CRY
ఒకప్పుడు వెయ్యి రూపాయల్లోనే అన్ని ఖర్చులూ పోగా ఇంకా కొంత డబ్బు దాచుకునేవాడిని.. ఇప్పుడు ఎంత వస్తే అంత ఖర్చు అన్నట్లుంది.. అసలు చేతిలో పైసా ఉండడంలేదు. ఒక్కొక్కసారి అనుకునేవాళ్ళం ఫలానా అతనికి నెలకు ఇంత సంపాదిస్తున్నాడంట..!, అంత డబ్బు ఎలా దాస్తాడో అని.. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది.. ఎంత సంపాదించాం, ఎలా సంపాదించాం అని కాదు.. సంపాదించినది ఎంత తెలివిగా ఖర్చుచేస్తున్నాం అన్నది ముఖ్యం అని.
వచ్చే డబ్బును బట్టి మన ఆలోచనలు కోరికలు ఉంటాయి. ఒకప్పటి రెండు రూపాయల బ్లేడు.. ఇప్పుడు రెండువందల రూపాయల జిల్లెట్ మ్యాక్ త్రీ షేవర్ అవుతుంది. మాములుగా తినే తిండి కాస్తా అనారోగ్యకరమైనదిగా తోస్తుంది.. చిన్న హొటల్స్ లో తిండి మాని కాస్ట్లీ రెస్టరెంట్ల మీద పడతాం. అందరూ త్రాగే మంచినీళ్ళు మంచివి కాదన్న అనుమానం మొలకెత్తి ఫిల్టర్డ్ వాటర్ బాటిల్స్ కొనుక్కుని త్రాగుతాం. కాస్త దూరానికే.. “ఆటో.. !”,అని చక్కగా.. కడుపులో చల్ల కదలకుండా.. పనులు కానిస్తాం. నాలుగేసి జతల బూట్లు, రకరకాల దుస్తులు.. నైట్ డ్రస్సులు, పార్టీ వేర్. షాపింగ్ వేర్.. మార్నింగ్ వేర్ ఇలా అన్నీ బ్రాండడ్ వాటిపై కన్ను పడుతుంది. చీప్ వాటిపై చీప్ లుక్స్ వేస్తాం.
అనవసరమైన షాపింగులు.. అవసరంలేకున్నా వస్తువులు వచ్చిపడతాయి ఇంటికి. మనకి ఇష్టముండక పోవచ్చు కానీ చూసే వాళ్ళకోసం ఈ ఖర్చులు అవీనూ.
ఇదే టాపిక్ వచ్చింది నా కొలీగ్ కి నాకు ఒకసారి.. అతని పుట్టిన రోజుకని బట్టలు తీసుకోవడానికి బయలుదేరాం. వెళ్ళి చూసాకా అన్నీ రెండువేలు మూడువేలూనూ.. నేనన్నా “నాకు ఊరికే డబ్బులు వచ్చినా ఇంత ఖరీదైనవి కొనబుద్దికాదు బాబు.. ”,అని..
“నేనూ అంతే…అలాగే అలోచిస్తా.. ఎంతైనా మిడిల్ క్లాసు మనస్తత్వాలుకదా!! “,అన్నాడు.. నవ్వుకున్నాం ఇద్దరూ. “కానీ ఆఫీసులో అందరూ కాస్ట్లీగా ఉంటున్నారు. నేను ఈసారి ట్రై చేద్దామని చూస్తున్నా ”,అని నాలుగువేలు పెట్టి కొనుక్కున్నాడు బట్టలు.
ఆరోజు చూసిన ఒక జీన్స్ భలే నచ్చింది నాకు.. ఒకసారి వేసి చూసుకున్నా.. చాలా బాగుంది.
ఎలాగైనా తరువాత సారి కొనుక్కోవాలని నిర్ణయించా. కానీ ఖరీదు ఆలోచిస్తే పదిహేనువందలు.. బ్రాండెడ్ మరి. అమ్మో అనిపించింది.. మనసుకి సర్ది చెప్పి ఈ సారికి ట్రై చేద్దాం అనిపించింది.
తరువాతనెల ఇంటికి పంపగా..., అన్ని ఖర్చులూ పోగా.. ఇంత, అనవసరపు ఖర్చులు మానేయాలి, మొత్తం ఇంత మిగల్చాలి అని లెక్కవ్రాసుకున్నా. మళ్ళీ ఒకసారి ఆలోచించా.. అంత డబ్బు ఎందుకూ అని.. మాములివి ఐతే.. అటువంటి జీన్స్.. రెండు ,మూడు దాకా కొనుక్కోవచ్చు.. వట్టి బ్రాండు కోసం అంత అవసరమా అనిపించింది. సరే ఈసారి ట్రై చేద్దాం ఇప్పుడు ఖర్చుచేయకపోతే మరి ఎప్పుడు చేస్తాం అని నిర్ణయం చేసేసా.
తరువాత రోజు ఉదయం ఆఫీసుకురాగానే చెప్పేసా కొలీగ్ కి.. ఈ రోజు సాయంత్రం నేరుగా షాపింగ్ కి వెళుతున్నాం అని. సరే అన్నాడు. సాయంత్రం అయ్యింది. అతనికి ఏదో పనితగిలింది.. నేను పోన్ చేస్తా అప్పుడు బయలుదేరదాం అన్నాడని నేను వెయిట్ చేస్తున్నా. ఫోన్ మ్రోగుతుంది.. హెడ్ పోన్స్ పెట్టుకుని లౌడ్ సౌండుతో పాటలు వినడం వలన నా ఫోన్ రింగు వినపడలేదు నాకు. నా ప్రక్క సీటతను నన్ను తట్టి , ఫోను అని సైగ చేసేసరికి ,తేరుకుని రిసీవర్ తీసా. ఏదో బ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం అట నాకు వద్దు అని చిరాకుగా పెట్టేసా. మళ్ళీ కొంతసేపటికి ఇంకొక పోను. గోవా ట్రిప్ లక్కీ డ్రా తగిలింది మీకు ఫ్రీ టికెట్స్ ఇస్తున్నాం. కానీ కండీషన్ ఐతే మీరు మ్యారీడ్ అయ్యివుండాలి అని.. ఫ్రీ గోవా ట్రిప్ కోసం నేనెక్కడ పెళ్ళిచేసుకునేది అని, నో ,అన్నా. మళ్ళీ ఐదునిముషాల తరువాత మరొక ఫోను.. ఈ సారి చిరాకుగా తీసా రిసీవర్… “కెన్ ఐ స్పీక్ టు శ్రీనివాస్ ప్లీజ్ ”,అంది అవతలివైపు ఆడగొంతు. “యా స్పీకింగ్ ..”,అన్నా కాస్త సీరియస్ గా.. “సార్ వి ఆర్ ప్రమ్ CRY ”,అని అన్నది ఆమె. “నో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ..”, అని.. పోన్ పెట్టేయబోతున్నా.
“నో సార్..”, అంటూ మొత్తం వివరంగా చెప్పింది. CRY అంటే "CHILD RIGHTS AND YOU" అని, డొనేషన్స్ కోసం ఫోన్ చేసాను అని. ఎనిమిది వందలు డొనేట్ చేస్తే.. ఒక పిల్లాడికి సంవత్సరం పాటు విద్యకోసం ఉపయోగిస్తారు అని.. ఇంకా రకరకాల విరాళాల వివరాలు చెప్పిందామె.
నేను సైట్ అడ్రస్, ఎలా పే చేయాలి.. అది కరెక్టుగా CRYకి చేరుతుందని నేను ఎలా నమ్మగలను లాంటి వివరాలు అడిగి తెలుసుకున్నా. కొద్దిరోజుల్లో మా ఏజంట్ వస్తాడు కంపెనీకి.. చెక్ ఇవ్వండి ఇంట్రస్ట్ ఉంటే అని అంది. సరే అని ఫోన్ పెట్టేసా.
షాపింగ్ కి బయలుదేరా.. ఆ కాస్ట్లీ షాప్ కి వెళ్ళలేదు.. వేరే దాంట్లో ట్రై చెద్దామన్నా.. “ఏ.. ఎదైనా ఖర్చులు తగిలాయా మళ్ళీ ”,అని నవ్వుతూ సరే! అన్నాడు మా కొలీగ్…
ఇక్కడ కూడా బ్రాండెడ్ లాంటి జీన్సే కొన్నా.. అదే పదిహేనువందలు పెట్టి.
కానీ ప్యాంటు ఖరీదు ఏడువందలు.. CRYకి ఎనిమిదివందలు చెక్ వ్రాసిచ్చా. నేను బ్రాండడ్ జీన్స్ వేసుకోకపోతే ఇప్పుడు దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదనిపించింది. కానీ ఆ డబ్బులు చిల్డ్రన్ ఫండ్ కి ఇచ్చి నేను CRY అనే బ్రాండడ్ కంపెనీ జీన్స్ వేసుకున్నట్లే ఫీలయ్యా.
వెల కట్టలేనిది విద్య అంటారు. చదువుకున్నవాడికి ఖచ్ఛితంగా చదువు విలువ తెలుసుంటుంది. దేశానికి ఎంతో చేయాలనుకుంటాం.. ఈ బిజీ జీవితంలో మనకు కావలసినవి కొన్ని మనం చేసుకోలేకే నలిగి పోతుంటాం. మన దగ్గరున్న విద్యను వేరొకనికి మనం ప్రత్యక్షంగా బోధించే సమయమూ వుండదు కూడా. అలా చేస్తున్న సంస్ధలకైనా చేయూతనిద్దాం. పరోక్షంగా చేస్తున్నందుకు తృప్తి పడదాం.
------------------------------------------------------------------------------------
ఇది చదివినవాళ్ళలో ఒక్కరైనా ఈ CRY బ్రాండు( ఆ పేరుమీద ఏ కంపెనీ లేదని మనవి, ఉన్నా దానికి ప్రమోషన్ మాత్రంకాదు) వస్తువులను వినియోగిస్తారని ఆశిస్తూ
పూర్తి వివరాలకు ఈ లింకు చూడండి.. Cry Donation