుటి వాడి ఆకలి బాధతెలియాలి అంటే ఒక్కరోజు ఆకలితో గడపాలి.., దూరమైనప్పుడే దేని విలువ అయినా తెలిసేది... అని అప్పుడే తెలుసుకున్నాడు.

ఇలా శంకర్ ఆలోచిస్తూ ఉండగానే తెల్లారిపోయింది.

Related Posts Plugin for WordPress, Blogger...